జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్
పరిచయం:
జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్” గా గుర్తుపడతారు. అరవైలలో రేడియో లో పనిచేసి, తరువాత కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖల్లో పలు కీలక పదవులను చేపట్టారు. రిటైరైన తరువాత కూడా మదనపల్లె లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అయితే, చాలామందికి తెలియని విషయం ఆవిడ చరిత్ర పరిశోధంకురాలిగా సుప్రసిద్ధులనీ, అనేక చరిత్ర పుస్తకాలు రచించారనీ. భారతదేశంలో పుస్తక ప్రచురణల చరిత్రపై ఆవిడ చేసిన పరిశోధన చాలా ప్రసిద్ధమైనది.
2010లో మదనపల్లెలోని ఆవిడ స్వగృహంలో ఆవిడను కలిసాము. ఆ మాటా, ఈ మాటా అంటూ మొత్తంగా మాతో రెండు గంటలకు పైగా కబుర్లు చెప్పారు. ఆవిడ చేసిన పనులు, రాసిన పుస్తకాలు, ఆవిడ ఆలోచనలూ అన్నీ మాతో పంచుకున్నారు. ఆ మాట మూటల్లోని కొన్ని ముచ్చట్లను మీతో ఇక్కడ పంచుకుంటున్నాము. ఆవిడ 01-02-2017న మరణించారు. ఆవిడ రాసిన పుస్తకాలూ, చేసిన పని ఎంతో స్పూర్తిదాయకమైనవి. కానీ, వాటికన్నా స్పూర్తినిచ్చింది ఆవిడ నిండైన వ్యక్తిత్వం.ఆవిడకు బాగా ఇష్టమైన క్రికెట్ పరిభాషలోనే – We, at pustakam, give her a standing ovation to the well played long innings! Take a bow!
(మేము మంగమ్మగారిని కలవడానికి సహాయపడ్డ శ్రీనివాస్ పరుచూరిగారికి, సత్యవతి కొండవీటిగారికి, మా స్నేహితుడు వంశీకి ప్రత్యేక ధన్యవాదాలు!)
గమనిక: మంగమ్మ అంతటి వారిని ఇంటర్వ్యూ చేశే అర్హతలు మాకు లేవు. అయినా, మేము పలకరించగానే, చక్కగా ఇన్ని కబుర్లు చెప్పినందుకు ఆవిడ సహృదయతను ఎప్పుడూ మర్చిపోలేము.
రిసెర్చిలో మిమల్ని బాగా inspire చేసిన వ్యక్తులు, మీరు ఆదర్శంగా తీసుకొన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా?
నా అంతట నేనే చేసినాను. ఇప్పుడు మొట్టమొదట ఈ Rate Schools అనేది రాసాను గద, ఇది కూడా ఎందుకు రాయవల్సి వచ్చిందంటే, Thomas Munro మనకు మడ్రాస్‍కు గవర్నర్ గా ఉన్నప్పుడు , సెకండరీ ఎడ్యుకేషన్ ఇక్కడ మొదలుపెట్టినారు. వాళ్ళు స్కూల్లో ఏ పుస్తకాలను వాడినారు అని చూస్తే అప్పటికే కొన్ని ప్రింటెడ్ పుస్తకాలు వాడినారు. ఆ ప్రింటెడ్ పుస్తకాలు ఎప్పుడు మొదలయ్యాయి అని నా curiosity తో to find out the books, నేను రిసర్చ్ చేసి, ఆ Book printing in India అనే పుస్తకం తయారుచేశాను. నాకు ఎవ్వరూ inspirationతో కాదు. Self inspiration తో చేశాను. అదే, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ అదంతా లేదు. నా పిహెచ్‍డి కూడా I did because of my interest.
చరిత్ర పుస్తకాలు బాగా విరివిగా చదివుంటారు కదా…
పుస్తకాలు చదవను నేను. పుస్తకాల్లో నాకు కావాల్సినివి ఉన్నాయా లేదా అని చూసుకుంటాను. పుస్తకంగా చదవను ఎప్పుడూ. నా రిసెర్చ్ అంతా రికార్డ్స్ నుండే. ఒరిజినల్.
మీతో పాటు ఎవరెవరు చేస్తూ ఉండేవారు? అసిస్టెంట్స్ గానీ, టీం మెంబర్స్ గానీ?
ఎవ్వరి హెల్ప్ లేదు. నా అంతట నేనే చేశాను. నేను చెయ్యగలిగినంత వరకు చేసినాను. అంతేగాని ఇంకొకరి హెల్ప్ గాని, అసిస్‍టెన్స్ గాని ఏమీ లేదు.
ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మా బులిటెన్ పొద్దున్న ఏడింటికి. అందుకని పొద్దున ఐదుకల్లా వెళ్ళాలి. ఐదుకు వెళ్ళాలంటే, ఏ నాలుక్కో లేచి, తయారై బయలుదేరేదాన్ని. కార్ వచ్చేది, మా కోసం. వెళ్ళగానే మెటిరియల్ ఇచ్చేవారు. దాన్ని చూసుకొని వార్తలు రాసుకోవాలి. ఇలా రాసుకోడానికి రెండు గంటలు పడుతుంది. ఏడింటికి స్టూడియోకి వెళ్ళి, వార్తలు చదవటం. 7:15 కల్లా అయ్యిపోతుది. మళ్ళీ పన్నెండింటి వరకూ పని లేదు. అంటే, ఏడున్నర నుండి పన్నెండున్నర లేక ఒంటిగంట వరకూ నేను ఖాళీయే.
