అజ్ఞానాన్ని తొలగిస్తామనే అయోమయ రచనలు

వ్యాసం రాసిపంపినవారు: ధీర
*****
ప్రజలు ఎప్పటినుంచో అమాయకంగా కొన్ని విషయాలను నమ్ముతున్నారనీ, మోసపోతున్నారనీ, వాళ్ళకి కాస్త విచక్షణా, తర్కమూ నేర్పి జ్ఞానబోధ చేస్తామనీ చెప్పుకునే రచనలు కొన్ని అపుడపుడూ వస్తూంటాయి. అయితే అలాంటి రచనలన్నిటిలోనూ నిజంగా తర్కం వుంటుందనుకోవడం పొరపాటు.

అందుకు ఒక మంచి  ఉదాహరణ ‘పురాణప్రలాపం’ అనే పుస్తకం.  హరిమోహన్ ఝా మైథిలీ భాష లో వ్రాసిన ‘ఖట్టర్ కాకా’ అనే ఈ వ్యంగ్యవినోద ప్రసంగాలని లక్ష్మిరెడ్డిగారు గారు పురాణప్రలాపం అనే పేరుతో తెలుగులోకి  అనువదించారు. ఇది ఒక “వికటకవి చిన్నాన్న” అనే అయన  పురాణాల గురించీ, సంప్రదాయాల గురించీ వ్యంగ్యంగా, వినోదంగా చేసిన విమర్శల సంకలనం.

పురాణాలలో వున్న వైరుధ్యాలన్నిటినీ అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత చక్కగా వివరించిందన్న ఘనప్రచారం వున్న ఈ పుస్తకాన్ని తెరిస్తే … ముందుమాటలోనే  తలతిరిగిపోయేటన్ని వైరుధ్యాలు.

ముందుమాటలో ఆంజనేయరెడ్డి గారు “ఎవరో చెప్పారని ఏదీ నమ్మద్దు.” అని చెప్తారు. అయితే ఆ మాటని తనే నేరుగా చెప్పకుండా. బుద్దుడు చెప్పాడంటారు. మళ్ళీ కాళిదాసు పాతవన్నీ గొప్పవి కావని “చెప్పాడనీ” గుర్తు చేస్తారు. మంత్రవిద్యను, ముహూర్త విద్యను ధూర్తవిద్యలని వేమన ‘ఎపుడో’ తేల్చి చెప్పాడంటూ పద్యాలు ఉదహరిస్తారు. ఎవరు చెప్పిందీ నమ్మరాదన్నపుడు, ఆమాటని నేరుగానే చెప్పొచ్చు కదా! ఇంకే ఉదాహరణలూ యివ్వకుండా ఊరుకోవచ్చుకదా! ఆమాటలని  ప్రముఖ వ్యక్తులు (బుద్ధుడు, కాళిదాసు, వేమన) చెప్పడం వల్లా, ఎపుడోనే చెప్పడం వల్లా వాటికి ప్రత్యేకమైన విలువేమీ రాకూడదు కదా!

“ప్రపంచం మిథ్య అని, కష్టాల కడలి అనీ, దాన్ని ద్వేషించడమే గొప్ప సుగుణమని భావించి ఎవరైతే పుట్టినప్పటినుంఛీ మోక్షం కోసం తపించి పోతూ వుంటారో, వారిని ప్రపంచం ఉపేక్షిస్తే అందులో తప్పేముంది?” అని ప్రశ్నిస్తారు ముందుమాటలో.

తప్పు లేదు. నిజానికి మోక్షం కోసం తపించేవాళ్ళు తమని ఎవరూ ఉపేక్షించరాదని, అందరూ  పట్టించుకోవాలని అనరు. అనుకోరు. దురదృష్టవశాత్తూ, జనమే, ముఖ్యంగా వారిపట్ల, వారి సిద్ధాంతం పట్ల నమ్మకం లేని జనమే వారి వెంటబడడం, వారిని క్షణమైనా ఉపేక్షించకుండా ఇరవై నాలుగు గంటలూ వారి గురించే మాట్లాడడం చేస్తుంటారు.

అలాగే “ప్రపంచం మిథ్య అని, కష్టాల కడలి అనీ” అనడమే నచ్చని ఆంజనేయరెడ్డి గారు ఆ విషయాన్ని విమర్శించి వూరుకోరు. మళ్ళీ  రెండు పేరాల తర్వాత వికటకవి చిన్నాన్న “ఈ జీవితమే ఒక వైతరిణి” అని చమత్కరించాడని గొప్పగా చెప్తారు.  ఇలా ఎన్నో విచిత్రాలు.

ఇక ప్రధాన రచన విషయానికి వస్తే ఇందులో ఒకే రకమైన, నిర్దిష్టమైన  వాదన ఎంతమాత్రమూ లేదు. ఉదాహరణకి నిస్వార్థంగా వుండడం. సహనంగా వుండడం, స్త్రీల స్వాతంత్ర్యాన్ని, హక్కుల్నీ అంగీకరించడం… ఇలాంటి ఎన్నో లక్షణాల విషయంలో ఎక్కడ ఎలా అవసరమయితే అక్కడ అలా అడ్డదిడ్డంగా వాదించారు.

ఒకచోట గట్టిగా సహనం వుండాలి అని వాదించడం. దానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలన్నిటినీ అపహాస్యం చేయడం. మరొకచోట సహనం “ఆడంగి లక్షణం”  అనడం. దానిని అపహాస్యం చేయడం. ఈ రకంగా సాగుతుంది పుస్తకమంతా.

ఈ పుస్తకంలోని ఇరవై మూడు వ్యాసాలూ ఒకేరకమైన లోపాలతో ఉన్నాయి కనుక అన్నిటినీ చర్చించడం అనవసరం అన్న భావనతో ఒక అయిదు వ్యాసాలను మాత్రం ఈ సమీక్షలో స్పృశించడం  జరుగుతోంది.

రామాయణం

ఇది మొదటి వ్యాసం. రామాయణం గురించి కొత్త విమర్శలేమీ లేవు. ఆంధ్రదేశంలో అందరికీ తెలిసిన విమర్శలే. వాటికి సమాధానాలూ చాలాసార్లు చెప్పుకున్నవే. అయితే ఈ పుస్తకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ రచయిత తను చెప్పిన ప్రతివిషయాన్నీ ఆ తర్వాతి వాక్యంలో తనే ఖండిస్తాడు.

రాముడ్ని తిడతాడు. మళ్ళీ ‘ఆలోచిస్తే రాముడి తప్పేమీ లేదనిపిస్తుంది’ అంటాడు,  దానికి స్పష్టమైన తర్కమేమీ చూపకుండానే.

ఒకప్రక్క విశ్వామిత్రుడు రాజర్షి నుండి బ్రహ్మర్షి అవడానికి వర్ణాశ్రమ నియమాన్ని తారుమారు చేశాడనీ  విమర్శిస్తాడు, మరొకప్రక్క రాముడు శంబూకుడ్ని వధించడాన్నీ విమర్శిస్తాడు.

“ఇంత తిడుతూ శ్రీరామనవమి వ్రతం ఎందుకు చేస్తున్నా”రంటే, “సీతకోసం” అంటాడు. “సీత మా (మిథిల) ఆడపడచు, రాముడు మా అల్లుడు కనుక మేమతన్ని ఏదైనా అన”చ్చంటూ చివరికి తన విమర్శనంతా తనే హాస్యంగా తేల్చేస్తాడు.

గొప్పవాళ్ళు సామాన్యుల్ని లెక్కచేయకపోవడాన్ని నిరసించే ఈ రచయిత ఈ వ్యాసంలో మాత్రం “ఒక సాధారణ పౌరుడికి (చాకలికి) ఉన్న అధికారం కూడా మహారాణికి (సీతకి) లేకపోయింది” అని బాధపడతాడు.  “రాముడి ఆస్థానంలో చిన్నవాళ్ళదే పెత్తనం – ఇంట్లో మంథర, బయట దుర్ముఖుడు. “ – అని  విమర్శిస్తాడు.

భగవద్గీత

ఈ వ్యాసంలో భగవద్గీత చాలా ప్రమాదకరమన్నట్లు మాట్లాడతాడు వికటకవి చిన్నాన్న. దానిని విన్నవాళ్ళందరూ అర్జునుడిలాగా విచక్షణ లేకుండా, కాస్త తగాదా రాగానే అవతలివాడిని చంపేస్తారని హాస్యం చేస్తాడు.

హాస్యాన్ని అందించడం మాత్రమే ధ్యేయమయిన పుస్తకంలో అయితే వక్రీకరణలనీ, వేళాకోళాలనీ పాఠకుడు కొంతవరకూ పట్టించుకోకుండా వదిలేస్తాడు. “సరదాకి అంటున్నాడు కానీ అది నిజం కాదని ఆయనకీ తెలుసు” అన్న భావంతో.

