Geek Sublime: Vikram Chandra
విక్రమ్ చంద్ర పుస్తకాలు ఎప్పుడు ఎక్కడ కనిపించినా, చదవాలన్న ఆసక్తి పుట్టలేదు. అందుకని పెద్దగా పట్టించుకోలేదు. కంటపరరీ ఇండియన్ ఇంగ్లిష్ రైటింగ్‌లో నాకు నచ్చేలాంటి సాహిత్యం దొరకదని నా అనుకోలు. అవునా? కాదా? అని తేల్చుకోడానికి ఎప్పుడూ శ్రమించలేదు. విక్రమ్ చంద్ర రాసిన ఈ పుస్తకం పట్ల ఆసక్తి పెరగటానికి గల కారణం, ఇందులో నాకిష్టమైన రెండు ఫీల్డ్స్ ని చర్చించటం. ఓ స్నేహితురాలు దీని గురించి చెప్పగానే ప్రయత్నించి చూడాలనుకున్నాను. అంతలో, అనుకోకుండా, గిప్టుగా ఈ పుస్తకం నన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి చెప్పలేనంత ఆనందం.
ఆ ఆనందం ప్రతి పేజి తిప్పే కొద్దీ పెరిగింది. ఆనందమొక్కటే కాదు. మనం ఇష్టపడేవాటిని గురించి వేరొకరు అంతే ఇష్టంగా రాసినవి చదువుతున్నప్పటి ఆనందం. విక్రమ్ ఎనభైల దశకాల్లో అమెరికాకు పై చదువులకోసం వెళ్ళారు. ఊహు, ఇంజనీరింగ్, మెడిసన్ కోసం కాదు. హుమానిటీస్ చదవడం కోసం. అప్పటిలో వాళ్ళ నాన్నగారు కొంచెం ఉన్నతమైన ఉద్యోగంలో ఉండేసరికి ఈయనను అంత దూరం పంపగలిగారు. అక్కడికి వెళ్ళాక, చదువులు పూర్తయ్యాక, కేవలం రైటింగ్ మీదే ఆధారపడి, రోజు గడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. అనుకోకుండా ప్రోగ్రామింగ్ వైపు మళ్ళారు. కొద్దికొద్దిగా కంప్యూటర్ల ఇన్స్టలేషన్లు నేర్చుకున్నారు. ఆపై ప్రోగ్రామింగ్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ, చిన్నాచితకా వ్యాపారులకు తమ సాఫ్ట్వేరును అమ్ముతూ, చేతిలో డబ్బులు పడుతుండడంతో, వీలు చూసుకొని తన తొలి నవల రాసుకొని, దాన్ని అచ్చువేశారు. ఈ మొత్తం క్రమంలో, సాఫ్ట్వేర్ గురించి, సాహిత్యం గురించి, ఆ రెంటి మధ్య గల సామ్యాలు, తేడాలు, రెంటిలో ఉన్న సాధకబాధకాలు గురించి వివరంగా రాశారు.
రచయితలు తమ రచనల గురించి రాసినవి చదవడం నాకు ఇష్టం. ప్రముఖ ప్రోగ్రామింగ్ నిపుణులు తన నైపుణ్యాన్ని వివరిస్తూ రాసిన పుస్తకాలూ భలే ఇష్టం. ఆ రెండూ కలిసి ఒకటే పుస్తకం కనిపించింది. ఈయన నవలలు అవీ బాగానే పబ్లిష్ చేసున్నారు కనుక, కెరీర్ మొదట్లో కొంచెం ఊతం ఇచ్చిన ప్రోగ్రామింగ్ గురించి ఏదో కొంచెం రాసుంటారు అనుకున్నాను గానీ, ఈయన ఇప్పటికీ ప్రోగ్రామింగ్‍ను ఫాలో అవుతున్నారు. ఆయన ఇప్పుడు తీసుకోబోయే బ్రేక్ లో ఫక్షనల్ ప్రోగ్రామింగ్, సంస్కృతం నేర్చుకోడానికి సిద్ధపడుతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈయనకు ప్రోగ్రామింగ్ పై ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధా ఉన్నాయో. He was too inspiring for me, in more than one ways!
రచయితలు రాయడం గురించి రాసిన పుస్తకాల్లో నేను ఎక్కువగా వెస్ట్ వాళ్ళు రాసిన పుస్తకాలే చదివాను. ఈయన కూడా అమర్ చిత్ర కథలు తర్వాత హెమింగ్వే గురించే రాశారు. ఆ తర్వాత మరింత మంది వెస్టర్న్ రచయితలను గురించి రాశారు. కానీ, ఆ తర్వాత మన సంస్కృతం, మన పాణిని, అభినవగుప్త, ఆనందవర్ధన గురించి రాశారు. ముఖ్యంగా, Indian linguistics గురించి చాలా వివరాలు రాశారు. వాటిని కోడింగ్ లో వాడే recursion లాంటి టెక్నిక్స్ లో పోల్చడానికి ప్రయత్నించారు. లింగ్విస్టిక్స్ గురించి నాకు చాలా తక్కువ తెల్సు. అందుకని ఈయన రాసినవన్నీ ఆసక్తికరంగా అనిపించాయి. వాటిని ఛాలెంజ్ చేయలేను. ఎవరైనా చేస్తే, చదువుకోగలను, మళ్ళీ ఆసక్తిగా. మోడ్రన్ కంప్యూటింగ్ లాంగ్వేజెస్ లో methods and methodologies కొన్ని మనవాళ్ళు నాచురల్ భాషకు ఎలా ఆపాదించారో చర్చించారు.
