అతడు – ఆమె
వ్యాసకర్త: తృష్ణ
*********
ఓ గొప్ప పుస్తకం చదివానన్న అనుభూతి పాఠకుడికి మిగిలినప్పుడు రచయిత ఆలోచనలకు, ఆ రచన చేయడం వెనుక ఉన్న అతడు/ఆమె ఉద్దేశ్యానికీ సార్థకత లభిస్తుంది. రచనాకాలం ఏభై అరవై ఏళ్ల క్రితందైనా సమకాలీనంగా అనిపిస్తే, రచయిత ప్రకటించిన భావాలు నేటి సమాజానికి కూడా ఉపయుక్తంగా అనిపిస్తే తప్పకుండా అదొక విశ్వజనీనమైన నవల అనిపించుకుంటుంది. అటువంటి రచనే డాక్టర్ వుప్పల లక్ష్మణరావు గారు సుమారు అరవై ఏళ్ల క్రితం రాసిన “అతడు – ఆమె“. మొదట రచయిత స్వస్థలమయిన బరంపురంలో వెలువడిన ఓ లిఖితపత్రికలో ధారావాహికలా ఇది ప్రచురితమైందిట. తరువాత తల్లిగారి ప్రోత్బలంతో కథను స్వాతంత్ర్యపోరాటం నేపథ్యంలో మళ్ళీ తిరగరాసారుట లక్ష్మణరావు గారు. మూడు భాగాలుగా రాసిన ఈ నవలకు మళ్ళీ కొన్నేళ్ళ తరువాత మిత్రుల ప్రోత్సాహంతో నాలుగవ భాగాన్ని కూడా రాసి ఈ నవలకు జతచేయవలసిందైగా కోరారుట ఆయన.
చాలా చోట్ల ఈ నవల గురించిన ప్రస్తావన చూసిన మీదట ఓ నెలరోజుల క్రితం ఈ నవల కొనుక్కున్నాను. ఎంతో నచ్చేసి చదవటం పూర్తవ్వకుండానే ఓ బ్లాగ్ టపా కూడా రాసా! ఇక పూర్తి చేసాకా ఇంత గొప్ప నవలకు సరైన ఆదరణ లభించలేదేమోనన్న బాధ కలిగింది. ఇప్పటికైనా చదవగలిగానన్న ఆనందమూ కలిగింది. సామాజిక నవల అనే ముద్ర వేసుకుంది కానీ ఈ నవల లో ఎన్నో విషయాల గురించిన చర్చలు ఉన్నాయి! ప్రేమ, స్త్రీ పురుషుల మధ్యన అనుబంధాలు, స్నేహాలు, స్వాతంత్ర్యోద్యమం, కమ్యూనిజం, రెండవ ప్రపంచయుధ్ధం, సమకాలీన సమాజం, సమాజం పట్ల వ్యక్తుల బాధ్యత; ముఖ్య పాత్రలైన శాంతం, శాస్త్రి, సుభ, లక్ష్మి…. వీళ్ల ఆలోచనలూ, అభిప్రాయాలూ… కాలక్రమేణా వాటిల్లో వచ్చిన మార్పులు.. స్వాతంత్ర్యం, ఉద్యమాలూ, నమ్మకాలూ, ఉద్రేకాలూ.. ఇలా చాలా విషయాల గురించిన ప్రస్తావన ఉంది. ఆనాటి రాజకీయాలు, అప్పటి సామాజిక పరిస్థితుల గురించిన చక్కటి చిత్రాన్ని మనకు అందిస్తుందీ నవల. రచయిత విషయపరిజ్ఞానం ఎంత విస్తృతమైనదో వీటన్నింటివల్లా మనకు అర్థమౌతుంది. వుప్పల లక్ష్మణరావు గారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈయన ఎక్కువ రచనలు చెయలేదుట కానీ “బతుకుపుస్తకం” అనే స్వీయచరిత్ర అందుబాటులో ఉన్నట్లు విన్నాను.
ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఈ నవలా ప్రక్రియ గురించి..! కథ చెప్పడానికి ఆటోబయోగ్రఫికల్ టెక్నిక్ ని వాడుకున్నారు లక్ష్మణరావు గారు. కథంతా నాయికా నాయకుల డైరీల రూపంలోనే మనకు తెలుస్తుంది. అతడు, ఆమె, అతడు, ఆమె.. ఇలా ఒక జంట వరుసగా రాసుకునే డైరీ పేజీలే కథను తెలుపుతాయి. కొన్ని విషయాలనూ, వారి జీవితాల్లో జరిగే సంఘటనలనూ, ఒక జంట వారి వారి దృష్టికోణాల్లోంచి ఎలా చూస్తారు అన్నది ఈ డైరీల ద్వారా మనకు తెలుస్తుంది. డైరీ అనేది ఎటువంటి బేషజాలూ లేకుండా ఉన్నదున్నట్లు మనసులో మాటలు రాసుకునే సాధనం కాబట్టి ఈ ప్రక్రియ వల్ల రచనలో ఒక విధమైన నిజాయితీ కనబడుతుంది. అదే పాఠకులను బాగా ఆకట్టుకునే అంశం. ఈ ఆటోబయోగ్రాఫికల్ స్టైల్ ద్వారా నాయికా నాయకుల వ్యక్తిత్వాలను తెలిపే పరంపరలోనే మనకు క్విట్ ఇండియా ఉద్యమం, జైలు జీవనం, గాంధీజీ నడిపించిన ఉద్యమాలు, అప్పటి కాంగ్రెస్, స్వాతంత్ర్యపోరాటం జరిగే రోజుల్లో పరిస్థితులు, మద్రాసు నగరం; ఆంధ్రా, తెలంగాణా ఉద్యమాలు, విభజనలు, వివాదాలు; రకరకాల పుస్తకాలు, తెలుగు వంటలు, వైవాహిక జీవితం, జీవితభాగస్వామిని ఎన్నుకునే పధ్ధతి, స్త్రీ స్వాతంత్ర్యం మొదలైన వివిధరకాల విషయాల గురించిన అవగాహన కలిగిస్తారు రచయిత. అందువల్ల ఇది కేవలం స్వాతంత్ర్యపోరాటాన్ని చిత్రికరించిన నవల మాత్రమే కాదు. పాత్రల వ్యక్తిత్వాలనూ, వికాసాలనూ, పురుషాహంకారాలనూ, పరిపూర్ణమైన ప్రేమతత్వాన్నీ గురించి కూడా చెప్పే నవల. ఈ పుస్తకం చదవడం వల్ల కొంతమేర స్వాతంత్ర్యోద్యమ చరిత్ర తెలియడమే కాక స్త్రీ పురుష సంబంధాలను గురించి కూడా విశ్లేషణాత్మకమైన చర్చలు ఉన్నాయి. అందుకే ఇదొక అభ్యుదయ రచన అని కూడా అనిపిస్తుంది నాకు.
ఈ నవల గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గా “అతడు-ఆమె-మనం” అనే సాహిత్యవిమర్శనా వ్యాసాన్నిరచించారు. ఈ వ్యాసం పుస్తకరూపంలో కూడా లభ్యమైంది. నవల చివర్లో ఆ వ్యాసాన్ని ప్రచురించారు కూడా. ఈ నవల ప్రభావమౌనో కాదో తెలీదు కానీ ఓల్గా రాసిన “స్వేచ్ఛ” లో పాత్రలకు ఈ నవలలో శాంతం, శాస్త్రి లకు పొలికలు కనబడ్డాయి నాకు. ఈ నవల కథ లోకి వస్తే విదేశాల్లో లా చదివి వచ్చిన శాస్త్రి, మద్రాసులో చదువుకుని అక్కడే లెక్చరర్ గా పనిచేస్తున్న శాంతం ప్రేమవివాహం చేసుకుంటారు. సంగీతం, సాహిత్యం, నృత్యం ఇలా అన్నింటిలో ఇద్దరి అభిరుచులూ ఒకటే. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ. అయితే వివాహం తరువాత క్రమక్రమంగా సహజీవితం గడిపే కొద్దీ ఇద్దరి ఆలోచనా విధానాల్లోనూ ఎంతో వ్యత్యాసం ఉందని కనుగొంటారు. ‘శాస్త్రి’ది పురుషాహంకారం + స్వార్థ దృష్టి, ‘శాంతం’ది సామాజిక దృష్టి. చిన్నపాటి ఘర్షణలు జరిగినా సర్దుకుపోతూ ఉంటారు కానీ స్వాతంత్ర్యోద్యమం ఉధృతమయ్యాకా భార్యాభర్తల అభిప్రాయాల మధ్యన అగాధాలు ఏర్పడతాయి. అవి ఎటువంటి మార్పులకు దారితీసాయి? శాస్త్రి,శాంతం విడిపోతారా? కలిసేఉంటారా? మొదలైన ప్రశ్నలకు నవలాపఠనమే సమాధానం.
