రైతురాయ-గుత్తి జోళదరాశి చంద్రశేఖరరెడ్డి గారి కన్నడ రచన
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
**********
రైతే రాజు అన్నమాటను అక్షరాలా నిరూపించే చిన్న నవలికను సరళమైన పద్యాల రూపంలో అందరికీ అర్థమయ్యేలా రచించారు గుత్తి జోళదరాశి చంద్రశేఖరరెడ్డి గారు. ప్రముఖ అనువాదకులు, రచయిత, కవి అయిన చంద్రశేఖర రెడ్డి గారు పాఠకలోకానికి సుపరిచితులే. వారు ఇదివరలో వ్రాసిన రైతురాయలు అన్న పద్యకావ్యానికి ఈ ఏడు కన్నడ అనువాదం ‘రైతురాయ’ వెలువడింది.
స్వయంగా వారే అనువదించిన ఈ రచనను కన్నడ విశ్వవిద్యాలయ ప్రాధ్యాపకులే ‘ఇది అనువాదం కాదని కన్నడ లో స్వతంత్ర రచన’ అని ముందుమాటలో పేర్కొని ప్రశంసించడం అన్ని విధాలా సరైనదే. కన్నడ పద్యరచన చదివి అర్థం చేసుకోగలనో లేనో ననే సంశయంతో పఠనం మొదలుపెట్టినా ఈ ‘రైతురాయ’ ఖండకావ్యం పాయసం తాగినంత ఇంపుగాను, సరళం గానూ సాగిపోయింది.
కథా నాయకుడు కదిరెప్ప ఊరి బాగు కోసం చెప్పిన గ్రామదేవత మాట చెల్లించడానికి చెరువు తవ్వడానికి పూనుకుంటాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల అతనికి తన భార్య చెంగమ్మ తప్ప తోడుగా ఎవరూ రాలేదు. చివరివరకూ అతను పట్టుదల వదలకుండా ఎలా శ్రమించాడు, అందువల్ల గ్రామానికే కాక రాజ్యానికే లాభం ఎలా కలిగిందనే కథ నూటముప్ఫై అందమైన పద్యాలలో కవి చక్కగా చెప్తారు.
ఎండను తిట్టుకోక, వలచే హృదయం గల మగని తలచుకుంటూ పొలానికి బువ్వ తెచ్చిన కోమల హృదయిని చెంగమ్మను , పాలకడలిలో అమృతభాండం చేతబట్టి వచ్చిన మోహిని లా మగడు భావించడం వారి మధ్యన ఉన్న మమతకు అద్దం పట్టడమే.
గ్రామజీవనానికి కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ పద్యంలోని అనువాదసరళత గమనించండి.
కాడి తప్పిసి పశుగళ కట్టు బిచ్చి
మేయలొందిష్టు సొప్పిన మెదెయ హాకి
తలె రుమాలలి బెవరను సలెయొరెసుత
మడది బళి బంద కదిరెప్ప తడెయదిన్ను.
దీనికి తెలుగు మూలం-
కాడి తప్పించి ఎద్దుల కట్లు విప్పి
మేయగ రవంత ఎండిన మెద విదిల్చి
తలరుమాలుతో చెమ్మట తడిని యొత్తి
పడతి చెంతకు కాల్దీసె తడవు లేక.
రైతు కదిరెప్ప ఏమి తిన్నాడో ఏమి పెట్టాడో ఒక్కసారి చూద్దామా.
నవణెయన్నద జొతెగె హుణసియ చిగురు
స్వల్ప గురుగెలె బెరెసిద పల్యవిహుదు
కడెగె మజ్జిగెయలుణస తొక్కన్ను కలిసి
కుడియబహుదిదు ఇష్టవే నుడియరణ్ణ.
దీనికి తెలుగు మూలం-
కొర్రబువ్వుండె మాకడ కొలదిగాను
చింత చిగురేసి గురగు రవంత కలిపి
వండినది కూరయు గలదు భవ్యులార!
తినుటకిచ్చగింతురొ లేదొ తెలుపరయ్య!
