“ఆనంద” దాయకం

వ్యాసకర్త: త్రివిక్రమ్

*******
చందమామలో కథలు చదువుతూ పెరిగి, కొంచెం పెద్దయ్యాక కథలు రాయాలనే ఉబలాటం కలిగినవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటివారిలో రచయితలుగా కొనసాగేవాళ్లు మాత్రం తక్కువమందే. అలాంటి రచయితల్లో బాలసాహిత్యానికి కట్టుబడినవారు మరీ అరుదు. అలాంటి అరుదైన రచయితల కోవకు చెందినవారు దాసరి వెంకట రమణ. వీరి మొదటి కథల సంపుటి “అమ్మ మనసు”. అది అతి త్వరలోనే నాలుగు పునర్ముద్రణలకు నోచుకోవడమేగాక నాలుగు అవార్డులు కూడా పొందింది. ఆయన వెలువరించిన రెండవ కథాసంపుటి ఆనందం. బాల సాహిత్యంలో ఒక రచయిత ఇంత త్వరగా రెండో కథాసంపుటి వెలువరించడం ఆనందమే (ప్రథమ ముద్రణ 2009 నవంబర్).

బాలసాహిత్యమంటే ఆబాలగోపాలాన్నీ అలరించగలిగేలా ఉండాలి. వయసుకతీతంగా పాఠకుల్లోని పసిమనసును వెలికితీసి ఆటాడించగలిగేలా ఉండాలి. వినోదమే ప్రధానమైనప్పటికీ విజ్ఞాన వికాసాలకూ చోటుండాలి. సర్వలక్షణ విలసితమైన బాలసాహిత్య సృజన పిల్లాట కాదు. ఈ సంపుటిలోని అన్ని కథల్లోనూ ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని చిన్నచిన్న లోపాలూ లేకపోలేదు.

ఈ సంపుటిలోని మొదటి కథ ‘ఆనందం’లో ధనార్జనే పరమావధిగా భావించే మామ, స్థిరాదాయం కలిగి ఉండి, భార్యాపిల్లల సాన్నిధ్యంలో పొందే ఆనందం అంతకంటే విలువైనదని భావించే అల్లుణ్ణి రెచ్చగొట్టి, తన కూతురు-అల్లుడు డబ్బు సంపాదనలో తలమునకలయ్యేలా చేసి, సరైనదారిలోకొచ్చారని తృప్తిపడతాడు! ఐతే వ్యాపారంలో తనే బోల్తా పడితే ఆ అల్లుడు తన వ్యాపారాన్ని మామకప్పగించి, తను వదిలేసొచ్చిన ఆనందం కోసం తన దారిలోకి తిరిగి వెళ్తాడు. ఇక్కడ చేసే పనేదైనా పూర్తి శ్రద్ధతో చేయడం, చిన్నచిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ చూపడం అల్లుడి విజయరహస్యంగా సూచించడం బాగుంది కానీ ఆ లక్షణాలు లేకుండానే అంతవరకూ మామ లాభాలెలా ఆర్జించగలిగాడో అర్థం కాలేదు.

రెండో కథ ‘తెలివైనవాడు’లో సోమసుందరుడు, సారంగుడు ఒకరికి మించి మరొకరు తెలివైనవాళ్ళు. ఇద్దరికిద్దరూ తమ తెలివిని అవతలివాళ్ళపై తెలివిగా ప్రయోగించి వాళ్ళను తమ అవసరాలకు తెలివిగా ఉపయోగించుకుని ఒకరి ద్వారా ఇంకొకరు తమ అవసరాలను తీర్చుకుంటారు! 🙂

ముందుమాటలో వసుంధర గారన్నట్లు కథకు పేరు పెట్టడమే ఒక కళ అని నూటికి నూరుపాళ్ళు అనిపించే కథ ‘మేలుకుట్టినదొంగ’. తేలు కుడితే ఆ బాధ కాసేపే. దొంగకు/ద్రోహికి మేలు కుడితే ఆ వేదన ఎప్పటికీ తీరనిది. దానికి చక్కటి కథారూపం ఇచ్చారు రచయిత.

‘రూపాయి సమస్య’ మొహమాటం వల్ల కలిగే నష్టాన్ని చక్కగా వివరిస్తుంది. అనదలచుకున్న మాటా, చెయ్యదలచుకున్న పనీ మొహమాటం వల్ల మనసులోనే ఆగిపోయి సీసాలో బంధించబడిన దయ్యాల్లా లోపల్లోపలే మనసుకు ఒత్తిడి కలిగించి అశాంతిని పెంచుతాయి. వాటికా అవకాశం ఎందుకివ్వడం?