ఆ లీజరు టైమ్‍లో నేను నేషనల్ ఆర్కైవ్స్ కు వెళ్ళేదాన్ని. అది దారిలోనే ఉండేది. అందుకే నడిచే వెళ్ళేదాన్ని. ఢిల్లీలో అంతా, వీథుల్లో నడిచేది ఎవరూ అంటే నన్ను చూపిస్తారు. (నవ్వుతూ) ప్రతీ రోజూ ఉదయం 8:45 కల్లా ఆర్కైవ్స్ కు వెళ్ళేదాన్ని, అప్పటికి అక్కడ వాళ్ళు తుడుస్తూ, ఊడుస్తూ ఉంటారు. వాళ్ళకి తెల్సు, నేను ముందే వచ్చేస్తాననీ, నా రిసెర్చి వర్క్ మొదలెడతాననీ! కనుక రిసర్చ్ రూం తెరిచి పెట్టేవారు. నేను వెళ్ళి కూర్చుంటాను. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. టేబుల్ మీద ఆ పక్కన కొన్ని రికార్డ్స్ పెట్టేస్తాను, ఈ సైడ్ నేను వర్క్ చేస్తూ ఉంటాను. అక్కడెందుకు పెడతానంటే, ఇంకొకరు వచ్చి కూర్చుంటారు కద? ఇంకెవ్వరూ రాకూడదు. ఎందుకంటే disturbance.. “hello, how’re you?” అని ఏమో మాట్లాడాలి , అందుకని నా పుస్తకాలు, ఆ రికార్డ్స్ కొన్ని ఆ పక్క పెట్టేస్తాను, అపుడు ఎవరో ఉన్నారనుకొని ఆ టేబుల్ దగ్గరికి ఎవరు రారు… సో, అలా ఒంటిగంట వరకూ పనిజేసి, మళ్ళీ అక్కడ నుండి హాస్టల్ కు.. హాస్టల్ దగ్గరే.. అదే వుమన్ హు వాక్స్ గద? మళ్ళీ అక్కడ నుండి నడిచివెళ్ళి భోజనం చేసేసి, మళ్ళీ మూడున్నరకు రెడీ అయ్యి, మళ్ళీ రేడియో స్టేషన్‍కు ఈవినింగ్ బులిటెన్ కోసం వచ్చేదాన్ని..
అలా ఆర్కైవ్స్ లో చాలా సమయం గడిపేదాన్ని. మధ్యాహ్నాలు వెళ్ళేది లేదు.. కాని ఉదయాలు మాత్రం తొమ్మిందింటి నుండి ఒంటిగంట వరకూ.. continuousగా… లేచేదే లేదు.. అందరూ టీకనీ, దీనికనీ, దానికనీ లేస్తారు, ఎక్కడికీ లేచేది లేదు, అత్తుక్కుపోవడమే.. గమ్ వేసుకొని, ఫెవికాల్ అంటించుకున్నట్టు.. కూర్చొని ఈ రికార్డ్స్ అన్నీ చూసేదాన్ని.
ఈ రికార్డ్స్ అన్నీ చూడడం కూడా according to the subjects I’ve selected.. అన్ని రికార్డ్స్ చూసేదాన్ని, నోట్సులు రాసుకునేదాన్ని.. ఆ రాసుకున్న నోట్స్ అన్నీ ఫైల్స్ ఆ రూంలో పడున్నాయి (గది చూపిస్తూ). Then, I used to do the work. అట్ల చేశానన్న మాట నా రిసర్చ్ వర్క్. నాకెవ్వరూ ఒకరిని ఆదర్శంగా పెట్టుకొని, చేయలేదు నేను. On my own, self made..
మీ మొదటి వైవా అనుభవం ఎలా ఉండింది?
ఒక నైట్ యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేసి, “రేపొద్దున్న మీకు వైవా ఉంటుంది. మీరిక్కడకి రావాలి.” అన్నారు. మార్నింగ్ అంటే ౩:౩౦కి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పినారు. I rang up my supervisor.. ఇలా రేపు రమ్మన్నారు, టైం ఏం ఇవ్వలేదూ అని చెప్తే, “after all it’s your own thesis paper, so what is there to be afraid of.. you come” అన్నారు. నా అలవాటు ఏమంటే, చిన్న పాకెట్ నోట్ బుక్ లో, ఛాప్టర్ బై ఛాప్టర్ అన్ని పాయింట్స్ రాసి పెట్టుకొని ఉంటాను. అది ఎప్పుడూ నా పర్స్ లోనే ఉంటుంది. సరే.. రేడియో స్టేషన్ నుండి నన్ను డి.ఎ.వి.పికి ట్రాన్సఫర్ చేసినారు. డి.ఎ.వి.పి. అంటే ప్రభుత్వ ప్రకటనలన్నీ అక్కడే రూపొందుతాయి. సో ఒక వారం అయ్యింది అక్కడ కొత్తగా చేరి… “మొదటి వారంలోనే వెళ్ళి “నేను యూనివర్సిటీకి వెళ్ళాలి” అంటే ఒప్పుకుంటారా? అని భయమేసిందన్న మాట. లంచ్ టైంలో మెల్లిగా.. డిప్యూటీ డైరెక్టర్ రూంలోకి వెళ్ళాను. శ్రీనివాసన్ అని, he was a very good man. అక్కడికి వెళ్ళాక, ఏమి అని అడిగారు. “పిహెచ్‍డి కండి, వైవా ఉంది.. యూనివర్సిటీకి వెళ్ళాలండి..” అంటే, “Why did you come to the office?” అని అరిచినారు. అంటే, “నువ్వసలు వచ్చుండ కూడదు గద, ఎందుకొచ్చినావు” అని కోప్పడి,”Go immediately” అన్నారు. సరే, ఆటో చేసుకొని ఎనిమిది మైళ్ళు, రేడియో స్టేషన్ నుండి యూనివర్సిటీకి. ఆ ఎనిమిది మైళ్ళ దూరంలో ఈ నోట్స్ రివిజన్ చేసేసినాను, ఆ చిన్న పాకెట్ బుక్ లోది. అక్కడికి వెళ్ళితే, వాళ్ళందరూ, ఒక రూంలో కూర్చున్నారు. నన్ను anti రూమ్ లో కూర్చోబెట్టినారు. ఆ రూంలో కూర్చొని, వాళ్ళు ఏం చేస్తున్నారు? సాండ్‍విచ్‍లు తింటూ, టీ తాగుతూ ఉన్నారన్న మాట. So, at 3’o clock they invited me. వెళ్ళాను రూమ్‍లోకి. Please sit down అన్నారు. జె.పి. నాయక్ అని, Secretary to Educational Ministry in Central Govt – ఆయన నాకు వైవా తీసుకునేది. Please have this Sandwich.. అంటే “No, Thank you” అన్నాను. అప్పుడు మా supervisor అన్నారూ- ఆమె చాలా strict, She’s a serious woman, అలా అంతా తినరామె అన్నారు. అప్పుడు నాయక్ ఏమన్నారంటే, ధానే ధానే పర్ ఖానే వాలేకా నామ్ లిఖా హోతా హై.. So, she’ll not take, her name is not on this.. and moreover God gives ration to everybody. ఆ రేషన్ తిన్నన్ని రోజులే వాళ్ళు బతుకుతారు. రేషన్ అయ్యిపోతే చచ్చిపోతారు. అంటే, నూకలు చెల్లిపోవటం అంటాం కదా, అలాగ. She wants to live long.. So, she’s not taking this sandwich..ఇట్లాగే తమాషగా ఏదో మాట్లాడేసి, వైవా అయ్యిపోయింది.
