The Groaning Shelf – Pradeep Sebastian
2011లో నేను దేశం వదిలి వస్తున్నప్పుడు నాకూడా తెచ్చుకున్న ఏకైక పుస్తకం – ప్రదీప్ సెబాస్టియన్ రాసిన “the groaning shelf”. కొన్నాళ్ళ క్రితం వరకు హిందూ పత్రికలో ప్రతి నెలా మొదటి ఆదివారం వచ్చే “లిటరరీ రివ్యూ”లో సెబాస్టియన్ వ్యాసాల కోసం నేను విపరీతమైన కుతూహలంతో ఎదురుచూసేదాన్ని. కారణం, అతనేదో నాకు తెల్సిన పుస్తకాల గురించి రాస్తాడు అని కాదు. ఒక్కటంటే ఒక్కసారి కూడా నేను చదివిన పుస్తకం దేని గురించీ అయన రాలేదు. కానీ, ఆయన రాసింది చదవడం లో ఒక ఆనందం ఉంది. తనకి పుస్తకాలపై ఉన్న ప్రేమను వ్యక్తీకరించడంలో అయన ఎక్కడా తగ్గకపోవడం అందుకు కారణం కావొచ్చు. నాకు మరీ భయంకర పుస్తక ప్రేమ లేకపోయినా, పుస్తకాలను ప్రేమించే వారంటే మాత్రం ప్రత్యేకమైన ప్రేమ. పుస్తకాలను గురించి వచ్చే పుస్తకాల గురించీ, వాటిని రాసే వెర్రి ప్రేమికుల గురించి చాలా కుతూహలం. ఈ పుస్తకంలోని వ్యాసాలు సరిగ్గా వాళ్ళ గురించే. సరిగ్గా వాటి గురించే.
“I began to look at books, really look at them, when I stopped reading. .. .. Holding a book but not actually reading it gave me time (and put me in the mood) to reflect on the act of reading and the physicality of the book; the book as material object. (Didn’t that high priest of scholar-collectors, Walter Benjamin, once make a case for the true bibliophile as the one who never reads her books?) I found myself drawn deeper and deeper into the culture and tradition of bibliophily: first and rare editions, bibliography, book history, the literature of collecting and the antiquarian book trade. When browsing in bookstores, I was drawn most to books that addressed the passion for reading and book collecting. The literary subgenre, I discovered, had a name: Books on Books, or Books about Books. The bibliophile’s dream-genre.”
– అని ప్రదీప్ సెబాస్టియన్ పుస్తకం ముందుమాటలో రాసిన వాక్యాలే ఈ పుస్తకం దేని గురించంటే జవాబు.
పుస్తక సేకరణలో ఉన్న ఆనందాలు, ఆరాటాలు, కష్టనష్టాలు, పాత బంగారాల కొనుగోళ్ళు, పాతపుస్తకాలలోనే ప్రత్యేకం వ్యాపారం నిర్వహించే ఆన్టీక్ డీలర్లు, పుస్తకాల గురించి పుస్తకాలు, వాటిని రాసే రచయితలు, ఫస్ట్ ఎడిషన్ల పిచ్చి, వ్యక్తిగత లైబ్రరీలు, పుస్తక చోరులు-వాళ్ళ కారణాలు -ఇలా పుస్తక లోకపు పౌరుల గురించి, ఇతర జీవ-నిర్జీవ సభ్యుల గురించీ రాసిన వ్యాసాల కలబోతే ఈ పుస్తకం. రచయితల గురించి, వాళ్ళ రచనల గురించీ కూడా కొన్ని వ్యాసాలు ఉన్నాయి. ఇందులో కొన్ని వ్యాసాలు “హిందూ” పత్రిక “లిటరరీ రివ్యూ” లో సెబాస్టియన్ “ఎండ్ పేపర్” శీర్షికన గత దశాబ్ద కాలంలో వచ్చినవే. మరికొన్ని ఇతరత్రా పత్రికల్లో వచ్చాయి అనుకుంటాను.
పుస్తకంలోని వ్యాసాలను తొమ్మిది భాగాల కింద విభజించారు: “The Pleasures of Bibliophily”, “Editions” (ఫస్ట్ ఏడిషన్లు వగైరాల గురించి), The Browser’s Ecstasy, A Gentle Madness (పుస్తకాలపై ఉండే పిచ్చి ప్రేమ గురించి), The Book Eaters, Writers (కొందరు రచయితల గురించి, వారి రచనల గురించి వ్యాసాలు), Ruined by Reading, Loved and Lost, Bookstores – ఇవీ వాటి శీర్షికలు.
