భార్యని వర్ణించిన కవులున్నారు
వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్
*************
కవులేల తమ భార్యను వర్ణించరని ఎల్లేపెద్ది వెంకమ్మ, ఇప్పటికైనా ఆ స్థితి మారిందా అని వివిన మూర్తి ప్రశ్నించారు. ఎల్లేపెద్ది వెంకమ్మ గారు 1928లో వివేకానంద పత్రికలో ఈ విషయాన్ని రాసి ప్రశ్నించగా, ఈ విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా అలానే వుందా అంటూ వివిన మూర్తి గారి వెలిబుచ్చిన సందేహం 2015 నాటిది. ఆయన బ్లాగులో ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ అలనాటి వెంకమ్మగారి వ్యాసాన్ని పునఃప్రచురించారు. 1928 నాటి వ్యాసంలో వెంకమ్మ సాధికారిక స్వరంతో ‘‘మన ఆంధ్ర వాఙ్మయమును జాగరూకతతో పరీక్షించిన ఈ పరీక్ష (భార్యను వర్ణించుట పరీక్ష అనుకుంటే)లో ఏ కవియు కృతార్థుడు కాడని చెప్ప, కవిస్మరణకు హానికాదు’’ అని తేల్చారు. అయితే వెంకమ్మ సమకాలికులు అయిన ఓ కవి భార్యను తన నవలల్లో, కావ్యాల్లో వర్ణించారని ఇప్పుడు చెప్పవలసిరావడమే ఆశ్చర్యం.
ఆ కవి రచయిత ఎవరన్నది తర్వాత ప్రస్తావిస్తాను. అయితే, ప్రతి కవిత్వంలోనూ కవి అనుభూతి లేకుండా ఉండదు. కవి తన భార్యనే ప్రేమించిననాడు అతను వర్ణించే కావ్యంలోని నాయిక నూటికి తొంభైపాళ్ళు తన భార్యే కావాలి. ఉదాహరణకు కాళిదాసు మేఘసందేశంలో విరహంతో వేగిపోతున్న ఓ యక్షుణ్ణి వర్ణించారు. ఆ యక్షుడు కారాగారవాసం మరో ఏడాదిలో ముగిసిపోతుందనగా తన భార్యకు సందేశం పంపడానికి ఓ మేఘాన్ని వాడుకుంటాడు. ఇక్కడ కాళిదాసు రాసిన కమనీయమైన విరహ కావ్యంలో యక్షుడు కాళిదాసే అవుతాడు, అతని భార్య కాళిదాసు భార్యే అయివుంటుంది. అయితే యక్షుడిని తీసుకుని అతణ్ణి నాయకుణ్ణి చేయడం, ఆకాశంలో మేఘాన్ని దూతగా వర్ణించడం కావ్యలక్షణాలు. కవి తీసుకునే స్వేచ్ఛ అది. అదే కాళిదాసు భార్యను వర్ణించే ఎరగడని రాసేశారు వ్యాసకర్త. అలానే మహాకవులెందరో రాసిన ప్రేమ కావ్యాలు, విరహ కావ్యాల్లో నాయికగా తన భార్యనే నిలపకపోయినా ఆ నాయికల్లో వారి భార్య ప్రతిఫలించడం లేదనుకోవడం పొరబాటు. మరోలా చూస్తే అంతటి కవులు నిత్యజీవిత ఘట్టాల్లో తన భార్యపై కవిత్వం చెప్పకపోయి వుంటారనేది కూడా సాహసమే. అయితే ఆ కవిత్వాన్నే తన కావ్యంలోని రసరమ్యమైన ఏదో ఘట్టంలో కొద్దిపాటి భేదంతో వాడుకునివుండొచ్చు. నూటికి నూరుపాళ్ళూ ప్రతి కావ్యనాయికా ఆ కావ్యకర్త భార్య రూపమే కాకున్నా ఏ కావ్యనాయికలోనూ ఆ కావ్యకర్త భార్య రూపం లేదనడం అనుచితం.
