A Short History of Tractors in Ukranian

“A Short History of Tractors in Ukranian” నా స్నేహితురాలు ఈ పుస్తకం పేరు చెప్పగానే – “ఉక్రెనియనా? హిస్టరీనా? ట్రాక్టర్లా? నేనెలా చదవను ?” అని అడిగాను అమాయకంగా, అయోమయంగా. “అది ఇంగ్లీషు పుస్తకమే” అనిందామె. “అనువాదమా? నువ్వు రష్యన్ లో చదివావా, ఇంగ్లీషులోనా?” అని అడిగాను. “నేను రష్యన్ అనువాదం చదివా కానీ, అది అసలుకి ఇంగ్లీషు పుస్తకం” అన్నది. ఈ పేరేదో విచిత్రంగా ఉందే అని, ఆ రాత్రే ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను.

బ్రిటన్ దేశంలో స్థిరపడ్డ ఒక ఉక్రెయిన్ దేశస్థుల కుటుంబం కథ ఇది. రెండో‌ప్రపంచ యుద్ధకాలంలో నాజీల బారిన పడి, తప్పించుకుని, ఆపైన చివరికి బ్రిటన్ వచ్చి స్థిరపడ్డ దంపతులకి ఇద్దరు కూతుళ్ళు. ఈ ఇద్దరు అక్క-చెల్లెళ్ళ మధ్యా వాళ్ళ అమ్మ చనిపోయాక ఆస్థి గొడవలు వచ్చి మాట్లాడుకోడం మానేస్తారు. ఇంతలో ఒకరోజు వాళ్ళ నాన్న తాను మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నానంటాడు. ఉక్రెయిన్ నుండి వచ్చిన ఓ ముప్పైల్లో ఉన్న వనిత ఎనభై దాటిన తమ నాన్నని పెళ్ళి చేసుకుంటోంది అనగానే వీళ్లిద్దరు విడివిడిగా‌ భగ్గుమంటారు. ఆ మనిషి ఈయన్ని ఆస్థి కోసం, ఈయన పేరు మీద వచ్చే బ్రిటీష్ పౌరసత్వం కోసం పెళ్ళి చేసుకుంటుందే కానీ, ప్రేమ వల్ల కాదని ఎంత చెప్పినా ఆ ముసలాయన వినడు. తన మానాన తను ఉక్రెనియన్ భాషలో తన ఇంజనీరు బుర్రను ఉపయోగించి ట్రాక్టర్ల చరిత్ర రాసుకుంటూ ఉంటాడు చుట్ట్టుపక్కల ఏం జరుగుతున్నా! ఆ రెండో భార్య ఈ అక్కచెల్లెళ్ళు అనుకున్నట్లే సరిగ్గా అందుకే వస్తుంది, మొదటి వివాహం వల్ల కలిగిన ఓ కొడుకుతో సహా! మరి ఏం చేయాలి? వీళ్ళు ఆమెని వదిలించుకోగలిగారా? అసలు ఎవరామె? ఎందుకలా చేస్తుంది? ఆ ట్రాక్టర్ల చరిత్ర పూర్తయిందా? ఈ అక్కచెల్లెళ్ళకి పడదు కదా – వాళ్ళిద్దరు కలిసి ఈ సవతి తల్లి సమస్య ఎలా పరిష్కరించారు? ఇలాంటి ప్రశ్నలకి జవాబులు నవల్లో కనిపిస్తాయి కానీ, ఆ జవాబుల వేటలో కాక ఊరికే చదివితే కూడా ఆసక్తికరంగా‌ ఉంటుంది.

