బుచ్చిబాబు చివరకు మిగిలేది

వ్యాసకర్త: రానారె
******

“అసలు జీవితానికర్థమేమై వుంటుంది?”
__ అధ్యాయము-1 పుట-1 వాక్యము-3.

జీవితానికి అర్థమేమీలేదని, మనిషి జన్మ మిగతా ప్రాణుల జన్మలకంటే ఉత్కృష్టమైనదేమీ కాదనీ, జన్మకు కారణమూ, సార్థకత, సాఫల్యమూ, సాధన లాంటివన్నీ పెద్దగా పట్టించుకోకపోతేనే మనసుకు ప్రశాంతత అనీ, ఎవరినో ఆదర్శంగా తీసుకుని ‘ఎదగాల’నే ప్రబోధం ఒత్తిడిని పెంచుతుందే తప్ప ఉపకరించదనీ ముప్పైమూడేళ్ల వయసులో అవగాహనకు వచ్చాను నేను. ఈ అవగాహన ఏ క్షణమైనా మారవచ్చుననే అవగాహన కూడా నేను కలిగివుండటం చేత, “అసలు జీవితానికర్థమేమై వుంటుంది?” అని బుచ్చిబాబు అనేసరికి, చూద్దాం ఏమి చెబుతాడోనని చదవడం కొనసాగించాను.

రెండోపేరాలో రెండో వాక్యం నన్ను నిలబెట్టేసింది. కారణం దాని నిర్మాణం నాకు సరిగా అర్థం కాలేదు. ఆ వాక్యం ఇదీ: “చివరికి మిగలడం! పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ఆవులించి మరో ప్రపంచంలో మూర్ఛిల్లిపోతే మిగిలినవి, పగటిని వదల లేక రాత్రిని వెతుక్కునే మత్తు మేఘాలు, నక్షత్రాలు భయంతో మెరుస్తున్నాయి.” ఇలాంటిదే మూడో పుటలో: “కొంగలగుంపు సిగ్గుపడే వెన్నెట్లో మెరుస్తూ పోతున్నాయి.” కొంగలగుంపు – ఏకవచనం, పోతున్నాయి – బహువచనం.

చదువుతూ పోతున్నకొద్దీ ఈ ఇబ్బందులు ఇంకా పెరగసాగాయి,  ఉండకూడనిచోట క్వోట్స్, అచ్చుతప్పులు (1936 బదులు 1986 వగయిరా), ఉండకూడని చోట ఫుల్‌స్టాప్, “కాదు అమృతం, చెప్పకపోవడానికి కారణం, చెప్పింది. అవతలవాడు నమ్మడేమోనన్న భయం.” ఇంకా  విశాలాంధ్ర వారి పుస్తకాల్లో రోటీనుగా వుండే అదే ఫాంటు, ఇలా.

ఈ నవల ఆద్యంతమూ భావకవిత్వపు తరహా వర్ణనలు, ఉపమానాలు పుష్కలంగా దట్టించబడ్డాయి. ఏమి చెప్పదలచుకున్నాడో, ఈ వర్ణనతో ఏ వాతావరణాన్ని సృష్టించదలచుకున్నాడో, పాత్రల మనఃస్థితి ఇదీ అని పాఠకుడు గ్రహించాలని తలపోసి రాశాడో – ఆ తలంపునాలో రచయిత ఉద్దేశించిన మోతాదులో కలుగుతోందోలేదో అనే ఆలోచనతో భావకవితలను చూడగానే నా CPU వేడి పెరిగిపోతుంది. షేక్స్‌పియర్ నాటకం “హామ్‌లెట్” కథ మీకు తెలిసేవుంటుంది. తెలీకపోయినా ఫరవాలేదు, ఇందులో ఒక అధ్యాయంలో క్లుప్తంగా చెబుతాడు రచయిత అందులోని. సమస్యే ఇందులోనూ ప్రధాన కథావస్తువు. పౌరాణిక నాటకాల భాషలో మాట్లాడే జగన్నాథం అనే పాత్ర లేకుంటే ఈ నవలను చదవలేం. మొదటి సగం భాగాన్ని నాతో చదివింపజేసింది కేవలం ఈ జగన్నాథమే. ఆ తరువాత చాలా విషయాలే చర్చకు వస్తాయి పాత్రల సంభాషణల్లో.