ఒక పేజిలో హెమింగ్వే, ఫాల్కనర్ గురించి చదివి, పేజి తిప్పగానే లాజికల్ ఆండ్, ఆర్ బొమ్మలు చూసేటప్పటికి చెప్పలేనంత ఆశ్చర్యం. ఈ పుస్తకం ముఖ్యంగా రచనా వ్యాసంగంపై ఆసక్తి ఉన్నవారికి, దానికి ప్రోగ్రామింగ్ మధ్య గల సామ్యాలు చెప్పడమని నాకు అనిపించింది. దానికోసం రచయిత ఎంతో శ్రమ తీసుకొని, ఓపిగ్గా కంప్యూటర్లకు సంబంధించిన అనేక విషయాలను గురించి రాశారు. ముఖ్యంగా కంప్యూటర్ ఎలా పనిజేస్తుందన్న సంగతి కొంతమంది ప్రోగ్రామర్లేకే తెలీదంటూ, కంప్యూటర్ పనిజేయడానికి basic blocks అయిన వాటిని గురించి బొమ్మలతో సహా వివరించారు. ప్రోగ్రామింగ్ ఎప్పుడూ చదవనివారికి ఇవి కొంచెం overwhelming information అనిపించచ్చు కానీ, కొంచెం శ్రద్ధ పెడితే, మనం జీవితాల్లో భాగమై పోయిన కంప్యూటర్ల గురించి, మనం అనునిత్యం వాడే సాఫ్ట్వేర్ల గురించి చాలా విషయాలు తెలుస్తాయి.
అంతే కాదు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే వారమంతా వెట్టి చాకరి చేసి, బోలెడన్ని డబ్బులు సంపాదించి, అవన్నీ అనవసరపు, బడాయి ఖర్చులకు ధారపోయడం అని తెలుగునాట పాతుకుపోయిన అభిప్రాయానికి మించిన వాటిని గురించి తెల్సుకునే అవకాశం ఉంటుంది. ప్రోగ్రామింగ్ లో ఉండే ఆనందం, గంటలు గంటలకు ఒకేదానిపై పనిచేసి, దాన్ని మొత్తానికి కావాల్సిన విధంగా పనిజేయించుకోవడంలోని ఆనందం. వాటిని గురించి తెలుస్తుంది. అలాగే ప్రోగ్రామర్లకు డిప్రషన్ లాంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయో చెప్పుకొచ్చారు. మొత్తానికి సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు మాత్రమే గమనించగలిగేవి ఈయన పేర్కోవడం నన్ను చాలా చాలా ఆశ్చర్యపరిచింది. (నేనింకా అదే ఆశ్చర్యంలో ఉన్నాను కూడా!) ముఖ్యంగా, ఈ రంగంలో మహిళా నిపుణులకు జరుగుతున్న తీవ్ర అన్యాయం గురించి కూడా రాశారు.
అలానే, మన సాహిత్యం మొత్తం “quite male” అని రాశారు. ఎప్పుడో అరా, కొరా ఆడవాళ్ళ గొంతులు వినిపించినా అవి వెంటనే మూగబోయాయని వాపోయారు. “Women writing in India” అనే పుస్తకంలో చర్చించిన అనేక విషయాలను మళ్ళి చర్చించారు. ఇందులో ముద్దుపళిని, బెంగళూరు నాగరత్నమ్మ, వీరేశలింగం పంతుల గురించి కూడా రాశారు. కాకపోతే ఈ టాపిక్‍కు దాదాపుగా ఒక చాప్టర్ వెచ్చించచడం నాకు కొంచెం అసమంజసంగా అనిపించింది.
ప్రోగ్రామింగ్ పై పట్టుండి, సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఆయన చెప్పిన అన్నింటితో ఏకీభవించకపోయినా, కనీసం ఆలోచించవచ్చు, ఆపై విభేదించవచ్చు.
సాహిత్యంపై బోలెడంత ఆసక్తి, ఎంతోకొంత ప్రవేశం ఉన్నవారు, ప్రోగ్రామింగ్ పై కొంచెం అవగాహన పెంచుకోడానికి ఈ పుస్తకం బాగా పనికొస్తుంది. తప్పక ప్రయత్నించవచ్చు.
I’m glad someone wrote this book. And I’m super happy that it came my way. It is indeed a treasure to me!
Non-fiction
Graywolf Press
2014
Paperback
235
Sangita
విక్రం చంద్ర తో ఇంటర్వ్యూ ఈ బుక్ topic తో
http://www.abc.net.au/tv/bigideas/stories/2014/06/19/4029047.htm