వాడ్రేవు వీరలక్ష్మిదేవి

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
(ఈ వ్యాసం రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి గారి పుట్టీన రోజు సందర్భంగా మొదట చినవీరభద్రుడు గారు జులై 2014లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు. వ్యాసానికి జతచేసిన చిత్రం సారంగ వారపత్రికలో వీరలక్ష్మి గారు చలం గురించి రాసిన వ్యాసం నుండి స్వీకరించబడీనది. – పుస్తకం.నెట్)
*****
ఈ రోజు మా అక్క పుట్టిన రోజు. ఆమె 1954 లో పుట్టింది. ఇప్పటికి 60 యేళ్ళు పూర్తి చేసుకుంది. ఒక మనిషి జీవితంలో అరవయ్యేళ్ళు పూర్తవడం మామూలు విషయం కాదు. కాలచక్రం ఒక పూర్తి పరిభ్రమణం పూర్తి చేసుకున్నట్టు. ఆమె జీవితం అబ్దుల్ కలాం జీవితం లాగా ఒక విజేత కథ. అయితే దాన్నామె ఒక ఆత్మకథగా ఇంకా రాయవలసే ఉంది.

మా అక్క వాడ్రేవు వీరలక్ష్మి దేవి విశాఖపట్టణం జిల్లా ప్రస్తుతం కొయూరు మండలంలో ఉన్న తోటలూరు అనే చిన్న గిరిజన గ్రామంలో పుట్టింది. అది మా అమ్మ పుట్టిల్లు. ఆ ఊరు ఇప్పటికీ చిన్ని పల్లె. అక్కణ్ణుంచి ఈ అరవయ్యేళ్ళల్లో ఆమె ఎంత ప్రయాణం చేసిందని. మా మొత్తం తాలూకాలోనే ఆమె మొదటి పోస్ట్ గ్రాడుయేటు. మా మొత్తం తరంలోనే ఆమె మొదటి లెక్చరర్. మొదటి మహిళా రచయిత. రోడ్డూ, కరెంటూ, హైస్కూలూ, కాలేజీ, రేడియో, వార్తాపత్రికా లేని ప్రాంతంనుంచి ఆమె విద్యావంతురాలిగా, భావుకురాలిగా,జీవితదార్శనికురాలిగా మారడం వెనక, తన జీవితం మీద తాను సాధికారికత సంపాదించుకోవడం వెనక ఆమె చేసిన ప్రయాణం, పడ్డ కష్టాలూ మామూలు మామూలు విషయాలు కావు. అవన్నీ ఆమె అక్షరరూపంలో పెడితే ఈనాటి యువతీయువకులకి ఆ అనుభవాలనుంచి నేర్చుకోవలసింది ఎంతో కనిపిస్తుంది.

మా అక్క కన్నా నేను తొమ్మిదేళ్ళు చిన్నవాణ్ణి. ఆమె గురించిన నా జ్ఞాపకాలు నా అయిదో ఏటనుంచో, ఆరో ఏటనుంచో మొదలయ్యాయనుకుంటే, దాదాపు 45 ఏళ్ళ జ్ఞాపకాల పరంపరనంతా నేను తలుచుకోవలసి ఉంటుంది. కాని ఒక్కమాటలో చెప్పాలంటే, మా అమ్మ నా పార్థివ శరీరానికి జన్మనిస్తే మా అక్క నా భావుక శరీరానికి జన్మనిచ్చింది. మా అక్కే లేకపోతే నాకు సాహిత్యమంటే ఏమిటో, సౌందర్యమంటే ఏమిటో తెలిసిఉండేవి కావు. మా శరభవరంలో మా చిన్నప్పటి వసంతకాలపు అడవి, వైశాఖమాసపు అపరాహ్ణాలూ, వర్షాకాలమంతటా ఎడతెరిపిలేకుండా కమ్ముకునే ముసురూ, శరత్కాలాల వెన్నెల రాత్రులూ, హేమంత సంక్రాంతీ నన్ను సమ్మోహపరిచేవంటే అందుకు కారణం వాటిని నేను మా అక్క కళ్ళతో చూసినందువల్లనే.

