కథ 2013
వ్యాసకర్త: వాయుగుండ్ల శశికళ
******
వివిధ అంతర్జాల పత్రికలు మరియు వివిధ సంచికలలో ఈ ఏడాది వచ్చిన కథలలో కొన్నిటిని ఎంపిక చేసి తెచ్చిన కథా సంకలనమే ఇది. వాసిరెడ్డి నవీన్ గారు, పాపినేని శివశంకర్ ల సంపాదకత్వంలో పెద్దల సహకారంతో ప్రతి ఏడాది ఇలా కష్ట నష్టాలకు ఓర్చి ఒక కథా సంకలనాన్ని వేస్తున్న వీరి ప్రయత్నం
ఇప్పటికి ఇరువవై నాలుగవ మెట్టు ఎక్కింది. కథకు ఇచ్చే గౌరవంగా దీన్ని భావించవచ్చు. కొన్ని కథలలో వస్తు వైవిధ్యం లేదు అనిపించినా అన్నీ కోణాలు స్పృశించాలి అనే వీరి ప్రయత్నం దాదాపు ఫలించింది.
దీనిలో మొత్తం పదునాలుగు కథలు ఉన్నాయి. ఎక్కువ మంది రచయితలు అందరికి సుపరిచితులే.
మొదటి కథ ”గుట్ట” ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని వృత్తులు కనుమరుగవడం గురించి కె.వి.నరేందర్ గారు వ్రాసారు. శిల్పాలు చెక్కే వీరాచారి ఇతరులు వారి శిలలకు కావాల్సిన గుట్టను లీజ్ కు ఇస్తే ఎలా ఇబ్బంది పడుతారు, ఇంకా పరోక్షంగా దాని ప్రభావం చుట్టు పక్కల పొలాలపై ఎలా ఉంటుంది అనేది వ్యావహారిక బాషలో చక్కగా నడిపించారు. కడుపు మండిన సామాన్యుడు చివరికి ఏ దారి ఎన్నుకుంటాడో సూచించారు.
రెండో కథ ”సిడి మొయిలు”. దీనిని స.వెం.రమేష్ గారు తనదైన మాండలిక శైలి లో వ్రాశారు. గుడిసె ముందు పూచిన బంతిపువ్వు మీద, పేదవాడి పడుచు భార్య మీద అందరి కన్ను ఎప్పుడూ పడుతూ ఉంటుంది. కొత్తగా పెళ్లి అయివచ్చిన సిరివన్నె మీద పడిన నాగరాజు కన్ను ఎట్టాటిది? తాచు పాము విషమే. దానిని ఆడవాళ్ళు అందరు కలిసి ఎలా ఎదుర్కున్నారో రమేష్ కలం ఉరవడిలో చదవాల్సిందే. కథ మధ్యలో చెప్పిన అహల్య లాంటి అల్లమదేవి కథ చదివితే గుండె బరువెక్కక మానదు.
మూడవ కథ ”సప్త వర్ణ సమ్మిశ్రితం” పి.సత్యవతి గారు వ్రాసారు. ఇది మరియు పదకుండవ కథ మధురాంతకం నరేంద్ర గారు వ్రాసినది ”చివరి ఇల్లు” రెండూ కూడా మంచం పట్టిన ముసలి వాళ్ళ గూర్చి పని వారి చేత విషయాలు చెప్పిస్తూ నడిపించారు. ఒక్క నిమిషం మనం మన చివరిరోజుల తలపుకు వెళ్లి వచ్చేస్తాము.
నాలుగవ కథ ”బినామి” వ్రాసిన కె.ఎన్.మల్లీశ్వరి గారు చక్కని మాండలికంలో మహిళ నిస్సహాయ కోపం పూనకంగా ఎలా మారుతుందో, ఏ భావం అయినా ఎక్కడో ఒక దగ్గర ఎలాగోలా బయట పడుతుందని వాస్తవ దృశ్య సమాహారంగా కాదని మనముందు ఉంచుతారు.
ఐదో కథ ”దెయ్యం” సి.వి.సునీల్ కుమార్ గారు వ్రాశారు. మనువులు మరిచి ఇంటికి వచ్చినా నెట్ కంటుకొని నీడల్లాగా మారిపోతున్న మనుషులు ఉండగా మనిషి. దెయ్యం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని హాస్యపూరిత శైలి లో వ్రాశారు.
