గూడ అంజయ్య యాదిలో
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
‘అమ్మ నుడి’ జూలై2016 సంచికలో మొదటిసారి ప్రచురితమైన ఈ వ్యాసాన్ని పుస్తకం.నెట్లో వేసుకునేందుకు అనుమతించినందుకు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు)
***************
ఊరూ వాడా ఏకం చేసిన ప్రజాకవి
[గూడ అంజయ్య (నవంబర్ 1,1954 – జూన్ 21, 2016) యాదిలో]
‘సుకవి జీవించె (చు) ప్రజల నాలుకలయందు’ అన్న మహాకవి జాషువా వాక్యం ప్రజా వాగ్గేయ కారుడు గూడ అంజయ్య విషయంలో అక్షరాలా నిజం.
‘ఊరు మనదిరా – ఈ వాడ మనదిరా
పల్లె మనదిరా – ప్రతి పనికి మనమురా
సుత్తె మనది – కత్తి మనది
పలుగు మనది – పార మనది
బండీ మనదిరా – బండెడ్లు మనవిరా
నడుమ దొర ఏందిరో – వాని దోపిడేందిరో’
నలభై యేళ్ళుగా తెలుగు నేలనే కాదు దేశవిదేశాల్లో పదహారు భాషల్లో వూళ్ళనీ వాడల్నీ సబ్బండ వర్ణాల ప్రజానీకాన్నీ వుర్రూతలూగించిన/వూగిస్తున్న యీ పాటని కయి గట్టింది గూడ అంజయ్య అని తొలిరోజుల్లో చాలా మందికి తెలియదు. ఆ రోజుల్లో జనం పాటలన్నీ సామూహిక కర్తృత్వంలోనే ప్రచారం అయ్యేవి. అరుణోదయ జననాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజా కళామండలి పార్టీల/గ్రూపుల తేడాల్లేకుండా గొంతులో గాన ధుని వున్న కళాకారులంతా యీ పాటని పుక్కిట బట్టి గుడిసె గుడిసెకూ చేరవేశారు (అందులో గద్దర్ పాత్ర గణనీయమైనది). దోపిడీకి గురైన అభాగ్యులంతా – పీడనకి లోనైనా అనాథులంతా పాటని గుండెకు హత్తుకున్నారు. పలుకు వచ్చిన పసి పిల్లల దగ్గర్నుంచి మూడుకాళ్ల ముసలవ్వ వరకూ ‘దొర పీకుడేందిరో’ అని పల్లెల్లో దొరతనాన్ని ధిక్కరించారు. దిక్కులు పిక్కటిల్లాయి. గడీల గోడలు బీటలు వారాయి. దొరలు పట్టణాలకూ నగరాలకూ తోకముడిచారు.
అలా వొక్క పాట ఊరినీ వాడనీ కలిపింది. దళిత బహుజన ఐక్యతకి కారణమై దాని అక్కరని తెలిపింది. అంతేకాదు; ఊరూ వాడలనుంచి దొరని వేరుచేసింది. ఉత్పత్తికీ ఉత్పత్తి కారుడికి ఉత్పత్తి సాధనాలకీ “నడుమ” దొర పెత్తనాన్ని ప్రశ్నించింది. కత్తీ సుత్తీ పలుగూ పారా బండీ బండెడ్లూ అరక సారె … వుత్పత్తి సాధనాలన్నీ సమస్త సంపదనీ సృష్టించే శ్రమజీవుల అదుపులో వుండాలని నిర్దేశించింది. విలాసంగా గట్టుమీద నించొని ఆలినుంచి అమ్మదాక విచక్షణ లేకుండా తిడుతూ కొడుతూ యే శ్రమా చేయని విరామ వర్గాల దొరల దొరతనాల ప్రమేయాన్ని ఖండించింది. రైతాంగంలో రైతుకూలీల్లో వర్గ స్పృహని రగిల్చింది. అంతిమంగా శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని ప్రబోధించింది. పని – పనిముట్లు అందించే