కథానాయకుడు, రచయిత ఇందులో ఎక్కడో తప్ప వేరువేరుగా వ్యాఖ్యానిస్తున్నట్టు అనిపించలేదు. ఇందులో పలు కోణాలను స్పృశిస్తూపోతాడు. అందులో దేన్నీ బలపచడంగానీ, తూలనాడటంగానీ చెయ్యడు. “… పట్నవాసాలకీ పల్లెలకీ, యంత్రాలకీ హృదయాలకీ, పారిశ్రామిక నాగరికతకీ – పాడిపంటతో నిండిన నెమ్మది వ్యవసాయానికీ, దేశంలో, అన్ని దేశాలలోనూ – నిరంతరం జరిగే మహాసంగ్రామం, తను, తన ఇంట్లో చూస్తున్నాడు. తను ప్రేక్షకుడుగా ఉండలేదు. ఇందులో ఏది మంచిదో నిర్ణయించలేం. అసలీ సమస్యలు తార్కిక బుద్ధితో తీరవు. శరీరంతో తాకి హృదయంతో అనుభవించి నాళాలపై రుజువుచేసుకోవాలి.” ఇలాగే స్త్రీ ప్రవర్తనపై, పురుషుడి నైజంపై, భగవద్గీతపై, ప్రేమపై, ద్వేషంపై, సంఘంపై, స్వేచ్ఛాజీవనంపై, సంప్రదాయాలపై ఇలా ఒక్కటేమిటి అన్నిటిమీదా స్వగతంలోనూ సంభాషణల్లోనూ ఆలోచనలను – నవల పొడుగునా – పాఠకునికి వ్యక్తీకరిస్తూనే వుంటాడు. ఏ విషయంపైనా తార్కిక బుద్ధితో ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేడు. అనుభవాలయేకొద్దీ అతని అవగాహన మారుతూపోతుంటుంది. ఐనా అన్నీ గహనం(abstract)గానే వుంటాయి. చివరికి మిగిలేది తనతో తాను సమాధాన పడటమే. సమాధానం కాదు, సమాధానం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాల జ్ఞాపకాలు.

కుటుంబరావు కమ్యూనిస్టు, సుందరం సోషలిస్టు, అహోబిలరావు అనార్కిస్టు అంటూ ముగ్గురిని పరిచయం చేస్తాడు – వీళ్లు కల్పిత పాత్రలు కాదేమోనని నాకనిపించింది. దీని గురించి బహుశా చర్చలు జరిగేవుండొచ్చు పాఠకలోకంలోనూ, విద్యార్థిలోకంలోనూ – ఇది “గ్రూప్-II మొదలగు పోటీ పరీక్షలకు ఎంపికైన నవల” అని ముద్రించబడి వుందిగనుక. వీళ్ల పరిచయంతో ప్రబోధంతో కొత్త అల్లుడు కాస్తా, భారత స్వాతంత్ర్యోద్యమంలో దూకి పోలీసుల చేతిలో దెబ్బలు తిని ఆస్పత్రిపాలై, తెల్లదొరల ప్రాపకంలో హోదా వెలిగిస్తున్న పోలీసు అధికారియైన మామగారితో చెడి, సంసారానికి దూరమౌతాడు. ఆ గొడవలో తనను మాత్రమే అరెస్టుకాకుండా తప్పించ ప్రయత్నించిన మామగారిని నిరసిస్తాడు – అటు వృత్తికీ, ఇటు జాతికీ కాకుండా పోయాడని. ఇదే ఇతివృత్తం మహీధర రామ్మోహనరావుగారి ‘కొల్లాయిగట్టితేనేమి’ నవలలో మరింత విశదంగా మంచి పట్టుతో చిత్రీకరించబడింది. ఇలా బ్రిటీషువారిచ్చే రావుబద్దూరు వంటి బిరుదాల హోదాల మోజులో జాతికి వ్యతిరేకంగా పనిచేసే ‘పెద్దలతో’ పేచీ పడిన ఇలాంటి యువకులకు ఆ సమయంలో కొదువ వుండేది కాదేమో.

