భైరప్పగారి ‘దాటు’

1975లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకున్న భైరప్పగారి దాటు నవలను ఓ నాలుగేళ్ళ క్రితం చదివాను. ఏం చదివానో ఏమో. అందులోని కథ బాగానే గుర్తుంది కానీ అందులోని విశిష్టత ఏమిటో, ఎందుకు అది సాహిత్య అకాడెమీ గుర్తింపుకి పాత్రమయ్యిందో నాకసలు అర్థం కాలేదు. బహుశా, కుల నిర్మూలన వంటి అభ్యుదయ కథావస్తువును ఎంచుకున్నందుకు అకాడెమీ వారి ప్రోత్సాహం లభించి ఉంటుందేమోననుకున్నాను.

ఇటీవల, ఆ రచయితవే మరో రెండు నవలలూ, ఆత్మకథా చదివినప్పుడు ఈ నవలను మళ్ళీ చదవాలనిపించింది. తన ఆత్మకథలో ఈ పుస్తకం గురించి చెబుతూ, “కుల సమస్యకి సంబంధించిన అన్ని కోణాలనూ, అందరి వాదనలనూ నిష్పక్షపాతంగా ఆవిష్కరించాను” అన్నారాయన. అయితే, ఈ నవల కొంత వివాదాన్ని సృష్టించిందట ఆరోజుల్లో. కొందరు “తస్మదీయ” రచయితల చేత రెచ్చగొట్టబడిన కొందరు వ్యక్తులు కొన్ని రాత్రుల పాటు భైరప్పగారి ఇంటి మీద రాళ్ళు రువ్వారట. ఒక దశలో పోలీసు ప్రొటెక్షన్ పెట్టుకోవాల్సి వచ్చిందట. “అంత అభ్యంతరకరమైనదేమున్నదబ్బా?” అన్న ప్రశ్న నన్ను పునఃపఠనానికి పురిగొల్పింది.

అభ్యంతరకరమైనది నాకేమీ కనబడలేదు కానీ – ఇంతకు ముందు “చదివినప్పుడు” మిస్ చేసిన అనేకానేక పరిశీలనలు, చర్చలు ఈసారి నా కంటబడ్డాయి. కనువిప్పు కలిగెనన్నమాట. :).

కథను టూకీగా పరిచయం చేసి మిగతా విషయాల గురించి ప్రస్తావిస్తాను.

ముఖ్య గమనిక: ఒక పుస్తకాన్ని చదివే ముందు అందులోని సారాన్ని ఎంతో కొంత ముందుగానే చదివితే మీ పఠనానందం తగ్గిపోతుందని అభిప్రాయం మీకుంటే – మీరు ఈ పరిచయం చదవకపోవటమే మంచిదేమో.
***

మైసూరు సంస్థానం/రాష్ట్రంలో తుముకూరు సమీపంలో మూడున్నర వేల గడపలున్నతిరుమలాపురం గ్రామంలోని వేర్వేరు కులాలకు చెందిన మూడు కుటుంబాల కథ ఇది. కథా కాలం – కొంచెం అటు-ఇటుగా – 1940-1960ల నడుమన ఉన్న ఇరవై సంవత్సరాలు.

తిరుమలాపురం విష్ణ్వాలయంలో అర్చకుడైన వెంకటరమణయ్యగారమ్మాయి సత్యభామా, వెంకటరమణయ్యగారి సహపాఠీ, ఉపమంత్రీ అయిన మేలగిరి గౌడగారి కుమారుడైన శ్రీనివాసూ ప్రేమించుకున్నా, పెళ్ళి చేసుకొని ఒక్కటవలేకపోతారు. తమ, తమ కుటుంబాల నుంచీ వ్యతిరేకత ఎదురవుతుందని తెలిసినా దాన్నెలా ఎదుర్కోవాలో ఆ అబ్బాయికి తెలియనందున.

తన కుటుంబపు ఒత్తిడికీ, తన అపరిపక్వ మనః స్థితినుంచి పుట్టుకొచ్చిన అనవసరమైన అపరాధ భావనకీ లోనైన శ్రీనివాసు, “మన సమాజం ఇప్పుడిప్పుడే కులాంతర వివాహాలకు సిద్ధంగా లేదు. నన్ను మరిచిపో, ఇక నేను నీ జ్ఞాపకాలతో నా మరణం కోసం ఎదురు చూస్తాను.” అంటూ సత్యభామకి జాబు రాసేసి, తన ఇష్టానికి విరుద్ధంగానే, తండ్రి రాజకీయాశయాలకూ, తాతగారి “క్షాత్ర” కుల గౌరవానికీ, తల్లి మనశ్శాంతికీ దోహదపడే విధంగా – వాళ్ళు చూసిన పిల్లనే పెళ్ళాడతాడు.

