“తెలుగు లిపి : ఆవిర్భావం – చరిత్ర ” ఒక మంచి పరిశోధనా గ్రంథం

వ్యాసకర్త: డా.మూర్తి రేమిళ్ళ
*******
భాషని, లిపిని సాహిత్యానికి రెండు కళ్లుగా భావించవచ్చు.

వాటితోనే సామాజిక అవలోకనం, వాటిద్వారానే ముందుకు అడుగు వెయ్యడం సాధ్యమవుతుంది కనుక! రాయడం అనేది నాగరికతకి ముఖ్యమైన చిహ్నం. రాతియుగాన్ని, లోహయుగాన్ని చరిత్రకి మునపటి కాలంగా పేర్కొనడానికి ముఖ్యకారణం వాటికి రాత (లిపి) లేకపోవడమే.

రాత ఉందీ అంటే సాహిత్యం అంతకు ముందే ఉందనీ, దాని వ్యాప్తికి ఒక నిర్దుష్టమైన పద్దతి ఉందనీ అర్థం. అయితే ఈ దేశంలో వేదాలు ఉపనిషత్తులు సూత్రాలు మొదలైన ప్రాథమిక సాహిత్యం ఉన్నా పూర్వకాలంలో ఈ అక్షరాస్యతా, సాహిత్యం కొన్ని అగ్రకులాలకీ, కొన్ని వర్గాలకీ మాత్రమే చేరువలో ఉండేవి. రామాయణ భారతాది ఇతిహాసాలు, పాణిని అష్టధ్యాయి మొదలైనవి భారతదేశంలో భాషాభివృధ్ధికీ, రాత ప్రక్రియ వ్యాప్తికీ, పరిమాణాలకీ దోహదం చేసిన గ్రంథాలుగా పేర్కొనవచ్చు. తాళ పత్రాలు, భూర్జ పత్రాల నుంచి పరిణామక్రమంలో కాగితంవరకు మార్పు చెందిన యాత్రలో ఈ మూలాలకి తోడుగా రాళ్ళు, కొండలు మరియు దేవాలయాల్లో గోడలు-స్తంభాలు మొదలైనవాటిమీద రాసినవీ, తరువాతికాలంలో తామ్రపత్రాలు మొదలైనవీ ఈ ప్రక్రియని కొనసాగించిన ఇతర సాధనాలు. వేదవాఙ్మయం ఎక్కువగా మౌఖికంగానే అందించబడడంవల్ల ఈ రాత ప్రక్రియ ముఖ్యంగా రాజశాసనాలకీ, దాన/ధర్మ పట్టాలలో, సూచికలలో వినియోగం ఎక్కువగా ఉండేది.

అశోకుడి కాలానికి సంబంధించి లభించిన ఆధారాలని బట్టి క్రీ.పూ 300 సంవత్సరాల ప్రాంతంలో ఇండియాలో రాత/రచనా ప్రక్రియ ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తారు. కానీ ఒక లిపి రూపుదిద్దుకొని, మార్పులు చెంది పూర్తిగా వినియోగంలోకి వచ్చి పెద్ద పెద్ద గ్రంథాలని రాయడానికీ, మంత్ర,శాస్త్ర సిద్దాంతాలలో వాడబడడానికీ ఒకటి రెండు శతాబ్దాలు పడుతుందనీ అంటారు. అలాంటప్పుడు అశోకుడి కాలానికి ముందు భారతదేశంలో రాత లేదని ఎలా చెప్పగలం అనే ప్రశ్న వస్తుంది. అనాదిగా ఉన్న పురాణ,వేద సాహిత్యం ఇన్ని శతబ్దాలుగా మనగలిగి మనకి ఉన్నాయంటే, ఇవన్నీ ఎంత మౌఖికంగా అందించబడిన రాతప్రక్రియ ఏదో ఒక రూపంలో ఉండే ఉండాలి అనేది ఈ భౌతిక, చారిత్రక సాక్ష్యాలకి అతీతమైన విషయం.

చాలా చారిత్రక విషయాల్లాగే అసలు “వ్రాయడం అనేది భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది” అనే విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదు. ఎంతగా వ్యత్యసాలు ఉన్నాయంటే , ఈ కాలాన్ని క్రీ.పూ 6 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల మధ్య రకరకాలుగా వివిధ చరిత్రకారులు పేర్కొన్నారు.
ఈ ప్రారంభం సింధు నాగరికతకి తర్వాత వచ్చినదనీ రాతప్రక్రియ అయితే బ్రహ్మ లిపి పరిజ్ఞానం క్రీ.పూ 7 వ శతాబ్ది నుంచి విరివిగా వ్యాప్తి చెందిందనేది ఒక స్థూల అభిప్రాయం.

