సాహిత్యచరిత్రలో వాదవివాదాల సమగ్రమైన సమీక్ష

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు
**********
భాసుని ‘ప్రతిమా నాటకం’ మూడవ అంకంలో ప్రతిమాగృహంలోకి అడుగుపెట్టిన భరతుడు తన తాతముత్తాతల చిత్తరువులను చూసి బిత్తరపోయినప్పటి చిత్తవిభ్రాంతి ఈ బృహత్పుస్తకాన్ని చేతులలోకి తీసుకొని, కళ్ళకద్దుకొని చదవటం మొదలుపెట్టినప్పుడు నన్ను ఆవహించిందని చెప్పటం అతిశయోక్తి కాదు. ఎన్నాళ్ళుగానో తెలుగు సాహిత్యచరిత్రను అధికరించి అధ్యయనలు చేస్తున్న ఆసక్తిపరులకు సైతం ఇన్నిన్ని అంశాలపై ఇంతింత పరిశోధన జరిగిందని, దాని పరిణామస్వరూపం ఇదని తెలిసి ఉండకపోవచ్చును. ఏ చర్చనీయాంశాన్ని ఎవరు ప్రారంబించారు? అది వివాదాస్పదం ఎందుకయింది? ఆనాటి విద్యావివాదాలలో పాల్గొన్న విదితవిద్వాంసు లెవరు? ఆ వాకోవాక్యాల పార్యంతిక పరిష్కారం ఏమిటి? అన్న వివరాలు ఈనాటి విద్యార్థులకే గాక విద్యాధికులకు కూడా పూర్తిగా తెలిసే అవకాశం లేదు. అప్పటి ప్రాంతీయపత్రికలు, ఆ విరుద్ధవాదగ్రంథాలు ఇప్పుడు వెతికినా దొరకటం కష్టం. ఆ లోపాన్ని పరిపూర్ణించేందుకు కవిగా, నాటకకర్తగా సుప్రసిద్ధులైన డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ గారు యుజిసి మేజర్ రీసెర్చి గ్రాంటు ఆధారంగా రెండేళ్ళ పాటు పరిశోధించి, 2005లో ప్రకటించిన సమస్త సాహిత్యవివాద విజ్ఞానకోశం ఇది. తెలుగు సాహిత్యచరిత్ర నిర్మాణశిల్పులైన పురాణం హయగ్రీవశాస్త్రి, తంజనగరం తేవప్పెరుమాళయ్య, మానవల్లి రామకృష్ణకవి, కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, జయంతి రామయ్యపంతులు, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, నడకుదుటి వీరరాజుపంతులు, వేదం వేంకటరాయశాస్త్రి, భావరాజు వెంకటకృష్ణారావు, వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేలూరి శివరామశాస్త్రి, అక్కిరాజు ఉమాకాంతం, చాగంటి శేషయ్య, చిలుకూరి వీరభద్రరావు, బండారు తమ్మయ్య, ఖండవల్లి లక్ష్మీరంజనం, నేలటూరు వేంకటరమణయ్య, శిష్టా రామకృష్ణశాస్త్రి, పాటిబండ మాధవశర్మ, నిడుదవోలు వేంకటరావు, దివాకర్ల వేంకటావధాని, కేతవరపు రామకోటిశాస్త్రి, ఆరుద్ర, కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి మహామహుల నిఃస్వార్థసారస్వతసేవాహేవాకానికి సమర్పించిన పునస్సమీక్షా నీరాజనం ఇది.

లక్ష్మీనారాయణ గారు ముందుగా ఆ రోజుల్లో జరిగిన వివాదాలన్నింటిని సాహిత్యచరిత్రలోని కాలక్రమానుసారం కూర్చుకొని, వాటిని వరుసగా వివరించారు. నిష్పక్షపాతంగా ఉభయపక్షాలను వివేచించి, ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ సమస్యలు మొత్తం ఎనభై రెండు:

