పల్లెలో మా పాత ఇల్లు – ఇస్మాయిల్

వ్యాసం రాసిపంపినవారు: బొల్లోజు బాబా

dsc001381“చెట్టు నా ఆదర్శం” అంటూ తన కవిత్వ హరిత కాంతుల్నిదశదిశలా ప్రసరింపచేసిన ఇస్మాయిల్ గారు పరిచయం అవసరం లేని కవి, మరీ ముఖ్యంగా అంతర్జాల పాఠకులకు.   ఎందుకంటే, ఏ ఆధునిక మహాకవి  సంపూర్ణ సాహిత్యం దాదాపు పూర్తిగా అంతర్జాలంలో లభ్యమవుతుందని చూస్తే, అది ఒక్క ఇస్మాయిల్ గారిదే.
ఇజాలు, వాదనలు లేకుండా,  మన దైనందిక విషయాలు, చిన్న చిన్న అనుభవాలు, ప్రకృతి కరుణించే సుందర అపురూప దృశ్యాలు, ఆయన కవితాలోకంలో,  కరుణ, తాత్వికలను అలంకరించుకొని సంచరిస్తూంటాయి.  అలాంటి కవిత్వం ఎవరికి ఇష్టముండదూ.
ఇస్మాయిల్ గారు 2003 నవంబరు, 25న, ఆయనే ఏదో కవితలో అన్నట్టు  ఓ విత్తనమై తనని తాను పాతుకొన్నారు.   ఆ మహా నిశ్శబ్ధంలోంచి మొలకెత్తిన ఓ తరువే “పల్లెలో మా పాత ఇల్లు” కవితా సంకలనం.  దీని ప్రధమ ముద్రణ నవంబరు, 2006.  ఇందులో వీరి  అముద్రిత రచనలు, కొన్ని అనువాదాలు ఉన్నాయి.
హైకూలను తెలుగు సాహితీలోకానికి పరిచయం చేసినట్లే “తంకా” లను (జపనీయ సాహితీ ప్రక్రియ) పరిచయం చేసే ప్రయత్నం చేసినట్లనిపిస్తుంది ఈ పుస్తకంలో.  ఇస్మాయిల్ గారు వ్రాసిన ఒక తంకా
స్టేషన్ రద్దీలో
బెంచీపై కూచుని
ముసిలాళ్లు ముచ్చటిస్తున్నారు.
ప్రవహించే నీటిలో
ప్రవహించని నీడలు.
ఈ పుస్తకంలో వలసపాక హైకూలు అన్న శీర్షికతో మొత్తం 72 హైకూలున్నాయి.  ఇస్మాయిల్ గారు తన జీవిత చరమాంకంలో,  టౌన్ లో ఉండే తమ ఇంటిని డెవెలప్ మెంట్ కిచ్చేసి, టౌనుకు దూరంగా వలసపాకల అనే ఊరిలో కొన్నాళ్లున్నారు..  శ్రీనాధుడు పాకనాటి వాడయితే నేను వలసపాకనాటి వాడినని ఎక్కడో చమత్కరించారు కూడా. ఆ కాలంలో  రాసిన హైకూలివి.  ఈ  హైకూలలో ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించే అదే సౌందర్యారాధనా, అదే ప్రకృతి పరిశీలనా, అదే తాత్వికతా, అదే నిశ్శబ్ధం,  పరిమళించే నెమలీకలై చదువరి మనసులను మృధువుగా తాకుతూ పరవశాన్ని కలిగిస్తాయి.
మచ్చుకు కొన్ని
ఇద్దరికీ సంబరమే
సముద్రపొడ్డున జనానికీ,
జనాల ఒడ్డున సముద్రానికీ.

సంజె వేళ
దీపాలు వెలిగించారు
ఎవరి దీపాలు వారివి.

కాకు లెగిరిపోయాయి
నల్లటి నిశ్శబ్ధాన్ని
వదిలి.

గిల్టు ప్రేమ
పెచ్చులు పెచ్చులుగా
ఊడుతోంది.

రాత్రి హోరున వర్షం
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు.

