రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్

(ఈ వ్యాసం మొదట పాలపిట్ట జనవరి 17 సంచికలో వచ్చింది. పుస్తకం.నెట్ కు పంపినందుకు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు)

*************

“Under a government which imprisons any unjustly, the true place for a just man is also a prison.”

నవీన్ రాసిన ‘చీకటి రోజులు’ నవల చదువుతుంటే అమెరికన్ కవీ సామాజిక తత్వవేత్త రాజకీయ విశ్లేషకుడూ Henry David Thoreau తన Civil Disobedience పుస్తకంలో రాసిన పై మాటలు పదే పదే గుర్తుకువచ్చాయి.

స్వతంత్ర భారత చరిత్రలో నామమాత్రంగా అమలయ్యే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సైతం అణచివేసి యేక వ్యక్తి నియంతృత్వానికి పట్టంకట్టిన ఎమర్జెన్సీ (1975 – 1977) కాలం యీ దేశ ప్రజలు మర్చిపోలేని భయంకరమైన పీడకల. ఇరవై వొక్క నెలలపాటు ‘జైళ్ళు దేశం అంతరాత్మ’ అన్న పరిస్థితి అమలైంది.

మేధావులు ముక్తకంఠంతో వర్ణించినట్టు అవి కటిక చీకటి రోజులు. పౌరులకు రాజ్యాంగ బద్ధమైన హక్కులేవీ లేవు. చట్టం చట్టుబండలైంది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో న్యాయవ్యవస్థ గుడ్డిదే కాదు మూగది కూడా అయ్యింది. రాజ్యాంగం రద్దయి పోలీసు రాజ్యం యేర్పడింది. రాజకీయంగా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచన వికృత రూపం ధరించి చివరికి ప్రజాస్వామ్యం అన్న భావనే నిషిద్ధమైంది. ప్రాథమికంగా ప్రతిపక్షాన్ని నిర్మూలించడానికి కట్టిన కత్తి సామాన్యుడి మెడమీద వేలాడింది. పత్రికా స్వేచ్ఛ అన్న మాట బూతుపదమైంది. పౌరహక్కుల గురించి మాట్టాడటం రాజద్రోహమైంది. ప్రశ్నించడం నేరమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం బందెల (బందీల) దొడ్డి అయ్యింది. రెండు రెళ్ళు నాలుగంటే జైళ్ళు నోళ్ళు తెరుచుకొన్న కాలం అది. అధ్యాపకులూ న్యాయవాదులూ డాక్టర్లూ బుద్ధి జీవులూ కవులూ రచయితలూ కార్మికులూ విద్యార్థులూ … ప్రజాస్వామిక హక్కుల గురించి ప్రశ్నించిన ప్రతి వొక్కర్నీ రాజ్యం శత్రువుగానే పరిగణించింది. వ్యక్తి నియంతృత్వంలో పౌరసమాజం అల్లకల్లోలమైంది. నిత్య నిర్బంధాలతో జీవించే హక్కే ప్రశ్నార్థకమైంది. సామాన్యుడి బతుకు అనుక్షణం అభద్రతకి గురయి వొక అగ్నిగుండంగా తయారయ్యింది.

ప్రభుత్వ రాజకీయాల్తో సైద్ధాంతికంగా విభేదించే విప్లవకారులతో బాటు భావజాల రంగంలో పనిచేసే రచయితల్ని కూడా అరెస్టు చేసే క్రమంలో వొక ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజిలో లెక్చరర్ గా పనిచేసే తిరుపతయ్య అనే రచయితని కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. అందుకు కారణం ఆయన రాసిన ‘న్యాయం’ అన్న కథ. భూస్వామి దురాగతానికి బలైన వొక పేదరైతు కథ అది. అందులో రైతు కొడుకు న్యాయం కోసం అన్ని విధాలా ప్రయత్నించి విఫలుడై చివరికి అడవి దారి పడతాడు. ఆ ముగింపు తీవ్రవాద వుద్యమాన్ని బలపరిచేదిగా వుందని అతని మీద అభియోగం. ఆ కథ 1973 లో కరీంనగర్ ఉద్యమ సాహితి ప్రచురించిన ‘బద్ లా’ సంకలనంలో చోటుచేసుకొంది. ఆ రోజుల్లోనే తాడిగిరి పోతరాజు రాసిన ‘ఎర్రబుట్ట’ కథని ప్రచురించిన కారణంగా నిషేధానికి గురైన ‘విద్యుల్లత’ పత్రిక సంపాదకుల్లో తిరుపతయ్య వొకరు (మరొకరు విజయ కుమార్). ఉద్యమ భావజాలాన్ని సొంతం చేసుకొన్న వరంగల్ సాహితీ మిత్రులు వరవరరావు లాంటి వారితో స్నేహం వుండడడం ఆయన చేసిన మరో నేరం. పనిచేస్తున్న కాలేజిలో సక్రమంగా జీతాలు యివ్వనందున యాజమాన్యాన్ని ప్రశ్నించడం కూడా యిరవై ఆరు రోజుల నిర్బంధానికి కారణమైంది. ఒక సాహిత్య కారుడిగా వుద్వేగశీలి అయినందువల్ల ఆ క్రూర నిర్బంధంలో యెదుర్కొన్న మానసిక యాతన తిరుపతయ్యలోని రచయితని చంపేసింది. ఆ యాతననంతటినీ నవీన్ అద్భుతంగా నవలీకరించాడు. తిరుపతయ్య , తిరుపతయ్యకి పోలీసు కేంప్ లో వాస్తవికంగా యెదురైన ఆ యా సంఘటనల్లో వ్యక్తులు పేర్లు మార్చుకొని యథాతథంగా (26 రోజుల నిర్బంధాన్ని 19 రోజులకి కుదించడం వంటి చిన్న మార్పులతో) పాఠకుల ముందు నిలబడి సాహిత్య రూపాన్ని ధరించి శాశ్వతమయ్యారు( నిజ జీవితంలో వ్యక్తుల్నినవల్లో పాత్రలతో పోల్చుకోవచ్చు) .

‘చీకటి రోజులు’ ఎమర్జెన్సీ మీద వచ్చిన తొలి సృజనాత్మక రచనే కాదు చానాళ్ళ వరకూ అదే యేకైక రచన. ఎమర్జెన్సీ జ్ఞాపకాలు తడి ఆరక ముందే – చావులు , గాయాలు పచ్చిగా వున్నప్పుడే వెలువడింది. ఉర్దూ లో రాహి మాసూం రజా రాసిన నవల ‘కట్రా బీ ఆర్జూ’ (1978) వొక్కటే యే యితర భారతీయ భాషల్లోనైనా చీకటి రోజులతో పాటు వెలువడ్డ రచనగా కనిపిస్తుంది. ఎమర్జన్సీ విధించక ముందే పాలకుల అధికార దాహాన్ని విమర్శిస్తూ అమృత్ మెహతా రూపొందించిన రాజకీయ వ్యంగ్య ప్రధానమైన సినిమా ‘కిస్సా కుర్సీ కా’ ని ఎమర్జెన్సీ విధించిన వెంటనే నిషేధించి ఫిల్ముల్ని తగలబెట్టేసారు.