(1) సాహిత్యచరిత్రలో యుగవిభజనల భేదాలు – సక్రమపద్ధతి
(2) ఆంధ్రదేశంలో జైన బౌద్ధ గ్రంథాలను దగ్ధం చేసిన మాట నిజమేనా?
(3) నన్నయ ఆదికవేనా?
(4) నన్నయ భారతాన్ని రాజరాజుకు అంకితం ఇచ్చాడా?
(5) అధర్వణ భారతం మాటేమిటి?
(6) కవిజనాశ్రయ కర్త రేచనా? భీమనా?
(7) వేములవాడ భీమకవి కాలం, గ్రంథాలు
(8) భారత రచనలో నారాయణ భట్టు పాత్ర ఎంత?
(9) నన్నయ ఆరణ్యపర్వాన్ని సంపూర్ణంగా వ్రాయలేదా?
(10) ప్రసన్నకథాకవితార్థయుక్తి – కలితార్థయుక్తి
(11) ఆంధ్రశబ్దచింతామణి నన్నయ రచనమేనా?
(12) నన్నయకు వ్యతిరేకంగా వీరశైవవాఙ్మయం ఎందుకు పుట్టింది?
(13) ‘మార్గ-దేశి’, ‘జానుతెనుగు’ అంటే ఏమిటి?
(14) నన్నెచోడుడు ఎప్పటివాడు?
(15) నన్నెచోడుడు చెప్పిన కవితాలక్షణాలను గురించిన చర్చల పరిశీలన
(16) తిక్కన తాతగారు భాస్కరుని కృతికర్తృత్వం
(17) తిక్కన తాతగారు భాస్కరుడెవరు?
(18) తిక్కన చెప్పిన కవితాలక్షణాలు ఎవరిని దృష్టిలో ఉంచుకొని అన్నవి?
(19) “కళావిదుడ” అని తిక్కన చెప్పిన మాట అర్థం
(20) కేతన తిక్కనను గూర్చి “కళా” పదాన్ని పెక్కుమార్లు ఎందుకు వాడాడు?
(21) పలనాటి యుద్ధం మతపరమైనదా?
(22) హరిహరనాథుడు తిక్కన సృజించిన దైవమా?
(23) భారతఘట్టాలలో నన్నయకు భిన్నంగా తిక్కన ఎందుకు వ్రాశారు?
(24) తిక్కన ఆరణ్యపర్వశేషాన్ని ఎందుకు తెలుగు చేయలేదు?
(25) భాస్కర రామాయణం వ్రాసిన భాస్కరుడెవరు?
(26) భాస్కర రామాయణం ఎవరు ఎంతెంత వ్రాశారు?
(27) ఎఱ్ఱన దృష్టిలో తిక్కనకంటె నన్నయకే ప్రాధాన్యం ఎక్కువా?
(28) ఎఱ్ఱన వాల్మీకి రామాయణానికి భిన్నంగా ఎందుకు వ్రాశాడు?
(29) నన్నయ తిక్కనలు వ్రాసిన ఘట్టాలకు అన్యవిధంగా ఎఱ్ఱన ఎందుకు వ్రాశాడు?
(30) ఎఱ్ఱన రామాయణం విడిగా ఉన్నదా? ఆరణ్యపర్వంలోని భాగమేనా?
(31) నాచన సోమన ఎఱ్ఱన వ్రాసిన వెంటనే మళ్ళీ హరివంశాన్ని ఎందుకు వ్రాశాడు?
(32) నాచన సోమన హరివంశాన్ని పూర్తిగా వ్రాశాడా?
(33) సోమన చెప్పిన లక్షణాలు కవిత్రయాన్ని విమర్శిస్తున్నాయా?
(34) సోమన హరిహరనాథునికే ఎందుకు అంకితం ఇచ్చాడు?
(35) రంగనాథ రామాయణం వ్రాసినది రంగనాథుడేనా?
(36) కాచవిభుడు – విఠలనాథుడు తెలుగులో మొదటి జంటకవులా?
(37) శ్రీనాథుని జననకాలమేది?
(38) శ్రీనాథుని జన్మస్థలం ఏది?
(39) శ్రీనాథుడు కర్ణాటుడా?
(40) శ్రీనాథునికి కనకాభిషేకం చేసిన కర్ణాటక్షితిపాలుడెవరు?
(41) శ్రీనాథుడు దర్శించిన సర్వజ్ఞ సింగమ నాయకుడెవరు?
(42) పలనాటి చరిత్రం శ్రీనాథుని గ్రంథమా?
(43) క్రీడాభిరామకర్త శ్రీనాథుడా?
(44) శ్రీనాథుని భీమేశ్వరపురాణం ఆంధ్రీకరణమేనా? కాదా?
(45) శ్రీనాథుని శివరాత్రిమాహాత్మ్యం అంకితమిచ్చిన గ్రంథమా?
(46) శ్రీనాథుడు చరమదశలో వ్యవసాయం చేశాడా?
(47) శ్రీనాథుడు ‘ఈశ్వరార్చనకళాశీలుడు’ అంటే శివోపాసకుడని అర్థమా?
(48) శ్రీనాథుడు శృంగారియా?
(49) శ్రీనాథుడు పోతన బావ-మఱదులా?
(50) పోతన జన్మస్థలమేది?
(51) పోతన భాగవతం శిథిలమైన గాథ సత్యమేనా?
(52) పోతన భాగవతాన్ని సంపూర్ణంగా అనువదించాడా?
(53) పోతన భాగవతం ఎవరికి అంకితం?
(54) పోతన వీరశైవుడా?
(55) భోగినీ దండకం పోతన రచనా?
(56) వీరభద్రవిజయం పోతన రచనేనా?
(57) నారాయణ శతకం పోతన వ్రాసినదా?
(58) “మొల్ల” అసలు పేరు అదేనా?
(59) మొల్ల “రసికుడైనట్టి శ్రీనాథు, రంగనాథు” అని వ్రాసిన విషయాలు ఎంతవరకు సత్యాలు?
(60) పినవీరభద్రుడు శ్రీనాథుని అపహాస్యం చేసిన మాట నిజం కావచ్చునా?
(61) అష్టదిగ్గజములు ఎవరు?
(62) ఆముక్తమాల్యద కృష్ణదేవరాయల రచనమేనా?
(63) నంది తిమ్మనకు ముక్కు తిమ్మన అని పేరెందుకు వచ్చింది?
(64) తిమ్మన పారిజాతాపహరణం వ్రాయటానికి ప్రచారంలో ఉన్న కారణం నిజమేనా?
(65) పెద్దన ఆంధ్రకవితాపితామహుడు ఎలా అవుతాడు?
(66) ‘భట్టుమూర్తి’ అన్నది పేరవుతుందా?
(67) భట్టుమూర్తి – రామరాజభూషణుడు ఒకరేనా?
(68) రామలింగడు – రామకృష్ణుడు ఒకరేనా?
(69) వేములవాడ భీమన ద్వ్యర్థికావ్యకర్తా?
(70) తెలుగులో మొదటి ద్వ్యర్థికావ్యం ఏది?
(71) ‘ప్రబంధ లక్షణాలు’ అనేవి ఉన్నాయా?
(72) సుమతీ శతక కర్త ఎవరు?
(73) వేమన ఎవరు? ఎప్పటివాడు?
(74) తాళ్ళపాక తిమ్మక్క అనే కవయిత్రి ఉన్నదా?
(75) ‘దక్షిణాంధ్ర యుగం – క్షీణయుగం’ అన్న విభజన సరైనదేనా?
(76) కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం పుష్పగిరి తిమ్మన రచనా?
(77) చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర ఎవరికి అంకితం?
(78) బాలసరస్వతి చెప్పిన సారంగధరుని చరిత్ర వాస్తవమేనా?
(79) సారంగధర చరిత్ర ఆంధ్రదేశానికి సంబంధించినదా?
(80) ‘ఆధునిక యుగము’ అన్న విభజన సమంజసమేనా?
(81) ‘ఆధునిక యుగము’ ఎప్పుడు ప్రారంభమైంది?
(82) ఆధునిక యుగకర్త ఎవరు?

