దేశవిభజన కాలరాత్రిని కళ్ళకుగట్టే “తమస్”
హైదరాబాదుకు చెందిన సూత్రధార్ నాటక కంపెనీవారు వేసిన ప్రదర్శన “మై రాహీ మాసూమ్” చూడ్డం సంభవించింది. అది ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహీ మాసూమ్ రజా జీవితంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని చేసిన నాటకం. అందులో రాహీ మాసూమ్ మాట ఒకటి: “ఆగష్టు పదిహేను, 1947న దేశవిభజన జరిగిందన్నది నిజం కాదు. ఆగష్టు పదిహేను, 1947 నాడు దేశవిభజన మొదలై, నేటికీ కొనసాగుతుంది.” నిజంగానే, దేశంలోఐక్యతా, సమానత్వం, సౌభ్రాతృత్వం లేవా? అన్నది ఒక ప్రశ్న అయితే, అసలా ప్రశ్నకు ఆస్కారం ఇచ్చిన 1947నాటి విభజన ఎలాంటిది? ఓ రెండు రాజకీయ పార్టీలు ఓ మధ్యవర్తిని పెట్టుకొని తీసుకున్న నిర్ణయమా? లేక కొన్ని స్వార్థపూరిత నిర్ణయాల వల్ల సంభవించిన పరిణామమా? అసలు దేశవిభజన అనేది ఓ కఠోర తపోఫలమా? లేక పదవిని దుర్వినియోగం చేసిన పాపమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చరిత్రలో కొన్ని దాఖలాలు ఉంటాయి. చరిత్రలో ఓ ముఖ్య ఘటనకు కీలకమైనవారు చేసిన చర్చలు, పడిన రాజీలు, తీసుకున్న నిర్ణయాలు, పొడిచిన వెన్నుపోట్లూ, ఆడిన అబద్ధాలూ, తప్పిన మాటలూ, తప్పని పరిస్థితిలూ, ఇవ్వన్నీ రాసిపెట్టి ముందు తరాలకు అందిస్తూ ఉంటారు చరిత్రకారులు.
చరిత్రను పక్కకు పెట్టి, ఆయా చారిత్రాత్మక ఘట్టాలలో సామాన్యుల సంగతేంటని అడిగితే వినిపించే ఒకేఒక్క సమాధానం: కథలు. ఆ చరిత్రను చూసినవారు చెప్పే, వీలుంటే రాసే కథలు! Literature is common man’s history అని ఊరికనే అనలేదుగా మరి. మన దేశవిభజనకు సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి. వాటిలో తప్పక చదవాల్సిన పుస్తకం భీష్మ్ సాహనీ, 1974లో రాసిన పుస్తకం “తమస్”. విభజనకు పూర్వం రావల్‍పిండిలో నివసించిన ఈయన, అప్పటి తన స్వానుభవాలకు కొంత నాటకీయతను జేర్చి రాసిన ఈ రచనకు కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు వచ్చింది. పలు భారతీయ భాషల్లో ఈ రచన అనువాదం లభ్యం. నేను చదివింది రచయితే చేసిన ఆంగ్లానువాదం.
కథ:
అప్పటికింకా బ్రిటిషువారి దేశాన్ని వదిలిపోలేదు కానీ, వారింక ఈ దేశంపై ఏలుబడి కొనసాగించలేరని స్పష్టమైన రోజులవి. నవల మొదలవ్వడమే ఓ రాత్రిపూట ఓ చర్మకారుడు పందిని చంపడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతనికి ఈ పనిని బ్రిటిష్ వద్ద పనిజేస్తున్న అతను అప్పజెప్తాడు. పనికి ముందే ఐదు రూపాయాల నజరానా కూడా అందుతుంది. ఆ ఊరిలోని పశువైద్యుని ఈ చచ్చిన పంది కావాలి అని చెప్తాడు. తెల్లారేసరికి పందిని చంపగలుగుతాడు అతడు. అంత ఉదయాన్నే ఆ ఊరి కాంగ్రెస్ కార్యకర్తలు “ప్రభాత ఫేరి”కి సిద్ధపడుతూ ఉంటారు. అనుకోకుండా వారి నడక కార్యక్రమం రద్దయ్యి, వాళ్ళంతా ముస్లిములు అధికంగా ఉన్న ఒక ప్రాంతంలో పారిశ్యుద్ధ కార్యక్రమానికి పూనుకుంటారు. అక్కడ పనిజేస్తుండగా వాళ్ళకి తెలిసొచ్చే విషయమేమిటంటే ఎవరో పందిని చంపి, దాన్ని మసీదు మెట్ల మీద పడేశారని. అప్పటివరకూ కాస్తో, కూస్తో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది.
ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందని అందరూ అనుకుంటూనే ఉంటారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ల నాయకలు జిల్లా కలెక్టర్‍ను సాయంకోసం ఆశ్రయిస్తారు. “మా చేతుల్లో ఏం మిగల్లేదింకా.. అంతా మీ నెహ్రూయే చూసుకోవాల”ని అంటాడాయన. ఈ లోపు హిందు, ముస్లిం, సిక్కుల అతివాదులు వారివారి మతస్థుల సంరక్షణకై ఆయుధాలు సేకరిస్తూ ఉంటారు. “ఏదో జరగబోతుంద”న్న గుసగుసలు అంతటా వినిపిస్తాయి. ఎవరికి వారు ఏ విపత్తూ జరక్కుండా జరిగిపోతే బావుణ్ణూ అనుకుంటూనే ఉంటారు. అయినా మారణహోమం జరిగిపోతుంది. మతం పేరిట దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనిషిని మనిషి నరుక్కుంటాడు. ఇదంతా ఓ ఊరినుండి ఇంకో ఊరికి పాకుతుంది. దారుణాలు జరిగిపోతుంటాయి. చంపబడకపోయినా, బతికే అవకాశమూ లేక, ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఒక్క రాత్రిలో నిరాశ్రయులై పోయినవారు ఎంతమందో! అప్పటికి ప్రభుత్వం మేల్కొంటుంది. అప్పుడు కర్ఫ్యూ పెడుతుంది. నిరాశ్రయులకు వసతి కల్పించడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది.
కథ చెప్పిన వైనం:
“కథ కంచికి, మనం ఇంటికి” అన్న మాటలోనే కథ వినేటప్పుడు మనం ఇంట్లో లేమని అర్థం స్ఫురిస్తుంది నాకు. ఏ కథైనా, సమర్థవంతంగా చెప్పాలే గానీ, అది వినే/చదివేవాణ్ణి ఆ కథలోని కాలానికి, ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడ తిరుగాడాలే చేస్తుంది. అందులోని పాత్రులతో మమేకమైయ్యేలా చేస్తుంది. సహానీ కూడా ఈ రచనతో పాఠకుణ్ణి దేశవిభజన కాలం నాటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళటంలో, వాటిని అర్థం చేసుకునే వీలు కల్పించటంలోనూ, అప్పటివారి నిస్సహాయతను సహానుభూతితో అర్థం చేసుకోవటంలోనూ సఫలమయ్యారు.
ఎన్నో ఏళ్ళుగా ఇరుగుపొరుగుగా మెలిగినవారు, కలిసి వ్యాపారం చేసినవారు, స్నేహితులైనవారు ఒక్కసారిగా ఒకరినొకరు నరుక్కోవడం ఎలా సాధ్యం? బంధం ఎంతటి దృఢమైనదైనా అనుమానం దాన్ని కృంగదీస్తుంది. పీడిస్తుంది. కృశింపజేస్తుంది. భారతీయ హిందూ ముస్లింల మధ్య బ్రిటిష్‍వారు అనుమానపు బీజాన్ని నాటారు. అది మొక్కై, మానై, విషఫలాలు ఇస్తున్న సమయంలో ఈ కథ మొదలవుతుంది. బ్రిటిష్‍వారికి పనిజేస్తున్న ఓ ఆఫీసరు, ఒక చర్మకారుడితో పందిని చంపించి, దాన్ని మసీదు ముందు పడవేయిస్తాడు. ముస్లిమ్‍లు అది హిందువుల పని అనుకుంటారు. ఆ పట్టణపు కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంజేసి అక్కడి నుండి పంది శవాన్ని తీసేస్తారుగానీ, అప్పటికే నిప్పు రాజుకొనుంటుంది. షికార్లుజేసే పుకార్లు ఆ నిప్పును ఎగదోస్తాయి. ఫలితంగా ఆ ఊరు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు తగలబడిపోతాయి. ఎవరికి వారు అవతలివారికి హాని కలిగించకూడదూ అనుకుంటారు. తమ జోలికి రాకపోతే ఎవరినీ ఏమీ అనుకూడదనే అనుకుంటారు. అయినా నరుక్కోవడాలు, ఆత్మహత్యలూ, చావలేక మతమార్పిడికి ఒప్పుకోడాలు, అప్పటికప్పుడు తయారవుతున్న నిరాశ్రయులూ, అనాధలూ… ఏవీ ఆగవు.
