తెలుగు నాటక వికాసంలో రేపల్లీయుల పాత్ర
వ్యాసకర్త: రాయదుర్గం విజయలక్ష్మి
*********
‘కావ్యేషు నాటకం రమ్యమ్ ‘ అన్నది ఆలంకారికాభిప్రాయం. నాటక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, మారుమూల పల్లె ప్రాంతాలలోనే గాక. జాతీయ, అంతర్జాతీయవేదికల మీద కూడ రాణిస్తూ, పద్య నాటకాన్ని, యీ వర్తమాన ఆధునిక యుగం లో కొనసాగించే కృషిలో భాగస్వాములుగా నున్న వారు మన్నె శ్రీనివాసరావు గారు. నాటకరంగాన్ని అనుపమానంగా అభిమానించే వీరు, తన ప్రాంతం రేపల్లె లోని నాటక ఆరంభ వికాసాలను పరిశీలించే నేపథ్యం తో వ్రాసిన గ్రంథం, ‘రేపల్లె రంగస్థలి ‘ అనే బృహద్గ్రంథం.
తెలుగు నాటక రంగ వికాసాన్ని గూర్చి క్లుప్తం గా చెప్తూ, రేపల్లె లోని నాటక రచయితలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులూ, నాటక సమాజాలు, నాటక పరిషత్తులు,నాటక పరిశోధకులు, విమర్శకులు, నాటక కళాక్షేత్రాలను ఏర్పరచి, నాటక ప్రయోగాన్ని సుసాధ్యం చేసుకునే వీలు కలిగించే నాటక కాంట్రాక్టర్ల వివరాలను కూడా విడిచి పెట్టని ఈ గ్రంథం నాటక ప్రదర్శనపై రచయితకు గల అభినివేశానికి అద్దం పడుతోంది.
రేపల్లెను జన్మస్థలంగా కలిగిన వారే గాక, యితర ప్రాంతాల లో జన్మించి, రేపల్లె లో స్థిరపడి, నాటకాభివృద్ధికి కృషి చేసిన వారు, యిక్కడ స్థిరపడక పోయినా, యిక్కడి నాటక సమాజాల్లో సభ్యులయి, నాటకాన్ని పెంచి పోషిస్తున్న ఔత్సాహిక కళాకారులు –వంటి వారి వివరాలను శ్రమకోర్చి,సేకరించిన మన్నె శ్రీనివాస రావుగారి కృషి అద్వితీయం. ఒక విశ్వవిద్యాలయ పరిశోధకుడు చేయవలసిన కృషిని, వృత్తి వేరయినా, నాటకాభిమానమనే ప్రవృత్తి కలిగినవారు కాబట్టి, క్షేత్రపర్యటన ద్వారా ఎన్నో విలువైన వివరాలను సేకరించి, రేపల్లె ప్రాంతపు నాటకరంగ చరిత్రను కన్నులకు కట్టించారు. నాటక పరిశోధకులకు ఒక మౌలికమయిన ఆకర గ్రంథంగా ఉన్న యీ గ్రంథాన్ని చదివిన తరువాత, ఆంధ్రదేశపు ప్రతి మారుమూలప్రాంతపు కళాకారులను గూర్చి, యిటువంటి పుస్తకం రావలసిన ఆవశ్యకతను గుర్తిస్తాము.
దాదాపు మూడువందలమూడుకు పై బడిన గ్రామాలున్న రేపల్లెలో నాటక సమాజం నెలకొల్పబడి, పద్ధతి ప్రకారం నాటకాలు ఉజ్జ్వలంగా ప్రదర్శింఫబడుతున్న గ్రామాలు ముప్ఫైఅయిదు ఉన్నాయి అనడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, నేటివరకు ఒక్క నాటల ప్రదర్శనకు కూడా నోచుకోని గ్రామాల సంఖ్య ముప్ఫైనాలుగు ఉన్నాయి అనడం అంతే ఆవేదనను కలిగిస్తుంది. నాటకాన్ని నేటికీ ఆదరిస్తున్న అరవయినాలుగు గ్రామాల చరిత్రను క్షుణ్ణంగా వివరించిన యీ ‘రేపల్లె రంగస్థలి’ గ్రంథాన్ని చదువుతున్నంతసేపు, నాటకరంగ గత వైభవాలతోబాటు, రేపల్లె ప్రజల ఉత్తమ నాటకాభిరుచి కూడా మనలను ఆనందంలో ముంచెత్తుతుంది.