ఈ ప్రశ్నలు జిజ్ఞాసువుల మనస్సులలో కుతూహలాన్ని ఉత్పాదిల్లజేశాక లక్ష్మీనారాయణ గారు ఎంతో శ్రద్ధతో ఉభయపక్షాల వాదసారాన్ని క్రోడీకరించి, తమ నిష్కర్షను పాండిత్యప్రకర్షతో గాక ప్రశాంతచిత్తంతో వివరిస్తారు. ఆసక్తి గలవారికోసం వారి సమాధానాలను ఒక్కొక్కటిగా ఇక్కడ సంక్షేపిస్తున్నాను. గ్రంథాన్ని చదివి సాధ్యనిర్దేశాలను, నిగమనాలను, అందుకు కారణాలను తెలుసుకోకుండా కేవలం ఈ వాక్యాలను మాత్రం చూసి ఆ విషయాలపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దని విద్యార్థులకు నా మనవి.

(1) కవులు, ప్రక్రియలు ఇత్యాదుల పేరిట గాక రాజవంశాల పేరిట సాహిత్యచరిత్రలో యుగవిభజన చేయటమే సక్రమపద్ధతి
(2) ఆంధ్రదేశంలో జైన బౌద్ధ గ్రంథాలను దగ్ధం చేసిన మాట నిరాధారమైన ఆరోపణ
(3) తెలుగులో నన్నయ గారే ఆదికవి
(4) నన్నయ భారతాన్ని రాజరాజుకు వినిపించటమే జరిగింది. అంకితం ఇవ్వలేదు
(5) అధర్వణుడు 13-వ శతాబ్దికి చెందిన కవి; అధర్వణ భారతం ఆదిపర్వం నుంచి శల్యపర్వం వరకు 25 పద్యాలు లభిస్తున్నాయి; ఛందోగ్రంథం దొరకలేదు; అధర్వణ కారికావళి అన్న గ్రంథం అహోబలపతి కూటసృష్టి
(6) కవిజనాశ్రయ కర్త మల్లియ రేచన; భీమన కాదు
(7) వేములవాడ భీమకవి కాలం క్రీ.శ. 1067-1140; గ్రంథాలు ఇదమిత్థంగా చెప్పలేము; సుమతి శతకం ఆయన కృతి అని కొందరన్నారు
(8) భారత రచనలో నారాయణ భట్టు పాత్ర ప్రోత్సహించటం వరకే గాని రచనలో కాదు
(9) నన్నయ ఆరణ్యపర్వ రచన (4-142) వరకే; సంపూర్ణంగా కాదు
(10) ప్రసన్నకథాకలితార్థయుక్తి పాఠమే సమంజసం
(11) ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది నాటి మరొక నన్నయ రచన
(12) వీరశైవవాఙ్మయం చారిత్రక పరిణామంలో వచ్చినదే కాని, అది నన్నయకు వ్యతిరేకం అన్న అభ్యూహ సరికాదు
(13) ‘మార్గ’ (తత్సమపదాల బాహుళ్యం) – ‘దేశి’ (దేశీయపదాల అల్లిక), ‘జానుతెనుగు’ (తేట తెలుగు)
(14) నన్నెచోడుడు 12-వ శతాబ్ది నాటివాడు
(15) నన్నెచోడుడు చెప్పిన ఎనిమిది కవితాలక్షణాలను గురించిన చర్చల పరిశీలన చాలా సుదీర్ఘం; ఆ లక్షణాలలో కొన్ని కవి ప్రాచీనతను స్థాపిస్తాయని వీరి వివరణ ఉన్నది
(16) ఇదొక సిద్ధాంతవ్యాసానికి సరిపడే సామగ్రి; తిక్కన తాతగారు భాస్కరుడు భాస్కర రామాయణ కర్త కావచ్చునా? అని పరిశీలించారు
(17) తిక్కన తాతగారు మంత్రి భాస్కరుడని, భాస్కర రామాయణం ఆయనదే అని ఉన్న వాదాన్ని మళ్ళీ ఒకసారి వేరే ప్రమాణాలతో చర్చించారు
(18) తిక్కన చెప్పిన కవితాలక్షణాలు కొన్ని నన్నయను, కొన్ని శివకవులను దృష్టిలో ఉంచుకొని అన్నవి
(19) “కళావిదుడ” అని తిక్కన చెప్పిన మాట అర్థం – సాహిత్యశిల్పం, సాహిత్య కళ, ఆనందోపదేశం తెలిసిన మనీషిని అని
(20) కేతన తిక్కన కళాసృష్టిని ప్రశంసించే అభిజ్ఞానంతోనే “కళా” పదాన్ని పెక్కుమార్లు వాడాడు
(21) పలనాటి యుద్ధానికి అధికారకాంక్ష, ఆధిపత్యనిరూపణ ప్రధానకారణాలు, మతద్వేషం ఆనుషంగికం