ఈలోపు – అన్ని విషయాల్లోనూ తన ప్రేమికుడి కన్నా ఎన్నో అడుగుల ముందుండే సత్య, తన తండ్రిచేత వీపూ, భుజాలూ వ్రయ్యలయ్యేలా చెప్పు దెబ్బలు తినీ, తన లెక్చరర్ ఉద్యోగాన్ని పోగొట్టుకొనీ, ఓ చీరల కొట్టులో సేల్స్‌గర్ల్‌గా చేరి స్వాభిమానాన్నీ తన సమతాదర్శాన్ని నిలబెట్టుకుంటుంది.

“ఎన్నాళ్ళ నించో వచ్చిన పద్ధతులివి. మధ్యలో ఎవరైనా వీటిని ఎదిరిస్తే ఎదిరించిన వాళ్ళకూ కష్టాలే; మిగిలిన వాళ్ళకూ కష్టాలే!” అని తెలుసు తనకి. కానీ తప్పదు. ఎవ్వరూ ఏ కష్టాలు పడకుండా విప్లవాలు వాటంతకవే రావు కదా?

ఇంతకీ, “ఈ తేడాల మూలతత్త్వం ఏది – జన్మా? రంగా? రూపమా?” అని తండ్రిని నిలదీసిన సత్య –
“భేదం అనేది అబద్ధం అని అన్ని వేదాంతాలు చెప్తున్నై. దాసర్లు [పురందర దాసు, కనకదాసు వంటి భక్తకవులు] కూడా అదే చెప్పారు. ఎవరు చెప్పారు అనేది ముఖ్యం కాదు. మన అంతరంగమే మనకు నిజం చెప్తుంది. మన అనుభవమే మనకు దారి చూపుతుంది.కాని ఈ కట్టుబాట్లు అంతరంగాన్ని కప్పిపెడతై. అనుభవం చెప్పే దాన్ని తప్పు దారి పట్టిస్తై. ధైర్యం కలవాళ్ళు కట్టుబాట్లను ఎదిరిస్తారు. ఎదిరించి నెగ్గగలుగుతారు. పిరికి వాళ్ళు మనస్సు మీద మట్టి కప్పి బురదలో పురుగుల లాగా బతుకులీడుస్తుంటారు.” అంటూ తన నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటిస్తుంది.

అంతరంగం-కట్టుబాట్ల గురించి ఆమె అన్న మాటలు వెంకటరమణయ్య గారిని వెంటాడతాయి. మరపున పడబోతున్న రహస్యమొకటి మళ్ళీ తలెత్తి ఆయన్ను నిలవనీయకుండా చేస్తుంది. సుమారు ఓ రెండు వందల పేజీలు పరిగెత్తించి సత్యను స్వగ్రామానికి చేర్చి కథను ఓ పెద్ద మలుపు తిప్పుతుంది.

తిరుమలాపురానికి తిరిగొచ్చాక సత్య అప్పటికే ఉన్మత్త దశలో ఉన్న తన తండ్రి ద్వారా బ్రహ్మదీక్షను పొందుతుంది. ఆయన ఆస్తిలో వాటాగా సగం పొలాన్నీ పొందుతుంది. అగ్ని కార్యం నిర్వహిస్తూ, తన పొలంలో కష్టిస్తూ, ఏకకాలంలో బ్రాహ్మణత్వాన్నీ, (స్వావలంబనా) శూద్రత్వాన్నీ నిలబెట్టుకుంటుంది.

కాలక్రమంలో, సత్యకు బెట్టయ్యగారి పిల్లలతో స్నేహం పెరుగుతుంది. బెట్టయ్యగారు ఆ ఊరి హరిజన నాయకుడూ, గాంధేయవాదీ, ఎమ్మెల్యే కూడానూ. తన గంగిగోవు స్వభావాన్ని అందిపుచ్చుకొన్న ఆయన కూతురు మీరాకి సత్య గురుసమానురాలు. తండ్రి స్వభావానికీ, సిద్ధాంతాలకూ పూర్తిగా విరుద్ధంగా ఉంటూ, మాట్లాడితే “విప్లవం, అంబేద్కర్” అనే మోహనదాసుకి సత్య అంటే గౌరవం. మూగ ప్రేమ కూడానూ.

కులం నిలబెట్టిన అడ్డుగోడలను వాళ్ళు ముగ్గురు దాటిన తీరూ, మేలగిరి గౌడ గారింటి సంఘటనలూ, నిర్ణయాలూ, వ్యవహారాలూ ఈ ముగ్గురి జీవితాలపై చూపిన ప్రభావమూ – ఇవీ, ఈ నవలలో మిగతా రెండొంతుల కథ.