తన గతాన్ని గురించి హేళనచేసి బాధించే వ్యక్తులైన – కోమలిని కొట్టడం, సుశీలను కోపంగా చూసి కండ్లనీరుపెట్టుకు వెళ్లిపోవడం, క్లబ్బులో వ్యక్తిని డబ్బు దొంగలించి ప్రతిక్రియ చేయబూనడం, అన్నీ అయ్యాక, చివరికి నేరుగా ఈ తరహా జనంలోకి వెళ్లి నేను మీకు చేసిన అపకారమేమిటని నేరుగా ప్రశ్నించడంతో కథానాయకుడు దయానిధి ప్రవర్తనలో మార్పు (పరిణతి అనలేను) కనిపిస్తుంది. ఈ పనేదో ముందే చేసివుండొచ్చు కదా అనిపించింది చదివినప్పుడు.

ఈ నవలలోని విద్యావంతులైన ముఖ్య పాత్రలకు ప్రపంచ చరిత్ర, సమకాలీన విషయాలూ చాలానే తెలుసనిపించేలా వున్నాయి సంభాషణలు.

దయానిధి పెండ్లికి వచ్చిన జగన్నాథం అంటాడు: “హెలన్ ఆఫ్ ట్రాయ్ ని చూశానండోయ్ – మై డియర్ హెక్టర్ జీ” అని. దయానిధి మరో మిత్రుడు రాజా అంటాడు, “అట్లాగయితే, నేనిక్కడ కిళ్లీ దుకాణం పెట్టుకుని, నన్ను గ్రేటాగార్బొ ప్రేమించిందంటే, నీ కెట్లాగనిపిస్తుంది?” – ఈ గ్రేటా గార్బొ గురించి ఈ మధ్యే తెలిసింది, సినిమా ప్రియుడైన నా మిత్రుని ద్వారా. పెండ్లికి నేను దూరం అనే ఈ రాజాతో “ఆ ‘బెర్నార్డ్ షా’ శిష్యరికం” మాన్పించేయాలనుకుంటాడు దయానిధి. “ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లాడటం మగువల పని, ఎంత కాలం వీలైతే అంత కాలం అవివాహితునిగా కొనసాగడం మగవాని పని” అనే బెర్నార్డ్ షా జ్ఞానగుళికను గతంలో విని వున్నాను. దయానిధి మరో మిత్రుడు అతనికి పంపిన కానుక, హేవ్‌లాక్ ఎలిస్ రాసిన పుస్తకం స్టడీస్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ సెక్సు.

దయానిధి పెళ్లిలో భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు రాజా చేసే వ్యాఖ్యానాలు కొంత ఆసక్తికరంగా వుంటాయి:

అకీర్తించాపి భూతాని కథయిష్యన్తి తేవ్యయామ్

సంభావితస్యచాకీర్తిర్మణాదతిరిచ్యతే
(హేయమైన యపయశముగూర్చి జనులు మాటాడగలరు అపయశమ్మునకన్న చావైనమేలు గౌరవార్హుండుకీర్తినే గోరదగును.)

“ఇంతకంటే దౌర్భాగ్యమైన సందేశం ఉంటుందా? పరమాత్ముని అనుభవించి, నిశ్చలమైన ఆనందాన్ని పొందినవాడు, అన్నిటికీ అతీతమౌతాడు. అలాంటివాడికి కీర్తిపై అంత మోజు ఎందుకు? సర్వాన్నీ విసర్జించి చిదానందం పొందిన వ్యక్తికి పేరు ప్రతిష్టలపై అంత తాపత్రయం దేనికో, పైగా దానికంటే చావే మేలట. కీర్తి ఒక పాండవులకు మాత్రమేనా ఏమిటి? కౌరవులకు అక్కరలేదా. అంచేత కీర్తికోసం దెబ్బలాడుకోమని ప్రబోధం. నేటి పెద్దరాజ్యాలన్నీ ఆర్థిక రంగంలో మార్కెట్లకోసం కొట్లాడుకుంటున్నట్లు! పైగా చావమంటోంది. అంటే ఆత్మ త్యాగాన్ని మెచ్చుకుంటోంది. అవతలవాడిని చంపలేకపోతే నువ్వు ఏ గన్నేరుపప్పో తిని చావమంటోంది ఈ పవిత్రగ్రంథం.”