తిరుమల రామచంద్ర వారి “మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు” నేను చదవలేదు గానీ, Andhra Pradesh Oriental Manuscripts Library వారు ప్రచురించిన Telugu Script: origin and evolution, 3rd century BC to 16th Century AD ఈ పుస్తకం లిపి పుట్టుక, పరిణామ క్రమం మీద వచ్చిన ఒక పరిశోధనాగ్రంథం.

రాత ప్రక్రియ మీద జరిగిన వివిధ దేశీయ, విదేశీయ అధ్యయనాల, పరిశోధనల సారభూతమైన పరిశోధనా సంగ్రహంగా మొదటి అధ్యాయంలో ప్రారంభమై; తెలుగు నేల, తెలుగు భాష, తెలుగు ప్రజల చరిత్ర రెండో అధ్యాయంగా, తెలుగులో రాత ప్రక్రియ ఆరంభం గురించి మూడో అధ్యాయంగా, తెలుగు వర్ణక్రమం రూపాంతరాలు నాలుగో అధ్యాయంగా, ఆంధ్రప్రదేశ్ లో భాష, అభిలేఖనల పరిణామక్రమం (epigraphical history) గురించిన చివరి అధ్యాయంతో మొత్తం మీద ఈ పుస్తకం ఐదు అధ్యాయాలుగా సాగుతుంది. తెలుగులో రాతప్రక్రియ, పరిణామక్రమం వర్ణమాల చరిత్ర గురించి తెలిపే ఉత్తరార్థం ఈ పుస్తకానికి మూల భాగం.

ముందే చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ లో రాత ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందో ఇదమిథ్థo గా చెప్పలేంగానీ (1) కర్నూలు జిల్లా పట్టికొండ తాలూకా ఎర్రగుడి, రాజులమందగిరి (2) గుంటూరు జిల్లా అమరావతిలోని స్తూపం మొదలైన భౌతిక ఆధారాలని బట్టి క్రీ.పూ 3వ శ|| గా పరిగణించి ఆ తర్వాతి భాషా/లిపి పరిణామ కాలాన్ని 7 దశలుగా విభజించేరు.

మొదటి దశ: మౌర్యుల కాలం నుంచి .పూ 3వ శ||

ఆంధ్రప్రదేశ్ లోని (1) మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న మారుమారూరు,పెద్ద మారూరు,ఉప్పలపాడు ,ఉప్పేరులలో(2) కరీంనగర్ జిల్లా కదంబపూర్ (3) గుంటూరు జిల్లా నాగార్జునకొండ (4) నిజామాబాద్ జిల్లా పోచంపాడు (5) నల్గొండ జిల్లా రాయగిరి,మల్లేశ్వరం మొదలైన ప్రదేశాలలో దొరికిన శిలా/రేఖా/చిత్రలిపి మొదలైనవి రాతప్రక్రియకి అశోకుడి ముందుకాలానికి సంబంధించిన సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ఒక వరుసలో 4 సంజ్ఞలు/అక్షరాలు చెక్కబడి మొత్తం మీద 132 చిహ్నాలతో కూడి ఉండడం వీటి ప్రత్యేకత. వీటిలోని సంజ్ఞలు క్రీ.పూ 3000 – 1500 శకానికి చెందిన సింధు నాగరికతకు చెందిన చిహ్నాలతో పోలి ఉన్నాయని పేర్కొన్నారు. క్రీ.పూ 3 వ శతాబ్ది నుంచి క్రీ.శ 5,6 శతాబ్దిల వరకు ఏడు ఏడు శతాబ్దులు కొనసాగిన బ్రాహ్మీలిపి రాతి నుంచి తామ్ర పత్రాలవరకు జరిగిన మాధ్యమాల మార్పులతో బాటు దక్షిణ భారతదేశంలో తెలుగు-కన్నడ భాషల స్థానిక లిపుల ఆవిర్భావానికి దారితీసింది. ఈ దశ క్రీ.శ 6-7 శతాబ్దులలో తెలుగు-కన్నడ లిపికి మూలమై ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు క్రీ.శ 14-16 శ|| ల కాలంలో రూపు దిద్దుకుంది.