అంతతః –
తన ప్రత్యక్ష కార్యాచరణకు పరాకాష్ఠగా, మోహనదాసు ఆ ఊరి చెరువు కట్టను పేల్చేసి తన ప్రాణాలను కోల్పోతాడు. వరద తాకిడికి ఆ ఊరి దేవాలయం కూలిపోతుంది. సత్య తన యజ్ఞోపవీతాన్ని తెంచి వరద నీటిలోకి విసిరేసి – కల్పాంత మహాప్రళయాన్ని తలపించి, రానున్న కొత్త సృష్టిని స్ఫురింపించిన ఆ ఆ ప్రవాహోధృతిని చూస్తూ “ధియో యో నః ప్రచోదయాత్” అని ధ్యానిస్తూ ఉండగా సమాప్తమవుతుంది, దాటు నవల.
***

కుల మతాల చట్రం కారణంగానూ, ఆ చట్రం సడలుతున్నచారిత్రిక సందర్భం కారణంగానూ బాధ పడేవాళ్ళూ, లాభపడేవాళ్ళూ, సర్దుకుపోయే వాళ్ళూ, సంఘర్షించే వాళ్ళూ, పారిపోయేవాళ్ళూ, రాలిపోయే వాళ్ళూ – అందరూ ఈ నవలలో కనబడతారు. ఆలోచనల, స్వార్థాల, భయాల, అవమానపు జ్ఞాపకాల, అంతర్మథనాల… స్వీయ మానసికావరణాలతో వాళ్ళు, ఎప్పటికప్పుడు, పాఠకుడికి రచయిత తన తలకెత్తుకున్నసమస్య తాలూకు తీవ్రతనూ, సంక్లిష్టతనూ గుర్తుకు చేస్తుంటారు. ముఖ్యంగా తన అధ్యయనాన్ని ఎప్పటికప్పుడు అనుభవంతో సమన్వయ పరచుకుంటూ ఉండే సత్యభామ. ఈ కథలో ఆవిడ రచయిత భావాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగని మిగతా పాత్రలు నోట్లో నాలిక లేనివేమీ కావు. రచయిత, తాను ప్రతిపాదించదలచుకున్న ఆదర్శాన్ని సమర్థించే పాత్రల నోటి నుంచే కాక, వ్యతిరేకించే పాత్రల నోటి నుంచి కూడా బలమైన వాదనలను వినిపించగలిగినందుచేతా, అన్ని వాదనలూ కథా పరిధిలోకి ఒదిగిపోవటం వల్లా ఈ నవలలో చక్కని “వాదావరణం” ఏర్పడి కథకి మంచి బిగువు కలిగింది.

ఈ నవలలో సత్యభామ పాత్ర పరంగా, రచయిత చేసిన శాస్త్ర చర్చ గురించీ, చరిత్ర నేపథ్యంలో చేసిన కొన్ని పరిశీలనల గురించీ కాస్తైనా చెప్తే కానీ తృప్తి కలగదు, :). కనుక, హైలైట్స్‌ని మాత్రం ప్రస్తావిస్తాను, అక్కడక్కడ, నాకు తట్టిన విషయాలను జోడిస్తూ.

కాలేజీలో చదువుతుండగా తను తెలుసుకున్న విషయాలు

1. పురుష సూక్తంలోని “బ్రాహ్మణోస్య ముఖమాసీత్…” వంటి వాక్యాలను యథాక్షరంగా కాక ఆనాటి సమాజ స్వరూపానికి ప్రతీకాత్మక వర్ణనగానే అర్థం చేసుకోవాలి.

2. “చాతుర్వర్ణ్యం మయా సృష్టం” అని చెప్పిన భగవద్గీతను రాసిన వాడు మనిషే.

3. శూద్రులు శారీరిక శ్రమలను నీచంగా భావించి వదిలేయటాన్ని నివారించేందుకే, “స్వధర్మే నిధనం శ్రేయః…” శ్లోకం భగవద్గీతలో వచ్చింది.
(భగవద్గీతలోని భక్తి-జ్ఞాన-కర్మ యోగాల సమన్వయం వెనకాల అసలు కారణం కూడా అదేనంటుంది సత్యభామ. అయితే ఆ సందర్భం వేరేననుకుంటాను. ఆ సందర్భంలో కర్మ అంటే వైదిక కర్మకాండ అని అర్థం చేసుకోవాలనుకుంటాను.)

శూద్రుల తిరుగుబాటు చరిత్ర గురించి

4. పై కులాల స్త్రీలను బలాత్కరించిన శూద్రులకు మనువు మరణ దండనను నిర్దేశించాడు. అంటే – బహుశా, అలాంటి బలాత్కారాలు నిజంగానే జరుగుతుండేవేమో. అది అప్పటి శూద్రుల తిరుగుబాటు స్వరూపం అయి ఉండవచ్చును.(“తిరుగుబాటు చేయనిదే పీడితుల పరిస్థితులు మెరుగు పడవు. ఇది చారిత్రిక సత్యం.” అన్న మోహనదాసు మాటలకు చారిత్రికాధారాలేమిటా అని ఆలోచిస్తున్నప్పుడు సత్యభామకు తట్టిన ఆలోచన ఇది.
ఇక్కడ భైరప్పగారు పొరపడ్డారేమోనని అనుమానం కలిగింది. తను చర్చించిన శ్లోకం – మను స్మృతి 8.374? – ఇలాంటి “తిరుగుబాటు”ను నిరోధించేందుకు కాక, వర్ణ సాంకర్యాన్ని నిరోధించేందుకు ఉద్దేశించినదని అనుకుంటాను. ఆక్యురసీ మాట అటుంచితే, “అది అప్పటి శూద్రుల తిరుగుబాటు స్వరూపం అయి ఉండవచ్చును.” అన్న ఊహ చాలా తప్పుడు ఆలోచనగా తోచింది నాకు.)