(22) సనాతనమైన హరిహరనాథతత్త్వానికి తిక్కన శాంతిసాధన నిమిత్తం ప్రాణంపోయటం జరిగింది
(23) భారతఘట్టాలలో నన్నయకు భిన్నంగా తిక్కన వ్రాయలేదు
(24) తిక్కన ఆరణ్యపర్వశేషాన్ని రాజరాజుకు గాక వేరొకరికి సమర్పించటం, పర్వ మధ్యంలో మొదలుపెట్టడం ఇష్టం లేక వదలివేసి ఉండవచ్చు
(25) భాస్కర రామాయణం వ్రాసిన భాస్కరుడు మంత్రి భాస్కరుడు; హుళక్కి భాస్కరుడు కాదు
(26) భాస్కర రామాయణం ఎవరు ఎంతెంత వ్రాశారో పెద్దల అభిప్రాయాలను, తమ నిర్ణయాన్ని వివరించారు
(27) ఎఱ్ఱన దృష్టిలో తిక్కనకంటె నన్నయకే ప్రాధాన్యం ఎక్కువా? అన్న విమర్శను త్రోసిపుచ్చారు
(28) ఎఱ్ఱన వాల్మీకి రామాయణానికి భిన్నంగా వ్రాయలేదని నిరూపించారు
(29) నన్నయ తిక్కనలు వ్రాసిన ఘట్టాలకు అన్యవిధంగా ఎఱ్ఱన వ్రాసినట్లు కనబడితే, అది వక్తృభేదం వల్లనే కాని, ఉద్దేశపూర్వకం కాదన్నారు
(30) ఎఱ్ఱన రామాయణం విడిగా ఉన్నదని ఊహించారు
(31) నాచన సోమన ఎఱ్ఱన వ్రాసిన వెంటనే మళ్ళీ హరివంశాన్ని వ్రాయటం కావ్యరచనలో తన ప్రత్యేకతను నిలుపుకొనేందుకే
(32) నాచన సోమన హరివంశం పూర్వభాగాన్ని వ్రాసి ఉండకపోవచ్చును
(33) సోమన చెప్పిన కవితాలక్షణాలు ఆయన ఆత్మీయతకు నిదర్శనలు; అవి కవిత్రయవిమర్శలు కావు
(34) తిక్కన తర్వాత తన స్థానాన్ని పదిలపరచుకొనేందుకు సోమన కావ్యాన్ని హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు
(35) రంగనాథ రామాయణం వ్రాసినది రంగనాథుడు కాదు; ఆయన ప్రచారం చేయటం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది
(36) కాచవిభుడు – విఠలనాథుడు విడివిడిగా వ్రాసినవారు; తెలుగులో మొదటి జంటకవులు కారు
(37) శ్రీనాథుని పుట్టుక క్రీ.శ. 1360 – 1385 నడిమి కాలం
(38) కృష్ణామండలం లోని కాళీపట్టణం శ్రీనాథుని జన్మస్థలం కావచ్చును
(39) శ్రీనాథుడు కర్ణాటుడు కాడు; అచ్చమైన ఆంధ్రుడు
(40) శ్రీనాథునికి క్రీ.శ. కనకాభిషేకం చేసిన కర్ణాటక్షితిపాలుడు 1412 వరకు ఉన్న మొదటి దేవరాయలు కాని 1422 వరకు ఉన్న రెండవ దేవరాయలు కాని ఎవరైనా కావచ్చును
(41) శ్రీనాథుడు దర్శించిన సర్వజ్ఞ సింగమ నాయకుడు క్రీ.శ. 1435 నాటి రెండవ సర్వజ్ఞ సింగమ నాయకుడు
(42) పలనాటి చరిత్రం శ్రీనాథుని గ్రంథమే
(43) క్రీడాభిరామకర్త శ్రీనాథుడు కాడు, వల్లభరాయలు
(44) శ్రీనాథుని భీమేశ్వరపురాణం ఆంధ్రీకరణ కాదు
(45) శ్రీనాథుని శివరాత్రిమాహాత్మ్యం ముమ్మడి శాంతయ్యకు అంకితమిచ్చిన గ్రంథమే
(46) శ్రీనాథుడు చరమదశలో వ్యవసాయం చేశాడని ఉన్నదంతా కట్టుకథ కావచ్చును; పుక్కిటి పురాణాలు చారిత్రకాధారాలు కాలేవు
(47) శ్రీనాథుడు ‘ఈశ్వరార్చనకళాశీలుడు’ అంటే శివోపాసకుడని కాదు; శివుని వర్ణించటం ఆయనకు ప్రీతిపాత్రమని
(48) శ్రీనాథుడు శృంగారియా? నిస్సందేహంగా శృంగారశేఖరుడే
(49) శ్రీనాథుడు పోతన బావ-మఱదులా? శ్రీనాథుని బావమరిది దగ్గుపల్లి దుగ్గనకు పోతన అని ఒక తమ్ముడున్నాడు; అది ఈ భ్రాంతికి మూలమై ఉండవచ్చును