రెండవ దశ: ప్రాకృత/మౌర్యుడి తదనంతర కాలం (క్రీ.పూ 2 వ శతాబ్ది నుంచి క్రీ.శ 1 వ శతాబ్ది)

ఈ దశ స్థానిక నాయకుల చిన్న సూచికల/పట్టీల రూపంలో అమరావతి, కోటిలింగాల, వడ్డమాను, గుంటుపల్లి, కొత్తూరు మొదలైనచోట్ల దొరికిన భౌద్దస్థూపాలు,తోరణాలు, నాణేలమీద వాడబడిన ‘ప్రాకృత’ దశ. గుండ్రటి అక్షరాలు కోణాలు,వంపులు తిరిగేలా చెందిన మార్పు ఈ దశలోనే జరిగింది.

మూడవ దశ: శాతవాహన ఇక్ష్వాకు దశ (క్రీ.శ 1-3 శతాబ్ది)
కృష్ణానదికి ఇరువైపులా కృష్ణా,గుంటూరు,నల్గొండ జిల్లాలలో దొరికిన ఆధారాలు గల ఈ దశ, మన అక్షరాలలో విశేషమైన మార్పులకు, కొత్త వాటి చేర్పులకు మూలమై, బ్రాహ్మిలిపి విప్లవాత్మక మార్పులకు సాక్షీభూతమైనది.

నాల్గవ దశ (పల్లవ ప్రారంభం – చాళక్యపూర్వం) (క్రీ.శ || 4-6 శ||)
ఇక్ష్వాకుల తర్వాత చాళుక్య పూర్వ కాలంగా, ఇంకా బ్రాహ్మిలిపికి చివరి దశగా దీన్ని పేర్కొన్నారు. ప్రోటో (proto) తెలుగుగా పేర్కొనబడిన మన తెలుగు ఆధారాలు (కోస్తాంధ్ర,కళింగలలో దొరికిన రాజ శాసనాలు/ పత్రాలు) ఈ దశకి చెందినవే. తామ్రపత్రాల లిపి ఈ దశలోనే ప్రారంభమైంది.

అయిదవదశ: తెలుగు-కన్నడ లిపి కాలం (క్రీ.శ 6-10 శ||)
పాశ్చాత్య చాళుక్య రాష్ర్టకూట, తూర్పు చాళుక్యులకి చెందిన క్రీ.శ 6-10 శతాబ్దులలో రూపొందిన లిపి ‘వేంగి’ లిపి. అక్షరాలు మరింత గుండ్రంగా, పొందికగా రూపొందించడమే కాక తెలుగు లిపికి ముఖ్యమైన తలకట్టు ప్రాముఖ్యం పొందడం ఈ దశలోనే జరిగింది.

ఆరవ దశ : తూర్పు చాళుక్య – కాకతీయ కాలం (క్రీ.శ 10 – 13 శ||)
ఈ దశని తెలుగు-కన్నడ లిపికి చిట్టచివరి దశగా పేర్కొంటారు. రాజరాజనరేంద్రునికి చెందిన నందంపూడి ధార్మిక పట్టా (grant), గణపతి దేవుని ఉప్పరపల్లి అభిలేఖనలు (inscriptions) ఈ దశకి చెందిన ఆనవాళ్ళు. తన పెద్దసోదరి కన్నడమునుంచి విడివడి స్వంత శైలిని తెలుగు రూపుదిద్దుకోవడం ఈ దశకి తలమానికం.

ఏడవ దశ: రెడ్డిరాజుల, విజయనగర సామ్రాజ్య కాలం (క్రీ.శ 14-16 శ||)
ఈ దశ రూపాంతరం చెందిన స్వతంత్ర, స్వంత తెలుగు లిపి ఆవిర్భావానికి చివరి దశ. ప్రోలయనాయకుని విలాస పట్టా అన్నమరెడ్డి పెదపాలకలూరు అభిలేఖనలు (inscriptions) కృష్ణదేవరాయుని అన్నియూరు అభిలేఖనలు (inscriptions) ఈ దశలో చెందిన మార్పు చేర్పులకి సాక్షీభూతాలు.

ఈ ప్రకారం 2000 సం||లలో అస్తిత్వానికి వచ్చిన తెలుగు లిపి కొత్త మెలికలు, తలకట్టలు వంటివి చేరడం, తీసివేయడంవంటి ఎన్నో రూపాంతరాలు, మార్పులు, చేర్పులు స్వంతం చేసుకుని పూర్వరూపు నుంచి ఒక క్రొంగొత్త రూపాన్ని, సొబగుని ఆపాదించుకుంది.