మీకు ఒక టాపిక్ తీసుకున్నాక, రిసెర్చ్ మొత్తం అవ్వటానికి ఎంత కాలం పడుతుంది?
నాలుగైదు ఏండ్లు పడుతుంది.
ఒక టాపిక్ తీసుకున్నాక, దాని మీద ఒక పుస్తకం రాయాలనుకుంటే..
అది రాయాలనుకుంటే, I must search in all the libraries.. ఇప్పుడూ ఢిల్లీలో ఉండే లైబ్రరీ చూసినాను, నెహ్రూ మ్యూజియమ్ లైబ్రరీ చూసినాను, హైదరాబాద్ లైబ్రరీ చూసినాను, హైదరాబాద్ ఆర్కైవ్స్ చూసినాను, తర్వాత మెడ్రాస్ లో మెడ్రాస్ ఆర్కైవ్స్ చూసినాను. మడ్రాసులో మాన్యుస్ర్తిప్ట్స్ లైబ్రరీ ఉంది.. అక్కడ చూసినాను. ఆ తర్వాత పాండీచేరీకి వెళ్ళాను. అక్కడ ఒక నెల ఉన్నాను. ఇలా అన్ని చోట్లకూ, ఎక్కడెక్కడ మనకు మెటీరియిల్ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, పనులు చేసుకోవాలి.
మరి ఇంతలేసి దూరాలు ప్రయాణించటం అంటే, ఆర్థకంగానూ, మానసికంగా శ్రమ అధికం కదా..
ఏం లేదు. నాకది హాబి. ఎవ్వరూ నాకు ఒక పైసా ఇచ్చింది లేదు. ఒక టికెట్ కొనిచ్చింది లేదు. On my own చేసానన్న మాట.
ఒకసారి, క్రిస్టియానిటీ మీద రాసిన ఒక పుస్తకంలో “The work of missionaries in Andhra Area” వాళ్ళ గురించి రాసాను. దానికి బెంగళూరులో 17, మిల్లర్ రోడ్ అనేదో ఉంది. అక్కడ వాళ్ళ హాస్టళ్ళో ఒక నెల పాటు ఉన్నాను. అది theological college. (United Thelogical College) అక్కడ ఫాదర్స్ కి అంతా ట్రేనింగ్ ఇస్తారు. నేను హాస్టల్లో ఉండి, అక్కడే భోజనం చేసుకుంటూ, అత్యధిక సమయం వాళ్ళ గ్రంథాలయంలో గడిపాను. అక్కడ ఒకావిడ ఉండేవారు, ఎమ్మా అని, జర్మన్. ఆవిడ ఒక ఇండియన్ని పెళ్ళాడారు. She was very helpful. నాకూ రూముకి పుస్తకాలు కావాలంటే ఇచ్చేదన్న మాట. నేను పుస్తకాలు తీసుకొని, నైట్, పొద్దున ఐదింటి నుండి రాస్తూ ఉండేది చూసి, వాళ్ళ స్టూడెంట్స్ ను తిట్టేవారు, “ఆవిడ చూడండి, ఎంత పని చేస్తోందో!” అని. వాళ్ళకి తిట్లుపడేవన్న మాట. But, I had a nice time! ఒక నెల వాళ్ళ లైబ్రరీలో ఉన్నాను. అలా వెళ్ళిన చోటల్లా ఒక్కో నెల నెలా ఉండేదాన్ని. ఎందుకంటే గవర్నెమెంట్ సర్వెంట్సుకు ఒక నెల earned leave ఉంటుంది. నేను ఆ సెలవలన్నింటినీ వీటికి ఉపయోగించేదాన్ని.
మీరు చెయ్యాలనుకొని చెయ్యలేకపోయినవి ఏమైనా ఉన్నాయా?
నేను చెయ్యాలనుకున్నది, చెయ్యలేకుండా ఉండను. చెయ్యాలనుకున్నది చేసి తీరుతాను. అంటే చెయ్యాలనుకొని పోస్ట్ పోన్ చేసి, ఇలా చేసేందుకు వయసు ఉండదు కద, we’ll become old and then we’ll not be able to move about. కాబట్టీ, దీపం ఉన్నప్పుడే ఇళ్ళు చక్కబెట్టుకోవాలి. When you’re able to move about, then you must be able to finish off your work. “నేను చెయ్యాలి, చెయ్యాలి” అనుకుంటే, చెయ్యలేము. “నేను చేసేస్తాను” అని అనుకొని అక్కడికి వెళ్ళినట్లైతే చేసేస్తాం. అదే, ఇంకొకరి మీద ఆధారపడకూడదు. We must be able to do our work by ourselves. Independently.
ఆ వర్క్ కు సామాగ్రి ఎక్కడ దొరుకుతుందో మనం ఆలోచించుకోవాలి. Then we must correspond with them about the material. ఆ మెటీరియల్ దొరుకుతుందా? మనం ఉండడానికి స్థలం అదీ ఉంటుందా అని కూడా చూసుకోవాలి. మనం హోటళ్ళల్లో ఉండలేం కద. అవ్వన్నీ కూడా చూసుకోవాలి. Being a lady, that is also important. మనం ఉండడానికి స్థలం చూసుకోని, ఆ ఆర్కైవ్స్, లైబ్రరీస్ లో మనకి కావాల్సింది చూడగలగాలి. So, that is the main thing. టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. టాపిక్ కి కొంచెం గైడెన్స్ ఇచ్చేవాళ్ళో, ఆఫీషయల్‍గా ఎవరో ఉండాలి కద, సూపర్‍వైజర్ అని, వాళ్ళని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పటి తరం చేస్తున్న పరిశోధనలను మీరు ఫాలో అవుతున్నారా?
ఇప్పటి తరం వాళ్ళు నా దగ్గరకి వస్తే గద..
మీరు హిస్టరీ కాంగ్రెస్ కి వెళ్తారు కద, అక్కడికి ఎవరూ రారా, ప్రస్తుత తరం వాళ్ళు?
