కుసుమాగ్రజ్ కవితలకు గుల్జార్ అనువాదం

కుసుమాగ్రజ్ అనే మరాఠి కవి రాసిన కవితకు హిందీ అనువాదం చేసి, దాన్ని చదివి వినిపించిన గుల్జార్ వీడియో చూశారా/విన్నారా మీరు? వినకపోతే ఒకసారి విని చూడండి. (వినుంటే మళ్ళీ ఒకసారి వినండి.) ఆ కవితలోని భావం, దాన్ని గుల్జార్ తనదైన శైలిలో హిందిలో చెప్పుకురావటం మీకుగానీ నచ్చితే, వెంటనే చేయాల్సిన పని ఈ కవిగారి కవితలను గుల్జార్ అనువాదం చేసి అచ్చేసిన పుస్తకం – కుసుమాగ్రజ్ కీ చునీ సునీ నజ్మెను అమెజాన్‍లో ఆర్డర్ ఇచ్చుకోవటం. అంతకు మించిన విషయం నేను ఈ వ్యాసంలో రాయబోవటం లేదు. అందుకని ఈ కిందంతా చదవకపోయినా మరేం నష్టంలేదు, ముఖ్యంగా గుల్జార్‍ను చదువుకోవడం ఇష్టపడేవారు.
*******
మొన్నేదో కథల సంపుటిని పరిచయం చేస్తూ, కథల సంపుటికన్నా నవలలను పరిచయం చేయడం ఎంత తేలికోనని వాపోయాను కదా? నవలల్లోనూ, కథల్లోనూ పాత్రలు ఎంచక్కా మనుషులల్లే ఉంటారు. పేర్లు ఉన్నా, లేకపోయినా, వాళ్ళ ఆచారవ్యవహారాలు ఏవైనా, ఎంతోకొంత సమానత్వం ఉంటుంది వాళ్ళల్లోనూ, మనలోనూ. బొత్తిగా పరిచయంలేని మనుషులనో, లేక తెల్సినా మర్చిపోయిన మనుషులనో కల్సుకున్నట్టు ఉంటుంది. వాటిని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు తెల్సినవారి గురించి మాట్లాడినట్టు చెప్తే సరిపోతుంది.
కవిత్వం అలా కాదు. కథ చదవటం ఓ ఊరెళ్ళి వచ్చే ప్రయత్నం అయితే, కవిత్వం మనం అంచున నుంచొని ఎప్పటినుండో దూకాలా వద్దా? అని తటాపటాయిస్తుండగా, గభాలున మనల్ని అందులోకి తోసేసేది. ఒక్కోసారి ఆ అగాధం మనలోపలదై ఉంటుంది. కవిత్వాన్ని పరిచయం చేయడమంటే, మనల్ని మనం పరిచయం చేసుకోవడం. Objectivity, impersonal etc లు వచనానికి సాధ్యపడవచ్చునేమోగానీ, any poetry that got to you, would be personal అని నా ఉద్దేశ్యం. (ఇక్కడ నేను కవిత్వాన్ని స్టడి, అనలైజ్ చేసి దాన్ని తప్పొప్పుల చిట్టా రాయగలిగేవారిని గురించి మాట్లాడ్డం లేదు. ఇస్మాయిల్‍గారు అన్నట్టు, కవిత్వం మూగవాని కేక అయితే, ఆ కేక విన్న మూగవాని స్పందన గురించి చెప్తున్నాను.) గుల్జార్ ఒక సినిమా పాటలో రాసినట్టు, మనసుకి హత్తుకున్న కవితలు “పర్సనెల్ సె సవాల్ కర్తె హై”. అవేవిటో, వాటికి సమాధానాలేమిటో పంచుకోవడం అంత తేలిక కాదు. అందుకే, నన్ను అడిగితే, ఓ కవిత నచ్చిందో లేదో చెప్పుకోవచ్చుగానీ, ఎందుకు నచ్చింది, ఎంతెలా నచ్చింది లాంటి చెప్పలేం. బహుశా, చెప్పకూడదేమో.
