కాగజీ హై పైరహన్ – ఇస్మత్ చుగ్తాయ్

నారు పోసినవాడు నీరూ పోస్తాడన్న నానుడి, నా పుస్తక పఠన విషయంలో చాలా నిజం. ఇంగ్లీషు పుస్తకాలు ఎన్నుకోవాలంటే ఇంటర్నెటు, తెలుగు పుస్తకాల గురించి తెల్సుకోవాలంటే తెలుగు బ్లాగులు, వాటి వలన కలిగిన స్నేహితులు. ఇహ, హింది సాహిత్యం గురించి సహాయం ఎవరు చేస్తారనుకుంటుండగా, నా పాలిట వరంలా, మా ఊరి సూత్రధార్ కంపెనీ వాళ్ళు ఎదురయ్యారు. అప్పటిదాకా పుస్తకాల గురించి ఎవరైనా చెప్పారంటే అర్థం, పుస్తక గురించి ఒక పరిచయ వ్యాసమో, సమీక్షో, లేక ఓ నాలుగు ముక్కలో చదివానని అర్థం. కానీ వీళ్ళు థియటర్ వాళ్ళు కదా? ఒక రచననో, ఒక రచయితనో అలా కళ్ళముందు నిలెబెట్టేస్తారు. మంటోని నాకు “సియా హాషియె”తో పరిచయం చేశారు. ఆ నాటకం చూసినప్పుడు నాకు అందులోని భాష చాలా వరకూ అర్థం కాలేదు. కానీ, ఆవకాయ రుచి తెలిసాక, కారమని ఊరుకోగలమా? అందుకే వెళ్ళి ఆయన రచన సంపుటాలన్నీ కొనేశాను. ఒకటి మాత్రం పూర్తిచేసి, పరిచయం చేయగలిగాను.

ఆ తర్వాత కొన్నాళ్ళకి “ఇస్మత్ – ఏక్ ఔరత్” అన్న నాటకం వేశారు, వాళ్ళే. అప్పటికి నాకు ఇస్మత్ అంటే ఎవరో తెలీదు. ఎవరో ఒకరులే, నేను మాత్రం చూసి వచ్చెద! – అని ఫ్రెండుతో అంటే, నా మందబుద్ధిని బాగా హాండల్ చేయగల ఫ్రెండు, ఆ రచయిత పేరు ఇస్మత్ చుగ్తాయని, ఆవిడ కథలు కొన్ని తెలుగులోకి అనువాదమయ్యాయని ఒక లింక్ ఇచ్చింది. అయినా కూడా, ఆ రచయిత గురించి ఏమీ తెల్సుకోకుండా నాటకానికి వెళ్ళాను. నాటకానికి ముందు ఇస్మత్ గురించి నాలుగు ముక్కలంటూ కొంచెం చదువుకొచ్చారు. అందులో నాకు తెల్సిన గొప్ప విషయమేమిటంటే, మంటో – ఇస్మత్ మంచి స్నేహితులని, పైగా వాళ్ళిద్దరికి హైదరాబాదుతో కొంచెం సంబంధముందని. ఇంకేం? నేను రాహుల్ ద్రావిడ్‍ను ఆవాహన చేసుకొని మరీ ఏకాగ్రతతో కని, విన్నాను మిగితా నాటకమంతా!

నాటకంలో మూడు భాగాలు ఉన్నాయి. (నో! ఇది నాటకం యొక్క రివ్యూ/ పరిచయం కాదు. పుస్తకం దగ్గరకు వస్తున్నా, మెల్లిగా.) మొదటిది, ఇస్మత్ పాత్రే స్టేజి పైకి వచ్చి తన అనుభవాల గురించి మనతో చెప్పుకొస్తుంది. ఆ పాత్ర చెప్పే డైలాగులన్నీ ఇస్మత్ ఆటోబయోగ్రఫీలోనివి.  ఈ భాగంలో ఇస్మత్ భావాలు చూచాయిగా తెలియగానే అర్థమయ్యింది, ఈవిడ ఆషామాషీ రచయిత కాదని. ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళ గురించి ఈవిడ భావేశాలు విన్నాక, మరో డొరతీ పార్కర్ అని అనిపించింది. నాటకంలో తక్కిన రెండు కథలూ చూశాక, ఈవిడను “ది ఇండియన్ డొరతీ!” అని మురిసిపోయాను.