5. పురాణాల్లో కనిపించే కలియుగ వర్ణన (శూద్రులు అధికారం చేజిక్కించుకోవటం, బ్రాహ్మణులు పతనం అవటం వగైరా) ఆనాటి చరిత్రలో (మౌర్యుల అనంతరం) నిజంగా సంభవించిన పరిణామాల ఆధారంగా చేసినదే.
(శూద్రుల తిరుగుబాటుకు చూపించిన చారిత్రిక దృష్టాంతం ఇది. అయితే ఈ పరిణామాలు మౌర్య కాలానంతరం జరిగినవేనా అని నాకు సందేహం.)

ఒకప్పడున్న కులాల ఊర్ధ్వ చలనశీలత గురించి

6. ఒక తెగయొక్క అంతస్తును వర్ణాశ్రమ చట్రంలోకి పెంచే లేదా దించే అధికారం రాజుకు ఉండేది. దానికి శాస్త్రాధారాలను బ్రాహ్మణులు సమకూర్చేవారు. కనకంతో, గోవులతోనూ బ్రాహ్మణులను తృప్తి పరిచి శాస్త్రాన్ని ఎవరైనా తమకు కావలసిన తీరులో మార్పించుకునే అవకాశం ఉండేది.

7. రెండువేల సంవత్సరాలనుంచి, మూలతః క్షత్రియులైన వాళ్ళెవ్వరూ లేరు, ఈ దేశంలో. బాహుబలంతో రాజ్యాన్ని సాధించిన వాళ్ళంతా క్షత్రియులయ్యారు. వారిది అగ్ని వంశమనో, సూర్య వంశమనో, చంద్ర వంశమనో పురాణాలు రాసేసి వంశ చరిత్రలను సృష్టించి, క్షత్రియ ముద్ర వేసింది బ్రాహ్మణులే.

8. మూలతః బ్రాహ్మణులైన వారెవ్వరు? ఒకప్పుడు, మంత్రాలు నేర్చుకున్న వారందరూ బ్రాహ్మణులనిపించుకున్నారు. ఈనాటి నాగర బ్రాహ్మణులు ఈజిప్టు నుంచీ, చిత్తపవన బ్రాహ్మణులు ఇరాన్‌నుంచీ – వలస వచ్చిన వారే. వేదాన్ని అభ్యసించి, అప్పటి రాజుల చేత బ్రాహ్మణులుగా ఆమోదించబడ్డారు. ఆఖరికి మారెమ్మ కథలో కనబడేది కూడా ఇదే – బ్రాహ్మణేతరుడు వేదాన్ని నేర్చుకొని బ్రాహ్మణుడవుదామన్న ప్రయత్నం.

9. అంతా బ్రహ్మమయమని ఘోషించిన ఉపనిషద్వాక్కును వర్ణ ధర్మమనే మిథ్య కబళించింది. వ్యావహారిక-పారమార్థిక సత్యాలు వేర్వేరన్న నెపం ఈ మిథ్యను బలపరిచింది. గత మూడు వేల ఏళ్ళుగా జరుగుతున్నదేమిటంటే – శూద్రులు తమ అస్తిత్వాన్ని మరిచిపోయి బ్రాహ్మణులవ్వాలని ఆరాటపడటం, బ్రహ్మత్వం ముసుగు వేసుకున్న శూద్రులు వారిని నిరోధించటం.
(రచయిత ఉద్దేశించి ఉండకపోవచ్చును కానీ ఈ చివరి వాక్యంలో అగ్రకులాహంకారం వినబడింది నాకు.)

