White Fang – Jack London

వ్యాసకర్త: రానారె
*******
ఒక శతాబ్దికాలం పైగా వన్నె తగ్గకుండా నిలిచిన రచనలను చదివినవారెవరైనా పఠనానుభవాన్ని రాయగలరేమోగానీ సమీక్ష రాయబూనడం హాస్యాస్పదం ఔతుందేమో. ఉదాహరణకు “వాల్మీకి రామాయణం చదివి రివ్యూ రాస్తాన”న్నవాణ్ణి హాస్యగాడుగా కాక మరెలా చూస్తాం?

The Call Of The Wild తొలిముద్రణ జరిగిన మూడేళ్ల తరువాత ౧౯౦౬లో వెలువడిన Jack London రచన White Fang. కాల్ ఆఫ్ ది వైల్డ్ నాయకుడూ, శతాధిక వృద్ధుడూ అయిన Buck మాదిరిగానే, Buck కంటే మూడేళ్ల చిన్నవాడైన White Fang కూడా నేటి తరం పాఠకులను అలరిస్తూ వుండటం తెలిసి ఈ నవలనూ వెంటనే చదివాను. Call of the Wild చదివేటప్పుడు రచయిత జాక్ లండన్ గురించి, క్లాన్డైక్ గోల్డ్ రష్ (Klondike Gold Rush) గురించీ వికీపీడియాలో చూశాను – కథా నేపథ్యం తెలిస్తే పఠనం మరింత రంజుగా వుంటుందని.

1896-1899 సంవత్సరాల మధ్య అలాస్కా ప్రాంతంలో బంగారం దొరుకుతోందని తెలిసి, లక్షమందికి పైగా జనం గనుల తవ్వకానికి లైసెన్సులను బారులుతీరి మరీ కొనుక్కుని, బయల్దేరారని, విపరీతమైన మంచుతో కప్పబడిన కొండప్రాంతాలను దాటి అక్కడికి చేరగలిగినవారు 30 నుండి 40 వేల మంది మాత్రమేనని, వారిలో కేవలం 4 వేల మంది మాత్రమే కార్యసాధకులు కాగలిగారనీ వికీపీడియా సమాచారం. ఈ నాలుగువేల మందిలో జాక్ లండన్ ఒకరు కాలేకపోయినా, 30-40వేల మందిలో ఒకరు. తన బావగారితో కలిసి అదృష్టాన్ని వెతుకుతూ వెళ్లి అక్కడ ఒక సంవత్సరం గడిపిన అనుభవాన్ని తన రచనల్లో ప్రతిబింబింపజేసి అమెరికాదేశపు ప్రపంచ ప్రఖ్యాత రచయితలలో ఒకడిగా నిలిచాడు.

ఆశ్చర్యాలకు ఆలవాలమైన ప్రపంచంలో శత్రుపూరిత వాతావరణంలో మనుగడ కోసం పోరాడిన ఒక తోడేలు జీవితకథను కళ్లకు కట్టే నవల ఇది. అడవిలో పుట్టి, అమెరికన్ ఇండియన్ల అధీనంలో పెరిగిన White Fang జీవన నియమాలను త్వరితంగా గ్రహించి ఒంటబట్టించుకోవలసి వుంటుంది. కౄరాత్ముడైన ఒక తెల్లవానికి తన యజమాని తనను అమ్మివేసినాక, వినాశనానికి అత్యంత దగ్గరగా నెట్టివేయబడిన White Fang, ప్రేమాస్పదుడైన మరో తెల్లవానిచేత రక్షించబడి, ఆటవిక పారంపర్యంగా తనకు సంక్రమించిన మొక్కవోని ఆత్మస్థైర్యంతో తిరిగి జీవం పోసుకుంటుంది. మొదటి పుట నుంచి పాఠకునిలో ఆసక్తతను రేకెత్తించి, చివరి వాక్యం వరకూ కట్టిపడేస్తుంది ఈ కథనం. ఒక తోడేలు దృక్పథంలో సందిగ్థతకు తావులేకుండా సహజాతమైన రీతిలో జీవిత సత్యాలను రచయిత జాక్ లండన్ మన ముందు పరుస్తూపోతాడు. ఈ “blessed wolf”ను సొంతం చేసుకుంటూ సాగే ఈ పఠనం, జీవితాన్ని గురించిన ఏదో అన్వేషణను మన మనసులో మొదలెత్తించి కొనసాగేలా చేస్తుంది.