నాటకం మూడు భాగాలలోనూ భారీ బర్కమ్ ఉర్దూ ఉన్నా, చాలా వరకూ పంచ్‍లకు నా చుట్టూ ఉన్న జనం విరగబడి నవ్వుతుంటే, నేను దిక్కులు చూస్తూ ఉన్నా, ఇంటికొచ్చాక, ఇస్మత్ చుగ్తాయ్ ఆటోబయోగ్రఫీ అని గూగుల్‍ను అడగ్గానే అది ఓ ఆంగ్లానువాదమూ ఉందని చెప్తున్నా, నేను “కాగజీ హై పైరహన్” అన్న పుస్తకాన్నే ఆర్డర్ ఇచ్చాను. లిపి ఏదైనా, భాష తెలీనప్పుడు, భావాన్ని పట్టుకోవడం ఎంత కష్టసాధ్యమో ఈ పుస్తకం చదవటం వల్ల అనుభవంలోకి వచ్చింది. అప్పటిదాకా చదివిన హింది పుస్తకాల్లో అక్కడో పదం, అక్కడో పదం అర్థం తెలియకపోతే వెతుక్కోవాల్సి వచ్చేది. ఇందులో అసలు, భాష చాలా విధాలుగా కష్టపెట్టింది. వాళ్ళ బాంధవ్యాలు అర్థమవ్వటానికి, ఆచారవ్యవహారాలు తెలియటానికి, ఆవిడ చమత్కారం చుర్రుమనిపించడానికి బాష చాలా అడ్డుగా నిలిచింది. దానికి తోడు, ఇది ఆత్మకథే అయినా, వ్యాసాలుగా వర్గీకరించి ఉందని చూసి, ఎటూ మొదటి వ్యాసం: నేను ఇక్కడ పుట్టా, అక్కడ పెరిగా టైపులో లేదుకదా అని, మొదట్రెండు వ్యాసాల తర్వాత మధ్యలోది ఏదో చదవటం మొదలెట్టా. ఎవరికి ఎవరో, ఏమవుతారో, అవి వాళ్ళ పేర్లా లేక పిలుపులే అలా ఉంటాయా? లాంటి బేసిక్ ఇన్ఫో కూడా తెలీక, చుక్కలు కనిపించాయి. ఆ తర్వాత బుద్ధిగా మొదటి నుండి చివరి దాకా చదివి, ఏదో అలా గట్టెక్కాను.

ఇస్మత్ చుగ్తాయ్ – ఈవిడ పేరొందిన ఉర్దూ రచయిత. ఆవిడ కథలు కొన్ని progressiveగా ఉంటాయని వినికిడి. ఒకట్రెండు వాటి గురించి గొడవలు కూడా జరిగాయి. ఈవిడనూ, మంటోనూ కోర్టుకు ఈడ్చారు కూడా. వాటినన్నింటిని ఎదుర్కోవడం, నెగ్గుక్కురావడం ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. అంతేగాక, సంప్రదాయ ముస్లిమ్ కుటుంబంలో ఎందరో మగపిల్లల తర్వాత ఆడపిల్లగా పుట్టి, అన్నలానే ఆటపాటలలోనూ, చదువుసంధ్యలలోనూ వాళ్ళతో పోటీ పడే అలవాటు చేసుకున్న తర్వాత, ఆడపిల్లవంటూ కలిగిన ఆంక్షలను ఎదురుకోవటంలోనూ, ఓ మోస్తరు చదువు అయ్యాక బడి మానిపించేసి ఇంట్లో వంట, కుట్లూ-అల్లికలూ నేర్చుకోమంటే, కావాలంటే కిస్టియన్ మతంలో కలిసిపోయి, కాన్వెంట్ చదువులు చదువుకుంటానుగానీ ఇంట్లో కూర్చోననే మొండితనం చూపించటంలోనూ ఈవిడ ధైర్యం, పరిస్థితులకు తలొగ్గని బిరుసుతనం తెలుస్తాయి.

