Love and Garbage – Ivan Klima
చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన రచయితలను ముగ్గురిని చదివాను, నేను. కాఫ్కా, మిలన్ కుందేరా, బహుమిల్ హ్రబల్. ముగ్గురూ నాకు నచ్చిన రచయితల్లో పై వరుసలో ఉంటారు. అయితే, వీళ్ళ గురించి వెంటవెంటనే తెలియటం, నేను వాళ్ళ రచనలు చదవటం అయ్యాక, మళ్ళీ ఇంకో చెక్ రచయిత గురించి సరైన పరిచయం జరగలేదు. ప్రాగ్ పుస్తక షాపుల్లో కొన్ని అరలకే పరిమితమైన ఇంగ్లీషు పుస్తకాల్లో ఎక్కువగా కాఫ్కా, మిలిన్ కుందేరాలే కనిపించారు. హ్రబల్ అక్కడక్కడ. వాటి మధ్యలో ఏదో మూల ఇవాన్ క్లీమా రచించిన “Love and Garbage” పుస్తకం కనిపించింది. అట్ట వెనుక ఈ రచయిత కాఫ్కా, కుందేరాల ఆదర్శంగా తీసుకొని, వాళ్ళ తర్వాత అంతటి రచయిత అనిపించుకోదగ్గ వాడు అని రాసి ఉంది. అనుమానిస్తూనే కొన్నాను. అనుమానిస్తూనే చదివాను.
పుస్తకం అయితే పూర్తి చేయగలిగాను కానీ ఇంకా ఈ పుస్తకం గురించి నా అనుమానాలు నాకు ఉన్నాయి. నవలకి పెట్టిన పేరును సార్థకం చేయటానికేనేమో ప్రేమ, చెత్త ఈ నవలలోని ముఖ్యమైన థీమ్స్. వాటిని అనుసంధానం చేస్తూ చాలా వరకూ కథ బాగా నెట్టుకొచ్చారు. ప్రాగ్ లో నివసించే ఒక రచయిత తను కాఫ్కా మీద రాస్తున్న వ్యాసాన్ని ఆపేసి, ఆ నగరంలో చెత్తను శుభ్రపరిచే వారి ఉద్యోగంలో తాత్కాలికంగా చేరుతాడు. ఈ కొత్త ఉద్యోగంలో చేరిననాటి నుండి, కొన్నాళ్ల వరకూ తన పనిని గురించి, సహోద్యోగుల గురించి చెప్తున్న కబుర్ల మధ్యలో తన గతాన్ని గురించి, యుద్ధకాలంలో గడిచిన తన బాల్యాన్ని గురించి, వాళ్ళ నాన్న గురించి, రచనా వ్యాసంగంపై ఉన్న అభిరుచి గురించి, భార్యాపిల్లల గురించి, మరో స్త్రీతో ఏర్పర్చుకున్న అక్రమ సంబంధం గురించి సవివరంగా చెప్పుకొస్తూ ఉంటాడు నరేటర్, series of flashbacks లో. మధ్యమధ్యలో కాఫ్కా నుండి ఎదురుగా కనిపిస్తున్న కొండో, కొమ్మో వరకూ అన్నింటి గురించి ఈయన ఆలోచనలు ఉంటాయి.
కథంతా ప్రాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంటుంది. సంక్లిష్టమైన కథ. నరేటర్‍కు పెళ్ళై, పిల్లలు ఉన్నా మరొకరిని ప్రేమించి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. ఆ తర్వాత అందులో కూరుకుపోతూనే ఉంటూ, భార్యనో, ఆ వేరే స్త్రీనూ కూడా ఊబిలోకి లాగేస్తూ ఉంటాడు. ఏదో ఒక క్షణంలో ఇక నిర్ణయం తీసుకోవడం తప్పదన్న పరిస్థితిలో తప్ప నిర్ణయం తీసుకోకపోవడంతో బతుకులు చాలా వరకూ నాశనమవుతాయి. ఇది first person narrationలో చెప్పిన కథ. దాని వల్ల నరేటర్ endless rantsకి మంచి స్కోపు దొరికినా, ఈ ప్రేమికులు తమ love interest గురించి రాసిందా చదువుతూ పోవాలంటే, మరీ బాగా రాస్తే తప్ప, విసుగు వస్తుంది. కట్టుకున్న భార్యా? కోరుకున్న మనిషా? అన్న డైలమాని చాలా వరకూ dull and redundant చేశారని నాకనిపించింది.
