వ్యాసం రాసిపంపిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు గారు
"అంత ఎత్తు మనిషి! సరస్వతి నవ్వులా ఉన్నాడు. శంకరుని సిగపువ్వులా ఉన్నాడు.
నవ్వుతుంటే నలకూబరునిలా ఉన్నాడు. నడుస్తూంటే నల చక్రవర్తి."
ఎవరతడు? తెలియలేదా! సరే యిది చదవండి,
"కమ్మని గొంతుతో అర్థ ప్రాధాన్యతగా రాగయుక్తంగా చదువుతున్నాడు...
అందరూ అతని సీసంలో పడి ఆ మాధుర్యానికి మైమరుస్తున్నారు. మంత్రి
రాయని భాస్కరుడు వచ్చి, 'పిన్నవాడవైనా నిన్ను విన్నవాడెవడి చేతనైనా
జై కొట్టించుకున్నవాడవయా' అంటూ కౌగిలించుకున్నాడు. ఆ మహాదాత
అతనికి తన చేతి కంకణం తొడిగాడు."
కంకణం తొడిగించుకున్న ఆ కవి ఎవరు?
"ఈ కుర్రవానిలో - వయో సహజాలైన ఆవేశం, సౌందర్య స్పృహ,
కామాతురత మొదలైన ఉద్రేకాలన్నింటినీ త్రోసిరాజనగల - ఓ విశుద్ధ
విజయలక్ష్యముంది. వయో సహజాలూ, మధుర శృంగారానుభూతులూ
కేవలమూ సాధనాలై - ఆ లక్ష్యసాధనకు ఉపకరణాలుగా మిగిలిపోనున్నాయా?
జీవిత సహజానుభూతులూ, అనుభవాలూ మెట్లు చేసుకుని కల్పిత విజయభావనా పాషాణ సీమకు
ప్రయాణం చేస్తున్నాడా? విజయమొక్కటే సమస్త జీవితానికీ అర్థం కాదని గ్రహించినపుడు - ఊహ
వాస్తవానుభూతులనుంచి తనను వంచించిందని గ్రహించినపుడు - ఏమయిపోతాడు"
ఒక వేశ్య ఏ కుర్రవాడి గురించి యిలా ఆలోచించింది?
"అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షా దానము సేయరా సుకవి రాడ్బృందారక శ్రేణికిన్
దక్షారామపురీ విహార వర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు దద్వాసనల్"
అని తెలుగు రాయని కస్తూరి అడిగింది ఎవరు?
"వారు అఖండ ప్రతిభా సంపన్నులు. ఆరుబయట మంచం వేసుకుని పడుకుని ఆకాశంలోకి చూస్తే
చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు కళ్ళముందు కదలాడతాయి. నలదమయంతుల శృంగారంలో
కూడా శివుడిని దర్శించగలిగిన ఆయన భక్తి తత్పరతకు ఒళ్ళు జలదరిస్తుంది. పాడుతూంటే ఒకలాగా,
మననం చేసుకుంటే మరొకలాగా అనుభూతిగా దృశ్యంగా మారుతుందా పద్యం. శబ్దం అర్థమై, అర్థం
శబ్దమై దృశ్య సాక్షాత్కారానికి పరస్పర దోహదకారులవుతాయి ఆయన పద్యంలో!"
ఎవరీయన? కవా? పండితుడా? శృంగార పురుషుడా? పరమ భక్తుడా?
"ఫుల్ల సరోజనేత్ర అల పూతన చన్నుల చేదు ద్రావినా
నల్ల దవాగ్ని మ్రింగితినటంచును నిక్కెదవేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో
మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము నీ పస గానవచ్చెడిన్"
అని ఆ కృష్ణుడినే నిలదీసిన చాటు కవి ఎవరు?
"పంపా విరూపాక్ష బహు జటాజూటికా
రగ్వధ ప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీఘటా
గంభీర ఘమ ఘమారంభములకు
కళసాపురప్రాంత కదళీ వనాంతర
ద్రాక్షలతా ఫల స్తబకములకు
కర్ణాట కామినీ కర్ణహాటక రత్న
తాటంకయుగ ధాళధళ్యములకు
నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత
తెలుగునను సంస్కృతంబున బలుక నేర్తు
ప్రౌఢ దేవేంద్రరాయ భూపాలవరుని
సమ్ముఖంబున దయజూడు ముమ్మ సుకవి"
యీ పద్య ధారాధుని ఎవరిది?
ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది తెలుగుదనం మూర్తీభవించిన కవిసార్వభౌముడు శ్రీనాథుని గురించని
ఈ పాటికే మీరు పోల్చుకుని ఉండకపోతే, అది మీ తప్పు కాదు. తెలుగుకి పట్టిన దౌర్భాగ్యం.
" 'వెర్రివాడా! నువ్వు కవీశ్వరుడివా, మునీశ్వరుడివా, మహేశ్వరుడి అంశవా అన్నది వ్యర్థ చర్చ.
ఈ భూమి మీద ఉన్నంత కాలమూ మనిషివి. ఇక్కడ సుగంధపరిమళం నిన్నలరిస్తే దుర్గంధం
బాధిస్తుంది. ఇక్కడ కురిసే వానా, వీచే చలిగాలీ, వినీల విహాయసం, విశాల సముద్రం నువ్విక్కడ
ఉన్నంత కాలమూ నీ ఊపిరీ, చూపూ నిలిపినంత కాలమూ నీ హృదయం మీదా, శరీరం మీదా వాటి
వాటి ప్రభావాలు చూపిస్తూనే ఉంటాయి. సౌందర్యం, క్రౌర్యం, లాలసా నీ యిచ్ఛాయిచ్ఛలకు
లొంగకుండా నీ మీద పనిచేస్తాయి. జీవితసారళ్యత నిన్ను మైమరపిస్తే, జీవిత కాఠిన్యత నిన్ను గిచ్చి
మరీ మేలుకొలుపుతుంది. వీటన్నిటిలోనూ భాగమైన నీవు, ఏనాటికీ విడిగా ఉండలేకపోగా - ఆ
ప్రయత్నంలో నీకు నీవే అన్యాయం చేసుకుంటున్నావు. నువ్వు వద్దన్నా నిన్నీ లోకం వదలదన్న
సంగతి అర్థం కావడం లేదా?' అతని జీవునికి వ్యతిరేకమైన పునాది లేని వైరాగ్యానికి ఆ సంఘటన
హంసగీతి పాడుతోంది."
ఇది శ్రీనాథుని మనోగతమట! అతనికసలు వైరాగ్యం ఎందుకు వచ్చింది? ఏ సంఘటన దానికి
హంసగీతం పాడింది? ఈ ప్రశ్నలకు సమాధానం, వివిన మూర్తిగారి "హంసగీతం" నవలలో
దొరుకుతాయి.
చరిత్ర మీద ఆసక్తీ, శ్రీనాథునిపై రక్తీ, ఘాటైన ఆలోచనలని తట్టుకొనే శక్తీ మీకుంటే "హంసగీతం" నవల
మిమ్మల్ని కచ్చితంగా చదివిస్తుంది. శ్రీనాఠునితో పాటుగా అతని తాతగారు కమనాభుడు, అతని
స్నేహితుడు అవచి తిప్పయ్యశెట్టి, ప్రగ్గడయ్య, మామిడి సింగన మంత్రి ఇలా చాలామంది మనకి
పరిచయమవుతారు. అనవేమా రెడ్డి, కుమారగిరి రెడ్డి, కాటయ వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి
మొదలైన రెడ్డి రాజులు, వాళ్ళ మధ్య నడిచిన రాజకీయాలూ రేఖామాత్రంగా కనిపిస్తాయి. శ్రీనాథుని
చాటువులకి కారణాలైన సందర్భాలూ సంఘటనలూ ఊహాచిత్రాలుగా కనిపిస్తాయి. ఆనాటి సాంఘిక
పరిస్థితులపై యీ కాలపు రచయిత దృక్పథం చూచాయగా తెలుస్తుంది.