‘అసూయ’ కథ బాగుంది. ఈ కథలో బ్రహ్మ తన గురించి తపస్సు చేసిన శివుడనే భక్తుడి గురించి సరస్వతితో “వాడికి నీ అనుగ్రహం లభిస్తుందంటే వాడికి కోరినదిస్తాను” అంటాడు. “నీ భక్తుడు మొదటి రకమైతే నా అనుగ్రహం తప్పక ఉంటుంది” అంటుంది సరస్వతి. ఇద్దరి బుద్ధులను పూర్తిగా దహించివేసిన శివుడి అసూయ రెండో రకమన్నది స్పష్టం. అంటే అతడికి సరస్వతి అనుగ్రహం ఉండకూడదు. కాబట్టి బ్రహ్మ అతడికి కోరినది ఇవ్వనవసరమూ లేదు. అయినా “తథాస్తు” అని ఎందుకన్నాడో అస్పష్టం.

అమాయకంగా కనిపించే ఉత్తముడు ఊరందరికీ లోకువ. ఆ ఉత్తముడికి వ్యవహారజ్ఞత అలవడితే… అతడు ఉన్నతుడౌతాడు. అంటే వ్యవహారజ్ఞత లోపించినవాడికి ఎన్ని ఉత్తమ గుణాలుంటే లోకుల దృష్టిలో వాడంత ‘ఉత్త’ముడని తెలిపే కథ ‘ఉత్తముడు’.

ఇప్పుడంటే పిల్లలకు చిన్నప్పట్నుంచే పాకెట్ మనీ ఇస్తున్నారు. వెనుకటి తరం వారికి – అందునా పల్లెటూళ్ళలో – ఈడొచ్చాక కూడా వ్యక్తిగతఖర్చులకు పైకం అందుబాటులో ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో అవసరార్థం ఇంటో బయటో చిన్న చిన్న దొంగతనాలు చెయ్యడం ఒక దారి. అలా వేరే దారిలేక, చేసింది దొంగతనమైనప్పటికీ అందులో చూపిన అసాధారణ శక్తిసామర్థ్యాలకు గుర్తింపు ఉండకపోదు! అదే ‘తండ్రి కానుక’ కథ.

పేరుకు, కథాంశానికి సంబంధం ఉన్నట్లనిపించని ‘కూర్మావతారం’ కథలో కోపం ప్రధానాంశం. మాటల్లో గానీ, చేతల్లో గానీ ఎదుటివారి నుంచి మనం ఆశించే ప్రవర్తన(expected behaviour)కూ, వారి వాస్తవ ప్రవర్తన(actual behaviour)కూ మధ్య తేడా ఎక్కువయ్యే కొద్దీ ఆ తేడాలోని తీవ్రత మనలో కలిగించే desperation (నిస్పృహ?) కోపం రూపంలో బయటపడుతుంది. దీనికి బాహ్య పరిస్థితులతో సంబంధం లేదు. ప్రయత్నం మీద ఎవరైనా దీన్ని నియంత్రించుకోవచ్చు కూడా. ఐతే ఇంకోరకం కోపం కూడా ఉంది. ఎదుటివారి నుంచి మనం ఆశించే ప్రవర్తనను రాబట్టడం కోసం “ప్రదర్శించే” కోపం. ఈ కోపాన్ని ప్రదర్శిచేటప్పుడు ప్రేక్షకులు లేకపోతే? చప్పగా చల్లారిపోతుంది. కూర్మావతారం కోపం అలాంటిదే.

ఆటేదైనా సరైన ప్రత్యర్థితో అడినప్పుడు, అభ్యాసం వల్ల మన ప్రతిభ దానంతటదే మెరుగుపడుతుంది. ఇరుపక్షాలనుంచీ ఆటలో ప్రదర్శితమౌతున్న ప్రతిభ ఆడేవారికి, చూసేవారికి కూడా గొప్ప ఆనందాన్నిస్తుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటలో మనం పొందే అసలైన ఆనందమదే. అలా కాక గెలుపుతో పొంగి, ఓటమితో క్రుంగితే ఆడడం వల్ల మనసుకు మిగిలేది అశాంతే. ఇదే ‘ఆటలో ఆనందం’ కథ.

