ఆరునదులు – విశ్వనాథ సత్యనారాయణ
వ్యాసకర్త: Halley
********
విశ్వనాథ సత్యనారాయణ గారి “ఆరు నదులు” చదివింది బహుశా రెండేండ్ల కిందట అనుకుంటాను. అటు తర్వాత వారి నవలలు ఒక యాభై దాకా చదివినా “ఆరు నదులు” నచ్చినంతగా నచ్చినవి యెన్నో లేవని చెప్పచ్చు. ఈ మధ్యన ఒక మిత్రునితో చదివించినందున తిరిగి ఈ పుస్తకాన్ని తలుచుకోటం జరిగింది. ఇంత గొప్ప పుస్తకం గురించి నాలుగు మంచి మాటలు రాసిపెడితే, అంతర్జాలంలో విశ్వనాథ గురించి శోధించే వారికి ఎవరికయినా పనికొస్తుంది ఏమో ఆనీ, ఈ పరిచయం చదివాక ఇంకెవరైనా ఈ పుస్తకం చదివి విశ్వనాథ వారి భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారేమో అన్న ఉద్దేశ్యంతో రాస్తున్న పరిచయం ఇది.
ఇది ఒక కొత్త గద్య కావ్యం అంటారు విశ్వనాథ పీఠికలో. కాదు కాదు నవలే అంటారు మళ్ళీ. పీఠిక నుంచే విశ్వనాథ వారి మార్కు ప్రస్ఫుటంగా కనబడుతుంది.
ఇక పుస్తకము దేని గురించయ్యా అని అంటే ఆరు నదులకు అనుసంధానంగా పుట్టిన ఆరు నాగరికతల గురించి. “భారత యుద్ధము 5000ల యేళ్ళ కిందట జరిగితే, అప్పటికి మహానాగరికత ఉంటే, ఇటువంటి నాగరికత కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన దేశంలో ఉందని మన గ్రంథాలు చెబుతూ ఉంటే లేవని వీనిని నమ్మని ఒక జాతిని ఇంగ్లీషువాడు సృష్టించాడు. పాశ్చాత్యుల సృష్టి క్రమమూ చరిత్రా అంతా ఊహ! ఈజిప్టు గ్రీకు మాయన్ నాగరకతలు అంతా మన నాగరకత యొక్క భ్రష్ట స్వరూపాలు అని అనడానికి దాఖలాలు చూపబడ్డాయి”. ఇది విశ్వనాథ వారి వాదన. ఈ విషయం చుట్టూతా ఒక కథ అల్లారు. నీలా నది (Nile), త్రిగిరీశ నది (Tigris), యుపరితీశ నది (Euphrates), త్రయీ నగరం (Troy), శాల్మలీ ద్వీపం (Africa), గిరీశ దేశము (Greece), ఈశ పీఠం(Egypt) అనుకుంటూ ప్రపంచ పటాన్ని మన ముందు ఉంచుతారు విశ్వనాథ వారు. నమ్మాలా నమ్మకూడదా అన్నది ఎవరికివారు ఆలోచించుకోవచ్చు. ఒకరు చెబితే వినే తరం కాదు కదా ఇది ఎలాగూ!
పుస్తకంలో ప్రధానంగా ఉన్నది కథానాయిక (సోఫియా) . అసలు విశ్వనాథ వారి నవలా నాయికలలో ఇటువంటి పాత్ర మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ పాత్ర ప్రవర్తన ఆధునికం, జీవ లక్షణం వైదికము. కథానాయికే ఎందుకు అంటే, మన జాతిలో మనము నిలువ దొక్కుకునే పురుషత్వము చచ్చిపోయినది గనుక అని అంటారు విశ్వనాథ వారు. విశ్వనాథ తన నవలా సాహిత్యంలో సృజించిన స్త్రీ పాత్రలు చాలా శక్తివంతమైనవి. పేరెన్నిక గల ఫెమినిస్టులు కూడా బలాదూర్ ఈ విషయంలో ఆయన ముందు. పతంజలి శాస్త్రి అన్న పాత్ర చేసే ఉపన్యాసాల ద్వారా ఆయన పాఠకులకి చెప్పాలి అని అనుకున్న పాఠం చెప్పేస్తారు. ఇది కాక కమల, చిదంబరం దంపతులు, సోమనాథ శాస్త్రి , జాకబ్ వగైరాలు ఈ నవలలో ప్రధాన పాత్రలు.
