బానిసగా పన్నెండేళ్ళు — Solomon Northup – Twelve Years a Slave
ఈ సంవత్సరం (2013)లో అమెరికాలో వచ్చిన ఉత్తమ చలనచిత్రాలలో Twelve Years A Slave ఒకటి. సోలొమన్ నార్తప్ అనే నల్లజాతి వ్యక్తి జీవితంలో జరిగిన విషయాల ఆధారంగా తీయబడ్డ ఈ చిత్రం హృదయంపై చాలా బలమైన ముద్ర వేసింది. స్వేచ్ఛగా పుట్టి, స్వేఛ్ఛగా బతుకుతున్న ఒక మనిషి మోసపోయి, బలవంతంగా అపహరించబడి, పన్నెండేళ్ళు కృూరమైన పరిస్థితుల మధ్య బానిసగా బతకవలసి రావటం కల్పిత కథ కాదని, నిజంగా జరిగిందే అని, సోలొమన్ నార్తప్ రాసిన Twelve Years a Slave అనే పుస్తకం ఉందని తెలిసి ఆ పుస్తకం వేటలో పడ్డాను. మరీ కష్టపడకుండానే అంతర్జాలంలో పుస్తకం దొరికింది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరొలీనా వారు అమెరికా దక్షిణ రాష్ట్రాల గురించి భద్రపరుస్తున్న పత్రాలలో భాగంగా, ఈ పుస్తకాన్ని 1997 నుంచి అంతర్జాలంలో అందుబాటులో ఉంచారు.
ఈ పుస్తకాన్ని సోలొమన్ నార్తప్ 1853లో ప్రచురించాడు. డేవిడ్ విల్సన్ సంపాదకుడిగా వ్యవహరించాడు.
సోలొమన్ నార్తప్ పూర్వీకులు కొన్ని తరాలుగా రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో నార్తప్ అనే కుటుంబంవారికి బానిసలుగా ఉండేవారు. ఆ కుటుంబంలో ఒకరు న్యూయార్క్ రాష్ట్రం వచ్చి స్థిరపడ్డారు. ఆయన చనిపోయేటప్పుడు తన బానిస మింటస్ నార్తప్‌కు (ఆ రోజుల్లో యజమానుల ఇంటిపేర్లనే వారి బానిసల ఇంటిపేర్లుగా వాడేవారు) స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా వీలునామా రాశాడు. అలా స్వేచ్ఛ పొందిన మింటస్ వ్యవసాయ కూలీగా కష్టపడి పనిచేస్తూ, వోటు హక్కుకు అర్హుడయ్యేంత ఆస్తిని కూడబెట్టుకున్నాడు. సంఘంలో కొద్దిగా పరువుప్రతిష్టలు కూడా సంపాదించుకున్నాడు. మింటస్‌కు ఇద్దరు పిల్లలు. రెండవవాడు సోలొమన్ జులై 1808లో జన్మించాడు. మింటస్ పిల్లలిద్దరికీ తన స్థితికి మించిన చదువు చెప్పించాడు. సోలొమన్ చదువుతోపాటు వయొలిన్ వాయించటం కూడా నేర్చుకొన్నాడు. 1829లో మింటస్ మరణించాడు.
సోలొమన్ 1829 క్రిస్టమస్ రోజున యాన్‌ను పెళ్ళి చేసుకున్నాడు. కుటుంబపోషణకోసం, కాలువ పనులలోనూ, కలప పనులలోనూ కష్టపడి పని చేసి,స్వంతంగా కలప రవాణా వ్యాపారం చేసేంతగా డబ్బులు కూడపెట్టాడు. వ్యాపారానికి, పనులకీ అదును కాని తరుణంలో వయొలిన్ వాయించటం ద్వారా కొంత డబ్బు సంపాయించుకునేవాడు. భార్య యాన్ మంచి వంటగత్తె. టూరిస్ట్ సీజన్లో ఒక హోటల్లో వంటగత్తెగా పని చేసి యాన్ కూడా కొంత డబ్బు సంపాదించేది. న్యూయార్క్ రాష్ట్రంలో సరటొగా స్ప్రింగ్స్ అనే ఊళ్ళో కాపురముంటూ, ముగ్గురు పిల్లలతో మధ్యతరగతి జీవితం జీవిస్తూ, ఊళ్ళో అన్ని జాతులవారితో మంచి సంబంధాలతో సుఖసంతోషాలతో ఉన్నారు.