ఫలితం పనిచేసేవాడికే చెందాలని ప్రకటించే ఖరారు నామా యీ పాట. అది పీడిత ప్రజల హక్కుల పత్రం. దొరల సామాజిక ఆర్ధిక ఆధిపత్యాన్ని కూలదోస్తూ వూరి రచ్చబండ మీద వేసిన వొక శిలాశాసనం – వొక మాగ్నా కార్టా . గూడ అంజయ్య అనే ప్రజా మహా వాగ్గేయకారుడి నోట బుట్టి వూరూ వాడల్లో రేగిన సుడిగాలి దుమారం . ఊడలు దన్ని పాతుకు పోయిన భూస్వామ్య విలువల్ని వేర్లతో సహా కుళ్ళగించిన పెను ప్రభంజనం. బలహీనులపై బలవంతుల దాష్టీకం యింకానా యికపై చెల్లదు అని నినదించిన సామూహిక స్వరం. మట్టి కాడ వెట్టి కాడ కంచె కాడ మంచె కాడ చేని కాడ చెలక కాడ ప్రతి పనిలో చెమట చిందించిన వాళ్ళకే యీ రాజ్యం దక్కాలని శాసించిన అలిఖిత చట్టం యీ పాట. ఇంత గొప్ప ఆర్థిక సామాజిక రాజకీయ తత్త్వ శాస్త్ర సారాన్ని ప్రజలనోళ్ళలో నానే అలతి అలతి పదాల్లో చొప్పించడంలోనే కవి అసామాన్యమైన ప్రతిభ దాగుంది.
ఈ పాట కయి గట్టే నాటికి అంజన్నకి మూతి మీద మీసం కూడా మొలవలేదేమో! ఇరవైయేళ్ళు కూడా నిండని యుక్త వయసులోనే యింటర్ మీడియట్ చదువుకొనే రోజుల్లోనే పాటని ఆయుధం చేసే కళ అతనికి యెలా అబ్బింది అన్న ప్రశ్న వేసుకొంటే వొకటే సమాధానం.పనిపాటలకి సజీవ సంబంధం వున్న దళిత సామాజిక నేపథ్యం నుంచి, అనునిత్యం జీవించడమే ఘర్షణయిన తండ్లాట నుంచి, పోరాటాల పురిటిగడ్డ తెలంగాణా పొత్తిళ్ళ నుంచి , సాహిత్యానికి జీవధాతువులందించే మట్టిపొరల్ని తొల్చుకొని అతనొచ్చాడు. అందుకే అతని పాటల్లోని భాష తెలుగుదనంతో పరిమళిస్తుంది (కాగడా వేసుకు వెతికినా వొక్క సంస్కృతం ముక్క దొరకదు). పాట గతిలో నడకలో పల్లె పదం గజ్జె కట్టి ఆడుతుంది. లక్ష్యంలో ప్రజా వుద్యమ భావజాలం భాస్వరమై మండుతుంది.
గూడ అంజయ్యే కాదు శివసాగర్ దగ్గర్నుంచీ గద్దర్ – అందెశ్రీ – గోరటి వెంకన్న – జయరాజ్ … వరకూ యెందరో ప్రజా కవులూ కళాకారులూ దళిత కుటుంబాల నుంచే రావడం ప్రజల వేదనకూ తిరుగుబాటుకూ సామూహిక స్వరం కావడం యీ నేలమీద అనివార్యమైన చారిత్రిక ఘటనలో భాగంగానే జరిగింది. ఆ చరిత్రలో అంజన్నది పురోగామి (vanguard) పాత్ర. అందుకే అతను ఆ యా సందర్భాల్లో తెలంగాణా నేలమీద పురుడుపోసుకొన్న ప్రగతిశీల – విప్లవ – దళిత – ప్రత్యేక రాష్ట్రోద్యమాల్లో చారిత్రిక కర్తవ్యం నిర్వహించిన సాంస్కృతిక సంస్థల నిర్మాణాల్లో ప్రధాన భూమికను నిర్వహించాడు. నవోదయ, అరుణోదయ, దళిత రచయితల కళాకారుల మేధావుల వేదిక, తెలంగాణా ధూంధాం ల వ్యవస్థాపకుల్లో వొకడై యాభై సంవత్సరాల పాటు పాటై, నినాదమై, సమస్త ఆధిపత్యాలపై నిరసన స్వరమై జ్వలించాడు. ఎమర్జెన్సీ లో జైలు కెళ్ళాడు.