ఈ కథలో దయామయులూ, కౄరాత్ములూ, వ్యసనపరులూ, పిరికివాళ్లూ, పశుప్రాయులూ కనిపిస్తారు. కథాంతంలో మనకు ఎవ్వరిమీదా అనురాగం కానీ ద్వేషం కానీ కలగదు – వారున్న పరిస్థితులమీద తప్ప. ఉదాహరణకు – “For Beauty Smith was cruel in the way that cowards are cruel.” అంటాడు. ఆ వెంటనే, “All life likes power, Beauty Smith was no exception.” అనీ అంటాడు.

“మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా – ఆడిస్తున్నాడు బొమ్మలాగ – నిజం – తెలుసుకు మెలగాలి మనిషిలాగ” అనే ఇంగితం కలిగించే మాటలు అక్కడక్కడా కనిపించి, కథనం మనలో కలిగించే తీవ్రమైన భావోద్వేగాల సుడిలో పడిపోకుండా ఒడ్డున పడేస్తాయి. ఉదాహరణకు – “And so, according to the clay of his nature and the pressure of his surroundings, his character was being moulded into a certain particular shape. There was no escaping it.” అలాగే, “Not only was White Fang adaptable by nature, but he had travelled much, and knew the meaning and necessity of adjustment.”

విధి అంటే మరేదో కాదు, అనిపించే ఒక వాక్యం – “It was in the nature of things, that he must learn quickly if he were to survive the unusually severe conditions under which life was vouchsafed him.”

“కడలిదాటితే తన గెలుపుకాదు – నడుమ మునిగినా ఓటమి కాదు” అనే సినారె మా(పా)టను గుర్తుకు తెచ్చే మాట – White Fang విజయ పరంపరను వర్ణిస్తూపోతూ, మధ్యలో ఇలా అంటాడు – “Not that he was to be praised for it. Nature had been more generous to him than to the average animal, that was all.”

White Fang నమస్తత్వమూ ప్రవర్తనా ‘అలా’ వుండటానికి కారణం ఏమిటంటే – “The clay of White Fang had been moulded until he became what he was, morose and lonely, unloving and ferocious, the enemy of all his kind.” ఇలాంటి మాటే రక్తపిపాసి యైన Beauty Smith విషయంలోనూ చెబుతాడు – “He was pre-eminently unbeautiful. Nature had been niggardly with him.” ఈ clay-moulding అనే మాటే కథ చివరిలో Jim Hall అనే నేరస్తుడి వర్ణనలో మళ్లీ కనిపిస్తుంది “He had not been born right, and he had not been helped any by the moulding he had received at the hands of society. The hands of society are harsh, and this man was a striking sample of its handiwork.”

సంఘంలో దయారాహిత్యం చేసే చెడ్డ గురించి చెప్పిన కఠోరమైన నిజం ( ఏక పక్షంగా చెప్పినట్టు అనిపించవచ్చుగాక) – “It was the treatment he had received from the time he was a little pulpy boy in a San Francisco slum— soft clay in the hands of society and ready to be formed into something. The more fiercely he fought, the more harshly society handled him, and the only effect of harshness was to make him fiercer.”

నాకు బాగా నచ్చిన కొన్ని పదప్రయోగాలు: Clay, White Wall, Flame.
Clay: “Environment served to model the clay(గుజ్జు) , to give it a particular form.”
Flame: పసిగుడ్డులుగా ఇంకా గుహలోనే వుంటూ ద్వారం దాటి బయటకు రాని White Fang, దాని తోబుట్టువులు కరువు కాలాన్ని దాటలేకపోవడాన్ని ఒక్క వాక్యంలో వర్ణించిన తీరు నాకు ఎంతో నచ్చింది. ” The cubs slept, while the life that was in them flickered and died down.”
White Wall: పసితనంలో White Fang కు గుహద్వారం ఎలా కనిపించేదంటే, “…he kept away from the mouth of the cave. It remained to him a white wall of light.”