1841 మార్చ్‌లో యాన్ వంటపనిమీద పక్క ఊరికి వెళ్ళింది. పనుల కాలం కాకపోవటం వల్ల ఖాళీగా ఉన్న సోలొమన్ దగ్గరకు హేమిల్టన్, బ్రౌన్ అనే ఇద్దరు అపరిచితులు, ఏదో వేరే ఊరి వాళ్ళు, కలిశారు. తాము సర్కస్‌లో పనిచేస్తుంటామని, తమకు పక్కవాద్యంగా ఉండటానికి వయొలిన్ బాగా వాయించే మనిషి అవసరమయ్యాడని, తమతో న్యూయార్క్ పట్టణం దాకా వస్తే, రోజుకు ఒక డాలరు భత్యం, వయొలిన్ వాయించిన ప్రతి ప్రదర్శనకు మూడు డాలర్లు ఇస్తామనీ,తిరుగుప్రయాణం ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామని చెప్పారు. బేరం బాగానే ఉందనుకున్న సోలొమన్ వారితో కలసి బయల్దేరాడు. న్యూయార్క్ చేరాక,వారు అక్కడనుంచి వాషింగ్టన్ నగరం వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ పెట్టారు. సరేనని, వారితో కలసి ఏప్రిల్ మొదటివారంలో వాషింగ్టన్ చేరుకొన్నాడు. ఈ కొత్త మిత్రులతో కలసి రోజంతా వాషింగ్టన్ లో తిరిగాడు. హేమిల్టన్, బ్రౌన్ రోజంతా మద్యం తాగుతూనే ఉన్నారు. వాళ్ళతోపాటు సోలొమన్ కూడా తాగుతూనే ఉన్నాడు. రాత్రయ్యేసరికి బాగా అలసిపోయాడు. విపరీతమైన వేడి అనిపించింది. విపరీతంగా దాహం వేసింది. చాలా అలజడిగా అనిపించింది. హోటల్ చేరుకుని మంచంమీద పడుకున్నాడు. ఇంకో పన్నెండేళ్లవరకూ అతని స్వేచ్ఛకు అదే ఆఖరురోజని అప్పుడు అతనికి తెలీదు.
మర్నాడు మెలకువ వచ్చే సరికి అతను ఒక చీకటిగదిలో ఉన్నాడు, కాళ్ళు, చేతులకు గొలుసులు కట్టేసి ఉన్నాయి. ఏం జరుగుతుందో, తాను ఆ స్థితిలో ఎందుకున్నాడో అతనికి అర్థం కాలేదు. మూడు నాలుగు గంటల తర్వాత, తలుపు తాళం తీసుకుని ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. వారిలో ఒకరు వాషింగ్టన్‌లో బానిసల వ్యాపారం చేసే జేమ్స్ బర్చ్. తన పేరు, ఊరు చెప్పుకుని, తాను స్వతంత్రుణ్ణని, తనను విడుదల చేయాలని అడిగాడు సోలొమన్. కాదు,నువ్వు జార్జియానుంచి పారిపోయివచ్చిన బానిసవి అన్నాడు బర్చ్. వాదించడం మొదలుబెట్టిన సోలొమన్‌ను బర్చ్ అనుచరుడు ఒక చెక్కపేడుతోనూ, కొరడాతోనూ కొట్టటం మొదలుబెట్టాడు. ఆ హింసాకాండ చాలాసేపు కొనసాగింది. ఇలా కొన్నిరోజులు జరిగాక, తన మొర విని తనను ఆదుకొనేవారు ఎవరూ లేరని, తనకు దెబ్బలు తప్పాలంటే తాను బానిసను కాదు అని వాదించకూడదని తెలిసివచ్చింది. అతను ఉన్న గది బానిసలకోసం కట్టిన బందెలదొడ్డిలో ఉంది. దానిచుట్టూ రెండునిలువుల ఎత్తు గోడలున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో బయటమనుషులకు తెలిసే వీలు లేదు. సోలొమన్ కాక ఇంకో ఇద్దరు నల్ల మగవాళ్ళూ, ఒక నల్ల స్త్రీ ఎలైజా, ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలైజా పూర్వ యజమాని ఆమెను రెండవభార్యగా చూసుకునేవాడు. ఆమెకు స్వేచ్ఛాపత్రాలు రాయబోతున్న సమయంలో చచ్చిపోయాడు. ఎలైజా అంటే మంటగా ఉన్న యజమాని భార్య ఆమెను, పిల్లలను బర్చ్‌కు అప్పచెప్పింది.