అయితే పాఠకుడికి అప్పటివరకూ తెలియని కొత్త నిజాలనీ, విజ్ఞానాన్నీ అందిస్తున్నానని ప్రకటించుకునే పుస్తకంలో అసత్యాలూ, వక్రీకరణలూ వుండకూడదు కదా!

నిజానికి అర్జునుడికి సంబంధించినంతవరకూ అతని “విచక్షణ”  భారతం చదివిన పాఠకులని ప్రత్యేకంగా  ఆకర్షించే లక్షణం. “పాశుపతాస్త్రం” లాంటి ఆయుధాన్ని తన దగ్గర వుంచుకుని కూడా అర్జునుడు తన జీవితంలో ఎపుడూ దానిని ప్రయోగించలేదన్న విషయం తలచుకున్న ప్రతిసారీ ఆ పాత్ర పట్ల ఆరాధనతో హృదయం పులకిస్తుంది. అంతే కాదు. భగవద్గీత విన్న తర్వాతే, అర్జునుడు తన బిడ్డలని చంపిన అశ్వత్థామని చంపకుండా వదిలేయడం జరిగింది. ఇవన్నీ భారతం చదివిన రచయితకి తెలియవనుకోలేం. తెలిసినదాన్ని మార్చి చెప్పి పాఠకులని తప్పుదారి పట్టించడాన్ని క్షమించలేం.

 ఈ వ్యాసంలో చిన్నాన్న నడిపిన  తర్కమంతా “కృష్ణుడు ‘ఇలా’ అనుకోమంటాడు, మళ్ళీ ‘ఇలా’ చేయమంటాడు, ఏమిటిది? ఏమిటీ వైరుధ్యం?” అన్న ప్రశ్నే. తర్కం, తర్కం అంటూ  ఈ ఒక్క ప్రశ్నే పది సార్లు ఆడిగారు ఈ  వ్యాసంలో. కానీ భావానికీ, క్రియకూ వుండాల్సిన వైరుధ్యాన్నే భగవద్గీత చెప్తుందనేది కాస్తంత వివేకం వున్న పసిపిల్లవాడు కూడా తెలుసుకోగల, అర్ధం చేసుకోగల విషయం.

మహాభారతం

ఈ వ్యాసంలో చెప్పిన విషయాలూ అందరికీ తెల్సినవే. కొత్తగా రచయిత కనిపెట్టిన కోణమేమీలేదు. అయితే ఆయన అయోమయమూ, తనని తానే ఖండించుకునే లక్షణమూ  మాత్రం ఈ వ్యాసం లోనూ చక్కగా కనబడింది.   

కాసేపు ద్రౌపది అయిదుగురితో సంసారం చేయాల్సి రావడం దుస్థితి అంటారు.  జాలి చూపిస్తారు.  మళ్ళీ తనే “ద్రౌపది పేకముక్కల్ని మార్చినట్లు భర్తలని మార్చింది. ఆటిన్ రాణిలా బ్రతికింది.” అని ద్రౌపది గురించీ, కుంతి గురించీ చులకనగా మాట్లాడతారు.

బ్రాహ్మణ  సంతర్పణ

బ్రాహ్మణ సంతర్పణని విమర్శించే ఈ వ్యాసంలో – మర్నాడు రుచికరమైన, విశిష్టమైన భోజనం చేసేందుకు ఈరోజు మామూలు భోజనం మానేయడం గొప్పేమీ కాదని ఉపవాసాన్ని అవహేళన చేశారు రచయిత. ఆ అవహేళన ఎంత అసంబద్ధంగా వుందో ప్రత్యేకించి వివరించనక్కర్లేదనుకుంటున్నాను. మర్నాడు మంచి భోజనం చేయడం కోసం ఈ రోజు పొట్ టమాడ్చుకోవడం సుఖమని చెప్తే నమ్మేవాళ్ళెవరుంటారో అర్థంకాలేదు.

 శాస్త్రాన్ని సమర్ధించేవారు బ్రాహ్మణుల ప్రత్యేకతని కూడా ఒప్పుకుంటారు. వాళ్ళకి దానితో ఇబ్బందేమీ లేదు. అందుకే వాళ్ళు బ్రాహ్మణులకి  సంతర్పణలూ చేస్తారు, పూజలూ చేస్తారు.

అయితే ఇక్కడ ఇంత పెద్ద విమర్శ రాసిన రచయిత, బ్రాహ్మణులని ప్రత్ర్యేకంగా భావించి సంతర్పణలు చేయడం అవివేకమన్న రచయిత వ్యాసం చివర్లో బ్రాహ్మణులు లోభులై వాళ్ళ నియమాలని వదిలేశారని  చెప్తూ, “మెదడే సమతౌల్యాన్ని కోల్పోతే ఇక మిగతా శరీరం పరిస్థితి ఎలాఉంటుంది? అదే పరిస్థితి సమాజానిదయింది.” అనడమే విచిత్రం. సమాజానికి బ్రాహ్మణులు మెదడు లాంటి వాళ్ళని  రచయిత ఒప్పుకుంటున్నారా! అలా అయితే శరీరంలో మెదడును ప్రత్యేకంగా చూసుకోవడంలో తప్పూ లేదు. శరీరం మెదడుని విమర్శించే అవకాశమూ  లేదు.

ఇంకో కొసమెరుపు ఏమిటంటే … బ్రాహ్మణులకి పెట్టే భోజనం గురించి, వాళ్ళ భోజనప్రియత్వం గురించి  పది పేజీలు బాధపడిన రచయిత చివరికి సంతర్పణలో వారికి ఏం పెడతారో కూడా చెప్పారు  పెరుగు, అటుకులు, పంచదార, కొన్ని మిఠాయిలు!!

కావ్యరసం

ఈ వ్యాసం దేవీ స్త్రోత్రాలలోని వర్ణనలని విమర్శిస్తూ సాగుతుంది.  

కవులు శృంగార రసాన్ని పోషిస్తూ చేసిన కుచ వర్ణనలూ, భక్తులు తమ స్త్రోత్రాలలో చేసిన అమ్మవారి కుచ వర్ణనలూ –  రెండింట్లోనూ వస్తువు ఒక్కటే కానీ భావం వేరు. ఈ పుస్తక రచయిత ఈ విషయంలో ఎందుకు అంత అయోమయంలో పడ్డారో కానీ, నిజానికి దీనిని  అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ భావ వైరుధ్యాన్ని అనుభవించే శక్తీ, నేర్పూ వున్నవారు ఆ రెండు భావాలనీ కలగలపరు. దేనికదిగా రెండింటినీ ఆనందిస్తారు.

ఇందులో కూడా తన వాదనని తనే ఖండించుకున్నాడు రచయిత. అతని మాటలు విని “మీరు ధన్యులు చిన్నాన్నా ఇలాంటి అర్థం మరెవరికీ తోచి వుండదు.” అంటాడు శ్రోత. దానికి ఆయన “కేవలం ‘గోవిందుని’ భజించేవారికి ఎలా తోస్తుంది? ‘రాధా-గోవిందు’ లను భజించేవారికయితే తోస్తుంది” అంటాడు.

ఈ వ్యాసానికి కొసమెరుపు ఏమిటంటే, కావ్యాలలో కుచవర్ణన గురించి పదిహేను పేజీలు బాధపడ్డ రచయిత, ‘ఇంతకన్నా మరే ఉదాహరణలూ దొరకలేదా మన కవులకి’ అని ప్రశ్నించిన వికటకవి, ‘ఇప్పటి కవిత్వం గురించి నీ అభిప్రాయమేమిటి చిన్నాన్నా’ అని అడిగితే “వాటిలో సహజ సిద్ధమైన రసం వెదకడం ప్లాస్టిక్ స్తనాల్లో పాలు వెదకడం లాంటిది!” అని జవాబిస్తాడు.  మరికొన్ని స్త్రీ సంబంధమైన ఉదాహరణలూ, శృంగార సంబంధమైన ఉదాహరణలూ యిస్తాడు.

ఇలా రచయిత ఏ మాత్రమూ తర్కానికి అందకుండా నడిచే పుస్తకాన్ని రాయడం ఒక విచిత్రమైతే ఇందులో బోలెడంత  తర్కముందన్న ప్రచారం జరగడం – అదింకా విచిత్రం.

ఒక విషయాన్ని అది మనుషుల ఆలోచనకి సంబంధించింది కావచ్చు, భావాలకి సంబంధించింది కావచ్చు, ప్రకృతిపరమైనది కావచ్చు, వస్తు స్వబావానికి సంబధించింది కావచ్చు ,దేనిని అర్థం చేసుకోవడంలోనూ తర్కమూ లేదు. విచక్షణా  లేదు. ఆ క్షణానికి తనకి తోచిందేదో చెప్పడమే.