స్నేహలతా రెడ్డి ‘జైలు డైరీ’ , కులదీప్ నయ్యర్ ‘జడ్జిమెంట్’, నిఖిలేశ్వర్ ‘గోడల వెనక’ , కె వి రమణారెడ్డి ‘డిటెన్యూ డైరీ’ ఎమర్జెన్సీ దురాగతాల గురించి పరిచయం చేసినప్పటికీ అవేవీ సృజనాత్మక రచనలు కావు. తనికెళ్ళ భరణి అసంబద్ధ నాటిక ‘గార్దభాండం’ ఆ తర్వాతెప్పుడో వచ్చింది కానీ అది ఎమర్జెన్సీ అత్యాచారాల ప్రత్యక్ష చిత్రణ కాదు , యే కాలానికైనా అన్వయించుకోడానికి పనికొచ్చే పొలిటికల్ సెటైర్.

ఎమర్జెన్సీలో తన జైలు జీవిత అనుభవాల్ని తాడిగిరి పోతరాజు కథలుగా మలిచాడు. అవి కూడా చీకటి రోజులు నవల వెలువడ్డ తర్వాత రాసినవే [అవి ఇటీవలే 2009లో ‘కెటిల్’ -ఎమర్జెన్సీ కథలు పేరున సంపుటిగా వచ్చాయి , దానికి ముందు మాట రాస్తూ ఎమర్జెన్సీ జైలు జీవితానుభవాలు వస్తువుగా రావాల్సినంత సృజనాత్మక సాహిత్యం రాలేదని వరవరరావు వెలిబుచ్చిన అసంతృప్తి సమంజసమైనదే] .

ఇందులో సంఘటనలు గానీ సన్నివేశాలు గానీ పాత్రలు గానీ కల్పితాలు అని నోట్ రాసుకోకుండా వెలువడ్డ ‘చీకటి రోజులు’ కేవలం శ్రీనివాసరావు అలియాస్ తిరుపతయ్య అనుభవాలే కావు. ఆనాడు ఆంధ్ర దేశం జైళ్ళలో వున్న వేలాదిమంది డిటెన్యూల అనుభవాలు. వాళ్ళ కుటుంబాల ఆవేదనలు. అయితే వాళ్ళ కన్నీటి ధారలకి తక్షణం స్పందించి త్రీ డైమన్షనల్ అక్షర రూపం యిచ్చిన వాడు మాత్రం నవీనే. ఒక వ్యక్తి జీవితాన్ని కేంద్రంగా చేసుకొని మొత్తం సమాజాన్ని ప్రతిబింబింప చేయడం వొక యెత్తయితే దాన్ని తీవ్ర స్వరంతో రాజకీయ వ్యాఖ్యానం చేస్తూ సృజనాత్మకంగా మలవడం మరొక ఎత్తు. ఏక కాలంలో ముప్పేటగా వ్యక్తి కల్లోల మానసిక ప్రపంచాన్ని చిత్రించడం, సంక్షుభితమైన సమాజం యెగుడు దిగుడు నేలపై నడుస్తూన్న తీరుని విశ్లేషించడం, అంతిమంగా రాజకీయ నియంతృత్వానికి వున్న తాత్త్విక కోణాన్ని ఆవిష్కరించడంలో చీకటి రోజులు వొక చారిత్రిక పత్రంగా రూపొందింది. అందుకు రచయిత ఎన్నుకొన్న డైరీ టెక్నిక్ యెంతగానో తోడ్పడింది. రచయిత తటస్థంగా వుండి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. నవల్లో ప్రధాన పాత్రధారి స్వయంగా చూసిన అనుభవించిన ఘటనల సమాహారమే కావడంవల్ల వొక సజీవ బీభత్స దృశ్యం పాఠకుల కళ్ళ ముందు అన్ ఫోల్డ్ అవుతుంది.

సాహిత్యంలో కల్పన కన్నా వాస్తవం పాఠకుల్ని యెక్కువ ఆకట్టుకొంటుంది – అనడానికి ‘చీకటి రోజులు’ మంచి వుదాహరణ. కల్పనకి యే మాత్రం చోటు లేకుండా అమాయకులైన విద్యార్థుల మీదా యువకుల మీదా పోలీస్ కాంప్ లో అధికారులు ఇంటరాగేట్ చేసిన విధానాన్ని అమలు చేసిన చిత్ర హింసని వొళ్ళు గగుర్పొడిచేలా అత్యంత వాస్తవికంగా వర్ణించడంలో రచయిత చూపిన నేర్పు అనితర సాధ్యం అని చెప్పాలి. 1986 వేసవిలో నగ్జలైట్లతో సంబంధాలున్నాయన్నఆరోపణతో బెంగళూరు లో ప్రొఫెసర్ గా పనిచేసే నగరి బాబయ్యను పోలీసులు నిర్బంధించి 90 రోజులు అనేక విధాలుగా హింసకు గురిచేస్తూ విచారించారు. ఆయన ఆ అనుభవాల్ని కన్నడలో క్రోడీకరిస్తూ రాసిన ఆత్మ కథాత్మక కథనం ‘కటిక చీకట్లో తొంభై రోజులు’ (కగ్గత్తలి జగత్తల్లి 90 దిన). ఆయన్ని నిర్బంధించిన పద్ధతి , ఇంటరాగేట్ చేస్తూ అడిగిన ప్రశ్నలు అక్షరశఃగా చీకటి రోజులు నవలలో శ్రీనివాసరావు అనుభవించిన యాతననే గుర్తు చేస్తాయి. అంతకు ముందు హజారీబాగ్ జైల్లో చిత్రహింసలు అనుభవించిన మేరీ టేలర్ రాసిన ‘My years in an Indian prison’ (భారతదేశంలో నా జైలు జీవితం : తెలుగు అనువాదం- సహవాసి) ఆమె జ్ఞాపకాలే అయినప్పటికీ వాస్తవిక సంఘటనల్ని నమోదు చేయడంలో కొంతమేరకి సృజనాత్మకమైన రచనా పద్ధతిని పాటించడం వల్ల వొక నవల చదువుతునట్టే వుంటుంది. కానీ నవీన్ యేది కల్పన – యేది వాస్తవం అని తెలియనీయని వొక గొప్ప అల్లికతో చీకటి రోజుల్ని కళ్ళకి కట్టించాడు. వాస్తవికతకీ కల్పనకీ మధ్యన గీతని చెరిపేయడం , అలా చెరిపేస్తూ కూడా కళాత్మక విలువల్ని కాపాడటం నవలా రచయితగా నవీన్ సాధించిన గొప్ప విజయం. అందుకు మనోవిశ్లేషనాత్మక రచనా శిల్పంలో నవీన్ కి వున్న అనుభవం బాగా వుపయోగపడింది.