కొన్నిరోజుల తర్వాత, ఒకరాత్రి పూట వారందరినీ బళ్ళలో పడేసి వర్జీనియాలో ఓడలరేవుకు తీసుకువెళ్ళి ఒక ఓడ ఎక్కించారు. ఆ ఓడవారికి సోలొమన్ పేరు ప్లాట్ అని చెప్పాడు బర్చ్. నిజం చెప్పితే తనను బర్చ్ బ్రతకనివ్వడని ఆ పేరుకే పలకటం మొదలు పెట్టాడు సోలొమన్. ఓడ ప్రయాణంలో తప్పించుకుందామని తోటివారితో కలసి కొన్ని పథకాలు వేశారు కానీ అవేవీ ఫలించలేదు. ఓడ న్యూఆర్లియన్స్ చేరుకుంది. అక్కడ బర్చ్ భాగస్వామి థెలోనియస్ ఫ్రీమన్ అనే బానిస వర్తకుడు సోలొమన్‌తో పాటు బర్చ్ పంపిన ఇంకో యాభైమంది బానిసలను తీసుకువెళ్ళి ఒక బందెలదొడ్దిలో పెట్టాడు. వాళ్ళందరినీ శుభ్రంగా తోమించి,బజారులో అమ్మకానికి పెట్టాడు. మంచి దేహధారుడ్యం కలిగి వయొలిన్ వాయించడంలో నిపుణుడైన సోలొమన్ వెల 1500 డాలర్లుగా నిర్ణయించాడు ఫ్రీమన్. ఆ ధర ఎక్కువ అని సోలొమన్‌ని కొన్నాళ్ళు ఎవరూ కొనలేదు. ఈలోపు సోలొమన్‌కు, ఆ దొడ్లో ఉన్న మిగతా బానిసలకు మశూచి వచ్చింది. సోలొమన్ ఆ వ్యాధితో చనిపోతాననే అనుకున్నాడు, కాని బతికి బయటపడ్డాడు. వ్యాధివల్ల బలహీనమయ్యాడనో ఏమొ, అతని ధరను వెయ్యి డాలర్లకు తగ్గించాడు. కొంచెం సాత్వికుడిలా కనిపిస్తున్న ఒకాయన సోలొమన్‌ను, ఎలైజాను కొనటానికి సిద్ధపడ్డాడు.. అప్పటికే ఎలైజా కొడుకును ఎవరో కొనేసుకున్నారు. తన కూతుర్ను కూడా కొనుక్కోమని, తననుంచి తన కూతుర్ను వేరుచేయొద్దని ఆయన్ని ఎలైజా వేడుకొంది. డానికి కరిగిపోయిన కొత్త యజమాని ఆ పిల్లను కూడా కొనటానికి సిద్ధపడ్డాడు. పెద్దైతే ఆ పిల్లకు చాలా ధర పలుకుతుందని, ఆ పిల్లను ఇప్పుడు ససేమిరా అమ్మేది లేదని ఖండితంగా చెప్పాడు ఫ్రీమన్. చేసేదేమీ లేక పిల్లను వదిలేసి సోలొమన్ ఎలైజాలను తీసుకుని బయలుదేరాడు కొత్త యజమాని (మాస్టర్) విలియం ఫోర్డ్. ఎలైజా దుఖానికి అంతు లేదు. అలా రాత్రింబవళ్ళు దుఃఖిస్తూనే చిక్కిశల్యమై తొందరలోనే ఆమె మరణించింది.