ఈ భార్యాభర్తలకు ఒక అమ్మాయి పుడుతుంది. ఈ పాపను కాక తమ గుమ్మం ముందుకు వచ్చిన ఓ పదేళ్ల నిరుపేదను చేరదీసి కూతురులా పెంచుతుంది శాంతం. అమెకు సుభ అని పేరు పెడుతుంది! ముమ్మూర్తులా శాంతం గుణగణాలను పుణికిపుచ్చుకుని ఉత్తమ సంస్కారం కలిగి, సామాజిక స్పృహతో జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలతో పెరుగుతుంది సుభ! నవల మొదటి భగం లో శాస్త్రి, శాంతం వైవాహికజీవితం గురించీ; రెండు,మూడు భాగాలు సుభ జీవితం, జనార్దనం తో ఆమె ప్రేమకథ ఉంటుంది. చివరిదైన నాలుగవ భాగంలో శాంతం,శాస్త్రిల కుమార్తె లక్ష్మి గురించి రాసారు లక్ష్మణరావు. మన కళ్లముందు పుట్టిపెరిగిన ఈ చిన్నపిల్ల ఇంత పెద్దదై ఎన్ని మాటలు చెప్తోందో అని ఆశ్చర్యం వేస్తుంది లక్ష్మి గురించి చదువుతుంటే! కమ్యూనిష్టుగా మారిన లక్ష్మివి పూర్తిగా అభ్యుదయ భావాలు. వివాహానికీ, ప్రేమకు కూడా ఆమె వ్యతిరేకి. అందువల్ల సహపాఠి భాస్కరంతో ఆమె స్నేహం పదేళ్ళు దాటినా ఏ మలుపులూ తిరగక కేవలం ఓ స్వచ్ఛమైన స్నేహంగానే మిగిలిపోతుంది. అదే బాగుంది కూడా! ఆమె చేసే పనులు, జీవన విధానం, ఆమె ఆలోచనలూ అవీ చదువుతుంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. అప్పట్లో ఇలా ఏకాకివంటి స్వేచ్ఛా జీవనం సాధ్యమా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. జన్మత: ధనికవర్గానికి చెంది, తన స్వేచ్ఛాపరమైన నిర్ణయాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండటం వల్ల, ఉద్యోగం వల్ల ఆర్ధికస్వాతంత్ర్యం ఉండబట్టి అలా ఉండగలిగిందేమో.. అందరికీ ఇది సాధ్యం కాదేమో అని కూడా అనిపించింది నాకు. ఏదేమైనా ఆదర్శవంతమైన పాత్ర.. నవలలోని మూడు స్త్రీ పాత్రలు ఆదర్శవంతమైనవే!
సంభాషణల మధ్యన హాస్యానికి కూడా బోలెడు చోటిచ్చారు రచయిత. శాంతం వేళాకోళాలూ, శాస్త్రి భోజనప్రియత్వం, జనార్దనం పిరికితనం… ఇవన్నీ కాక లక్ష్మి చూపే తెగువ కూడా ఒకోసారి నవ్వు తెప్పిస్తుంది. స్వాతంత్ర్యపోరాట సమయంలో ప్రజల మనోభావాల గురించీ, అప్పతి సామాజిక వ్యవస్థ గురించీ, మద్రాసునగరం పూర్వాపరాల గురించీ, కోర్టులు.. లాయర్లు,భూస్వామ్యవ్యవస్థ గురించీ, వివాహక్రతువులో మంత్రాల గురించీ, అసలైన తెలుగు వంటల గురించి, ఎన్నో పుస్తకాల గురించీ.. ఇంకా ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి ఈ నవల ద్వారా. చివరి భాగాలు కొన్నేళ్ళ వ్యవధి తరువాత రాసినవవడం వల్లనేమో మొదట్లో రాసినట్లు ఉండదు డైరీ! మొదటిభాగంలో డైరీల్లో ఉన్న పట్టు కథను తెలిపే క్రమంలో చివరి రెండుభాగాల్లో సడలిపోయినట్లు అనిపించింది నాకు.
ఇప్పటిదాకా ఎవరైనా అమలుపరిచారో లేదో తెలీదు కానీ ఈ నవలను పి.జి(తెలుగు) విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఉంచితే మనస్తత్వ చిత్రణకూ, పాత్రల చిత్రణకు మంచి సబ్జెక్ట్ అందించినట్లవుతుంది. ఏ పాత్ర గురించైనా ఎంతైనా చెప్పవచ్చు. అంతటి లోతు ఉందా పాత్రల్లో! రాజకీయాలనూ, చరిత్రనే కాదు సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆహ్లాదపరిచి, ఆలోచింపజేసే గొప్ప నవల “అతడు – ఆమె”.