సరే, అవన్నీ లేకపోయినా పర్లేదు. చాలాచోట్ల నిజాలని కూడా నిజాలుగా చెప్పలేదు.

ఉదాహరణకి, ‘అన్నగారికి  వందమంది కుమారులున్నారు కదా అని సరిపెట్టుకోకుండా తను మళ్ళీ సంతానానికి ఆరాటపడడమెందుకు పాండురాజు? అన్నగారి సంతానాన్ని చూసుకుని సంతృప్తి పడవచ్చు కదా!’ అంటారు రచయిత.

ఈ విమర్శనే తీసుకుంటే, ఇందులో సంతానం విషయంలో మనుషుల భావాలని అర్థం చేసుకోవడం కానీ, అప్పటి వ్యవస్థనీ, సామాజిక పరిస్థితులనీ, ధర్మాలనీ అర్ధం చేసుకోవడం కానీ, ఆ నేపథ్యంలో నుంచి తర్కం లేవనెత్తడం కానీ లేదు. సరే, అవన్నీ వదిలేసినా, గాంధారి కన్నా కుంతే ముందు తల్లి అయిందనీ, ధర్మరాజు పుట్టాకే మిగతావారు పుట్టారనీ – ఈ నిజాన్నైనా పరిగణలోకి తీసుకోవడమూ లేదు. తోచినవాడిమీద తోచిన విమర్శ చేసేయడమే. పాండురాజు “పచ్చకామెర్లు కమ్మి పిల్లలు కావాలనుకున్నాడనీ, అలా అనుకోకపోతే కురుక్షేత్రమూ జరిగివుండేది కాదు, వంశ నాశనమూ జరిగి వుండేది కాదు అనీ” తీర్మానిస్తారు రచయిత.

ఇలాంటి రచనలు చదివినపుడల్లా, ఇంత ఘోరంగా పాఠకులని అవమానించే రచయితలుంటారన్న అవగాహన కలుగుతుంది. నిజం. ఆకోణంలో మన జ్ఞానం నిస్సందేహంగా పెరుగుతుంది.

 పుస్తకం వివరాలు:

పురాణప్రలాపం :
వ్యంగ్య వినోద ప్రసంగం
మైథిలీ మూలం : హరిమోహన్ ఝా
తెలుగు అనువాదం : జె. లక్ష్మిరెడ్డి.
పేజీలు : 268, వెల : రూ.100.
అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్ లలో లభించును.

You Might Also Like

24 Comments

  1. gks raja

    ఏదైనా ఒక పుస్తకం గురించి, ముందే ఉండిన అభిప్రాయం (preconceived notion) తో ఏకపక్ష దూకుడుతో చేసిన కువిమర్శను సమీక్షగా వెయ్యడం ‘పుస్తకం.నెట్’ కి ఏమాత్రం తగదు. బిర్లా గుళ్ళు, వీసా వెంకటేశ్వర్లు, పాలు తాగే వినాయకుళ్ళు, పాలే తాగని పాములకు పాలు పోసేహింసలు వగైరా పిచ్చిభక్తి ఒక పక్క పెరిగిపోతుంటే, మరోపక్క దీనిని సొమ్ము చేసుకునే దొంగస్వాముల వీరంగాలు మితిమీరిపోతున్నాయి. ఎడారిలో ఒయాసిస్సులా ఇలాంటి పుస్తకాలు కాస్తంతైనా తర్కబుధ్ధిని ప్రసాదిస్తుంటే, కుతర్కాలతో చదవవలసిన వాళ్ళకు అడ్డుపడకండి. చంద్రహాస్ గారూ మీతో ఏకీభవిస్తున్నాను.
    ఇన్నయ్యగారూ! నిజం చెప్పడానికి వ్యంగరచన సాయపడిందని, తద్వారా మాత్రమే కొందరినయినా ఇది ఆకర్షిస్తుందని మీవంటి అభ్యుదయవాదులు అభిప్రాయపడడం ఈ పుస్తకాన్ని కొంచెం పలచన చేసినట్లవుతుందని నా అభిప్రాయం.
    రాజా.

    1. pavan santhosh surampudi

      గ్రంథకర్త కూడా ప్రీకన్సీవ్డ్ నోషన్స్‌తోనే కదా “పురాణ ప్రలాపం” అని (మీ లెక్కల్లో) పురాణాలపై కువిమర్శ చేసినాడు? ప్రతివారికీ ఉంటాయి ప్రీకన్సీవ్డ్ నోషన్స్, మీరీ వ్యాఖ్య రాయడానికి కూడా మీ ప్రీ కన్సీవ్డ్ నోషన్సే కారణమవుతాయి. అంతమాత్రాన ఎవరేది రాసినా తీసిపారేయగలమనుకుంటే తగదు.

  2. innaiah narisetti

    ఇన్నాళ్ళు హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు, సందేహ వాదులుసూటిగా, ఘాటుగా, చెప్పిన తీరు జనంలోకి ఆకర్షణీయంగా పోలేదు. ఈ గ్రంథ రచయిత హరిమోహన్ ఝా అనుసరించిన పద్ధతి వ్యంగ్య, వినోద ప్రక్రియ. కనుక ఇది పిల్లలకు, పెద్దలకు పట్టే అవకాశం ఉన్నది. More at: http://naprapamcham.blogspot.de/2008/05/blog-post_23.html

  3. J.L.Reddy

    జ్యోతిష్యం, ఆయుర్వేదం, చంద్రగ్రహణం, బ్రాహ్మణ సంతర్పణ. పురాణాలు, దేవతలు, మోక్షం, సత్యనారాయణ వ్రతం, భూతాల మంత్రాలు, శాస్త్ర వచనాలు, కావ్యాల్లో భక్త పేరుతో అభివ్యక్తి పొందిన మితిమీరిన శృంగారం, ఇలాంటి అనేక విషయాల ఆధారంగా జరిగిన సంభాషణల్లో గుదిబండల్లాంటి సామాజిక దురాచారాలతో, గుడ్డి నమ్మకాలతో, భావదాస్యంతో, అజ్ఞానంతో, అనుమానలతో, భయంతో, దైన్యంతో, దురాశతో, పిరికితనంతో, అకర్మణ్యతతో, కలుషితమై పోయిన, నిర్వీర్యమైపోయిన సామాన్య మానవుని జీవితానికి, ఆలోచనలకు పలు విధాలుగా ఆరోగ్యకరమైన, ప్రశస్తమైన మార్గం చూపించిన రచనలో ప్రబోధాంశం ఏమీ లేదు, మన సంప్రదాయాల విమర్శ మాత్రమే ఉంది, అని కొందరు అభిప్రాయపడడం విచిత్రంగా ఉంది. ఇదంతా ఎదురుగా జాజ్వల్యమానంగా సూర్యుడు ప్రకాశిస్తూండగా కళ్ళు మూసుకుని అంతా చీకటిగా ఉంది, అని నిట్టూర్చినట్లుంది. అలాంటివారికి ఎలాంటివైనా మన ప్రాచీన సంప్రదాయాలు పూజ్యమైనవిగానే ఉంటాయి. వాటిలో మార్పురావాలని ఎవరైనా చెబితే వారు దాన్ని సహించలేరు. అందుకే ఈ రచనలోని ప్రబోధాంశాన్ని చూడ లేక పోతున్నారు. చూడ నిరాకరించేవారికి ఎదురుగా పెద్ద కొండ ఉన్నా కనిపించదు. వాళ్ళను వాళ్ళ ఆనందానికి వదలేయడమో లేక మున్ముందు చూడగలుగుతారు లెమ్మని ఆశించి వదలిపేట్టడమో తప్ప మరేమీ చేయలేము. “భిన్న రుచిర్హి లోకః”
    అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. తనను తాను సంస్కరించుకోడానికి సిద్ధంగాలేని సమాజం ఎప్పటికే ప్రగతిశీలం కాజాలదనీ, నేటి మానవ జీవితం మతాచారాలను అధిగమించి ముందుకు సాగిపోయిందనీ అర్థం చేసుకోడానికి నిరాకరించడం అనేక శతాబ్దాల్లో మానవుడు తన మేధో శక్తి ద్వారా సాధించిన గొప్ప బౌద్ధిక విజయాలను, పొందిన జ్ఞాన సంపదను, హృదయ సంస్కారాన్ని తిరస్కరించడమే అవుతుంది, అవమానించడమే అవుతుంది.
    ఒక మేదావి అన్నట్లు, ” మీకు మీ సంప్రదాయంతో ఏ అసంతృప్తి, వివాదము లేకుంటే, వర్తమాన కాలంలో కూడా మీలో ఎలాంటి సృజనశీలత లేదనే మాట వాస్తవమే అవుతుంది”. అలాంటి స్థితికి చేరకుండా జాగ్రత్త పడడం మనకు ఎంతైనా అవసరం

  4. ananya k

    కొన్ని నెలల క్రితం ఈ ‘పురాణ ప్రలాపం’ చదివి రచయిత, అనువాదకుల ముందుమాటలో చెప్పిన దానికి లోపల విషయాలకి సంబంధం లేదే అనుకున్నాము. ఎందుకంటే ఈ పుస్తకం చదివితే వినోదం, విజ్ఙానం మరియు పాఠకులకు ఆత్మావలోకనమునకు ఈ పుస్తకం ఉపకరిస్తుందని అనువాదకులు అన్నారు. ఇక రచయితగారేమో వికటకవి చిన్నాన్న సనాతన ధర్మానికి సంబంధించిన వాటన్నిటినీ తన తర్కంతో తలకిందులు చేసేస్తాడు
    అంటే ఏమిటా తర్కం అని ఆసక్తి గా చదివాము.
    వికటకవి చిన్నాన్నకు భంగు రసం మత్తు లో పైత్య వికారాలు బాగా తలకెక్కిన తరువాత సాగిన ప్రలాపం కేవలం సనాతనాన్ని వీలైనంత ఎక్కువగా వక్రీకరించి ఆడిపోసుకోవాలనే కోరిక తప్ప ఇంకేం కనిపించలేదు.

