The Lover’s Dictionary: A Novel
పోయినవారంలో ఒకరు ఓ అమ్మాయి, అబ్బాయి మధ్యనున్న అపార్థాలను నాకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక పిట్టకథ చెప్పారు. మొదట బానే ఉందనిపించిందిగానీ, బైరాగి ఎక్కడో రాసినట్టు తర్వాతి రెండు రోజుల్లో “తరంగాల తాడనలా (దాని) అర్థోద్ధతి సహించాను.” ఆ మూడ్ నుండి బయటపడ్డానికి ఆన్‍లైన్‍లో ఏదో చదవబోతే “ది పారిస్ రివ్యూ”లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ తగిలింది. ఆమె రాసిన కథలెలా ఉంటాయోగానీ, ఆమె చెప్పిన కబుర్లు మాత్రం బాగా నచ్చాయి. అసలు ఆమె కథల పుస్తకం కొనాలనే అమెజాన్ పేజ్ తెరిచాను. తినే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసిపెట్టినట్టు, చదివే ప్రతి పేజి మీద చదివేవాడి పేరు కూడా ఉంటుందేమో. అందుకే కొనాలనుకున్న పుస్తకం కాకుండా “The Lover’s Dictionary” నా కళ్ళబడింది. మనసు ఊరింది. ఏ తర్వాత ఏముంది? పుస్తకం కొనుక్కొని డౌన్‌లోడ్ చేసుకోవడం, చదవటం, దాని గురించి రాయకుండా ఉండలేనంత దూరం వచ్చింది. Maybe books happen to you. Just like love.
ఈ వ్యాసం కూడా నేను రాసిన ఇతర వ్యాసాల్లానే ఉంటుంది. విపరీతంగా నచ్చేసిన పుస్తకాన్ని ఆ ఇష్టాన్నంతా వీలైనంతగా మాటల్లో పెట్టే వ్యాసం. “దీనికి మించిన పుస్తకం లేద”నే ధోరణిలోనే సాగుతుంది. నాకు అంతగా నచ్చింది మరి!
నిజానికి “The Lover’s Dictionary” అనే పేరు చదవగానే నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటైన “A Lover’s Discourse” అనే పుస్తకం గుర్తొచ్చింది, చటుక్కున. అందులో ఒకచోట బార్తెహస్ అంటారు ఇలా:
“To try to write love is to confront the muck of language: that region of hysteria where language is both too much and too little, excessive and impoverished.”
To try to read about love is to confront the muck of love, through the language అని నాకనిపిస్తుంది. ఒకవేళ ఆ muck అంటే చిరాకైనా, లేక అలాంటిదోటి ప్రేమలో సాధ్యపడదని మీ నమ్మకమైనా ఇలాంటి పుస్తకాలు మీకు నచ్చకపోవచ్చు. నచ్చినా నచ్చకున్నా ఆ muckతో పరిచయమూ, ఎంతో కొంత సంబంధమూ ఉంటే చదవాల్సిన పుస్తకాలివి అని నా అభిప్రాయం. (కొనేముందు అమెజాన్ వాడు పెట్టిన ప్రివ్యూ చూశాను. అందులో రెండు పేజీలు చదవగానే ఇది నాకు నచ్చేలాంటి పుస్తకమని అర్థమయ్యింది.)
పేరు సూచించినట్టుగానే ఇదో డిక్షనరిలానే ఉంటుంది. ఇంగ్లీషు అక్షరాలు “a” నుండి “z” వరకూ పట్టిక ఉంటుంది. ప్రతి అక్షరంతో మొదలయ్యే కొన్నేసి పదాలు ఉంటాయి. ప్రతి పదం కింద దాని అర్థం ఉండాలికదా! నేరుగా అర్థాన్ని చెప్పే బదులు, రచయిత ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు చెప్పుకొస్తారు. ఆ సంఘటనలోని అర్థం అర్థమైనవారికి అర్థమైనంత! పదాలకు మామూలుగా అందరూ అనుకునే అర్థాలు కాకుండా, ఒకానొక మగమనిషి (అది రచయితే అవునో,కాదో నాకు తెలీదు. నేను దీన్ని ఫిక్షన్ అనే అనుకుంటున్నాను.) ప్రేమలో ఉండగా, ఆ పదాలకుగల అర్థాలు స్ఫురించే సంఘటనలు మనకు వివరిస్తాడు. మొత్తం అన్ని అక్షరాలు అయ్యేసరికి, అతడి జీవితంలో ఆమె, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, వారి బంధం, అందులోని ఒడిదుడుకులు లాంటివన్నీ మనకి చాలావరకూ తెలిసొస్తాయి.
