సోఫోక్లిస్ రాసిన ‘యాంటిగని’ నాటకం

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు
(ఈ వ్యాసం మొదట చినవీరభద్రుడు గారు జూన్ 2014లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*****
10 టివి ప్రేక్షకులకోసం ప్రతి ఆదివారం అక్షరం కార్యక్రమంలో (మ. 12.30కి) ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. ఒక వారం కవిత్వం, ఒక వారం నవల, ఒకవారం నాటకం ఇట్లా. ఈసారి సోఫోక్లిస్ రాసిన ‘యాంటిగని’ నాటకాన్ని పరిచయం చేసాను. (రేపు ఆదివారం ప్రసారం అవుతుంది.) నిన్న ఆ పుస్తకం మీద మాట్లాడుతున్నప్పుడు మళ్ళా కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. వాటిని మీముందుంచాలనిపించింది.

ప్రపంచసాహిత్యంలో కొన్ని ప్రక్రియలకు, కొన్ని భాషలకు ప్రత్యేక స్థానం ఉంది. నవల గురించి మాట్లాడినప్పుడు 19 వ శతాబ్ది రష్యన్ నవల కు పెద్దపీట వేస్తాం. కథ అంటే ఇరవయ్యవశతాబ్ది అమెరికన్ కథ, అలాగే మంగళప్రదమైన నాటకమంటే ప్రాచీన సంస్కృత నాటకం, విషాదాంత నాటకమంటే ప్రాచీన గ్రీకు నాటకం.

క్రీ.పూ ఆరు, అయిదు, నాలుగు శతాబ్దాల్లో ప్రాచీన గ్రీసులో వికసించిన విషాదాంతనాటకాల్ని చదవడం గొప్ప రసానుభవం. గత రెండువేల ఏళ్ళకు పైగా ఆ నాటకాలు ప్రపంచసాహిత్యాన్నీ, ప్రపంచసాహిత్యవేత్తల్నీ అపారంగా ప్రభావితం చేస్తున్నాయి. అందులోనూ, ముగ్గురు నాటకరచయితలు, ఎస్కిలస్, సోఫోక్లిస్, యురిపిడిస్ శిఖరసమానులు. వారితో పాటు కామెడీలకు ప్రసిద్ధి చెండిన అరిస్టోఫేన్స్ ని కూడా కలుపుకుంటే, ఆ నలుగురి నాటకాలూ ప్రతి సాహిత్యవిద్యార్థి సిలబస్ లోనూ తప్పకుండా ఉండవలసిన గ్రంథాలు.

ప్రాచీన గ్రీకు నాటకం ఆధునిక నాటకం లాగా లౌకిక సందర్భంలో పుట్టిందికాదు, అది మతపరమైన అవసరాలకోసం, ప్రాచీన గ్రీకు దేవత డయోనిసిస్ ఆరాధనకోసం చేపట్టే క్రతువుల్లో భాగంగా వృద్ధిచెందింది. మొదట్లో 15 మంధి పౌరులతో మాత్రమే కూడుకున్న కోరస్ తో మొదలై, మొదట ఒక పాత్ర, ఆ తరువాత రెండుపాత్రలు, సోఫోక్లిస్ కాలం నాటికి మూడుపాత్రల్తో గ్రీకునాటకం స్పష్టమైన రూపుదిద్దుకుంది.

ప్రతి ఏడాదీ గ్రీకుదేవతారాధనలో భాగంగా మాత్రమే ఆ నాటకాల్ని ప్రదర్శించేవారు. ఇప్పటిరోజుల్లో మనం సినిమాలు చూసినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు ఆ నాటకాల్ని చూసే అవకాశం ఉండేది కాదు. మతపరమైన క్రతువుల్లోనే ఆ నాటకాల్ని ఎందుకు చూడాలో అరిస్టాటిల్ తన పొయెటిక్స్ లో వివరంగా రాసాడు. అసలు గ్రీకు విషాదాంత నాటకాన్ని ప్రేక్షకుడు ఎందుకు చూడాలి అని అంటే, ఆ నాటకాన్ని చూసేటప్పుడు ప్రేక్షకుడొక అద్వితీయ రసానుభవానికిలోనవుతాడు. అది అతడిలోని పాపప్రవృత్తినీ, హింసాప్రవృత్తిన్నీ క్షాళనం (purge) చేస్తుంది. అతడి మనసు తేటపడుతుంది. దాన్ని గ్రీకులు కెథారిసిస్ అన్నారు. అటువంటి కెథారిసిస్ మతపరమైన ఆరాధనా సమయాల్లోనూ, క్రతువేళల్లోనూ సాధ్యపడటం సులభంకాబట్టి ఆ నాటకాల్ని కేవలం ఆరాధనా సమయాల్లో మాత్రమే చూడాలనే నిర్బంధముండేదని అరిస్టాటిల్ చెప్తాడు.