‘కొండలు పగలేసినం’ పాటలో చెరబండరాజు ‘శ్రమ ఎవడిదిరో – సిరి ఎవడిదిరో’ అని ప్రశ్నించి అంతిమంగా ‘చావునీదిరో – గెలుపు మాదిరో’ అని తీర్మానించినట్టే గూడ అంజయ్య కూడా తొలినాళ్ళలో కట్టిన పాటలోనే
‘అసలేటి వానల్లొ
ముసలెడ్లు గట్టుకొని
మోకాటి బురదలో
మడిగట్టు దున్నితె
గరిసె లెవరివి నిండెరా – గంగన్న
గుమ్ము లెవరివి నిండెరా – గంగన్న’
అని ప్రశ్నించాడు. ‘ఊరిడిసి నే బోదునా అయ్యొ – ఉరిబోసుకుని సత్తునా ?’ పాటలో అప్పిచ్చి వెట్టి చాకిరీ చేయించుకొనే దొర పీడన భరించలేని రైతన్న ఆక్రోశం కంట నీరు పెట్టిస్తుంది. కానీ అది విషాద గీతం కాదు; పాట పూర్తయ్యే సరికి ‘ఊరిడిసి నే బోనులె – దొర తోడి పోరాడి సాధిత్తులే’ అని మట్టి సాక్షిగా చేసే బతుకుపోరు పాటగా పరిణమిస్తుంది (ఈ పాట రాసేనాటికి తన వయస్సు పదహారేళ్ళు అనీ – తొలిసారి దాన్ని చెరబండరాజు సమక్షంలోనే పాడటం దాన్ని అతను మెచ్చుకోవడం మరచిపోలేని అనుభవమనీ అంజన్నచాలా సందర్భాల్లో ప్రస్తావించాడు).
ఈ తొలిపాట దగ్గర్నుంచీ మలి దశ తెలంగాణా వుద్యమ గీతాల వరకూ ప్రశ్న తర్కం శోధన చైతన్యం తిరుగుబాటు మార్పు అనే గతితార్కికమైన తాత్త్వికత అంజయ్య రచనల్లో కనిపిస్తుంది. ‘లచ్చులో – లచ్చన్నా! ఈ లుచ్చాగాల్ల రాజ్జెంలొ బిచ్చగాల్ల బతుకులాయె’ అన్న తిట్టులా తోచే క్రుద్ధ స్వరంలో కూడా రాజ్య స్వభావాన్నిసైద్ధాంతికంగా అధిక్షేపించే రాజకీయ ప్రకటనే వినిపిస్తుంది.
‘విప్లవం నాకు ఆదర్శం కాదు అవసరం’ అని వుద్ఘోషించిన అంజన్న విప్లవోద్యమంలో కుల సమస్య గురించి మాట్లాడాడు. దళితోద్యమానికి విప్లవ చైతన్యాన్ని జోడించాడు. అంబేడ్కరిజం వెలుగులో వర్గంలో వున్న కులాన్ని, కులంలో వున్న వర్గాన్నీ చూడగలిగాడు. అంబేద్కర్ మీద బుర్రకథ రూపొందించాడు. కుల ప్రాంత అస్తిత్వ చైతన్యం లోంచి విప్లవ చైతన్యం పెంచాలనుకొన్నాడు. వాగ్గేయకారులు చాలామంది పాటలకి పరిమితమైతే అంజయ్య దళితోద్యమంలో తనను తాను మరింత విస్తృత పరచుకొన్నాడు. వచన సాహిత్యంలో కూడా తనదైన సత్తా చూపించాడు. దళిత అస్తిత్వ స్పృహతో కథలు (దళిత కథలు), నవల (పొలిమేర) రాశాడు. వాటికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారాలు పొందాడు. ఫార్మసిస్టుగా యెన్నో రోగాలకు మందులు అందించాడు. సామాజిక శాస్త్ర వేత్తగా సాహిత్య వైద్యం చేశాడు.
