తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు
వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి
*****************
ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన పాత్రలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. బలమైన పాత్రలు నావకు తెరచాపలాగా కథాగమనాన్ని సూచిస్తూ ఉంటాయి. ఒక పాత్ర తన వ్యక్తిత్వం ద్వారా, ప్రవర్తన ద్వారా కథపై బలమైన ముద్ర వేస్తాయి. రచయిత ఒక వ్యక్తిత్వంతో కూడిన పాత్రను సృష్టించడం ద్వారా ఏ పరిస్థితుల్లో ఒక పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయగల శక్తి పాఠకులకు వచ్చి తీరుతుందనేది నేను నమ్మే నిజం. కథను మలుపు తిప్పగలిగే పాత్రలను సాధారణంగా హీరో అని అంటారు. ఎక్కువ రచనల్లో పురుష పాత్రలే హీరోలుగా కనిపిస్తుంటాయి. కానీ ఒక స్త్రీ పాత్ర హీరోగా నిలిచి, కథాగమనాన్ని ప్రభావితం చేసిన పాత్రలు తెలుగు సాహిత్యంలో చాలా కనిపిస్తాయి మనకు. కొంతమంది రచయితలు ఆ పాత్ర ప్రవర్తన ఒకేసారి వర్ణించి కథలోకి వెళ్ళిపోతే, మరికొందరు అంతర్లీనంగా సంఘటనల ద్వారా పాత్రను వివరిస్తుంటారు. కొన్ని పాత్రలు కథను నడుపుతూంటాయి, కొన్ని పాత్రల కథ మాత్రమే ఉంటుంది. బలమైన వ్యక్తిత్వంతో ఉండే ఈ పాత్రలు సాహితీ లోకంలో నిలిచిపోతాయి. వీటికి రక్తమాంసాలుంటాయి అనడం అతిశయోక్తి కాదు. నిజానికి అవి మనచుట్టూ ఉన్నాయనే అనిపిస్తుంటాయి. నేను చదివిన వాటిలో, నాకు నచ్చిన కొన్ని పాత్రల విశ్లేషణ ఇలా…
నిజానికి కొంతమంది రచయితలకు రకరకాల ఇమేజ్ లు ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణకు ఆడవారిపై చిన్నచూపు ఉంటుందనీ, యద్దనపూడి సులోచనారాణి వంటింటి నవలలు రాశారు తప్ప ఇంటలెక్చువల్ కాదనీ, యండమూరీ పక్కా కమర్షియల్ తప్ప నైతిక బాధ్యత లేని రచయిత అనీ అంటూంటారు. కానీ వారు స్త్రీ కోణంతో రాసిన రచనల గురించి మాట్లాడుకోరు. విశ్వనాథ చాలా నవలల్లో స్త్రీ పాత్రలు తెలివైనవిగా, వ్యవహార దక్షత కలవిగా, రాజకీయ దురంధరగా తీర్చిదిద్దారు. ఆయన స్త్రీ పాత్రలు పైకి అమాయకత్వంగా కనపడ్డా, సమయం వచ్చినప్పుడు వారి తెలివితేటలు దూరాలోచనా బయటపడుతుంటాయి.
ఆయన నవలలు చదివినప్పుడు నాకనిపిస్తూ ఉంటుంది స్త్రీలు తెలివిగా, సమయస్ఫూర్తిగా ఉండాలని ఆయన కోరుకుంటారని. విశ్వనాథ వారి నాయిక పాత్రలపై ప్రత్రేక శ్రద్ధ ఉంటుంది అనడానికి ఉదాహరణగా ఆయన సృష్టించిన యశోవతి నవలలోని యశోవతి పాత్ర, నాస్తిక ధూమములో మాహేశ్వరి, భ్రమరవాసిని నవలలోని భ్రమరవాసిని పాత్ర, వేయిపడగలులోని గిరిక పాత్రలు నిలుస్తాయి.