సత్యభామ తన అగ్నికార్యాన్ని సమర్థించుకుంటూ చెప్పిన మాటలు

10. ఒకప్పుడు – యజ్ఞ యాగాదులు పూజా విధానంగా ఉన్నకాలంలో – వర్ణ భేదాలు లేవు. దేవుడికి ముఖము, భుజాలు, తొడలు, పాదాలు అంటూ మానవాకారాన్ని కల్పించాక – అంటే – విగ్రహారాధన ప్రారంభమయ్యాకే ఈ భేదాలు ప్రారంభమై ఉంటాయి. విగ్రహారాధనే మన పతనానికి కారణమయ్యింది.
(ఈ ప్రతిపాదన చాలా గందరగోళాత్మకంగా ఉన్నదనిపించింది నాకు. సగుణోపాసనను, విగ్రహారాధనను మిక్స్-అప్ చేసారేమోనని అనిపించింది. విగ్రహారాధనకీ – పోనీ, సగుణోపాసనకీ – వర్ణ భేదాలకీ కార్య కారణ సంబంధం ఉందని ఎలా చెప్పగలం?
విగ్రహారాధన అంటే నాకు భక్తి ఉద్యమం గుర్తుకు వస్తుంది. ఎందరెందరు సంస్కర్తలు కులానికి, వర్ణ ధర్మానికి వ్యతిరేకంగా గొంతు విప్పలేదు? విగ్రహారాధన లేకుండా మన దేశంలోని ఉజ్వల శిల్పకళను ఊహించలేను.)

11. మతం అన్న తరువాత ఏదో ఒక ప్రతీక ఉండాలి. ఆ మతంలోని వారిని ప్రతీకలు కలిపి ఉంచుతాయి. ఏ ప్రతీకా లేకుండా, ఐకమత్యమూ లేకుండా ఉంటే, అన్య మతాల వారి మతం మార్పిడి ప్రయత్నాలను ఎదుర్కోలేము. ‘అగ్ని’ – హిందువులకున్న ప్రతీకల్లో అతి తక్కువగా దూషితమైన ప్రతీక కనుక (హిందువులు) అందరిచేతా స్వీకరించదగ్గది.
(దాటు నాటి భైరప్పగారి పై ఆర్య సమాజ ప్రభావం ఉండి ఉండాలి…)

పరిష్కారాల గురించి

12. ఒక చారిత్రికమైన అన్యాయాన్ని సరిదిద్దే క్రమంలో మరి కొందరికి అన్యాయం జరగవచ్చును. కొత్తగా పైకి వస్తున్న వాళ్ళు ఆ మరి కొందరి పట్ల కొంత ఘాతుకత్వాన్ని చూపించే అవకాశం ఉంది. అది సహజం. న్యాయం గురించి మాట్లాడేప్పుడు – మొత్తం చరిత్రలోని న్యాయాన్యాయాల గురించి మాట్లాడాలి. మన తాతల ఆస్తిలో వాటా కోరుకుంటాము, మన ముత్తాతల పుణ్యం మనలను కాపాడాలని ప్రార్థిస్తాము. వారి తప్పులకు మాత్రం బాధ్యులము కాము అంటాము. ఇది నైతిక పలాయనవాదం కాదా?
(బ్రాహ్మణేతరుడి లాబీయింగ్ కారణంగా పదోన్నతి అవకాశాన్ని కోల్పోయిన ఒక బ్రాహ్మణుడితో సత్యభామ చేసిన వాదన ఇది. ఈ వాదనలో న్యాయం కనబడలేదు నాకు.)

13. వివక్షకి గురైన వాళ్ళు పురాణాలను గాలించో, అబద్ధపు కథలను సృష్టించో అగ్రవర్ణాల వారిగా గుర్తింపు పొందటం కన్నా, నిజాయితీగా – హింసాత్మకంగానైనా – తిరగబడి పోరాడటమే గౌరవప్రదమైన విషయం.
(ఇక్కడ రాణి శివశంకర శర్మ గారి “The Last Brahmin” గుర్తుకు వచ్చింది. దాటు నాటి భైరప్ప గారి ఆలోచన తీరుకీ, శర్మ గారి ఆలోచనలకీ కొన్ని పోలికలున్నాయని నాకనిపించింది. నాకు కనబడ్డ పోలికలు కేవలం ఉపరితలానికి సంబంధించినవేమో…)

14. విప్లవ మార్గం ద్వారా సమానత్వాన్ని సాధించిన వర్గాలు, తరువాత సామాన్యంగా శోషక వర్గాలే అవుతై.
(ఇక్కడ విప్లవ మార్గం అన్న మాటను తిరుగుబాటు/హింసాత్మక పోరాటం అనే అర్థంలో వాడుతున్నారు రచయిత. కుల నిర్మూలనకు సంబంధించి ఈ పుస్తకంలో కనబడే ఆఖరి “హెచ్చెరుక” ఇది. శోషిత వర్గాలు తిరుగుబాటు చేయటమే విముక్తి మార్గమని రచయిత నమ్మకం, అయితే “ఆ పోరాటం సమానత్వానికే దారి తీస్తుందా లేక బాలన్సు తప్పి కొత్త శోషకులను తయారు చేస్తుందా?” అన్నసందేహం తనకి ఉంది.
ఇంకో విషయం – ఈ విప్లవ కార్యాచరణ ఎలా ఉండాలో రచయితకి స్పష్టత ఉన్నట్లనిపించలేదు. దళితులు బలవంతంగా ఆలయాలలో ప్రవేశించటం, అర్చక వృత్తిని స్వీకరించటం, పబ్లికు స్థలాలలో సంచరించే హక్కును వాడుకోవటం, అడ్డుపడ్డ వాళ్ళను “పట్టుకొని తన్నటం” – మోహనదాసు ఆలోచనల్లో కొన్ని. ఒక దశలో, కుల సమీకరణాల ఆధారంగా దళితులు అధికారం చేజిక్కించుకోవచ్చునన్న ఆలోచనా మోహనదాసుకు కలుగుతుంది. దాని పరిణామాలెలా ఉంటాయో పాఠకులకూ, భవిష్యత్తుకూ వదిలేసారు, రచయిత.)