కథలో భాగంగా నాయకునికి అష్టదిగ్గజకవులిరుగో అని మాత్రం చూపించడం తెలుగు మూలంలో జరిగితే, కన్నడీకులకు మాత్రం పేరుపేరునా వారి శక్తిసామర్థ్యాలతో సహా పరిచయం చేయడం కవి లోకజ్ఞతను దర్శింపచేస్తుంది.
అమ్మవారిని ఆడబిడ్డగా భావించి ముద్దు చెల్లించడం ద్వారా ఆడబిడ్డను అమ్మవారితో సమానంగా చూసే ఆనాటి గొప్ప సంస్కృతిని చెప్పకుండానే చెప్తుందీ రచన. దారిని వెళ్ళే బాటసారులకు తమకున్నదాంట్లో ఏ లోటూ చేయకుండా కడుపు నింపే సీమ ఔన్నత్యాన్ని సహజంగా చూపిస్తుందీ రచన. సాహిత్య, సమర ప్రాంగణాల్లోనే కాక జనజీవన ఆవశ్యకతలను అర్థం చేసుకోవడంలో ప్రతిభ చూపి, ప్రజల మనసుల్లో బంగారు సింహాసనం మీద పట్టాభిషేకం చేయించుకున్న రాయల ఔదార్యాన్ని పరిచయం చేస్తుందీ రచన.
ఎక్కడో సభల్లో కూర్చొనిన పెద్దవాళ్ళు చట్టాలు చేసి పాలన సాగించాలనుకుంటారు. చట్టం తయారీలో క్షేత్రస్థాయిలో సామాన్యమానవుల అనుభవాలను, ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకూ అవసరం అవుతుంది అన్న మౌలికమైన విషయం ఇందులోని కథా వస్తువు. కవి అందమైన కల్పన అయిన ఈ రచనలో స్థానికంగా ఉన్న నమ్మకాలను చక్కగా కథ ముందుకు తీసుకొని వెళ్ళడానికి వాడుకున్నారు. గ్రామగ్రామాల్లో చెరువులు త్రవ్వించి, గుడిలన్నిటినీ పోషించి జనసామాన్యానికీ ఆరాధ్యుడైన శ్రీకృష్ణదేవరాయల నాటిది కథాకాలం. తేలికగా అర్థమయ్యే ఆటవెలదులు, సీసములు, కందములు మొదలైనవాటిలో అత్యధికంగా సాగిన ఈ కథారూపం చదివినవారినెవ్వరినీ ఆకట్టుకోకుండా ఉండదు. కథానాయకుని పట్టుదల, దీక్ష లకు అతను పెరిగిన నేపథ్యం, గ్రామస్తుల ప్రవర్తనలో వారి జీవన పరిస్థితులు, రాయల వారి వ్యక్తిత్వపు మెరుపులలో ఉన్న వాస్తవాలు వీటన్నిటిలో ఉన్న సహజత్వం కథాశిల్పానికి మెరుగులు దిద్దింది.
చెరువు చెలువమును, సభలో రాయల రాజసమును వర్ణించిన తీరు చాలా బాగుంది.
ముందుగా కన్నడ ప్రతి చదివి ఆనందించిన నాకు చింతా రామకృష్ణారావు గారి ఆంధ్రామృతం బ్లాగులో తెలుగుప్రతి కూడా లభించగా ఇమ్మడి సంబరం కలిగింది. ఈ కన్నడ ప్రతిలో చివర చంద్రశేఖరరెడ్డి గారు వచనంలో రచించిన శ్రీకృష్ణదేవరాయల జీవనయాన సంక్షిప్త చరిత్ర (ఇరవై పేజీలు) అదనపు ఆకర్షణ. రాయల వారి జీవితంలోని ముఖ్యఘట్టాలన్నిటినీ స్పృశిస్తూ సాగిన ఈ రచన చదివిన వారికి సంతృప్తినిస్తుంది.
వెల – 60 రూ.
ప్రతులకు –
శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి
మియాపుర్, హైదరాబాదు.
పోన్ నెం. 9177945559
Leave a Reply