    అయితే ఇప్పుడు సాగుతున్న చర్చకు వస్తే అనువాదకులు ఈ పుస్తకంలో కావ్య శాస్త్ర వినోదంతో పాటు ప్రబోధాంశాలు ఉన్నాయి అన్నారు. వారు ఇక్కడ సమీక్షకి సమాధానం గా ఇచ్చిన దాన్లో ఈ ఉదాహరణ చూడండి. కులస్త్రీ, వేశ్య శరీరాల ప్రహసనం. ఇందులో మనకు కావ్యశాస్త్ర వినోదం గాని
    లేదా పొందవలసిన జ్ఙానం గాని ఉందా? సమీక్ష వ్రాసిన వారు కొన్ని అందరికీ పరిచయం ఉన్న విషయాలని ప్రస్తావించి ఇందులో తర్కం ఎక్కడ ఉందని అడిగారు. దానికి ఎవరూ సమాధానం చెప్పలేదు. ప్రస్తావించలేదు. పైగా అనువాదకులు సమాధానంలో మూల రచయిత అయిన హరి మోహన్ ఝా గారు మహా వేదాధ్యాయి,పండితుడూ వగైరాలని అంతటివారిని విమర్శించడవేమిటి అని ప్రశ్నించారు. ఝా గారు వేదాలని చదివారు గాని వాటిని గౌరవించలేదు. అవహేళన చేసారు. కాబట్టి ఆయన వేదాలు చదివినా చదవకున్నా కూడా ఒక్కటే. కొండొకచో భంగు వికటకవి చిన్నాన్న తో పాటు రచయిత కూడా సేవించి కావ్య రచనకు పూనుకున్నారేమో అనిపించింది. కుతర్క మయమైన ఈ రచనలో కేవలం ఏకపక్షధోరణిలో ఈ దేశపు సనాతన
    సంప్రదాయాలను తూలనాడాలనే తపన తప్ప ఇంకేం లేదు.

    1. Thirupalu

      >>ఝా గారు వేదాలని చదివారు గాని వాటిని గౌరవించలేదు. అవహేళన చేసారు. కాబట్టి ఆయన వేదాలు చదివినా చదవకున్నా కూడా ఒక్కటే<<

      వేధాలు కానీ మరొకటి కానీ చదివినవన్నీ సమర్దించాలా? ఇదేమి తర్కమండీ? ఒక రచన చదివితే అందులోని సారం అర్దం చేసుకోవడంలో ఆ వ్యక్తి దౄక్పదాన్ని బట్టి ఉంటుంది.

      ఏ రచనైనా విమర్శనాత్మక దౄస్టితో చదవ కూడదా? ఏ రచనకైనా ప్రమానికత ఎప్పుడూ ఉండదు. కాలం మారుతూ ఉంటే ఈ ప్రమానికత కూడా మారుతుంది! అలా మారక పోతే ఆ సమాజం ఆ భూతకాలంలో ఉన్నట్లే అర్ధం!
      (నేను ఇక్కడ పుస్తకం గురించి కాదు ప్రస్తావిస్తున్నది.)

  5. కామాక్షీ దేవి

    ఈ చర్చ ని మొదటినుండీ గమనిస్తున్నాను. సమీక్షలో లేవనెత్తిన ప్రశ్నలన్నీ చాలా ఆలోచనాత్మకముగా, తర్కబద్ధంగా కనిపించినవి . పుస్తకం నచ్చిన వాళ్ళు వాటికేమి సమాధానం చెబుతారో అని ఆసక్తిగా చూసాను. కానీ ఈ పుస్తక అభిమానులూ, చివరికి అనువాదకులూ కూడా ఆ ప్రశ్నలు వదిలిపెట్టి ఏదేదో రాసినారు.
    ఒక విషయము మాత్రము అర్ధమయినది. వ్యాస రచయిత్రి చెప్పిన వైరుధ్యాల విషయం తేల్చుకోవడానికి పుస్తకం చదవ నక్కరలేదు. ఆ వైరుధ్యాలన్నీ ఇక్కడ సమాదానాలలోనే కనబడినవి. ఒక్కొక్కరు ఈ పుస్తకాన్ని ఒక్కొక్క రకముగా అర్ధం చేసుకోనినారు కదా!
    చంద్రహాస్ గారి వ్యాఖ్యలు మరీ వింతగా వున్నవి. “సమీక్షలో తర్కం ఎక్కడా కనిపించలేదనే ఈ ఘోషంతా” అన్నారు. సమీక్ష లో తర్కం ఎందుకు లేదు? స్పష్టముగా వున్నది కదా! అలాగే “రాసింది నాలుగు లైన్లు.” అని వెటకారం చేసారు. నాలుగు లైన్లు ఎక్కడ వున్నాయి? సమీక్ష వివరంగా వున్నది కదా! ఇక్కడ మిగతా రీడర్స్ అందరూ గమనిస్తారనైనా చూసుకోరా! ఇదే ఉద్వేగమంటే.
    ‘“పురాణాల్లో, కావ్యాల్లో ఉన్నవన్నీ మంచివని ఒక మైండ్‌సెట్ ఉన్నవాళ్లకు ఏం చెప్పగలం?”ఈ వ్యాఖ్య ఏ ఆధారంతో చేశారో తెలియలేదు అని ధీర గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్ననే తన సమాధానం లో రాసి మళ్ళీ prejudice అంటూ పాత పాటే పాడతారు. ఫలానా వాక్యం వల్ల prejudice అంటున్నాను అని ముందు చెప్తారేమోనని చూసాను. అదేమీ లేదు.
    “ఇప్పుడు అనువాదకులే నాలుగు మాటలు చెప్పారు. అదీ ఉద్వేగమని ఉద్వేగంతో అనకండి. అందులో తర్కం ఉంది. వివరణ ఉంది. వివేకం ఉంది. గమనించండి.” అన్న వాక్యాలు మాత్రము చాలా నవ్వించినవి. అనువాదకుని మాటలలో తర్కం వుందని అనడం కన్నా హాస్యాస్పదం వుందా? ఆయన రాసినది ఏమిటి? రచయిత చాలా గొప్పవాడు, ఈ పుస్తకాన్ని చాలా మంది మెచ్చుకొనినారు, గత అయిదేళ్లుగా దీనిని ఎవరూ విమర్సించ లేదు. ఈ మూడు విషయాలలో దేనిని చంద్రహాస్ గారు తర్కమని అనుకొనినారో తెలియదు.
    చివరికి “This is a scholarly book and deserves to be read.” అని వారే చెప్పేసినారు. scholarly book and deserves to be read ఎందువలన అయినదో మాత్రము చెప్పలేకపోయినారు.

