అంతా మనవాళ్ళే!

(డా. సోమరాజు సుశీల గారి కొత్త పుస్తకం ‘ముగ్గురు కొలంబస్‌లు’కు ముందు మాట)

ఐదువందల ఏళ్ళ క్రితం వరకూ మన దేశం మంచి భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేదట. వేరేదేశాల్లో దొరకని రకరకాల పంటలు పండేవట. మన మిరియాలు లేకపోతే యూరప్ రాచకుటుంబాలవారికి  ముద్ద దిగేది కాదట.  పత్తైనా, పట్టైనా, మనవారి నేతపని అంటే ప్రపంచమంతా మహా మోజుగా ఉండేదట. అబ్బో, ఇక రత్నాలైతే రాసులుగా పోసుకొని రహదారుల్లో అమ్మేవారట. అందరి కళ్ళూ మనమీదే ఉండేవట. అన్ని దేశాలవారికీ మనతో వర్తకం చేయాలని, మన దినుసులు తీసుకు వెళ్ళి అమ్ముకోవాలని మహా తహతహగా ఉండేదట. మనతో వ్యాపారానికి దగ్గర దారులు వెతుక్కునేవారట. యూరోపియన్లు నేలదారిన మనవైపు వచ్చేమార్గం తురుష్కుల అధీనంలోకి రావడంతో సుగమంగా ఉండే సముద్రమార్గాన్ని వెతకాలని బోలెడు మంది రాజులు, నావికులు ప్రయత్నించటం మొదలెట్టారట.

భూమి గుండ్రంగా ఉంటుంది కనుక పడమటిదారిన బయలుదేరితే, నెమ్మదిగా ఇండియా చేరవచ్చు అన్న గొప్ప ఆలోచన క్రిస్టొఫర్ కొలంబస్ అనే ఇటలీ దేశపు నావికుడికి వచ్చింది. చాలామంది ఎగతాళి చేసినా, ఎందరో రాజులు ధనసహాయం చేయటానికి నిరాకరించినా పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగి తిరిగి, చివరకు స్పెయిన్ దేశపు రాజదంపతులని ఒప్పించి వారి పెట్టుబడితో, 1492లో శాంతా మరియా, పింటా, నీనా అనే మూడు ఓడల్లో రెణ్ణెళ్ళ పాటు పడమటి దిక్కుకు ప్రయాణం చేసి అక్టోబరు 12న ఒక ద్వీపాన్ని చేరుకొన్నాడు. ఆసియా ఖండానికి కొత్త దారిని కనిపెట్టేశానని తెగ ఆనందపడిపోయాడు.

కానీ ఆయన చేరింది ఆసియాని కాదు. అప్పటిదాకా యూరప్‌వాసులకి తెలియని ఒక కొత్త ఖండాన్ని (ఆ ఖండానికి తర్వాత అమెరికా అని పేరు పెట్టారు). ఐతేనేం, ఆయన ఇండియాని కనుకున్నాడనుకుని, ముందునుంచి అక్కడ ఉంటున్న వాళ్ళని ఇండియన్లనేసి, రంగు కొద్దిగా తేడాగా ఉందని రెడ్ ఇండియన్లనే పేరు ఖాయం చేశారు. యూరప్ నుంచి తంబలు తంబలుగా జనాలు వలస వచ్చేసి, వ్యాపారాలూ, యుద్ధాలూ, సంధులూ అంటూ మోసాలూ చేసీ, హింసలు పెట్టీ, అసలు హక్కుదారుల్ని రిజర్వేషన్లలోకి నెట్టేసి, సహజ వనరులన్నిటినీ అభివృద్ధి చేసేసుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాల పేర కొత్త దేశాన్ని నిర్మించుకొని, వాళ్ళ అంగళ్ళలో ఒక్క రత్నాలేమిటి, ప్రపంచంలో దొరికే ప్రతీదీ చవగ్గా కొనేసి, టోకున అమ్మేయటం మొదలుపెట్టారు.