విలియం ఫోర్డ్ లూయిజియానా రాష్టం నడిబొడ్డున ఎర్ర నది (రెడ్ రివర్) ఒడ్డున అవొయెల్ల్స్ అనే ఊరిలో పైన్ వుడ్స్ అనే పెద్ద ఎస్టేటుకు యజమాని. కొన్నాళ్ళు అతని దగ్గర పని చేసిన సోలొమన్ దృష్టిలో విలియం ఫోర్డ్, పెద్ద మనిషి, ఉత్తముడు, ఉదాత్తమైన స్వభావం కలవాడు, న్యాయం ధర్మం పాటించేవాడు. ఐనా, అతను కూడా బానిస వ్యవస్థలో ఉన్న అమానుషత్వాన్ని, ఆ సమాజంలో మిగతావారి లాగానే, గుర్తించలేదు. ఫోర్డ్ తన దగ్గర పనిచేసే బానిసలను దయగా చూసి వారి ఆలనా పాలనా చూసుకునేవాడు. హింసలు పెట్టేవాడు కాదు. బైబుల్ పాఠాలు చెప్పేవాడు. అతని బానిసలు కూడా అతను అంటే ఇష్టంతో పనిచేసేవారు. అతని ఎస్టేట్‌లోని కలపను మార్కెట్టుకు రహదారిపై తీసుకువెళ్ళటం కంటే నది దారిన తీసుకు వెళితే శ్రమ, ఖర్చు తగ్గి లాభం పెరుగుతుందని,కాలువలపై రవాణా విషయంలో బాగా అనుభవం ఉన్న సోలొమన్ సూచించాడు. దానికి సంతోషించిన ఫోర్డ్ సోలొమన్‌ను బాగానే చూసుకునేవాడు. వడ్రంగం పనిలో సోలొమన్‌కు ఉన్న అనుభవం, వయొలిన్ విద్య, పనితనం సోలొమన్‌కు ఒక ప్రత్యేక స్థానం కలిపించాయి. ఇక్కడ కూడా సోలొమన్ అసలు పేరు, కథ ఎవరికీ తెలీదు; ప్లాట్ అనే పేరుతోనో అతను పన్నెండేళ్ళు బతికాడు.
ఐతే కాలక్రమేణా ఫోర్డ్ ఆర్థిక స్థితి పాడైపోయింది. తన దగ్గర ఉన్న బానిసలను అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది. జాన్ టిబీట్స్ అనే వడ్రంగం మేస్త్రీ ఫోర్డ్‌కు కొంత డబ్బిచ్చి, మిగతా డబ్బుకు సోలొమన్‌ను హామీగా తాకట్టు పెట్టి సోలొమన్‌ను కొనుక్కున్నాడు. స్వభావంలో ఇతను ఫోర్డ్‌కు పూర్తిగా వ్యతిరేకం. బూతులు తిట్టడం, ఏ చిరాకు వచ్చినా కొరడాతో సోలొమన్‌ని కొట్టటం అతనికి నిత్యకృత్యాలు. ఒకరోజున అతని దమనకాండకు తట్టుకోలేక సోలొమన్ టిబీట్స్ ను తిరగబడి కొట్టాడు. దెబ్బలు తట్టుకోలేక, ‘మళ్ళీ వచ్చి నీ అంతు చూస్తా’, అని బెదిరిస్తూ టిబీట్స్ పారిపోయాడు. అక్కడ ఉంటే చావు తప్పదని సోలొమన్ ఫోర్డ్ ఎస్తేటుకు పారిపోయాడు. అప్పుడు ఫోర్డ్ ఊళ్ళో లేడు. టిబీట్స్ మళ్ళీ మనుషుల్తో వచ్చి సోలొమన్‌ను కాళ్ళూ చేతులూ కట్టేసి ఉరి వేయటానికంటూ చెట్టుకు వేలాడతీయబోయాడు. ఉరి తీయకుండా టీస్డేల్‌ను ఫోర్డ్ ఓవెర్సీరు అడ్డుకున్నాడు. సోలొమన్ హామీగా ఉన్న అప్పు తీరేవరకూ అతని మీద ఫోర్డ్‌కు హక్కు ఉందని, అతన్ని చంపే హక్కు టిబీట్స్ కు లేదని అడ్డం పడ్డాడు. ఫోర్డ్ తిరిగివచ్చేవరకూ సోలొమన్ దాహానికి మంచినీళ్ళు కూడా లేక ఎండలో అలాగే చెట్టుకు వేళ్ళాడాడు. మళ్ళా కొన్నాళ్ళకి టిబీట్స్ తో ఇంకో గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత ఫోర్డ్ పరిష్కారంగా టిబీట్స్ నుంచి సోలొమన్‌ను ఇంకో ఎస్టేట్‌దారుడికి అమ్మేసి అప్పు తీర్చేట్లుగా ఏర్పాటు చేశాడు. తన పేరు ప్లాట్ కాదని, తాను స్వతంత్రుణ్ణే కాని బానిసను కాదని సోలొమన్ ఫోర్డ్‌కు చెప్పాడు. సోలొమన్‌కు సాయం చేసే స్థితిలో లేనని తన అశక్తతను వెలిబుచ్చాడు ఫోర్డ్.