(50) ఓరుగల్లు పోతన జన్మస్థలం
(51) పోతన భాగవతం శిథిలమైన గాథ సత్యమే; అందుకు కారణం ఓరుగల్లు పట్టణవినాశం
(52) పోతన భాగవతాన్ని సంపూర్ణంగా అనువదించాక శిథిలమైన భాగాన్ని ఇతరులు పూరించారు
(53) పోతన భాగవతం శ్రీకృష్ణ పరబ్రహ్మాత్మకుడైన శ్రీరామచంద్రునికి అంకితం?
(54) పోతన వీరశైవు డైనప్పటికి శైవవైష్ణవాలకు సారూప్యాన్ని భజించాడు
(55) భోగినీ దండకం పోతన బాల్యరచన
(56) వీరభద్రవిజయం పోతన రచనే
(57) నారాయణ శతకం పోతన చెప్పినది కాదు
(58) “మొల్ల” అసలు పేరు అదే; ‘మల్లి’, ‘మల్లమ్మ’ అనటం సరికాదు;
(59) మొల్ల “రసికుడైనట్టి శ్రీనాథు, రంగనాథు” అని వ్రాసిన విషయాలు కవితావిషయకాలు; సమంజసాలు
(60) పినవీరభద్రుడు శ్రీనాథుని అపహాస్యం చేసిన మాట నిజం కాకపోవచ్చును
(61) 55 పుటల బృహద్విమర్శ; అష్టదిగ్గజములు ఎవరో సవిస్తరంగా పరిశీలించారు
(62) ఆముక్తమాల్యద కృష్ణదేవరాయల రచనమే
(63) ముక్కు పెద్దది కావటం వల్ల కాబోలును, నంది తిమ్మనకు ముక్కు తిమ్మన అని పేరువచ్చింది
(64) తిమ్మన పారిజాతాపహరణం వ్రాయటానికి ప్రచారంలో ఉన్న కారణం నిజమే కావచ్చును
(65) కవికులానికి ఆరాధ్యుడు కావటం మూలాన పెద్దన ఆంధ్రకవితాపితామహుడు
(66) ‘భట్టుమూర్తి’ అన్నది పేరు కాదు; ఆయన పేరు ‘శుభమూర్తి’
(67) భట్టుమూర్తి – రామరాజభూషణుడు ఒకరే
(68) రామలింగడు – రామకృష్ణుడు ఒకరే
(69) వేములవాడ భీమన రాఘవపాండవీయం అనే ద్వ్యర్థికావ్యాన్ని వ్రాసి ఉండవచ్చును; దొరకలేదు
(70) తెలుగులో మొదటి ద్వ్యర్థికావ్యం పింగళి సూరన రాఘవపాండవీయమే
(71) ‘ప్రబంధము’ అనే ప్రక్రియ ప్రాచీనం; ‘ప్రబంధ లక్షణాలు’ అని మనము అంటున్నవి ఇటీవలి కాలంలో ఏర్పడ్డవి
(72) సుమతీ శతక కర్త (వీరు ‘సుమతీ శతకము’ అనే అన్నారు) బద్దెనా కాదు, వేములవాడ భీమకవీ కాదు; ఎవరో ఆ తర్వాతివారు
(73) వేమన క్రీ.శ. 1450 ప్రాంతాల యోగియై శివత్త్వప్రచారం చేసి పరమార్థజ్ఞానం పంచిపెట్టిన ప్రజాకవి
(74) సుభద్రాకల్యాణం ద్విపదకావ్యం చెప్పిన కవయిత్రి తిమ్మక్క సంకీర్తనాచార్యుడైన తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య తిమ్మక్క కాదు
(75) రాజవంశాల పేరిట యుగవిభజన చేసిన తర్వాత యుగలక్షణాలను పురస్కరించుకొని ‘దక్షిణాంధ్ర యుగం’ – ‘క్షీణయుగం’ అని విభజన చేయటమే సమంజసం
(76) కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం పుష్పగిరి తిమ్మన రచన కాదు; పాపరాజుదే
(77) చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర రఘునాథరాయలకే అంకితమని భావించాలి
(78) బాలసరస్వతి చెప్పిన సారంగధరుని చరిత్ర వాస్తవమేనా?
(79) సారంగధర చరిత్ర ఆంధ్రదేశానికి సంబంధించినది కాదు; మాళవ దేశపు కథ
(80) ‘నవ్య సాహిత్యయుగము’ అనటం కంటె ‘ఆధునిక యుగము’ అనటమే మేలు
(81) ‘ఆధునిక యుగము’ ఎప్పుడు 1875లో ప్రారంభమైందని వీరు నిర్ణయించారు
(82) ఆధునిక యుగకర్త కందుకూరి వీరేశలింగం గారు.