భలే విచిత్రమైన మనిషి ఆ నాన్న మట్టుకు. అతననే ఏముంది -ఇందులో పాత్రలన్నీ విచిత్రంగానే ప్రవర్తిస్తాయి. దానికి తోడు, రచయిత్రికి అదొక రకం హాస్య దృష్టి ఉంది. ఊహించని చోట్ల పుటుక్కుమని ఓ విరుపు …వ్యంగ్యం. అవి ఒక ఎత్తు. మధ్య మధ్యలో పాశ్చాత్యులు వచ్చి ఉక్రెయిన్ లోని సంప్రదాయ జీవనశైలిని ఎలా దెబ్బతీశారు అని పాత్రల మధ్య జరిగిన చిన్న చిన్న సంభాషణలు ఒక ఎత్తు. ఇవి కాకుండా‌ నాజీల నాటి అనుభవాలని – చెప్పీ చెప్పకుండా, గతాన్ని తల్చుకోడం ఎందుకంటూనే కథకురాలికి ఆమె అక్క, నాన్న మధ్య మధ్యలో వివరిస్తూండటం మరో ఎత్తు. వీటన్నింటి మధ్యా ఆ ఉండీలేక, లేకుండా ఉన్న కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలను గమనించడం ఇంకో ఎత్తు. వీటివల్ల పైకి కామెడీ నవలగానే కనిపించినా, ఈ నవలలో అనేక పార్శ్వాలు ఉన్నాయని తోస్తుంది నాకు. పైగా, చూడ్డానికి ఆ రెండో భార్య విలన్ లా అనిపించినా -చివరికొచ్చే సరికి ప్రధాన పాత్రలన్నీ ఆమెను గురించి ఏదో ఓ చోట – “పాపం!” అనుకుంటాయి. ఈ నవల్లో ఇది కూడా నాకు నచ్చిన అంశం – ఆమె చేసిన పనులని సమర్థించడం ఎవరూ చేయరు కానీ, ఎక్కడో ఓ చోట అందరూ ఆమె కోణంలో కూడా ఆలోచించేందుకు ప్రయత్నిస్తారు.

ఈ కథలో చాలాభాగం రచయిత్రి సొంతకథ ఏమో అని ఎక్కడికక్కడ అనుమానం వచ్చింది – ఆమె నిజజీవితానికి, ఈ నవలలోని పాత్రలకీ ఉన్న పోలికల వల్ల. ఇలా రాస్తే ఎలాగో ఈ రచయితలంతా! తమ జీవితంలోని పాత్రలు – అందరికీ తెలిసిపోయే లాగ కథల్లోకి వ్యాసాల్లోకి జొప్పించే తెలుగు రచయిత/త్రులూ ఉన్నారు అనుకోండి – అది బహుశా రచయితలు తరుచుగా చేసే పనేమో. కానీ, ఇలాంటివి చదివినప్పుడల్లా కథలూ, నవలలూ రాసే వాళ్ళకి దూరంగా‌ ఉంటే నా‌బతుకు బట్టబయలు కాకుండా ఉంటుందనిపిస్తుంది :-). “జీవితాల్నుంచి కాక ఎక్కడ్నుంచి వస్తాయి పాత్రలు?” అనకండి. మక్కికి మక్కికి “ఇది ఫలానావాళ్ళే” అనేస్కునేలా దించకుండా కొంచెం ఓపిక చేసుకుని, అలోచించి, నేర్పుతో రాయొచ్చని నాకు అనిపిస్తుంది. ఏమైనా, నాకు మల్లే అంతర్జాలంలో మరొకాయనకి కూడా అనిపించింది ఇందులో సొంత కథే ఉందేమో అని. ఆయన బ్లాగులో ఓ ఆసక్తికరమైన కథ చదివాను. Ben Travers అన్న బ్రిటీష్ రచయిత ఒకే ఒకసారి తాను రాసిన ఒక నవలలోని పాత్రని నిజజీవిత వ్యక్తి ఆధారంగా చిత్రీకరించాడు. తన ఇంటి దగ్గర ఉండే ఒక కల్నల్ గారి ఆధారంగా రాసిన పాత్రట అది. నాటకం ఆడ్డం మొదలుపెట్టాక ఒకనాడు కల్నల్ గారు ఈయనకి వీథిలో కనబడి, “ఇదిగో అబ్బాయ్, నువ్వు మరీ అతి చేస్తున్నావు. ఆ ఫలానా మేజర్ హంటింగ్టన్ పాత్ర నిజజీవిత వ్యక్తి ఆధారంగా రాసావు అని ఎవ్వరికైనా అర్థమైపోతుంది” అన్నాడట. Travers కి ఖంగారు మొదలైంది – ఇప్పుడీయన ఏం చేస్తాడో తనని, కేసు వేస్తాడో ఏమిటో! అని. “ఇది ఫలానా బ్రిగేడియర్ గారి ఆధారంగా రూపొందించిన పాత్ర కదూ? ఇలా నిజజీవిత పాత్రలని మక్కికి మక్కి దించడం అంత సంస్కారవంతుల లక్షణం కాదు” అని వెళ్ళిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నాడట 🙂