* * *
580పేజీల ఈ పుస్తకం విశాంలాంధ్ర వాళ్ల ప్రచురణ. ఆన్లైన్లో కావాలంటే ఈ లింక్ లో ప్రయత్నించవచ్చు:
ari.sitaramayya
మంచి పరిచయం రాశారు. నేను ఈ నవల చదివి చాలా సంవత్సరాలయింది. తెలుగులో ఇంత మంచి నవల మరొకటిలేదేమో అనిపించింది చదివినప్పుడు.
మేం ప్రేమించుకున్నాం అనుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. కలిసి జీవించే క్రమంలో నిజ స్వరూపాలు బయటపడతాయి. నిరాశ పడతారు. ప్రేమంటే ఏంటో కూడా అర్థం అవుతుందేమో. అలా కాకుండా, ప్రేమించుకున్నాం అనుకునే వారు ఇద్దరికీ ఇష్టమయిన పని ఏదైనా చెయ్యాలి కొంత కాలం. ఆ తర్వాత కూడా ప్రేమ మిగిలి ఉంటే అది నిజమైన ప్రేమేనేమో. స్త్రీ పురుషుల మధ్య ప్రేమే కాదు, ఇద్దరి మనుషుల మధ్య ఉన్నది అనుకునే స్నేహం, అభిమానం, ప్రేమా నిజంగా ఎంతలోతైనవో తెలుసుకోవాలంటే వారు కొన్నాళ్ళు ఏదో ఒక పని కలిసి చెయ్యాలి. అప్పుడుగాని వాళ్ళ సంబంధం ఎంత లోతైనదో తెలియదు. ఇదీ ఈ నవల నుంచి నేను గ్రహించిన సూత్రం.
తృష్ణ
@ari .sitaramayya :నవల మూడవ భాగంలో పెంచిన కూమార్తె ‘శుభ’ జనార్దనాన్ని వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు శాంతం ఆమెకు ఇవే మాటలు చెప్తుందండీ! కొన్నాళ్ళు ఒకరి మనసునొకరు బాగా గమనించుకున్న తర్వతే వివాహం చేసుకొమ్మని.
ధన్యవాదాలు.
Nagini
చాలా కాలం నుంచీ చదువుదామనుకుంటున్న పుస్తకమండీ..మానసిక విశ్లేషణలు చాలా ఆసక్తికరం గా ఉన్నాయి..మంచి పరిచయం తృష్ణ గారూ 🙂
తృష్ణ
@నాగిని: అవునండి..కేరక్టర్ స్కెచెస్ చాలా బాగున్నాయి ఈ నవలలో. చదవండి త్వరగా!
ధన్యవాదాలు.
రమాసుందరి
కాలేజ్ చదువులప్పుడు ఉత్తేజ పరిచిన పుస్తకమిది. మళ్ళీ చదవాలనిపిస్తుంది. బాగా పరిచయం చేసారండి.
తృష్ణ
@రమాసుందరి: ఈ కాలంలో కూడా చదువుతుంటే ఎంతో ఇన్స్పైరింగా అనిపిస్తుందండీ!
ధన్యవాదాలు.
pavan santhosh surampudi
శాంతం-శాస్త్రిల డైరీలు చదువుటూంటే మనస్తత్వంపై రచయితకున్న పట్టు ఆశ్చర్యం కలిగించేది. ఒకే విషయాన్ని ఇద్దరూ ఎంత వేర్వేరు దృక్పథాలు తీసుకుంటారో ఊహించను కూడా ఊహించలేము. ఇక మూడో భాగం గందరగోళానికి కారణం ఎవరి సమకాలీన రాజకీయాలను వారు నిశ్చలంగా రాయడం కష్టం కావడమే కారణం కావచ్చు.
భారత జాతీయోద్యమం గురించి పూర్వం బ్లాక్ అండ్ వైట్ గా చదివేవాణ్ణి. ఈ నవల, టంగుటూరి ప్రకాశం గారి ఆత్మకథ అందులోని గ్రే కోణాలని చూపిస్తాయి. గాంధీ జైలులో ఉన్నప్పుడు చట్టసభలకు వెళ్ళేందుకు కొందరు జాతీయ నాయకులు ఎంతగా ఉర్రూతలూగారో చదివితేనే అసలు కథ తెలుస్తుంది.