యశోవతి కాశ్మీర రాజవంశ నవలల్లో మొదటి నవల. మైధిలీ దేశపు రాజకుమార్తెగా జన్మించిన యశోవతి, కాశ్మీర రాజవంశానికి కోడలుగా వెళ్తుంది. చిన్నప్పటినుంచీ కృష్ణభక్తి ఉన్న ఆమె ముద్దు మాటలకు ముచ్చటపడిన అప్పటి కాశ్మీరాధిపతి అయిన గోనందుడు తన కుమారుడు దామోదరునికిచ్చి ఆమెకు వివాహం చేస్తాడు. కాశ్మీర రాజవంశం జరాసంధునికి మిత్రులు. కంస వధతో కృష్ణవైరి పెంచుకున్న జరాసంధుడు అతనిపై ఎన్నో సార్లు దండెత్తుతాడు. అలా కాశ్మీర రాజవంశంలో కూడా యశోవతి వివాహానికి ముందే కృష్ణవైరి ఉంటుంది. జరాసంధుని పక్షాన కృష్ణునిపై దండయాత్ర చేసే సమయంలో గోనందుడు కృష్ణుని చేతిలో మరణిస్తాడు. దాంతో దామోదరునికి కృష్ణునిపై కోపం ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. గాంధార రాజకుమార్తె, తన మేనకోడలి స్వయంవరానికి కృష్ణుడు వస్తున్నాడని తెలుసుకుని, కృష్ణునితో స్వయంవర మండపం ముందు యుద్ధం చేసి అతని చేతిలో మరణిస్తాడు. ఇవన్నీ తాత్కాలిక సుఖ దుఖాలని తెలుసుకున్న యశోవతి తన కృష్ణభక్తిని మాత్రం మరువదు. ఇంతవరకూ యశోవతి ముగ్ధత్వాన్నీ, భక్తినీ, అప్పుడప్పుడూ కొద్దిగా వాదనాపటిమనూ చూపిన విశ్వనాధ ఈ తరువాత నుంచీ అసలైన యశోవతిని మనకు సాక్షాత్కరిస్తారు. అప్పటికి అడ్డాల్లో ఉన్న తన కొడుకు తప్ప రాజ్యానికి ఉత్తరాధిపతి లేకపోవడంతో రాజ బంధువుల్లో మంత్రుల్లో, సైన్యాధికారుల్లో, దుర్గాధిపతుల్లో ఆశ చెలరేగుతుంది. ఆడదానికి అధికారం ఇవ్వకూడదంటూ వారు గొడవ మొదలుపెడతారు. రాజ్యాధికారంలో గోనంద వంశ నిర్మూలనం ఇష్టం లేని ఆమె తన తపః శక్తితో కృష్ణున్ని ప్రసన్నం చేసుకుంటుంది.
కృష్ణుడు వచ్చి రాజ్య ఉత్తరాధికారిని నిర్ణయిస్తాడని తెలిసిన తరువాత, ఆయన రావడానికి ముందూ ఆమె నెరిపిన రాణితనం, తెలివితేటలు, శాసనా పటిమ, రాజకీయం ఆమెలోని కొత్త కోణాన్ని చూపిస్తుంది. కృష్ణుడు యశోవతి కొడుకు రెండో గోనందుణ్ణి రాజును చేసి, అతనికి వయసు వచ్చేవరకూ సింహాసనాధికారిణిగా యశోవతిని నియమిస్తాడు. నిజానికి ఇది కల్హణుడు రాసిన కాశ్మీర రాజ తరంగిణి కదా ఇందులో యశోవతి పాత్రను తీర్చిదిద్దడంలో విశ్వనాధ వారి గొప్పతనం ఎక్కడుంది అనొచ్చు. కానీ ఆ కథల్లో యశోవతి కేవలం కృష్ణభక్తురాలిగా, దామోదరుని భార్యగా, రెండో గోనందుడి తరఫున సింహాసనాధికారిణిగా మాత్రమే ఉంటుంది. కానీ విశ్వనాథ ఆమెతోనే ఈ కథకు ముడిపెట్టారు. భక్తితో కృష్ణుణ్ణి మెప్పించి రాజ్యం పొందిన యశోవతి కథలో మధ్యలో ఉన్న ఖాళీని ఆయన పూరించారు. ఆమెను దర్శించారు. ఆమె తెలివితేటల్ని అంచనా వేసి కథను ఆమె చుట్టూ తిప్పారు. అలా ఈ నవల ద్వారా మొట్టమొదటిసారి విశ్వనాథ స్త్రీ ద్వేషి అన్న ముద్ర నాలోంచి కొట్టుకుపోయింది.
