Dark Star: The loneliness of being Rajesh Khanna
రాజేష్ ఖన్నా పోయినప్పుడు, వార్తాపత్రికల్లో, టివి, రేడియో ఛానల్స్ లో ఒక డైలాగ్ చాలా ఎక్కువగా వినిపించింది. అది, ఆనంద్ సినిమాలోనిది. “బాబూ మోషాయ్… జీవితం, మరణం రెండూ పైవాడి చేతుల్లో ఉంటాయి. దాన్ని మీరూ మార్చలేరు. నేనూ మార్చలేను. మనమంతా రంగస్థలం మీద కదలాడే తోలుబొమ్మలం. మనల్ని ఆడించే దారాలు పైవాడి వేళ్లల్లో దాగున్నాయి. ఎప్పుడు, ఎవరు, ఎలా పైకి పోతారో ఎవరికి తెలీదు. “ చాలా నాటకీయంగా అనిపించే ఈ డైలాగ్ రాజేష్ డబ్బింగ్‌లో ఆయన చనిపోయిన తర్వాత మారుమ్రోగింది. మనిషి చనిపోవటం తధ్యంగానీ, అది ఎలా సంభవిస్తుంది అనేది తెలీదంటూ ముగిసే ఈ డైలాగ్‍ను మనిషి జీవితానికీ అన్వయించుకోవచ్చు. ఎప్పుడు, ఎవరు, ఎలా పైకి పోతారో ఎవరికీ తెలీనట్టే, ఎప్పుడు, ఎవరు, ఎలా శిఖరాలను అధిరోహిస్తారో, ఎప్పుడు, ఎలా కిందకు పడిపోతారో ఎవరికీ తెలీదు. అది తెల్సుకునేందుకు ఓ ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని పేర్కొనవచ్చు. కానీ, మొత్తం చదివాక, మళ్ళీ మొదటికే వస్తాం, కొన్ని మన కళ్ళముందే జరిగినా, ఏదేంటో మనకు ఎంతకీ అంతుచిక్కవు.
రాజేష్ ఖన్నా – మీ వయసును బట్టి, హింది సినిమాలపై మీ అభిరుచిని బట్టి, ఈ పేరు వినగానే మీకు వేర్వేరు గుర్తు రావచ్చు. డబ్భై దశకాలలో మీరు రెండు పదులలో ఉండుంటే, మీకు రాజేష్ ఖన్నా ఒక ప్రభంజనం. ఒక మేనియా. దేశాన్ని ఉర్రూతలూగించిన ఒక ఇరవైఏళ్ళ కుర్రాడు. తొంభైల దశకాల్లో మీరు టీనేజర్ అయ్యుండి, పాత హింది సినిమా చూసే అలవాటున్న మీ ఇంట్లో వాళ్ళతో పాటు ఈయన సినిమాలు చూసుంటే, రాజేష్ ఖన్నా ఒక ఆనంద్ ,ఒక ఆరాధన, ఒక అమర్ ప్రేమ్ లో హీరో. చూడచక్కని రూపం. అందుకు తగ్గట్టు అభినయం. హింది సినిమాలు చూసే అలవాటు లేకపోయినా, ఆర్డి బర్మన్ – కిషోర్ పాటలంటే చెవి కోసుకునేవాళ్ళకి, అంతటి పాపులర్ పాటలన్నీ ఎక్కువగా చిత్రీకరించబడ్డ హీరో రాజేష్ ఖన్నా. ఆ తర్వాత వచ్చిన షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్లు, ఆపై వచ్చిన హృతిక్ షాహిద్‍లతో హింది సినిమాలు పరిచయమైనవారికి రాజేష్ ఖన్నా ఉనికే తెలిసుండకపోవచ్చు. మహా అయితే, అక్షయ్ కుమార్‍కు