ఈలోగా అసలు ఇండియన్లని నానాదేశాల వారు పంచేసుకొని, దోచేసుకొని, మాకు స్వతంత్రం కావాలని మనం నానా గొడవలు చేశాక, దోచుకోగా మిగిలిన అవశేషాన్ని మన మొహాన పడేసి, మీ చావు మీరు చావండని చక్కా వెళ్ళిపోయారు. అసలే సిరులన్నీ పోయాయి అనుకొంటుంటే, దేశానికి అవసరమైనదానికన్నా జనాభా పెరిగిపోవటంతో, కొద్దిగా పెద్ద బ్రెయిన్లన్నీ వాటికెక్కడ లాభదాయకంగా ఉంటుంది సుమ్మీ అని ఆలోచిస్తే, అప్పుడు వాటికి కనిపించిందయ్యా అమెరికా.

ఇంకేం, అప్పుడెప్పుడో కొలంబస్ అననే అన్నాడు, అది ఇండియానే అని. ఆ మాటే ఖాయం చేద్దాం అనేసుకొని ఆ బ్రెయిన్ల తాలూకువారంతా అమెరికా దిగడ్డం మొదలెట్టారు. గవర్న్‌మెంట్‌వాళ్ళు బ్రెయిన్ డ్రెయిన్ అని వాపోతున్నా వినిపించుకోకుండా, తల్లితండ్రులు మాత్రం ఉత్సాహంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ బిడ్డల్ని పెంచి పోషించి అమెరికా పంపేస్తున్నారు. ఇట్లా దేశాంతరం వచ్చిన పిల్లలేమీ తక్కువ తినకుండా అమెరికా అంతా మాదేనోయ్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ముందు హాస్పిటళ్ళనీ, యూనివర్సిటీలనూ ఏలేయటం మొదలెట్టారు.  బ్రిడ్జీలూ, బిల్డింగులూ డిజైన్ చేయాలన్నా, మెషీన్లతో కొత్త పనులు చేయించాలన్నా, బాడీలు బాగుచేయాలన్నా వీళ్ళే కావాలి అనిపించుకున్నారు. ఆ తర్వాత వైటూకే పుణ్యమా అని, ఇండియన్లు లేకపోతే మేం పనిచేయం అని కంప్యూటర్లు అనేసేంతవరకూ తెచ్చారు. స్పెల్లింగ్ బీలూ, లెక్కల పోటీలు, చదువూ, స్కాలర్‌షిప్పులు వంటి కష్టమైన పనులన్నీ మా పిల్లలు చూసుకుంటార్లే అని అమెరికన్ పిల్లలను హాయిగా బేస్‌బాలూ, ఫుట్‌బాలూ ఆడుకోటానికి పంపేశారు. చూస్తూ చూస్తూ ఉండగానే, మన పిల్లలు రెండు రాష్ట్రాల్లో గవర్నర్‌గిరీ చెలాయించటం మొదలుపెట్టారు. ఇంకొకాయనేమో రేపో మాపో సుప్రీం కోర్టు జడ్జీ అవుతాడు అంటున్నారు. బిల్ గేట్స్ అంతటి వాడు పక్కకు తప్పుకొని, ప్రపంచంలోకల్లా పెద్ద కంపెనీకి ఒక తెలుగాయన్న్ను పెద్ద తలకాయ చేశాడు. ఇవన్నీ చాలనట్టు, ఇంకో తెలుగమ్మాయి మిస్ అమెరికా పట్టం కట్టించుకొంది. ఇంకా కొన్నాళ్ళు గడిస్తే ఆ శ్వేతసౌధంకూడా మాదే అని ఇంకో ఇండియన్ అక్కడ కాపరం పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇండియన్లతో వర్తకం చేసి లాభం పొందుదామని కొలంబస్సు కనుక్కున్న అమెరికాకి దారి, అసలు ఇండియన్లకి కొద్దిగా ఆలస్యంగా తెలిసినా, మూడు దశాబ్దాల్లో ఆ దారిని రహదారి చేసేశారు. ఇకనేం, ఇప్పుడు రోజూ కొన్ని వేల మంది కొలంబస్సులు, ఎయిర్‌బస్సులనిండా అమెరికా వచ్చేస్తున్నారు.  సముద్రతరంగాల మీదతెరచాప ఓడలెక్కి తుపానులు తట్టుకుంటూ వచ్చే రోజులు కాకపోయినా, వీరిలో ప్రతి ఒక్కరిదీ ఒక సాహసయాత్రే. మనకు బాగా వచ్చుననుకున్న భాషను మనకు అర్థం కాకుండా పలికే దేశం కాని దేశం. అలవాటు లేని వాతావరణం. మన పద్ధతులూ, పాడూ ఉండవయ్యే. బతుకు తెరువు వెతుక్కుంటూ కుర్రవయసు హుషారులో వచ్చేవారిది సాహసమే ఐనా, దూరంగా ఉన్న పిల్లల్నీ, అక్కడే పుట్టి పెరుగుతున్న మనవళ్ళనీ, మనవరాళ్ళనీ చూసి, ముద్దు పెట్టుకుని అక్కున చేర్చుకుని మురిపాలు తీర్చుకోవాలన్న బులపాటంతో, ఎప్పుడూ ఊరువదలని పెద్దవాళ్ళు కూడా బలవంతంగా తమ మూలాలనుంచి తమను తాము పెరుక్కొని పరాయిదేశం ప్రయాణించటం ఏమన్నా తక్కువ సాహసమా?