  6. చంద్రహాస్

    వ్యాసకర్తను వ్యక్తిగతంగా నిందించడము…అన్న వ్యాఖ్య నాకు అంతుబట్టలేదు. ఎవరు ఎవర్ని వ్యక్తిగతంగా నిందించడము జరిగింది? ఇది ఒక పుస్తక సమీక్ష గురించి జరుగుతున్న మీమాంస. సమీక్ష అసంబద్ధంగా ఉంది అనడం నింద అవదు. సమీక్ష నిజంగా, అనువాదకులు లక్ష్మిరెడ్డి గారన్నట్లు, హడావుడి వ్యవహారం. ఆ సమీక్షకురాలు ‘ఇంత ఆలోచనతో రాసిన సమీక్షని…’ అనడం హాస్యాస్పదంగా ఉంది. రాసింది నాలుగు లైన్లు. అందులో అలోచన కనిపించలేదు. పైపెచ్చు ధీర గారు- ‘“పురాణాల్లో, కావ్యాల్లో ఉన్నవన్నీ మంచివని ఒక మైండ్‌సెట్ ఉన్నవాళ్లకు ఏం చెప్పగలం?”ఈ వ్యాఖ్య ఏ ఆధారంతో చేశారో తెలియలేదు. సమీక్షలో వుద్వేగం లేదు, తర్కం వుంది, గమనించవలసిన విషయం అది. నిజానికి వ్యాఖ్యలలోనే ఉద్వేగం కనిపిస్తోంది. పురాణాలలో అంతా చెడే ఉందనుకునే ఉద్వేగం’ అని రాశారు. పురాణాల్లో అంతా చెడే ఉందని నేననలేదు; అనలేను. సమీక్షలో తర్కం ఎక్కడా కనిపించలేదనే ఈ ఘోషంతా. ఇప్పుడు అనువాదకులే నాలుగు మాటలు చెప్పారు. అదీ ఉద్వేగమని ఉద్వేగంతో అనకండి. అందులో తర్కం ఉంది. వివరణ ఉంది. వివేకం ఉంది. గమనించండి. ఒక మంచి పుస్తకాన్ని, ఎందరో free from prejudice చదవాల్సిన పుస్తకాన్ని, అసంబద్ధంగా విమర్శిస్తే చదవాలనుకునేవాళ్ళు కూడా చదవకపోవచ్చు. సమీక్షకులెప్పుడూ సమతూకం పాటించాల్సిన బాధ్యత ఉంది. రెండో పార్శ్వం కూడా చూస్తేనే, చెబితేనే సమీక్షకు విలువ. అది ఈ సమీక్షలో జరగలేదు. సమీక్షకురాలి prejudice సమీక్ష శీర్షికలోనే అవగతమైంది. తర్వాత వ్యాఖ్యలతో నిఝంగా ఆ prejudice deep rooted అని స్పష్టంగా వెల్లడైంది. This is a scholarly book and deserves to be read. I urge every discerning reader to take a good look at it.

    1. సౌమ్య

      చంద్రహాస్ గారూ:

      నాకు ఈ వ్యాస రచయిత్రితో సంబంధం లేదు కనుక నేను ఆవిడ తరపున వకాల్తా పుచ్చుకుని ఇక్కడ చర్చ కొనసాగించలేను. కాకపోతే, 2,3 విషయాలు మాత్రం వివరించి, నేను ఈ చర్చ నుంచి వైదొలగదల్చుకున్నాను. ఐదేళ్ళ క్రితం చదివిన పుస్తకం మరొకసారి చదవకుండా నేను ఇప్పుడు దానిపైన మాట్లాడ్డం ఎలాగో భావ్యం కాదు. నేను చెప్పదల్చుకున్నవి:

      1) “ఒక మంచి పుస్తకాన్ని, ఎందరో free from prejudice చదవాల్సిన పుస్తకాన్ని, అసంబద్ధంగా విమర్శిస్తే చదవాలనుకునేవాళ్ళు కూడా చదవకపోవచ్చు.”
      – “మంచి పుస్తకం” అన్నది relative opinion. నా దృష్టిలో. ఒక పాఠకుడికి/పాఠకురాలికి ఫలానా పుస్తకం నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే, అది ఎందుకు నచ్చలేదు అని చెప్పుకోగల స్పేస్ పుస్తకం.నెట్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఆపైన జరిగే చర్చలు ఆయా వ్యక్తుల ఓపికలను బట్టి నడుస్తాయి కనుక వాటి గురించి మాట్లాడ్డం లేదు. కేవలం, వెయ్యి మంది మంచి పుస్తకం అన్నా కూడా తనకెందుకు మంచి అనిపించలేదో ఒక పాఠకుడికి పుస్తకం.నెట్ చెప్పే అవకాశం కల్పిస్తుంది అని మాత్రమే చెబుతున్నాను. పాఠకుడి వాదాలు తర్క విరుద్ధాలైన పక్షంలో, వ్యాసం చదివే వారు కూడా అది గ్రహించి నిర్ణయాలు తీసుకోగల తెలివిడితనం ఉన్నవారే అని నేను అనుకుంటున్నాను.

      2) “సమీక్షకులెప్పుడూ సమతూకం పాటించాల్సిన బాధ్యత ఉంది. రెండో పార్శ్వం కూడా చూస్తేనే, చెబితేనే సమీక్షకు విలువ. అది ఈ సమీక్షలో జరగలేదు.”
      – దీనిని సమీక్ష గా కన్నా ఒక అభిప్రాయంగా చూడాలేమో అనిపిస్తోంది నాకు. రచయిత్రి వ్యక్తిగత అభిప్రాయం లాగానే తోచింది నాకైతే మొదటి నుండి.

      3) వ్యక్తిగత విమర్శల విషయం: వ్యాసకర్త వివేచన గురించి వ్యాఖ్యలు నాకైతే వ్యక్తిగత నిందలుగానే అనిపించాయండి. అంతకు మించి ఈ విషయం లో వాదోపవాదాలకి నేను సిద్ధంగా లేను. అభిమాన సంఘాల వాళ్ళలా ఇంకొకరి తరపున నేను వకాల్తా తీసుకుని వాళ్ళకంటే ముందే అధిక ప్రసంగం చేయలేను. స్వస్తి.