నా “చివరి కొనిపోకడ”

ఈ నవలలో కనబడే శాస్త్రాలూ, చరిత్రా, రాజకీయాలూ… ఇవన్నీ ఒక ఎత్తు. “ఎవరు చెప్పారు అనేది ముఖ్యం కాదు. మన అంతరంగమే మనకు నిజం చెప్తుంది. మన అనుభవమే మనకు దారి చూపుతుంది.” అని సత్యభామ నోట పలికించిన మాట ఒక్కటీ మరొక ఎత్తు. గాఢమైన చీకటిలో నిశ్చలంగా వెలిగే జ్యోతిలాంటి మంచిమాట!

అదనపు వివరాలు

  1. రచనాకాలం: 1972; చక్కని తెలుగు సేత పరిమి రామనరసింహం గారిది; సాహిత్య అకాడెమీ ప్రచురణ (2005; 511 పేజీలు, మూడు పేజీల “టిప్పణి”తో కలుపుకొని; 200 రూపాయలు); ఈ-బుక్కు (వస్తే బావుణ్ణు)
  2. నెట్‌లో కనబడ్డ మరికొన్ని పరిచయాలు (1, 2, 3, 4)

You Might Also Like

8 Comments

  1. varaprasaad.k

    వివరముగా విపులముగా నాటి సంఘ్టనలను రచయితకంటే బాగా వివరించిన మీకు అభినందనలు శ్రీనివాసుగారు.వీలయితే చలం గురించి నాలుగు ముక్కలు రాయండి.చదివి సంతోషిస్తాము..

  2. లక్ష్మీదేవి

    కర్మకాండను గురించి వివరించేది యజుర్వేదం మాత్రమేననుకుంటాను.
    నాలుగువేదాల్లో సకృత్ గా మాత్రమే ‘సత్యా’న్వేషణ ఎందుకుంటుందంటే అది ఎక్కువ వివరించేది కాక ఎవరికి వారు చేయవలసిన దర్శనం.
    కర్మకాండ ఎక్కువ ఎందుకు వివరించబడి ఉంటుందంటే అది ఒకరు చెప్పినా కూడా అర్థం చేసుకొని నేర్చుకోవచ్చు.
    ఉపనిషత్కారులు ప్రతిపాదించని విషయాన్ని వారికి అంటగట్టి వారు ‘సాహసించలేద’ను ప్రతిపాదన
    సమంజసం కాదనిపిస్తుంది.
    నిజమే సౌమ్యగారు, నేనూ ఇక్కడితో ఆపేస్తాను. ఈ విషయపు పరిధి ఎంత విస్తృతమైనదో, నా జ్ఞానం ఎంత సీమితమైనదో తెలుసును.

  3. సౌమ్య

    మీ చర్చ వ్యాసం/పుస్తకం.నెట్ పరిధి దాటి వెళ్ళిపోతోంది అనిపిస్తోందండీ @శ్రీనివాస్ గారు, లక్ష్మీదేవి గారు 🙂

    1. వురుపుటూరి శ్రీనివాస్

      నిజమే. ఇక్కడితో ఆపేస్తాను. 🙂

  4. లక్ష్మీదేవి

    జ్ఞాన మార్గం అనేది ఒకటుందంటున్నప్పుడే దాని గమ్యం భగవంతుడని లేదా ఆత్మసాక్షాత్కారమని. ఒక ఉన్నత లక్ష్యం పెట్టుకొని చేరడానికే కదా ఒక మార్గాన్ని ఆశ్రయిస్తారు! అంటే ఆ ఉన్నత లక్ష్యం మీద ఆరాధానా భావన/భక్తి భావన ఉన్నట్టే కదా! దాన్ని ప్రత్యేకంగా సమన్వయం కోసం ప్రవేశపెట్టడం ఏమిటి? అలాలేదు.
    మూడు మార్గాలూ ముందే ఉన్నాయి. అసలు మూడు మార్గాలని విడగొట్టడానికే లేదు. జ్ఞానంలో భక్తి, భక్తిలో కర్మ, కర్మఎందుకు చేస్తున్నామంటే కొంత జ్ఞానం, భక్తి ఉండడం వల్ల. నిజానికి సెట్ థియరీ ఇలాగే ఉంటుందేమో అనుకుంటా.
    ఇంకొక విషయం. ఔపనిషదికము , వైదికమూ వేర్వేరు కాదు. వేదాల్లో ఉన్నదాని వ్యాఖ్యానమే ఉపనిషత్తులంటారు కదా!
    వైదికమైనవే మూడుమార్గాలూనూ. ఒకదానికొకటి విరుద్ధమయ్యే ప్రసక్తే లేదు.
    నాకు తెలిసిందిది. సరి/కాదు అని నిశ్చయంగా చెప్పే స్థాయి లేదనుకోండి.
    వ్యాసపు విషయాన్ని విడిచి వేరు విషయాలను గురించి మాట్లాడుతున్నందుకు మన్నించండి.
    http://www.google.co.in/imgres?imgurl=http://photos3.meetupstatic.com/photos/event/6/8/a/8/event_212786792.jpeg&imgrefurl=http://www.meetup.com/math-62/events/108613152/&h=244&w=256&tbnid=9QC4VfuskzUkzM:&docid=864nRoTJBwVWJM&ei=hCfEVdA4z97sBsqApcgE&tbm=isch&ved=0CDgQMygHMAdqFQoTCNCK2J-FlscCFU8v2wodSkAJSQ

