ఏం కోల్పోతున్నామో తెలిపే కథల సంపుటి – ఊహాచిత్రం
వ్యాసకర్త: కొల్లూరి సోమ శంకర్
****
“ఊహాచిత్రం” పుస్తకం శీర్షిక చూడగానే, “ఊహా? చిత్రమా? లేక రెండూనా? ఊహలో చిత్రమా లేక చిత్రమైన ఊహా” అనే ప్రశ్నలు పాఠకుల మదిలో తలెత్తుతాయి. ప్రశ్న ఏదైనా, ఊహాగానీ, చిత్రంగానీ, చిత్రమైన ఊహ గానీ, ఊహలో చిత్రంగానీ కథకుడికి ముడిసరుకులే.
తాను పొందిన ఆనందాన్ని ఇతరులలో కలిగించేది కళ అంటారు. రచయితలు, కవులు తమ ఆనందాన్నే కాకుండా బాధల్ని, స్పందనలని, ఆలోచనల్ని ఇతరులతో పంచుకుంటారు. ఆ క్రమంలోనే కథలూ, కవితలూ ఉద్భవిస్తాయి.
రచయిత సమాజానికి బయట వ్యక్తి కాదు. సమాజంలో ఉంటూనే తనకి నచ్చిన, నచ్చని అంశాలపైన, భావాలపైన రాస్తాడు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను కథారూపంలో ఇతరులకు పంచుతాడు. మంచి గురించి చెప్పినా, చెడు గురించి ప్రస్తావించినా, ఇతరులు పడుతున్న బాధలను వెల్లడించినా, వైయక్తికమైనా, సామాజికమైనా హితం కోరే రాస్తారు రచయితలు. వాదాలు, ఇజాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఏ దృక్పథంతో రాసినా తను చూసిన, తనకెదురైన అనుభవాలను, అనుభూతులను అక్షరబద్ధం చేస్తాడు రచయిత. కొందరు రచయితలపై ఇజం, వాదం, దృక్పథం ముద్రపడితే, మరికొందరు వాటికి అతీతంగా హ్యుమనిజం మీదా, మనిషి తనం మీదా రాస్తారు. అలాంటి కోవకే చెందుతారు అరిపిరాల సత్యప్రసాద్. తను రచించిన 18 కథలను “ఊహాచిత్రం” పేరిట సంకలనంగా తెచ్చారు. ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.
ఆధునిక ఉద్యోగ బాధ్యతలలో జనాలు పరిగెడుతూనే ఉంటారు. గమ్యం తెలియదు… టార్గెట్లు చేరుకోడానికీ, వస్తువులు కొనడానికి…. అన్నిటికీ పరుగులే! పరుగు ఆపిన భావుకుడిని కూడా రెచ్చగొట్టి యాంత్రికుడిలా మారుస్తారు తోటివాళ్ళు. ప్రపంచీకరణ నేపథ్యంలో తనలో చచ్చిపోతున్న భావుకుడిని బతికించుకోడానికి, తాను కోల్పోయిన నింపాదితనాన్ని తిరిగి పొందడానికి ఓ వ్యక్తి ఏం చేసాడన్నది “స్వప్న శేషం” కథ చెబుతుంది.
పుట్టి పెరిగిన ఊరిపై, ఆ నేలపై, సొంత ఇంటిపై మమకారం ఉన్న ఓ యువతి, అన్నయ్య ఆ ఇల్లు అమ్మేస్తుంటే విలవిలలాడిపోతుంది. ఆ పాత ఇంటిని బాగు చేయించినప్పుడల్లా ఒక్కో జ్ఞాపకం తుడిచిపెట్టుకుపోతుంటే బాధపడి, దిగులు పడిన ఆమెకి ఆ ఇల్లు ఇకపై కనిపించదనేసరికి నిస్తేజం కలుగుతుంది. ఊరెళ్ళి చివరిసారిగా తన ఇంటిని చూసుకుని జ్ఞాపకాలను బరువెక్కించుకుంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో తరచూ జరిగే సంఘటనతో అల్లిన కథ “తుది బంధం”.