తరువాతి కథ ”రీ బూట్” అనిల్.ఎస్.రాయలు వ్రాసారు. కాలబిలం గుండా వెళ్లి మార్స్ వాళ్ళను చంపే అనైతిక ఆలోచన కంటే తరువాతి తరాన్ని చక్కగా పెంచడం ఎంత ముఖ్యమో ఫిక్షన్ కథగా మలిచారు. ఇదే కాక భగవంతం గారు వ్రాసిన ”చంద్రుడు గీసిన బొమ్మలు” కూడా ఫిక్షన్. ఇప్పుడు మనం చూసే చంద్రుడు మనమే కాదు బుద్దుడూ చూసి ఉంటాడు. లీబో చూసి ఉంటాడు. ఇంకా చనిపోయిన ఒక తల్లి చూసి ఉంటుంది. ఆ చంద్రుడినే
తన అమ్మను గుర్తు చేసుకుంటూ కుమార్తె చూసి ఉంటుంది అనే ఊహతో అర్థం అయ్యే శైలిలో బాగుంది.
”ప్రాణం ఖరీదు వంద ఒంటెలు” పెద్దింటి అశోక్ కుమార్ గారు గారు వ్రాశారు. కొడుకును కోల్పోతే పుట్టే బాధ కొడుకును పోగొట్టుకున్న తల్లికే తెలుస్తుంది. విప్లవానికి ఊపిరి ఊదితే వచ్చే గర్వం విప్లవ వీరులను ఇంట్లో కలిగిన వారికే తెలుస్తుంది. తన కొడుకును దుబాయిలో చంపిన వారిని ఆ తల్లి ఎందుకు క్షమిస్తుంది అనేది ఆసక్తికరంగా వ్రాసారు.
”నీలా వాళ్ళ అమ్మ మరి కొందరు” విమల గారు వ్రాసారు. రెండో భార్య కూతురిగా పుట్టిన నీల సమాజంలో పొందే స్థానం, ఇంకా చివరికి తన అమ్మను చిన్న మువ్వతో చూసుకొనే విధానం తనదైన శైలి లో చక్కగా నడిపించారు.
”పగడ మల్లెలు”సోమయాజుల శివకుమార్ గారు అప్పటి ద్రౌపది కథను కొంత మార్మికతో వ్రాసారు.
ఇంకా ”యాళ్ పాణం గోస” మన్నెం సింధు మాధురి గారు వ్రాసిన విధానం, జాప్నా లో జరిగిన విప్లవ గాథలలోని సైనిక కృత్యాల విషాదం మన గుండెకు జీరనిస్తుంది.
కుప్పిలి పద్మ గారి ”ది లాస్ ఆఫ్ ఇన్నొసెన్స్” పైకి వెళ్ళాలి అనే కాట్ రేస్ లో ఆడ మగ మరచిపోతున్న నైతిక విలువలను చర్చిస్తూ మనం చివరికి ఎక్కడ పరుగు ఆపుతాము అనే ఆలోచనలో పడవేస్తుంది.
ముగ్గురు మధ్య ఏర్పడ్డ మానసిక స్థాయి అనుబంధంగా ”రామేశ్వరం కాకులు” తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి వ్రాసారు.
అన్నీ కథలు బాగున్నాయి అని చెప్పలేము. కొందరికి కొన్ని నచ్చుతాయి. కొన్ని ఎక్కువ సార్లు చదివితే అర్థం అవుతాయి.
కాని ఇంత తక్కువ ధరలో చక్కని ప్రయత్నంతో అందించిన ఈ సంకలనం ఈ ఏడాది చరిత్రలో భాగంగా సాహిత్య ప్రియులు కొని దాచుకోవచ్చు. ఈ బుక్ ”కినిగే”లో లభ్యం.
Short Stories
2014
sasi kala
థాంక్యుకిరణ్ గారు
కిరణ్ కుమార్ కే
శశి కళ గారు,
ఈ కథల గురించి మీరు ఇచ్చిన పరిచయం బాగుంది. వాటిపై మంచి అవగాహన, అభిప్రాయం కలిగాయి. పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
sasi kala
అవును మంజరి గారు …కొంత వివరణ kkaavaalemo
మంజరి లక్ష్మి
సి. వి. సునిల్ కుమార్ గారి “దయ్యం” కథ నాకు నచ్చింది. “రామేశ్వరం కాకులు” తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి గారి కథే నాకేమీ అర్ధం కాలేదు. పోలీసు తన దగ్గరకొచ్చినామే చచ్చిపోవటానికి వెళుతున్నట్లు తెలిసీ (ఆమెను చచ్చి పొమ్మని?), సముద్రంలో మునిగి పోయేటప్పుడు ఫోన్ చెయ్యమని చెప్పటం దేనికి ప్రతీకగా వాడారో నాకైతే బోధ పడలేదు.
sasi kala
కృతజ్ఞతలు తృష్ణ గారు
తృష్ణ
కొండపల్లి బొమ్మల ముఖచిత్రం బాగుంది.మంచి పరిచయాన్ని అందించినందుకు ధన్యవాదాలు శశి గారూ.