Nothing To Be Frightened Of: Julian Barnes
“I don’t believe in God, but I miss him.” – ఇట్లాంటి వాక్యాలతో పుస్తకాలు మొదలైతే, చదవకుండా ఉండడం నా వల్ల కాదు. జూలియన్ బార్న్స్ రచన, Flaubert’s Parrot, మొదలుపెట్టి, బొత్తిగా సాగక, పది పేజీలు కాకుండా వదిలేశాను. ఆ తర్వాత, కొన్నాళ్ళకి, Nothing to be frightened of, కనిపించింది. అందులో మొదటి వాక్యం దేవుడిని గురించి ఆ వాక్యం. ఆ ఒక్క వాక్యం, మొత్తం పుస్తకం చదివేలా చేసింది. మరలా ఆయన పుస్తకాలేవీ చదవలేదు. ముఖ్యంగా Sense of Ending గురించి చాలా వినుండి కూడా, దాని జోలికి పోలేదు. మొన్నటి వారం పాల్ ఆస్టర్ పుస్తకం పరిచయంలో ఈ పుస్తక ప్రస్తావన రావడంతో మళ్ళీ తిరగేశాను.
రెండు మూడేళ్ళ కిందట ఈ పుస్తకం చదివేటప్పుడు, నా ఆలోచనలు కొన్ని, చాలా విచిత్రంగా ఉండేవి అని చెప్పాలి. ముఖ్యంగా, ఈ పుస్తకం ప్రారంభంలో జూలియన్ తల్లిదండ్రుల మరణం గురించి చెప్పుకొస్తారు. బాగా వయసు మీద పడ్డాక, మనవలనూ, మనవరాలనూ చూసుకొని మరీ చనిపోతారు. అంతటి full-fledged life అనుభవించిన వాళ్ళు పోతే, “well-played knock!” అని standing ovation ఇచ్చి, ఊరుకోవచ్చు, అంతేగానీ బాధపడ్డానికీ, దిగులుపడ్డానికీ పెద్దగా ఉండదు అని అనుకునేదాన్ని. అయితే, పోయే ప్రతి మనిషితోనూ మనమూ కొద్దికొద్దిగా పోతామనీ, మనిషి ఉనికికి చరమగీతంగా “మృత్యువు” ఒకరకమైతే, గడిచిన ప్రతీ రోజూ కూడా ఒక రకంగా చిన్న మృత్యువే! A petite death! అని అర్థమవడానికి నాకు కొంచెం సమయం పట్టింది.
ఈ పుస్తకం మొదలవ్వడానికి దేవుడి గురించి చర్చతో మొదలై, రచయిత ఇంట్లోవాళ్ళ రిలిజియస్ బిలీఫ్స్ తో కొనసాగి, దాదాపుగా ఒక ఆటోబయోగ్రఫీగా మారబోతూ, అప్పుడు పాతతరం ఫ్రెంచి రచయితలు, ముఖ్యంగా Jules Renard సాహిత్యం గురించి ప్రస్తావనలతో కొనసాగుతుంది. కేవలం, దేవుడు, మృత్యువు గురించే కాకుండా, మతాలు, ప్రేమలూ వైగరాల గురించి కూడా బోలెడు ముచ్చట్లు ఉంటాయి. ఈ పుస్తకం చదివిన మొదటిసారి, Jules Renard పరిచయమైనందుకు తెగ సంబరపడిపోయాను. ఇందులో అధికంగా రెనార్డ్ రాసిన జర్నల్స్ లో నుండి కోట్ చేశారు. ఆ జర్నల్స్ దొరకబుచ్చుకోవడానికి చాలానే ప్రయత్నించానుగానీ, ఇప్పటి వరకూ దొరకలేదు.
జూలియన్ వచనం చదువుకోడానికి చాలా బాగుంటుంది. ఆయన శైలిలో ఒక subtle sense of humour ఉంటుంది. Wittyగా చెప్పుకొస్తారు కబుర్లు. అందులోనూ, మనిషికి అందని రెండు విషయాలు: దేవుడు. చావు. పైగా, ఈ పుస్తకంలో చాలా వరకూ బార్న్స్ కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖ్యంగా, రచయిత అన్నయ్య. ఆయన ఈ పుస్తకానికే హైలైట్. ఫిలాసఫర్ అయిన ఆయన, కొన్ని సందర్భాల్లో ఇచ్చిన ప్రతిక్రియలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పైగా అన్నదమ్ముల మధ్య సుధీర్ఘ అనుబంధం ఉండడం, దాన్ని రచయిత బాగా రాయగలగడంతో, ఆ సన్నివేశాలు బాగా రక్తి కట్టిస్తాయి. తల్లిదండ్రుల (లేక కుటుంబ సభ్యుల) మృత్యువుని కేవలం తోడబుట్టినవాళ్ళే కలిసి ఈదాల్సి వస్తుంది. ఒకరినొకరు ఓదార్చుకోవాల్సి వస్తుంది. ఒకరి భయాన్ని ఒకరు పోగొట్టాల్సి వస్తుంది. ఇవ్వన్నీ, కొన్ని సార్లు మాటలతో, చాలా సార్లు మాట్లాడకుండా. అది ఇందులో బాగా చూపించారు.
మృత్యువును గురించి ఆయన చెప్పిన కింది మాటలు, నాకు ఈ పుస్తకం నచ్చడానికి కారణంగా చెప్పుకోవచ్చు.
“For me, death is the one appalling fact which defines life; unless you are constantly aware of it, you cannot begin to understand what life is about; unless you know and feel that the days of wine and roses are limited, that the wine will madeirize and the roses turn brown in their stinking water before all are thrown out for ever- including the jug- there is no context to such pleasures and interests as come your way on the road to the grave.”
Mortal thoughts మీద ఆసక్తిగలవారు తప్పక ప్రయత్నించవలసిన పుస్తకం. తక్కినవారు ఎంత దూరంగా ఉంటే అంత మంచి అనిపించే పుస్తకం. ఇందులో రచయిత వెలుబుచ్చిన అభిప్రాయాలు అందరికి సమ్మతమై ఉండకపోవచ్చు. అయినా కూడా చదవదగ్గది.
Non Fiction
ebook
Leave a Reply