గ్రీకు విషాదాంతనాటకంలో ఒక విషాధనాయకుడు ఉంటాడు. ‘మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని’ గా సాహిత్యం ఉండాలనే భారతీయ నాటకధర్మం ప్రకారం నాయకుడు ధీరోదాత్తుడుగానో, ధీరలలితుడిగానో ఉండాలి. కాని గ్రీకు విషాదాంత నాటకంలో ప్రధానపాత్ర కేవలం ఉదాత్తంగా ఉంటే సరిపోదు. ఆ పాత్ర వ్యక్తిత్వంలో ఒక చీలిక, పగులు (tragic flaw) ఉందాలి. అతడు దైవాన్నీ, విధినీ, కాలాన్నీ ధిక్కరించి తాను తన వ్యక్తిత్వ పరిమితుల్తో తలపడేవాడు కావాలి. భారతీయ సాహిత్యాదర్శం ఇందుకు వ్యతిరేకం. భారతీయ కావ్య, నాటక నాయకుడు దైవోపహతుడైనప్పటికీ అతడు దైవాన్ని ప్రశ్నించడు. రాముడు అడవికివెళ్ళవలసి వచ్చినా, భార్యను పోగొట్టుకోవలసివచ్చినా, వానరుల సహాయాన్ని అర్థించవలసి వచ్చినా దైవాన్ని నిందించడు. అదంతా ఒక దివ్యమంగళలీలలో భాగమనే భావిస్తాడు. కాని గ్రీకు నాటకనాయకుడు దైవంతో తలపడతాడు. దైవానికీ, మనిషికీ మధ్య జరిగే ఆ సంగ్రామం ఏకకాలంలో మనలో pityనీ, fearనీ రేకెత్తిస్తుందని అరిస్టాటిల్ చెప్తాడు. భయం, కరుణ- ఈ రెండూ గ్రీకువిషాదాంతనాటకం మనలో రేకెత్తించే రసాలు. కరుణవల్ల మనం ఆ పాత్రలవైపు ఒక అడుగు వేస్తాం, ఇంతలో భయం వల్ల రెండడుగులు వెనక్కి వేస్తాం. ఇట్లా ప్రేక్షకుణ్ణి ఊగిసలాటకు గురిచేసి గ్రీకునాటకరచయితలు అతణ్ణొక అద్వితీయమైన intellectual experience కి గురిచేస్తారు.

గ్రీకు నాటకకర్తల్లో సోఫొక్లిస్ (క్రీ.పూ. 496-06) తదనంతర ఐరోపీయ సాహిత్యాన్ని, చింతననీ ప్రభావింతం చేసినంతగా మరే గ్రీకు రచయితా ప్రభావం చెయ్యలేదు. అతడు రాసిన వాటిలో మనకు లభ్యమవుతున్న ఏడునాటకాల్లో మూడు నాటకాల్లో ప్రధాన పాత్ర అయిన ఈడిపస్ ఐరోపీయ తత్త్వశాస్త్రాన్నీ, మనస్తత్వశాస్త్రాన్నీ కూడా గాఢంగా ప్రభావితం చేసిన పాత్ర. యూరోప్ ని అర్థం చేసుకోవాలనుకుంటే మనం మూడు పాత్రల్ని అర్థం చేసుకోగలిగితే చాలు. ఒకటి సోఫోక్లిస్ చిత్రించిన ఈడిపస్, రెండవది షేక్ స్పియర్ చిత్రించిన హామ్లెట్, మూడవది గొథే చిత్రించిన ఫౌస్ట్.

