The Art Of Living – Sharon Lebell
వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
(ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.– పుస్తకం.నెట్)
*******
కొన్ని పుస్తకాలు మనదగ్గర చాలాకాలంగా ఉన్నా సమయం వచ్చినప్పుడు కాని మన దృష్టివాటిమీదకి పోదు. గత కొన్నాళ్ళుగా చెప్పలేని మనోవేదనని అనుభవిస్తున్న నాకు నా అల్మైరాలో చాలాకాలంగా నా చేతులకోసం ఎదురుచూస్తున్న పుస్తకమొకటి కనబడింది. అది The Art Of Living: The Classic Manual on Virtue, Happiness and Effectiveness (హార్పర్ కాలిన్స్, 2005). షారోన్ లెబెల్ అనే రచయిత్రి, సంగీతసాధకురాలూ ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా ఎపిక్టెటస్ కు చేసిన అనువాదం.
ఎపిక్టెటస్ (క్రీ.శ్ 55-135) ప్రసిద్ధ గ్రీకు-రోమన్ స్టోయిక్ తత్త్వవేత్తల్లో ఒకడు. రోమన్ సామ్రాజ్యపు తూర్పు సరిహద్దుల్లో జన్మించి జీవితం అధికభాగం బానిసగా జీవించాడు. ఆ కాలంలోనే ఎవరో యజమాని అతణ్ణి హింసించడంతో అవిటివాడిగా కూడా మారాడు. కొన్నాళ్ళకు బానిసత్వం నుంచి బయటపడ్డాక ఒక తాత్త్వికుడిగా సంచరించాడు క్రీ.శ 94 లో రోమన చక్రవర్తి డొమితియన్ తత్త్వవేత్తల్ని రోం నుంచి బహిష్కరించడంతో, వాయవ్య గ్రీసులోని నికొపొలిస్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడే ఒక పాఠశాల నడుపుకుంటూ జీవించాడు. నిరాడంబరంగా చిన్న కుటీరంలో ఒక సాధుసత్తముడిగా జీవిస్తూ చేసిన బోధల్ని అతడి శిష్యుడు అరియన్ అనే యువకుడు గ్రంథస్థం చేసాడు. ఎనిమిది సంపుటాలుగా సంకలనమైన ఆ బోధనల్లో ప్రస్తుతం నాలుగు సంపుటాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వాటిల్లో Discourses నుంచీ, Enchiridion (Manual) నుంచీ కొన్ని భాగాల్ని షారోన్ అనువదించింది.
ఆ అనువాదాన్ని చదువుతుంటే రెండువేల ఏళ్ళ కిందటి రచన చదువుతున్నట్టు లేదు. ఇప్పటి సామాజిక జీవితంలో ఒత్తిళ్ళని తట్టుకోలేని యువతీయువకులకోసం గొప్ప మనస్తత్వ శాస్త్రజ్ఞుడు రాసిన కరదీపికలాగా ఉంది. ఆ మాటే షారోన్ కూడా అంది. ఆమె ఇలా రాసింది:
‘మన రోజువారీ జీవితం అనేకరకాల సమస్యల్తో అతలాకుతలమవుతున్నదని ఎపిక్టెటస్ గుర్తించాడు.మనిషి బాహ్య పరిస్థితులెట్లాగైనా ఉండనివ్వు, అయినా అతడు సంతోషం, జీవనసాఫల్యం, ఆంతరంగిక ప్రశాంతిని పొందడమెట్లా అన్నదాని గురించే ఎపిక్టెటస్ ఆలోచిస్తూ వచ్చాడు. తమని ఆవరించిన ప్రాచీన సందర్భంనుంచి ఆ రచనల్ని విడదీసి చదివితే అవి నేటికాలపు సమాజానికి ఎంత సన్నిహితంగా కనిపిస్తాయో చెప్పలేం. అవి మనకాలపు అత్యున్నత మనస్తత్వశాస్త్రంలాగా కనిపిస్తాయి… ఆ మాటకొస్తే వ్యక్తి తనని తాను సర్దుకోవడం గురించి బోధించే ఆధునిక మనస్తత్వశాస్త్రానికి ఎపిక్టెటస్ చింతనాధోరణి కూడా ఒక మూలమని చెప్పవలసిఉంటుంది.’
