ఓ కథ చెప్పనా?

నచ్చిన వాటిని సొంతం చేసుకొని జాగ్రత్తగా మన దగ్గరే అంటిపెట్టుకోవాలి. మనకెప్పుడు కావాలంటే అప్పుడే “నీవేనా నను తలచినది” అంటూ మనతో పాటు ఉండేంత దగ్గరగా ఉండాలి. మనసుపారేసుకున్నవి మన మనసు కోరగానే ప్రత్యక్షమయ్యేట్టు ఉండాలి. కానీ అంతటి జాగ్రత్త ఉండి ఏడుస్తే కదా! నచ్చిన వాటిని దూరం చేసుకోనున్నాక, వాటి తాలూకూ జ్ఞాపకాలను రోజువారీ కబుర్లో నెమరవేసుకుంటూ ఉన్నా, గుడ్డిలో మెల్ల, కనీసం అవైనా ఆవిరైపోకుండా మిగులుతాయి. మనస్సుకి మరీ దగ్గ్రరైన బాధైనా, ఆనందమైనా పంచుకోడానికి వెనుకాడే నాలాంటి వాళ్ళు, కనీసం జ్ఞాపకాలను కూడా జాగ్రత్తగా చూసుకోలేరేమో! అందుకే నేను ఇప్పుడు చెప్పేది ఒక కథ గురించి అనటం కన్నా ఓ కథతో నా కథ అంటం మేలు.

దాదాపు పదేళ్ళ కిందట ఓ ఆదివారం ఉదయం, ఎప్పటిలానే  “ఈనాడు ఆదివారం” తిరగేస్తుంటే ఉన్నట్టుండి ఒక అబ్బాయి “మొన్నామధ్య నాకు ఎవరో అపరిచితుల నుండి ఉత్తరం వచ్చింది” అని చెప్పటం మొదలెట్టాడు.

“సో?” అన్నా స్లోగా!

“అది ఎవరు పంపారో అన్న మానవాశక్తి కూడా లేకుండా పక్కకు పారేశాను.” అన్నాడు. ఎవరో నాకు దగ్గర చుట్టం మల్లే ఉన్నాడు, కాస్త ఆసక్తి కనబరిచాను.

“నీలి ముత్యాల్లా ఉన్నాయి ఆ అక్షరాలు. మూడు రూపాయల కార్డును మూడొందలకు కొన్నందుకు థాంక్స్ అని ఉందందులో” అని అన్నాడు. ఏంటో అర్థం కాక అయోమయంగా చూశాను.

“మొన్న మా యూనివర్సిటో ఏదో ఆర్ట్ ఎగ్జిభిషన్, డబ్బు పోగేసి మిలట్రీ వాళ్ళకి ఇద్దామని చేస్తున్నారట. అందుకనీ మెస్ బిల్ కట్టాల్సిన డబ్బును పెట్టి ఒక కార్డు కొన్నా. రెండు గీతలతో గాంధీజీ బొమ్మ గీసుంటుంది దాని మీద!” వివరణ ఇచ్చుకున్నాడు. “నచ్చావురా అబ్బి” అని అనుకొని లేచి కూర్చొని బుద్ధిగా వినటం మొదలెట్టాను.

“తర్వాత మళ్ళీ ఉత్తరం వచ్చింది. ఈ సారి ఎవరి నుండో ఏమిటో వెతికను. ఏ ఆధారం లేదు. కానీ నా గదిలో నా పేరు మీద ఉంది. ఎవరు పంపిస్తున్నారో కూడా తెలీదు” అని అన్నాడు అయోమయంగా. “ఎవ్వరై ఉంటారంటావ్” అంటూ నేనూ ఆలోచనల్లో మునిగాను. ఇంతలో మళ్ళీ ఉత్తరం వచ్చిందన్నాడు. ఎవరో అమ్మాయి రాస్తుందన్నాడు. అమ్మాయి గురించి ఆలోచించటం మొదలెట్టినట్టున్నాడు, మన వాడిలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. “నన్ను గెడ్డం పెంచుకొని తిరగదంది. గోళ్ళు కొరుకుతూ కనిపిస్తే కొట్టేస్తానని” బెదిరించింది అని బుంగమూతి పెట్టి చెప్పాడు. మరుసటి రోజుకళ్ళా గెడ్డం మాయం. గోర్లు కొరకడం కూడా తగ్గించాడు.

