Disgrace: Coetzee
Fiction of Relationship కోర్సులో చదివిన పుస్తకాల్లో ఇది ఒకటి. అంతకుముందు కొయెట్జీ పుస్తకాలేవీ నేను చదవలేదు. కోర్సులో ఇది చిట్టచివరి పుస్తకమైనా, కోర్సు మొదలవ్వక ముందే అందులోని పుస్తకాలను చదవాలనుకున్నప్పుడు, మొదట ఈ రచనతోనే మొదలుపెట్టాను. కోర్సులో భాగంగా మళ్ళీ చదివాను. ఇప్పటికి ఏడాది దాటుతున్నా ఈ రచన నా మీద చూపిన ప్రభావం ఇంకా అలానే ఉంది.
కథ క్లుప్తంగా చెప్పుకున్నా ఈ రచనకు జరిగే నష్టం పెద్దగా లేదనుకుంటాను. ఎందుకంటే ఇది ఒక series of incidents and their sequence కన్నా, ఆ సంఘటనల వల్ల మనుషులు ఎలాంటి భావోద్వేగాలకు గురైయ్యారు, వారిలో ఎలాంటి మార్పులు కలిగాయి అన్నదానిపై ఎక్కువ దృష్టి పెట్టే రచన. సౌత్ ఆఫ్రికాలో ఇంగ్లీషు ప్రొఫెసర్‍గా పనిజేస్తున్న డేవిడ్ కథ ఇది. భార్య నుండి విడాకులు తీసుకొని ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. అతడితో తరచూ గడిపే వేశ్య, తనను తన కొడుకుతో సహా డేవిడ్ చూసేశాడని గ్రహించి, అతడికి దూరంగా వెళ్ళిపోతుంది. ఆడదానికి బా అలవాటైన డేవిడ్ తన కూతురి వయసంతటి తన విద్యార్థినితో (ఆమె బ్లాక్) శారీరక సంబంధం పెట్టుకుంటాడు. ఆమె అతడిని వారించదుగానీ, ఆమోదమూ తెలపదు. ఆమె మౌనమే అంగీకారమనుకుంటాడు డేవిడ్. కొన్ని రోజులకు ఆమె, ఆమె బాయ్ ప్రెండ్ కలిసి డేవిడ్ మీద కంప్లెంట్ చేస్తారు – డేవిడ్ తన విద్యార్థినినే రేప్ చేశాడంటూ. ఎంక్వైరీలు మొదలవుతాయి. తాను చేసింది తప్పని ఒప్పుకుంటే చాలు, కొంత జరిమానాతో వదిలేస్తామని పానెల్ ఒక చివరి అవకాశం ఇస్తారు. డేవిడ్ అందుకు నిరాకరిస్తాడు. తాను చేసిందేం నేరం కాదని, అది చేసినందుకు తనకేం పశ్చాత్తాపం లేదని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. విసుగొచ్చిన జడ్జీలు అతడికి వీలైనంత కఠిన శిక్షే వేస్తారు.
ఉద్యోగం పోయి, పరువు పోయి వీధిన పడతాడు డేవిడ్. తల్లిదండ్రి నుండి దూరంగా ఊర్లో ఉంటున్న తన కూతురి దగ్గరకు వెళ్తాడు. అతడి కూతురు ఏదో కొంచెం పొలం పుట్రా సంపాదించుకొని, వాటితో జీవితం కొనసాగించాలనుకుంటుంది. ఎన్నిసార్లు అడిగినా పట్నానికి వచ్చేయడానికి ఇష్టపడదు. కూతుర్ని, ఆమె ఇష్టాయిష్టాలనూ, ఆమె చుట్టుపక్కల ఉండే మనుషులను అర్థం చేసుకోడానికి డేవిడ్ శ్రమపడుతుండగా, ఒక రోజు కొందరు (నల్లజాతీయులైన)దుండగులు వచ్చి, డేవిడ్‍ని చితకబాది బాత్రూమ్ లో పడేసి, వాళ్ళ ఇంట్లోనే అతడి కూతురిని బలాత్కరిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక, కొంత సమయం గడిచాక, డేవిడ్ పోలీసులకు రిపోర్టు ఇద్దామంటే కూతురు వద్దంటుంది. మాటమాటల్లో ఆమె బలాత్కరించబడడం ఇది మొదటిసారి కాదని గ్రహిస్తాడు. కొన్నిరోజులకు ఆమెను బలాత్కరించినవాళ్ళని పక్కింటివాళ్ళ ఫంక్షన్లో చూస్తాడు. వాళ్ళని పోలీసులకు పట్టించాలనుకుంటాడుగానీ కూతురు మళ్ళీ ఆపేస్తుంది. అంతకన్నా విడ్డూరంగా ఆ పక్కింటివాడినే – అతడికి ఇంతకుముందే పెళ్ళైనా కూడా – పెళ్ళి చేసుకోడానికే సిద్ధపడుతుంది. ఆ పెళ్ళి ఆమెకు అక్కడ రక్షణ కల్పిస్తుందని, ఆమె జోలికి గానీ, ఆమె ఆస్తుల జోలికిగానీ ఎవరూ రాకుండా అతడు చూసుకుంటాడన్నది ఆ పెళ్ళిలోని అంతర్లీన ఒప్పందమని డేవిడ్ తెల్సుకుంటాడు. పట్నానికి రమ్మంటాడు. కూతురు ఒకటే మంకు పట్టు పట్టుకొని కూర్చొంటుంది. చేసేది ఏం లేక, డేవిడే తిరుగుప్రయాణానికి సిద్ధపడతాడు.