ఎపిక్టెటస్ ఒక బానిసగా జీవించి మాట్లాడిన మాటల వల్ల అందరికన్నా ఎక్కువ ప్రభావితుడైన వాడు మార్కస్ అరీలియస్ (121-180). The Philosopher-King గా ప్రసిద్ధి చెందిన అరీలియస్ రాసుకున్న The Meditations మీద ఎపిక్టెటస్ ప్రభావం సుస్పష్టం. నిష్టురమైన కాలంలో జీవించవలసి వచ్చిన ఒక బానిసా, ఒక చక్రవర్తీ కూడా ఒక్కలాగే ఆలోచించడం చూస్తే తత్త్వశాస్త్రాన్ని కాలం నిర్ణయించినట్టుగా వ్యక్తులు నిర్ణయించలేరని తెలుస్తోందన్నాడు రస్సెల్. కాని ఆయనే మరో మాట కూడా అన్నాడు. క్రీస్తు పూర్వపు ఆరవశతాబ్ది ఏథెన్సు సామాజికంగా క్రీస్తు శకం రెండవ శతాబ్ది రోం కన్నా ఎంతో మెరుగైందే కాని, ప్లేటో ఊహించగలిగిన ఆదర్శలోకం కన్నా ఎపిక్టెటస్ భావించగలిగిన ఆదర్శజీవితం మరెన్నో రెట్లు ఉన్నతమైనదని. అంటే ఏమిటి? ఒక మనిషి సంభావించుకోగల ఆదర్శజీవితానికీ , అతడి బాహ్యపరిస్థితుల పరిమితులు ఆటంకం కాదనే కదా.
ఇదే స్టోయిక్ చింతనలో, ఎపిక్టెటస్ లో కనవచ్చే అత్యంత విలువైన అంశం. ఈ ప్రపంచం, మానవజీవితం ఒక నిశ్చయగతిని అనుసరించి నడుస్తున్నాయనే Determinism వారిది. కాని, అలాగని మానవుడు పరిస్థితులకి బానిస కాడు. అతడికొక స్వేచ్ఛా సంకల్పముంది (Free Will). అతడు తన మానసిక శక్తుల్ని, తన ఆలోచనాక్రమాన్ని తాను నిర్ణయించుకోగలడు. ఈ సమన్వయం స్టోయిక్కులు ప్రపంచానికిచ్చిన అత్యున్నతమైన ఉపాదానం.
బాహ్య ప్రకృతి కొన్ని చలనసూత్రాల ప్రకారం నడుస్తోందని 17 వ శతాబ్దిలో న్యూటన్ చెప్పినప్పుడు, మొత్తం మానవ స్వాతంత్ర్యమంతా ఒక పుకారుగా మారిపోయినప్పుడు, ఆ పరిస్థితినుంచి మానవ సంకల్పాన్ని పైకి లేవనెత్తడానికి ఇమ్మాన్యుల్ కాంట్ కి ఉపకరించింది ఈ స్టోయిక్కుల సమన్వయమే. ఇప్పుడు బాహ్యసమాజం మన ఆలోచనా ధోరణిమీదా, మన ప్రశాంతి మీదా ఆక్రమణ చేస్తున్నప్పుడు మనకీ, లోకానికీ మధ్య సమన్వయమెట్లా సాధించుకోవాలా అనే మీమాంసకి ఎపిక్టెటస్ ఆలోచనలొక దిక్సూచి అనడంలో అతిశయోక్తి లేదు.