ఆ తరువాత నాకు బాగా నచ్చిన పాత్ర గిరిక. వేయిపడగల్లోని ఈ పాత్ర చాలా ఉదాత్తమైనది. ధర్మారావుకు చెల్లెలైన గిరిక దేవదాసీ కులంలో జన్మించింది. తాను కృష్ణునికి భార్యకావలనుకుంటుంది. నిజానికి వేయిపడగలు నవల ప్రతీకాత్మకమైన నవల. ధర్మారావు ధర్మానికి ప్రతీక కాగా, గిరిక భక్తికీ, పసరిక పర్యావరణానికీ, గణాచారి ఊళ్ళలో ఉండే ఆచారాలకు ప్రతీకలు. ఈ నవల ద్వారా విశ్వనాథ దేవదాసీల ఆశలను ఆవిష్కరించారు. నిజానికి దేవదాసీలు ఆది నుంచీ జారవృత్తిలో లేరు. వారు గొప్ప నాట్య కళాకారిణులు. దేవాలయాల్లో నాట్యం చేస్తూ తమ భక్తిని చాటుకున్న కులం వారిది. కానీ స్వార్ధపరులైన కొంతమంది వల్ల వేశ్యాత్వంలోకి అడుగుపెట్టాల్సి వస్తే, మన భక్తి మూలాల్ని చెరిపే ప్రయత్నం చేసిన ఆంగ్లేయులు చేసిన కుట్రలో భాగంగా వారు దేవాలయాలకు, వారికి ఇచ్చిన మాన్యాలకూ దూరమై, రోజు గడుపుకోవడానికి జార వృత్తి చేపట్టారనేది చరిత్ర చెప్పే సత్యం. ఈ నవల్లో అసలు దేవదాసీల భక్తి స్వరూపాన్ని గిరిక పాత్ర ద్వారా సాక్ష్యాత్కరింపజేశారు విశ్వనాథ.
ఆయనకున్న మరో అపప్రధ స్త్రీ విద్యా వ్యతిరేకి(నిజానికి ఆయన ఆంగ్ల విద్యా వ్యతిరేకి మాత్రమే). కానీ ఈ నవలలో ధర్మారావు గిరికకు వేద, వేదాంగాలూ, రామాయణ, భాగవత, భారతాది పురాణేతిహాసాలు, జయదేవాది మధుర భక్తి కవుల కృష్ణ కీర్తనలూ అన్నీ నేర్పుతాడు. ఆమె కృష్ణున్ని పొందడంలో ఎనలేని కృషి చేస్తాడు. స్త్రీ ఒక దానికి కట్టుబడితే జీవితాంతం దానికి బద్ధురాలై ఉంటుంది అని చెప్పేందుకా గిరిక పాత్ర అలా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. ఆమె ఏకైక కోరిక కృష్ణునిలో ఐక్యం కావాలని. దానికి ఆమె చేసే దీక్ష ఎంతగానో అబ్బురపరుస్తుంది. దేవదాసీ కులంలో పుట్టి, జార వృత్తిలోకి దిగిన మిగిలిన వారిలానే ఆమెను భావించిన చాలామందికి ఆమె తన ఏకాగ్రతతో గుణపాఠం చెప్తుంది. ఆ ఊరి గోపాలస్వామికి జరిగే ఉత్సవాల్లో ఒక్కోరోజునా ఒక్కో అవతారం చొప్పొన నృత్యం చేస్తూంటుంది. ఆఖరికి కృష్ణ అవతారంలో రుక్మిణిగా నృత్యం చేస్తూ ఊరంతా చూస్తుండగానే కృష్ణునిలో ఐక్యం అయిపోతుంది. నిజానికి ఈ కాలానికి అదంతా అభూత కల్పనలా కనిపించినా, ఆమె దృఢ నిశ్చయానికి ప్రతీకగా ఈ ఘట్టాన్ని రచించారు విశ్వనాధ. గిరిక పాత్ర సత్యనారాయణ, ఆయన మొదటి భార్య పెద్ద వరలక్ష్మిగార్ల మానస పుత్రిక. వరలక్ష్మి గారు బతికున్నరోజుల్లోనే గిరిక పేరుతో ప్రత్యేకంగా నవల రాయలని వారిద్దరూ అనుకొన్నా, అది కుదరలేదు. తరువాత వేయిపడగల్లో ఒక పాత్రగా రాశారు విశ్వనాథ.