వస్తారు. కాని ఇప్పటి జనరేషన్, ఈ ముసలామెతో ఏం పని అని..వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళంతా గ్రూప్ వేరే ఉంటారు.
ఇప్పుడు మీకు లైబ్రరీస్ వాటికి వెళ్ళడం కష్టం కద, మరి మీరిప్పుడు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఎలా?
నా దగ్గర కలెక్ట్ చేసిన మెటీరియల్ అంతా అట్లే ఉంది కద. ఇంక రెండు పుస్తకాలు చెయ్యాలని. చేస్తానో లేదో చూడాలి.
పిహెడి
పీహెచ్‍డీ అడ్మిషన్ ఎలా దొరికింది?
నేను ఢిల్లీ యూనివర్సిటీకి 63లో అప్లై చేశాను, “ఇలాగ పిహెచ్‍డి చెయ్యాలి అనుకుంటున్నాను.” అని. వాళ్ళు ఏమని రిప్లై చేసారంటే, “నువ్వూ ఒక చోట ఉద్యోగం చేస్తున్నావూ… you’re already employed. one must give full time for research, నువ్వు ఫుల్ టైం ఇవ్వలేవు కాబట్టి, అడ్మిట్ చేసుకోలేము.” అని చెప్పినారు. అప్పుడు ఆర్కైవ్స్ డైరెక్టరు దగ్గరకు వెళ్ళాను. నా సమస్యేమిటో చెప్పాను. He was also a very good man. నేను మీట్ అయిన వాళ్ళంతా very good పీపుల్. (నవ్వుతూ). ఆయన వెంటనే రిసెర్చ్ రూంకి లేడీ ఇన్‍చార్జ్ అయిన మిస్ డేవిడ్ ను పిలిచినారు. ఆమె అజ్మేర్. రాజస్థాన్ ఆమె. ఆమెతో, “ఈమెకు ఏమేం కావాల్నో అన్నీ ఇచ్చేయమ్మా” అని చెప్పేసినారు. ఆమె ఏం చేసింది, ఇవ్వకుండా, నన్ను తీసుకెళ్ళి ఆ ఎడ్యుకేషనల్ రికార్డ్స్ ఉన్న స్టోర్ లోకి తీసుకెళ్ళి వదిలేసింది. “నీ ఇష్టం..” అని.
అక్కడ రికార్డ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి బాక్సులోనూ , ప్రతి సంవత్సరంవీ రికార్డ్స్ ఉంటాయి. ఇలా చాలా బాక్సులు ఉంటాయి. 1850 నుండి ప్రతీ సంవత్సరంది బాక్సు ఓపెన్ చేయడమూ, నాకే రికార్డ్స్ పనికొస్తాయో లిస్ట్ రాయడమూ. దాని మీద ఆ నెంబరు రాసుకోవడమూ, బాక్స్ పక్కకు పెట్టి ఇంకోటి తీసుకోవటం. అలా, 1850 నుండి 1947 వరకూ, దాదాపుగా వందేళ్ళ రికార్డ్స్ లో నాకు పనికి వచ్చే నెంబర్లన్నీ రాసుకొనేసినాను. ఒక నెల పట్టింది. అప్పుడు రిసెర్చ్ రూంకి వచ్చి, రోజూ ఒక పది రికార్డ్స్ కు requisition ఇచ్చేదాన్ని. వాళ్ళు not transferred అని కాని, brittle అని కాని అనడానికి వీల్లేదు, నేను చూసాను కదా వాటిని. అందుకని వాళ్ళు నిరాకరించడానికి లేదు. అలా ప్రతీ రోజూ ఒక పది రికార్డులు చూసుకొని, నాక్కావల్సినవి ఏం పాయింట్స్ ఉన్నాయో చూసుకొని, ఎడ్యుకేషన్‍కి సంబంధించినవి రాసుకొని, వాళ్ళకి తిరిగి ఇవ్వటం. ఇలా ఒక ఏడాది కాలంలో, నేను యాభై పేజీల ఒక వ్యాసం తయారు చేశాను. దాన్ని అటాచ్ చేస్తూ, మరుసటి ఏడాది, మళ్ళీ అప్లికేషన్ పంపించాను. వాళ్ళు ఈ సారి తిరస్కరించడానికి వీలే లేదు. నేను అక్కడే రాసి ఉంటి, “ఒక ఏడాదిలో నేనింత పని చేయగలిగితే, పని చెయ్యగలను అన్న నమ్మకం నాకుంది” అని. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడే కూర్చున్నాను. రోమిలా థాపర్ అప్పటికి ఢిల్లీ యూనివర్సిటీలో రీడర్ గా పనిచేస్తున్నారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ “మనకి ఫాకల్టీ లేదు. ఆ ఎడ్యుకేషన్ శాఖ శుక్లా సూపర్‍వైజర్‍గా ఉండేందుకు ఒప్పుకున్నట్టు అయితే అప్పుడు ఈవిణ్ణి తీసుకోవచ్చునూ” అని చర్చిస్తున్నారు.
అది వినేసినాను. రేడియో స్టేషన్ కు వచ్చి, “చూడు వాళ్ళిలా అన్నారూ.. ఎవరో ఆయన శుక్లా అంట, ఆయన ఒప్పుకున్నట్టు అయితే నాకిస్తారంట అడ్మిషనూ” అన్నాను. అప్పుడూ జీ ఆర్ రావు అని ఒకాయన ఉన్నారు. ఆయనిప్పుడు రిటైర్ అయ్యి, హైదరాబాద్‍లో ఉన్నారు. ఆయన అన్నాడూ.. విజయవాడ నుండి ఒక రావు ఉన్నాడూ.. రావూనూ, శుక్లానూ ఫ్రెండ్సూ, ఆయనకి చెప్తాను, ఆయనకి చెప్పమని అని అన్నారు. బహుశా, ఆ రావు శుక్లాకి చెప్పినట్టున్నారు. ఇంత వరకూ నేనా రావును చూసింది లేదు. తర్వాత శుక్లాకి ఫోన్ చేసినాను. చేస్తే, మరుసటి రోజు రమ్మన్నారు. మాట్లాడారు. Then, he was selected for asian institute of education in UN. వాళ్ళ ఆఫీసు ఏమంటే, ఇంద్రప్రస్థ ఎస్టేట్ లోకి వచ్చింది. మా ఆఫీసు నుండి దగ్గరే. వాకింగ్ డిస్‍టెన్స్. ‘గాడ్ సెంట్’ అని అనుకున్నాను, యూనివర్సిటీకి ప్రతీ సారి వెళ్ళక్కరలేకుండా.. ఇది దగ్గరయ్యిపోయింది అనుకున్నాను. ప్రతీ బుధవారం అక్కడికి వెళ్ళేదాన్ని. ఒక చాప్టర్ రాసుకొని, పేపర్లు ఆయనకి ఇస్తే, బ్యాగులో పెట్టేస్తారు. మళ్ళీ వచ్చే వారం వెళ్తాను కదా, అప్పుడు తీసి, “ఓహ్…ఈ పేపర్ ఇక్కడే ఉంది కదా..” అని దాన్ని అలా అలా తిప్పి, “ఇక్కడ కొంచెం మార్చొచ్చు, అక్కడ కొంచెం మార్చొచ్చు” అని చెప్పేస్తారు. అలా ఆయన నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు.
