మౌనానికి ముందుమాట

రాసిన వారు: మూలా సుబ్రమణ్యం

[ఈ వ్యాసం మొదటిసారి 20 సెప్టెంబర్ 2006 న తెలుగుపీపుల్.కాం వెబ్సైటులో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం]

శీర్షికలోని చమత్కారం చూడండి. మౌనానికి (మౌనం అనే కావ్యానికి) ముందు మాట. మౌనానికి ముందు మాట(హైకూ) . గోపిరెడ్డి రామకృష్ణ గారి హైకూ సంకలనం ‘వెన్నెలగా ఉంది’ కి ముందు మాట రాస్తూ, బి.వి.వి ప్రసాదు గారు పెట్టిన శీర్షిక ఇది. ఏ హైకూ సంకలనానికైనా ఇంతకన్నా చక్కని శీర్షిక ఉంటుందని నేననుకోను. పుస్తకాన్ని పరిచయం చేసేముందు హైకూ గురించి కొంత తెలుసుకుందాం.

ఇస్మాయిల్‌ గారు, గాలి నాసర రెడ్డి గారు తెలుగు కవిత్వానికి పరిచయం చేసిన ఈ హైకూ వెనక బలమైన తాత్విక చరిత్రే ఉంది. దీని మూలాలు జెన్‌ బౌద్ధంలో మనకు కనిపిస్తాయి. సంస్కృతంలో ‘ధ్యాన’ శబ్దం , చైనాలో ‘చెన్‌ ’ గానూ, జపాన్లో ‘జెన్‌ ’ గానూ మారింది. జెన్‌ బౌద్ధం ప్రకారం రేపు అనేది ఒక భ్రమ. ఈ క్షణమే సత్యం. మనిషి జ్ఞాపకాలనీ, కలలనీ జయిస్తేగానీ అతనికి సంపూర్ణ స్వేచ్ఛ లభ్యం కాదు. జ్ఞాపకాల, కలల ప్రభావం లేకుండా తను ఈ క్షణం చూస్తున్న దృశ్యాన్ని చూసినట్టు అందించడమే హైకూ. ఆ ప్రయత్నంలో ఆ ప్రకృతిలో దృశ్యాన్ని తన హృదయంలో కూడా దర్శించగలుగుతాడు హైకూ కవి. అంటే దృశ్యానికీ, ద్రష్టకీ సరిహద్దు చెరిగిపోతుంది. ఇదే హైకూ సారం.

శబ్దం నుండి నిశ్శబ్దానికి చేసే ప్రయాణంలో ఆఖరి మజిలీ హైకూ. హైకూ అంటే ఒక క్షణాన్ని నిలబెట్టెయ్యడం. ప్రసూన భాషలో చెప్పాలంటే క్షణాలు చినుకులుగా రాలిపోతుంటే నువ్వొక ఆల్చిప్పగా మారిపోవడం. నిన్ను నువ్వు మరిచి సమస్త సృష్టి అస్తిత్వంతో మమేకమవడం. అందుకే ప్రకృతితో దీనికి విడదీయరాని సంబంధం . దురదృష్టవశాత్తూ తెలుగులో హైకూలు రాస్తున్న కవుల్లో చాలామంది హైకూ తాత్విక భూమిక తెలుసుకోకుండా రాస్తున్నారు. హైకూ నేపథ్యం తెలుసుకోకుండా చౌక బారు కొసమెరుపుల, చమత్కారాల స్థాయికి దాన్ని దిగజార్చడం నేరం. హైకూ గురించి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోడానికి ఈ లింక్‌ క్లిక్‌ చెయ్యండి.

ఇక సంకలనంలోకి వద్దాం. శబ్దాలు మనల్ని ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతాయి? హైకూ తత్వం అంతా రామ కృష్ణ గారి కింది హైకూలో ఒదిగిపోయింది.

కీచురాయిని
శబ్దం గుండా కొంత చేరుకున్నాకా
రహస్యమైపోయింది

ఆలోచనకీ, తెలుసుకోడానికీ మధ్య ఉన్న అఖాతాన్ని వంతెన వేసి దాటలేమని జెన్‌ బౌద్ధులు నమ్ముతారు. ఒక్క సారి గెంతాలి. గెంతితే తెలుసుకోవచ్చు. అంటే సత్యస్ఫురణ ఆకస్మికంగా కలుగుతుందని అర్ధం. ఎన్నో యేళ్ళు సాధన చేసినా సాధించలేని సత్యానుభవం , ప్రశాంత వాతావరణంలో మ్రోగిన ఆలయం గంట వల్లనో, చీకట్లో మెరిసిన ఓ మెరుపువల్లనో పొందినట్లు చాలా జెన్‌ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ తత్వం కింది హైకూలో మనకు కనబడుతుంది

పాత చెరువు
చందమామ మీదకి
కప్ప గెంతింది

కప్ప నిజంగా చెరువులో చంద్రుడి మీదకే గెంతిందా? చెరువులో అకస్మాత్తుగా వచ్చిన కదలిక ప్రతిస్పందన కవి మనసులోనూ మనం చూడొచ్చు.