అలాంటి ముగ్గురు సాహసయాత్రికుల అనుభవాలని మనకి అందిస్తున్నారు డాక్టర్ సోమరాజు సుశీల గారు. సుశీల గారు ఉత్తమా ఇల్లాలు అని మనకు ఇంతకుముందే తెలుసనుకోండి. వాళ్ళాయన, అత్తగారూ, ఇతర కుటుంబసభ్యులూ ఎంత చిత్రహింసలు (కౄర హింసలు కాదండోయ్) పెడుతున్నా పల్లెత్తు మాటనకుండా (అన్నా ఎవరూ వినిపించుకోరని ఆవిడకు తెలుసు) పాపం తన అవస్థలు తాను పడుతూ, అప్పుడప్పుడూ కథలూ, పుస్తకాలూ రాసుకుంటూ ఉంటారు. సుశీలగారి కుమార్తె దేశాలు పట్టిపోయిందా లేక విదేశంలో ఉంటుందా అనేది కొంత వివాదాస్పద అంశమట. కాని వారి కుటుంబ విషయాల్లో మనం తీర్పు చెప్పటం అంత మర్యాదగా ఉండదు.  పదోక్లాసులో ఉండగానే పక్కింటి బాబుని తన కాబోయే భర్తగా సెలెక్ట్ చేసేసుకున్న కుమార్తె డిగ్రీ పూర్తి చేసుకుని, ఆ బాబుతో కలసి అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఇంచక్కా పీహెచ్‌డీ చేసేసుకుంటూ, అక్కడే ఒక చక్కని పాపాయిని కూడా కనేసింది. పాపం ఇక్కడ అమ్మమ్మ ప్రాణాలు కొట్టుకుపోతున్నా, మనవరాల్ని చూడ్డానికి కుదరని పరిస్థితి. ప్రయాణాలంటే శ్రీవారికి తగని పరాకు. సుశీల గారంతటి మహాయిల్లాలు ఆయన్నీ, అత్తగారినీవదిలేసి ఒక్కతే అమెరికా ఎలా వెళతారు?

మహత్ప్రయత్నమ్మీద వారిద్దరినీ బయల్దేరదీసి హైదరాబాద్-మద్రాస్ ఎక్స్‌ప్రెస్‌లో అమెరికా బయల్దేరారు. (మద్రాస్ ఎక్స్‌ప్రెస్‌లో అమెరికా వెళ్ళడమేమిటి అంటారా? లోపల చదువుకోండి; నామటుకు నేనూ అమెరికాకి సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లోనే బయలుదేరాను లెండి). అప్పుడు మొదలుబెట్టి మళ్ళీ బొంబాయిలో దిగేసి, హమ్మయ్య మనదేశం తిరిగొచ్చేశాం అని గ్యారంటీగా కళ్ళముందు గుర్తులు కనిపించేదాకా ఈ ముగ్గురు కొలంబస్సులు చేసిన సాహస పర్యటన కథ ఇది.

