నోబెల్ కవిత్వం
వ్యాసకర్త: తమ్మినేని యదుకులభూషణ్
***********
ముకుంద రామారావు గారు ముప్పై ఏడుమంది నోబెల్ బహుమానం పొందిన ఒక శతాబ్ద కాలపు కవులను ఎంతో ప్రయాస కోర్చి మూడు వందల పుటల్లో తెలుగు చేశారు. ఇందులో, ఇటీవలి కాలంలో తెలుగులో అనూదితమైన నెరుడా, పాజ్, మిలో ష్ లే కాకుండా, ఒక తరం వెనుకటి కవులు (యేట్స్, ఠాగూర్, ఇలియట్), స్మృతిపథం నుండి జారిపోయిన కవులు కూడా అనేకం దర్శనమిస్తారు. కవుల జీవిత విశేషాలు కూడా పొందుపరిచారు ఈ
పుస్తకంలో. కవుల పట్టికలు, కాల పట్టికలు, సంప్రదించిన గ్రంథాల పట్టికలు, కొన్ని పరిశీలనలు చివరలో చేర్చి భావి పరిశోధకులకు మేలు చేశారు. ప్రతి అనువాద కవిత చివర ఆంగ్ల శీర్షిక నుంచి, శ్రద్ధ గలవారు ఆంగ్ల మూలాన్ని తెలుగు తర్జుమాని సవిమర్శకంగా పరిశీలించగల వీలు కల్పించారు.
అనువాదకులు పేర్కొన్నట్టు -“ఈ కవితలన్నీ ఆంగ్లానువాదాల నుండి తీసుకున్నవే. మూలానికి విధేయుడిగా ఉండే ప్రయత్నమే ఎక్కువ చేసాను. భావాన్ని అనుసరించి స్వేచ్ఛ తీసుకున్నవి చాలా తక్కువ. అనువాదమే అయినా దాదాపు మన కవిత్వమే అనిపించే ప్రయత్నం మాత్రం ఉద్దేశ పూర్వకంగానే చేసాను. అలాగే అందరికీ అర్థమయే రీతిలో ఉండాలనుకున్నది మరొకటి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనువాదం అనువాదమే“.
ఈ పుస్తకం ద్వారా కలిగే రెండు లాభాలను ‘అర చేతిలో ప్రపంచం’ అన్న ముందు మాటలో వెల్చేరు గారు సులువుగా ముక్తాయించారు: “ఒకటి – మన దృష్టి ప్రపంచమంత విశాలమవడం; రెండు – మన భాషలో రాస్తున్న వాళ్ళలో మంచి కవులని ప్రచార నిరపేక్షంగా గుర్తించగల బుద్ధి నైశిత్యం మనకి ఏర్పడడం“.
ఒక అనువాద పుస్తకం నుంచి అంతకు మించి ప్రయోజనాన్ని ఆశించలేము.
జంట సంపాదకుల (ప్రభాకర్,అశోక్ కుమార్ గార్లు) దృష్టిలో –
“ఈ అనువాదాలన్నీ ఇంగ్లీష్ నుంచి చేసినవే. అందువల్ల వాటికి కొన్ని పరిమితులు యేర్పడే అవకాశాలు లేకపోలేదు. తెలుగు అనువాదాన్ని అంగ్లపాఠంతో బేరీజు వేసుకొన్నప్పుడు మాత్రమే అనువాదకుడి ప్రతిభ గానీ లోటుపాట్లు గానీ తెలుస్తాయి”
మచ్చుకు కొన్ని అనువాదాలు:
LAST DAWN
Your hair lost in the forest,
your feet touching mine.
Asleep you are bigger than the night,
but your dream fits within this room.
How much we are who are so little !
Outside a taxi passes
with its load of ghosts.
The river that runs by
is always
running back.
Will tomorrow be another day ?
(Octavio Paz)
చివరి వేకువ
నీ జుత్తు అడవిలో పోయింది
నీ కాళ్ళు నన్ను తాకుతున్నాయి
నిద్రలో నువ్వు రాత్రికంటే పెద్ద
కానీ ఈ గది లోపలికే నీ కలలు సరిపోతాయి
మనమెంత – చాలా చిన్న వాళ్ళం
దయ్యాల బరువుతో బయట టాక్సీ వెళ్తోంది
ఎప్పుడూ పరిగెత్తే నది
వెనక్కి పరిగెడుతోంది
రేపు మరో రోజవుతుందా ?
***
THE BRIDGE
Between now and now,
between I am and you are,
the word bridge.
Entering it
you enter yourself:
the world connects
and closes like a ring.
From one bank to another,
there is always
a body stretched:
a rainbow.
I’ll sleep beneath its arches.
(Octavio Paz)
వంతెన
ఇప్పటికి ఇప్పటికి మధ్య
నీకూ నాకూ మధ్య
పదం వంతెన
దానిలోకి ప్రవేశిస్తే
నీలోకి నువ్వు ప్రవేశిస్తావు
ప్రపంచం చట్రంలా
కలుపుతూ మూస్తుంది
ఒక తీరం నుండి మరో తీరానికి
ఒక శరీరాన్ని ఎప్పుడూ సాగదీస్తే
ఇంద్ర ధనుస్సు
నేను దాని కమానులకింద నిద్రపోతాను
****
( నోబెల్ కవిత్వం -కవుల జీవిత -కవిత్వ విశేషాలు -ముకుంద రామారావు )
Leave a Reply