ప్రమాణాల గురించిన చర్చ విశ్వనాథ వారి నవలలలో చాలా చోట్ల వచ్చేదే. అయితే ఈ నవల సమస్తం నాగరకతల గురించే అవటం మూలాన ఇందులో కొంచం ఎక్కువగానే వస్తుంది. ఒక రకంగా ఈ నవల Archaeological evidence, Scientific method వంటి విషయాల పైన విశ్వనాథ ఎక్కువెట్టిన బ్రహ్మాస్త్రం అని అనవచ్చును. “వాళ్ళకి ప్రమాణాలు లేవు. వాళ్ళ ఇష్టనిష్టాలే ప్రమాణాలు. వాళ్ళతో వాదం యెట్లా? ఆ మతం గొప్పా. ఈ మతం గొప్పా అని చర్చ వస్తే గొప్ప అంటే యేమిటి అన్న విషయం తేల్చుకోకుండా నిర్ణయించటం ఏట్లా?” అని అంటారు ఒక చోట.
ఇక ఈ వాదనా క్రమంలో భగవంతునికి ఆయన ఇచ్చిన definition నాకు బాగా నచ్చింది.
“ఒకడు తన బుద్ధి బలము చేత తన వ్యక్తి యొక్క ప్రతిభ చేత అజ్ఞాపింపకుండా పనులు చేయిస్తాడు. అతని పురుషాకృతి మనకి కనిపిస్తూనే ఉంటుంది కానీ, సర్వమును నియోగించే అతని ప్రతిభ మనకి కనిపించదు. అతని ప్రతిభ ఒక ముద్దగా ఉండి ఈ నియుక్తసర్వ కార్య కలాపానికి హేతువవుతుంది. సర్వ జగద్రక్షణ శీలమైన సర్వజగన్నియామకమైన అట్టి ప్రతిభా సంపుటి, వివేక సంపుటి, పరమ చైతన్య సంపుటి భగవంతుడు. ఆ ప్రతిభనెట్లు చూడలేవో ఈ భగవంతుడిని అట్లు చూడలేవు”
విశ్వనాథ వారి నవల అనగానే ధర్మము అన్న పదము రావలసిందే దాని గురించి పసందైన తర్కాలు ఉండాల్సిందే. అది రివాజు!
“లోకములో ధర్మము వేరు నీతి వేరు. ఈ ధర్మము పరమేశ్వరుడు నిర్మించాడు. పరమేశ్వరుడే లేడనే వాడు పరమేశ్వరుడు నిర్మించాడంటే ఒప్పుకోడు . భగవంతుడుంటే చూపించాలంటాడు. ఇంతకంటే తెలివి తక్కువ మాట ఉండదు. నేను ఫలానా ఆయన మనుమణ్ణి అంటాడు. ఆయన చచ్చిపోయినాడు. ఆయన మనుమడివి అయితే ఆయనని చూపించు అంటే ఎలాగు! ఆయన చచ్చిపోయినాడాయెను. “ఈయన న్యూయార్కు వెళ్ళాడు. లండన్ వెళ్ళాడు టోకియో వెళ్ళాడు” అని ఒకర్ని గురించి చెబితే, వెళ్ళలేదు అంటే ఏమి చేస్తావు. అలాంటి ఊళ్ళేలేవు అంటే ఏమి చేస్తావు. నాకు చూపించమంటే ఏమి చేస్తావు. డబ్బు పెట్టి వెళ్తే ఆ ఊళ్ళు కనిపిస్తవి. ఆ ఊళ్ళు లేవు అన్న ప్రతీవాణ్ణి డబ్బు పెట్టి వెళ్ళి చూపిస్తూ ఉంటావా. ఇలా అన్నీ కనిపించవు. చచ్చిపోయిన తాతయ్య యెలా కనిపిస్తాడు.”
ఈ మూడు వాక్యాల్లో ఎన్ని గొప్ప భావాలో. పతంజలి శాస్త్రి ఒక ఉపన్యాసములో ఇలా అంటాడు.