రంగుల కల సినిమాలో ‘భద్రం కొడుకో’ పాట కూడా గద్దరే పాడాడు. శ్రీ శ్రీ కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటని చెవిని పెట్టక బయల్దేరిన బాటసారి కష్టం గురించి రాస్తే అంజన్న పల్లె నుంచి పొట్టచేత బట్టుకొని నగరానికి వలస వచ్చి రిక్షా తొక్కే కష్టజీవి కొడుక్కు ‘భద్రం కొడుకా పైలం కొడుకా’ అని చెప్పే తల్లి మాటల్నే పాటగా కట్టాడు. గద్దర్ గొంతులో ఊరు మనదిరా పాట వురుములా గర్జనలు పొతే భద్రం కొడుకో పాట ఆర్ద్రంగా అమ్మ లాలింపులా వొళ్ళంతా పుణుకుతుంది. పాట యెత్తుకోవడంలోనే తెలంగాణ నుడికారం కట్టి పడేస్తుంది. ‘రిక్షా యెక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపుడు కాడ భద్రం కొడుకో జర పైలం కొడుకో’ అన్న అమ్మ పేగు భాషని ఆర్తితో పలికిస్తూనే బడుగుజీవుల శ్రమని దోచుకోడానికి పల్లెకీ పట్నానికీ తేడా వుండదని హెచ్చరిస్తాడు. పల్లెలో దొరల బాధలు పడలేక పట్నమొస్తే పట్నంలో ‘పెద్దపెద్ద బంగ్లలల్ల పెద్దా పెంజరలుండు నల్లా బాజారు నిండ నల్లా నాగులుండు నలుగురు గూడిన కాడ నరలోకపు యముడుండు’ అని మొత్తం దోపిడీ వ్యవస్థ వెయ్యికాళ్ల జెర్రిలా యెలా వ్యాపించి వుందో కళ్ళకు కట్టించాడు అంజన్న. శ్రీ శ్రీ ‘బాటసారి’ కవితనీ అంజయ్య ‘భద్రం కొడుకో కొమురన్న’ పాటనీ పక్క పక్కన పెట్టి చూసినపుడు అంజన్న పాటలోని బలమేంటో బోధపడుతుంది. వూరుగాని వూరిలో పల్లెగాని పల్లెలో కొత్త పరిసరాల్లో వలస కార్మికులకు సాంఘిక భద్రత కల్పించాల్సిన పాలకుల బాధ్యతని గుర్తు చేస్తూ సామాజిక రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది. పల్లె విడిచి కొత్తగా పట్నానికి వచ్చిన ప్రతి శ్రామికుడూ ఆ పాటలో తనను చూసుకొన్నాడు. ఆ పాటలోని తొలిపదం (భద్రం కొడుకో) తో మరో సినిమా వచ్చింది.
సినిమాలకు తన పాటలనిచ్చినా సంపద పోగేసుకోలేదు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ వంటి పాటలు సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టించినా అక్కడి తళుకులూ బెళుకులూ అతణ్ణి ఆకర్షించలేదు. నిరాడంబర స్వభావంలో మార్పు తేలేదు. హంగులూ, ఆర్భాటాలకు ఆమడ దూరం వున్నాడు. నిజానికి వూరు మనది పాట పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమా నిర్మాతలు చౌర్యం చేసినప్పుడు ఇండస్ట్రీని యేలుతున్న దొరతనాన్ని యెదిరించడంలోనే అంజయ్య బాహాటమయ్యాడు. సినీ పరిశ్రమ పెద్దల కి అతని బలమేంటో తెలిసొచ్చింది. ఆర్ నారాయణ మూర్తి ఆ బలాన్నితన చిత్రాల్లో గొప్పగా ఆవిష్కరించాడు. ‘నా కొడుకో బంగారు తండ్రి నిన్ను కలకటేరు అనుకొంటిరో’ వంటి పాటలు గుండెల్ని పిండేస్తే , ‘తెలంగాణ గట్టు మీద సందమామయ్యో … ఎర్ర మల్లెలు పూసెనంట సందమామయ్యో’ లాంటి పాటలు వుత్సాహాన్ని నింపి గుండె ధైర్యాన్నిచ్చాయి.