వాస్తవానికి 20వ శతాబ్దపు తొలినాళ్ళలోని భావకవులు భార్యల ఊసే లేకుండా కేవలం ఊహాసుందరితో ఊహాత్మకమైన పవిత్ర ప్రణయాల్లో కొట్టుకుపోతూండం ఈ వ్యాసానికి నేపథ్యం. వ్యాసకర్త తన కాలంలో చూసిన భావకవుల లక్షణాలనే తాను చదివిన ప్రబంధాలకు నేరుగా అనువర్తింపజేశారు. అయితే భావకవిత్వం, ప్రబంధకవిత్వంపై పుట్టుకువచ్చిన కవితావిప్లవం. అన్నివిధాలా భావకవిత్వం ప్రబంధకవిత్వ రీతుల్ని భేదిస్తుంది. ప్రబంధకవిత్వంలో నాయికా నాయకుల రతిని, నాయిక అంగసౌందర్యాన్ని వర్ణించుకునే లక్షణం ఉంటే, దాన్ని వ్యతిరేకిస్తూ పుట్టుకువచ్చిన భావకవిత్వంలో ముఖ్యాంశం పవిత్ర ప్రణయం. అంటే శారీరికమైన సంబంధానికి కాక మానసికమైన ప్రణయానికి ఇక్కడ పెద్దపీట. అందుకే ప్రణయాన్ని శారీరికమైన స్పర్శకు దూరం చేసేందుకు భావకవులు ఊహాసుందరులను కావ్యవస్తువులుగా స్వీకరించారు.
ఐతే ఇది నూటికి నూరుపాళ్ళూ సరైన సమర్థన అవ్వదు. చాలా సందర్భాల్లో ఊహల్లో సుందరులకు పరిచర్యం చేసే భావకవులు, నిజజీవితంలో భార్య పట్ల కఠోరంగా వ్యవహరించినా ఆశ్చర్యం లేదు. ఆ విషయాన్నే చెప్తూ ‘‘తెఱచిరాజు’’ నవలలో ఓ భావకవిని పాత్రగా చేసుకుని ఒకపక్క భార్యను అవమానాల పాలు చేస్తూ, మరోపక్క కవిత్వంలో ప్రణయాన్ని తీయగా వర్ణించే పాత్రను ప్రవేశపెట్టారు విశ్వనాథ సత్యనారాయణ. అదే విశ్వనాథ తన ‘‘వేయిపడగలు’’ నవలలో కిరీటి పాత్ర ద్వారా మరో భావకవి తాను ప్రేమించి వివాహమాడిన భార్యతో సంసారాన్ని ఎలా పండించుకున్నాడో కూడా చూపించాడు (నిజజీవితంలో తనకు సన్నిహితుడైన ఓ భావకవిని తన నవలలో పాత్రగా మలిచారు విశ్వనాథ). మొత్తానికి వాస్తవం ఇలా రెండు స్తరాల్లో విడిపోయి వుంది. ఇదంతా అటుంచితే పూర్వకవుల్లో భార్యను కావ్యవస్తువుగా స్వీకరించినవారు లేరని, తమ నిత్యజీవితంలో భార్యతో ప్రణయానికి కావ్యగౌరవం ఉందని వారు భావించలేదని చేసిన ఆరోపణల్లో సత్యం లేదు.
ఈ వ్యాసాన్ని రచయిత్రి రాసేనాటికి తెలుగునాట కవిగా, రచయితగా ప్రాచుర్యం కలిగిన ఆమె సమకాలికుడు విశ్వనాథ సత్యనారాయణే ఓ ఉదాహరణ. విశ్వనాథ సత్యనారాయణ తన భార్యని కావ్యానాయికను చేయడమే కాదు ‘‘నా యఖిల ప్రశస్తకవనమునకు’’ ఆయమ పట్టభద్రురాలంటూ ఆమెను ఆకాశమంత ఎత్తున నిలిపారు. విశ్వనాథ సత్యనారాయణ రచనా జీవితపు తొలినాళ్ళలో రాసిన పలు కావ్యాల్లో ఆయన కథానాయికను తన భార్యనే భావిస్తూ నిర్మించారని చెప్తూంటారు. ఆయన భార్య వరలక్ష్మి మరణం వారి జీవితాన్ని రెండుగా విడగొడుతోంది. పలువురు విమర్శకులు ఆయన భార్య మృతికి ముందు రాసిన ‘‘ఏకవీర’’ లాంటి నవలల్లోనూ, తొలినాళ్ళలో రాసిన కావ్యాల్లోనూ కనిపించే నాయికల ముగ్ధత్వం, మాధుర్యం తర్వాతి రచనల్లో కానరావని చెప్తారు. తర్వాతి రచనల్లోనూ గొప్ప నాయిక పాత్రలను సృష్టించినా వాటి తీరు వేరు, ప్రవర్తన వేరు ముగ్ధత్వం అన్నది ఆమె మరణంతోనే ఆయన రసజీవితంలో అంతరించిందని చెప్పాలి.
విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో మాగ్నం ఓపస్ లాంటిదనే ‘‘వేయిపడగలు’’ అటు ఆత్మకథాత్మకంగానూ, మరోవైపు కల్పనాత్మకంగానూ ఉంటుంది. ధర్మారావు, అరుంధతి, కిరీటి, సూర్యపతి వంటి పాత్రలు నిజజీవిత పాత్రల నుంచి వచ్చినవైతే, పసరిక, గిరిక, హరప్పనాయుడు వ్యవస్థకు ప్రతీకలు. కథానాయకుడు ధర్మారావుకు నిజజీవితంలోని మోడల్ విశ్వనాథ సత్యనారాయణ అయితే ధర్మారావు భార్య అరుంధతికి నమూనా స్వయానా విశ్వనాథ వారి భార్య వరలక్ష్మియే. నవలలో ఆమెను అత్యంత ఉన్నతమైన పాత్రగా నిలిపారు. అంతేకాక ధర్మారావు, అరుంధతిల మధ్య ప్రేమ, వారి సాంసారిక జీవనం వంటివన్నీ చాలా అద్భుతంగా వర్ణించారు. అరుంధతిని వారి పుట్టింటివారు ధర్మారావు వద్దకు కాపురానికి పంపకుండా ఇంట్లోనే పెట్టుకుంటే ధర్మారావు వెళ్ళి ఆమెను తెచ్చేసుకునే సన్నివేశం అలాంటివాటిలో ఒకటి. విరహం ఒకవైపు, అనురాగం మరోవైపు ఒత్తిడి చేస్తూండగా ఆమెను అతను నడుముమీద చేయివేసి భూమికి అడుగు ఎత్తులో ఎత్తుకుని, కళ్ళలోకి చూస్తూనే తమ ఊరికి నడిచి తీసుకువచ్చే ఘట్టం వారిద్దరి మధ్య భావి జీవితాన్ని సూచిస్తుంది. ఇక వారిద్దరూ కలిసి పంచుకున్న జీవితాన్ని, వారి మధ్యన సల్లాపాలను, అలౌకికమైన అనుబంధాన్ని రాసుకువచ్చారు. చివరగా ఆమె మరణాన్ని నవలలో వర్ణించిన తీరు హృద్యమైనది. ఆ బాధ వేదన తీరనిది. అది వేలసార్లు చదివినా మళ్ళీ చదివి వినిపిస్తూ కంఠం వణికి, కన్నులు తొణికినవారిని నేను స్వయంగా చూశాను.
విశ్వనాథ వారి మొదటి భార్య వరలక్ష్మి మరణించినప్పుడు ఆయన విపరీతమైన వేదన, బాధ అంతా మూడువందల పద్యాలుగా వెలువడ్డాయి. చిక్కనైన బాధను పద్యరూపంలో వెలువరించిన ఆ కావ్యానికి వరలక్ష్మీ త్రిశతి అని పేరు. ఆమె మరణించిన ఘట్టం మొదలుకొని కర్మలు జరిగే ప్రతి సమయంలోనూ ఆమెను గుర్తుచేసుకుంటూ, ఆమె తన జీవితంలోకి వరంలా వచ్చి హఠాత్తుగా వెళ్లిపోయిందో తలుచుకుంటే రాసే శతాధిక పద్యాలకు కర్మశతకమని పేరు. ఇక స్మృతి శతకం ఆ సమయం గడచిపోయాకా నిత్యజీవితంలో పడలేక, ఆమెను గుర్తుచేసుకుంటూ రాసిన పద్యాలకు పేరు. చివరిగా స్మరణ దాటిపోయి ఆమెతో జీవించిన కాలం, ఆమె స్మృతులో తన నిత్యజీవితంలో భాగమైపోయిన విధాన్ని కన్నులకు కట్టేది నిత్యశతకం. ఇలా మూడువందల పద్యాల్లో ఆమె తనకెంత వరమో వ్రాస్తూవచ్చారు. అందులోనే వారి దాంపత్యాన్ని, ఆమె అనితరసాధ్యమైన చాకచక్యాన్ని, పాండిత్యాన్ని వర్ణించారు. ఆ రచనలో ఆయన తనతో తాను చెప్పుకుంటున్నట్టు, పక్కవారికి వివరిస్తున్నట్టు రకరకాల ఫణితుల్లో రాసిన చిక్కని కవిత్వం ఉంది. ఇదంతా భార్యావియోగ దుఃఖాన్ని భరిస్తూ పద్యాల రూపంగా వెలువడ్డ వేదనే అది.
