పద్మావతి కృషి
వ్యాసకర్త: కాదంబరి
*******
పోట్లూరి పద్మావతి అనేక ఆధ్యాత్మిక పుస్తకములను రచించారు. అన్నీ లోకహితాభిలాషతో వెలువరించినది. ఇలాటి పొత్తములను ఆమె పాకెట్ బుక్ సైజులతో విరామం లేకుండా రచించి, ముద్రింపించారు. ఖర్చుకు వెనుదీయక, సాగిస్తున్న పోట్లూరి పద్మావతి నిరంత కృషి గొప్పది. పోట్లూరి పద్మావతీ శర్మ టీచరు వృత్తిలో రిటైరైనారు. ఆమె తెలుగు భాషాభిమానమునకు నిదర్శనములు ఆమె రచించిన పుస్తక పరంపర. ముద్రణాభారమును వహించడమే కాదు, వేదాంత విజ్ఞానమును ప్రజలకు ఉచితంగా పంచుతున్నారు.
హిందూ విజ్ఞాన భాండాగారములోని అనేక విశేషాలను అందరికీ సులభంగా బోధ పరుస్తూ, వ్రాయగలిగారు. మానవ ధర్మ సూత్రాలు, రుద్రాక్ష మహత్యం, శ్రీ తులసీ వైభవం, శ్రీ లలితా సహస్ర నామ భాష్యము; శ్రీ సహస్ర నామ భాష్యము; ఇత్యాది చిట్టి పుస్తకములను రాసిన అమూల్య కృషి ఆమెది.
**************,
ముద్రితములు:-
శ్రీ సుందరకాండను గేయరూపంలో రచన చేసారు. అంతే కాదు. ఆమె ఇతర ముద్రిత పొత్తములు:
శ్రీ శివ తాండవ స్తోత్ర తాత్పర్యం,
శ్రీవారి బంగారు మేడ,
శ్రీ కృష్ణ శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తరశతనామావళి;
మా మంచి కథలు,
శ్రీ ఘంటసాల బుర్రకథ
కవితా మందారమాల
మధుర గీతములు
మహనీయుల కథలు
వెంకన్న నామాలు
రథ సప్తమి
మాఘ మాసం
కార్తీకమాసం
శీ ఆంజనేయమహిమ
నవ నారసింహ
శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత కథ
అన్నపూర్ణస్తుతి
వెంకన్న నామాలు
శ్రీకృష్ణుని జననం
మానవ ధర్మ సూత్రాలు
రుద్రాక్ష మహత్యం
శ్రీ తులసీ వైభవం
శ్రీ లలితా సహస్ర నామ భాష్యము
శ్రీ సహస్ర నామ భాష్యము
వివిధ పత్రికలలో వ్యాసాలు, కవితలు
************,
శ్రీ శివ తాండవ స్తోత్ర తాత్పర్యం, చిన్నచిన్నమాటలతో శ్లోకములను వివరించిన పద్ధతి, తామరాకుల దొన్నెలను తయారు చేసి, వర్షాభ్ర బిందువులను అందించినట్లు ఉన్నది. మచ్చుకు రెండవ శ్లోకానికి ఆమె ఇచ్చిన తాత్పర్యం చూద్దాము.
శ్రీ శివ తాండవ స్తోత్రం – 2
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఘరీ|
విలోల వీచివల్లరీ విరాజమానమూర్ధనీ|
ధగధగజ్జ్వలల్లలాట పట్టపావకే|
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ||
తా|| పెద్ద పాత్ర వలెయున్న జడలందు ఆకాశగంగ సుడులు తిరుగుతుండగా
ఆ నది తరంగ తీగలతో ప్రకాశిస్తున్న జఠధారీ అగ్నిగోళాన్ని
నుదుటున దాల్చిన బాలచంద్రశేఖరుని చూసి ఆనందించుగాక!
******************
అత్తిపత్తి మొక్కనూ, తులసి మొక్కనూ కలిపి పూజించడం శ్రేయోదాయకం, అని ఉపపత్తులను చూపారు. తులసి దళాలను గోళ్ళతో గిల్లరాదు. సాయంత్రం, రాత్రి వేళలో కోయరాదు. ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులలో కోయరాదు. అలాగే ఆమె తులసి దళాలను జలుబు వంటి చిన్న రుగ్మతలకు చిట్కావైద్యంలో ఎలాగెలాగ ఉపయోగిస్తారు, అనే అనేక సంగతులను విపులంగా ఇచ్చారు.