గుండె బీటలు పడితే
దిగుళ్లు తప్ప
అన్నీ కారిపోతాయి.
ఈ పుస్తకంలో శ్రీనివాస్ రాయప్రోల్, జీబనానంద దాస్, సుజాతా భట్, రేనర్ మరియు రిల్కే, పాబ్లో నెరుడా మరియు వివిధ జపనీయ కవయిత్రులు వంటి ముప్పై మంది  కవుల కవితల అనువాదాలు ఉన్నాయి.  చదువుతున్నపుడు అవి అనువాద రచనల్లా కాక, స్వతంత్ర రచనలుగా అనిపిస్తాయి.  దీపావళి రోజు అనే కవితలో పలికించిన విషాదం ఈ రోజు  తెలుగునాట చాలా ఇళ్లలో ప్రవహించేదే.
జీబనానంద దాస్ వ్రాసిన బనలతాసేన్ అనే పద్యానువాదంలో, ఇస్మాయిల్ గారి ట్రేడ్ మార్కయిన భాషా సరళత కనిపించదు. దీనికి కారణం బహుసా సంస్కృత భూయిష్టంగా ఉండే మూల కవితే.  అనువాదకుడు మూలానికి విధేయుడై ఉండాలి అనే నియమానికి ఈ కవితానువాదం సాక్షి గా నిలుస్తుంది.  ఇస్మాయిల్ గారికి  బెంగాలి కూడా వచ్చు.
చీనా వేదాంతి అన్న అనువాద కవిత ఇలా సాగుతుంది.
సరే, వాళ్ల చేతిలో ఓడిపోయాం;
ఐతే ఏమైంది?
టీ వచ్చింది తాగు.
మరో తొమ్మిది వందలేళ్లలో
వాళ్లూ ఓడిపోతారు
మరొకళ్ల చేతిలో.
ఈ పదిహేను పదాల కవితలో కవితలో మొత్తం మానవజాతి చరిత్ర ఇమిడిపోలేదూ?
రేబో అనే కవిత కవికి ఉండవలసిన నిబద్దతను అన్యాపదేశంగా, అద్బుతంగా ఆవిష్కరిస్తుంది.
అంతటి సర్రియల్ పాబ్లో నెరుడా ఇస్మాయిల్ చేతిలో పడి, అలతి అలతి పదాలలో, తేటగా, తేలికగా ప్రకాశించటం, “కృష్ణ పక్షం, ఏల ప్రేమింతు నిన్ను, పరిచ్యుతులు” అనే కవితల్లో చూడవచ్చు.  (వీటి మాతృకలను, మిత్రులెవరైనా తెలుపుతారని ఆశిస్తున్నాను – వ్యాసకర్త)
ద్వేషం మానవజాతిని అనాదిగా నాశనం చేస్తుంది అనే భావనను వ్యక్తీకరించే “ద్వేషం” అనే అనువాద కవిత అత్యద్బుతంగా ఉంటుంది. రకరకాల వాదాలతో కొట్టుకు చచ్చే ఈ లోకరీతిని నిరసిస్తూ, మానవత్వాన్ని అక్షరక్షరంలోనూ పలికించే కవిత ఇది.  అందులో ఒక చోట
మిగతా అనుభూతుల గురించి చెప్పకండి.
వట్టి నీరసప్పీనుగులు.
సౌభాతృత్వం పేరు చెపితే
ఎక్కడైనా జనం మూగారా?
జాలీ, దయా
ఎప్పుడైనా గెలిచాయా?
పని చేసి చూపించేది
ద్వేష మొక్కటే.
జపనీయ కవయిత్రుల అనువాదాలు చాలా సరళంగా హృద్యంగా సాగుతాయి.
అవ్యక్త వాంఛ
ఘనీభవించి
నా శరీరపులోతుల్లో
నల్లటి ముత్యంలా
మారుతోంది.

ఎన్ని ముద్దులు పెట్టుకొన్నా
ఎన్ని కబుర్లు చెప్పుకొన్నా
నువ్వు నువ్వే
నేను నేనే
వంటివి చదివిన చాలాకాలం వెంటాడతాయి.
ఇస్మాయిల్ గారు కేవలం అనువాదాలను వదిలిపోయారట; మూలంలో చాలామంది కవుల పేర్లను  శీ ismail-ppయదుకుల భూషణ్ గారు గుర్తించి, ఈ సంకలనాన్ని తీసుకురావటంలో ఎంతో సహాయపడ్డారు. అలా ఇస్మాయిల్ అభిమానులు తీసుకువచ్చిన పుస్తకం  “పల్లెలో మా పాత ఇల్లు”.
ఇజాలు, కులాలు, మతాలు, ప్రాంతీయతలు లేని సార్వజనీనమైన కవిత్వాన్ని అనుభవించి, పలవరించాలని కోరుకొనే వారందరికీ ఈ పుస్తకం నచ్చుతుంది.  ఇది ఇస్మాయిల్ గారి చివరి రచనల సంకలనం కనుక, ఆయన అభిమానులందరికీ మరింత అపురూపం.
బొల్లోజు బాబా
కాపీలకొరకు
1. విశాలాంద్ర, నవోదయా అన్ని బ్రాంచీలలో
2. Smt. Vadrevu VIralakshmidevi
Sephalika, 70-1/C-2
NFCL Road, Kakinada-533003
3. మరిన్ని వివరాలకు సంప్రదించండి:desibooks@gmail.com
వెల
50/- రూపాయిలు
$ 10

You Might Also Like

One Comment

  1. బొల్లోజు బాబా

    తాత్వికలను = తాత్వికతలను sorry

Leave a Reply