ఇది ప్రధాన కథ. ఇది కాకుండా కూడా డేవిడ్ మరెన్నో పాత్రలతో ఇంటరాక్ట్ అవుతుంటాడు. అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందులో బాగా గుర్తుండిపోయేవి: తాను “రేప్” చేసిన విద్యార్థిని తల్లిదండ్రులను కలవడానికి వాళ్ళ ఇంటికివెళ్ళినప్పటి సీక్వెన్స్. అలానే రేప్ కారణంగా గర్భవతి అయిన కూతురిని బాగోగుల గురించి అతడు మధనపడుతూ ఆ ఊర్లో ఉన్నఆనిమల్ వెల్ఫేర్ నడిపిస్తున్న స్త్రీతో అతడి సంభాషణ. “నీ కూతురిని రేప్ చేసేటప్పుడు నువ్వక్కడ లేవుగా” అన్న మాటల గురించి, అతడిలా అనుకుంటాడు:
“What more could he have witnessed than he is capable of imagining? Or do they think that,where rape is concerned, no man can be where the woman is? Whatever the answer, he is outraged, outraged at being treated like an outsider.”
ఈ రచనలో ఆసక్తికరమైన విషయమేమిటంటే, డేవిడ్ పట్నంలో ఉన్నంతకాలం అతడి తెల్లవాడు అవ్వడం అతడికో రక్షణా కవచంలాంటిది. అక్కడ అతడికి అడ్డు లేదు. అదే అతడు ఊర్లో ప్రవేశించేసరికి, అదే తెల్ల చర్మం అతడికి, అతడి కూతురికి ప్రమాదకరంగా మారింది. అక్కడ నల్లజాతీయులు తెల్లవాళ్ళ మీద ప్రతీకార చర్యలు మొదలెట్టి ఉన్నారు. తనను రేప్ చేసినవారిని గురించి మాట్లాడుతూ, అతడి కూతురు, వారి కళ్ళల్లో నేను ద్వేషం చూశాను అని చెప్తుంది. సౌత్ ఆఫ్రికాలోని రేషియల్ డిస్క్రిమినేషన్, దానివల్ల జరిగిన దుష్పరిణామాలు, అది ఇరువర్గాల మీద చూపిన ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో ఈ రచన చాలా ఉపయోగపడుతుంది. అంటే, హిస్టారికల్ అకౌంట్ కోసం కాదు. ఆ ఘటన మధ్య నలిగిన బతుకులను అర్థంచేసుకోవడమని నా ఉద్దేశ్యం.
అదే కాక, మగవాడు ఆడదాని శరీరాల మధ్య సంబంధాల గురించి ఆలోచించుకునే వీలుకూడా కల్పిస్తుంది ఈ నవల. ఉదాహరణకు, కూతురి రేప్ గురించి డేవిడ్ ఇలా ఆలోచిస్తాడు:
Menstruation, childbirth, violation and its aftermath: blood-matters; a woman’s burden, women’s preserve. Not for the first time, he wonders whether women would not be happier living in communities of women, accepting visits from men only when they choose. Perhaps he is wrong to think of Lucy as homosexual. Perhaps she simply prefers female company. Or perhaps that is all that lesbians are: women who have no need of men.
ఈ కథనంతా థర్డ్ పార్టీ నరేషన్‍లో నడిపిస్తారు. ఆ నరేటర్ కథలో పాత్ర కాకపోయినా ఆ గొంతును విస్మరించటం కష్టం. డేవిడ్ అంతర్మాతలా ఒకసారి, అతడి విమర్శకునిగా మరోసారి నరేటర్ ఆసక్తికరమైన కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటాడు. కథంతా దాదాపుగా డేవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది. ఈ లిమిటెడ్ నరేషన్ వల్ల మనకు డేవిడ్ సంగతులు, అతడికున్న కారణాలు తప్ప ఇంకేం తెలీవు. ఉదాహరణకు, అతడి వారించకపోవడానికి అతడి విద్యార్థినికున్న భయాలు, కారణాలు ఎలాంటి? తండ్రి మాట విని పట్నం రాకుండా అతడి కూతురు ఎందుకు ఊర్లోనే ఉంటానని అంటుంది? పైగా ఆ ఊర్లో ఉండడానికి ఎప్పటికప్పుడు తాను ఇలాంటి దౌర్జన్యాలకు గురవుతూనే ఉండాలి? లాంటి ప్రశ్నలకు పాఠకులకు నేరుగా సమాధానాలు ఇవ్వరు. అవ్వన్నీ డేవిడ్‍కు ఎంత విసుగు, వేదనా కలిగిస్తాయో.. ఆలోచించే పాఠకులనూ అలాగే వెంటాడుతాయి.