అంజన్న సాహిత్య జీవితంలో మూడు దశలున్నాయి. మొదటి దశలో తన పాటని సాయుధం చేసి విప్లవోద్యమానికి అంకితమిచ్చాడు. రెండో దశలో దళిత రాజకీయాలతో మమేకమయ్యాడు. మూడో దశలో తెలంగాణా రాష్ట్ర సాధనలో భాగమయ్యాడు. కవిగా గాయకుడిగా రచయితగా యే దశలోనూ ప్రజా సంబంధాలు కోల్పోలేదు. పాటని జీవితం నుంచీ విడదీసి చూడలేదు. ఎవరి ముందూ తల వంచలేదు. స్వీయ ప్రయోజనాలకోసం పాకులాడలేదు. అధికారానికి దాసోహం అనకుండా ప్రజల పక్షం వహించాడు. ప్రజలనుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకే అంకితం చేశాడు. పెయి మీద అంగీ కాళ్ళకి చెప్పులు లేని బడుగు జీవుల అనుభవాలు గుండె గోస బాస యాస కష్టాలూ కన్నీళ్ళే తన పాటకి ప్రాణం పోశాయని ప్రజలే తనకు గురువులై పాటని మహాకావ్యంగా శిఖరంపై నిలిపారని అంజన్న చెప్పుకోనేవాడు. ప్రజల పట్ల వారి సంస్కృతి పట్ల భాష పట్ల రాజకీయాల పట్ల అతనికున్న ఆ వినమ్రత కారణంగానే అతను ‘పాట కవుల వేదిక’ అయ్యాడు. మలి దశ తెలంగాణా వుద్యమంలో తొలిపొద్దయ్యాడు అయ్యాడు.
అంజయ్య పాట లేకుండా తెలంగాణా రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. ధూం ధాం లలో అంజన్న పాట పోరు హోరయ్యింది. ‘నా తెలంగాణ – నిలువెల్ల గాయాల వీణ , నను గన్న నా తల్లి – నా తెలంగాణ’ పాట తెలంగాణా ప్రజల దు:ఖాన్ని ఆర్తినీ ఆవిష్కరిస్తే , ‘పుడితొక్కటి – సత్తె రెండు రాజిగ ఒరె రాజిగ , ఎత్తూర తెలంగాణ జెండ రాజిగ ఒరె రాజిగ’ పాట వుద్యమ చైతన్యాన్ని నింపింది. ‘అయ్యోనివా – అమ్మోనివా’ సమైక్య వాదం లోని అశాస్త్రీయతనీ తాత్త్విక గందరగోళాన్నీ బోలుతనాన్నీ యెండగట్టింది. తెలంగాణా రాష్ట్ర సాధనలో తన పాటని ఆయుధంగా అందించిన అంజన్నయాభై యేళ్ళ తెలంగాణా కల సాకారం కావడడం కళ్ళారా చూసుకోగలిగాడు. ప్రజా తెలంగాణ విషయంలో మారోజు వీరన్న బెల్లి లలితల వారసత్వం అతనిది.
తెలంగాణా టూ తెలంగాణా వయా నగ్జల్బరి ప్రస్థానంలో విస్ఫులింగాలు కురిసిన అంజన్న పాటలు కోస్తాలో కూడా విస్తృతప్రచారం పొందాయి. కాకినాడ లో జోరువానని సైతం లెక్కజేయక ప్రజలు దొర ఏందిరో ఆని దోపిడేందిరో అని అంజన్నతో గొంతు కలిపారు. కాకినాడ నుంచి తిరుగు ప్రయాణంలోనే పాటగాణ్ణి పోలీసులు వేటాడి అరెస్టు చేశారు. జైల్లో వున్న సంవత్సరంపాటు రాసిన పాటల్లో శ్రీపాద శ్రీహరి మీద ‘లక్షలాది చుక్కల్లో ఏ చుక్కల్లో ఉన్నావో’ అంటూ రాసిన స్మృతిగీతం చాలా ప్రచారం పొందింది.