చారిత్రక నవలలో చరిత్ర మాత్రమే ఉండదు. రచయిత ఊహలు ఉంటాయి. చరిత్ర గురించి రచయిత
వ్యాఖ్యానం కూడా అంతో ఇంతో ఉంటుంది. ఇందులో కూడా అది ఉంది. దాన్ని స్వీకరించడం మానడం
పాఠకుల యిష్టం. ఊహలు మాత్రం మనోహరం! శ్రీనాథుని కావ్యాలద్వారా, అంతకన్నా ముఖ్యంగా
అతని చాటువుల ద్వారా మనకతని వ్యక్తిత్వం గురించి అనూచానంగా కొంత తెలుస్తూ ఉంది. ఒక
మహాపండితుడు, మహాకవి, శృంగార ప్రియుడు, శివభక్తుడు, రాజకీయ కార్యకలాపాలలో
సంబంధమున్నవాడు, అతిశయం ఉన్నవాడు, దేశ దిమ్మరి - ఇలా చాలా రకాలుగా శ్రీనాథుడు
కనిపిస్తాడు. శ్రీనాథుని యీ విభిన్న పార్శ్వాలని యీ నవలలో ఆవిష్కరించడానికి రచయిత
ప్రయత్నించారు. వాటికి సాంఘిక పరిస్థితులు, సంఘటనలూ హేతువులుగా చిత్రించే ప్రయత్నం
చేసారు. ఇలా చెయ్యడంలో ఒక ప్రమాదం ఉంది. చిత్రించే పాత్ర తనదంటూ స్వతస్సిద్ధమైన వ్యక్తిత్వం
లేని ఒక తోలుబొమ్మలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇందులోనూ కోంతవరకూ అలా
జరిగిందేమోనన్న అనుమానం పాఠకుడిగా నన్ను వేధించింది. శ్రీనాథుడు కేవలం పరిస్థితులకి
కీలుబొమ్మగా తన జీవితాన్ని గడిపాడా అన్న బాధ మనస్సులో కాస్తంత గుచ్చింది. శ్రీనాథుని
వీరాభిమానులు దీన్ని సహించకపోవచ్చు! నా అనుమానం తప్పనికూడా కొందరు అభిప్రాయపడవచ్చు.
సరిగ్గా దీనికి వ్యతిరిక్తంగా కనిపించాడు పోతన! అవును యీ నవలలో పోతన కూడా ఉన్నాడు.
అసలీ నవల పోతన గురించే అనిపించింది, పూర్తిగా చదివాక. నవల ప్రారంభంలో చివరనా కనిపించేది
పోతనే. శ్రీనాథుని గురించే అయితే "అరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి" అన్న పద్యంతో నవల
పూర్తైపోవాలి కదా. కాని అలా అవ్వదు. నవల పూర్తయ్యేది పోతన అస్తమయంతో. ఆంధ్రభాగవత
పరిరక్షణతో.
"మడిలో దిగి మేడి పట్టి నాగలితో భూమిని దున్ను! పాషాణం లాంటి భూమి వెన్నముద్దవుతుంది!
'ఒరే పోతనా! ఎందుకురా ఈ మంకుదనం... నన్ను వెంటాడి వేధించి చంపుతున్నావురా... సరే
సరే... వెళ్ళు. వెళ్ళి ఆ ఉట్టిలో వెన్న తీసుకోరా' అన్న మా అమ్మ గుర్తు వస్తుంది! క్రిష్ణయ్య
మంకుతనం కనిపిస్తుంది! ఉదయం నుంచి అలసిపోయిన శరీరం కటిక నేల మీద పడుకుంటుంది!
చల్లగాలి వచ్చి ఈ శరీరానికి సేవలు చేస్తుంది! ఆదమరపు పుడుతుంది! ఏదో కథా సందర్భంలోనో
చిక్కుకుని పదం విడక దృశ్య సాక్షాత్కారం కాక తన్నుకుంటున్న ఆత్మకు ముడి విడుతుంది! నా
నాగలిని నేను విడిచిపెడితే నా గ్రంథం నన్ను విడిచిపెడుతుంది! నా రామయ్య నన్ను విడిచిపెడతాడు."
అని నిశ్చయంగా చెప్పిన రైతుకవి పోతన. పోతన జీవితంలో సంఘర్షణ లేదా అంటే ఉంది.
కానీ దాన్ని అధిగమించిన స్థిర వ్యక్తిత్వం పోతనది. పరమ భాగవతుడైన పోతన "భోగినీ దండకం"
ఎందుకు రచించాడు? రామని భక్తుడు రామాయణం కాక భాగవతం ఎందుకు పలికాడు? రామభద్రుడు
నిజంగానే పోతనకి సాక్షాత్కరించాడా? సరస్వతీ దేవి పోతన ముందు నిలిచి కాటుక కంటినీరు
కార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? "అల్ల కర్ణాట కిరాటక కీచకుల కమ్మ త్రిశుద్ధిగ" అన్న అతని
మాటలకి రాజులు ఎలా స్పందించారు? భాగవతాన్ని ఎవరు ఎలా పరిరక్షించారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ
ఉదాత్తమైన ఊహలతో, కల్పనలతో తనదైన సమాధానాలు చెప్పారు రచయిత. అపూర్వమైన భోగిని
పాత్ర చిత్రణ గురించి ప్రస్తావించకుండా యీ నవల గురించిన పరిచయం అసంపూర్ణమవుతుంది. కాని
దాన్నిక్కడ వివరించేస్తే, స్వయంగా చదివేటప్పుడు పస చెడుతుంది. కాబట్టి చెప్పను.