నవీనే అనేక సందర్భాల్లో పేర్కొన్నట్టు నవల్లో వర్ణించిన సంఘటనలన్నీ తిరుపతయ్య స్వయంగా అనుభవించినవి కూడా కావు. ఎమర్జెన్సీ ముగియగానే రాష్ట్రంలోనూ యితరత్రా దేశంలోనూ వెలుగులోకి వచ్చిన క్రూర నిర్బంధ చరిత్రని జోడించి తిరుపతయ్య రాయని డైరీని అతని జ్ఞాపకాల్లోంచీ నవీన్ కొత్తగా సృజించాడు. ఆ జ్ఞాపకాల పునాది మీద అకారణంగా నిర్బంధానికి గురై కుటుంబానికి దూరమై స్వేచ్ఛా జీవితాన్ని కోల్పోయి అభద్రతకి లోనైన వ్యక్తి కల్లోల మానసిక ప్రపంచాన్ని దృశ్యమానం చేసాడు. అందుకే అవి కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోలేదు. స్వేచ్చని నిర్వచించే రాజకీయ తాత్త్వికతకి వ్యాఖ్యానాలయ్యాయి. స్వీయ అధికారాన్ని కాపాడుకోడానికి బహుళత్వాన్ని ధ్వంసం చేసే నియంతల వ్యవహార శైలికి అక్షర సాక్ష్యాలయ్యాయి. ఎక్కడో దూరంగా జరిగిన కేరళ రాజన్ సంఘటన, కర్ణాటక స్నేహలతారెడ్డి వుదంతం చీకటిరోజులు నవల రాసేటప్పుడు తన మనస్సులో వున్నాయి అని నవీన్ పేర్కొన్నప్పటికీ అతని కళ్ళముందే వరంగల్ ఆర్ ఈ సి లో చదువుకొంటున్న సూరపనేని జనార్దన్ నీ అతని మిత్రులు సుధాకర్ మురళీ మోహన్ ఆనందరావుల్ని గిరాయిపల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ చేసిన తూటా చప్పుడు యింకా పచ్చిగానే గుర్తుండి వుండాలి. అదే మహాదేవపూర్ అడవుల్లో కిరణ్ ని కాల్చి చంపే హింసాధ్యాయంగా నవల్లో ప్రతిధ్వనించింది. వీళ్ళంతా వున్నత చదువులు చదివే ప్రతిభావంతులైన విద్యార్థులేనన్న విషయం గుర్తుంచుకోవాలి. నూతన ప్రజాతంత్ర విప్లవాచారణ లోకి మేధావుల్నీ విద్యావంతుల్నీ రానివ్వకుండా భయభ్రాంతుల్ని చేసే వ్యూహమే యిది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎమర్జెన్సీ అత్యాచారాలపై ప్రత్యేకంగా విచారించడానికి నియమించిన భార్గవ కమీషన్ , తార్కుండే కమీషన్ 80 నుంచి 100 వరకు పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లకి పాల్పడ్డారని పేర్కొన్నారు. అవన్నీ రాజ్యం చేసిన హత్యలే అనడానికి యే మాత్రం సందేహించనక్కర్లేదు.

ఎమర్జెన్సీ అత్యాచారాలపై విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షా కమీషన్ సమర్పించిన తన రిపోర్ట్ ని (ఆగస్టు 6, 1978) BLACKEST HOURS of Independent India అని పేర్కొనక ముందే యీ నవలకి ‘చీకటి రోజులు’ (ఫిబ్రవరి 1978) అని పేరు పెట్టడం గమనిస్తే నవీన్ రచయితగానే గాక వొక సామాజిక రాజకీయ శాస్త్రజ్ఞుడిగా ఆనాటి పరిస్థితుల్ని యెంత లోతుగా అధ్యయనం చేసారో అర్థమౌతుంది.

అంతేకాదు , పోలీసుల అదుపులేని అధికారం వారితో యెన్ని దురాగతాలు చేయించేదీ చెబుతూ పేర్కొంటూ , స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ముప్పై యేళ్ళు గడిచాక కూడా దేశంలో ప్రజాస్వామ్య విలువలు అందని మాని పండ్లైన తీరుని , ఆచరణలో విఫలమైన నిజాన్ని స్పష్టం చేయడానికి నవీన్ యేమాత్రం వెనుకాడలేదు. దేశంలో అమలయ్యే అర్థ భూస్వామ్య వ్యవస్థ స్వరూపాన్ని సోదాహరణంగా వెల్లడించాడు.

నిజాం కాలం నాటికీ నేటికీ మన పల్లెటూళ్ళలోని వాతావరణం యేమీ మారలేదనిపించింది. పోలీసులు వచ్చారంటే ఊరంతా హడలిపోవడం, పల్లెటూళ్ళ లోని క్రింది వర్గాల వారిని పీడించి పటేల్ పట్వారీలు పోలీసులకు ఇంతెజాంలు చేయడం , వారితో వెట్టిచాకిరి చేయించడం నాటికీ నేటికీ ఒకే రకంగా ఉంది. ఈ నాటి క్కూడా పోలీసులు వచ్చారంటే అందరికీ భయమే. చాకలి వచ్చి నీళ్ళు తేవడం , ఊడ్వడం , కోళ్ళను కొయ్యడం మొదలుకొని విస్తళ్ళు తీసేదాకా చాకిరి చేయాల్సిందే. కుమ్మరి వాడు వంటలు చేయాల్సిందే. మంగలి పోలీసులకు క్షవరాలూ , మాలీసులు చేయాల్సిందే. వీళ్ళంతా పోలీసులకు కోడి పెట్టల్ని , గ్రుడ్లను ఉచితంగా సప్లై చేయాల్సిందే. నిజాం కాలం నాటి ఈ ఫ్యూడల్ వ్యవస్థ యే మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఈ నాటికీ నిలిచి ఉంది.’

‘చీకటి రోజులు’ నవలకి నవీన్ నేపథ్యంగా యెంచుకొన్న ఉత్తర తెలంగాణలో వున్న యీ వ్యవస్థకి వ్యతిరేకంగానే రైతాంగం తిరగబడింది. విరసం, అరుణోదయ , జనామం, పౌరహక్కుల సంఘం, రాడికల్‌ విద్యార్థి సంఘం, రాడికల్‌ యువజన సంఘం, రైతుకూలీ సంఘం మొ. వివిధ ప్రజాసంఘాలు ఉద్యమావసరాల రీత్యా ఈ కాలంలోనే ఏర్పడ్డాయి (వీటిలో కొన్ని యివ్వాళ ప్రకటిత, అప్రకటిత నిషేధాలకీ, నిర్బంధాలకీ గురయి వున్నాయి). దేశవ్యాప్తంగా రైల్వేసమ్మెఅప్పుడే జరిగింది. గాంధీ సహాయనిరాకరణ – శాసనోల్లంఘన స్ఫూరితోనే కావచ్చు బీహార్‌లో విశ్వవిద్యాలయాల్ని విడిచి విద్యార్థుల్నీ, మేధావుల్నీ ప్రజల్లోకి వెళ్ళమని జయప్రకాష్‌ నారాయణ్‌ పిలుపునిచ్చింది కూడా ఈ కాలంలోనే. ‘గ్రామాలకు తరలండి’ కాంపెయిన్‌ ‘ప్రజా పంథా’ లో గుణాత్మకమైన మలుపు. ఇది ఉద్యమాల స్వరూపాన్ని మార్చివేసింది. దోపిడికి వ్యతిరేకంగా పెనుగులాడుతోన్న రైతాంగాన్ని నిర్మాణాల వైపు నడిపించింది. దేశ చరిత్రలో అది దందహ్యమాన దశాబ్దం.