మనం ఎవరికి వాళ్ళం అత్యంత నిజాయితీపరులం అనుకుంటాం. కానీ అవకాశం దొరికితే నిజాయితీ నోరు నొక్కేయడానికి ఏ మాత్రం వెనుకాడం. తప్పు చేసినప్పుడు ఒప్పుకోడానికి ధైర్యం లేని మనిషి, తప్పు దిద్దుకోడానికి అవకాశం ఎదురుచూస్తునే ఉండాలి. “ఐదు వందల రూపాయల నోటు” కథ దీన్నే చెబుతుంది. ఆర్.టి.సి బస్ డ్రైవర్లూ, కండక్టర్ల బాధలను, బస్సు ప్రయాణంలోని పదనిసలనూ క్లుప్తంగా చెబుతూనే, ఆ బస్‌లో మనమూ ప్రయాణించిన అనుభూతి కలిగిస్తారు రచయిత.
కళ! ఎంత గొప్ప పదం! పలుకుతుంటేనే ఓ అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. కళలని సొమ్ము చేసుకునే మనుషులు ఉన్నట్లే, కళని కళ కోసమే ప్రదర్శించే వారూ ఉంటారు ఊహాచిత్రం” కథలో ఓ చిత్రకారుడు రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. తన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అతని ఆత్మ అక్కడే తచ్చాడుతుంది. ఈ కథ మార్మికంగా ఉంటుంది. అర్థమయినట్లే ఉంటుంది కానీ అస్పష్టంగా అనిపిస్తుంది. కథలో ఎదురైన ప్రశ్నలకి ఎవరికి వారు జవాబులు వెతుక్కోవలసిందే. ఓ అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్ లానే ఈ కథ కూడా నైరూప్య ధోరణిలో సాగుతుంది.
తన చుట్టు పక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టి, అందరిచేత తిట్టించుకుంటూ, పదిమందితోనూ గొడవలు పడ్డ రామనాధం అనే వ్యక్తి చనిపోతాడు. అందరూ ‘అమ్మయ్య’ అనుకుంటారు. ‘పీడ’ విరగడైందని భావిస్తారు. అయితే చనిపోయిన వ్యక్తిని తిట్టడం సంస్కారం కాదంటాడు కథకుడు. అసలు రామనాధం జనాలకి ఎందుకు నచ్చడో కారణం తెలుసుకుంటాడు. ఆయన విషయంలో జనాలు ఎక్కడ పొరపాటుపడ్డారో ఆయన పెద్దకొడుకు చెప్పినప్పుడు అర్థమవుతుంది రామనాధం వ్యక్తిత్వం. తప్పక చదవాల్సిన కథ “చిరాకు రామనాధం”.
తన పేరు మర్చిపోయిన ఈగలా “ఏడు తరువాత” ఏమోస్తుందో మర్చిపోతాడో వ్యక్తి. తెలుసుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. ఎన్నెన్నో జవాబులు! కానీ ఏదీ అతనికి సంతృప్తినీయదు. చివరికి ఓ పిచ్చి ఫకీర్ చెప్పిన జవాబు అతనికి నచ్చుతుంది. హాస్యధోరణిలో రాసిన ఈ కథ వర్తమాన సమాజపు తీరుతెన్నులపై వ్యంగ్య బాణాలు విసురుతుంది. నవ్విస్తునే మనసుని చివుక్కుమనిపిస్తుంది.
వర్షాన్ని ఇష్టపడని భావుకులు ఉండరేమో! ఓ వర్షం చినుకు భూమి మీదకి రాలి, తన ప్రస్థానాన్ని కొనసాగించిన వైనాన్ని, మనిషి జీవజలాన్ని కలుషితం చేస్తున్న ఉదంతాన్ని అందంగా భావుకత్వంతో వర్ణించిన కథ “చినుకులా రాలి…”.
ఆలూమగలూ ఇద్దరూ ఉద్యోగస్తులై, ఇద్దరి ఉద్యోగ సమయాలు వేరయితే, వారి సంసారం ఎలా ఉంటుంది? బ్రతుకులో సారమే లేకపోతే సంసారం ఎలా ఉంటుంది? జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోలేని స్థితిలో ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటారు. రాతల్లో వ్యక్తమైన అనురాగాన్ని జీవితంలోకి బదలాయించుకోవాలంటే వాళ్ళేం చేయాలి? సమాధానం కోసం “చిలక రాయబారం” కథ చదవాలి.