సోది ఆపి మళ్ళీ పుస్తకం విషయానికొస్తే, అంత సస్పెన్స్ లేకపోయినా, ఇది పూర్తిచేసేదాక ఖాళీ దొరికినపుడల్లా అది తీసి చదివా ఓ నాలుగైదు రోజులపాటు. చాలాసార్లు పైకి గట్టిగా నవ్వుకున్నాను. కథనం ఆట్టే “గొప్ప”గా లేదు. ఓ మోస్తరుగా ఉంది కానీ, చక్రపాణి సినిమాలోలాగ ప్రతీ పాత్రా ఒక eccentric పాత్ర. దాని వల్ల, “వీళ్ళు తరువాత ఏం‌చేస్తారో?” అన్న ప్రశ్నలతో నన్ను ఆపకుండా చదివించింది. నాలో ఏదో ఒక స్పందన కలిగించిన రచనని నేను వ్యక్తిగతంగా మంచి రచనగానే పరిగణిస్తాను. ఇది చాలా చోట్ల నవ్వించింది. అక్కడక్కడా ఆలోచనలో పడేసింది. చివరికంటా ఉత్కంఠతో చదివించింది. కనుక చివర్లో నిరాశపరచినా కూడా క్షమించి, ఈ రచయిత్రి రాసిన మరొక నవల ఏదన్నా దొరుకుతుందేమో చూడాలని నిర్ణయించుకున్నాను. ఈ నవలను కూడా ఎప్పుడో‌ మళ్ళీ చదువుతానని అనుకుంటున్నాను. కొన్ని కొన్ని వాక్యాలైతే ఎన్నిసార్లైనా చదివి నవ్వుకోవచ్చు.

అన్నట్లు, ఈ నవల రచయిత్రికి ప్రచురణ పొందిన తొలి నవల. అంతకుముందు ఆవిడ చాలా రాసినా కూడా అవి ప్రచురణకి నోచుకోలేదట. కానీ, ఇది మాత్రం విపరీతమైన ప్రాచుర్యం పొంది, అనేక అవార్డులు అందుకుంది. ఈ నవలకు ముప్పై పైచిలుకు భాషల్లో అనువాదాలు విడుదలయ్యాయి.

రచయిత్రి వికీపేజీ, సొంత వెబ్సైటు.

You Might Also Like

3 Comments

  1. pavan santhosh surampudi

    నిజజీవిత వ్యక్తుల్ని నేరుగా తెలిసిపోయేలా సాహిత్యంలో చూపించడం గురించి బాగా రాశారు. పతంజలి “పెంపుడు జంతువులు” నవలలో ఓ పత్రిక ఎడిటర్ తనను అస్తమానూ హింసలు పెట్టే ఇంటి యజమానిని ఏమీ అనలేక పత్రికలో కార్టూనిస్టు చేత కార్టూన్(అతని రూపం కొంత తెలిసేలా) వేయించి సంతృప్తి పడతాడు. తీరాచూస్తే ఆ ఇంటి యజమానికి పూర్తిగా విషయం అర్థమైపోతుంది. దాంతో అగ్గిమీద గుగ్గిలమైపోయి ఇంటి మీదకొచ్చి తనలోని రౌడీయిజం యాంగిల్ చూపించి వెళతాడు. ఆ ఎపిసోడ్ మొత్తం గుర్తొచ్చింది మీ వ్యాఖ్యలు చూస్తే. ఆయనే కావాలని “నువ్వే నేను” నవలలో ప్రధానమంత్రికి వేరే పేరు పెట్టి పీవీ కారికేచర్ అన్న విషయం తెలిసిపోయేలా రాశారు మళ్ళీ. ఐతే ఇదంతా ఆత్మకథాత్మక నవలలకు వర్తించదనుకుంటాను. వంశీ “మా పసలపూడి కథలు”లోని అన్ని కథలు తానూ విని, చూసి గుర్తుపెట్టుకున్న కథలుగానే రాశారు. అలానే నామిని కథల్లో కూడా నాన్ ఫిక్షనల్ విషయాలు ఉంటాయి ఎక్కువగా. వీరు మరి ఎలా మేనేజ్ చేయ్యగాలిగారో తాము పాత్రలుగా రాసి అచ్చొత్తెసిన జనాలను.

  2. pavan santhosh surampudi

    వ్యంగ్య హాస్య నవలలు చదివే ట్రెండ్‌లో ఉన్నారా ఏంటి మొత్తానికి? పరిచయం బావుంది.

    1. సౌమ్య

      లేదండి. ది గుడ్ లైఫ్ ఎల్స్వేర్ గురించి నా స్నేహితురాలికి చెబుతుంటే ఆమె ఇది చదవమని చెప్పింది అంతే. సాధారణంగా నేను అంత వీర భక్తిగా వెంటనే చదవడం మొదలుపెట్టేయను కానీ, ఈసారికి అలా కుదిరింది 🙂

Leave a Reply