ఒక్కో కొత్త అనుభవంలోంచీ ఒక్కో కొత్త నమ్మకం పుట్టుకురాదు. అనుభవం ఒకటే అయినా చూసేవారి దృక్కోణాలు వేరైనప్పుడు ఒకే అనుభవం పరస్పర విరుద్ధాలైన నమ్మకాలను సమర్థించడానికి/పోగొట్టడానికి పనికొస్తుంది. వాటిలో ఏది నిజం? ఎవరి నమ్మకం వాళ్ళకు నిజం అని తెలిపే కథ ‘నమ్మకం’.

అతి సర్వత్ర వర్జయేత్! ప్రతిదానికీ సమయం, సందర్భం ఉంటాయి. సరైన సమయంలో ఉపయోగపడిన సుప్రతీకుడి తెలివి ఒక రకమైతే అతడి చేతిలో ఓడిపోయిన కంకణుడు, ‘లోకనాథుడి పాండిత్యం’ కథలోని లోకనాథులది ఇంకొక రకం తెలివి. ‘గానుగెద్దు-గంగిరెద్దు’ లో సుందరానిది మరోరకం తెలివి.

ఒకస్థాయికి మించి వినయాన్ని ప్రదర్శించేవారి చిత్తశుద్ధిని తప్పనిసరిగా శంకించాలి. ఎందుకంటే “అతివినయం ధూర్తలక్షణం” కాబట్టి – అని తెలిపే కథ ‘అతివినయం’.

హేతువాదులకు నాగబంధాలు, అష్టమంగళ దేవప్రశ్నలు మూఢనమ్మకాలు. ఐతే ఏ విషయంలోనైనా ఎక్కువమంది ప్రజలు బలంగా నమ్ముతున్నదాన్ని మూఢనమ్మకమని, అందువల్ల పాటించరాదని శాసనం చేస్తే ‘భ్రాంతి’ కథలో విశారదుడన్నట్లు “భ్రాంతిలో ఉన్నవారు నిజం భరించలేరు. ఇటు తమ దేవతపై దుష్ప్రచారం చేస్తున్నామని కొందరు భక్తులు తిరగబడతారు. అటు దేవతకు భయపడి అదుపులో ఉంటున్న దుష్టులు దుర్మార్గాలు చేయడం మొదలుపెడతారు. మధ్యరకం మనుషులకు అన్నిరకాల నమ్మకాలూ పోయి సందిగ్ధంలో పడతారు.” అందుకే ముందుగా “పాలకులు ప్రజల బుద్ధిని వికసింపజేయాలి. మూఢనమ్మకాలను వదిలిపెట్టి నిజాన్ని నిజంగా తెలుసుకునే స్థాయికి ప్రజలు ఎదగాలి.” ఈ కథలో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నది మూఢనమ్మకం కాదు. రాజ్యంలోని ప్రజలందరూ బలంగా విశ్వసిస్తున్నది ఒక మూఢనమ్మకమనే నిష్ఠురమైన నిజాన్ని వెల్లడి చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయన్నది విశారదుడి భావం.

ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఎవరు/ఎందుకు చేసి ఉంటారో వెంటనే ఒక నిర్ధారణకు వచ్చేస్తాం. అదే వాస్తవమని నమ్మి ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎప్పుడో ఒకప్పుడు అందరూ చేసే పనే. అలా ఆవేశపడిపోకుండా కాస్త నిదానంగా నిజానిజాలు నిర్ధారించుకుంటే చాలావరకు సమస్యలే ఉండవు. అదే ‘త్రిధాముడి కల’.

భార్య కోసం బంగారు గాజులు కొనే స్థోమత లేని చంద్రయ్యకు తమ నకిలీ గాజులు బంగారు గాజులే అని కాసేపైనా నమ్మి మురిసిపోవడానికి ఆలంబనగా నిలిచేది నిద్రలో ఐతే కల, మెలకువలో ఐతే ఏ దేవతో లేక “దయ్యమో” కరుణించిందన్న ‘భ్రాంతి’ మాత్రమే.

మనిషి బతకడానికి ఏం కావాలి? కూడూ, గూడూ, గుడ్డ ఉంటే సరిపోతుందా? వీటితోబాటే మనిషికి స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, పరపీడన నుంచి రక్షణ కావాలి. ఆనందం, ఆహ్లాదం, ఆలోచన, ఆవేశం – వీటిని పొందే మార్గం, స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశమూ కావాలి అని తెలిపే కథే ‘సందేహ నివృత్తి’.