తృష్ణ
@పవన్ సంతోష్ సూరంపూడి: అవునండీ.. అసలు కళలపై ఏకాభిప్రాయాలుండి, ప్రేమవివాహం చేసుకున్న ఇద్దరు మనుషులు ఒకే విషయాన్ని గురించి ఇంత భిన్నంగా ఆలోచిస్తారా అని ఆశ్చర్యం వేస్తుందండి. చివర్లో డిస్టర్బెన్స్ కి కారణం రచనాకాలంలో ఉన్న గేప్ అనుకుంటానండి నేను. ఏకబిగిన రాసినప్పుడు ఫ్లో ఒకలా ఉంటుంది. బ్రేక్ ఇచ్చి కొన్ని ఏళ్ల తరువాత రాస్తే మరోలా ఉంటుంది. ఆ తేడానే నవలలో కనబడుతుంది.
ధన్యవాదాలు.
Thirupalu
//ఓ గొప్ప పుస్తకం చదివానన్న అనుభూతి పాఠకుడికి మిగిలినప్పుడు రచయిత ఆలోచనలకు, ఆ రచన చేయడం వెనుక ఉన్న అతడు/ఆమె ఉద్దేశ్యానికీ సార్థకత లభిస్తుంది. రచనాకాలం ఏభై అరవై ఏళ్ల క్రితందైనా సమకాలీనంగా అనిపిస్తే, రచయిత ప్రకటించిన భావాలు నేటి సమాజానికి కూడా ఉపయుక్తంగా అనిపిస్తే తప్పకుండా అదొక విశ్వజనీనమైన నవల అనిపించుకుంటుంది.//
చాలా బాగా చెప్పారండీ! ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేయడం బాగుంది. వీలు పడితే లక్ష్మన రావు గారి బతుకు పుస్తకం పరిచయం చెయ్యరూ?
తృష్ణ
@Thirupalu :”బతుకు పుస్తకం” విశాలాంధ్రవాళ్ళే వేసారుట కానీ ఇప్పుడు దొరకట్లేదండి 🙁 కనుక్కున్నాను. ఎవరి వద్దనైనా ఉందేమో వెతుక్కుని చదవాలి..
ధన్యవాదాలు.
S. Narayanaswamy
good show.
తెలుగులోని అత్యుత్తమ నవలల్లో ప్రథమశ్రేణిలో ఉండదగినది.
కాలమానం ప్రకారం చూస్తే శాంతం సుమారు 1910 ప్రాంతాల్లో పుట్టి ఉంటుందనిపిస్తుంది. ఆమెకున్న విశాల దృక్పథంగానీ, వ్యక్తిత్వ బలంకానీ నేడు ఆధునికులమని చెప్పుకునే స్త్రీలలో, స్త్రీపాత్రలలో చాలా అరుదుగా కనిపిస్తాయి.
తృష్ణ
@ఎస్. నారాయణస్వామి: శాంతం పాత్ర నాకు ఎంతగా నచ్చిందో చెప్పలేనండి. తాను నమ్మిన సిధ్ధాంతం కోసం ఏ మాత్రం రాజి పడకుండా నెగ్గుకురావడం, అదీ మీరన్నట్లు ఆ కాలంలో చాలా గొప్ప విషయం. ఒక ఉత్తమ ఇల్లాలి పాత్రని సృష్టించాలనే సదుద్దేశంతో లక్ష్మణరావు గారు ఆ పాత్రని, మిగిలిన ఇద్దరు స్త్రీ పాత్రలను సృష్టించారనిపించిందండీ!
ధన్యవాదాలు.
sasi kala
అప్పటి బుక్ కొనడమే కాక దాని గూర్చి వ్రాసారు అంటే గ్రేట్.చాల baagaa వ్రాసారు
తృష్ణ
@శశికళ: మీరూ చదవండి. తప్పకుండా నచ్చుతుంది మీకు.
ధన్యవాదాలు.
manjari. lakshmi
తృష్ణ గారు చాలా మంచి పుస్తకం పరిచయం చేసారండి. అందరు వెనక్కి తిరిగి విశ్వనాధ సత్యన్నారాయణ సాహిత్యంలో మొహాలు దాచుకుంటూ ఉంటే భయమేసింది. చాలా మంచి సమయంలో మంచి పుస్తకం పరిచయం చేసారు. “మొదటిభాగంలో డైరీల్లో ఉన్న పట్టు కథను తెలిపే క్రమంలో చివరి రెండుభాగాల్లో సడలిపోయినట్లు అనిపించింది నాకు”. మీరన్నది నిజమే. నాకు అలానే అనిపించింది.
తృష్ణ
@మంజరి.లక్ష్మి: బ్లాగ్లోకం, కొన్ని మంచి తెలుగు జాలపత్రికల పుణ్యమా అని ఇటువంటి మంచి పుస్తకాల గురించిన వివరాలు తెలుస్తున్నాయండి.
ధన్యవాదాలు.