మన ప్రపంచం: దుప్పల రవికుమార్
వ్యాసకర్త: భాను ప్రకాశ్
“మనప్రపంచం” ఈ పుస్తకం చదవటానికి ముఖ్యకారణం ఇది మా ఇంగ్లిష్ మాస్టారు రాయడం, ఆయన నడుపుతున్న మీరుచదివారా అనే బ్లాగువల్ల నాకు ఇంకా ఎన్నో పుస్తకాలు,రచయితల పేర్లు తెలియడం.. హా.. ఈ పుస్తకం.నెట్ అనేది ఉందని కూడా నాబోటోడికి తెలియడానికి కారణం ఆయనబ్లాగులే.ఆయానే మా దుప్పల రవికుమార్ మాస్టారు. మా కాలేజ్ లో అందరికి ముక్తకంఠం తో ఇష్టమైన సారు, అవతలోడి ఊహా శక్తిని కొత్త ఆలోచనల్ని ఎప్పుడూ తమ బీసీలనాటి పద్ధతులతో వాళ్ళ ఈగోలకి క్రమశిక్షణ అని పేరుపెట్టుకుని ప్రాక్టికల్ మార్క్స్ అనే ఆయుధాన్ని చూపించి చంపేసే సార్లలా ఆయన లేకపొవడం మాకు ఆయనంటే కూసంత ఎక్కువ ఇష్టానికి కారణం (JNTU లో ఇంగ్లిష్ కి కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి).
ఇక పుస్తకం లో సుమారు 59 వ్యాసాలున్నై. అందులో కొన్ని చిచ్చుబుడ్లు. కొన్ని డైనమైట్లు. ఇవన్నీ శ్రీకాకుళం లోని సత్యం సాయంకాల పత్రికలో వచ్చినవి.అలా అని ఇవి కేవలం శ్రీకాకుళానికి మాత్రమే సంబంధించినవి కావు, మొత్తం దేశకాలమాన పరిస్థితులని మనకి కళ్ళకి కట్టినట్టుచూపించేవి. ఈయనకి విప్లవభావాలు ఎక్కువ కాబట్టి బాగా విప్లవాత్మకంగా కూడా ఉంటాయి, కొన్ని మన సంప్రదాయ ఆలోచనల్ని కాస్త గట్టిగానే ఢీకుంటాయి, సిద్ధంగా ఉండాలి.
పుస్తకంలో నాకు బాగా నచ్చిన వ్యాసాలు ఒక రెండుమూడు తప్ప అన్నీను. “తత్తరపాటు” అనే వ్యాసంతో ఈ వ్యాసపరంపర మొదలవుతుంది,ఈ వ్యాసంలో రాహుల్ గాంధి పోలవరం ప్రొజెక్ట్ గురించి మాట్లాడిన అమాయకపు మాటలు, ఇంకా మన రాష్ట్రం లోని పోలవరం లాగే ఒరిస్సాలోని నియమగిరి వల్ల అక్కడ గిరిజనులుకు జరిగే అన్యాయాన్ని తాను ఢిల్లిలో వినిపిస్తానని ఆయన చెప్పడం కాంగ్రెస్ వారు దానికి తర్వాత సర్దిచెప్పుకోవడం ఉంటుంది. రెండో వ్యాసం లో 2005 డిసెంబర్లో అనిరుద్ బెహాని, సుహాని రాజ్ అనే ఇద్దరు జర్నలిస్టులు పార్లమెంటులో ప్రశ్నలు వెయ్యడానికి కొంతమంది ఎంపిలకు లంచం ఇవ్వడం, వాళ్ళు ఏంపోయిందిలే అని లంచం తీసుకుని ప్రశ్నలు వేయడం ఈ మొత్తం తతంగమంతా జర్నలిస్టులు రికార్డ్ చేయడం, కాని పొలీసులు జర్నలిస్ట్లనే అరెస్ట్ చేయడం చదివితే మన చట్టాలని చూసి నవ్వొస్తుంది కాని ఆ తర్వాత ఏమయ్యిందని ఎవరికి వారు చదివి తెలుసుకోండి.
“పరీక్ష” అనే వ్యాసంలో బ్రిటిష్ వారు మన దేశానికి వెన్నుముక అయిన రైతులని, అలాగే చిన్న చిన్న కుటీరపరిశ్రమల్ని ఎలా తొక్కి పెట్టారో రచయిత మనకి వివరిస్తారు. రైతులకి కావల్సింది బిక్ష కాదని వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పారు. “వాళ్ళంతే” వ్యాసంలో మీడియా ఎలా న్యూస్ ని పంచుకుంటుందో ఉదహరిస్తూ కన్నెధార (శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఒక అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు అవుతుంది) న్యూస్ ఈనాడుదే అని ఇంకెవరూ దానిమీద రాయరని అంటారు. “మనమెక్కడొ” వ్యాసం లో ఎడ్యుకేషన్ మన దేశంలో ఎలా ఉందో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలుఇక్కడకు వస్తున్నాయంటే ఎందుకు ఇక్కడ వారు ఉలిక్కి పడుతున్నరో వివరించి చెప్పారు. “కాంగ్రెస్ మార్క్” అనే వ్యాసం లో ఏ.ఓ హ్యూం, సర్ ఆర్థర్ కాటన్ అన్నయ్యని చెప్పారు నాకా విషయం ఇది చదివాకే తెల్సింది (ఏమో నా విషయ జ్ఞానం శూన్యం అవ్వొచ్చు) ఇంకా ఇక్కడ కూడ కాంగ్రెస్ పార్టి లోని లోపాలని ఎత్తి చూపారు.