‘అ’ నుంచి ‘ఱ’ వరకు ఉన్న తెలుగు వర్ణక్రమంలోని ప్రతి అక్షరం ఈ ఏడు దశల్లోను పొందిన మార్పులు, చెందిన రూపాంతరాలు వివరించే 4వ అధ్యాయం కాలక్రమంలో మరుగున పడిపోయిన (ళ) (న్ర) వంటి అక్షరాలను, రూపాంతరాలను, అంకెలు వాటి రూపాంతరాలను కూడా వివరిస్తుంది.

భాషా పరిశోధనల సౌధానికి రాళ్ళెత్తిన కూలీలు:

పురాతత్త్వ పరిశోధనల్లోని ఇతర విభాగాల్లాగే తెలుగు లిపి ఆవిర్భావం గురుంచి ముఖ్యమైన పరిశోధన ఆంధ్రదేశంలో 19వ శ|| చివరి భాగంలో ప్రారంభమయ్యింది. ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ నలుమూలలా వెతికి రాళ్ళు, కొండలు, గుళ్ళు, గోపురాలు, తామ్ర పత్రాలు మొదలైన మాధ్యమాల అభిలేఖనలు (inscriptions) సంపాదించ సంకల్పించిన కలనల్ కొలిన్ మాకింజేని ఈ పరిశోధనకి ఆద్యుడుగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ బృహత్కార్యాన్ని కొనసాగించిన శ్రామికులుగా కావలి సోదరులను, బుక్కపట్నం రాఘవాచార్యులు, వి. వెంకయ్య, హెచ్.క్రిష్ణశాస్త్రి, ఆర్ ఎస్ పంచముఖి మొదలైన అసంఖ్యాక భాషా చరిత్రాకారులను గురించి, శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ శ్రీ రాళ్ళబండి సుబ్బారావు వంటి ప్రముఖుల గురించీ కొనసాగిన చివరి అధ్యాయం ఒక విధంగా భాషా పరిశోధనల సౌధానికి రాళ్ళెత్తిన కూలీలుగా పేర్కొనదగిన ఆ మహానుభావులందరికీ ‘అక్షర సుమాంజలి’గా పేర్కొనవచ్చు.
ఎన్నో శాసనాల, కుడ్య, శిలా శాసనాల చిత్రాలతో కూడి ఉన్న ఈ పుస్తకాన్ని ఎందుకు కేవలం ఇంగ్లీషులోనే వ్రాసేరో మాత్రం అర్థానికి అందదు. ఇది మినహాయిస్తే, తెలుగు భాష, తెలుగు లిపి గురించి ఆసక్తి కలిగిన భాషాభిమానులందరూ చదివి తెలుసుకోవలసిన మంచి పరిశోధనా గ్రంథం ఇది.

‘భాషాభిమానాన్ని’ ‘భాషా పరిజ్జ్ఞానం’ గా మార్చుకోడానికి ఒక చక్కని కరదీపిక ఈ పుస్తకం. ఇన్ని మార్పులు చేర్పులు, పరిశోధనలు చేయబడి, తరతరాలుగా పరిరక్షింపబడి మనకి అందించబడిన వారసత్వ భాషా సంపదని మనం వృద్ధి చెయ్యకపోయినా, కనీసం కాపాడడానికి అయినా వాడుకలో, రాతలో కొనసాగించడం ద్వారా మన వంతుగా భాషాసేవ చేయాలనే సంకల్పాన్ని పాఠకులకి రగిలిస్తుంది ఈ పుస్తకం.

ఈ పుస్తకం వివరాలు:
Telugu Script: origin and evolution, 3rd century BC to 16th Century AD
Published by: AP Oriental Manuscripts Library, Hyderabad http://manuscriptslibrary.ap.nic.in
Edited by Dr. PV Parabrahma Sastri and NS Ramachandramurthy
Rs. 350

***

Telugu Script: origin and evolution, 3rd century BC to 16th Century AD
Dr. PV Parabrahma Sastri and NS Ramachandramurthy (Eds.)

You Might Also Like

5 Comments

  1. Gopi P

    Telugu script origin and evolution..book I need..how to get

    1. gopi

      I need this book

  2. Vijaya Lakshmi

    Sir how to buy this book

  3. R.PANDARINATH

    ఇంకా కొంచం వివరంగా తెలుగు భాష గురించి ,దాని పుట్టుక గురించి ,అక్షరాల రూపకల్పన,గురించి తెలుపండి

    1. Dr. Murthy Remilla

      sorry for the late reply . ఆ వివరాలన్నీ పుస్తకం లో వున్నాయి సర్

Leave a Reply