ఈ వివేచన మూలాన ప్రాఙ్నన్నయకాలం మొదలుకొని ఆధునికయుగం వరకు తెలుగు సాహిత్యచరిత్ర విషయమై విద్వాంసులకున్న భిన్నాభిప్రాయాల స్వరూపస్థితి పాఠకులకు తెలిసివస్తుంది. విద్యార్థులు తమదైన విశిష్టాభిప్రాయాన్ని స్వతంత్రంగా ఏర్పరచుకొనేందుకు ఈ పరిశీలన ఉపకరిస్తుంది. ఎక్కడికక్కడ ఆధారగ్రంథాలను పేర్కొనటం వల్ల మరింత తరచి చూడాలనుకొనేవారికి ఆ సమాచారం తోడ్పడుతుంది.

సాహిత్యచరిత్రలో మొత్తం ఉన్న చర్చనీయాంశాలు ఇవేనా? అంటే, ఈ పట్టికలో లేని సమస్యలకు ఎంతో కొంత సంతృప్తికరంగా సమాధానాలు దొరికాయని, వాటిని మళ్ళీ తవ్వి తలకెత్తుకొని పునర్విచారం చేయవలసిన ఆవశ్యకత లేదని, లక్ష్మీనారాయణ గారి ఉద్దేశమై ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ముఖ్యవిషయానికి అనుబంధంగా అటువంటి కొన్ని ప్రాస్తావికాంశాలను ఆయన వివరింపకపోలేదు. అధర్వణుడు రచించిన భారతం సంగతి నిజమేనా? అని చర్చించినపుడు ఆయన ముఖ్యశీర్షికలో పేర్కొనకపోయినా, అధర్వణుని ఛందోగ్రంథం ఒకటుండేదా? అనికూడా చర్చించారు. తథ్యమిథ్యావివేచన చేసి పరిష్కారాన్ని ప్రతిపాదించారు. తిక్కన కవిసార్వభౌమచ్ఛందస్సు, నన్నెచోడుని కళావిలాసం, శ్రీనాథుని గాథాసప్తశతి, ధనంజయవిజయం, చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనం, పింగళి సూరన గిరిజాకళ్యాణం మొదలైన అంశాల వివాదం సామాన్యవిద్యార్థులకు అనవసరం అని, ఆ వాదాల పునరుక్తి సరికొత్త ఆలోచనకు దారితీయదని లక్ష్మీనారాయణ గారు అనుకొని ఉంటే అది సమంజసమే.

గ్రంథాన్ని చదువుతున్నపుడు లక్ష్మీనారాయణ గారి విస్తారమైన అనుభవం, తర్కసంగతి, నిష్పక్షపాత ధోరణి, పూర్వపక్ష సిద్ధాంతాలను ఒక చారిత్రికక్రమపరిగతితో ప్రతిపాదించిన తీరు, ఎక్కడా నిష్ఠురత లేని సమన్వయసరణి ఆకట్టుకొంటాయి. ఒక్కొక్క వివాదచరిత్రను పునరవలోకించే ముందు ఉపలభ్యమైన సమస్తగ్రంథజాతాన్ని సాకల్యంగా పరిశీలించి ఉండటం పరిశోధకులకు ఉత్తేజకంగా ఉంటుంది. 1987లో గుంటూరులో తొలిసారి వారింటికి వెళ్ళినపుడు అతివిశాలమైన అయిదంతస్తుల ఇల్లంతటా నిండి ఉన్న అనర్ఘమైన వారి పుస్తకసంచయాన్ని చూసినప్పుడు కళ్ళు చెదిరినట్లయి నాకు నోట మాట రాలేదు. ఆ సేకరణ ఫలం, ఆ అధ్యయనఫలం ఇందులో అడుగడుగున ప్రతిఫలించాయి.