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వో వా భో క్ష్యసే మహీమ్
తస్మా దుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ:
అంటే యుద్ధంలో చనిపోతే స్వర్గమో (అంటే రంభ వగయిరా స్త్రీలతో కులాసా), గెలుపొందితే రాజ్యభోగము పొందగలవు. అందుచేత, లే, యుద్ధం చెయ్యి అని. చూశారా, భోగాలకోసం, శరీర సుఖాల కోసం మంచి బట్టలు, హైక్లాసు సిగరెట్లు, మోటార్(కారు/సైకిలు) రేడియో, వీటికోసం యుద్ధం చెయ్యమని ప్రబోధం. ఈ నాడు అన్ని దేశాలు చేస్తున్న పనే యింది…”

దయానిధి సర్కాలు జిలాలనుండి రాయలసీమకు వచ్చే అధ్యాయంలో, రాయలసీమను రచయిత వర్ణించిన తీరు చాలా కృతకంగా వుంది. “మైళ్లు మైళ్లు చెట్లే వుండవు.” “కుర్రాళ్లు కూడా ముసలి నవ్వులు నవ్వుతారు” “క్షామ దేవత సంతానం” లాంటి మాటలతో సాగుతుంది వర్ణన. దయానిధి కోసం వజ్రకరూర్ ప్రాంతాన్ని ఎన్నుకోవడం, అందులో దయానిధికి వజ్రం దొరకడం, ఆ తరువాత గనుల తవ్వకాలతో అతడు ధనవంతుడవటం లాంటి పరిణామాలు చాలా నాటకీయంగా కొంత అసహజంగా అనిపించాయి.

ఆంధ్ర రాష్ట్ర సాధన సమయంలో సీమ జిల్లాల వారికీ సర్కారు జిల్లాల వారికీ పరస్పర ద్వేషం రగిలించబడినట్లు వుందిందులో. తెలంగాణ్యులకు కోస్తాంధ్రులతో ఈ భేదభావాలున్నట్టు విన్నానుగానీ, సీమవాళ్ళకు ఉన్నట్టు వినలేదు. ఇది కల్పితమో నిజమో తెలీదు. కానీ ప్రాంతీయభేదాలను సృష్టించి, విద్వేషాలను రగిల్చి, ఎడబాటు కలిగించడం ఎంత సులువుగా చెయ్యబడుతుందో ఇటీవలి సంవత్సరాలలో కళ్లారా చూశాను గనుక ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

నవల చదివేశాక ఈ నవల గురించి అంతర్జాలంలో కొంత వెతికాను. పూర్తి స్థాయి మనోవైజ్ఞానిక నవల, ఆణిముత్యం, తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది లాంటి మాటలేవేవో అన్నారని తెలిసింది ఈ నవల గురించి. ఈ పుస్తకం అట్ట వెనుక భాగంలో వున్నట్టుగా, ఈ నవలలోని పాత్రలు “ఆ కాలంలో తెలుగు దేశంలోని ఆధునిక సాహిత్య – సామాజిక – తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తా”యేమో కానీ “కొల్లాయిగట్టితేనేమి”, “చిల్లరదేవుళ్లు” నవలలలో కనిపించే సహజత్వమూ పఠనీయతా ఈ నవలలో నాకు కనిపించలేదు. పై రెండు నవలల్లోని సరళతనూ సహజతనూ బుచ్చిబాబు చివరకు మిగిలేదిలో నేను అశించకూడదేమో కూడా. ఎందుకంటే, జీవితానికి అర్థం వెతకడమనే పరిధులులేని విషయాన్ని చర్చిస్తున్నది గనుక భావుకత, గహనత, మార్మికత, మనోవిశ్లేషణ ఇందులో అవసరం అయుండొచ్చు గనుక – అనుకున్నాను.