మారుమూల గ్రామాలలో శతాబ్దాల నుండి జరుగుతున్న నాటక కృషిని వెలికితెచ్చినందుకు, వందలాదిమంది గ్రామీణ కళాకారుల జీవన చిత్రాలను ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేస్తున్నందుకు, యీ గ్రంథం పట్ల యెనలేని మమకారం కలుగుతుంది. కాలిన్ మెకంజీ చెప్పినట్లు .. గ్రామీణ చరిత్రలు వ్రాయించి, ఆ చరిత్రలనన్నిటినీ క్రోడీకరిస్తే, దేశ చరిత్రలు రూపొందుతాయన్నట్లు, తెలుగు నాటకరంగ చరిత్రలో గ్రామీణ ప్రాంతాలలో విలసిల్లిన నాటక కళాభివృద్ధిని సేకరించవలసిన ఆవశ్యకతను యీ ‘రేపల్లె రంగస్థలి’ నొక్కి చెబుతుంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన రంగస్థలిగా పేరొందిన నాగార్జున కొండలోని రంగస్థలమూ, గ్రీకులోని రంగస్థలమూ – వంటి ఛాయాచిత్రాలు, ఆంధ్రదేశంలో నిర్మించవలసిన శాశ్వత రంగమంటపాల ఆవశ్యకతను గుర్తుచేస్తాయి.
అంతేకాదు. ఆధునికయుగంలో వ్యాపించిన మైమ్ వంటి భేదాలనే గాక, ఆశునాటకం (ఎక్స్-టెంపోరల్) లో సి.యస్. నారాయణ ప్రభృతులు రాష్ట్రస్థాయిలోనే గొప్ప ప్రఖ్యాతిని గడించగా, వారికి ధీటుగా రాణిస్తూ, తన శిష్యులలో పలువురిని యీవిభాగంలో, మన్నె శ్రీనివాసరావు తీర్చిదిద్దుతున్నారనడం, …ప్రజలే నటులుగ రంగస్థలం.. (‘థియేటర్ బై ది పేపుల్’) అనే విశిష్ట కళాప్రక్రియలో భాగంగా ‘జనసాహితీ సాంసృతిక సమాఖ్య’ రాష్ట్రచరిత్రలోనే మొట్టమొదటి సారిగా కొత్తపాలెం లోని ఉప్పుకొఠార్ల కార్మికుల సమస్యలపై, స్థానిక ప్రజలతోనే ఆశువుగా నాటికనురూపొందించి ప్రదర్శించారనడం (1978) ……వంటి ఎన్నో కొత్త విషయాలను అందిస్తూందీ గ్రంథం.
ఈ ప్రాంతాల విలసిల్లిన నాటకరంగ చరిత్రను గ్రామాల వారీగా విభజించుకుని ఆయా ప్రాంతాలలో జరిగిన నాటకాభివృద్ధిని, యీ ప్రాంతాలలో జరిగిన తొలి నాటక ప్రదర్శన మొదలుకొని ఎన్నో ఆసక్తికరమయిన అంశాలను grass root level లో పరిశోధించి, నాటకరంగ చరిత్ర నిర్మాణంలో కొత్త మార్గాన్ని నిర్దేశించే మార్గసూచిగా యీ గ్రంథాన్ని తీర్చిదిద్దడంలో రచయిత చూపిన ప్రతిభ పేర్కొనదగినది.