నాకేమంటే Wednesday is very important in my life. ఎందుకంటే.. నేను రిషి వ్యాలీలో 48లో వర్క్ చేశాను. అక్కడే ఉన్నాను. అప్పుడు Wednesdays అన్నీ half-day. Saturday and Wednesday halfday. girls house inchargeని నేను. గర్ల్స్ ను అలా వాకింగ్‍కు తీసుకెళ్ళేదాన్ని కొండల మీద.. హాస్టల్ కొండల మీద ఎక్కితే, మళ్ళీ అంతా చూస్తూ, చివరకు సాయంత్రం ఆరుగంటలకు దిగేవాళ్ళం . కొండమీద నాగదాళి (??) అంటే బ్రహ్మదేముడు.. చెట్లుంటాయి. వాటిలో ఒక కాయ ఉంటుంది. ఎర్రగా. ఈ తమిళనాడు నుండి వచ్చిన పిల్లలూ, ఆ ఎర్ర కాయలు తీసుకొని, పిన్నుతో ఆ ముళ్ళు తీసి పడేసి, “ఊ…ఫ్” అని పీల్చి తినేస్తారు దాన్లో. దాంట్లో బాగా జ్యూస్ ఉంటుంది. అలాగ పండ్లన్నీ తినీ తినీ తిని మూతులంతా ఎర్రగా మారి, వాళ్ళు దిగివచ్చిన తర్వాత చూస్తే, మూతులన్నీ ఎర్రగా కోతి పిల్లలు ఉన్నట్టు ఉంటారన్న మాట. So like that, I’ve enjoyed in that Rishi Valley. అందుకని Wednesday is an important day నాకు.
రేడియోకి వెళ్ళితే, Wednesday was my off day, వారంలో. ప్రతీ బుధవారం ఢిల్లీ యూనివర్సిటీలో సెమినార్ ఉండేది, పిహెచ్‍డి విద్యార్థులకు. సో, నేను వెళ్ళి అటెండ్ అయ్యేదాన్ని. ఎవరికీ తెలీదు, నేను వేరే ఉద్యోగం చేస్తున్నానని, ఏమంటే, Wednesday నా ఆఫ్ డే. So, like that I’ve enjoyed my Wednesdays.ఇట్ల నా పిహెఛ్‍డి పూర్తి చేశానమ్మ..
రచించిన పుస్తకాల గురించి
(భారత పార్లమెంటు పుస్తకాన్ని చూపిస్తూ)
ఇది మొదటి అనువాదం.. భారత పార్లమెంటు.. అప్పుడు అన్ని తక్కువ ధరలకు అందించేవారు. ఇప్పుడు ఎక్కడ? అన్నీ వందల్లో ఉంటున్నాయి. అది డిపిడి, పబ్లికేషన్స్ డివిజన్, ఐ ఆండ్ బి వారు వేసినారు.
ఇది మీరు ఇంగ్లీషు నుండి అనువదించారా?
యెస్..
(Inde అన్న పుస్తకాన్ని చూపిస్తూ…)
ఇది ఫ్రెంచ్ బుక్.. అంటే 1982లో NAM, అంటే నాగాలాండ్ మూవ్‍మెంట్ , దేశాలన్నీ ఢిల్లీలో మీట్ అయ్యినాయి. అప్పుడు 137 దేశాలు నుండి డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళు ఫ్రెంచి, స్పానిష్, హింది, అరబిక్ ఇవన్నీ మాట్లాడేవారు. నేనప్పుడు ఐ.సి.సి.ఆర్ (ఐండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) లో ఉన్నాను. అక్కడ నేను ఛీఫ్ ఎడిటర్. వచ్చిన డెలిగేట్స్ కు ఇండియా గురించి మెటీరియల్ ఇవ్వవలసి వచ్చింది. అప్పుడు ఇంగ్లీషులో ఒక పది పుస్తకాలు రాయించి, ఆ పుస్తకాలను అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, హిందీలలో తర్జుమా చేయించి, అవన్నీ ప్రింట్ చేయించాను. వాటిని వచ్చిన డెలిగేట్స్ కు ఒక్కొక్క pack చేయించి, అన్ని భాషల కాపీలు పెట్టి, అందరికీ ఇచ్చినాను. pack చేయడానికి నా దగ్గర వాణి అని ఒక అసిస్టెంట్ ఉండేది. ఆ అమ్మాయికి స్పానిష్ వచ్చు. నేను ఫ్రెంచ్ చేశాను. ఇద్దరం కల్సి మయాపూర్ అని ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ప్రెస్ కు వెళ్ళి, అర్థరాత్రి దాకా కూర్చొని, ఫైనల్ ప్రూఫ్ చూసుకొని, బుక్స్ తయారు చేసుకొని, ఆఫీసుకు తీసుకు వచ్చినాము. ఆ అమ్మాయి వెళ్ళి కనాట్ప్లేస్ లో కనుక్కొని వచ్చింది. 82లో వాడు ఒక్కో packకు ఇరవై రూపాయలు తీసుకున్నాడు. సరే అన్నీ pack చేయించింది, తీసుకొచ్చినాము. కాన్పరెన్స్ హాల్ లో పెద్ద టేబుల్ ఉంటుంది కదా, అన్నీ దాన్ని మీద పెట్టినాం బండిల్స్. మార్గరెట్ అల్వా మినిస్టర్ ఉన్నారప్పుడు, ఆవిడ తమ్ముడు నాజరత్ మాకు డైరెక్టర్, ఐసిసిఆర్ లో, ఆయన కింద వచ్చి “All these packets are here. The delegates are going away, what is the use?” అని అరుస్తున్నారు. సరే, మూడు కార్లు ఉన్నాయి అక్కడ. ఆ మూడూ బుక్ చేసుకున్నాను. ఈ డెలిగేట్స్ కనిష్కాలో కొందరూ, ఆశోకాలో కొందరూ అలా ఉన్నారన్న మాట. అందరికీ ఎక్కడెక్కడికి వెళ్ళాలో పాస్ లు అవీ నేనే తీసుకొచ్చి ఇచ్చాను విజ్ఞాన్ భవన్ కు వెళ్ళి, ఇద్దరి ఫారెన్ ఆఫైర్స్, డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళకూ, నాకూ అందరికీ పాస్ లు తెచ్చాను. ఒక్కో కార్లో ఒక్కోరిని కూర్చోబెట్టి ఒక్కో చోటకు పంపించేశాను. నేనేమో అశోకా హోటల్ కు పోయినాను. ఆశోక హోటల్ కు పోయి, “ఇది ఫారెన్ అఫైర్స్ వ్యవహారం. వాళ్ళకి ఇవ్వాల్సినది. కాబట్టి ఇస్తాను” అంటే వాడు లోపలికి పంపించాడు.