ఆడపిల్లని చదివించడం ఆ రోజుల్లో కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. కాని మా నాన్నగారు ఆమెని చదివించినందుకు ఆమె మా నాన్నగారినీ, మా కుటుంబాన్నీ కష్టసమయంలో రెండు చేతులా ఆదుకుంది. ముగ్గురు తమ్ముళ్ళనీ, నలుగురు చెళ్ళెళ్ళనీ చదివించి వాళ్ళకొక జీవితాన్ని సమకూర్చింది. ఆమె సాహిత్యజీవితం అంతా ఒక ఎత్తూ, ఈ కృషి ఒక్కటీ ఒక ఎత్తు. ఈ ప్రయాణంలో ఆమె చూసిన ఎగుడుదిగుళ్ళు ఎక్కడా రాయకపోయిఉండవచ్చు, కానీ మా హృదయాల్లో మాత్రం అవి చెక్కుచెదరకుండా ఉంటాయి.

మా అక్క గొప్ప ఉపాధ్యాయురాలు. ఆమె తరగతిగదిలోనూ, బయటకూడా కనీసం రెండుతరాల్ని ప్రభావితం చేసింది. ఇప్పటికీ యువతీయువకులు ఆమె చుట్టూ మూగుతారంటే ఆమెలోని గురువుకున్న గురుత్వాకర్షణ శక్తినే అందుకు కారణం. మల్లంపల్లి శరభయ్యగారూ, భమిడిపాటి జగన్నాథరావుగారూ వంటి మహనీయులు ముందు ఆమెకు గురువులు, ఆమెకి తమ్ముణ్ణైనందున నాక్కూడా గురువులు. ‘ఉత్తమోత్తమ గురుల శిష్యుండనైతి/గురుడనైతిని సచ్ఛిష్య కోటులకును’ అని కవి అన్న మాటలు ఆమె విషయంలో అక్షర యథార్థాలు.

మా అక్క గొప్ప కథకురాలు అని నేను మళ్ళా చెప్పనవసరం లేదు. ‘ఉత్సవసౌరభం’ ‘కొండఫలం ‘ కథాసంపుటాలు చదివినవాళ్ళకి ఈ సంగతి తెలుసు. స్త్రీ సమస్యలకి పరిష్కారం ఆర్థికస్వాతంత్ర్యంతో ఆగదనీ, అక్కణ్ణుంచి మళ్ళా మరొక కొత్త ప్రయాణం,పోరాటం మొదలవుతాయనీ ఆమె గత ముఫ్ఫై యేళ్ళుగా చెప్తూ వచ్చింది. నాకు తెలిసి ఆమె ’24 కారెట్ ‘ కథ (1983) రాసేనాటికి తెలుగు సాహిత్యంలో మిలిటెంట్ స్త్రీవాదసాహిత్యమేదీ ప్రభవించనేలేదు ( బహుశా ఒక్క రాజమండ్రి సావిత్రి రాసిన ‘ఈ దేశంలో ఇదో వర్గం ‘ కథ ఒక్కటీ మినహాయిస్తే). కాని అక్క చూపించిన ఈ ముందు చూపుకి తెలుగు సాహిత్యలోకం, విమర్శకులు ఆమెకి ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వకపోవడం నాకు చాలా మనసుకి కష్టం కలిగిస్తుంది. ఇరవయ్యవ శతాబ్ది తెలుగు రచయిత్రుల రచనలతో సాహిత్య అకాదెమీ కోసం అబ్బూరి ఛాయాదేవి రూపొందించిన సంకలనంలో అక్క రచన లేకపోవడం పెద్ద లోటు.కాని జీవితమంతా విలువలకోసం నిలబడే అక్కలాంటి రచయిత్రి పేరుకోసం పాటుపడకపోవడం వల్ల ఇట్లాంటి సాహిత్యతప్పిదాలు తప్పవనుకుంటాను.

