సంక్షోభం నుంచి సంతోషం వైపు నడిపే కథలు
వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
***********
మధ్యతరగతి ప్రజల జీవితాలలో మునుపెన్నడు లేనంత వేగం పెరిగింది. కొత్తగా లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, జీవన విధానాలను మార్చుకుంటూ, జీవననౌకని భవసాగరంలో ఆనంద తీరాల వైపు నడపాలని ప్రయత్నిస్తున్నారు. మరి సాగరమంటే – ప్రయాణం సులువుగా ఉండదుగా. ఆటుపోట్లు ఉంటాయి, నావిగేషన్ సిస్టమ్స్ పని చేయక, దిశానిర్దేశం లేక, నడిసంద్రంలో నిలిచిపోతే? కాలం స్తంభించినట్లువుతుంది. భయభ్రాంతులు మొదలవుతాయి. సందేహాలు, సంశయాలు, అనిశ్చితి, వెరసి … అందోళన! ఫలితం – తప్పుడు నిర్ణయాలు! అటువంటి సమయంలో సరైన మార్గదర్శకత్వం లభిస్తే, సంక్షోభ సుడిగుండాలను దాటి జీవననౌకని క్షేమంగా సంతోషతీరాలకు తీసుకురావచ్చు.
సాహిత్యం చేసేది అదే! మానవ జీవితంలోని చీకటివెలుగులను ప్రస్తావిస్తూ, కాలానుగుణంగా ఎలా నడుచుకోవాలో, ఎలా ఉంటే మన జీవితాలు ఆనందంగా ఉంటాయో, మనం సంతోషంగా ఉంటూ ఇతరులని కూడా ఎలా అనందంగా ఉంచగలమో సాహిత్యం తెలుపుతుంది. ఈ విషయంలో ఇతర సాహితీ ప్రక్రియల కన్నా ‘కథ’ ముందుంటుంది. కథాసాహిత్యం పరిధి విసృతమెనది. ముఖ్యంగా వర్తమాన సమాజంలోని అంశాలను ఇతివృత్తాలుగా ఎంచుకుని వ్రాసిన కథలకు ప్రయోజనం ఎక్కువ.
కాలానుగుణంగా విలువలు మారుతుంటాయి. ఒక తరంలో ‘విలువ’ అనుకున్న పద్ధతి/విధానం, మరోతరానికి వచ్చేసరికి ‘అడ్డుకట్ట/బంధనం’ లా అనిపించవచ్చు. ‘విలువలు’ అని అనుకునే భావాలు/పద్ధతులు – ఏ కాలంలోనైనా మేలు చేసేవిగానే ఉండాలి తప్ప వ్యక్తిగత శ్రేయస్సుకి, సామాజిక హితానికి భంగం కల్గించకూడదు.
భద్రజీవులుగా ముద్ర పడ్డ మధ్య తరగతి వారికి సమస్యలు కొత్తకాదు. సమస్యలతో రణం వారి జీవితం! చాలీచాలని జీతాలు, పెరుగుతున్న ఖర్చులు, భారమవుతున్న బంధాలు… ఇలాంటివి మధ్యతరగతి జీవితాల్లో సర్వసాధారణం. అయితే, మారుతున్న కాలంతో పాటు మారడానికి ప్రయత్నిస్తూ, మనకి అంతగా పరిచయం లేని సంస్కృతుల నుంచి జీవన విధానాన్ని అరువు తెచ్చుకుంటూ, ఇంకెవరి జీవితాన్నో జీవించాలనుకోడం వలన.. ఇటీవలి కాలంలో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త ఉద్యోగాలు, ఉద్యోగ (అ)భద్రతలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, సహజీవనాలు, సాంకేతికత చాటున జరిగే వంచనలు… అపోహలు, అసూయలు, అలకలు.. ! చిన్న చిన్న కారణాలకే కలతలకి లోనై జీవితాన్ని దుర్భరం చేసుకునే వ్యక్తులు తటస్తిస్తున్నారు.
ఇటువంటి వ్యక్తుల జీవితాలలోని వర్తమాన సంక్షోభాలకు అద్దం పడుతోంది శ్రీమతి నండూరి సుందరీనాగమణి గారి కథాసంపుటి – “అమూల్యం“. ఆ సంక్షోభాలకు నెపం మరొకరిపై మోపక, సమస్యని విశ్లేషించి, పరిష్కారం దిశగా నడుపుతాయి ఈ 15 కథలు. మంచేదో చెడేదో వివరించి, నిర్ణయాన్ని ఆయా పాత్రల విజ్ఞతకే వదిలేస్తాయి. మన మంచి కోరే నమ్మకమైన నేస్తం లాంటి పుస్తకం ఇది.