“ధర్మబద్ధమైన జీవితం గడిపే ప్రతి జీవీ నిప్పు లాంటిదే. నిప్పులో వేలుపెడితే కాలుతుందన్న పరమసత్యాన్ని, మూఢులకు చేతల ద్వారా చెప్పవలసివస్తుంది.” అని ‘అమోఘవాక్కు’ కథా సారాంశాన్ని కథలోనే చక్కగా ఇమిడ్చేశారు. దురన్యాయానికి గురైన సాధుజీవి తిరగబడితే ఆ ధర్మాగ్రహం చూపరులను విస్మయపరిచేంతటి ప్రభావాన్ని చూపిస్తుంది.

మనలో మంచితనం ఉంటే మనకేదైనా అవసరమొచ్చినప్పుడు ఆ అవసరాన్నిబట్టి నలుగురూ మాటసాయం, చేతిసాయం లేదా ధనసాయం చేస్తారు. అందుకే “మనిషికేదైనా ఆపద సంభవించినప్పుడు ఆదుకొనడానికి అతని వద్ద మంచితనమైనా ఉండాలి, లేదా మంచిగా సంపాదించిన ధనమైనా ఉండాలి” అని చెప్పే చక్కటి కథ ‘మంచితనం – మంచిధనం’.

‘నిజమైన గెలుపు’లో నిజానికి భూషణం చేసింది సత్యాగ్రహం – నిరసన దీక్ష ద్వారా తండ్రి ఆరోగ్యం గురించి తనకున్న ఆందోళనను తెలియపరచడం. ఆ పనిని అతడిచేత చేయించింది తండ్రి మీద ఉన్న ప్రేమ. మాధవయ్య లొంగింది దానికే.

ఈ సంపుటిలో చివరి కథ ‘ఐకమత్యం’. తనదాకా వస్తేగానీ స్పందించని, ఏదెట్లా పోతే మనకేమనే ఉదాశీన వైఖరి మన దేశంలో ఎక్కువని, దేశాభివృద్ధికి అది పెద్ద ఆటంకమని కొందరి అభిప్రాయం. ఎన్నికలప్పుడు నమోదయ్యే ఓట్ల శాతం మొదలుకుని ప్రతిచోటా అది కనబడుతూనే ఉంటుంది. సమష్టి ప్రయోజనాలు ముడివడి ఉన్నచోట జంకుగొంకులు, భయసందేహాలు వీడి చొరవచూపాలనే విజ్ఞత అప్పటికప్పుడు రాదు. చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో నూరిపోయాలని సూచించే కథ ‘ఐకమత్యం’.

సంపుటిలోని కథల ప్రథమ ముద్రణ వివరాలు ఇచ్చి ఉంటే బాగుండేది. పుస్తకం ముద్రణ కంటికింపుగా ఉంది. కథలకూ, అట్టపైనా చంద్ర వేసిన బొమ్మలు కూడా బాగున్నాయి. ఈ-పుస్తకం ఇప్పుడు కినిగెలో కూడా లభ్యం.

————————–

సమీక్ష ఇక్కడితో అయిపోయింది. ఇక నా సొంత ఘోష కొంత: పాఠకులుగా మనం బాలసాహిత్యం ప్రాధాన్యతను సరిగా గుర్తించినట్లైతే “బాల” మొదలుకొని ఎన్నో పిల్లల పత్రికలు చరిత్రలో కలిసిపోకుండా కాపాడుకోగలిగేవాళ్ళం. ప్రతి నెలా పిల్లల పత్రికలు లక్షల ప్రతులు అమ్ముడుపోతూ ఉండేవి. మన పుస్తకాల ర్యాకుల్లో కనీసం ఒక్కో అర తప్పనిసరిగా బాలసాహిత్యానికి కేటాయించగలిగేవాళ్ళం. బాలసాహిత్యానికున్న ఆదరణ దాసరి సుబ్రహ్మణ్యం తదనంతర కాలంలో యండమూరిలాంటి సమర్థులైన రచయితలను ఆకర్షించగలిగి ఉండేది. బాలసాహిత్యం కొత్తపుంతలు తొక్కి, వైవిధ్యభరితంగా ఉండేది.

వాస్తవంలో అలా జరక్కపోగా చందమామ సర్క్యులేషన్ పది లక్షల నుంచి మూడు లక్షలకు పడిపోయిన రోజుల్లో సైతం ఆ లోటును భర్తీ చెయ్యగల పిల్లల పత్రిక గానీ, దాసరి సుబ్రహ్మణ్యం తర్వాత ఆ స్థాయిలో పిల్లల నవలలు రాయగల రచయిత గానీ రాకపోవడం ఆందోళన కలిగించే అంశాలు.