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
అంటూ ఓ పద్యంలో ఆమె సాన్నిహిత్యం తననెలా కవీశ్వరుణ్ణి చేసిందో వివరిస్తారు. మరోసారి శ్రీరామచంద్రునికి 36 సంవత్సరాల వయస్సులో సీతావియోగం కలిగిందనీ, భార్యావియోగ దుఃఖం తనకూ అలానే 36 ఏళ్ళకు కలిగిందనీ వ్రాస్తూ ఆ దుఃఖం తెలియనిదే రామాయణ కల్పవృక్షాన్ని రాయలేనని రామచంద్రుడే ఈ దుస్థితి కల్పించాడేమోనని బాధపడ్డారు. అయితే ఆమె మరణించినప్పుడు రాసిన వరలక్ష్మీ త్రిశతిని తన వ్యక్తిగత విషయంగా పెట్టుకున్నారు. చాన్నాళ్ళు ప్రచురణ చేయలేదు. తానేదో తన వరలక్ష్మి గురించి రాసుకున్న పద్యాలు తనవి అని పెట్టుకున్నారు. అయితే తన రచనల వెనుక చోదకశక్తి అయిన ఆమె గురించి పాఠకులు తెలుసుకోవాలనుకున్నారో ఏమో రాసినాకా 20 తర్వాత మొదట వెలుగులోకి తెచ్చారు.
కవిత్వంలోనూ, రచనల్లోనూ మాత్రమే కాక నిత్యజీవితంలో కూడా ఆమెన తలుచుకుంటూనే వుండేవారు. జ్ఞానపీఠ్ పురస్కారం పొంది, అందుకునేందుకు శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడూ ఆమెనే తలచి ‘‘ఇప్పుడు మహాకవిని అంటూ పురస్కారాలిస్తున్నారు, అలాగైతే అప్పుడూ మహాకవినే. కానీ నన్ను ఇంత కవిని చేసింది ఆమె (వరలక్ష్మి). ఇప్పుడు పెద్ద మేడలో వుంటున్నాను, ఆమె ఉన్నన్నాళ్ళూ తాటాకుపాకలోనే బతికేవాళ్ళం. వానవస్తే ఆ నీళ్ళలోనే రాళ్ళుపేర్చి అమృతంలాంటి భోజనం చేసి వడ్డించేది. ఇప్పుడు అన్నీవున్నాయి, కానీ అనుభవించేందుకు ఆమె లేదు’’ అని బాధపడ్డారట. విశ్వనాథ వారు అనారోగ్యంతో ప్రాణంమీదకి వస్తే విజయవాడ నుంచి మంచి వైద్యం కోసం కారులో గుంటూరు తీసుకువెళ్తున్నప్పుడూ ‘‘గుంటూరు వెళ్తున్నామా? ఆవిడా అక్కడే వెళ్ళిపోయింది, నేనూ అక్కడికే వెళ్తున్నాను’’ అన్నారట. అప్పటికి ఆయన వయసు 80, ఆవిడ మరణించి నలభై ఏళ్ళు దాటింది, కానీ అంత్యంలో కూడా ఆమెనే గుర్తుచేసుకున్నారు. చివరకు అలానే గుంటూరులో మరణించారు.