    1. వురుపుటూరి శ్రీనివాస్

      లక్ష్మీదేవి గారికి

      గట్టి ప్రశ్నే అడిగారు: “జ్ఞాన మార్గం అనేది ఒకటుందంటున్నప్పుడే దాని గమ్యం భగవంతుడని లేదా ఆత్మసాక్షాత్కారమని. ఒక ఉన్నత లక్ష్యం పెట్టుకొని చేరడానికే కదా ఒక మార్గాన్ని ఆశ్రయిస్తారు! అంటే ఆ ఉన్నత లక్ష్యం మీద ఆరాధానా భావన/భక్తి భావన ఉన్నట్టే కదా! దాన్ని ప్రత్యేకంగా సమన్వయం కోసం ప్రవేశపెట్టడం ఏమిటి?”

      ముందుగా “ప్రవేశపెట్టారు” అని నేనన్న మాట గురించి. అది “introduce” అన్న మాటకి (అప?) అనువాదం. బుద్ధిపూర్వకంగా ఎవరో ఆ భావనను ప్రవేశపెట్టారనే అర్థం వచ్చే ప్రమాదం ఉన్నది కదా (ఆ ఇంగ్లీషు మాటా అదే అంటున్నదేమో…). అది కరెక్టు కాదేమో. ఈ భావనలు ఒకానొక సుదీర్ఘ కాలఖండంలో పరిణమిస్తూ వచ్చాయేమో.

      మతం/ఆధ్యాత్మికత విషయంలో – జ్ఞానమూ, కర్మా, భక్తీ – ఒకదానినొకటి అంటుకోకుండా విడివిడిగా ఉండవు అని మీరన్నది కరెక్టు. ఐతే – ప్రాధాన్యతల ఆధారంగా ఆ మూడింటినీ మూడు మార్గాలుగా గుర్తిస్తారేమో. నాకు అంతగా తెలియదు.

      “ఔపనిషదికము , వైదికమూ వేర్వేరు కాదు. వేదాల్లో ఉన్నదాని వ్యాఖ్యానమే ఉపనిషత్తులంటారు కదా!” అన్నారు మీరు. సంప్రదాయం అలాగే చెబుతుంది. అయితే, ఆ మాటను రుజువు చేయటం అంత సులభం కాదనుకుంటాను (విషయాంతరమే కానీ ఈ నడుమన నేను విన్న చాగంటివారి రామాయణ ప్రవచనాల్లోనూ ఆయన “వేదం చెప్పిందే రాముడు చేసాడు. రాముడు చేసినదంతా వేదానికి అనుగుణమయ్యిందే. రామాయణం వేదోపబృంహణము.” అని అన్నారు. అయితే ఆయన ఎక్కడా వేదాన్ని ఉటంకించి ఇదిగో ఈ సూత్రాన్ని రాముడు ఈ ఘట్టంలో అనుష్ఠించాడని చెప్పిన జ్ఞాపకం లేదు.)

      నండూరి రామమోహనరావుగారి విశ్వదర్శనం రెండవ భాగం (భారతీయ చింతన)లో, “కర్మ జ్ఞాన యోగాల సమన్వయం” అనే పేరుతో ఉన్న అధ్యాయంలో ఈ విషయమై చెప్పిన మాటలతో ఈ వ్యాఖ్యను ముగిస్తాను:

      “వేదాలు ఇంద్రాగ్ని వరుణాది దేవతలకు, యజ్ఞ యాగాది కర్మకాండకు ప్రాధాన్యమిచ్చాయి. యజ్ఞ యాగాది క్రతువులతో దేవతలను ప్రసన్నులను చేసుకోవడం, కామితార్థాలను పొందడం వేద మత ప్రధాన లక్ష్యం…

      “ఉపనిషత్తులు వేదాలపై, వేద మతంపై తిరుగుబాటు. ఉపనిషత్తులు బోధించిన మతం వేదమతం కంటే భిన్నమైనది…

      “జ్ఞానం ఎలా లభిస్తుంది అసలు జ్ఞానం అంటే దేన్ని గురించిన జ్ఞానం? శాశ్వతానందం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలే ఉపనిషత్తులు. ఈ సమాధానాలు వేదాలలో చెప్పబడిన వాటికంటే విభిన్నమైనవి. ఉపనిషత్తులది ఒక వినూత్న మతమని కూడా చెప్పవచ్చు.