తరువాతి పాత్ర భ్రమరవాసిని నవలలోని భ్రమరవాసిని పాత్ర. ఇది కాశ్మీర రాజవంశ నవలల్లో ఆరవది, ఆఖరుది. కాశ్మీర రాజైన రణాదిత్యుడు భ్రమరవాసిని అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె అతని గదిలోకొచ్చినప్పుడల్లా భ్రమరానాదం వినిపించి నిద్ర పోతాడు. అప్పుడు అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో అతను ఒక సామాన్య సంసారి. అతనికి వివాహమైంది. కానీ అతనికి తన భార్య అంటే ఇష్టం ఉండదు. తాను ఎంపిక చేసుకోలేదు అన్నదే ఏకైక కారణం. ఆమె దేవీ భక్తురాలు. శుక్రవారాల నాడు గొప్ప దేవీ పూజ చేస్తుంది ఆమె. ఒకనాడు ఆమె పుట్టింట్లో మరణిస్తుంది. అప్పట్నుంచీ భార్యలేని లోటు అతనికి తెలుస్తుంది. ఆమె చదువుకునే లలితా సహస్ర నామాలుండే పుస్తకం తెరిచి చూస్తాడు. ఆ పుస్తకం దేవీ భాగవతం. అందులో అతనికి భ్రమరవాసినీ వ్రతం కనిపిస్తుంది. ఆ వ్రతం చేయడం చాలా కష్టం. ఒక జపాన్ని కొన్ని లక్షల సార్లు అడవిలో, మరికొన్ని లక్షలు ఒక చెట్టు తొర్రలో, మరికొన్ని ఒక సరస్సులో ఒంటికాలిపై నుంచిని పఠించి, అడవి తేనెటీగలుండే గుహ దాటి భ్రమరవాసినీ మందిరానికి చేరుకుని, అమ్మవారిని వరం కోరుకుంటే ఆ వరం తీరడంతో పాటు, వచ్చే జన్మలో చక్రవర్తిగా పుడతాడు.
భార్యను అనవసరంగా బాధపెట్టాననే చింతతో వచ్చే జన్మలోనూ ఆమె తనకు భార్యగా రావాలనీ, ఆ జన్మలో మాత్రం తాను ఆమెను అమితంగా ప్రేమించాలనీ కోరుకుని ఈ వ్రతం చేపడతాడు. అంతా పూర్తయి భ్రమరవాసిని మందిరంలో ఆమెను కోరిక కోరుకునే సమయంలో అమ్మవారి విగ్రహం అచ్చం చనిపోయిన తన భార్యలా కనపడటంతో, వచ్చే జన్మలో నువ్వే నా భార్యగా రావలని అమ్మవారిని కోరుకుంటాడు. కోపించిన అమ్మవారి అతణ్ణి మందలిస్తుంది. అందులో తన తప్పు లేదనీ తనకు తన భార్యలానే కనిపించిందనీ చెప్పిన తరువాత అమ్మవారు ఒక వింత వరాన్ని అతనికి ప్రసాదిస్తుంది. అది వచ్చే జన్మలో అతను కాశ్మీర రాజు అవుతాడు, అమ్మవారు అతనికి భార్య అవుతుంది. అలా ఈ జన్మలో రణాదిత్యుడు వివాహం చేసుకున్న భ్రమరవాసిని అమ్మవారు. ఆమె తనలానే ఉండే తన చెల్లెలు అమృతప్రభను ఇచ్చి మరల వివాహం చేస్తుంది. ఆమే క్రితం జన్మలో చనిపియిన అతని భార్య. ఆ తరువాత క్రితం జన్మలో అతనికి సాయం చేసిన అతని అక్కగార్ని కాపాడి, అతని చేత భారతదేశమంతా గెలిపించి, అతణ్ణి చక్రవర్తిని చేస్తుంది భ్రమరవాసిని. పేరుకు ఆమె అతని భార్య కానీ, ఆమె ఎప్పుడూ పరమేశ్వరిగానే ప్రవర్తిస్తుంది. ఆమె నెరిపే రాణితనం అంతులేనిది. ఆమె ఎంతో దృఢ నిశ్చయ. ఆమె పనులన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. ఆమె రాజకీయ చతురత, యుద్ధ నైపుణ్యం పాఠకులను అబ్బురపరుస్తుంది. నిజానికి సరిగా రాయకపోతే చాలా గొడవలైపోతాయి ఈ నవల వల్ల. కానీ విశ్వనాథ ఈ నవలను ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా శ్రద్ధ వహించారు కాబట్టే అమ్మవారు సామాన్యునికి భార్య అయింది అన్నా, ఆ నవల చదివితే తప్పుగా అనిపించదు. ఆమె ఒక నిర్దేశినిగా ఉంటుంది ఈ నవల్లో. నా ఉద్ధేశ్యంలో రణాదిత్యుని పూర్వ జన్మ కథ ద్వారా ఎవరినైనా అకారణంగా హింసిస్తే ఎప్పటికైనా దానికి మనం అనుభవించి తీరాల్సిందేనని చెప్పారనిపిస్తుంది. ఏదైనా తప్పు చేస్తే ఎప్పటికైనా మన అంతరాత్మ మనల్ని క్షమించదు అని ఈ నవల ద్వారా నేను నేర్చుకున్న మరో పాఠం.