ఈ కథలో తోడేలు మెదడులాగ, నాది కూడా classification మాత్రమే చెయ్యగలది కావడంవల్లనేమో, ఈ కథలోని సరళత నాకు బాగా నచ్చింది. మొన్న మాటల మధ్యలో ఒక పెద్దాయన అన్నట్టు, classics అనే వాటిలో ముఖ్యమైన అంశం సరళత్వం అని. మరో ఆలోచనకు తావులేకుండా ఈ నవలను ఒక classic అనొచ్చంటాను నేను.

imageCall of the wild కథతో పోలిస్తే, ఇది దాని ప్రతిబింబం అనే కామెంట్ ఒకటి వుంది. స్థూలంగా చూస్తే నిజమే కావచ్చు. తరచి చూస్తే దీనికిదే ప్రత్యేకమైన నవల. Klondike ప్రాంతపు వాతావరణం ఇందులో మరింత విపులంగా వర్ణించబడింది. జీవమూ కదలికా దానికి శత్రువులంటాడు. జీవం ఉడిగేదాక, కదలిక ఆగే దాక అది శాంతించదంటాడు. నవల తొలి పుటల్లో – ప్రకృతిని మృత్యువుతో పోలుస్తూ చేసిన వర్ణన చాలా ఆసక్తికరంగా, సందర్భోచితంగా, fascinatingగా వుంది. అమెరికన్ ఇండియన్ గృహిణులను ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పదం వుంది ఇంగ్లీషులో – squaw. ఈ పదప్రయోగం 18వ శతాబ్దపు చివరిలో అంటే ఈ కథా కాలంలో అత్యధికంగా వుండి, ఆ తరువాత తగ్గిపోతూ వచ్చిందని గూగుల్ చెబుతోంది. అన్నట్టు, White Fang కథ సినిమాగా కూడా వచ్చింది 1991లో. వందేళ్లు బతికిన ఈ పుస్తకం చుట్టూ తవ్వేకొద్దీ ఎన్నో విశేషాలున్నట్టున్నాయి.

White Fang
Jack London
1906

Free Ebook is available from Gutenberg.org

You Might Also Like

6 Comments

  1. రానారె

    సుజాత గారన్నట్టు ఇది dry పరిచయమే. అనుమానమేమీ లేదు. మీ వ్యాఖ్య వల్ల ఈ నవల గురించి తెలీనివాళ్ల మనసుల్లో దీనికి మరింత ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడవచ్చు. అదీ మంచిదే. మీరూ ఒక పరిచయం రాయండి. అదీ మరీ మంచిది కదా.

    1. మంజరి లక్ష్మి

      పూర్ణిమ గారి సమాధానం అంత బాగా లేదు. పరిచయం రాయబడిన తరువాత ఎవరి భావాన్ని వారు వ్యక్తం చేయటంలో తప్పేముందీ? రా.నా.రే. గారి సమాధానం(bold?) నాకు బాగా నచ్చింది. అలా ఉండాలి.

  2. సుజాత

    కాల్ ఆఫ్ ది వైల్డ్ లాంటి నవలకు ఇంత Dry పరిచయమా??

    ప్చ్ ..

    1. సుజాత

      వైట్ ఫాంగ్/కాల్ ఆఫ్ ది వైల్డ్ లాంటి నవలకు ఇంత డ్రై పరిచయమా?

    2. Purnima

      పరిచయం డ్రైయా? వెట్టా? అన్నది కాదు ఇక్కడ కావాల్సింది.

      ఒక పరిచయం ఒకరిని ఆ పుస్తకం చదవడానికి ప్రోత్సహించిందా? అన్నదే ముఖ్యం. కవిత్వాలు, పదాల ఆర్భాటాలు, రొమాంటిసైసింగులూ అవసరం లేదు. పుస్తకం చదివినప్పటి ఆలోచనలు పంచుకుంటే చాలు. పుస్తకం.నెట్ ఉద్దేశ్యం అదే! గమనించగలరు.

  3. మైథిలి అబ్బరాజు

    మంచి పరిచయమండీ. పఠనానుభవాలని పంచుకోవటం ఇవాళ్టి రోజున క్లాసిక్ నవలలకే ఎక్కువ అవసరం. సమకాలీనం కానిది అనిపించే దేనికైనా విలువ తక్కువ కట్టే ధోరణి మధ్యన మీరు ఊరట కలిగిస్తున్నారు

Leave a Reply