చివరికి సోలొమన్ ఎడ్విన్ ఎప్స్ అనే పత్తి ఎస్టేట్‌దారుడి దగ్గర బానిసగా తేలాడు. ఎప్స్ మంచి ఒడ్డూ పొడుగూ ఉన్న భారీ మనిషి. కోపదారి. తాగుబోతు. తాగినప్పుడు మైకంలో బానిసలని తరిమి తరిమి కొరడాతో కొట్టటం అతనికి సరదా. ఎస్టేట్‌లో పాట్సీ అనే బానిస ఉంది. మంచి పనికత్తె. పొలం పనులు మొగవాళ్ళకన్నా బాగా చేసేది. పత్తి వలవటంలో మిగతావారందరికన్న రెండింతల మిన్నగా చేసేది. ఎప్స్ ఆమెను బలవంతంగా అనుభవించేవాడు. ఈ కారణం వల్ల ఎప్స్ భార్యకు పాట్సీ అంటే కోపంగా ఉండేది. ఆమెను అనేకరకాలుగా హింసించేది. ఆ హింసకు ఎప్స్ అడ్డువచ్చేవాడు కాదు.
పత్తి సాగు, పత్తి వలవటం సోలొమన్‌కు అలవాటు లేని పనులు. తన వంతు పత్తి వలవనందుకు రోజూ కొరడా దెబ్బలు తినేవాడు. ఎప్స్ దగ్గర పని చేయటం కష్టం. పొద్దున్నే సమయానికి లేవకపోతే కొరడా దెబ్బలు; చేలలో వేగంగా పనిచేయకపోతే కొరడా దెబ్బలు. తన వాటా పత్తి వలవకపోతే కొరడా దెబ్బలు. పనంతా చేసి కొంపకు చేరి వంట చేసుకుని తిని పడుకునేపాటికి బాగా పొద్దు పోయేది. కంటికి నిద్ర లేకుండా మళ్ళీ తెల్లవారు జామునే లేవాలి. బానిసలు చిక్కిపోయినా, ఒళ్ళు పెంచుకున్నా పనులు చేయలేరని, మధ్యస్థంగా ఉండేట్టుగా తిండి పెట్టేవారు.
మధ్యలో పత్తిచేలకు పురుగుసోకి పంట నాశనం అయితే, రెండేళ్ళ పాటు ఎప్స్ తన బానిసలను దగ్గరలో చెరుకు సాగుచేసే ఇంకో ఎస్టేట్‌వారికి అద్దెకు ఇచ్చాడు. సోలొమన్‌కు పత్తిసాగుకన్నా చెరుకుతోటల్లో పని చేయడం సులువుగా అనిపించింది. ఆ తోటల్లో మంచి నేర్పరి అయ్యాడు. వారాంతాల్లో పార్టీలకు వయొలిన్ వాయించడానికి పక్క ఎస్టేట్ల వారు పిలచి కొంత డబ్బు ఇచ్చేవారు. ఎప్స్ సోలొమన్‌ని బానిసలకు మేస్త్రీని (డ్రైవర్) చేశాడు. మెడలో కొరడా వేసుకుని మిగతా బానిసలతో పని చేయించాలన్న మాట. బానిసలను కొడ్తున్నట్టు నటిస్తూ యజమానికి నమ్మబలుకుతూ జీవితాన్ని గడిపాడు.
సోలొమన్ తాను చదువుకున్న విషయం ఎవరికీ తెలియనివ్వలేదు – చదువుసంధ్యలున్న బానిసను యజమానులు సహించరు. చాలా రహస్యంగా ఒక కాగితం సంపాదించి, తానే స్వయంగా సిరాను తయారుచేసుకుని, సరటొగా ఫాల్స్‌లో తెలిసినవారి పేర ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని పోస్టాఫీసులో ఇవ్వటానికి సహాయం చేయమని ఒక తెల్ల పనివాణ్ణి అడిగితే. అతను ఆ విషయం ఎప్స్‌కు చేరవేశాడు. చదువే రాని తాను ఉత్తరం ఎలా రాస్తానని, ఆ తెల్లతను తనను ఇబ్బందులు పాలు చెయ్యటానికి అబద్ధాలు ఆడుతున్నాడని డబాయించి ఎప్స్‌ని నమ్మించడంతో ఆ గండం గడచిపోయింది.