అటువంటి విశ్వనాథ ఆమెను ఛాయామాత్రంగానైనా వర్ణించని రచనలేదు. ఆమెనే కేంద్రంగా చేసుకుని రాసినవీ వున్నాయి. చివరగా చెప్పేదేమిటంటే భార్యను కథానాయకిగానో, కావ్యనాయకిగానో చేసి రచనలు చేసినవారిని పట్టుకునేందుకు 2015 వరకూ రావాల్సిన పనిలేదు. 1920-40ల్లోనే ఉన్నారు. కులపాలికతో ప్రణయం కథావస్తువుకు పనికిరాదనుకునే లక్షణం భావకవులదే తప్ప ఇతరులకు దాన్ని ఆపాదించలేము.
Narayanaswamy
చాలా బావుంది. ఎత్తుగడ చదవగానే వేయిపడగలులో అరుంధతే తోచింది నాకు. అదే రాశారు. చక్కగా రాశారు.
కామేశ్వరరావు
కావ్య ప్రబంధ కవులు తమ భార్యలను వర్ణించలేదేమని ప్రశ్నించడం పూర్తిగా అసందర్భమే. అది ఎంత అసందర్భమో, అసమంజసమో, కావ్య నాయికలకు భార్యలు స్ఫూర్తి అనీ, ఇంకా మరో అడుగు ముందుకు వేసి భార్య ప్రతిరూపమే నాయిక అనీ (కాళిదాసు మేఘసందేశ కావ్యంలో) అనడం కూడా అంతే అసందర్భం, అసమంజసమూను! ఇది ఎంత అనుచితమో యీ వాదనను రామాయణ కావ్యానికి కూడా పొడిగిస్తే బోధపడుతుంది.
అసలిది మన ప్రాచీన కావ్యసిద్ధాంతానికే పూర్తిగా విరుద్ధం! రసం అనేది కావ్యానికి ప్రాణమని ఇంచుమించు ఆలంకారికులు అందరూ ఒప్పుకొన్న విషయమే. సామాజికుకలో (పాఠక/ప్రేక్షక/శ్రోతలు) రస నిష్పత్తి జరగడానికి ఒక ప్రధానమైన అంశం “సాధారణీకరణ”. అంటే, ఒక పాత్ర ఒక ప్రత్యేక వ్యక్తిగా కాకుండా, ఆయా సందర్భాలలో పోషింపబడే భావాలు నిలిచేందుకు ఆధారంగా మాత్రమే (అందుకే వాటికి “పాత్ర” అనే పేరు వచ్చిందని కూడా కొందరు చెప్పారు) ఉంటుంది. అప్పుడే సామాజికునిలోకూడా ఆ భావం స్థిరంగా నిలిచి రసంగా అభివ్యక్తమవుతుంది. అభిజ్ఞానశాకుంతలంలో శకుంతలా దుష్యంతుల శృంగారసన్నివేశాన్ని చదివే పాఠకులకు అక్కడున్నది శకుంతల, దుష్యంతుడు, అనే జ్ఞానం ఉన్నంత సేపూ అతనిలో/ఆమెలో శృంగారరసం అభివ్యక్తం కాలేదు. ఆ పరిధి దాటి, వారిద్దరూ శృంగారభావాలకు ఆలవాలమైన ఒక జంటగా మాత్రమే తోచినప్పుడు ఆ భావం పాఠకులలో కూడా నిలుస్తుంది. అదే రసం. ఈ ప్రక్రియనే సాధారణీకరణ అంటారు. ఇది జరగాలంటే, కావ్యంలో వ్యక్తులు కేవలం కల్పిత పాత్రలు కావాలి. ముఖ్యంగా శృంగారరసానికి యిది చాలా అవసరం. అంచేత కవులు కూడా తమ దర్శనశక్తి చేత ఆ పాత్రలను చిత్రిస్తారే తప్పిస్తే నిజజీవిత వ్యక్తులను కావ్యాలలో చిత్రిస్తారనడం అసంబద్ధం. ఆధునిక మనోవైజ్ఞానిక సిద్ధాంతాల బట్టి అలాంటి ప్రభావం ఉంటుందని అనుకొన్నా, అది అసంకల్పితంగా, కవికి తెలియకుండానే జరిగే ప్రక్రియగానే భావించడం ఉచితం.