పిల్లనిచ్చిన మామగారిగా, ఓ ట్రివియాగా! దాదాపుగా ఖన్నా మొదలెట్టినప్పుడే సినిమా రంగ ప్రవేశం చేసి, ఆయనకు ప్రత్యర్థి అనిపించుకొని, నిరూపించుకొని, నిలబడిన అమితాబ్ బచ్చన్ నేటికి అందరి నోళ్లల్లో నానే పేరు. అందరూ గుర్తు పట్టే మొహం. అందరూ ఓసారైనా చేతులు కలిపాలనుకునే సెలబ్రిటి. రాజేష్ కు వరుసబెట్టి పదిహేను బ్లాక్ బస్టర్లను, ఎనలేని క్రేజ్‍ని ఇచ్చినప్పుడు, అమితాబ్‍కు వరుసగా ప్లాపులు మూటగట్టాడు. ఆ తర్వాత, ”ఆంగ్రీ యంగ్ మాన్”గా అవతారమెత్తి దూసుకుపోయిన బచ్చన్‍ను చూస్తూ రాజేష్ దారుణంగా ఓడిపోయాడు. వీళ్ళిద్దరి జీవితాలకి డైరెక్షన్ చేసిన (పై)వాడు ఎవడోగానీ, అమితాబ్‌ని పైకి లేవుతూనే, రాజేష్‍ను మరలా లేవలేకుండా పడదోశాడు.
పుస్తకం అధిక భాగం దీని గురించే. How Rajesh Khanna became “The Rajesh Khanna”, and how he lost it even before he realized it?అన్న ప్రశ్నకు జవాబు వెతకటమే ఈ రచన ముఖ్య ఉద్దేశ్యంగా తోస్తుంది. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చాడు? ఎలా సినిమాలు చేజిక్కించుకున్నాడు? అన్ని హిట్లు రావడానికి కారణమేమిటి? ఆ తర్వాత రావాల్సిన అవకాశాలు ఎలా చేజారిపోయాయి? తాను ప్రోత్సహించిన సలీమ్-జావేద్ అతడి మీద ఎందుకు కక్ష్యగట్టినట్టు ఆయనతో పనిచేయలేదు? ఆయణ్ణి ఇండస్ట్రీకి తెచ్చి, ఆయనతో సినిమాలు చేసినవాళ్ళు కూడా ఆయనకు దూరంగా ఉండడానికే నిశ్చయించుకున్నారు? మూడేళ్ళ పాటు చూసిన వైభవం మూడు నిముషాలు అయినట్టు ఎలా మాయమైపోయింది? ఆయన తనకు వచ్చిన సక్సెస్ అంతా తన వల్లే అని విర్రవీగినా, ఎప్పటికప్పుడు మంచి క్రియేటివ్ టీమ్స్ తో ఎలా పనిజేశారు? ఆయన గురించి మీడియాలో ఎలాంటి కబుర్లు వచ్చాయి? దాన్ని ఎవరు రాసేవాళ్ళు? ఆయన వాటిని ఎలా ప్రోత్సహించారు? పతనమైపోతున్న కెరీర్‍ను కాపాడుకోవాడానికి ఎన్ని పాట్లు పడ్డారు? ఎన్ని అగచాట్లు పడ్డారు? ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఊపు అందుకోని కెరీర్‍ను పక్కకుపెట్టి పాలిటిక్స్ లో ప్రవేశించాక ఎలాంటి అగచాట్లను ఎదుర్కున్నారు? ఆపై పాలిటిక్స్ కి కూడా దూరమై చివరి రోజులు ఎలా గడిపారు? అన్న ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి.