సాహనీ కథను నేర్పుగా చెప్తారు. అప్పటి వాతావరణాన్ని, దాన్ని కలుషితం చేయిస్తున్న శక్తులనీ, దానికి బలైపోయిన సామాన్యులని ఆయన ఒకే దృష్టితో చెప్పుకొస్తారు. మసీదుముందు పడేయడానికే తనచేత పందిని చంపించారని గ్రహించిన ఆ చర్మకారుడు, తన భార్యతో ఆ భయాన్ని, అపరాధభావాన్ని ఎలా పంచుకున్నాడో మనకి చూపించారు. అలానే, “హిందూ-ముస్లిములు ఒకరినొకరు కొట్టుకొని చావకపోతే మనల్ని కొడతారు.”[Darling, rulers have their eyes only on differences that divide their subjects, not on what unites them.] అని తేల్చిజెప్పే బ్రిటిష్ కలెక్టర్ వైవాహిక జీవితంలోని సంక్లిష్టతనూ అంతే మానవీయంగా చిత్రీకరిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య విభేదాలు, ఎవరు ఏయే అవసరాలకు కాంగ్రెసులో జేరీందీ హాస్యస్ఫోరకంగా చూపిస్తారు. ఒక పదిహేనేళ్ళ కుర్రాడిని హిందూ పరిరక్షకుడిగా తయారుజేయడానికి అతడికి కోడిని చంపే శిక్షణ ఇప్పించటంలో భయానకరసాన్ని చూపిస్తారు.
ఈ రచన ఏ ఒక్కరి లేక ఒక జాతి తరఫునో వాకాల్తా పుచ్చుకొని చేసిన ప్రసంగం కాదు. ఇందులోని రాజైనా, బీదైనా ముందో మామూలు మనిషి. అతడు వేసుకునే బట్టలూ, చేసే ప్రార్థనలూ, నివసించే ప్రదేశాలూ ఏవైనా అతడి మనసును అర్థంచేసుకునే వీలు కలిపించే రచన ఇది. అందుకే ఇందులో నిరాశ్రయులైన సిక్కు దంపతులను కుటుంబాన్ని ఎదిరించి ఆదరించే ముస్లిం మహిళ ఉంటుంది. ప్రాణస్నేహితుడైన హిందువు కోసం అల్లర్లు జరుగుతున్నాయని తెల్సినా వాళ్ళ పనిజేసిపెట్టే ముస్లిమూ ఉంటాడు.
ఎందుకు చదవాలీ పుస్తకం?
నాకీ పుస్తకం గురించి ముష్రిల్ హాసన్ ఎడిటర్‍గా వ్యవహరించిన “India Partitioned.” మొదటి సంపుటి వల్ల తెలిసింది. అందులో సాహనీ రాసిన “We have arrived in Amritsar” అనే కథను పరిచయం చేస్తూ, తమస్ గురించిన ప్రస్తావనలో, తమస్‍ను గోవింద్ నిహలానీ తీసిన చిత్రం దూరదర్శన్‍లో ధారావాహికగా 1988లో వచ్చిందనీ, దాన్ని ఆపేయాలంటూ పిటిషన్ వేయబడిందనీ, ఆ పిటిషన్‍ను తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు అన్న మాటలు:
“Tamas takes us to a historical past – unpleasant times, when a human tragedy of great dimension took place in this subcontinent… Naked truth in all times will not be beneficial but truth in its proper light indicating the evils and the consequences of those evils is constructive and that message is there in Tamas.”
ఈ నవలను చదివాక నేనా పై వాక్యాలతో పూర్తిగా ఏకీభవిస్తాను. కొన్ని సందర్భాల్లో గతాన్ని మర్చిపోలేకపోవటం ఎంతటి శాపమో, మరికొన్ని సందర్భాల్లో దాన్ని కప్పిపెట్టేసి, ఏం జరగనట్టు వ్యవహరించటమూ అంతే దురదృష్టకరం. పరిచయ వ్యాసం కాబట్టి నేను ఎక్కువ రాయలేకపోతున్నాను కానీ, ఈ రచనలో ఆలోజింపజేసే పరిస్థితులూ, అవి లేవనెత్తే ప్రశ్నలు అనేకం.