పుస్తక చోరుల గురించి రాసిన రెండు వ్యాసాలు: “The Man who loved books too much: Book Thief 1”, “The Tome Raider: Book Thief 2” చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. “The Tales of Bibliomania” కూడా. ఈ bibliomania అన్న పదం వాడకం గురించి రాసిన వివరాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఇలా ఎక్కడెక్కడి కథలో మట్టుకే కాదు, మన అమర్ చిత్ర కథ, 11వ నంబర్ పుస్తకం గురించి పరిశోధనలు చేస్తూ ఇండియా వచ్చిన విదేశీ వనిత, మన దేశంలో ప్రింటు పుస్తకాల గురించిన చరిత్ర – ఇలాంటి విషయాల గురించి కూడా కొన్ని కథనాలు ఉన్నాయి ఈ వ్యాసాల్లో.
Newyork antiquarian book fair గురించి పుస్తకం చివర్లో రాసిన afterword వ్యాసం కూడా నాకు చాలా నచ్చింది. ఈమధ్య కాలంలోనే antiquarian book trade గురించి తెలుసుకుంటూ ఉండడం వల్లా, ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ లో antiquarian fair ఉన్న విభాగంలో కాసేపు గడిపినందువల్లా, ఈయన చెప్తున్న విషయాలను నా అనుభవంతో పోల్చుకుంటూ చదువుకున్నాను. కొన్ని పుస్తకాల షాపుల గురించి రాసిన వ్యాసాలు కూడా ఇదే కోవలో వ్యక్తిగత కారణాల వల్ల మరింత నచ్చాయి నాకు. చాలా కాలం క్రితం పుస్తకం.నెట్లో పుస్తకాల షాపుల వారితో జరిపిన సంభాషణలు వరుసగా వేశాము – అది గుర్తువచ్చింది.
ఇక, ఇలాంటి విషయ పరిజ్ఞానం కల వ్యాసాలే కాక – చదువరుల అలవాట్ల గురించి, ఇళ్ళల్లో ఉండే పుస్తకాల అరలతో అనుబంధం, వీథి చివరి సర్కులేషన్ లైబ్రరీలో చదివిన పుస్తకాలు – ఇలా పఠనాసక్తి ఉన్నవారికి గల మామూలు అనుభవాల గురించి కూడా ఆసక్తికరమైన వ్యాసాలు ఉన్నాయి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే: మీరు పుస్తకాలను చదవడమే కాక, పుస్తక ప్రపంచాన్ని కూడా ఇష్టపడేవారైతే తప్పకుండా చదవాల్సిన పుస్తకం. నాలాగ ఈ విషయంలో ఆసక్తి తప్ప ఎక్కువ పరిజ్ఞానం లేనివారైన పక్షంలో ఇది చదివితే మీరు చదవాలి అనుకునే పుస్తకాల జాబితాలోకి ఓ వంద పుస్తకాలైనా చేరుతాయి 🙂 (For the academically oriented: బహుశా ఇది మీకు అంత నచ్చకపోవచ్చు. దీనికి ప్రథమ పాఠకులు మామూలుగా వార్తాపత్రికలు చదివే అలవాటు గల సాహితీ ప్రియులు మాత్రమే అని అనుకుంటున్నాను – ఇవన్నీ పత్రికల్లో వచ్చిన వ్యాసాలే కనుక)
2010లో ఈ పుస్తకం మొదటిసారి చదివాను. మధ్యలో అడపా దడపా ఒక్కో వ్యాసం చదివినా, ఈమధ్య కాలంలో ఒక విమాన ప్రయాణంలో మళ్ళీ మొదట్నుంచి మొదలుపెట్టాను. ఇందుకు కారణం ఇటీవలే ఆయన లిటరరీ రివ్యూ లో “Gutenberg’s Apprentice” అన్న పుస్తకం గురించి రాసిన వ్యాసం. అలా ఆయన మరిన్ని సంవత్సరాల పాటు నాకళ్ళకి గొప్పగా కనబడే వ్యాసాలు మరెన్నో రాయాలని, తద్వారా నేనూ మరిన్ని పుస్తకాల గురించి తెలుసుకోవచ్చన్న స్వార్థంతోనే కోరుకుంటున్నాను.
Sashank
మీరు రాస్తున్న పుస్తక సమీక్షలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మీలాగా చాలా పుస్తకాలు చదవాలన్న ప్రేరణ కలుగుతోంది. తప్పనిసరిగా మీ చదువూ, సమీక్షలూ రెండూ కొనసాగించండి.
-శశాంక