అయితే నేను ఈసారి పరిచయం చేసిన నాటకం ఈడిపస్ ట్రయాలజీ కాదు. అతడు రాసిన మరొక విశిష్టనాటకం యాంటిగని. యాంటిగని నాటకానికి ప్రసిద్ధ విద్యావేత్త ఎం.ఆర్. అప్పారావుగారి అనువాదం, సాహిత్య అకాడెమీ ప్రచురణ దాదాపు ముఫ్ఫయ్యేళ్ళకిందట చదివాను. ఆ అనువాదానికి ముందు గ్రీకునాటకం గురించి అప్పారావుగారు ఎంతో సవివరమైన, పాండిత్య స్ఫోరకమైన ముందుమాటకూడా రాసారు. ఆ తరువాత నా జీవనగమనంలో ఆ నాటకాన్ని ఇంగ్లీషులో మరొక రెండుమూడు సార్లు చదివాను. ఇప్పుడు ఈ పరిచయం కోసం మరొకసారి చదివాను. గొప్ప సాహిత్యకృతులకి ఉండే లక్షణమేమిటంటే అవి మనతో పాటే ఎదుగుతాయి. మనం మన జీవితానుభవాలనుంచి నేర్చుకునే పాఠాలవల్ల అవి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా విశేషార్థాల్ని సంతరించుకుని కనిపిస్తాయి. యాంటిగని విషయంలో కూడా నేనదే అనుభవానికి లోనయ్యాను.

యాంటిగని కథ చాలా సరళం. ఈడిపస్ మరణించినప్పుడు ఈడిపస్ కొడుకులు ఎటియోకిల్స్, పోలినేసిస్ అనేవాళ్ళిద్దరూ థీబ్స్ నగరరాజ్యాన్ని వంతులవారీగా పరిపాలించాలని ఒప్పందం చేసుకుంటారు. వారికి యాంటిగని, ఇస్మెనె అనే ఇద్దరు అక్కచెళ్ళెళ్ళు. క్రెయోన్ ఒక రాజప్రతినిథి. యూరిడైస్ అతడి భార్య. హేమోన్ అతడి కొడుకు. కథాప్రారంభం నాటికి హేమన్ కీ, యాంటిగనికి నిశ్చితార్థం జరిగిఉంటుంది. ఎప్పట్లానే వంతులవారిగా పరిపాలన సాగించడానికి తనకి రాజ్యమిమ్మని పోలినేసిస్ అడిగినప్పుడు ఎటియోకిల్స్ నిరాకరిస్తాడు. దాంటో పాలినేసిస్ థీబ్స్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధంలో క్రియోన్ ఎటియోకిల్స్ కు బాసటగా నిలబడతాడు. కాని యుద్ధంలో అన్నదమ్ములిద్దరూ, ఎటియోకిల్స్, పోలినేసిస్ ఒకరిచేతిలో ఒకరు మరణిస్తారు. క్రియోన్ రాజవుతాడు. తమ నగరరాజ్యం పట్ల విధేయతతో, నగరాన్ని రక్షించడానికి యుద్ధం చేసిన ఎటియోకిల్స్ కి రాజలాంఛనాల్తో అంత్యక్రియలు నిర్వహించాలనీ, నగరవినాశనాన్ని కోరుకున్న పోలినేసిస్ కి ఎటువంటి అంత్యక్రియలూ నిర్వహించకూడదనీ, ఆ శవాన్ని కాకులూ, గద్దలూ పీక్కుతినాలనీ క్రియోన్ ఆదేశాలు జారిచేస్తాడు. తన శవానికి అంత్యక్రియలు నిర్వహించకపోవడం కన్నా ఒక ప్రాచీన గ్రీకు పౌరుడికి పెద్ద అవమానం మరొకటి లేదు. అందుకని అతడి సోదరి యాంటిగని ఆ శవానికి కనీసం లాంఛనప్రాయంగా నైనా అంత్యక్రియలు నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. అలా చెయ్యడం ద్వారా ఆమె రాజధర్మానికీ, భ్రాతృధర్మానికీ మధ్య ఒక సంఘర్షణకి తెరతీస్తుంది.