అడ్వెంచర్, ఫ్యాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్, సై-ఫై, అధివాస్తవికత, అపరాధ పరిశోధన, లాంటి వివిధ జానర్లలో పిల్లల కోసం గత అర్ధశతాబ్ద కాలంలో వచ్చిన రచనల రాశి, వాసి నిరాశను కలిగించేవే. అందుకు కారణం బాలసాహిత్యంపై పిల్లల తల్లిదండ్రులకున్న ఉదాసీనతే.

ఇవన్నీ నా అపోహలేనని, నిజంగా బాలసాహిత్యం పరిస్థితి అధ్వాన్నంగా లేదని తేలితే అదే నాకు నిజమైన “ఆనందం”.

You Might Also Like

5 Comments

  1. bhoom reddy narahari

    పుస్తకం.నెట్ లో సభ్యునిగా చేరుటకు పద్దతులేమిటి.తెలియబరచగలరు.

    1. సౌమ్య

      మీకు పుస్తక పరిచయాలు రాయడంపై ఆసక్తి ఉంటే, మీ రచనలను editor@pustakam.net కు పంపవచ్చు. రచనను మేము పరిశీలించి, ప్రచురించగలిగితే ప్రచురిస్తాము. ప్రచురించినా, ప్రచురించకపోయినా మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాము. ఇంతకు మించి ప్రత్యేకంగా సభ్యత్వం అంటూ ఏదీ లేదు.

  2. కామాక్షీ దేవి

    అనుకోకుండా మొన్నొక చోట ఈ పుస్తకం కనబడితే, మూడు నాలుగు కథలు చదివినాను.
    భాష, కథా వస్తువులు పిల్లల స్థాయిలో లేవేమోననిపించింది. మొదటి కథ “ఆనందం” లో అయితే కథనం కూడా పిల్లలకు సరిపోయేలా లేదనిపించింది. ఈ కథలో రచయిత చెప్పదలచినది ఏమిటో పెద్దవాళ్ళకే అర్ధం కావడం కష్టం.
    పిల్లల కథలు ఇంకొంచెం జాగ్రత్తగా వ్రాయాలి. లేకుంటే సరైన మెసేజ్ యివ్వవు. “సుప్రతీకుడి ప్రశ్నలు” అనే కథలో ఒక దేశపు రాజుగారు సర్వకళా సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తే పొరుగు దేశం నుంచి వచ్చిన ఒక పండితుడు దేశ విదేశాల నుంచి వచ్చిన ఎందరో పండితులను ఓడించి విజయుడిగా నిలుస్తాడు. అతను తన దేశానికి తిరిగి వెళ్తుంటే దారిలో ఒక పసుల కాపరి అతన్ని ఆపి మూడు చిన్న ప్రశ్నలతో, పొడుపు కథలతో ఆ పండితుడిని ఓడించి దేశం పరువు కాపాడతాడు. ఈ కథలో పండితుడి విజ్ఞానానికీ, పొడుపు కథలకీ ముడిపెట్టడం బాగా లేదు. పండితుడు తన కథలో పాత్ర కనుక రచయిత అతడికి ఆ మూడుప్రశ్నల జవాబులూ తెలియకుండా చేసినారు కానీ పండితులందరికీ అవి తెలియకుండా వుండాలని లేదు కదా! ఒకవేళ తెలియకపోయినా పాండిత్యమూ, పొదుపుకథలూ ఒకటే అవుతవా! మరో కథలో ఆటని అనందించడం ముఖ్యం, ఆటలో గెలుపు ముఖ్యం కాదు అని చెప్పిన ఈ రచయిత ఈ కథలో మాత్రం గెలిచి వెళ్తూన్న పండితుడంటే పసుల కాపరికి కోపము రావడాన్నీ, ఓడిపోవడం పరువు తక్కువగా భావించి బాధపడటాన్నీ సమర్ధించినారు.

  3. anoo

    నిజమేనండీ….బాల సాహిత్యం మరుగునపడు తోందని బాధ వేస్తోంది. మొన్ననే మా వాడి పుస్తకాలు సర్ది…కొన్ని కథల పుస్తకాలు పైన పెట్టాను కనిపించేలా….కనీసం సెలవల్లో అన్నా ఒక్కసారైనా వాటి వైపు చూస్తాడని. నేను మటుకు మొన్న కూర్చుని దాసరి సుబ్రహ్మణ్యం గారి కథలను…మృత్యోలోయనూ తిరిగి చదివా. ఈనాడు వారు అందించే బాల సాహిత్యాన్ని అయినా ఆదరిస్తే బాగుణ్ణు.

  4. valaludu

    మీది అపోహ కాదు. దురదృష్టకరమైన నిజం.

Leave a Reply