“ప్రతీ దానికి మొదలు ఉంటుందనే మన తెలివికి అది అందటము లేదు కానీ మానవ సృష్టి అనాది అని తర్కముతో వాదిస్తారు. ఈ సంసారమునకు మొదలు లేదు. అనాది నుంచి మానవుడు భారత దేశములోనే ఉన్నారని మీరు అన్నారు గదా! దానికి ప్రమాణము ఏమిటి అని అంటే, మన పురాణాలు మన శ్రుతి స్మృతులు. మేము నమ్మము అంటే, మీరు ఏదీ నమ్మకపోతే నాకు అభ్యంతరము లేదు గానీ, పాశ్చాత్యులు రాసింది నమ్ముతాము కానీ మీరు రాసింది నమ్మమంటే బాబూ ఇది న్యాయమా అని అడుగుతాను” అని.
ఈ మూడు ముక్కలు అర్థం చేసుకున్నామా పుస్తకం అంతా అర్థం అయినట్టే. అటు తర్వాత యెవరయినా ఇంగ్లీషు వాడు వచ్చి భారత దేశంలో ఏమి చేసాడయా అని అడిగితే మా ప్రమాణాలు మార్చివేసి వెళ్ళాడు అని చెప్పచ్చు ఎంచక్కా. “మాల మాదిగలలో శైవులున్నారు వైష్ణవులున్నారు స్మార్తులున్నారు. వాళ్ళలో పెద్ద పండితులున్నారు. మన దేశములో క్రైస్తవ మిషనరీలను పల్టీలు కొట్టించిన మాల దాసరులున్నారు. చిత్తు చేసిన మాల జంగాలున్నారు” అని అంటారు విశ్వనాథ మరో చోట.
ఇక మతము గురించి అన్న కొన్ని మాటలను పరిశీలించండి. సోమనాథ శాస్త్రి తన యజమాని అయిన జాకబ్ తో అన్న మాటలు ఇవి-
“మా మతములో తప్పులు మీరు చూపిస్తారు మేము ఊరుకుంటాము. మాలో కొందరు నిజమే మా తప్పు ఉందని ఒప్పుకుంటారు. ఇతర మతాలవారు ఒప్పుకోరు సరికదా పోట్లాడతారు విరోధాలు పెట్టుకుంటారు. అపకారాలు చేస్తారు. ఇది మా మతాలకీ ఇతర మతాలకీ భేదము. మా మతములోనే బ్రాహ్మణులు ఉన్నారు. ఇతర కులాల వారున్నారు. ఏ కులము వాణ్ణ్ణన్నా పేచీయే. ఒక్క బ్రాహ్మణులనంటేనే ఏ పేచీ లేదు. ఒక కులాన్ని అంటే వాళ్ళు దుకాణాన్ని మూసివేస్తారు. ఇంకొకళ్ళనంటే వాళ్ళు కర్ర పుచ్చుకొని పైకి వస్తారు. మరి ఒకళ్ళ నంటే పని చేయటం మానివేస్తారు. ఒక్క బ్రహ్మణులని యే భయం లేకుండా ఏది పడితే అది అనవచ్చు. అన్ని మతాలలోను జవసత్వం ఉడిగిపోయిన మతము హిందు మతము అవుతే హిందుమతములోన అన్ని వర్ణాలలోని జవసత్వాలు ఊడిగిపోయిన వర్ణము బ్రాహ్మణ వర్ణము.”
ప్రతి నవలలోనూ ఎక్కడో ఒక చోట ఇంగ్లీషు వాడిని తలుచుకోకుండా ఉండలేరు విశ్వనాథ. విశ్వనాథకి ఇంగ్లీషు వాడు bête noire. అయితే ఆ కోపం వెనుక ఒక వేదన ఉంది. ఒక ఆవేశం ఉంది. ఈ వాక్యాలను చదివితే బహుశా ఆయన ఆవేదన తెలుస్తుంది మనకు.
“జనము ఎక్కువ భాగము అపండితులై ఉంటారు. ఈ సామాన్య జనాలని అధికారులు పాలిస్తూ ఉంటారు. ఆ ఇంగ్లీషు వాడి తెలివి ఏమిటంటే చదువుకునే వాళ్ళందరికీ తన చదువు చెప్పాడు. వాళ్ళనందరినీ అధికారులని చేసాడు. తన సిద్ధాంతాలు నేర్పాడు. వందయేళ్ళలో దేశం అంతా మారిపోయింది. ఆర్యులీ దేశము వారు కారనీ ఎక్కడి నుంచో వచ్చారని చిన్నపిల్లల పుస్తకాలలో రాయడం దగ్గర నుంచి నూరి పోశారు. ఈ పని ఎందుకు చేశాడంటే ఆ మొదటి ఆర్యులే ఈ దేశము వారు కారు. ఎప్పుడూ ఈ దేశము గతి ఇంతే. ఎవళ్ళో రావటం ఆక్రమించుకోవటం అని నేర్పాడు. యెందుకు? తాను వచ్చి ఆక్రమించుకోవటంలో తప్పేమీ లేదనడానికి. తెలిసిందా?”