ఎప్స్ తన ఇంటిముందు అదనపు గదులు కట్టటానికి పక్క పట్టణం నుండి బాస్ (Bass) అనే ఒక వడ్రంగపు మేస్త్రీని పిలపించి, సోలొమన్‌ను అతనికి సహాయకుడిగా అప్పచెప్పారు. ఆ మేస్త్రీ ఆ ప్రాంతం వాడు కాదు. కెనడాలో పుట్టినవాడు. ఊరందరి దారికి పెడగా వాదించేవాడు. దీన్నో తిక్కలతనంగా భావించి గట్టిగా పట్టించుకోకుండా, వినోదం కోసం అతన్ని రెచ్చగొట్టి అతని వాదాలను హాస్యంగా తీసుకొని అందరూ ఆనందిస్తూ ఉండేవారు. బానిసత్వం అమానుషమే కాకుండా, దేవుడి ధర్మానికి కూడా వ్యతిరేకమని అతను ఎప్స్‌తో వాదించేవాడు. ఆ వాదనలన్నీ వింటూ, బాస్‌ని దగ్గరనుండీ చూస్తున్న సోలొమన్‌కి అతని మీద నమ్మకం కలిగింది. రహస్యంగా తన కథను వినిపించాడు. సోలొమన్‌కు సహాయం చేస్తానని, అతను సరటోగా ఫాల్స్‌కు ఉత్తరం రాస్తే దాన్ని తాను పక్కన ఉండే బస్తీ మార్క్స్‌విల్‌నుండి పోస్టు చేస్తానని బాస్ హామీ ఇచ్చాడు. సరటొగా ఫాల్స్‌లో తనంటే అభిమానం చూపే ఇద్దరు తెల్ల వర్తకుల పేర, తాను బానిసను కాదన్న ఆధారాలు ఉన్న కాగితాలు పంపే ఏర్పాటు చేయమని, సోలొమన్ ఒక చిన్న ఉత్తరం రాశాడు. బాస్ ఆ ఉత్తరాన్ని రహస్యంగా పోస్టు చేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తాను చేసిన పని తెలిస్తే ఎప్స్ తనకు తీవ్ర హాని చేస్తాడని అతనికీ భయమే.
ఆ ఉత్తరాన్ని బాస్‌కు 1852 ఆగస్టు 15న ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు సోలొమన్ తనకోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశాడు. నాలుగు నెలలు గడచాయి కానీ ఏమీ జరగలేదు. క్రిస్టమస్ పండుగ కూడా వచ్చి వెళ్ళింది. ఇక అతను ఆశలు వదిలివేసుకున్నాడు.
నిజానికి ఆ ఉత్తరం అతను ఉద్దేశించిన వారికి చేరింది. వారు వెంటనే ఆ వార్తను సోలొమన్ కుటుంబసభ్యులకు చేర్చారు. వారంతా కలసి హెన్రీ నార్తప్ అనే వకీలు దగ్గరకు ఆ ఉత్తరం తీసుకువెళ్ళారు. హెన్రీ నార్తప్ తెల్లవాడు; ఒకప్పుడు సోలొమన్ తండ్రి అతని దగ్గర బంధువు వద్ద బానిసగా ఉండి విడుదల పొందాడు. ఆ కారణం చేత కాబోలు హెన్రీ నార్తప్ ప్రత్యేకమైన శ్రద్ధతో సోలొమన్‌ని విడిపించటానికి ప్రయత్నించాడు. అంతకు కొన్నేళ్ళ క్రితమే న్యూయార్క్ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ప్రకారం ఆ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉన్న నల్లవారిని ఎవరైనా బలవంతంగా బానిసలుగా మార్చినట్లు తెలిస్తే వారిని ఆ బానిసత్వం నుంచి విడుదలచేయించటానికి రాష్ట్ర గవర్నరు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవటానికి ఒక ఏజంటును నియమించాలి. అవసరమైన ఖర్చులు ప్రభుత్వమే పెట్టుకోవాలి. హెన్రీ నార్తప్ అవసరమైన విషయాలు సేకరించి, పకడ్బందీగా అర్జీ తయారుచేసి, గవర్నరును ఒప్పించాడు. గవర్నరు ఈ విషయంలో ఏజంటుగా హెన్రీ నార్తప్‌నే నియమించాడు. హెన్రీ నార్తప్ అప్పుడు అవసరమైన అన్ని పత్రాలు తీసుకుని మార్క్స్‌విల్ పట్టణం చేరుకుని అక్కడి అధికారులను కలుసుకుని అన్ని విషయాలు వివరించి సోలొమన్ విడుదలకు అవసరమైన పత్రాలు తయారుచేయించి సోలొమన్ ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తీయటం మొదలుబెట్టారు –అక్కడ ఎవరికీ సోలొమన్ అన్న పేరే తెలియదు, ప్లాట్ అని తప్ప. సోలొమన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటానికి చాలా సమయమే పట్టింది. ఈ విషయాలు మార్క్స్‌విల్‌లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఎప్స్‌కు ఈ విషయం గురించి ఏ మాత్రం అనుమానం తగిలినా సోలొమన్‌ని మాయం చేసి ఉండేవాడు.