      “అయితే తమది వేదబాహ్య మతమనే నింద పొందడానికి ఉపనిషత్కారులు సాహసించలేదు. వేదప్రామాణ్యాన్ని అంగీకరిస్తూనే, వేదాలు వదిలిపెట్టిన చోటు నుంచి ముందుకు పోవడానికి వారు ప్రయత్నించారు. అంతే కాదు వేదాల్లో సకృత్తుగా కనబడే విశ్వ వివేచనను, అంతిమ సత్యాన్వేషణను మరింత ముందుకు తీసుకుపోవడానికి వారు ప్రయత్నించారు.”

      శ్రీనివాస్

  5. లక్ష్మీదేవి

    కర్మ అంటే వైదిక కర్మకాండ అని అర్థం చేసుకోవాలనుకుంటాను.—
    ఈ సందర్భంలో అని అన్నారు.
    కానీ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః
    అహంకార విమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే
    (సకల కర్మలు అన్ని విధములుగ ప్రకృతిగుణములద్వారానే చేయబడుతున్నవి. అయితే అహంకారం చేత భ్రమించిన అంతఃకరణం కలిగిన అజ్ఞాని అంతటికి నేనే కర్తనై యున్నాను అని తలంచును.

    న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
    కార్యతే హ్యవశః కర్మసర్వః ప్రకృతిజైర్గుణైః
    నిస్సందేహముగా ఏ వ్యక్తి కూడ ఏ సమయంలోనైనా కర్మ(పని) చేయకుండా క్షణకాలమైన ఉండజాలడు. ఏలనన ప్రకృతి జనితములైన గుణములకు లోబడి గత్యంతరము లేక మానవసముదాయమంతయూ కర్మాచరణకు తలయొగ్గుచున్నది . (ప్రేరితమగుచున్నది.
    ___________భగవద్గీత.
    చెప్పొచ్చేదేమంటే కర్మ అనగా వైదిక కర్మ అని కాదు. ప్రతిక్షణం ఆచరించుచున్న ప్రతిదీ కర్మయే.

    1. వురుపుటూరి శ్రీనివాస్

      లక్ష్మీ దేవి గారికి

      మీరన్నట్లు, ఈ శ్లోకాలు చాలా స్పష్టంగా మనం చేసే పనులన్నీ కర్మలనే చెబుతున్నాయి.

      ఈ నవలలో, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల సమన్వయం “చిన్న” కులాల వారిని తమ తమ వృత్తులలో నిలిపేందుకే బయల్దేరిందన్న సత్యభామ వ్యాఖ్యానాన్ని విన్న తండ్రి “భగవద్గీతలో అలా ఎక్కడ రాసి ఉంది?” అని అడుగుతాడు. అందుకు బదులుగా, “అప్పటి కాలంలోని పరిస్థితుల ఆధారంగా ఇటీవలి చరిత్రకారులు/పండితులు చేసిన విశ్లేషణ ఇది” అని చెబుతుంది.

      కర్మ అంటే వైదిక కర్మకాండ అని ఇంతకు మునుపు ఎక్కడ చదివానో అంత బాగా గుర్తుకు లేదు కానీ ఈ నడుమ చదువుతున్న On Hinduism అనే Wendy Doniger పుస్తకంలో, ఈ మూడు యోగాల సమన్వయం గురించి ఇలా రాసారు:

      “But karma took on a negative meaning in renunciant Hinduism, where the goal is to get free of all karma, even the merit of good acts (including Vedic rituals, also designated by the term ‘karma’). And this bias against any karma reinforced the dualistic contrast between karma (Vedic action) and jnana (the transcendent Vedantic fourth)…Thus, in order to resolve the conflicting claims of the original binary opposition, a new term, bhakti, was introduced (by the Bhagavad Gita and other texts). This new concept became one marga, or path, in the paradigm of the three paths to salvation, also called the three yogas: karma (works, rituals), jnana (knowledge, meditation) and bhakti (worship, love, devotion).”

      ఔపనిషదికమైన జ్ఞాన మార్గానికీ, వైదికమైన కర్మకాండకూ సమన్వయం చేసేందుకు భక్తి భావన ప్రవేశపెట్టారని డానిగర్ అంటున్నారా (కర్మ అంటే పనులు మరియు కర్మకాండ అని రెండు అర్థాలను చెబుతూనే)?

Leave a Reply