నిజానికి నక్జల్బరీ నుంచీ శ్రీకాకుళం వరకూ పాకిన నిప్పుని దేశవ్యాప్తం కాకుండా నివారించడంలో భాగంగానే ఆ నాటి పాలకుల ఎమర్జెన్సీ దూకుడుని అర్థం చేసుకోవాలి. పల్లెల్లో ఫ్యూడల్ అణచివేతకి వ్యతిరేకంగా కదలబారిన భావజాల ప్రకంపనలే బద్ లా సంకలనం . అందులోని న్యాయం కథ. రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు ‘ఎటువైపో’ తేల్చుకొన్న కాలం అది. ఈ చైతన్యానికి అడ్డుకట్ట వేయడానికే చీకటి రోజల్లో శ్రీనివాసరావునైనా రామరాజునైనా సత్యాన్నైనా వేణూనైనా తరుణనైనా పోలీసులు టార్గెట్ చేసింది. తద్వారా శ్రీనివాసరావు లాంటి మధ్య తరగతి భద్రజీవుల్ని కొందరినైనా విప్లవ కార్యాచరణకి దూరం చేసింది.

***

నవల్లో శ్రీనివాసరావు మానసికంగా అన్ని విధాలా చాలా బలహీనుడు. చాలా సున్నితహృదయుడు. అన్నిటికీ మించి టిపికల్ మధ్య తరగతి మనస్తత్వం. పోలీసులు అరెస్టు చేసారని నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని భయం. వుద్యోగం వూడి పోతుందని భయం. కుటుంబం వీథిన పడుతుందని భయం. భార్య అనారోగ్యంతో చనిపోతుందని భయం. పిల్లలు యేమైపోతారో అని మరో భయం. ప్రాణ భీతి. ఈ భయాల్ని జయించే ప్రయత్నం చేసాడా అంటే అనుమానమే. విరసంలో చేరమని కాలేజి స్నేహితుడు వేణు బలవంతం చేసినా భయం వల్లే చేరలేదు.

తన హక్కులేంటో అతనికి తెలుసు. కానీ వాటిని వుల్లంఘించే అధికారుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడలేడు. తన స్వేచ్చని కాపాడుకోలేని తనం పట్ల తనమీద తనకే సానుభూతి. తాను నిర్దోషినని తెలుసు. కానీ నిరూపించుకోలేని నిస్సహాయత. ఏ తెలియని శక్తులో తనకు స్వేచ్చని ప్రసాదిస్తాయని ఆశాభావం. తోటి ఖైదీల పట్ల సానుభూతి. ఇలాంటి యెన్నో అనుభూతుల మేళవింపు శ్రీనివాసరావు.

చివరికి భయాన్ని జయించానని అతను వొక సందర్భంలో అనుకుంటాడు గానీ జయించలేదు. అతని ఆ తెగువ క్షణికమే. రామరాజులాగానో వేణులాగానో వుండాలని వుంటుంది గానీ వుండలేడు. అన్యాయాన్ని సహించలేడు అట్లా అని యెదిరించలేడు. దాన్ని ఆపలేనందుకు మహా అయితే దిగులు పడతాడు. లోలోన కుమిలిపోతాడు. తీవ్రంగా దు:ఖిస్తాడు. లేదా జ్వరం తెచ్చుకుంటాడు. అతణ్ణి చూస్తే జాలి వేస్తుంది. అదే సమయంలో అతను పాటించే మధ్య తరగతి విలువల పట్ల చిరాకు పుడుతుంది. ఆ తత్వాన్ని అతను కూడా లోలోపల ద్వేషిస్తాడు. కానీ దాన్ని అతను జయించలేడు. కళ్ళముందు జరిగే అన్యాయాన్ని యెదిరించలేని తన పిరికి తనం మీద చేతకాని తనం మీద తనకే అసహ్యం .

నిజానికి శ్రీనివాసరావు లాంటి మధ్య తరగతి వ్యక్తులు తమకు తామే బందీలు. ఒక సందర్భంలో ఆ సత్యం అతనికి అవగతమౌతుంది. సమాజంలో సమూలమైన మార్పుకి ఆటంకంగా వున్న యీ మధ్య తరగతి మనస్తత్వాన్ని నవీన్ వొడుపుగా పట్టుకొని సునిశితంగా విమర్శకి పెట్టాడు.

ఎవరూ నా గూర్చి చెడుగా అనుకోవద్దు. జనం నా గూర్చి తప్పు చేశాడనుకోవద్దు. వాళ్ళలా అనుకుంటే నేను భరించలేను. ఏమీ చేయడానికి సాహసం లేదు. ఏ పని చేసినా ముందు ఆలోచించాలిసంఘాన్ని భార్యా పిల్లల్ని , బంధువుల్ని, కొలీగ్స్ ని, యజమానుల్ని – వీళ్ళను కాదని నేను నా కోసం ఎప్పుడైనా బతికానా ? కేవలం నా కోసం నేనెన్నడూ బతకలేదు. చిన్ననాడు తల్లిదండ్రుల కోసం పెద్దయ్యాకా భార్యా పిల్లల కోసం అంతే నేను యేనాడూ స్వతంత్రుణ్ణి కాను ఈ దేశంలో నాలాగ ఇలా మిడిల్ క్లాస్ మనస్తత్వంతో పుట్టినప్పటినుండీ ఎవరికో ఒకరికి దాస్యం చేస్తున్న వాళ్ళెంతమందో! ఇవ్వాళ ఆవిడెవరో వచ్చి మన స్వాతంత్ర్యాన్ని హరించివేసిందని అరుస్తున్నాము. అసలు మిడిల్ క్లాస్ వాడికి యేనాడూ నిజమైన స్వాతంత్ర్యం లేదు. సంఘానికి , సంప్రదాయానికి, పెళ్ళానికి, పిల్లలకు,అధికారానికి, అధికారులకు ఎప్పుడూ యేదో విధంగా ఊడిగం చేస్తూనే ఉంటాడు.’

శ్రీనివాసరావులోని యీ ద్వైధీభావాన్ని , అంతరంగ చిత్రాన్ని, మానసిక వైక్లబ్యాన్ని భిన్న సందర్భాల్లో నవీన్ అద్భుతంగా ఆవిష్కరించాడు. అలా ఆవిష్కరించగల నైపుణ్యం ఆయనకీ తొలినవల అంపశయ్య రోజుల్లోనే అలవడింది. అప్పుడే విశ్వరూపం ధరించింది. చీకటి రోజుల్లో అది నల్లేరు మీద బండి నడకలా సాగింది. ఆ శిల్పం నవీన్ రచనలన్నిటికీ గొప్ప పఠనీయతని సాధించి పెట్టింది. సంక్లిష్ట విషయాల్ని సైతం పాపులర్ పద్ధతిలో చెప్పడానికి ఆ శైలి యెంతగానో దోహదపడింది. ఇటు సీరియస్ సాహిత్య పాఠకులకీ అటు కామన్ రీడర్స్ కీ నవీన్ రచనలు దగ్గర కావడానికి కారణం కూడా అదే.

మధ్య తరగతి మనస్తత్వాన్నే కాదు క్రూరంగా ప్రవర్తించే పోలీసుల నైజానికి కారణాలని కూడా నవీన్ లోతుగా విశ్లేషించాడు. ప్రశ్నించడానికి వీలులేని అధికారం యెంత భయానకంగా వుంటుందో , అధికార మదం తలకెక్కిన వారి మానసిక ప్రవృత్తి యెలా వుంటుందో వెంకయ్య ప్రభాకర్ వంటి పోలీసు అధికారుల మాటల ద్వారా చేతల ద్వారా నవల పొడవునా బలంగా చిత్రించాడు. ఆ వొరవడి లోనే ఖాకీవనంలో పతంజలి , ఖాకీ బతుకులులో స్పార్టకస్ పోలీసుల హింసోన్మాదానికి కారణాల్ని తాత్త్వికంగా విశ్లేషించారు.