ప్రేమలో విఫలమై, జీవితాన్నే కోల్పోయానని భావించిన మంజీరకి, జీవితంలో ప్రేమ ఓ పార్శ్వం మాత్రమేనని, అసలైన ప్రేమ కానిదాని కోసం జీవితాన్ని వృధా చేసుకోవడం తప్పని తన స్వీయానుభవంతో నేర్చుకున్న పాఠాన్ని మంజీరకి చెబుతారు కరుణ – “మనసా ఎటులోర్తునే” కథలో.
తల్లిదండ్రుల వైవాహిక జీవితంలోని విషాదాన్ని చూసిన స్నిగ్ధ, పెళ్ళి వద్దనుకుని సహజీవనం మెరుగని భావిస్తుంది. కంపానియన్‌గా ఉన్న ప్రశాంత్, స్నిగ్థని వధువుగా ఎందుకు, ఎలా మార్చుకున్నాడో తెలుసుకోడానికి చదవాలి “ఏనాడు విడిపోని ముడివేసెనో” కథ.
భర్తగా సృజన్ తనకే సొంతమని, అతని సమయమంతా తనకేనని భావించే స్పందన – ఓ డాక్టర్‌గా సృజన్ అందరివాడని గ్రహించడానికి ఎందుకు ఆలస్యమైందో “ఉషస్సు” కథలో చదవచ్చు.
పిల్లల్ని తల్లిదండ్రులు వేలు పట్టుకుని నడిపించడం అందరికీ తెలిసిందే. భర్త ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా తనలో ప్రభవిస్తున్న ఓ కళ గొంతుని నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తుందో ఇల్లాలు. ఆమె కొడుకు పెరిగి పెద్దయ్యాకా, అదే కళలో నైపుణ్యం సాధిస్తాడు. తన భార్యతో కలసి అమ్మలోని కళని వెలికితీసి, ప్రపంచానికి చాటుతాడా కొడుకు “అమ్మా, నా వేలు పట్టుకో!” కథలో.
ఓ మగాడి చేతిలో మోసపోయి, జీవితం నాశనమైపోయిందని కుమిలిపోయిన విరజ – ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని “అపరాజిత“గా ఎలా మారింది? స్ఫూర్తిదాయకమైన కథ ఇది.
ఒకప్పుడు ప్రేమలో విఫలమైన తండ్రి, తన కొడుకు ప్రేమ ఓడిపోకూడని, అతని జీవితం తన బ్రతుకులా కాకూడని, భార్యకి ఇష్టం లేకున్నా, కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే అతని పెళ్ళి చేయడానికి సిద్ధమైన వైనం “జీవితమే సఫలము” కథలో చదవచ్చు.
అల్లారుముద్దుగా పెంచిన తండ్రిని కాదని ప్రేమించినవాడితో వెళ్ళిపోతుంది సుధీర. కాని ఒక పాప పుట్టాక, ప్రేమించిన వాడి నిజస్వరూపం బయటపడ్డాక అతనితో ఉండలేక, తిరిగి తండ్రి వద్దకు వచ్చేస్తుంది. కాని ఇక్కడ తండ్రి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అప్పుడు సుధీర ఏ నిర్ణయం తీసుకుంది? పేరులోనే ధీరత్వం ఉన్న ఆమె తమ జీవితాలను పునర్నిర్మించుకున్న విధానం ఎందరికో ప్రేరణనిస్తుంది. “కణ్వ శాకుంతలం” కథ చదవండి.
తళుకుబెళుకుల రంగురాయిని వదిలి జాతి రత్నాన్ని పొందగలగడం ఎంత అదృష్టమో “అమూల్యం” కథ చెబుతుంది.
ఇంటి దీపాన్ని కంటిరెప్పలా కాపాడుకోవటం మన బాధ్యత అని చెప్పే కథ “గ్రహణం“. పొరపాటుగా బురదలో అడుగేసిన వ్యక్తి, అది బురదని గ్రహించాకా, మళ్ళీ దాంట్లో కాలుపెట్టకపోవడం వివేకం. వివేకవంతుడైన కిరిటీ పొరపాటు చేస్తే, ప్రేమించిన సంధ్య అతన్ని అసహ్యించుకుందా? క్షమించిందా? చైల్డ్ అబ్యూస్ నుంచి పసిపిల్లలకి కాపాడుకోడానికి కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు రచయిత్రి ఈ కథలో.