నాకు నచ్చిందదే ఈ పుస్తకంలో. అందమైన వచనంలో పేలవమైన ప్రేమకథ చెప్పినా బాగానే ఉంటుంది, చదువుకోడానికి. కానీ ఈయన కథను ఏకధాటిగా చెప్పకుండా, bits and piecesగా నేర్పుగా చెప్పుకురావడమేగాక, ప్రేమలో ఉన్నప్పుడు పదాల అర్థాలు మామూలుకన్నా ఎంతగా మారిపోతాయో హైలైట్ అయ్యే విధంగా రాసారు.మొదటంతా ఎన్నుకున్న పదానికి ఎలాంటి అర్థం ఆపాదిస్తారా అన్న ఉత్సుకత ఉన్నా, రానురాను వీరి కథలో లీనమైపోయి, వాళ్ళిద్దరి బంధం ఎక్కడ ముగిసిపోతుందోనన్న ఆందోళన కూడా మొదలయ్యింది నాకు. అంత చాకచక్యంగా పరిచయంచేశారు, పదాలను, అతడు-ఆమె మధ్య నడిచిన కథను. “అతడు” మనకి కథ చెప్పుకొస్తాడు. అతడిలో చాలావరకూ రచయిత లక్షణాలు కనిపిస్తాయి; ఉదాహరణగా చదవటమంటే ఇష్టం, ఆమె మాట్లాడేటప్పుడు అందులో గ్రామటికల్ మిస్టేక్స్ గమనించటం, గదిలో కూర్చొని ఆమె గురించి రాసుకోవటం లాంటివి. ఆమె అందమైన అమ్మాయి. సంపాదిస్తుంది. ఎక్కువగా తాగుతుంది. వీళ్ళిద్దరూ ఓ డేటింగ్ సైట్‍లో కలుస్తారు. ఆ తర్వాత సహజీవనం. ఈ చిట్టి పుస్తకమంతా వాళ్ళిద్దరి మధ్య ప్రేమతో నిండిపోయుంటుంది. చదివేటప్పుడు ఎంతో కొంత మన మీదకూ పొంగుకొస్తుంది.
ఈ మధ్యనే నేను చదువుతున్న మరో రచయిత, Lydia Davis. ఈవిడ కూడా బుల్లి-బుజ్జి కథల నుండి ఓ మోస్తారు నిడివిగల కథలు రాశారు. అందులో ఒకటి, ఇలా ఉంటుంది:
Affinity
We feel an affinity with a certain thinker because we agree with him; or because he shows us what we were already thinking; or because he shows us in a more articulate form what we were already thinking; or because he shows us what we were on the point of thinking; or what what we would sooner or later have thought; or what we would have thought much later if we hadn’t read it now; or what we would have been likely to think but never would have thought if we hadn’t read it now; or what we would have liked to think but never would have thought if we hadn’t read it now.
“The Lover’s Dictionary” నామీద పైవిధంగానే పనిజేసింది. ఉదాహరణకు, గత కొద్ది నెలలుగా కథలను ఎందాక కొనసాగించాలి, ఎక్కడ ఆపాలి అన్న ప్రశ్నలు వేధిస్తున్నాయి. నేను కథలగురించి, కథల ముగింపు అనుకున్నవి ఈ రచనలో కనిపించాయి. ఎక్కడ కథను ఆపితే దాని స్వరూపస్వభావాలే మారిపోతాయో, అలా ఒకటే కథను ఎన్ని కథలుగా చెప్పొచ్చో ఈ రచనలో చూపించారు.