ఇందులో నాకు అన్నింటికన్నా ఆసక్తికరంగా అనిపించిన సన్నివేశం ఒకటి ఉంది. ఆ పొద్దున్నే మసీదు వద్ద జరిగిన ఘోరాన్ని గురించి సాయంకాలం ఒక హోటెల్ లో కొందరు చర్చించుకుంటూ ఉంటారు. అందులో ఒక ఫకీరు అధికారంలో ఉన్నవాడు చూడగలిగేంత దూరం సామాన్యులైన తాము చూడలేమని వ్యాఖ్యానిస్తాడు. అందుకు తగ్గ మూసా (ప్రాఫెట్) కథను చెప్పుకొస్తాడు. అందులో మూసా చేసే కొన్ని పనులు విపరీతంగానూ, అమోదయోగ్యంకానివి గానూ అనిపిస్తాయి కొత్తగా చేరిన శిష్యునికి. తీరా తాను ఏది ఎందుకు చేశానో మూసా చెప్పగానే అన్ని సమ్మతమనిపిస్తాయి. ఈ కథ చెప్పి, ఇలా ముగిస్తాడు:
“The moral of the story is: a ruler can see what you and I, ordinary folk, cannot see. The British ruler has all-seeing eyes, otherwise how can it be possible that a handful of firanghis coming from across the seven seas rule over so big a country? The firanghis are very wise, very subtle, very far-sighted..”
అంటే అప్పటి ప్రజలు బ్రిటిష్ పాలకులను దేవుళ్ళతో, వారి దూతలతో పోల్చేటంత అమాయకులా? లేక అధికారం ఉన్నవాడి చేతిలో – వాడు దేవుడు అయినా కాకున్నా, అతడి ఉద్దేశ్యాలు మంచివి అయినా కాకున్నా – సామాన్యులు కీలుబొమ్మలే అని అంతరార్థమా? కొన్ని కోట్లమంది జీవితాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే నాయకులే స్వార్థపరులైతే ఆ జీవితాలెలా బుగ్గిపాలు అవుతాయో కదా? ఇలా ఆలోచన పరంపరకు అడ్డు ఉండదు, ఈ రచన చదువుతున్నంత సేపూ!
దేశవిభజన ప్రస్తావన రాగానే నెహ్రూ-గాంధీలనో, జిన్నానో, బ్రిటిష్‍వారినో ఆడిపోసుకుంటే సరిపోదు. అప్పటి సమస్య ఇప్పటికీ ఉంది. అప్పటి నిప్పు ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది. రాహీ మాసూమ్ రాజా అన్నట్టు, దేశాన్ని ఈనాటికీ విభజిస్తూనే ఉన్నారు. అందులో అన్యం పుణ్యం ఎరుగనివారు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. దేశసరిహద్దుల్లో బయటి శత్రువులనుండి మనల్ని కాపాడే మన సైన్యం కోసమే కాదు, అంతర్గత శత్రువుల క్షుద్రరాజకీయాల్లో బలైపోతున్న అమాయకులకోసం “జర.. ఆఖోం మె భరలో పానీ!” అనుకుంటే తప్పక చదవాల్సిన పుస్తకమిది.
Jai Ratan’s translation of Tamas, available for download for free, here.
ఎ కె ప్రభాకర్
గతం స్మర , కృతం స్మర . భవిష్యత్తుని దిద్దుకో . చక్కటి పరిచయం .
varaprasad
సౌమ్య గార్ని రిక్వెస్ట్ చేశాను,మీరు కూడా ప్రయత్నం చేసి యండమూరి ,మల్లాది లను పుస్తకం లో రాసేలా చేయండి.
varaprasad
బాగాచెప్పారు పూర్ణిమ గారు,కానీ వాస్తవంలో బ్రతకటానికి ప్రజలు అలవాటు పడకుండా మనదేశ రాజకీయాలు నాటి నుండి నేటి వరకు ప్రజల్ని వంచిస్తూనే ఉన్నాయి.