ఇంక ఈ కవితా సంపుటి విషయానికొస్తే, ఇందులో కుసుమాగ్రజ్ రాసినవాటిలో దాదాపు వందకు పైగా కవితల హింది/ ఉర్దూ తర్జుమా ఉంది. (కవితలన్నీ దేవనాగరి లిపిలో ఉన్నాయి.) గుల్జార్ కథల పుస్తకానికైనా, కవితల పుస్తకానికైనా ఆయన రాసే ముందుమాటలంటే నాకు భలే ఇష్టం. మనమేదో ఆయనకి ఆప్తులైనట్టు, ఆ రచన చదివి ఏమనుకుంటున్నామో మనల్ని ఆప్యాయంగా అడిగినట్టు రాస్తారు వాటిని. ఎందుకు రాశారు, ఎలా రాశారు అన్నవి బోనస్. ఈ కవితల సంపుటిలో కవితలు సేకరించడానికి, వాటిని తర్జుమా చేయడానికి సాయపడినవారికి థాంక్స్ చెప్తూనే, మరాఠి నుండి హిందిలోకి అనువదించేటప్పుడు చేయాల్సి వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చారు.
పైన ఇచ్చిన యూట్యూబ్ లింక్‍లో కవితలానే చాలా వరకూ కవితల్లో రోజూవారి జీవనం గురించిన విషయాలే ఉన్నాయి. పేదవారు పడే పాట్లు గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి (ఇవి చదువుతున్నప్పుడు గుల్జార్ రాసిన కవితలు, పాటలు గుర్తుకురాక మానవు), సామాన్యుని జీవితంలో పాలిటిక్స్ గురించిన అంశాలను స్పృశించారు. అప్పుడప్పుడూ శూన్యంలోకి, అంతరిక్షంలోకి కూడా తీసుకెళ్ళారు. కొండలూ, కోనలూ, అందులోని ఆదివాసీలు కూడా. పెద్ద ఆడంబరం లేకుండా, మామూలు విషయాలను అలతి పదాల్లో మనసుకు హత్తుకునేలా ఉన్నాయి కవితలన్నీ. ఎక్కడా complex imagery కనిపించలేదు నాకు.
అనువాదాల్లో గుల్జార్ మార్కు బాగా కనిపిస్తుంది. నచ్చినా, నచ్చకున్నా ఆయన విరివిరిగా వాడే ఉర్దూ పదాలు, ఇంగ్లీషు వాడ్డం లాంటివన్నీ కనిపిస్తుంటాయి.
గొప్ప కవిత్వమో కాదో చెప్పలేనుగానీ, చదువుకోదగ్గ కవిత్వం. అన్నీ కాకపోయినా కొన్ని అయినా చాన్నాళ్ళ వరకూ గుర్తుండిపోయే కవితలు. హింది కవిత్వంపై ఆసక్తి ఉన్నవారు తప్పక ప్రయత్నించాల్సిన సంపుటి.
Poetry
Vani Prakashan
Paperback
128
varaprasaad.k
సమీక్ష బావుంది.
Amarnath
“గంగా మైయా ఆయీ థీ…. మాయీ కే ఆయీ హుయీ లడకీ కీ మానిన్ద్”
గంగా దేవి పుట్టిల్లు హిమాలయాలు… పోరాడే అతని ధైర్యం అతన్ని హిమాలయం లాగా నిలబెట్టినట్టుంది అని నాకనిపించింది. కవి ఊహ కూడా అదేనేమో… తెలీదు.
Amarnath
Thanks for the video link.
“ప్రళయ కావేరి కథలు” లో “ఆడపడుచుల సాంగెం” కథ గుర్తొచ్చింది ఆ కవిత వింటుంటే.
వరదల్లో ఇల్లు మునిగిపోయినా ప్రళయ కావేరి ని తిట్టొద్దనె కథకుడి తాత ధైర్యం గుర్తొచ్చింది.