లోపల, మన ఫారెన్ అఫైర్స్ మినిస్టరీ వాళ్ళ ఆఫీసుంది. వాళ్ళు ఏమన్నారంటే, “ఇవ్వన్నీ స్కాన్ చేస్తేగాని లోపలికి పంపించడానికి వీలు లేదు.” అన్నారు. ఫిఫ్త్ ఫ్లోర్లో వాళ్ళతో వాదించుకుంటూ ఉన్నాను నేను. ఈయన, ఇక్కడ ఆఫీసులో, “Who will allow her? Why has she gone there?” అని అరుస్తున్నారు. అలాగే ఆశోక హోటెల్ కు వచ్చేశారు. అక్కడ చూస్తే, నేను కింద ఎక్కడా లేను. వాళ్ళు ఒక ప్యూన్ ని ఇచ్చినారు. అప్పుడు అవన్నీ స్కాన్ చేయించి, ఇచ్చి, చేసి, వచ్చాను. అదన్న మాట. నన్ను చూస్తే ఎవ్వరూ “ఈమె ఏమైనా చేయగలదు” అని అనుకోరు. ఎందుకంటే modern గా ఉండను కదా.
అట్ల వచ్చిన పుస్తకం ఇది, Every month I used to bring magazines in all the five languages (for the external affairs). It meant a lot of work, translators ని పట్టుకోవటం, ప్రెస్ కి ఇవ్వటం, ప్రింట్ చెయ్యటం అంతా కూడా tremendous work.
(The Historical papers గురించి చెబుతూ)
ఇందులో ఉన్న 20 essays, నేను history congressలో ప్రెజెంట్ చేసినవి. నేను ప్రతి సారి ఆ హిస్టరీ కాంగ్రెస్ లో ఒక పేపర్ చదివి తీరుతాను. సాధారణంగా సౌత్ ఇండియా హిస్టరీ గురించి ఎక్కువ రాయరు. నాకేమంటే మైసూరూ, టిప్పూ సుల్తానూ, హైదర్ ఆలీ, టిప్పూ సుల్తాన్ యుద్ధాలూ, పాలెగార్సూ, ఇట్ల.. south Indian history లో పేపర్స్ రాస్తాను.
(ప్రింటింగ్ హిస్టరీ పుస్తకం గురించి చెబుతూ….)
1719లో డచ్ వాళ్ళు వచ్చి “తరంగ మలై” అని మడ్రాసు దగ్గర, తమిళనాడులో అక్కడికి వచ్చిన మొట్టమొదటి ఫాదర్, హిడన్‍బర్గ్ బైబిల్ ను తమిళ్‍లోకి ట్రాన్స్లేట్ చేశారు. అనువాదం చేసి, జర్మనీలో ట్రైనింగ్ అయినారు. వాళ్ళని అడిగి పేపర్, తర్వాత టైప్స్ తెప్పించుకున్నారు. తెప్పించుకొని ప్రింట్ తీయటం మొదలుపెట్టినారు. సగం ప్రింట్ అయ్యేటప్పటికి పేపర్ అయ్యిపోయింది. ఇంకేం చేస్తారు? ఆయన ఇక్కడే పేపరు తయారు చేసి, ఇక్కడే తమిళ ఫాంటు చిన్నగా ఉన్నది తయారు చేసి, మిగిలిన సగం పుస్తకాన్ని అచ్చువేసారు. నాకేమో ఆ పుస్తకం చూడాలని. దాన్ని ఎస్.పి.సి.కె (Society for Propagation of Christian Knowledge) వాళ్ళు ప్రింట్ చేసినారు.
ఒకసారి ఒక పేపర్ చదవటానికి కాంబ్రిడ్జ్ వెళ్ళాను. పేపర్ అయిపోయినాక ఈ పుస్తకాన్ని చూడాలని లండన్ లో వాళ్ళ ఆఫీసు వెతుక్కుంటూ పోయాను. (ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే పోయేదాన్ని.) వెతుక్కుంటూ వెళ్ళగా, రసల్స్ స్క్వేర్ లో ఉంది. రసల్స్ స్క్వేర్ ని మూడు చుట్టులు చుట్టినాను. వాళ్ళ ఆఫీసు కనబడింది. ఆఫీసు లోపలికి వెళ్ళాను. వాళ్ళకి “ఎవరు ఈమె?” అనుకున్నారు. చీర కట్టు చూసి నేను భారతీయురాలనని తెల్సిపోయింది. “ఏం కావాలి?” అని అడిగారు. నేను “1719లో హిడన్‍బర్గ్ ప్రింట్ అయినటువంటి బైబిల్, నేను చూడాలి”అని అన్నాను. వాళ్ళు ఎగాదిగా చూశారు. ఏమంటే, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, పట్టుచీర కట్టుకొని సౌత్ ఇండియన్ వచ్చి, హిడన్‍బర్గ్ 1719లో ప్రింట్ చేసిన బైబిల్ అడుగుతుందేమిటబ్బా అని. వాళ్ళది ఎక్కడో పైన పెట్టినారు. పాపం, నిచ్చెనలు వేసి ఎక్కి తీసినారు. ఆ పుస్తకంలో సగం ప్రింట్ పెద్దక్షరాలు, సగం ప్రింట్ చిన్న అక్షరాలు. అలా చూసి వచ్చానన్న మాట. ఇలా ఉంటాయి నా పనులన్నీ.