కోయెట్జీ ఇతర రచనలేవీ నేను చదవలేదుగానీ, చదివిన ఇది ఒక్కటీ మాత్రం మనసుకు బాగా హత్తుకొనిపోయింది.
Fiction
Paperback
SEKHAR
పైన చర్చించిన నవలలో Poornima గారు చెప్పిన విషయాలు మాత్రమే గాక ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కథానాయకుడు తన సోషల్ జీవితంతో సంబంధం లేకుండానే సాంఘిక వివక్షకు గురికావడం, పుట్టిన దేశంలోనే తన రంగు వల్ల పరాయివాడు కావడం,అధికార ఆక్రమణ పర్వంలో సమాజం ప్రదర్శించే ద్వంద్వ నీతులూ, ఆ ప్రవాహంలో పది కొట్టుకుపోయే వానపాములూ మనకు పై నవలలో కనిపిస్తాయి.
Poornima గారూ , మీకు వీలైతే LIFE AND TIMES OF MICHEL K of Coetzee చదవండి. Coetzee view లోని South Africa, అక్కడ జరుగుతున్నSTRUGGLES లోని COMPLEXITIES బాగా అవగతం అవుతాయి.
Sekhar
.
మంజరి లక్ష్మి
పూర్ణిమ గారు నాకు ఇంగ్లీష్ నవలలు చదవటం రాదు. కానీ వాటిలో చెప్పే విషయాలు తెలుసుకోవాలని కుతూహాలం. వాళ్ళ వాతావరణం, వాళ్ళ దృక్పధం వేరుగా ఉంటాయి కదా! అందుకని ఇటువంటి పరిచయాలనే చదివి పుస్తకం చదివిన ఫీలింగ్ తెచ్చుకుంటూ ఉంటాను. ఈ కధలో తెల్ల వాళ్ళ మీద నల్ల వాళ్ళు అత్యాచారం చెయ్యటం చూస్తే, చలం గారి ఒక నవలలో(బ్రాహ్మణీకం అనుకుంటా) కూడా ఇలాంటిదే ఒక సన్నివేశం ఉంది. ఆమె బ్రాహ్మణ మనిషని చెప్పి ఆ కులం మీద ఉన్న వ్యతిరేక భావంతో ఒక తక్కువ కులం మనిషి ఆమెను, తను డాక్టరునని, పిల్లవాడిని బాగు చేస్తానని చెప్పి మోసం చేసి, పాడుచెయ్యటం, తల్లి పిల్లాడు చనిపోవటం, ఆ మోసం చేసిన వ్యక్తి కూడా దీపం బుడ్డి పంచకంటుకొని చనిపోవటం జరుగుతుంది.
Halley
After Saramago i have now added Coetzee to my to-read list. You seem to be targetting Nobel laureautes of late!
Purnima
ఇప్పుడనే కాదు, నేను “లిటరరీ ఫిక్షన్”ను సీరియస్‍గా తీసుకున్న రోజు నుండి నాకు నోబెల్ ప్రైజ్ విన్నర్సే ఎక్కువగా తగిలారు, అందులో చాలా వరకూ నచ్చారు. ఆఖరికి, నేనేదో క్యూరియోసిటీ కొద్దీ మో యాన్‍ను చదివిన ఏడాదికేమో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలా అని, అవి వచ్చినవాళ్ళవే చదివానని కాదు. But they have been occupying a special place on my shelf, for some time now.
Glad you added them to your reading list. I’d be waiting to hear what you think about them.
మంజరి లక్ష్మి
“అతడితో తరచూ గడిపే వేశ్య, తనను తన కొడుకుతో సహా డేవిడ్ చూసేశాడని గ్రహించి,” ఆ వేశ్యకు కొడుకు ఉన్నాడని తెలియకపోవటమా లేకపోతే ఆ వేశ్య తన కొడుకుతో సంబంధం పెట్టుకుంటే చూశాడా? ఆమె కొడుకు డేవిడ్ కు అంతకుముందే తెలుసా? నాకిక్కడ అంతగా అర్ధం కాలేదు.
Purnima
నేను జవాబు ఇవ్వటం ఆలస్యమైంది గనుక, మీరీ పాటికి పుస్తకం చదివేసి, ఆ వాక్యంలోని అర్థం తెల్సుకునే ఉంటారని అనుకుంటున్నాను. 🙂
తన కస్టమర్‍కు తన కుటుంబ విషయాలు తెలియకూడదని అనుకుంటుంది ఆమె. అతడికి తెల్సాక, అతడికి దూరంగా జరుగుతుంది. ఎందుకు, ఎలా అనేవి పుస్తకంలో చదువుకుంటూనే బాగుంటుంది.