అది సహజంగానే క్రియోన్ కి ఆగ్రహం తెప్పిస్తుంది. అతడు యాంటిగనిని ప్రశ్నించినప్పుడు ఆమె తనకి సోదరుడి పట్ల ధర్మం నిర్వహించడమే ముఖ్యమని అందుకు తాను చావుకు కూడా వెనకాడననీ చెప్తుంది. తన సోదరుడి శవానికి లాంఛనప్రాయంగానే కాక సమగ్రంగా అంత్య కర్మలు నిర్వహించడానికి పూనుకుంటుంది. దాంతో ఆగ్రహించిన క్రియోన్ యాంటిగనికి సజీవమరణ శిక్ష విధిస్తాడు.

అక్కడితో రెండవ అంకం ముగుస్తుంది కాని కథ అక్కడితో ఆగదు. గ్రీకు నాటకాల్లో తరచు కనిపించే టైరీషియస్ అనే అంధసాధువు క్రియోన్ దగ్గరకు వచ్చి పోలినేసిస్ శవానికి రాజలాంఛనాలతో అంత్యకర్మలు నిర్వహించమనీ, యాంటిగనిని విడుదల చెయ్యమనీ సలహా ఇస్తాడు. క్రియోన్ అతడి మాటలు పెడచెవిన పెట్టడమే కాకుండా అతడి ఉద్దేశ్యాల్ని కూడా శంకిస్తాడు. దాంతో టైరీషియస్ ఆగ్రహించి క్రియోన్ ఇంట్లోనే దారుణమైన పరిణామాలు సంభవించనున్నాయని హెచ్చరించి వెళ్ళిపోతాడు. యాంటిగనికి మరణశిక్ష విధించబడిందని తెలిసి క్రియోన్ కొడుకు హేమోన్ ఆత్మహత్య చేసుకుంటాడు. కొడుకు మరణించాడని తెలిసి అతడి తల్లి,క్రియోన్ భార్య కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. కొడుకునీ, భార్యనీ పోగొట్టుకున్న క్రియోన్ కూడా భగ్నహృదయంతో మృత్యువుకి ఎదురేగుతాడు.

స్థూలంగా ఇదీ కథ. అయితే ఈ కథ విషాదాంతనాటకమెట్లా అయింది? నాటకం ముగిసేటప్పటికి నాలుగు మరణాలు సంభవించినందువల్లనా? నాటకానికి యాంటిగని అని పేరుపెట్టినందువల్ల రెండువేల యేళ్ళ పాటు ఈ నాటకాన్ని యాంటిగనికి సంభవించిన ట్రాజెడీగానే బావించారు. కాని యాంటిగని చేసింది వీరోచిత కృత్యంకదా. ఆమె కథ వీరరసోత్పాదకం తప్ప కరుణరసోత్పాదకం ఎలా అవుతుంది? తరువాతి రోజుల్లో విమర్శకులు దీన్ని క్రియోన్ కి సంబధించిన ట్రాజెడీగా చూడడానికి ప్రయత్నించారు. కాని క్రియోన్ చేసిన తప్పిదమేమిటి? ఒక రాజుగా అతడు రాజధర్మానికి కట్టుబడటంలో అనుచితమేముంది?

కాని ఇలా ఆలోచించడం నాటకాన్ని పైపైన చదవడం మాత్రమే. అలా చదివినందువల్ల మొదటి పఠనంలో ఈ నాటకం మనకు పూర్తిగా బోధపడలేదని అర్థం. దీన్ని సోఫోక్లీస్ ట్రాజెడీ అన్నాడు కాబట్టి అది ఎందుకు ట్రాజెడీనో మనం మరొకసారి ఆలోచించాలన్నమాట.