కథ చెప్పుకొస్తూనే, కథనం దెబ్బతినకుండా అనేకానేకాంశాల మీద ఆలోచనలు పంచుకోవడం కుందేరాను చదివినవారికి కొత్త కాదు. అందులో కథ ఎంత ఉంటుందో, నరేటర్ అభిప్రాయాలూ, ఆలోచనలూ కూడా అంతే ఉంటాయి. అయితే, అవి కథనబలాన్ని దెబ్బతీసేవిగా ఉండవు. కథకు ఎలాంటి అడ్డంకి కలిగించకుండా, ఇంకా ఆ stream of narrationకి బలం చేకూర్చేలా రాయటంలో ఆయన దిట్ట. ఈ ఇవాన్ రాసిన శైలి కూడా అలానే ఉంటుంది, కానీ అంత బాగుండదు. దానితో చాలా చోట్ల ఫిక్షన్ చదువుతున్నానన్న సంగతి మర్చిపోయి, ఏదో వ్యాసాల సంపుటి చదువుతున్న ఫీలింగ్ మాటిమాటికి కలిగింది. దానికి తోడు నరేషన్‍లో కాలగమనంలో ముందుకీ, వెనక్కీ పోతూ వస్తూ ఉండడం వల్ల వచ్చే సంక్లిష్టతలో ఈ ఆలోచనా స్రవంతిని కూడా జతచేయటంతో తికమకగా అనిపించింది కొన్ని చోట్ల. పైగా, డైలాగ్స్ కి వాటికి conventional గా వాడే quotations ఒకో చోట వాడుతూ, ఒకో చోట లేకుండా కొనసాగించారు. అందులోని మర్మం మొదటిసారి చదివినప్పుడు మాత్రం తెలియలేదు. రి-విజిట్ చేసినప్పుడు చూడాలి.
ఈ పుస్తకం నేను కొనడానికి పేరు ఒకరకంగా దోహదపడింది. ఇందులో నరేటర్ కొన్ని సందర్భాల్లో ప్రపంచంలోని ప్రతీదాన్ని చెత్తతో పోల్చడమో, లేక దానితో అనుబంధంగా చూడ్డమో చేస్తూ రాసిన కొన్ని వాక్యాలు భలే ఉంటాయి. ముఖ్యంగా ప్రాగ్ నగర వీధులని శుభ్రపరిచేవారి జీవితాలను గురించి కొద్దిగా తెల్సుకునే అవకాశం ఉంటుంది. ఎన్నేసి రకాలుగా మనం చెత్తను క్రియేట్ చేస్తున్నామో, దాన్ని విశ్వం ఎలా భరిస్తుందో అన్న దిశగా సాగే ఆలోచనలు కొన్ని బాగున్నాయి.
ఈ రచనలో అత్యధికంగా కాఫ్కా ప్రస్తావన ఉంటుంది. ఇందులోని ముఖ్య పాత్ర / నరేటర్‍కు కాఫ్కా చాలా కీలకం. ఆల్మోస్టు అతడి మీడ మెడిటేటషన్ చేస్తున్నట్టు ఉంటాయి కొన్ని పేరాలు. కాఫ్కా గురించి నాకు అర్థమైనంతలో ఈ పుస్తకంలో రాసినవి చాలా వరకూ valid interpretations. నేను ఈ పుస్తకం చదవడం వల్ల కలిగిన గొప్ప లాభం కాఫ్కాపై ఈయన మ్యూజింగ్స్ చదవగలటం. కథకన్నా, నవలకన్నా ఇవే గొప్పగా అనిపించాయి. కాఫ్కా డైరీలలోంచి, ఉత్తరాల్లోంచి కొన్ని కొటేటషన్స్ కూడా ఉన్నాయి.
కుందేరా, హ్రబల్ నచ్చినంతగా ఈయన ఈ రచన నచ్చకపోయినా, ఈయనదే ఇంకో పుస్తకం దొరికితే చదవాలనుకుంటున్నాను. లిటరరీ ఫిక్షన్ అంటే ఆసక్తి చూపేవారు ఒక సారి ప్రయత్నించి చూడదగ్గ పుస్తకం.
Fiction
Paperback
224
mani vadlamani
Hi! Purnima Tammireddy prapancha shaityanni telusukovadam,alage chadvadam (diniki konni technical probs unnayi) naaku chala istam anduke chinnappti nunchi malati chadoori gaari transalations chadivedanni swatilo,taruvata anta nachhindi ee site. original chadvalekpoyina meeru rasina parichyam to valla jeevanvidhnam,valla bhavalu vlla jivitalagurunchi telusukovadam yedo telusukunnamu anna trupti anamdam kaligayi. konni kafka(transaltions) koni chadivanu. meeru yentao srama to adi chadivi parichyam cheyyadam great .