1853 జనవరి మూడో తేదీన సోలొమన్ పత్తిచేనులో పని చేస్తుండగా చేను దగ్గరకి ఒక బగ్గీ వచ్చి ఆగింది. దాన్లోనుంచి ఇద్దరు పెద్దమనుషులు దిగారు. ఒకాయన, ఆ ప్రాంతపు షరీఫు (ముఖ్య పోలీసు అధికారి), ప్లాట్‌ని పిలచాడు. నువ్వెక్కడ పుట్టావ్, నీ అసలు పేరు ఏమిటి అని అడిగాడు, సోలొమన్‌కు మాత్రమే జవాబులు తెలిసి ఉండగల ప్రశ్నలు కొన్నివేసి అతనే సోలొమన్ నార్తప్ అని ధృవీకరించుకున్నాక, సోలొమన్ బానిస కాదని, స్వేచ్ఛాజీవి అని ప్రకటించి తనతో వచ్చిన హెన్రీ నార్తప్‌కు అప్పగించాడు. ఈ విషయం విన్న ఎప్స్, అతను సోలొమన్ కాదనీ, ప్లాట్ అనీ వాదించడానికి ప్రయత్నించాడు కానీ,సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో ఆ ప్రయత్నాలు మానివేశాడు.
సోలొమన్ నార్తప్, హెన్రీ నార్తప్ కలసి న్యూ ఆర్లియన్స్ నుంచి బయలుదేరి వాషింగ్టన్ చేరుకున్నారు. అక్కడ సొలోమన్ జాన్ బర్చ్‌పై ఫిర్యాదు చేశాడు. అతన్ని అరెస్టు చేసి కోర్టుకు తెచ్చారు. అతని రికార్డుల ద్వారా అతను దోషి అని తెలిసిపోతూనే ఉంది. కానీ ఈ విషయంలో ఉన్న ఒకే ఒక ప్రత్యక్ష సాక్షి సోలొమన్ మాత్రమే. అప్పుడు వాషింగ్టన్ కోర్టుల్లో తెల్లవారికి వ్యతిరేకంగా నల్లవారు సాక్ష్యం చెప్పటానికి లేదు. దానితో కేసు కొట్టివేసి బర్చ్‌ని విడుదల చేశారు.
జనవరి 21న న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న తన కుటుంబాన్ని సోలొమన్ నార్తప్ కలుసుకున్నాడు. మూడు నెలలు తక్కువగా పన్నెండేళ్ళపాటు అతను బలవంతంగా బానిసగా బతికాడు.
డేవిడ్ విల్సన్ అనే రచయిత సహాయంతో సోలొమన్ తన కథను Twelve Years a Slave అనె పేరుతో గ్రంథస్తం చేశాడు. ఆ పుస్తకానిక్ మంచి ప్రాచుర్యం లభించింది. మూడేళ్ళలో 30,000 పుస్తకాలు అమ్ముడయ్యాయి. సోలొమన్ బానిసత్వ నిర్మూలన ఉద్యమంలో చురుకుగా పనిచేస్తూ, ఉత్తర రాష్ట్రాలలో తిరిగి చాలా ఉపన్యాసాలు ఇచ్చాడు. బోస్టన్‌లో ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళాడు. అకస్మాత్తుగా అతను మాయమయ్యాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలీదు.
—
సోలొమన్ పుస్తకాన్ని చదివిన ఒకాయన సోలొమన్‌ని మోసం చేసిన బ్రౌన్, హేమిల్టన్లు ఎవరో గుర్తు పట్టాడు. వాళ్ళిద్దరినీ అరెస్టు చేశారు కానీ, రెండేళ్ళ విచారణల తర్వాత, తగినంత సాక్ష్యం దొరకక విడచిపెట్టారు.