గ్రీకు నాటకాల్లో నాయకుడు విషాదాంతం వైపు నడవడానికి అతడి వ్యక్తిత్వంలో ఉండే పగులు కారణమవుతుందని చెప్పుకున్నాం కదా. ఆ పగులుకి ముఖ్యకారణం ఆ నాయకుడు ఒక గర్వాంధతకు లోనుకావడం. గ్రీకులు దాన్ని hubris అన్నారు. అంటే ఏ కారణం వల్లగానీ, మనిషి తాత్కాలికంగా ఒక గర్వాంధతకి లోనవుతాడు. ఆ గర్వాంధత అతణ్ణి అభిశప్తుణ్ణి చేస్తుంది. (అతడు గర్వాంధత వల్ల అభిశప్తుడైన నహుషుడు అన్నాడు బైరాగి ఒక కవితలో. ఈ రెండుపదాలకు నేనాయనకు ఋణపడిఉంటాను.) అటువంటి గర్వాంధత ఫలితం పతనం, గ్లాని, విషాదం. దాన్ని గ్రీకులు nemesis అన్నారు. (గ్లానిలో అవసానమొందినదా అహంకృత సింహనాదం-బైరాగి).

యాంటిగని నాటకంలో యాంటిగని ఒక hubris కి లోనయ్యింది. ఆమె తన సోదరుడిపట్ల భ్రాతృధర్మాని నెరవేర్చి ఊరుకోకుండా ఆ విధంగా నెరవేర్చడంలో ఒక అద్వితీయ సంతోషాన్ని, కించిదున్మత్తతనీ అనుభవించింది. ఒక మనిషి తన కర్తవ్యం నెరవేర్చడంలో గర్వించవలసిందేమీ లేదు. కర్తవ్య నిర్వహణ దానికదే ఒక కనీస బాధ్యత. దాన్నుంచి ప్రత్యేకంగా సంతోషం పొందుతున్నావంటే, దానర్థం, భారతీయ పరిభాషలో చెప్పాలంటే, ఆ కర్మ నిష్కామ కర్మ కాలేదని అర్థం. ఆసక్తి తో చేసే కర్మ మనిషిని బంధించి తీరుతుంది. యాంటిగని విషయంలో జరిగిందదే.

మరొక రకంగా ఇది క్రియాన్ ట్రాజెడీ కూడా. ఎందుకంటే క్రియాన్ కూడా తన రాజధర్మాన్ని నిర్వహించడంలో ఒక అద్వితీయ సంతోషాన్నిని పొందడమే కాక ఆ క్రమంలో ఒక నిష్టురంవ్యక్తిత్వాన్ని కనపర్చాడు. తనకి సలహా ఇవ్వడానికి వచ్చిన టైరీషియస్ తో అతడు వ్యవహరించిన తీరులో అతడి hubris ప్రస్ఫుటమయ్యింది. ఒక రాజు తన రాజధర్మాన్ని నిర్వహిస్తున్నందుకు నిష్టురంగానూ, కర్కశంగానూ మారవలసిన అవసరం లేదు. ఆ నిష్టురత్వమే అతడి ఇంట్లో పెనువిషాదాన్ని సృష్టించింది.

మొదట చదివినప్పుడు రాజధర్మానికీ, భ్రాతృధర్మానికీ సంఘర్షణగా కనిపించిన ఈ కథ నిజానికి మనుషులు తమ ధర్మాల్ని తాము నిర్లిప్తతతో నిర్వహించకుండా ఆసక్తితో నిర్వహిస్తే దాని ఫలితాలు విషాదంగా పరిణమిస్తాయని చెప్పడంగా ఇప్పుడు అర్థమవుతున్నది నాకు.

Antigone
Euripides
Greek Tragedy

You Might Also Like

2 Comments

  1. Raghavendra

    కొత్త మాటలు పరిచయం చేశారు భద్రుడు గారూ. కొత్త (అసలు) అర్ధాలు.విరేచనం కావడానికి Cathartics వాడతారు వైద్యులు అనుకొనేవాణ్ణి. కళాత్మకమైన వ్యక్తీకరణ ద్వారా అపరాధ భావనను తొలగించుకోవడమన్న మాట Catharsis అంటే. వినాశకరమైన, సాధారణంగా అనివార్యమైన ప్రతిక్రియే nemesis అని నిఘంటువు లో వున్నది. కానీ అనురక్తి లేనిదే కష్టసాధ్యమైన కర్తవ్య పాలన దుర్లభం కాదా

  2. Jampala Chowdary

    ఈ నాటకం స్ఫూర్తిగా ఈమధ్య వచ్చిన నవల The Watch కు పరిచయం
    http://pustakam.net/?p=12713

Leave a Reply