అయితే, ఆ జవాబులు చాలా balancedగా, చాలా బాధ్యతగా ఉంటాయి. రాజేష్ లాంటి సన్సేషనల్ స్టార్ జీవితాన్ని బాగా మసాలా దట్టించి, లేనిపోనిది కల్పించి చాలా రాయవచ్చు. అలా కాకుండా, ఈ పుస్తకం మొత్తం ఒక పద్ధతిగా సాగుతుంది. రాజేష్ ఖన్నా ది స్టార్ గానే కాకుండా, ఓ మనిషిగా కూడా చూసే వీలు కల్పిస్తుంది. ఆయన మంచివాడా, దుర్మార్గుడా? అన్న గొడవ జోలికి పోకుండా, ఆయన కూడా మనిషే అన్న దిశగా కొనసాగుతుంది. ఆయన అభిమానులకు మింగుడుపడని పార్శ్వాలు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన ఇతరులను లెక్కచేయకపోవటం, చాలా దురుసుగా ప్రవర్తించటం, అమితాబ్ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడల్లా పార్టీలు చేసుకోవడం లాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే, ఒక నటుడి చేసే పాత్రను, ఆ నటుడి వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూడగలిగి, ఒక frenzied environmentలో చిక్కుకుపోయిన మనిషి చేసే వాటిని approve చేయకపోయినా, కనీసం అలా వ్యవహరించడానికి గల కారణాలను, వివశతను ఊహించుకోవడానికి ప్రయత్నించేవారికి, ఈ పుస్తకం బాగా పనికొస్తుంది. ఆయన బాల్యం, సినిమాలకు ముందు యవ్వనం, వైవాహిక జీవితంలోని గొడవలు, అఫైర్ల గురించి అవసరమైనంత మేరకు మాత్రమే చెప్పి, తక్కిన వివరాల జోలికి పోలేదు.
ఆయన సినిమాలన్నింటికి ప్రస్తావిస్తున్నప్పుడు, అవి ఎలా సంభవించాయి, అవి తీస్తున్నప్పుడు జరిగిన విశేషాలే కాకుండా, ప్రతి సినిమాకు synopsis కూడా ఇవ్వడం బాగుంది. ఆయన సినిమాలు చాలా మందికి గుర్తుండకపోవచ్చననే ఉద్దేశ్యంతో ఇలా సినాప్సిస్ ఇచ్చానని రచయిత ముందు మాటలో చెప్పారు. రాజేష్ ఖన్నా సినిమాలంటే ఆనంద్, అమర్ ప్రేమ్, ఆరాధన అంటూ అక్కడక్కడే ఆగిపోయే నాలాంటి వాళ్ల లిస్ట్ కి ఇంకొన్ని మంచి సినిమాలు (ఎక్కువగా ఆడకపోవడం వల్ల తెలీని సినిమాలు) గురించి తెల్సుకునే వీలు కల్పిస్తుంది. To-watch list తప్పకుండా పెరుగుతుంది. చూసిన సినిమాలు కూడా మళ్ళీ చూడాలనిపిస్తాయి. అలానే, ఆయన సినిమాల్లో చాలా ముఖ్యమైన సంగీతం, పాటల గురించి కూడా బోలెడు కబుర్లు. ముఖ్యంగా ఆనంద్ బక్షీ రాసిన అనేకమైనా ఆణిముత్యాల గురించి చదివే అవకాశం కలిగింది. కొన్ని అరుదైన ఫోటోలు ఉన్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా, షర్మిలా టాగుర్ రాసిన foreword కూడా! ఆయనపై అభిమానాన్ని, ఆయన antics వల్ల వచ్చే విసుగును ఒకేె breathలో చెప్పటం, బహుశా ఈవిడకే సాధ్యం. ఆవిడ అన్నట్టు, ఈ పుస్తకం ఆయన బతికున్నప్పుడే వచ్చి ఉండాల్సింది. కానీ, ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషం.
చిన్న విషయమే అయినా, ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్‌కి ఇంగ్లీషులో టైటిల్ పెట్టడంతో పాటు, ఆ చాప్టర్ సారాంశాన్ని సూచించేట్టుగా ఆయన పాటలోని లైన్ కూడా ఇచ్చారు. ఆయన హిట్ సాంగ్స్ లో ఒకటైన “యే క్యా హువా? కైసె హువా? కబ్ హువా?”. రాజేష్ ఖన్నా రాజేష్ ఖన్నా ఎలా అయ్యాడు? ఏమై మిగిలాడు? అని అంటూ 242 పేజీలు చదివాక, I’m glad this book happened. More importantly, a phenomenon or a lost soul , I’m glad he happened.