ఉద్యోగ బాధ్యతల్ని ఒక స్థాయికి మించి మోసి, నిండు జీవితాన్ని కోల్పోయి పిచ్చివాడనిపించుకున్న వ్యక్తి కథ “మబ్బుతునక”. ఉద్యోగమే జీవితం కాదని, జీవితంలో అదొక భాగం మాత్రమేనని చెబుతూ, కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో హెచ్చరిస్తుందీ కథ.
ఆధునిక మనిషి జీవితంలో పరుగులు పెట్టడానికీ, కొనుగోలు ఓ ఉన్మాదంలా మారిపోడానికి కారణం దేవుడు పెట్టిన ఓ పరీక్ష అంటారు రచయిత “పద్మావతీ శ్రీనివాసం” కథలో. కలియుగంలో మనిషి దేవుడికన్నా శక్తిమంతుడయ్యాడనీ, అందుకే తాను సాధించలేని పనిని మనిషి చేస్తే చూడాలని తలుస్తాడు దేవుడు. కానీ అందరూ తనలాగే ఇబ్బంది పడుతున్నారు తప్ప, పరిష్కారం మాత్రం కనుక్కోలేకపోయారని వాపోతాడు పైవాడు.
నలుగురి మేలు కోరే నిస్వార్థపరుల జీవితాన్నీ; తాము మాత్రమే బాగుండాలని కోరుకునే స్వార్థపరుల బతుకులని దర్శింపజేసిన కథ “మంచినీళ్ళ బావి”. అరమరికలు లేకుండా అందరు కలసిమెలసి ఉన్న రోజుల్లో చక్కని మంచి నీళ్ళు ఉన్న బావి, జనాల మధ్య కలహాలు మొదలయ్యాక, ఉప్పునీటి బావిగా మారిపోతుంది. ఊరికి మేలు చేయాలన్న సదుద్దేశంతో ఓ దంపతి తమ ఇంట్లో తవ్వించిన బావి లేత కొబ్బరినీళ్ళ లాంటి జలంతో ఊరి దాహార్తిని తీరుస్తుంది. కానీ అదే నీటితో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు బావినీరు పూర్తిగా ఇంకిపోతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు మారుతున్న వైనాన్ని ఈ కథ మరోసారి చాటింది.
ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చినా, జీతాలు పెరిగినా జీవితంలో ముందుకు వెళ్ళడం లేదనే భావన ఎందుకు కలుగుతుందో తెలుసుకోవాలంటే “భూదేవమ్మ” కథ చదవాలి.
ఈ వ్యాసంలో ప్రస్తావించని ఒకటి రెండు కథలూ ఉన్నాయి ఈ సంకలనంలో.
ఈ 18 కథలలోనూ వస్తు వైవిధ్యం ఉన్నా, వీటిలో అంతఃసూత్రంగా ఉన్నది – ఒకే ఒక ఆలోచన. జీవితంలో మనిషి డబ్బుకీ, హోదాకీ కాకుండా సంతృప్తికీ, సాటి మనుషులకీ విలువ ఇవ్వాలని!!
చక్కని శైలిలో, సొంపైన పద ప్రయోగాలతో, హాయిగా చదివించే రీతిలో రాసారీ కథలని సత్యప్రసాద్. జీవితపు పరుగు ఆపి, కాసేపు సేద తీరి, తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోమంటున్నారు రచయిత. నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నారు రచయిత. ఆధ్యాత్మికంగా కాకపోయినా, లౌకికంగానైనా మనల్ని మనం తెలుసుకుంటే – తృప్తిగా ఉన్నట్లు బతుకుతున్నామా లేక నిజంగా సంతృప్తికరమైన జీవితాలు గడుపుతున్నామో తెలుస్తుంది అంటారు.
ఈ క్రమంలో మనం ఏం కోల్పోతున్నామో గ్రహిస్తాం. ఎందుకు పోగొట్టుకోకూడదో అర్థం చేసుకుంటాం. ‘జ్ఞ’ ప్రచురణల వారి 136 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 120/-. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం. కినిగె వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి పొందవచ్చు.
s.nageswara rao
నో వర్డ్స్..నేను ఈ బుక్స్ చదవలనుకున్తున్నాను..ప్లీజ్ సెండ్ యువర్ అడ్రస్ .