ఆమె కొంత సాహిత్య విమర్శ, సమీక్షా కూడా చేసింది. ‘సాహిత్యానుభవం’ పేరిట వచ్చిన ఆ వ్యాస సంకలనం ఆధునిక తెలుగువిమర్శలో లెక్కపెట్టదగ్గ పుస్తకాల్లో ఒకటని అనుకుంటాను. గత నాలుగైదేళ్ళుగా చినుకు మాసపత్రికలో ఆమె భారతీయనవలల్లో ఉత్తమరచనల్ని తెలుగుపాఠకులకి పరిచయం చేస్తూ వస్తున్నది. ఈ కృషిలో ఆమెని మాలతీచందూర్ తో పోల్చకుండా ఉండటం కష్టం.

ఇవి కాక ఆమె కాలమిష్టుగా రాసిన ఆణిముత్యాల్లాంటి రచనలు ‘ఆకులో ఆకునై’ ‘మా ఊళ్ళో కురిసిన వాన ‘ పేరిట పుస్తకరూపంలో తెచ్చింది. వాటిని ఆరాధ్యగ్రంథాల్లాగా పఠించే భావుకపాఠకుల్ని నేను స్వయంగా చూసాను.

జీవితం ఇన్నాళ్ళుగ ఆమె మీద పెట్టిన బరువుని ఇప్పుడు కొంత దించి ఆమెకి వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడామె చెయ్యవలసిన పనులు చాలా వున్నాయి. మొదటిది ఆమె ఎప్పుడో రాసిన ‘వెల్లువ’ నవల తరువాత మళ్ళా మరే నవలా రాయలేదు. ఆమె నుంచి కనీసం రెండు మూడు అత్యుత్తమ నవలలు రావలసి ఉంది. భారతీయ నవలల్లో ఉత్తమోత్తమ రచనల్ని చదివినందువల్లా, అటువంటి నవలలు తెలుగులో రావట్లేదని నాలానే తను కూడా ఆవేదన చెందుతున్నందువల్లా అట్లాంటి లోటు ను పూరించవలసిన బాధ్యత ఆమెదే అనుకుంటాను.

మరొకటి ముందే చెప్పినట్టు, ఆమె అరవయ్యేళ్ళ జీవనయానాన్ని గ్రంథస్థం చెయ్యడం. శరభవరం, రాజవొమ్మంగి, యేలేశ్వరం, రాజమండ్రి, కాకినాడలు ఈ అరవయ్యేళ్ళల్లో అనూహ్యంగా మారిపోయాయి. ఆ మార్పు, వ్యక్తుల్లో, కుటుంబాల్లో, వ్యవస్థలో వచ్చిన ఆ మార్పుని ఆమె కాకపోతే మరెవరు చెప్పగలుగుతారు?

మూడవది, ఆమె మల్లంపల్లి శరభయ్యగారి శిష్యురాలు. ప్రాచీన తెలుగుసాహిత్యం గురించి నేటి తరానికి అర్థమయ్యేలా పరిచయగ్రంథమొకటి రాసి గురువు ఋణం తీర్చుకోవలసి ఉంటుందామె.

You Might Also Like

4 Comments

  1. సత్యనారాయణ

    వారి గురించి వినడమేగాని వారి రచనలేవీ చదవలేదు. తెలిపిన వివరాలకి కృతజ్ఞుడిని.
    వ్యాసం ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంది.

  2. Raghavendra

    ఇలా ప్రతిభ కలవారిని గుర్తించడమూ, ప్రోత్సహించడమూ చేయవలసిన పని. ఈవ్యాసం మరింత మందికి స్పూర్తి కలిగించాలని కోరుకుందాము.

  3. తృష్ణ

    ఆలస్యంగా చూస్తున్నానండి.. బాగుంది. వీరలక్ష్మి గారు మీరు చెప్పిన రచనలన్నింటినీ పూర్తి చేయాలని కోరుకుoటున్నాను.

Leave a Reply