  7. J.L.Reddy

    ధీర గారు ’పురాణ ప్రలాపా’న్ని జాగ్రత్తగా చదవక అయోమయంలో పడి కేవలం అత్యుత్సాహంతో వ్యాఖ్యానం రాశారని చెప్పక తప్పదు. ఈ పుస్తకంలో కేవలం మన శాస్త్రపురాణాల్లోని అసంగతమైన విషయాల విమర్శే కాకుండా కావ్యశాస్త్త్ర వినోదం కూడా చాలా ఉంది.(కావ్యశాస్త్ర వినోదం అంటే ఏమిటో మనలాంటి వారికెవరికీ వివరించ వలసిన అవసరం లేదనుకుంటాను.) రచయిత ప్రొ. హరిమోహన్ ఝా తన ముందు మాటలోని మొదటి వాక్యంలోనే ’కావ్యశాస్త్రవినోదేన కాలో గచ్చతి ధీమతామ్ | వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా ( వివేకవంతుల కాలం కావ్యశాస్త్ర వినోదంలో గడుస్తుంది, మూర్ఖుల కాలం వ్యసనాల్లోను, నిద్రలోను, కలహాల్లోను గడుస్తుంది ) అని రాసి సంస్కృతంలో కావ్యశాస్త్రవినోదానికి సంబంధించిన అసంఖ్య జలధారలున్నాయని, ఈ రచనను ఆ సంప్రదాయానికి సంబంధించిన రచనగా కూడా చూడాలని సూచించాడు. అందువల్ల మన చెడు సంప్రదాయాల విమర్శగానే కాక కావ్యశాస్త్ర వినోదానికి సంబంధించిన ఒక చక్కటి ఉదాహరణగా కూడా భావించి దీన్నిమనం అర్థం చేసుకోవాలి. ఈ మాటను అనువాదకుడనైన నెను చెప్పాను కూడా. ఏ మాట వినోదం కోసం చెప్పిందో, ఏ మాట గంభీరంగా చెప్పిందో, తెలుసుకోలేని పాఠకులు ధీర గారి లాగే అయోమయంలో పడి రచయిత పాఠకుణ్ణి అవమానిస్తున్నాడని కోపం తెచ్చుకొని తామే రచయితకు అన్యాయం చేస్తారు. లేకపోతే ఆమె ఇంత గొప్ప రచయితను గురించి ఇంత చులకనగా రాయరు.
    ఇంకా నయం. పురాణ ప్రలాపం లోని ’ధర్మచర్చ’ (155 వ పుట)లో “కులస్త్రీకి, పతివ్రతకు పురిసెడు నీళ్ళకు, నిరంతరం ప్రవహించే మహానదికి ఉన్న తేడా ఉంది. ఒకరు క్షుద్రతామూర్తి అయితే, మరొకరు ఉదారతామూర్తి. ఒకే వ్యక్తికి ఉపయోగపడే శరీరం కూడా ఒక శరీరమేనా? అనేకులకు ఉపయోగపడే శరీరమే కదా ధన్యమైంది? — పరోపకారాయ సతాం విభూతయ: (సజ్జనుల సంపదలు పరులకుపయోగ పడడానికే ఉంటాయి) అనే మాట చూసి ఆమె అయ్యో! ఈయన పతివ్రతలనందరినీ అవమానిస్తున్నాడు, వేశ్యావృత్తిని బలపరుస్తున్నాడు, అని నింద వేయలేదు. ఇలాంటి సందర్భాలు పుస్తకంలో మరి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కావ్యశాస్త్ర వినోదంలో భాగమే. వీటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోతే పాఠకునికి రచనలోని ఆనందం అందదు, విజ్ఞానమూ తెలియదు.
    పట్నా విశ్వ విద్యాలయంలొ దర్శనశాస్త్ర ప్రొఫెసరుగా పని చేసిన హరిమోహన్ ఝా సామాన్యుడైన రచయిత కాదు. ఆధునిక మైథిలీ సాహిత్యంలొ సర్వోన్నత స్థానం అలంకరించిన, మైథిలీ భాషను, సాహిత్యాన్ని, పలు విధాలుగా సుసంపన్నం చేసిన రచయిత. మిథిలా ప్రాంతంలో గొప్ప కవి పండితులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, వేదాలు మొదలుకొని అన్ని శాస్త్రపురాణాలతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని, ఆలోచనా ధోరణులను కూడా క్షుణ్ణంగా తెలుసుకొన్న గొప్ప పండితుడు. ’పురాణ ప్రలాపం’ చివర ఇచ్చిన అనుక్రమణిక (index) చూస్తే ఆయన ఎంత పండితుడో తెలుస్తుంది. మైథిలీ సాహిత్యంలొ ’హాస్య రసావతారం’గా, ’వ్యంగ్యసామ్రాట్’ గా ప్రసిద్ఢుడు. ఈ ప్రసిద్ధికి ప్రధానమైన ఆధారం ’ఖట్టర్ కాకా’ పేరుతో ఆయన రాసిన ఈ గ్రంథం. ఇలాంటి రచన మైథెలీ లోనే కాదు, హిందీలో కూడా లేదని పండితుల అభిప్రాయం. అలాంటి రచన ప్రాశస్త్యాన్ని ఏ మాత్రం అర్థం చేసుకోకూడా విమర్శించడం హర్షించదగిన విషయం కాదు.
    అయితే ఇక్కడ హర్షించవలసిన విషయం ఒకటుంది. అదేమిటంటే పుస్తకం వచ్చిన గత ఐదేళ్లలో ఇలాంటి అయోమయంలో పడినవాళ్ళు నాకు ఎవరూ కనిపించలేదు. ఇది సాధారణ పాఠకుల, పండితుల, విమర్శకుల గొప్ప ప్రశంసలకు పాత్రమైంది. అనేక పత్రికల్లో ప్రశంసా పూర్వకమైన విమర్శలూ వచ్చాయి, తెలుగు సాహిత్యంలో చేరిన ఒక గొప్ప రచనగా, ప్రజల్లో వివేకాన్ని, విజ్ఞానాన్ని, విచక్షణను పెంపొందించి ఛాందసవాద రుగ్మతకు ఉపశమనం కలిగించే ఔషధంగా దీన్ని గుర్తించారు. కీర్తించారు. తరతాలుగా, పొరలుపొరలుగా పేరుకుపోయిన మూఢత్వాన్ని నిర్మూలించడానికి బాగా ఉపకరించే డైనమైటు లాంటిదన్నారు. స్వబుద్ధితో ఆలొచించి కర్మశీలివి, విజ్ఞానివి, కమ్మని నవ్విస్తూ కవ్విస్తూనే కమ్మగా ప్రబోధించే గురువులాంటిది, పెద్దదిక్కులాంటిది, అన్నారు. మాటిమాటికి చదవవలసిన. మననం చేసుకోవలసిన ఉత్కృష్ట రచన అన్నారు. మరెన్నో విధాలుగా ఈ పుస్తకాన్ని ప్రశంసించారు, ప్రశంసిస్తున్నారు.
    అలాంటప్పుడు ఒక సామాన్య పాఠకునిలో కనిపించిన వివేచనా శక్తి కూడా ధీర గారిలో లేదని నేననుకోవడం లేదు. అలాగే ఐదు సంవత్సరాలుగా ఈ పుస్తకాన్ని నెత్తికెత్తుకున్నఅనేక పాఠకుల్లో,పండితుల్లో ధీర గారిలో ఉన్నంత వివేచనాశక్తి లేకపోయిందని కూడా నేను అనుకో లేక పోతున్నాను. ఆమె మరో సారి జాగ్రత్తగా చదివితే, ఏ మాట వినోదం కోసం చెప్పిందో, ఏ మాట విమర్శనా దృష్టితో చెప్పిందో తెలుసుకుంటే, —-అదేమంత కష్టం కాదు. ఇంత దాకా మామూలు పాఠకులు కూడా ఆ తేడాను తెలుసుకుని ఆనందించారు—-ఆమెకు ఈ రచనలో ఏ వైరుధ్యాలు కనిపించవని, ఆమె అయోమయం తొలగిపోతుందని నా నమ్మకం. ఏ పుస్తకాన్ని గురించైనా బాగుందని చెప్పడానికి చదవ వలసిన పనిలేదు. చదివే శ్రమ తీసుకోకుండానే బాగుందంటె, ఏ గొడవా ఉండదు. కానీ అందులో లోపాలు చెప్పాలంటె, జాగ్రత్తగా చదవవలసిన అవసరం ఉంటుందని, మన prejudices ను పక్కన పెట్టవలసి కూడా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి.
    జె. లక్ష్మి రెడ్డి

    1. సౌమ్య

      ఈ వ్యాసం వచ్చినరోజునే రాద్దామనుకుని వ్యాఖ్య రాయలేదు. కానీ, ఇప్పుడు అవసరం అనిపిస్తోంది.
      >>అదేమిటంటే పుస్తకం వచ్చిన గత ఐదేళ్లలో ఇలాంటి అయోమయంలో పడినవాళ్ళు నాకు ఎవరూ కనిపించలేదు
      – ఈ పుస్తకం నేను చదివి దాదాపు ఐదేళ్ళైంది. అప్పట్లో నాకు వ్యంగ్యం నచ్చినా కూడా incoherent గా అనిపించాయి వ్యాసాలు అన్న విషయం మట్టుకు చెప్పగలను.

      అంతకంటే వివరాలు చెప్పడానికి ఆ పుస్తకం ఇపుడు నా వద్ద లేదు, నాకు మళ్ళీ చదివే ఉద్దేశ్యం కూడా లేదు. అలాగే, ఒక పుస్తకం నచ్చలేదన్న వాళ్లో, నచ్చిందన్న వాళ్ళో మనకి ఇప్పటి దాకా ఎవరూ కనిపించకపోతే, తుదకి ఒకళ్ళు కనిపిస్తే, వాళ్ళ అభిప్రాయం తప్పవ్వాలన్న రూల్ లేదు అని నేను అనుకుంటాను. అందరిలోనూ ఒకే స్పందన ఏ రచనా కలిగించలేదు.

      ఒక రచన పట్ల ఒక అభిప్రాయానికి రావడానికి, రచయిత ఎంత గొప్పవాడు, ఎంతమందికి ఆయన రచనలు నచ్చాయి? ఆయనకి ఎన్ని అవార్డులొచ్చాయి? అన్న విషయాలకి సంబంధం లేదని నమ్ముతాను నేను. ఎవరి వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాలు వారివి. ఇంతమంది అనుభవం గల పాఠకులు వచ్చి, ఈ వ్యాసకర్తను వ్యక్తిగతంగా నిందించడము…గతంలో ఒకసారి ఒక ప్రముఖ పుస్తకాన్ని గురించి కొంచెం భిన్న దృక్కోణంలో రాసిన వ్యాసాలు వచ్చినప్పుడు – “వ్యాసకర్తకి పుస్తకం చదవడం ఎలాగో తెలియదు” అన్న దగ్గర మొదలై, అసభ్యమైన పోలికలు తెచ్చి విమర్శించేదాకా వెళ్ళాయి…ఆ సంఘటన ను గుర్తుచేస్తోంది. మన పాఠకులకి ఏదన్నా పుస్తకం గురించి వ్యతిరేక దిశలో ఉన్న అభిప్రాయాలని అది ఇంకొకరి అభిప్రాయం.. అని గౌరవించి, అదొక అభిప్రాయం మాత్రమే.. అని అర్థం చేసుకుని వదిలివేసే సహృదయం కానీ, సహనం కానీ లేవేమో అనిపిస్తోంది.