యేర్లగడ్డ రాఘవయ్యగారు, తానే రాసి, దర్శకత్వం వహించి, కథానాయకునిగా ప్రదర్శించిన, ‘డెల్టారైతు’ అన్న నాటకమే రైతు జేవితేతివృత్తంతో వెలసిన తొలినాటకం అనడం మాత్రమే గాక, యీ ఇతివృత్తంతో ప్రదర్శింపబడిన (28-12-1928) తొలి నాటకం కూడా అనడం ఆసక్తి గొలిపే విషయమే! ఇలాంటివే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు యీ గ్రంథం నిండా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలలో తొలి పాఠ్యగ్రంథాలుగా ఆమోదింపబడిన, {సీజరు చరిత్రము (1879), ఉత్తరామచరిత్రము (1890), మృచ్ఛకటికము (1897 ),(మదరాసు విశ్వవిద్యాలయం)} నాటకాల రచయిత వావిలాల వాసుదేవశాస్త్రిగారేననడం; లలిత కళలు అయిదింటిలోనూ ప్రవేశమున్న ఏకైక రంగస్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మాత్రమే ననడం; ప్రపంచ నాటకోత్సవాలలో ప్రదర్శింపబడిన తొలి చారిత్రిక నాటకం మన్నె శ్రీనివాసరావుగారి ‘సమ్రాట్ అశోక’ అనడం; తెలుగు నాటకరంగచరిత్రను గురించి ఆంగ్లంలో రచింపబడిన తొలిగ్రంథం గండవరం సుబ్బరామిరెడ్డిగారి ‘The Glimpses of Telugu Drama ‘ అనడం; దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆంగ్లంలోకి అనువదించిన నందికేశ్వరుని ‘అభినయదర్పణం ‘ కేంబ్రిడ్జ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1917 లోనే ప్రచురింపబడి, ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో భద్రపరుపబడి ఉన్నదనడం …… యిలా ఎన్నెన్నో ఆసక్తికరమైన, విలువయిన అంశాలను అందించడమే కాదు, ఎన్నో అరుదయిన చాయాచిత్రాలు కూడా పొందుపరచబడి కనులకు, మనసుకు కూడా అమేయమైన ఆనందాన్ని కలిగిస్తున్న యీ ‘రేపల్లె రంగస్థలి’ దాదాపు ఆరువందల పుటలతో అలరారుతూ , నాటకాన్ని అభిమానించే వారి దగ్గర మాత్రమే కాదు, విశ్వవిద్యాలయ లైబ్రరీలలో సైతం ఆధారగ్రంథంగా ఉండవలసిన గొప్ప గ్రంథం అన్న మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రతులకు:
మన్నె లక్ష్మి, మన్నె వెంకటేశ్వర్ల్లు మెమోరియల్ ట్రస్ట్,
రెండవ అంతస్థు-ఫ్లాట్ నెంబరు – 166/576,
వేజళ్ళ అపార్ట్ మెంట్స్ , ఇసుకపల్లివారి వీధి
రేపల్లె – 522265
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రచురణ; 2013
మూల్యము; రూ – 600 /-
బెహరా వెంకట లక్ష్మీ నారాయణ
సమీక్ష చాలా బాగుంది..వెంటనే పుస్తకం చదవాలనిపించింది..మన్నె వారికి అభివాదాభినందనలు..వారి కృషికి నమస్సులూ
narasingh- bapatla
Vijayalakshmi Garu wrasina visleshana grandham gurinchi chaala chakka ga parchayam chesinadi.
Ilanti Books ni sahitya , nataka , charitra praiyuluandaru anadharu koni chadivethe
\
Rachiyata ki , sahiti prapanchaniki melu-
– Narasingh , bapatla
tahiro
vijayalaksmi gaari parichayam baagundi. okka repalle kaadu prati mandalam vaalloo elaanti prakriya chepadite mana telugu lo rangastala natula puttu poorvottaraalu lokaaniki cheruthai. pustakaanni samagrangaa, saralangaa, paaradarshakangaa cheppaaru.
– tahiro