*****************
తులసి కాండముతో, తులసి చెక్కతో, వేరుతో తులసి పూసలు చేస్తారు. ప్రాతఃకాలంలో తులసిని పూజిస్తే 10 వేల ఆవులను దానమిచ్చే పుణ్య ఫలితం,
10 వేల వాజిపేయ యాగాల చేస్తే వచ్చే పుణ్య ఫలితం వస్తుంది. ఇలాగ అనేక విశేషాలు, మనకు తెలుసును- అనిపిస్తూ ఉంటాయి, కానీ పూర్తిగా తెలిని అనేక సంగతులను, ఆయా వ్యాసాలలో సమ సందర్భం ప్రకారం, రచయిత్రి పోట్లూరి పద్మావతి చెప్పారు. ప్రత్యక్షరమూ జిజ్ఞాసయే – ఉవ్వెత్తున ఉరికే కజ్జలము (= సిరా, ink) గా మారి, కాగితం పైన అక్షరముల అలలైనవి. తెలుగుపండిట్ గా చేసిన ఆమె స్వయంగా మహనీయుల ఇంటర్వ్యూలను చేసారు. ఏవో ఆషామాషీగా సందేహాలను తీర్చుకున్నాము, అని మిన్నకుండక, లిపిబద్ధం గావించారు, ఆ అక్షర ప్రసూన మాలికలను లోకానికి అందించారు.
ఆ పుస్తకం “శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ” : “ప్రశ్నోత్తర మణి మాల”.
******************
పోట్లూరి పద్మావతి భగవంతుని ప్రతి పేరునకు కలిగి ఉన్న అర్థాన్ని స్థూలంగా చెప్పారు. “శ్రీ కృష్ణ శ్రీ మహా లక్ష్మీ శతనామావళి” అష్టోత్తర అనగా 108 పేర్లు అని అర్థం:
“త్రిభంగి” (26 వ నామము) మూడు భంగిమలలో నిలబడి, వేణువు నూదుతూన్న క్రిష్ణమూర్తి. మధురా నాథ (56 )= మధురా నగరమునకు, మధు రత్నమునకు నాయకుడు శ్రీ మహావిష్ణువు, కేలండరులందున, కోవెల శిల్పములందున ఇలాటి ముచ్చటైన మురళీధరుని ఫోజులను వీక్షించగలగిన కన్నుల కలిమి అద్భుత నిధి ఈ నిలయం.
పద్మావతి ముద్రిత లఘు పుస్తకములు 30 పేజీలు ఉన్నవి. చిన్న పొత్తములు [కావడంతో ] ఆమె ఎంచుకున్న అంశాన్ని ఒక్కొక్క పుస్తకములో – ఒక్కొక్కటి చొప్పున వివరించాల్సి వచ్చింది. బీజములో మహావృక్షం వలె, వ్యాసములు విపుల వివరణలు క్ఌప్తముగా సూక్ష్మరూపములో అందించారు ఆమె.
వీటిలో ఇండెక్సు అవసరం లేదు. ప్రచురణ తేదీ, సంవత్సరాదులను పేర్కొన లేదు. అందువలన ఏది ముందు వెలుగులోకి వచ్చిందో కాస్త తికమకగా ఉంటుంది.
చివరి కవరు పేజీపై ముద్రితములు, అముద్రితములు, అనే విషయాదులను తెలిపారు. అందుచే నిశిత గమనికలతో తెలుసుకోగలము.
తెలుగు బుక్ అఫ్ రికార్డ్,వండర్ బుక్ అఫ్ రికార్డ్ లను ఆమె అందుకున్నారు. విజయవాడ లోపెద్దల సమక్షంలో 6=4=14న వండర్ బుక్అఫ్ రికార్డ్,
సి.నారాయణరెడ్డి గారి ద్వారా 4=4=14న ఆమె గౌరవ పురస్కారములు అందుకున్నారు.
ఆమె లోకులకు హిందూ మంత్రములు, శ్లోకములు మున్నగు అంశాలను, వానిలోని ప్రయోజనములను ఇచ్చే మంచి అదనపు పాయింట్సును, సుబోధకముగా ఒసగారు. ప్రసాదము చిటికెడే కానీ, కళ్ళకు అద్దుకుని భక్తి భావముతో స్వీకరిస్తూంటే అనిర్వచనీయ అనుభూతి కలిగి, మానసిక అవ్యవస్థను తొలగించి, మనశ్శాంతిని అందిస్తుంది. అందుకే ఇట్టి మిణుగురు కాంతుల నిచ్చు తారకలు ఆహ్వానించదగినవి.
చిరునామా:- సెల్ల్: 9291468295 ; potluripadmavati@gmail.com
పి.పద్మావతి శర్మ
కృతజ్ఞతలు కాదంబరిగారు(కుసుమ ).నాగురించి బాగారాశారు