“విభూది” వ్యాసం నాకు అన్నిటి కంటే బాగా నచ్చిన వ్యాసం ఈ వ్యాసాలన్నిటిలోకి గుండె కాయలాంటి వ్యాసం. ఈ వ్యాసంలో జావెద్ అఖ్తర్ సాబ్ గారిచ్చిన స్పీచ్ చాలా చాల బాగుంటుంది, మన సంప్రదాయ ఆలోచనల్ని బద్దలు చేస్తుంది. కనీసం ఈ వ్యాసం కోసమైనా ఈ పుస్తకం కొనొచ్చు. “అవినీతి” అనే వ్యాసం లో శ్రీకాకుళం లో పుట్టిన స్వామి అగ్నివేష్ మొదటసారి అన్నహజారే దీక్షకి మద్దతు పలకడం శ్రీకాకుళం వాడిగా కాస్త గర్వంగా అనిపించింది. ఇంకా ఈ వ్యాసంలో లోకపాల్ బిల్లుకి జనలోక్పాల్ బిల్ల్ కి ఉన్న తేడాని వివరించారు. “అక్షరం” అనే వ్యాసంలో మన నేషనల్ హీరో అయిన టిప్పు సుల్తాన్ గురించి, టిప్పు సుల్తాన్ ఒక అనాకారి అని, అసలేమాత్రం వీరత్వం లేని వాడని, బ్రిటిష్ వాళ్ళు కావాలనే ఆయనని హీరో ని చేసారని రాసారు, నిజానికి ఇది జీర్ణమవ్వడానికి చాల సేపు పట్టింది. “గాడ్మాన్” వ్యాసంలో సత్యసాయిబాబలో ఆయనపైన హత్యాయత్నం జరిగాకా వచ్చిన మార్పు గురించి, ఆయన మరణించి తర్వాత మీడియా ఆడిన డ్రామా దేన్ని పక్కతోవపెట్టించడానికో చెప్పారు.
ఇవన్ని మచ్చుకి కొన్ని, కాని ఇందులో వ్యాసకర్త దేశంలో జరుగుతున్న ఏ విషయాన్ని వదలలేదు, ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుని. వ్యాసకర్త ప్రత్యేక తెలంగాణని సమర్థిస్తూ ఎందుకు సమర్థిస్తున్నారో సహేతుకంగా వివరించారు. అది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, లేదంటే లేదు. ఇంకా నిత్యం మన నోళ్ళలో నానే పేర్ల అసలు స్వరూపం ఈ వ్యాసాలు మనకి చూపిస్తాయి. నిజానికి రచయిత మనకి అలా చూపించారు వివిధ ఉదాహరణలతో. దానికి ఎంతో పరిశోధన, విషయ పరిజ్ఞానం కావాలి. ఈ వ్యాసాల్లో వచ్చే పేర్లు చిరంజీవి, జెపి, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు, ఈనాడు రామోజి రావు, ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ. ఇంకా ఐపిఎల్ గురించి, ఇండియా వరల్డ్ కప్ దాని మీద జరిగిన వ్యాపారం, ఇండియా పాకిస్తాన్ సెమి ఫైనల్ మాచ్-దానిపైన దేశభక్తి ముసుగులో జరిగిన వ్యాపారం. రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో జరిగిన కుట్రలు, దాని పైన వివిధ పార్టీల సమర్థింపులు. అమెరికా మిగిలిన దేశాలని ఎలా దోచుకుంటుంది అలాగే అందులో భాగంగానే కొణతం దిలీప్ గారు రాసిన అంటే అనువందించిన కుట్రాజకీయం బుక్ గురించి చెప్పారు. అలాగే యువ జర్నలిస్ట్ లలో తెహల్కా రగిల్చిన స్ఫూర్తి ఆయన మీద కాస్త సానుభూతి, మహమ్మద్ప్రవక్తని అవమానించాడని కేరళలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడికి జరిగిన తీవ్రమైన అన్యాయం, చివరగా మా శ్రీకాకుళంలో ఉన్న బివిఎ రామారావు నాయుడు గారు ఆయుర్వేదంలో చేసిన విశేష కృషి. ఇంకా మీడియా పైన రచయిత చాలా సునిసితమైన విమర్శలు చేసారు, అవి ఇప్పటకి కొన్ని వార్తా పత్రికల్లో వచ్చే న్యూస్ లే నిజమని నమ్మేవాళ్ళ కళ్ళు తెరిపించడం ఖాయం. ముఖ్యంగా మన తెలుగు ప్రింట్ మీడియా పై చాలా విమర్శాబాణాలున్నయి. అలాగే హిందు పత్రిక ని కూడా వదల్లేదు ఈ వ్యాసాల్లో. మన మీడియా కన్నా పాకిస్తాన్ మీడియ ఎంతో మేలుగా ప్రజాస్వామ్యకంగా ఉన్నదని, మన మీడియా పార్టీలుగా విడిపోయి చాలానీచ స్థితికి దిగజారిందని ఉదాహరణలతో వివరించిన తీరు అద్భుతం.