విశ్వనాథ వారు నాస్తిక ధూమము అనే నవల ద్వారా చాలా పెద్ద రిస్క్ చేశారనే చెప్పుకోవచ్చు. ఈ నవల పురాణ వైర గ్రంధమాల సిరీస్ లో రెండవది. మగధరాజ వంశ మహారాణి మాహేశ్వరి కథ ఇది. కాశ్మీర రాజవంశంలో జన్మించినా వారి కుటుంబం అప్పటికి అధికారంలో లేనందున, అడవుల్లో పెరిగింది. మగధ రాజు ఈమెను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. జరాసంధుని కాలం నుండీ మగధ రాజ వంశం ఉగ్రరూపమైన చాముండీ అమ్మవారి భక్తులు. జరాసంధుని తరువాతి రాజు అమ్మవారి విగ్రహాన్ని రాజధాని నుంచీ వింధ్యా కాంతారలకు తరలించేస్తారు. మాహేశ్వరి కూడా చాముండీ దేవి భక్తురాలవుతుంది. వింధ్యగిరిస్వామి అనే ఒకడు దేవీ ఆరాధన పేరుతో ఆడవారిని లోబరుచుకునేవాడు మాహేశ్వరిని కూడా లోబరుచుకుంటాడు. మాహేశ్వరి ద్వారా మగసంతానాన్ని కని, మ్లేచ్ఛ రక్తాన్ని వ్యాపింపజేయాలి అన్నది వాడి ఉద్దేశ్యం. వింధ్యగిరిస్వామితో సంబంధం దేవీ ఆరాధనలో భాగమని ఆమె భ్రమిస్తూంటుంది. దీనిని ఆసరా చేసుకుని ఒక వృద్ధమంత్రి ఆమె గురించి దుష్ప్రచారం చేస్తూంటాడు. రాజును, రాకుమార్తెను కూడా ఆమెకు వ్యతిరేకంగా మారుస్తాడు. రాజుకు వ్యాధి వచ్చే మందులిచ్చి చివరికి అతణ్ణి చంపేస్తాడు.
కానీ ఈ మంత్రి కొడుకు చాలా మంచివాడు. రాకుమార్తె అతణ్ణి ప్రేమిస్తుంది. రాజు చనిపోయిన తరువాత మాహేశ్వరిలో తెగింపు వస్తుంది. మంత్రికి
వ్యతిరేకంగా పావులు కదిపి అతణ్ణి నిరుత్తుణ్ణి చేస్తుంది. అంతవరకూ రాణి భోగలాలస అనుకున్న మంత్రి, పరిజనం ఆమె రాణితనం, అధికారం, రాజకీయం, వ్యూహనైపుణ్యం చూసి అవాక్కవుతారు. మంచివాడైన మంత్రి కొడుకు సాయంతో రాజ్యాన్ని యుద్ధ భయం నుంచీ తప్పించి, మంత్రికి శిక్ష వేయించి, తన కుమార్తెకు, మంత్రి కొడుక్కూ పెళ్ళయేంతవరకూ రాజ్యాన్ని ఏలుతుంది. ఆ తరువాత వింధ్యా కాంతారాలకు చేరి, తన అంగరక్షకుడి చేత మంత్రిని చంపిస్తుంది. అంతవరకూ కేవలం ఆమె తెలివితేటల్నే అంచనా వేయలేక, ఆశ్చర్యపోయిన వింధ్యగిరిస్వామితో కత్తి యుద్ధం చేసి, దాదాపు అతణ్ణి చంపుతుంది. నిజానికి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆడదాన్ని విశ్వనాథ వారు సమర్థిస్తారని మనం అనుకోము, కానీ ఈ నవల ద్వారా బలవంతంగా ఆ రొంపిలోకి దిగే ఆడవారిపై ఆయన కోణం మనకు అర్ధం అవుతుంది. అలాగే అల్పురాలిగా లెక్క కట్టిన ఆమె, ఒక్కసారి తన తెలివి, సమయస్ఫూర్తి, ఆలోచనాశక్తితో మనల్ను అబ్బురపరుస్తుంది.
Varaprasad
ఒక గొప్ప మార్గదర్శి గురించి మరింత విపులంగా చర్చిస్తే మరింత బావుండేది.విశ్వనాధుని గొప్పతనాన్ని క్లుప్తంగా చెప్పినా మహా గొప్పగా చెప్పారు.నాలాంటి మందమతులకు మరింత వివరంగా వివరంగా చెపితేగాని బుర్రకు ఎక్కదు.వీలైతే ఇంకో కామెంట్ పెడితే సంతోషం.మీరు రాసిన శైలి బావుంది మేడం.
srinivasa rao v
బాగుంది,