(1857 గురించి చెబుతూ..)
ఈ పుస్తకానికీ చరిత్ర ఉందమ్మా. అంటే..ఇంగ్లీషులో ఐదొందుల పేజీలుందిది. ఇంగ్లీషులో 1857 అని ఉంటుంది. దాన్ని వాళ్ళు తెలుగులో పందొమ్మిది వందల యాబది యేడు అని తర్జుమా చేసేసినారు. వాళ్ళు తర్జుమ చేయమన్నారు. నేను నెలరోజుల్లో చేసిచ్చాను. ఐదొందల పేజీలు. వాళ్ళు ఆర్నెల్లల్లో ప్రింటు వేసి, నాకో కాపి ఇచ్చినారు ఐ ఆండ్ బి మినిస్ట్రీ వాళ్ళు.
నెల రోజుల్లో ఎలా అనువదించగలిగారు?
అప్పట్లో యూనిట్ లో బులిటెన్‍లు ట్రాన్స్ లేట్ చేస్తుంటే, ఆ ఉర్దూ యూనిట్ వాళ్ళు దగ్గరే ఉండేవారు. వాళ్ళు అనే వారు “Mangamma ji has taught her pen how to translate.” అందుకని ఇక్కడ ఇంగ్లీషు చూడగానే అక్కడ పెన్ రాసేస్తూ పోతుంది.
మీరు పాలెగాళ్ళ మీద రాసిన పుస్తకం?
అది తెలుగు అకాడెమీ వద్ద ఉంది. ఇంకా ప్రింటు కాలేదు.
More than 60 articles in leading papers and journals అని ఉంది ఒక చోట.. ఈ ఆర్టికల్స్ మీ దగ్గర ఉన్నాయా?
ఉన్నాయి. ఎక్కడో ఉండాలి. కొన్ని ఇక్కడ ఉన్నాయి గా.
తెలుగులో కూడా మీరు చాలా రాసినట్టున్నారు?
అవును.
అవి ఎక్కడ వచ్చేవి?
ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక వాటిలో వచ్చేవి. వీక్లీలో వచ్చేవి ఎక్కువగా.
దేని గురించి రాసేవారు?
అంటే.. ఈ హిస్టరీ కాంగ్రెస్ అలిఘర్, ఛంఢీఘర్, కాశ్మీర్, అన్ని చోట్లా తిరిగేది. ప్రతీ సంవత్సరం హాజరు అయ్యేదాన్ని. ఆ ఊరిని గురించి, దాని ప్రాముఖ్యత గురించి రాసేదాన్ని. నేను బద్రినాథ్, హిమాలయాలకూ వెళ్ళాను. దాని గురించి కూడా రాశాను.
<<ఒక పుస్తకాన్ని చూపిస్తూ మేం అడిగాము>>దీని మీద ఏం కాపీరైట్స్ లేవేంటి?
ఏం కాపీరైట్లు. ఎవరికైనా కావాల్సివస్తే తీసుకుంటారు.
మీరు కథలు అవీ ఎన్ని రాసారా?
ఏవో కొన్ని రాశాను. (మదనపల్లె రచయితల సంఘం సంకలనంలో ఉన్న మంగమ్మ గారి కథ – ’స్టేషనుకు రండి’ కథ చెప్పారు.)
మా చెల్లి భాగ్యలక్ష్మి కథ కూడా ఉంది ఇందులో. తను యూపీఎస్సీ అక్కడంతా పని చేసింది. వివిధ దేశాలు తిరిగింది. వాళ్ళు డిల్లీలో స్థిరపడ్డారు.తను దాదాపు పాతిక పుస్తకాలు రాసింది.
తెలుగులో అచ్చైన తొట్టతొలి పుస్తకం కథ
తెలుగులో అచ్చైన తొట్టతొలి పుస్తకం గురించి చెబుతారా?
The first book printed in Telugu was in Germany. అప్పుడు మన ఫాంటు కూడా వేరే ఉంది. అంటే.. ఇది తెలుగు, కన్నడలకు కలిపి ఉన్న ఫాంటు.
జర్మనీలో తెలుగు పుస్తకాలు ఎలా ప్రింట్ చేశారు?
ఎందుకంటే, ఇక్కడికి వచ్చిన మిషనరీస్ తెలుగు నేర్చుకున్నారు. అది నేర్చుకొని కొన్ని ట్రాన్స్ లేషన్స్ తీసుకువెళ్ళి, 1746లో అక్కడ ప్రింట్ చేశారు. అదెంత. ఒక మన అరచేయంత పుస్తకమే. అలా ఆరు పుస్తకాలు ప్రింట్ చేసినారక్కడ.
ఇప్పుడా పుస్తకాలు ఎక్కడన్నా ఉన్నాయా మరి?
ఉన్నాయి. లేనిదే ఈ ఫోటోలు అవీ ఎలా వచ్చినాయి?
అంటే, అప్పుడున్నాయేమో. మీరు చేసినప్పుడు ఉన్నాయా అని.
నేను చేసినప్పుడే ఉన్నాయి. తెప్పించుకున్నాను కాపీలను, కోపెన్‍హాగెన్ నుండి. బ్రిటిష్ మ్యూజియమ్ నుండి తెప్పించుకున్నాను.
మన లైబ్రరీస్ వాటిలో మనకు సంబంధించినవవీ జాగ్రత్తగా భద్రపరుస్తారా?
నేషనల్ అర్కైవ్స్ లాంటి వాటిలో ఉంటాయి. కాటలాగులు ఉంటాయి. ఇండెక్స్ లు ఉంటాయి, వాటిని చూసి తీసుకోవాలి.
మీరేదైనా టాపిక్ అనుకున్నాక, దానికి తగ్గ మెటీరియల్ దొరక్క ఇబ్బంది పడిన సందర్భాలు?
లేకపోవటం ఏముంది? ఉన్నవాటిలోనే మనకి ఏది బా పనికొస్తుందో చూస్తాం గాని, లేని దాని గురించి ఆలోచిస్తామా. మనం గెస్ చేయగలగాలి, ఫలానా దానికి మెటీరియల్ ఫలానా చోట ఉండాలి. అలా అని వాళ్ళకి రాస్తాము.