Some links:
Author in conversation about the book
Biography
HarperCollins Publishers India
2014
Hardcover
242
gnanendra reddy
website chala bagundi…kani ‘search’ option unte chala baguntundi..
paramesh reddy
Nice review about the book and about the great actor.
tprashanth
రాజేష్ ఖన్నా తన కార్ పార్క్ చేసి ఎక్కడికైన వెళ్లితే అతని కారు అమ్మాయిల లిప్ స్టిక్ మార్కులతో నిండిపోదని చెప్తారు.బిబిసి రిపోర్టర్లకి కుడా ఇంటర్వ్యూ ఇవ్వకుండ వారాల తరబడి ఇంటి చుట్టూ తిప్పుకునేవాడన్న అపవాదూ ఉంది.1960,70 లలో ఒక ప్రభంజనంలా ఉన్న రాజేష్ ఖన్నా సినీ జీవితం రాజేష్ ఖన్నా,ఆర్.డి.బర్మన్,కిశోర్ కుమార్ త్రయంలో ఒక తారాస్థాయిని చేరుకుంది.80 దశకంలో అతని అతని చరిష్మా తగ్గడం మొదలైంది.సినిమాలు తగ్గడం చాలా మంది హీరోల విషయంలో జరిగేదే.రాజేష్ ఖన్నా విషయలో అది తీవ్ర ప్రభావాన్ని చూపింది.బాలివుడ్ లో ఒరిజినల్ సూపర్ స్టార్ గ వెలిగిపోయిన అతన్ని వైవాహిక జీవితపు ఒడిదుడుకులు,సినిమాలలో అమితబ్ తో గట్టి పోటి చీకటి తెరల వెనక్కి నెట్టేసాయి.అయనపై వచ్చిన పుస్తకానికి నిజంగా ఇది ఒక ఆప్ట్ టైటిల్.విజయం మనల్ని శిఖరాల పైన నిలబెడుతుంది. విషాదం ఎంటంటే ఆ శిఖరం మీద మనం ఒంటరిగా ఉంటాం.అప్పటికే మనం సామాన్య జనానికి చాలా దూరం వచ్చేసుంటాం.ఇప్పటి తరానికి అయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు.హైయస్ట్ గ్రాసర్ థియరీస్,ఫాల్స్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ రాజేష్ ఖన్నా సక్సెస్ రేట్ ని అంచనా కట్టలేకపోవచ్చు.సిక్స్ ప్యాక్ నో,ఎయిట్ ప్యాక్ నో నటన లో భాగం చేసిన ఇప్పటి ట్రెండ్ కి కళ్లలో అనందాన్ని, విషాదాన్ని నింపేసి నటనని రక్తి కట్టించగల సూపర్ స్టార్ ని గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే .బహుషా రాజేష్ ఖన్నా జీవితం లో విషాదాన్ని ఆయన అభిమానులు, ఆ తరం అమ్మాయిలు సరిగ్గా అంచనా వేయగలరు.
Kavita Chintamani
A well written balanced review. Just for information- the writer is the grandson of Telugu poet Arudra.
Nagini
I’m glad I read this review.In fact I was waiting for this article in Pustakam.net..It’s in my ‘to read’ list now.Thank you. 🙂
పద్మవల్లి
ఈ పుస్తకం వచ్చిందని తెలిసిన దగ్గర్నుంచీ చదవాలని ఎదురు చూస్తున్నాను. పరిచయం చాలా బావుంది. నిజమే నాకూ రాజేష్ అంటే ఓ బాబూ మోషాయ్, ఓ ఆరాధన, ఓ అమర్ ప్రేమ్. అయితే కిషోర్ + రాజేష్ పాటల పిచ్చితో ఈపుస్తకం ఇంకా బాగా నచ్చుతున్దనుకుంటా నాకు. షర్మిలా ముందుమాటా…. I strongly believe that no one else deserve that for that job, than her. Interesting.