  8. ధీర

    “పురాణాల్లో, కావ్యాల్లో ఉన్నవన్నీ మంచివని ఒక మైండ్‌సెట్ ఉన్నవాళ్లకు ఏం చెప్పగలం?”
    ఈ వ్యాఖ్య ఏ ఆధారంతో చేశారో తెలియలేదు. సమీక్షలో వుద్వేగం లేదు, తర్కం వుంది, గమనించవలసిన విషయం అది. నిజానికి వ్యాఖ్యలలోనే ఉద్వేగం కనిపిస్తోంది. పురాణాలలో అంతా చెడే ఉందనుకునే ఉద్వేగం.
    పురాణాలలో వున్నవాటిని మెచ్చుకునేవారందరూ ఆ పని గుడ్డిగా చేస్తారనీ, వారికి తర్కమే తెలియదనీ అనుకోవడం పొరపాటు. అలా మెచ్చుకునే ముందు వారు కూడా హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించి ఉండవచ్చునని గ్రహించాలి.
    కాస్త స్థిమితంగా ఆలోచిస్తే నాకు పైన ఉదహరించిన శ్లోకంలో తప్పు కనబడడం లేదు. తీవ్రత కనిపిస్తోంది అంతే. (నాకు సంస్కృతం రాదు. అక్కడ వ్రాసిన తాత్పర్యాన్ని బట్టే నేనూ దానిని అర్ధం చేసుకున్నాను)
    ఒక తల్లి తన పిల్లాడితో “అబద్ధాలాడకు. కళ్ళు పోతాయ్.” అంటుంది. నాలాంటి వారికి అది నచ్చదు. కళ్ళుపోతాయ్ అనే మాట ఎందుకు? అబద్ధం ఆడడం తప్పని కొంచెం సున్నితంగా చెప్పచ్చు కదా అనిపిస్తుంది. అయితే ఆ చెప్పిన విషయంలో తప్పు లేదు. అబద్ధం ఆడడం ముమ్మాటికీ తప్పే. అలాగే “ఒక వస్తువుని అవతలి వారికి పంచకుండా మనమే అనుభవించే అవకాశం మనకి వుంటే, (అంటే అలా చేస్తే మూడో కంటికి తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ) దానిని దుర్వినియోగం చేయకూడదు.” ఈ విషయమే ఇక్కడ తీవ్రంగా చెప్పబడింది. తీవ్రత మనకి నచ్చకపోవచ్చు. అయితే పురాణ రచన ధ్యేయమే అదేమో! రచన ధ్యేయానికి సరిపోయే భాష రచనలో వాడబడి వుంటే అది విమర్శించాల్సిన లోపం కాదేమో!
    విషయమేమిటంటే తీవ్రత వేరు, వైరుధ్యం వేరు. పురాణాలలో తీవ్రత వుండి ఉండవచ్చు. కానీ పురాణప్రలాపం లో నాకు వైరుధ్యాలు కనిపించాయి.
    సందర్భం మొత్తం వివరించినప్పటికీ, సాధారణ పౌరుడు, మహారాణి పోలిక ఈ రచయిత చేయడంలో వైరుధ్యం వుంది.. రామాయణంలో ఆ వైరుధ్యం లేదు. ఆనాడు వారి సమాజంలో వున్న ఒక నియమాన్ని ఎవరు చెప్పినా దానికి విలువ ఇవ్వబడింది. చాకలి వాడు చెప్పాడు కాబట్టి దానిని మతిలేని వాగుడు గా రామాయణం లోనే కొట్టివేయలేదు. అలాంటిది, సమసమాజాన్ని గూర్చి మాట్లాడటం ధ్యేయమైన (?) రచనలో అటువంటి పోలిక తేవడం వైరుధ్యం, లోపం.
    తీవ్రత అనేది స్థల కాలాలపైన, వ్యక్తులపైనా ఆధారపడి వుంటుంది. ఒకరికి తీవ్రం అనిపించినది మరొకరికి సాధారణం అనిపించవచ్చు. కానీ వైరధ్యం లో ఆ సబ్జెక్టివిటీ లేదు. కొంత మందికైనా అవసరమూ, సాధరణమూ అనిపించే తీవ్రతనే ఛీ అన్నప్పుడు సర్వకాల సర్వావస్థల లోనూ వైరుధ్యమే అనిపించే వైరుధ్యాన్ని ఛీ ఛీ అనాలేమో!
    జ్యోతిష్యం గురించి ఎందుకు తీసుకోలేదు? మరొకటి ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నలు వచ్చాయి. జ్యోతిష్యం గురించి అందరికీ తెలియదు. మిగిలిన పురాణాలన్నీ కూడా అందరూ చదివి వుంటారనుకోను. రామాయణం, భారతం వంటి ఎక్కువమంది చదివి వుండడానికి అవకాశం వున్న గ్రంధాలని ఉదహరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పదే పదే చెప్పినట్లు సందర్భం తెలియకుండా మధ్య మధ్యలో వ్యాఖ్యలు/శ్లోకాలు తీసుకుంటే అపార్ధాలకు (ఈ పుస్తకం లో వలె) దారి తీస్తాయి. గ్రంధాన్ని మొత్తం సమీక్షలో వివరించలేము కనుక, ఎక్కువ మందికి తెలిసిన సందర్భాలనీ, విషయాలనీ వాటి గురించి ఈ పుస్తక రచయిత చేసిన విమర్శలనీ సమీక్షలో చెప్పడం జరిగింది.
    నా వరకు నేను కూడా నాకు బాగా తెలిసిన గ్రంధాల విషయంలోనే వైరుధ్యాలని స్పష్టంగా గుర్తించ గలిగాను. ఆ వైరుధ్యాలని బట్టి మిగతావాటిని (నేను చదవని పురాణాలు) గురించిన విమర్శల లోనూ వైరుధ్యాలుండ వచ్చునని గ్రహించాను.
    ఇంత ఆలోచనతో రాసిన సమీక్షని “పురాణాలని గుడ్డిగా నమ్మి” వ్రాసిన సమీక్షగా కొట్టిపడేస్తే చేసేదేం లేదు. అది మళ్ళీ “మరో వైరుధ్యం” అనుకుని వూరుకోవడమే.
    నేను చెప్పవలసినది అవసరమైన దానికంటే ఎక్కువగానే చెప్పాను కనుక యిక ఈ విషయంపై ఇదే నా చివరి సమాధానం.

  9. చంద్రహాస్

    రాముడు న్యాయం యొక్క ఆదర్శాన్ని చూపెట్టి వెళ్ళాడు, న్యాయపాలన కోసం సీతను అడవికి పంపడానికి కూడా వెనుకాడలేదంటే దానికి సమాధానంలో సాధారణ పౌరుని మాట వస్తుంది. ఆ సమాధానం ఇది:
    “వాళ్ళ వంశానికది పరిపాటే. తండ్రి ఈయనకు వనవాసమిచ్చాడు. ఈయన భార్యకిచ్చాడు. నీవు న్యాయం, న్యాయం అంటున్నావు. న్యాయం అంటే ఎవడో ఏదో అన్నాడని ఎవరినైనా ఉరికంబమెక్కించడమేనా? న్యాయమే చేయదలచుకుంటే వాది, ప్రతివాది ఇద్దరినీ రాజాస్థానంలోకి రప్పించవలసింది. రెండు పక్షాల వాజ్ఙూలాలు విని నిష్పక్షపాతంగా నిర్ణయం చేయవలసింది. అదంతా ఏమీ చెయలేదు. గప్చిప్గా సీతను అరణ్యానికి పంపేశాడు. ఇది ఎక్కడి ధర్మం, ఎక్కడి ఆదర్శం? ఒక సాధారణ పౌరునికి ఉండే అధికారం కూడా మహారాణి సీతకు లేకపోయింది.”
    పైదాని తర్వాత మళ్ళీ చాకలి మాట వస్తే “ఈయన మతిలేని చాకలివాని మాటలకు భార్యకు వనవాసం ఇచ్చాడు. వాళ్ళ ఆస్థానంలో చిన్నవాళ్ళదే పెత్తనం. ఇంట్లో మంధర, బయట దుర్ముఖుడు” అన్నారు. Read in the context, there is logic in what is said.

    స్కంద పురాణంలో శ్లోకం ఇది:
    భర్తారం యా సంస్తృజ్య మిష్ణమశ్నాతి కేవలం
    సా గ్రామే శూకరీ స్యాద్వా గర్వభీ వా తు విడ్భుజా

    అంటే, భర్తకు పెట్టకుండా మిఠాయి తినే స్త్రీ మరుజన్మలో పందిగానో, గాడిదగానో లేక మలంలో ఉండే కీటకంగానో జన్మిస్తుంది.
    ఏం మాటలు. ఛీ.
    ఇలాంటివి హర్హణీయమా? ఇవి రాయడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించవచ్చా?
    బ్రాహ్మణులపై అవహేళనలు – less said the better. Every so-called అవహేళన
    is supported by some text or the other. ఇక రోమావళి మాటలు as commented by Sri Naag పురాణాల్లో ఎన్నో, ఎన్నొన్నో.
    పురాణాల్లో, కావ్యాల్లో ఉన్నవన్నీ మంచివని ఒక మైండ్‌సెట్ ఉన్నవాళ్లకు ఏం చెప్పగలం?

  10. Chandrahads

    There is a a lot about astrology, role models, how in the name of scholarship the ordinary folk are fleeced, how eclipses are used as ruse to fill someone’s pockets, etc. in the text. Ramayana, Mahabharatha, Gita are only the beginning. The reviewer glosses over all the ills that our scriptures contain. Sad.