తన ఆలోచనల్ని వివరించడానికి మొదలుపెడుతూనే ఎపిక్టెటస్ ఇలా అంటున్నాడు:
‘మనం ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థంచేసుకోవడం మీదనే మన సంతోషం, స్వాతంత్ర్యం ఆధారపడ్డాయి.అదేమంటే, కొన్ని సంగతులు మన చేతుల్లో ఉన్నాయి. కొన్ని మన చేతుల్లో లేవు. ఈ ముఖ్య, మూల సూత్రాన్ని నువ్వు అర్థం చేసుకుంటేనే, నీ చేతుల్లో ఉన్నదేదో, లేనిదేదో తెలుసుకున్నాకనే నీ ఆంతరంగిక ప్రశాంతీ, బయటి సామర్థ్యమూ ఒనగూడతాయి.‘
ఆయన మాటల సారాంశాన్ని షారోన్ ఇట్లా సంగ్రహంగా చెప్పింది:
‘చాలా సరళ, సామాన్య, దైనందిన జీవితానికి అనువైన పద్ధతిలో ఎపిక్టెటస్ మనిషి నడవడిక ఎలా ఉండాలో వివరించాడు. మనం మన మంచితనాన్ని అసాధారణంగా, ఆడంబరంగా, వీరోచితంగా ప్రకటించడం కన్నా ఈశ్వరసంకల్పం ప్రకారం స్థిరంగా, సరళంగా ప్రకటించే జీవితం పట్ల అతడెక్కువ మొగ్గు చూపాడు. చక్కటి జీవితం గురించి అతడు చెప్పిన విషయాలు మూడు సూత్రాల మీద ఆధారపడ్డాయి: నీ కోరికల్ని అదుపు చేసుకోవడం, నువ్వు చెయ్యవలసిన పనులు సక్రమంగా చెయ్యడం, నీ గురించీ, తక్కిన ప్రపంచంతో నువ్వు నడుచుకోవలసిన తీరు గురించీ స్పష్టంగా ఆలోచించుకోవడం.‘
ఈ విషయంలో ఎపిక్టెటస్ Enchiridion (Manual) భగవద్గీతనీ, దమ్మపదాన్నీ, తిరుక్కురళ్ నీ, తావో తేచింగ్ నీ, సువార్తల్నీ సహజంగానే గుర్తుకుతెస్తుంది. అయితే వాటికన్నా ఎపిక్టెటస్ మరింత ఆచరణాత్మకంగా, మరింత మానవసన్నిహితంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ రచన నేటికాలపు ఒక Self-Help Manual గా కనిపించి నాకు కొత్తబలాన్ని అందించింది.
అందులోంచి కొన్ని వాక్యాలు మీ కోసం:
1. దేన్నైనా గట్టిగా కావాలనుకోవడంగాని, వద్దనుకోవడంగాని, చాలా శక్తివంతమైనవేకాని, అవి కేవలం అలవాట్లు మాత్రమే. ప్రయత్నిస్తే మనమంతకన్నా మంచి అలవాట్లే అలవర్చుకోగలుగుతాం.నీ చేతుల్లో లేని విషయాలపట్ల కలత చెందుతుండే అలవాటుని అదుపుచేసుకోవడం నేర్చుకో. అందుకు బదులు నీ చేతుల్లో ఉండి నీకు మేలుచెయ్యనివాటిని నిగ్రహించడం మొదలుపెట్టు.
2. నిన్ను బాగా సంతోషపెడుతున్న విషయాలగురించి ఒక్కసారి ఆలోచించు- నువ్వు వాడుతున్న పనిముట్లు, నువ్విష్ట పడుతున్న మనుషులు. కాని ఒకటి గుర్తుపెట్టుకో, వాటి గురించి మనమేమనుకుంటున్నామన్నదాంతో సంబంధం లేకుండా వాటికంటూ వాటికొక ప్రత్యేక ధర్మం కూడా ఉంటుంది. ఉదాహరణకి, నువ్వు బాగా ఇష్టపడుతున్న చిన్నచిన్న విషయాలతోటే మొదలుపెట్టు. నీకు బాగా ఇష్టమైన మట్టిపాత్ర. నీకదంటే బాగా ఇష్టం. కాని గుర్తుపెట్టుకో. అది మట్టిపాత్ర. ఏదో ఒక రోజు పగిలిపొయ్యేదే. అట్లాపగిలిపోయినప్పుడు తట్టుకోగలగడం కూడా నేర్చుకో. అట్లాగే నీకు ఇష్టమైన మనుషుల విషయంలో కూడా.