ఈ పుస్తకం మొత్తం సోలొమన్ ఉత్తమపురుషలో కథను చెపుతాడు. తన కథను ఆసక్తికరంగా చెప్పటమే కాకుండా, 1840-52 మధ్యలో బానిసల రవాణా,అమ్మకాల గురించి, రెడ్ రివర్ పరీవాహక ప్రాంతాల్లో బానిసల, బానిస యజమానుల జీవనాల గురించి స్పష్టంగా వివరిస్తాడు. యజమానుల క్రౌర్యమే కాక, బానిసల నివాసము, ఆహారము, నిత్యజీవిత విధానాలు, మనస్తత్వాలు, ఆచార వ్యవహారాలు, అరుదుగా దొరికే వినోదాలు విపులంగా వర్ణిస్తాడు. ఆకాలంలో కలప పనులు, పత్తిసాగు, చెరకు సాగు, పంచదార తయారు చేయటం వంటి విషయాలను విశదంగా చెప్తాడు. పుస్తకం చిన్నదే ఐనా, ఒకప్పటి జీవితం కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది.
సోలొమన్ కథనంలో ఆర్తి, వేదన, కోపాలతో పాటు, కొంత సానుభూతి, సమాలోచన, తాత్వికత ఉన్నాయి. ఒక సమాజపు సంస్కృతిలో కొందరు మనుషులు మిగతా మనుషుల మనిషితనాన్ని ఎలా మాయం చేస్తారో విస్మయం కొలుపుతుంది. స్వతహాగా మంచితనం ఉన్న మనుషులుకూడా అటువంటి సమాజంలో ఉన్నప్పుడు, ఆ అన్యాయాన్ని గుర్తించని గుడ్డివారు కావడమూ సహజంగానే జరిగిపోతుంది. ఈ కథలో తెల్లవారంతా చెడ్డవారు కాదు. సోలొమన్ విడుదలకు కృషి చేసినవారు, అతను వేసిన వ్యాజ్యాలకు మద్దతు ఇచ్చినవారు తెల్లవారే.
కొన్నాళ్ళపాటు నార్తప్ కథనం మరుగున పడిపోయింది. 1968లో లూయిజీయానా స్టేట్ యూనివర్సిటీ వారు ఈ పుస్తకాన్ని పరిష్కరించి సాధికారకంగా ప్రకటించాక సోలొమన్ నార్తప్ జీవితం మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది. 1998లో నార్తప్ తన కథనంలో చెప్పిన విషయాలన్నిటినీ కొంతమంది పరిశోధించి, చారిత్రక ఆధారపత్రాలన్నీ క్రోడీకరించి ప్రదర్శించారు.
ముందుగా చెప్పినట్టు ఈ కథ ఇప్పుడు మంచి చలనచిత్రంగా వచ్చింది. మూలకథను, కొద్ది మార్పులు, చేర్పులు ఉన్నా, దాదాపుగా అలాగే చిత్రీకరించారు.
పుస్తకమూ, చిత్రమూ రెండూ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీలు చేసుకుని తప్పక చదవవలసిన / చూడవలసిన పుస్తకం/ చిత్రం.
Twelve Years a Slave:
Narrative of Solomon Northup, a Citizen of New-York,
Kidnapped in Washington City in 1841, and Rescued in 1853:Solomon Northup (b. 1808)
1853Electronic Edition.
University of North Carolina at Chapel Hill
1997336 pages.
Ravi Avula
నేను ఈ సినిమా చూసాను …గుడ్ మూవీ. కానీ, ఇది ఇదొక్క బుక్ ద్వార ..తిసరనుకొలెదు. రూట్స్ అనే నావల్ వుంది కదా? దానిలో భాగం అనుకున్న…
ఇప్పటికి కొందరు..ప్రజలు నాయకుల చేతిలో బానిసలే…
mani vadlamani
‘పుస్తకం చిన్నదే ఐనా, ఒకప్పటి జీవితం కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది.”
కళ్ళకి కట్టి నట్లు చక్కటి సమీక్ష రాసారు చౌదరిగారు
ఒక మనషి మీద తన తోటి మనిషి ఎలా అధికారం జులుం చలాయిస్తాడో అనిపిస్తోంది కే వలం శరీరపు రంగు ఆర్ధిక స్థాయిమూలంగా కొన్ని దేశాలలోజరుగుతూ వుంటే మనదేశం లో కులం ఆధారంగా కూడా ఈ వివక్షత ఇంకా కొనసాగుతూనే వుంది .
చదువుతుంటే మనసంతా దిగులుగా అనిపించింది
BSR
Nice review JVSR. It is important especially for the younger generations to read about the inglorious parts of human history and understand the consequences of average joe going along unquestioningly. It is equally important for the NRI kids to learn about and understand and denounce the caste segregation and inhuman treatment of certain classes that had gone on (to a lesser degree still goes on unfortunately) in India.