అదే సమయంలో పోలీసు కేంపులో యువకులు విద్యార్థులు విప్లవ గీతాలు పాడుతుంటే సెంట్రీ పోలీసులు తాళం వేయడం, పై అధికారులు లేనప్పుడు ఖాళీ సమయాల్లో వాళ్ళతో డెటెన్యూలు కలిసి కార్డ్స్ ఆడుకోవడం వంటి అంశాలు కూడా నవీన్ దృష్టి నుంచి తప్పుకుపోలేదు. ఉద్యమాల్లో జైళ్ళ పాలయిన వాళ్ళు ఏదో వొక సందర్భంలో పొందిన అనుభవాలే అవి. పోలీసులంతా శాడిస్టులు కాదు వాళ్ళల్లో కూడా మనసున్న మంచివాళ్ళు వుంటారని సూర్యం చంద్రయ్య లాంటి పాత్రల్ని కూడా రచయిత నవలలో సృష్టించాడు. వాళ్ళలో కొందరికి అన్యాయంగా శిక్షలనుభవిస్తున్న విద్యార్థులపట్ల సానుభూతి వుంటుంది. నాయుడు లాంటి వారికి ‘ఏమో రేపు వీళ్ళే రాజ్యాధికారం సాధిస్తారేమో’ అన్న అనుమానం కూడా. వ్యక్తుల భిన్న వర్తనలకున్న అనేక కోణాల్ని చిత్రించడం నవీన్ రచనలో ప్రత్యేకత. అది చీకటి రోజుల్లో పుష్కలంగా కనిపిస్తుంది.

వ్యక్తి అంతరంగ క్షోభకీ సమాజంలోని సంక్షోభానికీ వున్న కార్య కారణ సంబంధాన్ని సైతం ‘చీకటిరోజులు’ చక్కగా ప్రతిబింబించింది. శ్రీనివాసరావులోని ఆత్మన్యూనతకి కారణాల్ని విశ్లేషిస్తూనే దాన్ని జయించడానికి అవసరమైన చైతన్యపు దినుసుని కూడా రచయిత నవల్లో అందజేశాడు. శ్రీనివాసరావు మొదటి నాల్గు రోజులూ తనకేదో అన్యాయం జరిగిందని ప్రమాదం జరిగిందని అవమానం జరిగిందనీ , తన భార్యా పిల్లలు యేమైపోతారో అనీ తనలో తాను కుమిలిపోతుంటాడు. తన తండ్రి పోలీసు కేంప్ లో వున్నాడేమో అని వెతుక్కొంటూ వచ్చిన సూర్యం అనే పదేళ్ళ పిల్లాడికున్న విశ్వాసం ధైర్యం కూడా శ్రీనివాసరావుకి లేవు. ఎప్పటికైనా ప్రజలే జయిస్తారు – నిర్బంధం నుంచీ అందరికీ విముక్తి కల్గిస్తారన్న పిల్లాడి మాటలకి అతను ముగ్ధుడయ్యాడే గానీ స్ఫూర్తిని పొందలేదు. గోళ్ళూడగొట్టడం కోదండం వేయించడం సిగరెట్ తో కాల్చడం రోకలి బండ యెక్కించడం చచ్చేదాకా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాకప్ హింసను చూసి అతను విచలితుడయ్యాడు. శారీరిక హింసని మించిన మానసిక హింస అనుభవించాడు. ఒక ఆదర్శం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం తమ ప్రాణాల్ని అర్పించడానికి సిద్ధమైన సత్తెయ్య కిరణ్ పివొడబ్ల్యూ తరుణ వంటి పడుచు పిల్లల స్థైర్యాన్ని ధైర్యాన్ని చూసాకా అతనిలో మార్పు వచ్చినప్పటికీ విప్లవ రచయిత రామరాజు రాజ్యాన్నెదిరించే తెగువ మాట తీరుకీ ప్రభావితుడైనాకే చివరికి ‘మీసా’ కింద బుక్ చేసి జైలుకు పంపించమని పోలీసు అధికారుల్ని అడుగుతాడు. ‘పిరికితనంతో ప్రతిక్షణం చచ్చేకన్నా … ధైర్యంగా ఒక్కసారే చస్తే బావుంటుంది అన్న తెగింపు’ మంచిదని భావిస్తాడు. బిడియం నైరాశ్యం వదిలి సినిసిజం నుంచీ విశ్వాసం వైపు ప్రయాణం చేయాలన్న కొత్త అవగాహన కూడా రామరాజు ద్వారా పొందగలిగాడు.

***

ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికి రాదు. డిక్టేటర్ షిప్పే కావాలి అని భావించే మధ్య తరగతిలో కొందరు ఎమర్జెన్సీలో అవినీతి నిర్మూలన జరుగుతుందని భ్రమించారు. కానీ పోలిస్ స్టేషన్లే అవినీతికి అక్రమాలకీ నెలవయ్యాయి. ప్రశ్నించే గొంతులు లేక అధికార స్వామ్యానికి తిరుగులేకుండా పోయింది. అధికారుల ఆగడాలు రాజముద్ర వేసుకొన్నాయి. బూటకపు ఎన్ కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయి. రాత్రికి రాత్రి మనుషులు మాయమై పోయేవాళ్ళు.

ప్రజల ఆర్ధికావసరాల్ని తీర్చడానికే ఎమర్జెన్సీ అనీ అవినీతిని అంతం చేయడానికి అదే సరైన మార్గం అనీ వాదించే వాళ్లకి సమాధానం అన్నట్టు నవీన్ పోలీస్ స్టేషన్లు అవినీతిలో యెంతగా కూరుకు పోయాయో తెలియజేసే యెన్నో సంఘటనల్ని నవల్లో జోడించాడు. తాగి రోడ్డుమీద నడుస్తున్నారని యిద్దరు వడ్డెరల మీద దొంగ కేసులు బనాయించి కోర్టులో హాజరు పరచకుండా నిర్బంధించడం వదిలి పెట్టాలంటే పైసలు డిమాండ్ చేయడం వాళ్ళని అమానుషంగా హింసించడం చూస్తే అత్యవసర పరిస్థితి అంటే అమాయకుల మీద పోలీసుల అపరిమిత అధికారామేనా అన్న సందేహం కల్గుతుంది. నారాయణ కథ యింకా దయనీయం. అతని భార్యపై షావుకారు అత్యాచారం చేస్తే తట్టుకోలేక షావుకారు మీద నారాయణ తిరగబడ్డాడు. షావుకారు అతనిమీద దొంగతనం ఆరోపించి అరెస్టు చేయిస్తాడు. పోలీసులు అతణ్ణి కోర్టులో హాజరు పరచలేదు. కేసు నమోదు చేయలేదు. అడిగిన లంచం యిచ్చేవరకూ భార్యా పిల్లలకు దూరం చేసి స్టేషన్ లోనే నిర్బంధించి ఊడిగం చేయించుకుంటారు. నారాయణ లాంటి అభాగ్యులకు ఎమర్జెన్సీ వొరగబెట్టిందేంలేదు. వాళ్ళ వ్యథల కథలకు అంతం లేదు.