నిజానికి అమెరికాలో అనుభవాల గురించి చదవడానికి ఇప్పుడు కొత్తదనమేమీ ఉండకూడదు. నలభై యాభై ఏళ్ళ క్రితం అక్కినేని నాగేశ్వరరావుగారో (నేను చూసిన అమెరికా), ఆయన బావమరిదో (అంతా కలిస్తే అమెరికా) అమెరికా వచ్చి తాము చూసినవన్నీ పుస్తకాలుగా రాస్తే, అందరమూ ఆరాటంగా చదివి ఆశ్చర్యపడిపోయిన రోజులు కావు ఇవి. ఆంధ్రదేశంలో కనీసం సగం మంది రచయితల పిల్లలు అమెరికాలో ఉండటంతో, ప్రతి వేసవి కాలమూ దేశం నలుమూలలా తమ మనవళ్ళూ, మనవరాళ్ళతో ఆడుకొంటున్న రచయితల, జర్నలిస్టుల హాహాకారాలు (వేరే అర్థాలు తీయద్దు, ఇవి అమెరికన్ హాహాలు – అంటే నవ్వులులెండి) వినిపిస్తూంటాయి. వాళ్ళందరూ తలా ఒక నవలో, కథో, కాకపొతే ఒక కాలమో, వ్యాసమో రాయకుండా ఉండరు.

మరైతే ఈ పుస్తకం ఎందుకు చదవాలట? రెండు కారణాలున్నాయి. మొదటిదేమిటంటే, ఈ పుస్తకం రాసింది ఇల్లేరమ్మ గారు కాబట్టి. ఇంకెవరూ mugguruఆవిడలారాయలేరు కాబట్టి. పేజీకి కనీసం పదిసార్లన్నా హాయిగా నవ్వుకోవచ్చు కాబట్టి. అట్లా నవ్విస్తూనే జీవితసత్యాలను కూడా చెప్పగల చాతుర్యం ఆవిడకి ఉందికాబట్టి.  ఆవిడ అమెరికా కబుర్లతో పాటు, ఆవిడకి మాత్రమే సొంతమైన గృహప్రపంచపు కబుర్లూ (చాలాసార్లు ఇష్టంగానూ, కొన్నిసార్లు – ఉత్తుత్తి – కష్టంగానూ) కలేసి నిర్మొహమోటంగా చెప్పేస్తారు కాబట్టి. ఇట్లా చాలా కాబట్టిల పట్టీ విప్పగలను కానీ ప్రస్తుతానికి ఆపేస్తాను.

రెండో కారణమేమిటంటే, సుశీలగారు ఈ పుస్తకంలో చెప్పిన కబుర్లు, సామాన్యంగా అందరూ చెప్పే అమెరికా కబుర్లకన్నా భిన్నమైనవి. అమెరికా వచ్చే మనవారు చాలామంది తమవారి మధ్య ఉంటూ, రోజూ ఇంటర్నెట్‌లో తెలుగు పేపర్లు చదువుతూ, డిష్ నెట్వర్క్‌లో తెలుగు సినిమాలు, సీరియళ్ళూ చూస్తూ, వీకెండ్లలో తోటితెలుగువారితో కలుస్తూ ఇండియాకి అమెరికాకి తేడా లేకుండా సమయం గడిపేస్తుంటారు. ఎప్పుడో హడావుడిగా నాలుగు ప్రముఖ పర్యాటక ప్రదేశాలు చూసేసి తిరుగుప్రయాణం కడతారు. అమెరికన్లతో గడపటం కాని, వారి జీవితాన్ని దగ్గరగా చూడటంగాని సాధారణంగా చేయరు. వీరిలో కొంతమందికి అమెరికా అంటే ఒకనాలుగ్గోడల బందిఖానా; మరికొంతమందికి భూతలస్వర్గం.