ఈవిడకు మాట్లాడ్డమంటే ఇష్టమని ఇష్టంగా తను చెప్పేవరకూ వేచి చూడనవసరం లేదు. ఆవిడ రాయడంలోనే, పొట్లాల్లో కట్టిన వేడి, వాడి మాటలు ఉంటాయి, కరకరమంటూ. వాళ్ళింట్లో వాళ్ళంతా ఇలా “బాతూనీ” అని చెప్పారుగానీ, ఈవిడ మాటల్లో మతలబులు, మాతాబులు వేరే! (వీళ్ళ అన్నగారు రాసిన కొన్ని కథలు డి.ఎల్.ఐలో దొరికాయి, అప్పట్లో. ఫాంట్ బొత్తిగా చదవడానికి వీల్లేకుండా ఉందని పక్కకు పెట్టేశాను. )

ఈవిడ చెప్పిన కబుర్లలో నన్ను బాగా ప్రభావితం చేసినవి: ఈవిడ హాస్టల్, కాలేజిలలో ఉండగా తోటి-విద్యార్థులతో, లెక్చరర్లతో ఉన్న అనుబంధం. అక్కడి లైబ్రరీలలో చదివిన పుస్తకాలు, వాటిపై ఈవిడ ఆలోచనలు. అలాగే, ఇష్టమైన రచయితల గురించి, తోటి రచయితల గురించి చెప్పిన విషయాలు. మంటో, కృష్ణ చందర్ లాంటి రచయితల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, మంటోతో, మంటో కుటుంబంతో ఆవిడకున్న స్నేహం, లాహోర్ కోర్టులో ఇద్దరి మీదా కేసులు బనాయించబడినప్పటి సంగతులను కళ్ళకి కట్టినట్టు రాసుకొచ్చారు.

అలానే, అప్పటి హిందూ-ముస్లిమ్ల మధ్య ఉన్న equationను కూడా ఇష్టంగా చెబుతూనే, అందులో కష్టం కలిగించేవాటి గురించి సుతిమెత్తగా ఎత్తి చూపారు. ఎంత ఆప్యాయతలు ఒలకబోసుకున్నా, ఒకరి ఆచారవ్యవహారాలను ఇంకొకరు ఎద్దేవా చేయడం జరుగుతూనే ఉంది. భారత్-పాక్ విభజన ప్రస్తావన అక్కడా ఇక్కడా వచ్చినా, నేను ఆశించినంతగా రాయలేదు.

ఇహ, ఆడవాళ్ళ గురించి, పురుషాధిక్య ప్రపంచంలో ఆడవాళ్ళ పరిస్థితుల గురించి ఆవిడవి uninhibited అభిప్రాయాలు. అవి అందరికీ నచ్చకపోవచ్చు. మాటలోని తీవ్రతనూ, తీక్షణతనూ ఏ మాత్రం దాచకుండా చెప్పినప్పుడు, చెప్పేది ఎంతటి నిజమైనా కొందరికి మింగుడు పడదు. ముఖ్యంగా, చెప్పేవాళ్ళు ఆడవాళ్ళైతే. “ఆడది బలహీనమైతే అవ్వచ్చుగానీ, బుద్ధిహీనురాలు కానవసరం లేదు.”, “భర్త నుండి విడిపడి స్వతంత్రంగా ఉండే ఆర్థిక పరిస్థితులు లేనందున, ఆమె భర్తను అంటిపెట్టుకొని ఉంటే, ఆమె వేశ్య కన్నా హీనురాలు.” , “ఇది పురుషుడి ప్రపంచం. అతడు చేసుకున్న, పాడుచేసుకున్న ప్రపంచం. అందులో ఆడది ఒక ముక్క, అతడి ప్రేమనూ, ద్వేషాన్నీ వ్యక్తీకరించే ఆసరా. తన మూడ్‍కు అనుగుణంగా, ఆమెను పూజిస్తాడు, లేదా తన్ని తగలేస్తాడు….” లాంటి అభిప్రాయాలు ఘాటుగానే తగులుతాయి.