మొత్తానికి నాకు అనిపించిందేమిటంటే, జీవితానికి అర్థమేమిటనే ప్రశ్నకు ఈ నవల ఇచ్చే సమాధానం, ఎవడి జీవితానికి అర్థం వాడు వెతుక్కోవాల్సిందేనని.

civaraku migilEdi
buchchibaabu

You Might Also Like

3 Comments

  1. Thirupalu

    బుచ్చి బాబు గారి చివరకు మిగిలేది నిస్సందేహంగా చైతన్య శ్రవంతే నండి. అద్బుతమైన రీడబిలిటి ఉన్న నవలగా నేను అనుకొటున్నాను.కాక పోతే బుచ్చి బాబు గారి దృక్పదం తో మనం ఏకీభవింలేమేమో – అదీ కొన్ని విషయాల్లో మాత్రమే. స్త్ర్రీని ఏదో అర్దం కాని బ్రహ్మ పదర్ధంగా,ఏదొ మార్మికత అంటకట్టి మగవాన్ని మబ్య పెట్టే మాయగా అభి వర్ణించడం నాకు నచ్చలేదు- అంటె ఆధునిక స్త్రీ వాధ ద్రుక్పధంటొ చూసినప్పుడు.

  2. M.V.Ramanarao

    అప్పట్లో కమ్మ్యూనిస్టు రచయితలు వాళ్ళ ఐడియాలజీ ప్రకారం రాసేవారు.అవి సులభంగానే అర్థమయేవి.మిగతా కొంత మంది భావుకతతో,మార్మికతతో రాసేవారు.అందువలన వారి భావాలుసరిగా అర్థం అయేవికావు.బుచ్చిబాబు,గోపీచంద్ ,జీవీ కృష్ణారావు లాంటివారు.,జీవితసత్యాలని అన్వేషిస్తూ రాసేవారు.వారికే వారు పూర్తిగా అర్థమయేవారు కారనుకొంటాను.చివరికిమిగిలేవి ‘జ్ఞాపకాలు ‘ అంటాడు రచయిత.చైతన్యస్రవంతి పద్ధతిలో మొదటిసారిగా రాసిన నవలగా ‘చివరికి మిగిలేది ‘ కి ప్రచారం లభించింది.మానవ జీవితానికి సార్థకత,లక్ష్యం,అంటూ వున్నవా అనేది ఇంకా శేషప్రశ్నే.’చిల్లరదేవుళ్ళు ‘నీ,చివరకు మిగిలేది ‘ నీ పోల్చడానికి వీలుపడదు.

  3. మంజరి లక్ష్మి

    “”కొల్లాయిగట్టితేనేమి”, “చిల్లరదేవుళ్లు” నవలలలో కనిపించే సహజత్వమూ పఠనీయతా ఈ నవలలో నాకు కనిపించలేదు. పై రెండు నవలల్లోని సరళతనూ సహజతనూ బుచ్చిబాబు చివరకు మిగిలేదిలో నేను అశించకూడదేమో కూడా. ఎందుకంటే, జీవితానికి అర్థం వెతకడమనే పరిధులులేని విషయాన్ని చర్చిస్తున్నది గనుక భావుకత, గహనత, మార్మికత, మనోవిశ్లేషణ ఇందులో అవసరం అయుండొచ్చు గనుక – అనుకున్నాను.” ఈ మాటలు నిజమేనండి. ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ఏమి అర్ధం కాలేదు. ఒక పరిధి లేకుండా ఏదో చెప్పుకు పోతుంటే ఇలాగే ఉంటాయి. అయితే అందరు ఇదేదో జేమ్స్ జాయిస్ అనే ఆయన కనిపెట్టిన చైతన్య స్రవంతి అనే పధ్ధతి అనీ దీన్ని నవీన్ అంపశయ్య నవలలో ప్రయోజనకరంగా చూపించాడని అంటారు.

Leave a Reply