సుశీలగారు ఈ పర్యటనలో అమెరికాలో రెండు నెలలే ఉన్నా, మామూలు పర్యాటకులకంటే భిన్నమైన అనుభవాల్ని పొందారు.  దీనికి ఆమె వ్యక్తిత్వమూ, అభిరుచులూ ఒక కారణం ఐతే, ఆమె కుమార్తె కుటుంబం జీవిస్తున్న విధానం ఇంకో కారణం. తెలుగుదనాన్ని వదిలిపెట్టకుండానే, వారి చుట్టుపక్కల ఉన్న అమెరికన్ల సాంఘికజీవనంలో వారు భాగస్వాములవటం మెచ్చుకోతగ్గ విషయం. అందుచేత, అమెరికన్ సాంఘిక జీవనాన్ని పరిశీలించగల సౌకర్యం సుశీలగారికి కలిగింది. దేశమేదయినా, పద్ధతులలో తేడాలున్నా మానవస్వభావం మాత్రం ఒక్కటే అన్న సత్యాన్ని ఆవిడ మళ్ళీ మళ్ళీ చూడగలగటానికి దోహదం చేసింది. ఈ ట్రిప్పులో సుశీలగారు అందరూ చేసే పనులూ కొన్ని చేశారు. మిగతావారు సాధారణంగా చేయని పనులు (మంత్లీ పాసుతో దీర్ఘ రైలు ప్రయాణాలు చేయడం, జాజ్ అండ్ పాప్ కాన్సర్ట్‌కు వెళ్ళడం, షెనండావా లోయలో క్యాంపింగ్ చేయటం, ఫార్మర్స్ మార్కెట్టుకు వెళ్ళి స్ప్రింగ్‌రోల్స్ తినటం వంటివి) చాలా చేశారు. నచ్చినవీ, నచ్చనివీ నిర్మొహమోటంగా మనతో పంచుకున్నారు. ప్రతి విషయమూ మనసుకు తాకేలా చెప్పారు. అదీ ఈ పుస్తకం ప్రత్యేకత.

ఈ పుస్తకానికి కథలు –కథనాలు అని ఉపశీర్షిక పెట్టారు కాని, నిజానికి సుశీలగారు కథలు రాయలేదు. కబుర్లు చెప్పారు. సాయంత్రం పకోడీలు తింటూ కాఫీయో, టీయో తాగుతూ, తీరిగ్గా కూచున్నప్పుడు మనకిష్టమైన మాటకారి పెద్దమ్మ అందరినీ  పగలబడి నవ్విస్తూ  చెప్పుకునే తలపోతల్లా సాగిపోతూ ఉంటాయి ఈ కబుర్లు. చూసిన, చేసిన విషయాల కబుర్లు సరదాగా ఉంటే, వాటిచుట్టూ ఉండే పిట్టకథలూ, స్వగతాలూ, వ్యాఖ్యానాలూ బహుపసందుగా ఉంటాయి.  ఇంట్లో పెద్దావిడ (అత్తగారి) దగ్గరనుంచి  అమెరికా పక్కింటి పిన్నిగారి వరకూ రకరకాల మనుష్యుల కబుర్లు చెప్తూనే,  మధ్యలో అమెరికాలో కనిపించిన గడ్డిపూలు చూస్తూ కృష్ణశాస్త్రిగారినీ గుర్తు చేయగలరు. ఏ మాటకామాటే, చెపుతున్న ముఖ్యవిషయంలో మిగతా అన్ని విషయాలూ చక్కగా ఇమిడిపోయి ఎక్కడా సాగతీత, విసుగుబాటూ ఉండకుండా సమయం ఇట్టే గడచిపోతుంది.

సుశీలగారి కబుర్లతో పాటు, ఆ కబుర్లలో ఉన్న సెటైర్నీ, స్పిరిట్నీ ఒడుపుగా పట్టుకొని కళ్ళకు కట్టించారు శ్రీ అన్వర్. అంటే ఎక్కువగా ఉంటుందేమో కానీ, నా చిన్నప్పుడు స్వామీ అతని స్నేహితులు (ఆర్కే నారాయణ్) పుస్తకాన్ని లక్ష్మణ్ బొమ్మలతో చదువుకోవడం గుర్తొచ్చింది. విద్వాన్ విశ్వం గారి మాటల్లో చెప్పాలంటే ఇడ్లీకి పచ్చడి బాగా కుదిరింది.

ముందుమాట రాయమని అడిగి గౌరవించినందుకు సుశీల గారికి కృతజ్ఞుణ్ణి.  ఆ మర్యాద నిలుపుకోకుండా, ఈ పుస్తకం ఆలస్యం కావటానికి కారణమైనందుకు క్షంతవ్యుణ్ణి. కానీ, ఈ ఆలస్యం ఈ పుస్తకాన్ని ఇప్పటికే పలుసార్లు చదివే అవకాశం ఇచ్చింది. కొన్ని కొన్ని పంక్తుల్ని పక్కన ఉన్న నా శ్రీమతి అరుణకి గట్టిగా చదివి వినిపించి మరీ నవ్వుకున్నాను. మనసుకు ఆహ్లాదం అవసరం అనుకున్నప్పుడు నేను చదువుకొనే పుస్తకాల లిస్టులో – ఇంతకు ముందు సుశీల గారిపుస్తకాల్లాగే – ఈ పుస్తకం కూడా చేరుతుంది.