సమాజంకోసం శ్రీనాథుడు మారితే, సమాజం పోతన కోసం మారింది అనిపించింది నాకు. ఆ యిద్దరి
జీవిత గాథలనీ అపురూపంగా పెనవేసిన కలనేత యీ నవల. అయితే, కథనం కాలక్రమంలో సాగక
ముందుకీ వెనక్కీ, ఫ్లాష్ బ్యాక్లతో, ఫ్లాష్ బ్యాక్లలో ఫ్లాష్ బ్యాక్లతో సాగుతుంది. ఇది కొంతమంది
పాఠకులకి కాస్త తికమక చిరాకు కలిగించ వచ్చు. మరికొందరికి ఆసక్తి కలిగించ వచ్చు.
శ్రీనాథుని జీవితాన్ని చిత్రించే పుస్తకాలు చాలానే వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గ రెండు పుస్తకాలు వేటూరి
ప్రభాకరశాస్త్రిగారి శృంగార శ్రీనాథము, నోరి నరసింహశాస్త్రిగారి కవి సార్వభౌముడు. శృంగార శ్రీనాథము
కేవలం చరిత్ర. కవిసార్వభౌముడు శ్రీనాథుడు విజయనగర రాజ్యంలో జరిపిన విజయయాత్రని మాత్రమే
వర్ణించే నవల. శ్రీనాథుని పూర్తి జీవితాన్ని చిత్రించే పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి భిన్నంగా,
"హంసగీతం"లోని ప్రత్యేకత ఏమిటంటే, ఆనాటి సాంఘిక పరిస్థితులని, శ్రీనాథ పోతనల వ్యక్తిత్వాలని
ఆధునిక ఆలోచనలతో, కొంత సామ్యవాద దృక్పథంతో వ్యాఖ్యానించడం. ఇది కొత్త చూపు.
శ్రీనాథుని జీవితాన్ని చిత్రించే నవల కాబట్టి, ఇందులో శృంగారం సమృద్ధిగా ఉంది. అది అక్కడక్కడ
శ్రుతిమించిందని కూడా అనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సందర్భోచితంగా అక్కడక్కడా
కనిపించే రేఖా చిత్రాలు ఇందులో అదనపు ఆకర్షణ. వీటిని గీసిన వారు శ్రీకర్. పంటికింద రాళ్ళలా
చాలాచోట్ల, ముఖ్యంగా పద్యాలలో, తగిలే అచ్చుతప్పులు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. వీటిని
మలి ముద్రణలో దిద్దుకుంటారని ఆశిద్దాం.
కథా రచయితగా తెలుగు సాహిత్యలోకానికి చిరపరిచితులైన వివినమూర్తిగారు రచించిన యీ నవల
"రచన" మాసపత్రికలో 44 నెలలపాటు ధారావాహికంగా ప్రచురింపబడింది. తర్వాత సిలికానాంధ్ర వారి
సౌజన్యంతో, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో, వాహినీ బుక్ ట్రస్ట్ వారి
ప్రచురణగా 2003లో పుస్తక రూపంలోకి వచ్చింది.
రచయిత : వివిన మూర్తి
ధర : 100 రూపాయిలు (మాత్రమే!)
కాపీల కోసం:
Vahini Book Trust, 1-9-286/3, Vidyanagar, Hyderabad
Visalandhra Book House branches
Navodaya Book House, Opp: Aryasamaj Mandir, Badi Chowdi, Hyderabad
Navayuga Book House, Sultan Bazaar, Hyderabad
Navodaya Publishers, Governorpet, Vijayawada
గిరి
మంచి పుస్తుకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు భైరవభట్ల గారు. వీలు దొరికినప్పుడు విశాలాంధ్రకి వెళ్ళి ఈ పుస్తుకం కొనుక్కుంటాను.
రవి
నోరి నరసింహశాస్త్రి గారి మరో రచన, కవిద్వయము. ఇందులో శ్రీనాథుడి చివరి రోజులు, పోతన శ్రీనాథుల అనుబంధం, అప్పటి సామాజిక పరిస్థితులు, ఇలాంటివన్నీ వివరింపబడ్డాయి.
ఆ విషయాలే ఈ పుస్తకంలో మరింత విస్తృతంగా వివరించినట్టు సమీక్ష ద్వారా చెప్పినట్టు అనిపిస్తూంది.
బొల్లోజు బాబా
సమీక్ష చాలా బాగుంది.
నా ఎదురుగా భైరవభట్లగారు కూర్చొని నాతో చెపుతున్నట్లే ఉంది. పుస్తకాన్ని చదవాలి.
బొల్లోజు బాబా