శ్రీనివాసరావ్ పనిచేసే కాలేజి మానేజ్ మెంట్ ప్రభుత్వం నుంచీ గ్రాంటులు తీసుకొని ‘ఉద్యోగులకు జీతం సక్రమంగా చెల్లించకుండా విద్యని వ్యాపారం చేస్తూ వుంటే అత్యవసర పరిస్థితి వాళ్ళని యేమీ చేయలేకపోయింది.’ పై పెచ్చు తమ అవినీతిని ప్రశ్నించిన వాళ్ళపై దొంగ కేసులు బనాయిస్తుంది. ఉద్యోగాల్లోంచీ తొలగిస్తుంది. శ్రీనివాసరావ్ లాంటి వాళ్ళని జైలు పాల్జేస్తుంది. అవినీతి చట్టబద్ధం కావడానికే అత్యవసర పరిస్థితి వుపయోగపడింది. దొంగలు దొరలై కులకడానికే అది దోహదం చేసింది. మనిషిని మనిషి దోచుకోడాకో హింసించడానికో తోడ్పడింది. అధికార స్వామ్యానికి రాచబాటలు పరచింది.

వెంకయ్య లాంటి పోలీసు యిన్స్పెక్టర్లు ఖైదీలకి కేటాయించిన రేషన్ మిగుల్చుకోడానికి గానీ ఆ మిగులుతో వాళ్ళ కళ్ళ ముందే షడ్రుచులతో విలాసవంతమైన భోజనం చేయడానికి గానీ అత్యాయక పరిస్థితి ఆటంకం కాలేదు. మొదటి తరగతి రాజకీయ ఖైదీలకి యివ్వాల్సిన కనీస సదుపాయాల మాటేమో గానీ కేంప్ లో ఉడికీ ఉడకని అన్నం , చారు తప్ప మరేం పెట్టేవారు కాదు. మిగతాదంతా కేంప్ ఆఫీసర్ల జేబుల్లోకే. జైల్లో సరైన సదుపాయాల కోసం హక్కుల కోసం అడిగిన వాళ్ళ పట్ల క్రౌర్యం పడగ విప్పుతుంది. వాళ్ళ వీపులమీద లాఠీలు విరగుతాయి. వూపిరాడని లాకప్ లో చిత్ర హింసలు అనుభవించాలి.

నరసింహులు జీవిత కథ భిన్నమైనది. చిన్నతనంలో చిల్లర దొంగతనాలు అలవాటైన అతను తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో నల్లా నర్సింహులు దళంలో పని చేసాడు. చెడుపనులు మానేశాడు. అతనికి జీవితంలో ‘ఆ నాలుగేండ్లే బంగారమోలె అనిపించింది’. సొరాజ్జెం వచ్చాకా మళ్ళీ దొంగతనాలు మొదలెట్టాడు. ఈ సారి హంతకుడయ్యాడు. దొంగ హంతకుడుగా మారడానికి కారణమెవరు అని రచయిత ప్రశ్నిస్తాడు. ఉద్యమం సఫలమైతే నరసింహులు సన్మార్గంలోనే వుండేవాడు. రచయిత అతనిలో దాగి వున్న మానవీయ స్పందనల్ని యెత్తిచూపాడు. మనుషులు నేరస్తులుగా మారడానికి సమాజమే కారణమన్న వాస్తవాన్ని నిరూపించాడు. నిజానికి నరసింహులు తిరుపతయ్యకి జైల్లో తారసపడ్డాడో లేదా అతడు నవీన్ కల్పించిన పాత్రో తెలీదు గానీ అతని వృత్తాంతం చదువుతోన్నంతసేపూ వట్టికోట ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథల్లోని ‘పతితుని హృదయం’ గుర్తొచ్చింది. అందులో గండయ్య ద్వారా ఆళ్వారుస్వామి లేవనెత్తిన ప్రశ్నలకి నర్సింహులు జీవితం కొనసాగింపులా కనిపించింది. నేరాలకీ శిక్షలకీ స్వేచ్చకీ నిర్బంధానికీ వున్న అనేక సామాజిక రాజకీయ కోణాల్ని అర్థం చేయించడానికి ఆళ్వారు స్వామి దగ్గర్నుంచీ నవీన్ వరకూ ప్రయత్నిస్తున్నప్పటికీ జైళ్ళు పరివర్తన శాలలుగా కాక నరక కూపాలుగానే మిగిలి వున్నాయి. 40 ల నుంచీ 70 లకు గానీ అప్పటి నుంచీ కొత్త శతాబ్దం వరకూ మార్పేం లేదు. (కథంతా – రచయిత కథనంతో సహా – పూర్తి మాండలికంలో రాయడాన్ని నవీన్ యెప్పుడూ ఆమోదించలేదు కానీ నవల్లో పదిపేజీల నరసింహులు కథ చక్కటి తెలంగాణా భాషలో మౌఖికంగా నడుస్తూ రచయితకి భాషా శైలీ శాస్త్రాల విషయంలో వున్న అవగాహననీ తెలంగాణా గ్రామీణ భాష మీద వున్న సాధికారతని తెలియజేస్తుంది.)

పోలీసులకు మొరబెట్టుకుంటూ ‘నేనే తప్పూ చేయలేదు సార్ – నాకు రాజకీయాల్తో ఎలాంటి సంబంధంలేదు’ – నవల్లో మధుసూదన్ అనే పాత్ర అన్న మాటలు గమనించాల్సినవి. పాలకవర్గ భావజాలంతో విభేదించే రాజకీయాభిప్రాయాలు కలిగి వుండటమే నేరమన్న స్థితికి దేశప్రజల్ని నెట్టివేసిన ఫాసిస్టు పోకడలకి ఆ మాటలు అద్దం పడుతున్నాయి. రాజకీయాల్తో ప్రత్యక్ష సంబంధం వుండనక్కరలేదు ; సాహిత్యాన్ని రాజకీయాల్తో ముడిపెట్టినా సాహిత్యంలో సామాజిక నిబద్ధత గురించీ మాట్లాడినా సాహిత్యం ద్వారా ప్రజా చైతన్యం తెచ్చే యెటువంటి చిన్న ప్రయత్నం చేసినా నేరమే అనీ – సాహిత్య కారులకీ విద్యావంతులకీ ఉద్యోగులకీ రాజకీయాలతో సంబంధం వుంటే నిర్బంధించవచ్చు అనీ చదువుకున్న వాళ్ళు సైతం భావించేంతగా వొక భయానక వాతావరణం తయారైంది. ఎవరెన్ని విధాలుగా వ్యాఖ్యానించినప్పటికీ సామాన్య ప్రజానీకాన్ని భీతవహుల్ని చేసి ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు తలెత్తి చూడనీయకుండా చెయ్యడమే ఎమర్జెన్సీ ముఖ్యోద్దేశ్యం. రాజ్యాంగంలో పొందుపరచిన అన్ని ప్రాథమిక హక్కుల్నికాలరాయడమే దాని కార్యాచరణ. అందుకే అంత హింసోన్మాదాన్ని ప్రజలు చవి చూడాల్సి వచ్చింది.