”పెళ్ళాలంతా అంతేలే, వట్టి సెంటిమెంటల్ ఫూల్స్…” అనుకునే శ్రీహరికి, ఓ మిత్రుని వ్యధాభరిత అనుభవం ద్వారా “‘భార్యలు‘ కూడా తమలాంటి వారేనన్న సత్యం” ఆలస్యంగా తెలుస్తుంది. మిత్రుడి అనుభవం నుంచి నేర్చుకున్న శ్రీహరి తన ప్రవర్తనని మార్చుకుంటాడు “జీవిత సహచరి” కథలో.
“అమ్మ చెప్పింది” చక్కని కథ. మాయమోహంలో బొగ్గును వజ్రంగా భ్రమసి ఆశపడి వంచనకి గురైన కూతురికి… ప్రేమతో నిజమైన వజ్రాన్నే కానుకగా ఇచ్చిందో తల్లి. వయసుతో పాటు వచ్చే పెద్దరికంలోని అనుభవాన్ని రంగరించి, పిల్లల జీవితాలను తీర్చిదిద్దగలిగే మమతలాంటి తల్లుల అవసరం ప్రస్తుతకాలంలో మరింత పెరిగింది.
కూతుర్లు మంచివాళ్ళు, అల్లుళ్ళే చెడ్డవాళ్ళు అన్న అపప్రథ మన సమాజంలో చాలా కాలం నుంచి ఉంది. అల్లుళ్ళ మంచితనం గురించి కథలు వచ్చినా, కూతుర్ల అవలక్షణాలని ప్రస్తావించిన కథలు తక్కువే. కూతురి అత్యాశ కారణంగా అల్లుడిని అపార్థం చేసుకున్న ఓ అత్తమామల కథ “దుహిత“.
“ఉడుకునీళ్ళు”,” ఆశాదీపం”,” మంచిముత్యం” కథలు కూడా ఆసక్తిగా చదివిస్తాయి.
ఈ పుస్తకం చదవడం పూర్తయ్యాక, సమస్యలని తలచుకుని బెంబెలెత్తకుండా, సానుకూల దృక్పధంలో పరిష్కారాలను అన్వేషిస్తారు పాఠకులు. ఇవి కథలే, వీటిల్లో జరిగినట్లు జీవితంలో జరగవు అని అనుకోకూడదు. ఈ పుస్తకంలోని చాలా కథల్లో ప్రస్తావించిన అంశాలన్నీ వర్తమాన సమాజాన్ని కుదిపేస్తున్న అంశాలే. ఆయా కథల్లో సూచించిన పరిష్కారాలే మనకూ వర్తించాలనేం లేదు. దాన్నుంచి ప్రేరణ పొంది, సమస్యను పరిష్కరించుకోగలిగే మనోనిబ్బరం పొందవచ్చు.
జీవితం విలువ అమూల్యమని చాటి చెప్పే ఈ 175 పేజీల పుస్తకం వెల రూ.150/-. జె.వి. పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో లభిస్తుంది.
ఈబుక్ కినిగెలో లభ్యం.
మణి వడ్లమాని
మన మంచి కోరే నమ్మకమైన నేస్తం లాంటి పుస్తకం ఇది. నిజం ఇవి కదల గా ఉండవు.మనపక్కనే ,మనచుట్టూ ఉన్నట్టు గ అనిపిస్తుంది. దుహిత కధలో పాత్ర ని చాల ధైర్యం గా రాసారు. ఎందుకంటె సమాజం లో కోడలు చెడ్డది,కూతురు మంచింది అనే ట్యూన్ అయి[పోయిన పరిస్థితి లో ఈ కధ రాయడం సాహసం.
నాకు ఎందుకో ఈ కధ చదివిన తరువాత విపులలో వచ్చిన
జ్ఞాన్ పీఠ అవార్డు గ్రహిత శ్రీమతి ప్రతిభా రే కధ గురుకు వచ్చింది. . చక్కటి కధలు రాసిన సుందరీ నాగమణి గారికి, వాటిని చక్కగా విశ్లేషణ చేసిన కొల్లూరి సోమసుందర్ గారికి ధన్యవాదాలు.