ఇక పతంజలి శాస్త్రి తన ఉపన్యాసములో అన్న ఈ మాట తప్పక గుర్తు పెట్టుకోవలసిన మాట. పది మందితో పంచుకోవలసిన మాట!
“నాగరకత అంటే ఏమిటో నిన్న చెప్పాను. ఆతిథ్యము, ఔదార్యము, దాక్షిణ్యము, ధర్మము, సత్యము, అహింస, శాంతి, దాంతి! మన వాళ్ళు కూడా ఇదంతా మర్చిపోయి పరమ నాగరకత అంటే ఆటం బాంబు అని అనుకుంటున్నారు”
ఆంగ్లేయుల పాలన తర్వాత పుట్టిన ప్రతి తరాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య గురించి ఆయన రాసిన వాక్యాలు ఇవి. నిజానికి అసలు సిసలైన సంఘ సంస్కర్తలు అంటూ యెవరన్నా ఉంటే ఈ భావదాస్యం నుంచి దేశాన్ని విముక్తులని చేస్తే వేరే ఏ సంస్కరణా అక్కర్లేదు ఈ దేశానికి నాకు తెలిసి.
“మన పురాణాలలోని కథలన్నీ, వాళ్ళ దేశాలలోని సామాన్య చరిత్రకారులు – రాజకీయ దురహంకారముచే ప్రోత్సాహింపబడ్డ చరిత్ర కారులు – పుక్కిటి పురాణాలని వ్రాస్తే మన డూడూ బసవన్నలు నిజమేనని నృత్యము చేయటమే కానీ, తమంతట తాము స్వతంత్ర పరిశోధన చేసిన వాళ్ళు కారు. వాళ్ళు, వాళ్ళ చదువు చదవటము, వాళ్ళు చెప్పినవన్నీ రైటనటము, వాళ్ళ మార్గములో పెద్ద పెద్ద పరీక్షలు పాసు కావటము, విశ్వవిద్యాలయాలలో ఆచార్య స్థానాలు పొందటమూ, అదే జీవిత పరమార్థము అన్నట్టు ప్రవర్తించటము, మన నాగరకత వాళ్ళ నాగరకతకులొచ్చు అని అనుకోవటము, స్వతంత్రంగా ఊహించుకోవటం లేకపోవటము, స్వదేశాభిమానము, స్వమతాభిమానము, స్వజాత్యాభిమానము లేకపోవటము! వాళ్ళు చేసిన పరిశోధనలు, వాళ్ళు మన సిద్ధాంతాలను కాదన్నవి. సృష్టి ఏసుక్రీస్తుకు పూర్వము రెండు వేల యేళ్ళ కిందట జరిగినది అని బైబిలులో ఉంటే – వాళ్ళు చేసిన పరిశోధనల వలన “క్రీస్తు పూర్వము యెనిమిది వేల యేళ్ళ పూర్వము కూడా ప్రపంచకములో పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నవి. నాగరకతలు ఉన్నవి” అని వాళ్ళు స్థాపించారు. వాళ్ళ మత గ్రంథమైన బైబిలులో ఉన్న కాలనిర్ణయము, వాళ్ళు చేసిన భూగర్భ ఖననాది క్రియల చేత తప్పని వాళ్ళే రుజువు చేసికొన్నారు. మన భారత యుద్ధము అయిదు వేల ఏళ్ళ కిందట జరిగింది అంటే మన పండితులు నమ్మరే!? వాళ్ళు చదివిన చదువులో అట్లా లేదు”
“ఎంతసేపటికీ ఆ పాశ్చాత్యులు రాసిన కాలానికి సరిపెడదామనే ప్రయత్నమే తప్ప, మన పురాణాలలో మన పూర్వ ఋషులు చెప్పిన కాలము సరిపోతుందా అన్న విచారణ లేదు. అందుచేత భారతము క్రీస్తు పూర్వము రెండు వేల యేండ్ల కిందట వ్రాయబడ్డది. ఇంకొక రెండు వేల యేండ్ల కిందట రామాయణము వ్రాయబడ్డది. బస్! సరిపోయింది! ఇంక బస్సెక్కు! కాలేజికి వేళవుతున్నది”
ఆలోచించకుండా ఆవేశానికి లోనయ్యే వాళ్ళకి ఈ వాక్యాలు చదివాక కోపము రావచ్చు. అతిత్వరలో అందరం డెవలప్ అయిపోతాం అని అనుకునే వాళ్ళకు కూడానూ! అంటే అందరం త్వరలో కార్లు కొంటాం, అందరమూ బంగళాలు కొంటాం, అందరమూ ప్రపంచ పర్యటనలు చేసేస్తాం. త్వరలో అతి త్వరలో జీ.డీ.పీ ఆకాశాన్ని అంటుతుంది అన్నీ జరిగిపోతాయి చూస్తూ ఉండండి అని అనుకునే వాళ్ళకి ఇది పాత చింతకాయ ఆలోచనలు అని అనిపించవచ్చు. నా మట్టుకు నాకు ఇందులో కొంత నిజము లేక పోలేదు అని అనిపించింది.