సమాజంలో వ్యక్తిప్రాధాన్యం పెరిగడం వల్ల, విమర్శలో చోటుచేసుకొన్న పరిణామంలో భాగమిది. కావ్య కర్తృత్వాన్ని గురించిన చర్చ దీనికి మొదటి స్థాయి. కవుల వ్యక్తిగత జీవితాలకూ కావ్యానికీ ముడిపెట్టడం దానికి పై స్థాయి!
సరే ఆధునికకాలంలో వచ్చిన భావకవిత్వంలో ఆత్మాశ్రయత్వం ఒక భాగం కాబట్టీ, భావకవులు తమ వ్యక్తిగత జీవితంలోని అంశాలనూ, వ్యక్తులనూ తమ కవిత్వంలో భాగం చేసారు కాబట్టీ, వారి గురించి యీ ప్రశ్నను సంధించడం కొంతవరకూ సబబే. అయితే వారి కవిత్వంలో కనిపించే “ప్రేయసు”లకూ, భార్యలకూ ముడిపెట్టడం, భావకవిత్వంలోని “ప్రణయతత్త్వా”న్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. విశ్వనాథవారిలా ఒకరిద్దరు నేరుగా భార్యగూర్చిన కవిత్వం వ్రాసినవారున్నారు (అది కూడా భావకవిత్వంలో భాగమే). నాకు తెలిసినంతలో అదంతా “స్మృతి కవిత్వ”మే, అదొక విశేషం! భావకవులకన్నా ముందే, గురజాడ తోకచుక్క గేయంలో కవిగారి భార్య ప్రస్తావన ఉంది. ఆ కవిత ఉత్తమపురుషలోనే సాగుతుంది. అయినా అందులో ప్రస్తావించబడినది గురజాడవారి భార్యే అని అనడానికి లేదు. అసలా ప్రశ్నే అప్రస్తుతం!
“పూని యూదెడు నెరజాణ! ప్రొయ్యి మీద
నలుక గొనబోకు, రక్తపాటల సుగంధ
మైన నీ యూర్పుజవులకు నాస గొనుచు
పొగలెగయుగాని మండదీ ప్రొయ్యి నగ్ని”
అని కొన్ని వేలయేళ్ళ కిందట చెప్పిన యీ మనోజ్ఞమైన పద్యం తన భార్య గురించి కవి చెప్పినదే కదా! గాథాసప్తశతి నిండా ఇలాంటి ఇంటింటి గాథలే! తమాషా ఏమిటంటే, ఇవి రసానంద కారకాలే! వాటికి కర్తృత్వశృంఖలాలు లేవు కాబట్టి అది సాధ్యమయ్యింది.
నీహారిక
కవులెందరో భార్యలనో,ప్రియురాళ్ళనో తలుచుకుంటూ భావగీతాలు వ్రాసినవారు ఉన్నారు. భర్తగురించి కానీ ప్రియుని గురించి కానీ చిన్న పద్యం కానీ పాట కానీ వ్రాసిన స్త్రీలు ఎవరైనా ఉన్నారా ? అందరూ పాటల రచయతలే కానీ పాటల రచయిత్రులు సినీరంగం లో గానీ బయట గానీ ఎవరైనా ఉన్నారా ? తెలుపగలరు.
తాడిగడప శ్యామలరావు
కాళిదాసు మేఘసందేశంలో యక్షుని శాపావధిని ప్రస్తావిస్తూ, వర్షభోగ్యేణ అని ఒక సంవత్సరకాలమే శాపానుభవకాలపరిమితిగా చెబుతారు.
వ్యాసకర్తగారు, ఆ యక్షుడు కారాగారవాసం మరో ఏడాదిలో ముగిసిపోతుందనగా తన భార్యకు సందేశం పంపడానికి ఓ మేఘాన్ని వాడుకుంటాడని అనటం పొరపాటు.
ఈ చిన్నవిషయం ప్రక్కన పెడితే ఈ వ్యాసం చాలా బాగుంది.
వురుపుటూరి శ్రీనివాస్
కారాగారం కాదు, ప్రవాస శిక్ష కదా?