అయితే వొక సందర్భంలో విప్లవోద్యమంతో సంబంధం లేని వాళ్ళని కూడా పోలీసులు హింసిస్తున్నారని చెబుతూ సత్తెయ్య – తాడుని చూసి కూడా వీళ్ళు పామనుకొంటున్నారని వ్యాఖ్యానిస్తాడు. అతని ఆ వ్యాఖ్య విప్లవకారులు పాములాంటి వారన్న తప్పుడు సంకేతాన్నిస్తుంది. అలాగే వాళ్ళని యే విచారణా లేకుండా నిర్బంధంలో వుంచే పోలీసు న్యాయాన్నిఅధికారాన్ని సమర్థించినట్టు కనిపిస్తుంది. అదే విధంగా కానిస్టేబుల్ సూర్యం సమర్థత గురించి చెబుతూ ఎర్రగా ఎత్తుగా అందంగా పెద్ద ఆఫీసర్లా వుండాల్సినవాడు కానిస్టేబుల్ గా వున్నాడు వంటి వ్యాఖ్యలు కూడా శ్రీనివాస రావు మధ్య తరగతి మనస్తత్వం నుంచీ వచ్చినవే అని కొట్టివేయలేం. అటువంటివాటిని రచయిత పరిహరించి వుంటే బాగుండేది. అయితే ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం యేమంటే తెలుగునేల మీద ఎమర్జెన్సీ బాధితుల్లో అధిక శాతం విప్లవోద్యమాల్లో పౌరహక్కుల సంఘాల్లో పనిచేసినవాళ్ళేనని నవీన్ గుర్తించినప్పటికీ రచయితగా తాను ‘అపొలిటికల్’ వుండిపోయాడు. రాడికల్ యువకుల విషయంలోనే కాదు గోడల మీద రాతలు రాసిన ఆరెస్సెస్ పిల్లల్ని పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకొని హింసించిన తీరు పట్ల కూడా సమభావంతోనే నిరసన వ్యక్తం చేసాడు. ఆ విధంగా రచయిత ప్రజాస్వామిక స్వరం నవల పొడవునా బలంగా ధ్వనిస్తూనే వుంటుంది. సాహిత్య కారుడిగా నవీన్ గొంతు అదే.

***

ఎమర్జెన్సీలో సాహిత్యకారులు యెటు నిలబడ్డారు అన్నది నవల్లో ప్రముఖంగా ప్రసక్తమైంది. ప్రభుత్వ పాలసీలను సమర్థిస్తున్నామని అండర్ టేకింగ్ పత్రం రాసిచ్చి సరెండర్ అయితే చాలు నిర్బంధం నుంచీ బయట పడవచ్చు అని యెన్ని విధాల ప్రలోభపెట్టినా నవల్లో రామరాజు లొంగలేదు. తండ్రి నచ్చచెప్పినా భార్యా బిడ్డలు రోదించినా సడలలేదు. ప్రజలపట్ల నమ్మిన రాజకీయాలపట్ల నిబద్ధుడైన రచయిత యెలా ఉండాలో చెప్పడానికి నవీన్ రామరాజు పాత్రని నవల్లో వుదాత్తంగా చిత్రించాడు. రామరాజు శ్రీనివాస రావుకి పూర్తిగా కాంట్రాస్ట్. ఎమర్జెన్సీ విధించాగానే మిత్రుడు రవి చెప్పినట్టు తనకి విప్లవ రాజకీయాల్తో గానీ రచయితలతో గానీ సంబంధాల్లేవని రాసివ్వనందుకు శ్రీనివాసరావు బాధపడతాడు. అభ్యుదయ ప్రగతిశీల వాదులనుకొన్న కొంతమంది రచయితలు ఇందిరమ్మ ఇరవై సూత్రాలు సంజయ్ గాంధీ అయిదు సూత్రాలు దేశ దారిద్ర్యాన్ని తీర్చే తారక మంత్రాలు అని ఎమర్జెన్సీకి మద్దతు పలికి తమ చర్మాల్ని కాపాడుకొన్నారు. కొందరు పీఠాలధిరోహించారు. అవార్డులందుకున్నారు.

ఎమర్జెన్సీ లో ఆరెస్సెస్ వంటి రైట్ వింగ్ రియాక్షనరీస్ మీద నిర్బంధం అమలు పరచడం ద్వారా కమ్యూనిస్టుల సపోర్ట్ పొందాలని ఇందిరమ్మ ప్రయత్నించింది. నిజానికి వాళ్ళు అప్పటికే బ్యాంకుల జాతీయకరణ రాజ భరణాల రద్దు వంటి వాటితో ‘ఇందిరమ్మ సోషలిజం’ మత్తులో పీకల్దాకా కూరుకుపోయారు. వొక విధంగా భజన చేస్తున్నారు. అదీగాక అంతర్జాతీయంగా రష్యా ప్రావ్డా మార్షల్ టిటో ఇరాన్ షా వంటి వారి మద్దతు కూడా సంపాదించింది. దాంతో ఎమర్జెన్సీని ‘అభ్యుదయ వాదులంతా ముక్తకంఠంతో బలపరుస్తున్నారు’ అని గజ్జెల మల్లారెడ్డి లాంటి కవులు అడక్కుండానే కితాబులిచ్చారు. అదే స్ఫూర్తితో ‘దీక్ష’ కవిత్వం వెలువడింది. సినారె దేవీప్రియవంటి కవుల అకవిత్వం అందులో చూడొచ్చు.

నిజాంని తరతరాల బూజుగా అభివర్ణించి జైలుకెళ్ళిన దాశరథి తన ‘ఆలోచనా లోచనాలు’ ఎమర్జెన్సీకి ముందూ వెనకా రాష్ట్రంలో రాక్షస నిర్బంధాన్ని వ్యవస్థీకృతం చేసిన జలగం వెంగళరావుకి అంకితమిచ్చాడు. ‘మన ప్రియతమ నాయకుడు జలగం – ప్రజాకోటియే ఆయన బలగం’ అని పాలకుల పాదాల్ని శిరసావహించాడు. అప్పుడు దాశరథి అరసం అధ్యక్ష వర్గ సభ్యుడు కూడా. తర్వాత ఆస్థాన కవి పదవి అతణ్ణి వరించింది.

ఓరోరీ ముఖ్యమంత్రిగా – ఇందిరమ్మ బాజా భజంత్రిగా

ఔరౌరా వెంగలప్పిగా జలగావు నీ పేరంటే కడుపు నొప్పిరా

కాంగిరేసు చాకలింటిలో దిక్కుమాలి వంగి వంగి నడుచు గాడిదా (12-7- 1974)

అని వెంగళరావు పాలనని విమర్శించిన శ్రీ శ్రీ ఎమర్జెన్సీని వామపక్ష అనుకూల నియంతృత్వంగా భావించడం వింతే  (‘ఇండియాలో ఇవాళ ఫాసిజం లేదు – There is certain dictatorship. Yes – but that is a left dictatorship, I assert – వామపక్ష అనుకూల నియంతృత్వం’).  పైగా తర్వాత తాను ఎమర్జెన్సీని సమర్థించలేదు ఇరవై సూత్రాలనే బలపర్చానని చేసుకొన్న సర్దుబాటు భూమయ్య క్రిష్ణా గౌడ్ ల వురి తీత ని ఖండిస్తూ ‘భూమ్యాకాశాలు’ (3-12-1975) కవిత రాసే నాటికి దిద్దుబాటుగా పరిణమించింది. శ్రీ శ్రీ లాంటి వాళ్ళు యే కొందరో అటూ ఇటూ వూగిసలాడుతూ వున్నప్పటికీ విరసం సభ్యులెంతోమంది జైలు పాలయ్యారు.