ఇంకో హైకూ చూడండి

రాత్రి
నీటిదోయిలిలో నక్షత్రాలు
తాగడం మరిచాను

నీరు తాగడం మరిచి దోసిలిలోని నక్షత్రాలని చూస్తూ ఉండిపోయాడు. తనని మరిచి ప్రకృతిలో తాదాత్మ్యం చెందడమే హైకూకి పునాది.హైకూ కవికి కరుణ, ఆర్ధ్రత,చేతనా సౌకుమార్యం, సౌందర్య దృష్టీ అవసరం. ఈ హైకూ చూడండి

పాపాయి
యాచకునికి చేయందిస్తోంది
నవ్వుతూ

నవ్వుతున్న పాపాయి చిన్ని చేతుల స్పర్శకన్నా గొప్ప బహుమానం ఎవరికైనా ఏముంటుంది? ఎలాంటి వ్యాఖ్యానాలూ చేర్చకుండా ఇలాంటి క్షణాల్ని హైకూల్లో బంధించాలంటే కొంత ధ్యానం, మౌనం తప్పనిసరి. రణగొణ ధ్వనులతో నిండిన ప్రపంచం మీదకి ఈ కవి మౌనంగా హైకూలు రాలుస్తున్నట్టే

నందివర్ధనం చెట్టు
ముళ్ళపొదలపైకి
ఒక్కొక్కటిగా పూలు రాలుస్తోంది

మనిషి ఒంటరిగా పుడతాడు. ఒంటరిగా చనిపోతాడు. రెండిటికీ మధ్య అనంతమైన ఒంటరితనం. పుట్టలోకి వెళిపోయిన చివరి చీమ కూడా ఇతనికి దిగులు కలిగిస్తుంది.

చివరి చీమకూడా
పుట్టలోకి వెళ్ళిపోయింది
మరోమారు ఒంటరిని

ఐతే హైకూ తత్వం తెలిసిన తెలుగు హైకూ కవుల్లో కూడా గమనించాల్సిన ప్రధాన లోపం రాసిన అన్ని హైకూల్లోనూ సమాన గాఢత కొనసాగించలేకపోవడం.ఈ సంకలనంలో కూడా అక్కడక్కడా హైకూలు పల్చబడతాయి. బహుశా ఇది ఎక్కువ సంఖ్యలో హైకూలు రాయడం వల్ల వచ్చిన లోపం కావచ్చు. ఐతే ఈ సంకలనంలో చాలావరకూ హైకూలు సారవంతమైనవే కావడం అభినందనీయం!

ఇస్మాయిల్‌ గారి పేరు మీద ప్రతి సంవత్సరం భూషణ్‌ గారు ఒక యువకవికి అందజేస్తున్న ‘ఇస్మాయిల్‌ అవార్డు’ ఈ సంవత్సరం రామకృష్ణ గారికి ఇవ్వడం సముచితంగా ఉంది. ఇస్మాయిల్‌ గారే స్వయంగా ఈ కవికి రాసిన ఉత్తరంలో ‘మీ అభిమానుల్లో నేనొకణ్ణి. పుస్తక రూపంలో తెస్తే మొదటి కాపీ నాకు పంపించండి’ అన్నారుట. అందుకే

తడి ఇసుక నదీతీరం
ఎవరి పాద ముద్రలపైనో
పూలు రాలాయి

ఆ పాదముద్రలు ఇస్మాయిల్‌ గారివనీ, ఈ హైకూలు వాటి మీద రాలిన పూలనీ చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు!

For copies :

G. Rama krishna rao
22-15-18
Mutyala vari street
Near old bus stand
Tanuku – 534 211
West Godavari Dist.
& Visalandhra, Navodaya.

You Might Also Like

2 Comments

  1. హెచ్చార్కె

    చాల బాగున్నాయి. గోపిరెడ్డి హైకూలు, మూలా వ్యాఖ్యానం రెండున్నూ. వెదుకుతున్న దేనికో దారి చేస్తున్నట్టుగానో, చెబుతున్నట్టుగానో వున్నాయి.

  2. saiprakash

    bhaavayukthamina kavitalu, dhanyavaadaalu

Leave a Reply