“ఇక లాభంలేదు. ఆ అమ్మి ఎవరో మనం కనుక్కోవాల్సింది” అన్నాను యమ సీరియస్‍గా!

“తెల్సింది. తెల్సింది. మా యూనివర్సిటిలోనే వేరే కోర్సు చేస్తుంది తను. నా రూమ్మేట్ కుట్ర వల్ల నాకు ఉత్తరాలు అందుతున్నాయి” అంటూ ఆమెను ఓ నాలుగైదు లైన్లు వర్ణించాడు. మన వాడు కొన్న గీతల గాంధీ కూడా అమ్మాయిగారి ఆర్టే అట. తెగ మురిసిపోయాడు. చదువులోనూ, కళల్లోనూ, రూపంలోనూ (గోడ చాటు నుండి చూడ్డం మొదలెట్టాడు మరి) వందకి వంద మార్కులు వేసేశాడు. కానీ ఉత్తరాలకి మాత్రం జవాబులు ఇవ్వటం లేదు. ఆ అమ్మి రాస్తూ ఉండడం, ఈ అబ్బి చదివి తన్మయత్వంలో మునిగి తేలడం – నాకూ అలవాటయ్యిపోయింది.

“మీరంటే ఏదో ప్రత్యేక భావన” అని రాసిందట ఒక దాంట్లో. మరో దాంట్లో మన హీరో కరీర్ పరంగా ఏమేం చెయ్యాలో కూడా సలహాలిచ్చింది తనకి జూనియర్ అయ్యుండి. అప్పుడే ఈ అబ్బి కుటుంబ నేపధ్యం గురించి నాకు తెల్సింది. పేద కుటుంబం నుండొచ్చి, కుటుంబ బరువు బాధ్యతలను త్వరలో నెత్తినేసుకోబోయే క్రమంలో, ఏదో భారం మోస్తున్నవాడిలా ఉదాసీనంగా ఉండేవాడు. ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చే డబ్బుతో పి.జి చేస్తున్నాడు. తనకున్న అవకాశాలను పట్టించుకోకుండా ఒకే చూరిని పట్టుకొని వేళ్ళాడుతున్న వీడికి కొన్ని సలహాలు ఇచ్చింది. మన వాడు తు.చ. తప్పకుండా పాటించాడని నేను చెప్పక్కరలేదనుకుంటాను.

“అన్నీ చేస్తున్నావ్ కదా, వెళ్ళోసారి ఆ అమ్మాయితో మాట్లాడచ్చు కదా” అనబోయాను. “మా పరీక్షలైన ఆఖరి రోజున మేమిద్దరం కలుస్తున్నాం” అని అనౌన్స్ మెంట్! ఇప్పుడూ గోర్లు నేను కొరకడం మొదలెట్టాను. తీరా వచ్చి, అసలేం మాట్లాడుకోలేదు, ఐదు నిముషాలు ఒకరినొకరం చూసుకొని వచ్చేశాం అని చెప్పాడు.

“ఏంటీ? ఇన్నాళ్ళకి కలుసుకొని మొహాలు చూసుకొని తిరిగి వచ్చేశారా? – ధీర్ఘాలు తీశాను.