వాస్తవంగా జరిగిన వొక కథ రాసిన పాపానికి తన పై అమలయిన పాశవిక నిర్బంధం కారణంగా యం వి తిరుపతయ్య (నవలలో శ్రీనివాసరావు) కలం పట్టడానికి జీవితాంతం భయపడేవాడు. అతనిలోని రచయిత చనిపోయాడు. అందుకే నవీన్ ముఖత: అతని కథ వినవలసి వచ్చింది. వ్యవస్థలు మనిషి స్వేచ్చని హరిస్తాయి. ప్రవృత్తిని నాశనం చేస్తాయి. ఆధిపత్య విలువలతో నడిచే రాజ్యం ఉద్యోగం కుటుంబం సాహిత్య కారుడిలోని సృజనాత్మకతని ధ్వంసం చేస్తాయి అనడానికి తిరుపతయ్య జీవితమే వుదాహరణ. అతను తన చరమ దశలో గానీ కలం పట్టి రచనలు (బతుకు , జీవన సమరం నవలలు) చేయలేదు.

ఎమర్జెన్సీ నాటి రాజ్యహింసే మరింత వికృతరూపం ధరించి యివ్వాళా అమలవుతోంది. జైళ్ళు హైటెక్ సెక్యూర్డ్ జోన్స్ నరక కూపాలుగా తయారయ్యాయి. పోలీసు ఠాణాలే అత్యున్నత న్యాయస్థానాలయ్యాయి. పోలీసే న్యాయ నిర్ణేత అయ్యాడు. పోలీసు న్యాయమే అంతిమ న్యాయం అయ్యింది. మీసా చట్టం స్థానంలో టాడా పోటా యుఏపిఏ వంటి చట్టాలు రాచమార్గంలో వచ్చి చేరాయి. వాటికి తోడు ప్రభుత్వాలే ప్రైవేటు సైన్యాల్ని నడుపుతున్నాయి. కార్పోరేట్ కంపెనీలకి దేశాన్ని అమ్మేసే రాజనీతి వీరవిహారం చేస్తోంది. కాదంటే రంగు రంగుల వేట ఆపరేషన్ల కోసం సరిహద్దు సైన్యాలు మన భూభాగమ్మీద మన పౌరులపైనే యేకపక్ష యుద్ధం చేస్తాయి. ఎమర్జెన్సీ అవసరం లేకుండానే శుద్ధ ప్రజాస్వామ్యం గొడుగు నీడనే పాలకులు ఫాసిస్టు నియంతృత్వాన్ని బాహాటంగా అమలుచేస్తున్నారు. అధికార దాహానికి తోడు యివ్వాళ బహుళత్వ భావనల పట్ల అసహనం పెరిగింది. భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగి వుండటమే అపరాధమైంది. స్వయంగా పాలకులే చట్టాన్ని దేశభక్త మాఫియా ముఠాల చేతిలోపెట్టి చోద్యం చూస్తున్నారు. అధికార పక్షానికే చెందిన అద్వానీ లాంటి సీనియర్ పార్లమెంటేరియన్ మరోసారి ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం పొంచి వుందని హెచ్చరించే పరిస్థితి దాపురించింది.

AmpasayyaNaveenఇప్పడు రాజకీయాల్లో పౌర సమాజంలో ప్రజాస్వామిక సంప్రదాయాల , దృక్పథాల అవసరాన్ని బలంగా విశ్వసించే నవీన్ లాంటి రచయితలకి బాధ్యత మరింత పెరిగింది. అందుకే యీ వ్యాసం థోరో మాటలతోనే ముగించుకొందాం.

How vain it is to sit down to write when you have not stood up to live

అంపశయ్య తర్వాత ‘రాయడమే సామాజిక ఆచరణ’ అని నిరూపిస్తూ నవీన్ ని నిబద్ధ రచయితగా నిలబెట్టిన రాజకీయ నవల ‘చీకటి రోజులు’. రచయితగా నవీన్ అదే నిబద్ధతని కొనసాగిస్తూ కడదాకా నిలబడబతారని నా ఆకాంక్ష , నమ్మిక.

You Might Also Like

3 Comments

  1. divikumar

    ప్రభాకర్ గారూ — చాలా బాగా రశారు. నేను రాసినది స్థూలంగా గుర్తుంది కానీ , సూక్ష్మంగా గుర్తు లేదు. మీరు రాసింది మంచి విశ్లేషణ. నేను ఇప్పుడే చదివాను. అంటే నా గత పోస్టింగ్ సమయానికి చదవక పోవటమే కాదు. మీరు రాసినట్లు కూడా తెలియదు.
    అయితే ఎమర్జెన్సీలో అరెస్టవటమే వీరోచిత త్యాగం గా భావిస్తూ రాసుకునేవారూ, లేక వారి గురించి అలా రాశేవారూ, అన్ని నిర్బంధాల నడుమ ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించిన వారిపట్ల ఎంత కన్సర్నెడ్ గా వున్నారు? అలాంటి కాలంలో రహస్య బహిరంగ కార్యకలాపాల సమన్వయం ఎంత అనుక్షణ ప్రమాద భరితమో ఎందరికి తెలుసు?
    రహస్యంగా ఒక కరపత్రం ప్రచురించటం ఆ రోజుల్లో (జిరాక్షులెరుగని)ఎంత కష్టమో , దాన్ని వివిధ ప్రదేశాలకు చేర్చటానికి, జనం లో పంచటానికి ఎన్నెన్ని సున్నిత సునిసిత పద్ధతులవసరమవుతాయో , అవన్నీ బహిరంగ, రహస్య సమన్వయంతో జరిగాయో ఎక్కడా రికార్డ్ కాలేదు.నా లెక్కన జైలులో వున్నవారికంటె బయట వుంటూ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కృషి సల్పిన వారు ఎక్కువ త్యగపూరిత కార్యకర్తలు.
    ఈ కోణం సాధారణంగా రచయితలు మిస్ అవుతారు. ఎందుకంటే వారికి జైలుకి వెళ్ళటమనే అంశమే మహా గొప్పదిగా అనిపిస్తుంది.జైలులో లభించే తీరుబాటుతో వెలువడిన రచనలే అందుబాటులో వుండే సాక్ష్యంగా కనిపిస్తుంటుంది… దివికుమార్

  2. divikumar

    ఈ నవలపై సమీక్షను నేను నవీన్ గారి పై వెలువడిన సావనీర్లో (2008 కావచ్చు)రాశాను. కొంత ఎడిట్ చేసి ప్రచురించారు — దివికుమార్

  3. thayamma karuna

    చాలా బాగా రాశారు ప్రభాకర్ గారు. ఈ వ్యాసం చదివితే ‘చీకటి రోజులు’ను చదివినట్టే. అంత వివరంగానూ, అంత సునిశితంగానూ, విశ్లేషణాత్మాకఓగా రాశారు.

Leave a Reply