అలాగే, జర్మనీ వాళ్ళకి రాసినాను లెటర్, ఏమనంటే ఈ మొదట ప్రింట్ చేసినటువంటి ఆ అక్షరాలు, ఆ టైప్స్ మీరు ఎత్తిపెట్టినారా మీ మ్యూజియంలో అని రాసినాను. ఆరు నెలలు అయినాక, నాకు జవాబు వచ్చింది. ఏమనొచ్చిందీ? Your letter is in English. Please send it in German.
మీదింకా unpublished వర్క్ ఏమైనా ఉందా? మీ రిసెర్చ్ పూర్తయినా ఇంకా వెలుగు చూడనిది?
మెటీరియల్ ఉంది, ఇంకా రాయాలి అన్న మాట. ఇంక రెండు ప్రాజెక్ట్స్ అనుకున్నాను, ఒకటేమో Women’s Education in India. బెంగాల్లో మొదట ఇంగ్లీషు ఎడ్యుకేషన్ మొదలయ్యింది. ఇంకోటి Revolutionary Movements in India.
మన దేశంలో చరిత్రకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువనీ, ఉన్నవారిలో కూడా ఎవ్వరూ పరిశోధన వైపుకు పోవడం లేదనీ ఒక అభిప్రాయం. దానిపై మీ అభిప్రాయం.
దాంట్లో ఇంటరెస్ట్ ఉన్నవాడు చేస్తాడు.
చరిత్ర విద్యార్థులే తగ్గిపోతున్నారు కదా…
అంటే మీలాంటి వాళ్ళంతా ఇంజినీర్లు అయ్యిపోతా ఉంటే, హిస్టరీ ఎవరు చదువుతారు? (నవ్వుతూ)
స్వతహాగా ఇంటరెస్ట్ ఉంటే చెయ్యవచ్చును. అంటే, నాక్కూడా ఇంటరెస్ట్ ఉండి కాదు, నేను రేడియోలో సెలెక్ట్ అయ్యినప్పుడు, నా ఉద్దేశ్యం ఏమంటే, దేశంలో ఉన్న డిగ్రీల్లో highest degree తీసుకోవాలని. అప్పట్లో పిహెచ్‍డి నే highest అనుకునేదాన్ని. కాబట్టి పిహెచ్‍డి చెయ్యాలన్న ఉద్దేశ్యంతో…
నడుపుతున్న పాఠశాల గురించి
ఈ జ్ఞానోదయ పాఠశాలను ఎప్పుడు మొదలుపెట్టారు
1989.
See.. I came back in 1984. 84 నుండి 89 వరకు రిషి వ్యాలికి వెళ్ళేదాన్ని. రోజూ వెళ్ళేదాన్ని. అక్కడ పన్నెండో తరగతి హిస్టరీ చెప్పేదాన్ని. వాళ్ళది ఐబిఎస్‍సి సిలబస్. 89లో మా స్కూలే స్టార్ చేసినాం. అప్పుడు ఇంగ్లీషు చెప్పటం మొదలెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంగ్లీషు టీచరు.
స్కూల్ పదోతరగతి వరకూ ఉందా?
అవును. పన్నెండో తరగతి పెట్టదల్చుకోలేదు.. కొన్ని ఇబ్బందుల వల్ల. ఇక్కడ హాస్టల్ కూడా ఉంది. దాదాపు రెండువేల మంది విద్యార్థులు ఉన్నారు. స్కూలు బస్సులు చుట్టుపక్కల ఊర్ల నుంచి విద్యార్థుల్ని తీసుకొస్తాయి.
జోలెపాలెం మంగమ్మ గారి రచనలు
* Book printing in India:with special reference to the contribution of European scholars to Telugu, 1746-1857; Bangorey Books; Nellore ; 1975; For copies, C.P. Brown Research Project, S.V. University, Tirupati. [Telugu translation: తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు – 1746-1856; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు; 2001.]
* Alluri Sitarama Raju; A.P. State Archives, Hyderabad; 1983. [Telugu version: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు; విశాలాంధ్ర పుబ్లిషింగ్ హౌస్; హైదరాబాదు; 1985]
* The Rate Schools of Godavari; Govt. of Andhra Pradesh, Hyderabad; 1973.
* The Historical Papers (Sekhar Pathippagam), Chennai 2009.
* Technical and agricultural education : a study of Madras Presidency; Kumar Publishing House; Delhi; 1990.
* ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ; తెలుగు అకాడమి, 1992.
* ఆంధ్రగీర్వాణఛ్ఛందము – సి. పి. బ్రౌన్ తెలుగు భాషాకు చేసిన సేవ; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు, 2007.
* శ్రీ అరవిందులు; నేషనల్ బుక్ ట్రస్ట్; న్యూఢిల్లీ; 1973. – ఆంగ్లం నుండి ఆంధ్రానువాదం
* పాలెగాళ్లు (exact Title ?); తెలుగు అకాడమి; 2012 [A small monograph published on the eve of Prapancha Telugu Mahaasabhalu, Tirupati, 2012.]
* భారత పార్లమెంటు (సమాచార మంత్రిత్వ శాఖ) – ఆంగ్లం నుండి ఆంధ్రానువాదం
* పద్దెనిమిది వందల యభై ఏడు -అనువాదం. (సమాచార మంత్రిత్వ శాఖ)
varaprasad.
Chaala baaga raasaaru.
Bhagavan
Thank you for this article,
Jampala Chowdary
మంచి ఇంటర్వ్యూ.
ఇరవై యేళ్ళ క్రితం పరుచూరి శ్రీనివాస్ మంగమ్మ గారు అల్లూరి సీతారామరాజు గురించి వ్రాసిన మోనోగ్రాఫ్ కాపీ ఇచ్చారు. అప్పటివరకూ ఆవిడ ఒక న్యూస్ రీడర్ అనే తెలుసు. ఆవిడ స్కాలర్షిప్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. మన యూనివర్సిటీలలో ప్రొఫెసర్లందరూ రీసెర్చ్ పట్ల ఆమెకున్నకమిట్మెంట్ చూపిస్తే ఎంత ముందుకెళ్ళేవాళ్ళమో!
varaprasad.
Mee pustakaala jnapakaalato oka pustakam ray and I sir.
ranjani
ఓహ్! బలే చేసారు 😀