పక్షవాతం వచ్చి మంచానబడ్డ చివరి రోజుల్లో సైతం యెడమ చేత్తో పలకమీద ప్రజల పాట రాయడానికి తపించాడని అతని భార్య హేమగారు చెప్పిన మాటలు అంజన్న చివరివరకూ శ్వాసించి ఆచరించిన నిబద్ధతకి నిలువెత్తు సాక్ష్యాలు. ఎడమ పిడికిలి బిగించే విశ్వవిద్యాలయాల వెలివాడలో వర్ణ వివక్షకి బలైన రోహిత్ వేములకి జై భీములు చెప్పాడు. రచయిత రాజీ పడటమంటే ఆత్మని అమ్ముకోవడమే అని జీవితాంతం విశ్వసించి ఆచరించిన అంజన్న తెలంగాణా సొంత రాష్ట్రంలో దొరల గడీలు గులాబీ రంగేసుకోవడాన్ని ప్రశ్నించాడు. ప్రజాస్వామ్యం ముసుగేసుకొన్న పాలకుల దొరతనపు పోకడల్ని అసహ్యించుకొని సామాజిక తెలంగాణా రాలేదని బాధపడ్డాడు.
కొత్త రాష్ట్రం యేర్పడి రెండేళ్ళయినా స్వపరిపాలనలో సైతం ప్రజా సమస్యలు యెందుకు పరిష్కారం కావడం లేదు – ‘సేను వాయె – సెలుక వాయె , బతుకు వాయె – మెతుకు వాయె , గొడ్డు వాయె – గోద వాయె , వలస బోయి బతుకుడాయె’ అని తాను యేళ్ళ తరబడి పాడిన పాతపరిస్థితులే ఎందుకున్నాయి అని పాలకుల్ని ప్రత్యక్షంగా కలిసి నిలదీయాలనుకొన్నాడు. అయితే రాజ్యాన్నేలే దొరని చూడటం ఆయన చివరి కోరిక అని కొందరు అపార్థం చేసుకున్నారు.
ఊరున్నంత కాలం వాడ వున్నంత కాలం ఊరూ వాడల్ని విడదీసే దొరలూ దొరతనాలూ వున్నంతకాలం అంజన్న పాటకి ప్రాసంగికత వుంటుంది. పాటతో దొరతనాల పీఠాలు కుదిపినందుకే యేలిన వారికి ప్రజా వాగ్గేయ కారుడి మరణం అల్పవిషయంగా తోచింది. చివరి చూపులక్కూడా దొర రాకపోవడమే అంజన్న విజయం. అదే అతని గౌరవాన్ని ఇనుమడింపజేసింది. ఎత్తిన తల దించకుండా పోయేలా చేసింది. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా అతను చేసిన పోరాటాలని పదికాలాల పాటు గుర్తుంచుకొనేలా చేసింది. కుల మత వర్గ ఆధిపత్యాలను తొలగించే నూతన ప్రజాస్వామిక విప్లవంలో కొనసాగడమే అంజన్న ద్వారా మనం పొందాల్సిన స్ఫూర్తి. అమరుడు యుగకవి గూడ అంజయ్యకి లాల్ నీల్ సలాం.
ఎ కె ప్రభాకర్
Thank you Raja for your valuable response
G K S RAJA
‘గూడ అంజయ్య యాదిలో’ వ్యాసం తెలంగాణ పోరాటపటిమనూ, పాట పవరునూ, మరవలేని యాది యాతనను తొలిచింది. దొర యేందిరో .. ఆడి దోపిడేందిరో అని ఎప్పటికప్పుడు, ఇప్పటికీ ఎలుగెత్తాల్సిన అగత్యాన్ని అంజన్న ఆవేదన రూపంలోనే ప్రభాకర్ గారు వెలిబుచ్చిన పద్ధతి నిజమైన నివాళిగా ఉంది. దొరల గడీలకు గులాబీ రంగు పులువుకోవడం, అధికార దొరలు అంజన్న ఆఖరి చూపులకూ దిగి రాకపోవడం… లాంటి పోకడలు, అంజన్న పాటల్ని ఇప్పుడూ గుండెల్నిండా పీల్చుకుని, గొంతెత్తాల్సిన వర్తమాన చారిత్రక అవసరాన్ని నొక్కి చెబుతోంది ‘అంజన్న యాది’. అంజన్నకు జోహార్లు.
రాజా.