3. విషయాలు వాటంతటవే మనల్ని బాధపెట్టేవీ కావు, అడ్డగించేవీ కావు. అలాగే మనుషులు కూడా. మనమా విషయాల్నెట్లా చూస్తున్నామన్నది వేరే సంగతి. కాని విషయాలపట్లా, మనుషుల పట్లా మన వైఖరి, మన ప్రతిస్పందనలు-అవే మనని బాధపెట్టేది… మన బాహ్యపరిస్థితులెలా ఉండాలో మనం శాసించలేం. కాని వాటిపట్ల ఎలా ప్రతిస్పందించాలన్నది మాత్రం పూర్తిగా మన చేతుల్లో ఉన్న విషయమే.
4. మనం నైతికంగా పురోగమిస్తున్నామన్నదానికి స్పష్టమైన ఒక కొండగుర్తు ఇతరుల్ని తప్పుపట్టే గుణం మనలో నెమ్మదిగా తగ్గిపోతుండటమే. ఊరకనే ఎదుటివాళ్ళను వేలెత్తి చూపడం నిరర్థకమని గ్రహించడమే.
5. ఏదీ మననుంచి దేన్నీ కాజెయ్యలేదు. మనం పోగొట్టుకునేదంటూ ఏదీ లేదు.’నేనిది పోగొట్టుకున్నాను’ అనుకోవడం మానేసి ‘నేను ఫలానాదాన్ని ఎక్కణ్ణుంచి తెచ్చుకున్నానో అక్కడే పెట్టేసాను’ అని ఎప్పుడనుకుంటావో అప్పుడే నీ ఆంతరంగిక ప్రశాంతి మొదలవుతుంది.
6. నీ జీవితం నువ్వొక విందుకు వెళ్ళడంలాంటిది. నువ్వక్కడ చాలా హుందాగా ప్రవర్తించవలసిఉంటుంది. నీ ముందు వంటకాల వడ్డన సాగుతున్నప్పుడు నువ్వు మితంగా హుందాగా వడ్డించుకోవాలి. వడ్డించేవాళ్ళు నీ ముందు ఆగలేదా, నీ పళ్ళెంలో ఏముందో దానిమీదే దృష్టిపెట్టాలి. వడ్డించేవాళ్ళింకా నీ వైపు రాలేదా, ఓపిగ్గా ఎదురుచూడాలి.
7. నువ్వు అత్యున్నతమైన నువ్వుగా మారడం మీద తప్ప మరిదేని మీదా దృష్టిపెట్టకు. ఎందుకంటే, నువ్వు నువ్వుగా మారడం పూర్తిగా నీ చేతుల్లో ఉన్నదే.
8. నిన్ను అవమానించడం, బాధపెట్టడం ఎవరివల్లా కాదని గుర్తుపెట్టుకో. ఎవరైనా నిన్ను తిడితే, కొడితే, నువ్వు అవమానానికి గురయ్యావని అనుకుంటే. అది అవమానానికి గురయ్యావని నీకు నువ్వు చెప్పుకోవాలని అనుకోవడం తప్ప మరేమీ కాదు.
9. ప్రతి దానికీ రెండు హాండిల్సు ఉంటాయి. దాన్ని పట్టుకోవడానికి ఉపయోగించేదొకటి, పట్టుకోడానికి వీలుకానిది మరొకటి. ఉదాహరణకి నీ అన్నదమ్ముడో, అక్కచెల్లెలో నీతో సరిగ్గా ప్రవర్తించలేదనుకో, అప్పుడు నువ్వు బాధపడితే నువ్వా విషయాన్ని పట్టుకోలేని హాండిల్ వైపు పట్టుకోవడానికి చూసినట్టు. అలా కాకుండా, ఆ బాంధవ్యాన్ని పట్టుకోగలిగే హాండిల్ వైపు పట్టుకోవడానికి ప్రయత్నించు. అంటే, మీ మధ్య ఉన్న బాంధవ్యం చిన్నప్పుణ్ణుంచీ, తల్లికడుపునుంచీ మొదలయ్యిందనీ, అది కలకాలం ఉండవలసిందనీ, దాన్నెట్లాగైనా నిలుపుకోవాలనీ ఆలోచించు.
10. నిజమైన సంతోషం నామవాచకం కాదు, క్రియాపదం.
Leave a Reply