“ఇట్లా ఉండగా క్రైస్తవు లిచ్చట రాజ్యము చేసినపుడు, అనగా ఇంగ్లీషు వాళ్ళు రాజ్యము చేసినప్పుడు, హరిజనులలో కొంతమందిని క్రైస్తవులుగా మార్చి, వాళ్ళకు చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చినారే కానీ, యదార్థంగా వాళ్ళ సంఘాన్ని బాగు చేసింది ఏమీ లేదు. యెక్కడ ఉన్నావే గొంగళి అని అంటే వేసిన చోటే ఉన్నాను అంటున్నాయి ఆ కులాలు. ఇంగ్లీషు వాళ్ళు బాగు చేసిందీ లేదు. గాంధీ బాగు చేసిందీ లేదు. అమెరికాలోనూ, ఇంగ్లాండులోనూ తల్లులు సినిమాలకు పోయి, పసి పిల్లలకు నల్లమందు వేసి పోతారట. వాళ్ళు ఆయినా కూడా హరిజనులకు ఒక నల్లమందు వేసారు. ఈ నల్ల మందు అస్పృశ్యతా నివారణమన మాట. రెండవ నల్లమందు హరిజన దేవాలయ ప్రవేశము. అదీ సాగలేదు ఇదీ సాగలేదు. కడచిన యాబై అరవై యెండ్లుగా ఇంగ్లీషు వాళ్ళూ, వాళ్ళని అనుసరించిన గాంధీ మతస్తులూ చేసిన మహాకార్యమేమిటంటే దేశంలో శాంతి అనేది లేకుండా చేసారు. విప్లవ భావాలు రేకెత్తించారు. కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, వర్ణం పేరు చెప్పి యెవరు ధనవంతులో వారి మీద యెక్కువ దౌర్జన్యం చేయటానికి వీలేర్పరచారు. ఈ ప్రజాస్వామీకం వచ్చాక ఈ లక్షణం మరీ వృద్ధి పొందింది. హరిజనులు మరీ అధోగతికి పోయినారు. అదివరకు తిండీతిప్పలు ఎట్లున్నా మానవుల మధ్య ఒక సౌహార్దం ఉండేది. అందరం కలసి బతకాలి అనే భావం ఉండేది. ఇప్పుడది విచ్ఛిన్నమై పోయింది”
ఇక మనము మన చదువులలో అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే “కాలం” అన్న విషయం గురించి విశ్వనాథ (పతంజలి శాస్త్రి) ఆలోచనలు ఇవి. నేటి కాలపు మేధావులు ఈ విషయాల గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు యేవి లేవు. కొన్ని ఏండ్ల కిందట వీటి గురించి రాసిన విశ్వనాథనూ ఆయన మేథస్సునూ మనం పట్టించుకున్న దాఖలాలూ తక్కువే ఆ మాట కొస్తే! మన జీవన విధానాన్నే సమూలంగా మార్చి వేసే శక్తి గల అంశం ఇది, కాలం అన్నది.