“వాలాలనే బాధ్యతను మర్చిపోయాయి నా కనురెప్పలు!” అన్నాడు. పొయెట్రీ! కవిత్వం! షాయరీ! అదే ఊపులో ఆమెతో గడిపిన ప్రతీ క్షణాన్ని అంతే కవితాత్మకంగా చెప్పుకొచ్చాడు. నాకు కథ చెప్పటం మొదలెట్టిన కుర్రాడేనా అని అనుమానం వచ్చింది. పరీక్షలయ్యాయని ఆ అమ్మాయి ఊరెళ్ళెంది. మనోడు కాంపస్‍లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఊర్లు నుండి ఉత్తరాలు పంపుతూనే ఉంది. తన ఊరు గురించి, తనకు అమ్మా నాన్నా లేరనీ, చనిపోయారనీ, తాతయ్య దగ్గర ఉంటుందనీ, తన తాతయ్యతో మొదటిసారిగా ఓ అబ్బాయి గురించి చెప్పిందనీ, అప్పట్లో అన్న “ప్రత్యేక భావన” ప్రేమ అని తెలిసిందనీ, అని చాలా కబుర్లు చెప్పుకొచ్చింది ఉత్తరాల్లో.

మన బుద్ధుడింకా జాబులివ్వడు ఆ అమ్మికి. నాకు టెన్షన్ ఇలా ఇలా ఉత్తరాలు చదవటం తప్ప ఏం చేయడమోనని. కానీ మెగా ప్లానింగ్‍లో ఉన్నాడని తర్వాత తెల్సింది. ఆమెని పెళ్ళి చేసుకుంటానని వాళ్ళ తాతగారిని అడగడానికి నేరుగా ఆమె ఇంటికెళ్తాడు, ఎవ్వరికీ మాట మాత్రమైనా చెప్పకుండా! వెళ్ళి కుర్చిలో కూర్చొని నీళ్ళు తాగుతూనే చుట్టూ పరిస్తాడు. అన్నీ ఆమె ఉత్తరాల్లో వివరించిన వాటికి ప్రాణం పోసినట్టుంటాయి. ఆమె చెప్పనది, అతడు చూసి “షాక్” తినే ఒక ఫోటో ఉంటుంది. అది ఆమె ఫోటోనే. కానీ దండేసి ఉంటుంది. ఆమె ఒక రోడ్డు ఆక్సిడెంట్ లో కొద్ది రోజుల కిందట చనిపోతుంది.

మనవాడి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. కంపించినట్టు అనిపిస్తుంది. “నేను నా జీవితాన్ని కానుక ఇద్దామనకున్నాను. నేను వచ్చే లోపే నువ్వు నాకు దూరమయ్యిపోయావు” అని తన గదికొచ్చి ఉత్తరం రాసుకుంటాడు. ఆమెకు రాసిన మొదటి లేఖ.

కథ పూర్తవ్వగానే కళ్ళల్లో నీళ్ళు. “దేవుడెంత దుర్మార్గుడు!?” అని అప్పటి అమాయకపు ఆలోచన. ఇప్పుడైతే నేరం ఆ అబ్బాయిదే అనిపిస్తుంది. కలసి బతికే అవకాశం ఎవ్వరు దూరం చేశారనేది వదిలేస్తే, ఆ అమ్మాయిని అంగీకరించానని తెల్సీ పెదవి విప్పకపోవటం క్షమించరాని నేరమనిపిస్తోంది. ఇప్పుడీ కథ మళ్ళీ చెప్తే నాకు కోపం కూడా రావచ్చు.

టీనేజీలో ఇలాంటి కథ చదవటం వల్ల నాకీ కథ గుర్తుండిపోయిందీ అనిపిస్తుంది. అసలే వయస్సులోనైనా కథను అంత హృద్యంగా ఆవిష్కరించినందుకు మనసు పారేసుకునే తీరతాను అని అనిపిస్తుంది ఇంకోసారి. కథనం కూడా కాదు, ఆ పాత్రలు ప్రాణం పోసుకొని నాలో నిలిచిపోయాయి అనిపిస్తుంది ఎప్పుడూ. స్కూల్లో చదువుకున్న అమ్మాయి, ఆ పై ఎప్పుడూ కలవకపోయినా తన రూపం లీలగా కళ్ళ ముందు మెదిలినట్టు ఇప్పటికీ ఈ కథలో అమ్మాయి కూడా మెదులుతుంది, చెప్పబడ్డ వర్ణనల వల్ల. కథ first person నరేషన్ లో ఉంటుంది. ఆ అబ్బాయి కథ చెప్తున్నట్టు.