సర్వే సర్వత్ర లక్ష్మీనారాయణ గారు ప్రతివచనీయం ఉన్న చోట్లలో పూర్వాపరాలను ఎంతో జాగ్రత్తగా సమీక్షించుకొని ఒక నిర్ణయానికి వస్తారు. సాహిత్యచరిత్రను వినిర్మించిన కందుకూరి వీరేశలింగం గారు, చాగంటి శేషయ్య గారు, ఆరుద్ర గారు వంటి పెద్దల భావాలను క్రోడీకరించి సమాధేయాన్ని వివరింపవలసి వచ్చినప్పుడు మాత్రం కొంత అధికంగా ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి తెలుగు సాహిత్యచరిత్ర ప్రభావం కనబడుతుంది. వారిపై లక్ష్మీనారాయణ గారికున్న ప్రామాణ్యభావం, శిష్యత్వం అందుకు కారణాలు. అట్లాగని కుమారసంభవం కావ్యకర్త నన్నెచోడుడు కాదని, మానవల్లి రామకృష్ణకవి గారే కూటసృష్టి చేశారని శ్రీరామమూర్తి గారు చేసిన సిద్ధాంతాన్ని వీరు అంగీకరింపలేదు. నన్నెచోడుడే కావ్యకర్త అని, ఆయన క్రీ.శ. 12-వ శతాబ్ది నాటి వాడని నిర్ధారించారు. తన వాదం కాలపరీక్షకు నిలబడుతుందో లేదో అన్న సందేహం ఇంకా మిగిలి ఉండటం వల్ల కాబోలు, “ఇది సిద్ధాంతము కాకపోవచ్చును. బలవదాకృష్టశిల్పము మాత్రము కాదు. సత్యస్థాపన సంకల్పము” అని ముగించారు.

అష్టదిగ్గజాలు ఎవరు? అన్న చర్చలోనూ వీరు తొలినాటి విమర్శకుల అభిప్రాయాలను అంగీకరింపక స్వయంగా పరిశోధనకు పూనుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కృష్ణరాయభూషణుడు దిగ్గజస్థానభూతుడన్న శ్రీరామమూర్తి గారి వాదాన్ని సప్రమాణం కాదంటూ సున్నితంగానే తిరస్కరించారు. ఇవన్నీ లక్ష్మీనారాయణ గారి పరిశోధన తాత్పర్యానికి, నిర్భీకతకు, సత్యనిష్ఠకు నిదర్శనాలు.

ఇంత పటిష్ఠమైన ప్రణాళికతో, ఇంత శాస్త్రీయసంవిధానంతో వాదవివాదాల స్వరూపాన్ని వివరించిన రచనలో అక్కడక్కడ “ఫలానా వారి మాట యథార్థము”, “ఫలానా వారు ఫలానా వారి వాదమును పరాస్తము చేసిరి” వంటి కవితాత్మక వాక్యాలు అసంగతా లనిపిస్తాయి. వాదసమీక్షలలో యథార్థం, కథార్థం నిత్యసత్యాలు కావు. సాహిత్యచరిత్ర విమర్శలో లోచూపు వల్ల, సరికొత్త సమాచారం లభించటం మూలాన ఒకనాటి నమ్మకాలు వేరొకప్పుడు సడలిపోతుంటాయి. వాదిని పరాస్తం చేయగలము కాని వాదానికి అస్తంగతత్వం ఉండదు. అందులోనూ ప్రత్యక్షప్రమాణం లేని అతీతకథానకాన్ని అభ్యూహించే ప్రయత్నంలో వాదబలం, వాదిబలం అన్నవి ఎల్లపుడు ఉంటాయి. ఎప్పటికప్పుడు పునరవలోకించటమే కాని, తుది తీర్పు అన్నది విమర్శలో సాధ్యం కాదు. కాలాంతరయోగ్యత అన్నది విమర్శకులకు ఒక అందమైన ఆదర్శం మాత్రమే. అంతరంగదర్శనం ప్రకాశవిమర్శను ఉద్దీపింపజేయటం వల్లనే సాహిత్యం, సాహిత్యవిమర్శ పారస్పరికతను సంతరించుకొంటాయి.

ఇంతటితో ఈ వివాదాంశపటలం ఒక ముగింపుకు వచ్చిందనుకోకూడదు. నన్నెచోడుని కాలం, కర్తృత్వం మొదలైన వివాదం ఇప్పటికీ ఎంతో కొంత రగులుతూనే ఉన్నది. ఆంధ్రశబ్దచింతామణి నన్నయ రచనమని, ఆముక్తమాల్యద కృష్ణదేవరాయల రచన కాదని, రంగనాథ రామాయణ కర్త రంగనాథుడే అని, జక్కన శ్రీనాథునికి పూర్వుడని, క్రీడాభిరామం శ్రీనాథుని రచనే అని నమ్మేవారున్నారు. వారిని ‘మృతసర్పతాడనవినోదులు’ అని వెక్కిరించటం సులభం. మళ్ళీ ఆ అభిప్రాయాలపై పరిశోధనలు తప్పవు. ఎవరి సాధనసంపదతో వారు సత్యజ్యోతిని వెలిగించే ప్రయత్నం చేయక మానరు. ఆ ఉద్యత్నక్రమానికి పురోవచనికగా లక్ష్మీనారాయణ గారి కృతి నెమరుకు వస్తూనే ఉంటుంది.

సాహిత్యచరిత్ర విషయమై విద్యార్థిత్వం గల విద్యార్థులు నియతంగా చదివి తీరవలసిన మేలి రచనమిది.