“పూర్వ జన్మలూ పర జన్మలూ లేవు అని నీవు ఒక సిద్ధాంతం పెట్టుకున్నావు అనుకో. ఫలితమేమవుతుంది? ఎవడు పడితే వాడు, ఈ అనంత కాలంలో అనంత దేశాలలో ఒక్కసారే పుడతాడు. చిన్నప్పుడే చస్తే పీడ వదిలిపోతుంది! డెబ్బై యెనభై యేళ్ళు బతికితే ప్రతి మనుష్యుడు సర్వ సుఖాలు అనుభవించాలి కనుక సర్వ వాంఛలూ తీర్చుకోవాలి గనుక, అనంత కాలానంత దేశములందున్న సర్వ వాంఛలు సర్వ సుఖాలు వాడికి ఆ జన్మలోనే తీరాలి గనుక, వాడి అనీతి ప్రవర్తనకవధి ఉండదు. ఇది ఒక జాతి లక్షణమైతే, సృష్టిలో వాళ్ళ వల్ల జరిగే ఘోరాలకవధి ఉండదు. ఇట్లా ఒక జాతి నిర్మించుకున్న మతమూ, మత సిద్ధాంతాలూ, దేవతా భావనా, నీతి భావనా వాటి మీద ఆ జాతి యొక్క ప్రవర్తన సాగుతూ ఉంటుంది”
“ఎంత మటుకు తెలిస్తే అంత మటుకే మనకు తెలియటం. ఇంతవరకు తెలిసింది అని అనుకోవాలి తప్ప మనకు తెలియంది లేదనుకోవటం ఏమి జ్ఞానం” అని అంటాడు పతంజలి శాస్త్రి మరో చోట.
మరోచోట ఇలా అంటాడు పతంజలి శాస్ర్త్రి . ఇటువంటివి చదివి గర్వించాలో లేక ఎంత పతనమవుతున్నామో తలుచుకోని బాధపడాలో మనమే తేల్చుకోవాలి అనట్టు ఉంటాయి పతంజలి శాస్త్రి ఉపన్యాసాలు!
“ఆ జాతి యొక్క నాగరకత, వాళ్ళ మతము, వాళ్ళ సిద్ధాంతాలూ, వాళ్ళ జీవితం అన్నీ అవినాభావ సంబంధంగా ఉన్న జాతి సంపూర్ణ జాతి! మన దేశంలో వేద శాస్త్ర పురాణములు పునాదులు. మతాలు అందులోంచి పుట్టినవి. వేదాంతమందులోంచి పుట్టినది. సంఘనిర్మాణమందులోంచి పుట్టినది. వేద శాస్త్ర పురాణాది మహా గ్రంథ సముదాయము లోంచి మహార్థ ప్రతిబింబము కాని మానవ జీవితము, అణుమాత్రమైనా యదార్థమైన భారత దేశము నందు లేదు.”
అయితే అక్కడక్కడా పతంజలి శాస్త్రి ఉపన్యాసాలలో ఇటువంటి వాక్యాలు చదివినప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది అనమాట పాఠకులకు!
“మన భారత దేశమున్నది. ప్రథమ సృష్టి ఇచ్చట జరిగింది. భగవంతుడు ధర్మాన్ని మొదట ఇచట స్థాపించాడు. తాను దశావతారాలు ఇచ్చటనే ఎత్తాడు. ఎన్ని విప్లవాలు వచ్చినా వైదిక ధర్మం ఇచ్చట చెడిపోదు. సర్వ నాశనం జరుగుతుంది అని అనిపించినప్పుడు కూడా మళ్ళీ ఆ చివరి నిమిషములో యే కారణమో కలిగి, ఆ వేదమతము మళ్ళీ వృద్ధి పొందుతుంది.”
“వేయి పడగలు” తర్వాత ఆ స్థాయిలో చదువరిని ప్రభావితం చేయగల శక్తి ఉన్న నవల ఇది. ఎదో కథ చెప్పాలి అన్నట్టుగా కాకుండా ఒక ఉదాత్తమైన లక్ష్యంతో రాస్తారు విశ్వనాథ వారు నవలలు. ఒక్కసారి సరిగ్గా చదివితే జీవితాంతం ఆలోచించుకోగల ప్రశ్నలతో వదిలేస్తారు మనలని. ఆలోచించే కొద్దీ సమాధానాలు కూడా వారి రచనలలోనే దొరకుతాయి కూడాను!
Novel
sharan
sir pdf available vunte kasta send cheyandi aarunadulu . koshika.sharanya@gmail.com
9966825682 whatsapp cheyandi
శ్రీగిరిరాజు వేంకట సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదు
బాగుందండీ. ఆనదించాను.