కొన్నేళ్ళ పాటు కథ మాటిమాటికీ చెప్పించుకునేదాన్ని. (చదివేదాన్ని అనటానికి రావటం లేదు!) ఎవరికైనా కథను ఇచ్చినా ( పేపర్ కటింగ్స్) పీకల మీద కూర్చొని వెనక్కి ఇప్పించుకునేదాన్ని. రాను రాను దాని కథే మర్చిపోయాను. ఓ చోట భద్రపరచుకున్నానని గుర్తు. ఏ చోటో మరి?! గంట వెతికి, లాభం లేక, ఊరుకోలేక ఇలా, ఇక్కడ! కథ పేరు “కానుక”? ఏమో మరి! గుర్తు లేదు. పాత్రల పేర్లూ గుర్తు లేవు. రాసింది గోపరాజు రాధాకృష్ణ అని గుర్తు. కాదు, బండ గుర్తు! అయినా పొరబాటుకి అస్కారం లేకపోలేదు. ఏవీ తెలీనప్పుడు కథ గురించి తెలపటం దేనికీ అంటే, ఏమో మరి, నాకు నచ్చిన కథను పంచుకోవటం తప్ప మరే స్వార్థం లేదు!

(గోపరాజు రాధాకృష్ణ గారి మరో కథ ఓ రెండేళ్ళ తర్వాత ఈనాడూ ఆదివారంలోనే వచ్చింది. అది కూడా నాకు నచ్చిన కథే! ఆయనవి కథ సంకలనం లేక ఏవైనా రచనలుంటే తెలియజేయగలరు. ప్లీజ్!  ఇదీ అసలు కుట్ర!)

You Might Also Like

6 Comments

  1. anuradha

    hai.

    poornima… nakkuda chala nachina kadha… radhakrishnagari gurinchi naku tesuku… if u want … wll give u details

  2. కొత్తపాళీ

    cool.
    మీరు బ్లాగు రాయడం మానెయ్యడం బ్లాగ్లోకంలో జరిగిన అతి పెద్ద క్రైం.

  3. aruna pappu

    పూర్ణిమా, చాలా బాగా రాశారు. నేను చెబుదామనుకున్న విషయాలు మురళి చెప్పేశారు. నా దగ్గర కూడా ఉందీ కథ. పేపర్ నుంచి కత్తిరించి దాచుకున్నది. పీడీఎఫ్ పంపుతాను త్వరలో. రాధాకృష్ణ కథల సంకలనం రాలేదు.

  4. శేఖర్

    వావ్! కథ, కథని మీరు చెప్పిన తీరూ రెండూ బాగున్నాయి. నాక్కూడా “వెన్నెల్లో ఆడపిల్ల” గుర్తొచ్చింది.

  5. Purnima

    WOW!

    ఈ టపా రాసేసి, చాలా సేపు ఆలోచించాను, వెయ్యనా? వద్దా అని.

    మురళి గారు, ధన్యవాదాలు!

  6. మురళి

    పూర్ణిమ గారూ కథ పేరు ‘కానుక.’ నాయిక పేరు ‘గీతిక’ హీరో పేరు ‘గాంధీ’.. రచయిత పేరు కరక్టే.. గాంధీ కాలేజిలో లెక్చరర్ ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎమ్మెస్సీ చదువుతూ ఉంటాడు.. ఆమె అతనికి జూనియర్.. అతని చేత వేరే ఉద్యోగాలకి అప్ప్లై చేయిస్తుంది.. లెక్చరర్ ఉద్యోగం రాదు కానీ, ఆ అమ్మాయి సలహా వల్ల వేరే ఉద్యోగం వస్తుంది.. నాకు చాలా చాలా నచ్చిన కథ.. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ గుర్తొస్తుంది.. నా దగ్గర ఉందండి..

Leave a Reply