… … … … … … … … … … … … … … … … … …

డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ గారు 1940లో జన్మించారు. పద్యకవిగా మంచి పేరుతెచ్చుకొన్నారు. సాహిత్యాసభలలో వీరు చెప్పిన పద్యాల సంకలనం ‘చతురాస్య’ 1998లో వెలువడింది. ఆదిభట్ల నారాయణదాసు గారిని గురించిన వీరి సిద్ధాంతవ్యాసం ‘నారాయణదర్శనము’ సుప్రసిద్ధం. కొప్పరపు సోదరకవుల రచనలను వెలుగులోకి తెచ్చారు. ‘తిరుపతివేంకటీయము’, ‘పంచముఖి’, ‘కళాకేళి’ ముఖ్యరచనలు. ఉత్తమ అధ్యాపకులు, అవధాని, రంగస్థలనటులు, సంభాషణచతురులు. 1997లో శ్రీనాథుని ‘భీమేశ్వరపురాణము’ను ‘దక్షిణకాశికా వ్యాఖ్య’తో ప్రకటించారు. అధికకాలం గుంటూరు జె.కె.సి. కళాశాలలో పనిచేసి 1998లో పదవీ విరమణ చేశారు. ‘తెలుగు సాహిత్యములో సందేహ ధోరణులు – సమన్వయ సరణులు’ 2005లో వెలువడింది. డెబ్భయ్యవ యేట మరణించారు.

You Might Also Like

6 Comments

  1. రాంభట్ల వేంకటరాయ శర్మ

    చక్కని వ్యాసమును అందించినందుకు ముందుగా ధన్యవాదములు… ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుందో తెలియజేయగలరు…

  2. G K S RAJA

    లక్ష్మీనారాయణ గారి బృహద్గ్రంధంపై సమీక్ష వ్రాయడానికి తగు సరంజామా అంతా వ్యాసకర్త ఏల్చూరి వారి దగ్గర ఉండడం ఎన్నదగిన విషయం. మీ వ్యాస పటిమ ఆరుద్ర గారి డిటెక్టివ్ సాహిత్య సమీక్ష లో ప్రస్ఫుటం గా కనబడింది. ఈ పుస్తకం విద్యార్ధిత్వం వలసినవారు చదవాలని మీరు సూచించినందుకేమో, విద్య ‘అర్ధి’ ని కావాలని ఉర్రూతలూగిస్తోంది. ఆలస్యంగా అయినా మంచి వ్యాసం చదవగలిగాను. అందించినందుకు ధన్యవాదాలు.
    నిన్ననే బావురుమంటున్న బార్న్స్ అండ్ నోబెల్ పుస్తకాలయాన్ని చూసి మనస్సు చివుక్కుమంది. 2005 లో ముద్రితమయిన ఈ పుస్తకం గురించి ఇంతవరకు నాకు ఏ మాత్రం ఎరుక లేదు. ఇటువంటి పుస్తక సమీక్షలు, పరిచయాలు అటు గ్రంధకర్తలకూ, పుస్తకప్రియులకూ కూడా ఎంతో ఉపయుక్తం. ఇట్టివి మీరు కొనసాగించాలని కోరుకుంటూ…
    రాజా.

  3. Jampala Chowdary

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు.

  4. Halley

    చూడబోతే ఇది ఏదో చాలా మంచి పుస్తకం లాగా ఉందే! మంచి పరిచయం. పుస్తకం కొని చదవాలి అని అనిపించేటట్టుగా ఉంది

  5. Saikiran

    అష్టదిగ్గజ కవుల గురించి తప్ప, దాదాపు ఈ విషయాలు డా.పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్రలో చర్చించారు. ప్రాఙ్నన్నయ యుగం నుంచి… నన్నయ, శివకవి, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాధుడి యుగందాకా కొనసాగిన ఆ పుస్తకం శ్రీకృష్ణదేవరాయల యుగ ప్రస్తావనతో ఆగిపోతుంది. ఆ యుగంలోని కవుల విషయాలు ఎందుకో అసలు చర్చించినట్లు లేదు.

    పింగళిగారి అభిప్రాయంలో, “కావున, నన్నయ ఆదికవి కాకపోయిననూ భారతము ఆదిగ్రంథమని (తెలుగులో) ఇప్పటికి అంగీకరింపక తప్పదు” అన్నారు.

    మంచి వ్యాసంతో, మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు.

    1. kv ramana

      ఈ వ్యాసాన్ని ఆలస్యంగా చూశాను. సాహిత్య చర్చలో వాద వివాదాలను ఒకచోట చేర్చడం బాగుంది. పరిశోధకులకు ఉపయోగపడుతుంది. ఒక సందేహం. నన్నయ ఆదికవి కాకపోయినా భారతం ఆదిగ్రంథం అని పింగళి వారు అన్నట్టు రాశారు. ఇందులోని తిరకాసు ఏమిటో? భారతం ఆదిగ్రంథం అయితే నన్నయ ఆదికవి ఎందుకు కారు? నన్నయకు ముందు కవులు ఉన్నారు కనుక ఆయనను ఆదికవి అనకూడదని పింగళి వారి ఉద్దేశం అయితే, అసలు ఆదికవి అని ఎవరిని అనగలం? ఆదిగ్రంథాన్ని బట్టి ఆదికవిని గుర్తించలేకపోతే అసలు ఆదికవి అని ఒకరిని గుర్తించడమే కష్టం. కనుక నన్నయను ఆదికవి అనడమే న్యాయం. కాదంటారా?

Leave a Reply