మనుష్యుల మీద నమ్మకాన్ని పెంచుకోవటానికి మరోసారి సాయం చేసిన సుశీల గారి తర్వాతి పుస్తకంకోసం నేను ఎదురుచూస్తున్నాను. మీరు మాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకాన్ని హాయిగా ఆస్వాదించి అనుభవించండి.

ముగ్గురు కొలంబస్సులు
డా. సోమరాజు సుశీల
Travelogue
Uma Books, 58- Krishnareddy Nagar, New Boinpally, Secunderabad 500011
July 27, 2014
150

You Might Also Like

12 Comments

  1. Varaprasad

    అమ్మయ్య ఎంతబాగా చెప్పారు .

  2. ఎ.కె.ప్రభాకర్

    చౌదరి గారి ముందుమాట చాలా ఆహ్లాదకరంగా వుంది. ఇంత లైవ్లీనెస్ ని ఆయన రాతల్లో ఇంతకు ముందు చూడలేదు. ఇక – సోమరాజు సుశీలాదేవి శైలే వేరు. వెనకటికి బీనాదేవి కథలూ కబుర్లు ఇలాగే చెప్పారు. కానీ ఆమె భాషా శైలీ పురాణం సీతకి దగ్గరగా వుంటాయి. చిన్న పరిశ్రమల్లో వ్యంగ్య భరితమైన నిర్వేదం, ఇల్లేరమ్మ ముచ్చట్లలో హాస్యంతో కూడిన సహజత్వంతో సుశీలమ్మగారు తన కథనరీతికో ప్రత్యేకతని సాదించుకొన్నారు. చౌదరిగారి ముందుమాట ద్వారా ముగ్గురు కొలంబస్ ల సాహసయాత్ర భానుమతిగారి అత్తగారి కథల్లా ఉంటుందేమో అనిపిస్తుంది. వెంటనే పుస్తకం చదవాలనే ఆసక్తి కలిగేలా ముందుమాటని సుసంపన్నం చేసినందుకు అభినందనలు.

  3. సౌమ్య

    ఇల్లేరమ్మ కథలు చదివాక నేను సోమరాజు సుశీల గారి అభిమానిని అయిపోయాను. అప్పుడెప్పుడో ఆ పుస్తకం మా అమ్మకి కొందాం అనుకుని ఇప్పటిదాకా కొనలేదు. అప్పత్నుంచిహ్ అనుకుంటూ ఇంకా చిన్న పరిశ్రమల కథలు చదవలేదు. మీ పరిచయం చూస్తూంటే అక్కడినుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఈ పుస్తకం కూడా చదవాలి అనిపిస్తోంది. వ్యాసం చాల బాగుంది. ధన్యవాదాలు.

  4. K. Chandrahas

    పుస్తకంలో కాపీలకు – ఉమాబుక్స్, 58- కృష్ణారెడ్డి నగర్, న్యూ బోయినపల్లి, సికింద్రాబాద్ – 500011కు అని రాసి ఉంది. మిగతా అన్ని ప్రముఖ షాపుల్లో అని కూడా రాసి ఉంది.

  5. Siddharth

    ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది .

  6. K. Chandrahas

    అనుభూతులు అనుభవాలూ చూసేవాళ్లనిబట్టి వుంటాయి. ఇందులో ఉన్న అబ్సర్వేషన్లు డా. సోమరాజు సుశీలవి. విమానంలోంచో, రైళ్లోంచో, కారులో వెళ్తూనో చూస్తే దేశం అంతు పట్టదు. ఆ నేల దిగాలి. అక్కడి గాలి పీలుస్తూ ఆ మనుషుల నైజాలను సంస్కారాలను సక్రమంగా అంచనా వేసుకోవాలి. అచ్చోటి సంస్కృతిని అవగతం చేసుకోవాలి. అంటే ఆ ప్రాంతాన్ని మరోసారి కనిపెట్టడమే అవుతుంది. కథలు-కథనాలలో మనం ఆహ్లాదపడే భోగట్టా ఉంది. దాని తాలూకు అంతరంగమూ ఉంది. ప్రపంచదేశాల వారంతా ఆ సహజీవనం చేస్తూ అవకాశాల అమెరికా నేల మీద కనిపిస్తారు. అక్కడ వినిపించే వివిధ సంస్కృతుల సంగీతం ఏడు రంగుల ఇంద్రధనుసులా కమనీయంగా కనిపిస్తుంది. ఆ వాద్యస్వర సమ్మేళనానికి అక్షరరూపం యీ రచన.
    ‘ముగ్గురు కొలంబస్ లు’ పుస్తకానికి అద్దం పట్టే పై వాక్యాలు blurb లో ఉన్నాయి. ఇదెవరు రాసారో చెప్పలేదు. అయినా పాఠకులు ఆయనెవరో చదివిన వెంటనే పట్టేస్తారని నా నమ్మకం.