This work is a confluence of language and love, in more than one interesting way. As an example consider the following:
“The key to a successful relationship isn’t just in the words, it’s in the choice of punctuation. When you’re in love with someone, a well-placed question mark can be the difference between bliss and disaster, and a deeply respected period or a cleverly inserted ellipsis can prevent all kinds of exclamations.”
Anybody who had to write – either by choice or because of no other option – to their love, would know very well what the above para means. The others can just thank their good fate for not having to know what he means. 🙂
ఫిక్షన్ చదవడమంటే నాకిందుకే ఇష్టం. వాళ్ళవైనా, మనవైనా… కథలవే! సెట్టింగ్స్ మారుతుంటాయి. మనవి మాట్రిమోనియల్ సైట్స్, వాళ్ళవి డేటింగ్ సైట్స్ అయ్యుండచ్చు, కానీ తోడు కోసం ఆడే ఆట ఒకటే. మన పెళ్ళిచూపులకూ, వాళ్ళ డేటింగులకూ భూమ్యాకాశాలంత తేడాలుండచ్చు, గానీ తగిలే గాయాలు, వాటికి మందులు దాదాపుగా ఒక్కటే. కాపురమో, సహజీవనమో కలిసి ఉండటంలో తీపి,చేదు,వగరు, పులుపుల కలయిక మాత్రం అవే పాళ్ళల్లో ఉంటాయి. దానికి ఒక్కసారి మనం చెజిక్కాలేగానీ, ప్రేమ మనతో ఆడుకునే ఆటలు మాటలు కాదు. అయినా కూడా, వాటిని అందంగా మాటలు పేర్చగలరు కొందరు. అలాంటి రచన ఇదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
Fiction
Haper Collins Ebooks
ebook
223
Srinivas Vuruputuri
“Maybe books happen to you. Just like love.” – అందమైన ఊహ!
గతసంవత్సరం కన్నా ఈయేడు మీరు ఎక్కువగా, బాగా చదువుతున్నట్లున్నారు. రాయటం మీద ధ్యాస పెరిగినట్లున్నది. సంతోషం!
Purnima
ఇట్లాంటి కామెంట్స్ అంటే పెద్ద పట్టించుకోనట్టు ఉంటానుగానీ, అప్పుడప్పుడూ ఇవిచ్చే ఊతం అంతా ఇంతా కాదు. థాంక్యూ!
లేదండి. పోయినేడాదే బాగా చదువుకున్నాను. ఈ మూడు నెలల్లో పరిచయం చేసినవాటిలో చాలావరకు పోయిన ఏడాది చదివినవే! అందులోనూ ఆ కోర్సులు కూడా చేశాను. అవి చాలా మేలు చేశాయి. 2013 నా పుస్తకపఠనానికి సంబంధించినంత వరకూ స్పెషల్ ఇయిర్.
రాయడంపై ధ్యాస పెట్టాల్సి వస్తుంది. 🙂 ఎగ్గొట్టే మార్గాలేవైనా ఉంటే నాకు మెయిల్ చేయండి ప్లీజ్. తగిన పారితోషకం కలదు. 😛
pavan santhosh surampudi
//ఈ వ్యాసం కూడా నేను రాసిన ఇతర వ్యాసాల్లానే ఉంటుంది. విపరీతంగా నచ్చేసిన పుస్తకాన్ని ఆ ఇష్టాన్నంతా వీలైనంతగా మాటల్లో పెట్టే వ్యాసం. “దీనికి మించిన పుస్తకం లేద”నే ధోరణిలోనే సాగుతుంది//
అందుకేనేమో మీరు చదివే పుస్తకాలు చదివినా లేకున్నా మీరు రివ్యూలో ఏం రాశారోనని చదువుతుంటాను. చాలాబావుంటుంది మీ శైలి.
Purnima
Appreciate your constant support. Thanks for it.