మొత్తంగా చూసుకుంటే ఈ పుస్తకం మనకి నిజంగానే పేరుకి తగినట్టు మనప్రపంచాన్ని మనకి కొత్తగా చూపిస్తుంది. ఖచ్చితంగా ఇవి చదివాక మన ఆలోచనా తీరులో మార్పు వస్తుంది. రోజు చూసే వార్తలని కొత్త దృష్టి తో చూస్తాం, రచయిత మనకి ఆ దివ్యద్రుష్టిని ప్రసాదిస్తారు.కాని ఈ వ్యాసాల్లొఎక్కువగా టిడిపి ని, అధినేత చంద్రబాబు నాయుడుని విమర్సించారు , ఇంకా ఈనాడునైతే సరే సరి. అన్ని వ్యాసాలు చాల నిష్పాక్షికంగా రాసిన రచయిత మాటి మాటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మహానేత మహానేత అని అంటుంటే కాస్త ఇబ్బంది గా అనిపించింది. బహుసా ఆయన చనిపోయి ఈయన చేతిలో బతికిపోయాడెమో. చంద్రాబాబు నాయుడు మీద చేసిన విమర్శల్లో సగమైనా రాజశేఖర్ రెడ్డికి కూడా కేటాయుంచుంటే(ఎందుకంటే ఈయన ఆయనలో సగం టైం పాలించాడు కాబట్టి) నాణానికి ఇంకో వైపు ఇంకా బాగా తెలిసేది, నిండుగా ఉండేది. చివరగా, ఇందులో విషయాలు చాల మట్టుకు మనెముప్పుడు చదవనివి నేనైతే అందరికి ఈ బుక్ ని సజెస్ట్ చేస్తాను. సత్యం పత్రిక నుంచి ఒక మంచి వ్యాసాల సంపుటి ఇది. శ్రీకాకుళం రాజకీయాల గురించి, మాజి రెవెన్యూమినిస్టర్ ధర్మాన ప్రసాదరావు, సోంపేట కాకరాపల్లి అణువిద్యుత్ ఘటనల గురించి కూడా మంచి సమాచారం దొరుకుతుంది.
ఈ పుస్తకం ఈ బుక్ గా కినిగెలో లభ్యం.
ebook
Manjari Lakshmi
బాగుందండీ మీరు రాసిన వ్యాసం. అందులో ఉన్నాయని మీరు చెప్పిన విషయాలు, ఈ పుస్తకాన్ని చదవాలనే కుతూహలాన్ని కలిగిస్తున్నాయి. తప్పక చదువుతాను.
Bhanu Prakash
నా మొదటి రివ్యూకి మీరే మొదట కామెంట్ చేసింది మీ పేరును గుర్తు పెట్టుకుంటాను.నా నుంచి రాబోయే మిగతా రివ్యూలని మీరు చదివి ఆస్వాదించి మీ అభిప్రాయం చెబ్తారని ఆశిస్తున్నాను.తప్పకుండా ఈ పుస్తకం చదివి ఆస్వాదించగలరు.
bhanuprakash
పాఠకులకు చిన్న మనవి, నేను రాసిన ఈ రివ్యూ లో కన్నెధార కొండ దగ్గర అణువిద్యుత్ కేంద్రం ఉందని రాశాను, అది అణు విద్యుత్ కేంద్రం కాదు అక్కడ గ్రానైట్ పడుతుంది అందుకని ఆ కొండని ఒక పెద్ద రాజకీయ నాయకుడి సంబంధించిన వారికి అడ్డగోలుగా ఇచ్చేసారు, అలాగే సోంపెట,కాకరాపల్లి లో అణువిద్యుత్ కేంద్రాల గురించి అని రాయడం జరిగింది అవి థమల్ ప్లాంట్ లని గమనించగలరు.
G. Sreeramulu Naidu.
భాను ప్రకాష్ రాసిన విశ్లేషణ చదివిన తరువాత ‘మనప్రపంచం’ పుస్తకం చదవాలని నాకు కుతూహలం కలిగింది. రచియిత గురించి, రచియిత శక్తి సామర్ధ్యాలగురించి చాలా బాగా రాసాడు. తొందరలోనే పుస్తకం కొని చదువుతాను.