  7. Jayasree Devineni

    ఇప్పుడే చదవటం అయింది పుస్తకం. నవ్వులూ పువ్వులూ చదువుతున్నంత సేపూ :)) అమెరికా కబుర్లు కొత్త కోణంతో పాటు, సోమరాజు సుశీల గారి అమ్మాయి శైలూ కుటుంబ జీవన విధానం, సుశీల గారి కుటుంబసభ్యుల మధ్య స్వేచ్చ ఆప్యాయతలు తెలిసి ఇంత హాయిగా గడిపేయొచ్చన్న మాట జీవితం అనిపించింది. అమెరికా అంటే పరుగులు, ఇండియా అంటే అబ్బా ఎంత చెడిపోయింది అని రోజూ వింటున్నారా? కానే కాదని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది!

  8. మణి వడ్లమాని

    ఇప్పుడే చదివాను
    డా. సోమరాజు సుశీల గారి కొత్త పుస్తకం ‘ముగ్గురు కొలంబస్‌లు’కు ముందు మాట రాసిన జంపాల చౌదరిగారి వ్యాసం ‘అంతా మనవాళ్ళే’.
    నిజంగా పుస్తకం చదివినంత అనుభూతిని ఇచ్చింది
    అసలు పుస్తకం కోసం చూస్తున్నాను

  9. pavan santhosh surampudi

    అమెరికాలో వెళ్ళే ముందు అమెరికా గురించి రకరకాలుగా అమెరికాలోని తెలుగువాళ్ల అనుభవాల ద్వారా తెలుసుకున్నాడు మా ఫ్రెండ్. ఆపైన అమెరికా వెళ్ళి “ఇల్లేరమ్మ గారి స్టైల్లో” అక్కడివాళ్లతో కలిసిపోయి భలేటి కొత్త విశేషాలు చెప్తున్నాడు నాక్కూడా. మొన్నీమధ్యే వాడితో అన్నాను “నువ్వివన్నీ రాయాల్రా అబ్బాయ్” అని. కానీ నాకొచ్చిన సమస్య ఏంటంటే వాడికి తెలుగు రాయడంలో ప్రాథమిక జ్ఞానం కూడా లేదు.
    ఇలాంటి సమయంలో మీరు ఈ పుస్తకం పరిచయం చేయడం మాత్రం తాయిలం పెట్టినట్టే ఉంది.

  10. pavan santhosh surampudi

    చిన్న అధర్మ సందేహం(వ్యాసంతో బాదరాయణ సంబంధం తప్ప మరేం లేదు కాబట్టి):
    //ఐదువందల ఏళ్ళ క్రితం వరకూ మన దేశం మంచి భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేదట. వేరేదేశాల్లో దొరకని రకరకాల పంటలు పండేవట.//
    అన్నారు. “ట”, “ట” అంటున్నారేటండీ. నిజం కాదా?

  11. Rajendra Sunkara

    ముందు మాట చదువుతూ ఉంటే కథ ఇంకా ఎంత బాగా వున్తున్దో అని పిస్తుంది

    మధుసూధన రావు దేవినేని గారికి ధన్యవాదాలు.

  12. Narayanaswamy

    మీరూ సామాన్యులు కారు. భారత్ చరిత్రని గురించి రాసిన మొదట పేరాలు చదువుతుంటే డేవ్ బెర్రీ అమెరికాను చరిత్రని గురించి రాసిన పుస్తకం గుర్తొచ్చింది. ఇహ ఇల్లేరమ్మ గారి గురించి చెప్పేదేవుంది. పుస్తకం చదవాల్సిందే అనిపించేస్తోంది అప్పుడే.

Leave a Reply