పై వాక్యాలు చూసి ఈవిడ మగజాతి మీద పగబట్టిన జాబితా అని అనుకుంటే పొరపాటే! వాళ్ళ నాన్న గురించి, అన్నయ్యల గురించి, కజిన్స్ గురించి, తోటి స్నేహితల గురించి, భర్తను గురించి రాసినవి ఏవి చదివినా ఆవిడ మనిషికి ఎంత విలువనిస్తుందో, అంతగా ఆరాధించగలదో తెలుస్తుంది. ఆడవాళ్ళు మరొకరి దయాదాక్షిణ్యాలపై బతకటమంటే ఆవిడకు చిరాకుగానీ, సరిసమానంగా ఇచ్చిపుచ్చుకోగల బంధాలను కాదనుకునే మనిషి కాదు. “ఫెమినిజం” అన్న పదానికి ఎవరు ఇచ్చుకునే అర్థం వారిదే అయినా, తమకన్నా ముందు పరిగెత్తగలిగే సత్తా ఉన్న మగవాళ్ళని ఈసడించుకోవటం కన్నా, పరిగెత్తలేమని మునగదీసుకుపోయే ఆడవాళ్ళంటే ఈవిడకు ఎక్కువ చిరాకు. అది ఈ పుస్తకంలో చాలా చోట్ల స్పష్టమవుతుంది. ఆవిడ కథలు నేనింకా చదవలేదుగానీ, విన్న ఒకట్రెండులో ఆవిడది ఇదే ఉద్దేశ్యమని అర్థమయ్యింది.

సూత్రధార్ వాళ్ళు ఇస్మత్ నాటకానికి “ఇస్మత్ – ఏక్ ఔరత్” అని పేరు పెట్టడానికి గల కారణం, ఆవిడను గురించి మంటో ఒకానొక సందర్భంలో మాట్లాడుతూనే / రాస్తూనో, “ఎన్ని అన్నా, ఏం చేసినా, ఇస్మత్ ఒక స్త్రీ!” అన్న అర్థంలో అన్నవేవో చదివి వినిపించి, ఆవిడలోని “ఔరత్”ను పరిచయం చేయడమే మా లక్ష్యం అని చెప్పారు. ఈ “కాగజీ హై పైరహన్” మొత్తంలో ఆ “ఔరత్” స్పష్టంగా మన కళ్ళ ముందుకి వచ్చి నిలబడుతుంది. అందులో అనుమానమే లేదు! అందుకే ఇస్మత్ గురించి తెల్సుకోవాలంటే ఈ రచన indispensable!

చివరిగా, పుస్తకం గురించి: రాజ్ కమల్ వారి ప్రచురణ. హార్డ్ కవర్. చక్కని ఫాంట్. కఠినమైన ఉర్దూ పదాలకు తేలిక భాషలో సమానార్థాలను పేజి,పేజికి ఇచ్చారు. చదువుకోగలిగితే, ఇదే పుస్తకం కొనుక్కోవటం మేలు.

లేదంటే, ఆంగ్లానువాదంలో ఒక చాప్టర్, ఒకరి అభిప్రాయం ఇదిగో.

 

Kaghzi Hai Pairahan (Hindi)
Ismat Chugtai
Autobiography
RajKamal Prakashan
Hard Cover
266

You Might Also Like

2 Comments

  1. Radha

    బాగుంది పూర్ణిమా! ఆడవాళ్ళు మరొకరి దయాదాక్షిణ్యాలపై బతకటమంటే ఆవిడకు చిరాకుగానీ, సరిసమానంగా ఇచ్చిపుచ్చుకోగల బంధాలను కాదనుకునే మనిషి కాదు – ఈ వాక్యం బాగుంది. చక్కటి పరిచయం. తెలుగు అనువాదం లింక్ ఏమిటో చెప్తారా ప్లీజ్

    1. సౌమ్య

      రాధ గారూ,
      పి.సత్యవతి గారి అనువాదం ఒకటి కినిగె.కాంలో ఉంది: http://kinige.com/book/Ismat+Chugthai+Kathalu
      ఇది కాకుండా ఇంకో అనువాద కథల సంకలనం కూడా చూశాను ఆమధ్య…వివరాలు గుర్తులేవు.

Leave a Reply