  11. Naag

    కావ్యరసం : కుచ వర్ణనలతోనే ఆగుంటే అలవాటున సరిపెట్టుకోవచ్చేమో రోమావళుల (అర్ధం తెలుసనుకుంటాను) వర్ణనలుకూడా ఉన్నాయన్న విషయం జీర్ణించుకోవడం మాత్రం కష్టమయ్యింది. వ్యాసరచయిత మరి ఆ వర్ణనలకి భావవరుధ్యాన్ని కారణంగా చూపించదలచుకున్నారో.

    జ్యొతిష్యం : మొత్తంగా ఈ అంశాన్నే ప్రస్తావించకపోవడం విచారకరం.

    విమర్శనావిధానం వ్యంగ్యమేకనీ అందులో అబధ్ధాలేమున్నాయి. శ్లోకాలను ఉదాహరణకూడా ఇచ్చారుకదా! అవి లేవనికానీ, వాటి context వేరనికానీ చెప్పలేం కదా!

  12. చంద్రహాస్

    I have a problem in typing in Telugu. So pardon me for this mixture. Pardon my hurried translation too.
    About రామాయణం
    This is the comment of the reviewer: రాముడ్ని తిడతాడు. మళ్ళీ ‘ఆలోచిస్తే రాముడి తప్పేమీ లేదనిపిస్తుంది’ అంటాడు, దానికి స్పష్టమైన తర్కమేమీ చూపకుండానే.
    The context in which this is said is important. The writer says, “After a careful consideration, it appears to me that Rama was not at fault. Actually, his father Dasaratha was a hasty man too. He went hunting. He heard a sound on the river bank. And immediately he drew the bow, placed the arrow on the string and released it pulling it to the ear in the direction whence the sound came. It didn’t occur to him that he could be shooting a man. Poor Sravanakumar was killed and his blind father died of heartbreak. And, as a result, Dasaratha too had to die of the pangs of separation from his own son.”

    Does this not explain? I’m sure it does.

    The next comment is this: గొప్పవాళ్ళు సామాన్యుల్ని లెక్కచేయకపోవడాన్ని నిరసించే ఈ రచయిత ఈ వ్యాసంలో మాత్రం “ఒక సాధారణ పౌరుడికి (చాకలికి) ఉన్న అధికారం కూడా మహారాణికి (సీతకి) లేకపోయింది” అని బాధపడతాడు. “రాముడి ఆస్థానంలో చిన్నవాళ్ళదే పెత్తనం – ఇంట్లో మంథర, బయట దుర్ముఖుడు. “ – అని విమర్శిస్తాడు
    This is what is there in the text. “Tell me this. If a washerman falls off the donkey, I wouldn’t throw your aunt out of our home, would I? … Because of a foolish maid servant’s words, a father banished his son to the forest. And this man sent his wife away to live in the forest because of the prattle of a mindless washerman. In their court, the petty held sway – Mandhara at home and Durmukah, Rama’s spy, outside.”
    I think the writer expressed Sita’s agony rather than a class conflict.

    The next comment is this: ఇంత తిడుతూ శ్రీరామనవమి వ్రతం ఎందుకు చేస్తున్నా”రంటే, “సీతకోసం” అంటాడు. “సీత మా (మిథిల) ఆడపడచు, రాముడు మా అల్లుడు కనుక మేమతన్ని ఏదైనా అన”చ్చంటూ చివరికి తన విమర్శనంతా తనే హాస్యంగా తేల్చేస్తాడు.
    If that’s not satire, what is?
    Look at what the text says.
    “Uncle! Since you celebrate Sriramanavami you must have devotion in your mind.”
    “Yes, but that’s for Sita. If it were not for Sita, Rama would have been acclaimed only as ‘Raghupati Raghava Rajaram’. He wouldn’t have been called ‘Patita pavana Sitaram’. Every Kshatriya king would routinely do whatever Rama did. Just in respect of one matter, he was an exception. He did not take another wife. He got a gold statue of Janaki made and spent the rest of his life looking at it. For this reason, I would forgive him of all his misdeeds. Rama’s greatness was due to Sita. That’s why, first Sita and then Rama. Tulsidas said, ‘I would raise my hands, put my palms together hands and pray assuming that the entire creation is pervaded by Sita and Rama.’ Valmiki also says, ‘Pray Sita and her husband.’”
    “Uncle. You are so devoted to Sita. Why then do you criticise Rama? You don’t spare his father too.”
    Uncle broke into a smile and said, “Arey, don’t you understand this small little thing? I’m from Sita’s mother’s place. The criticism of the barber from the mother-in-law’s place also is also acceptable. And I’m a Brahmin. Could anyone else venture to talk like me? People of Mithila would always pour scorn on the people of Ayodhya. Even god can’t make us shut up.”

    About Mahabharatha:
    The review says: ఈ వ్యాసంలో చెప్పిన విషయాలూ అందరికీ తెల్సినవే. కొత్తగా రచయిత కనిపెట్టిన కోణమేమీలేదు. అయితే ఆయన అయోమయమూ, తనని తానే ఖండించుకునే లక్షణమూ మాత్రం ఈ వ్యాసం లోనూ చక్కగా కనబడింది.
    కాసేపు ద్రౌపది అయిదుగురితో సంసారం చేయాల్సి రావడం దుస్థితి అంటారు. జాలి చూపిస్తారు. మళ్ళీ తనే “ద్రౌపది పేకముక్కల్ని మార్చినట్లు భర్తలని మార్చింది. ఆటిన్ రాణిలా బ్రతికింది.” అని ద్రౌపది గురించీ, కుంతి గురించీ చులకనగా మాట్లాడతారు.
    The context of the above is important.
    The writer talks of ill fated Draupadi when Kunthi asked Arjuna to share the alms (Draupadi) among all the five brothers. He says, “Was Panchali panchamrith prasad or what to be distributed like this? We must feel happy that the five limbs of Draupadi were not distributed. Then her position would have been much worse. Anyway, she suffered much, didn’t she? One woman amongst five men…”
    After about 5 pages or so, the debate moves on to another subject, five kanyas– Ahalya, Draupadi, Tara, Kunthi and Mandodari, about whom it is claimed that utterance of their names would cleanse you of all sins. Well, the author questions this and says none of them was really virtuous. Ahalya was turned into a stone for straying. Tara and Mandodari fell into the arms of their brothers-in-law. Kunthi satisfied the desire of five. The daughter-in-law was no less, bestowing love on five persons.
    Much later, the writer says Draupadi used to change husbands like the cards. She lived her life like a queen of ace, controlling her husbands and lording over them. For instance, once while walking in the forest, she suddenly fell down. Yudhistara cried at her fate. Bhima, Nakula and others hoisted her onto their shoulders and began to walk. The writer says if she were the wife of just one man, would she have had such luxury? It’s not a case of contradiction. It’s rather a case of It’s the writer’s point of view. Take it or leave it.
    అనువాదకుడు హరిమోహన్ ఝా గురించి ఇలా అన్నారు: “ఆయన (ఝా) హిందూమత గ్రంథాలను, భారతీయ సంస్కృతిని విమర్శించాడని, పరిహసించాడని సనాతనవాదులు ఆయనపైన దాడి చేశారు. ఆయనను తీవ్ర విమర్శకు గురిచేశారు. కాని, ఈ రచనకందిన అపూర్వ జనాదరణ ముందు వారి ఆగ్రహావేశాలు ఎంతోకాలం నిలువలేకపోయాయి.”
    ఈ రచనకు అర్థం, ఫలం గురించి అనువాదకుడు చెప్పిన మాటలు ఇవి: “వక్రీకరణ, చీకటికోణాల అన్వేషణ కావ్యశాస్త్ర వినోదానికి ప్రాణం అని గుర్తుంచుకుంటే పాఠకులకు ఇందులో మన శాస్త్ర పురాణాల చీకటి చిత్రాలు మాత్రమే ఉన్నట్లు, వాటి వెలుగును ఉపేక్షించినట్లు అనిపించదు. అంతేకాక మన ప్రాచీన సంప్రదాయాల ప్రశస్తిగీతాలు ఇంతకాలమూ ఇలానే రాయడం జరిగింది. వాటిలో కొంత సమతూకం తీసుకురావడానికి ఇలాంటి రచనలు అవసరం.”
    అనవసరమా!? Who cares but ఎవరి హక్కు వారిది.
    తెలుగులో అనువాదం కొత్త కాని ఎన్నో దశాబ్దాల క్రితం హరిమోహన్ ఝా రచనలివి.
    అక్కడక్కడా కస్త చురుక్కుమని తగిలినా, కటువుగా తోచినా, గడుసుతనం, వ్యంగ్యం పుష్కలంగా ఉన్న వ్యాసాలివి. నవ్వగలిగితే సరి. వినోదం కోసమైనా చదవాల్సిన పుస్తకం.
    I rest my case. Thanks.

    1. ధీర

      మీరు చెప్పినవన్నీ సమీక్షని సమర్ధించేవిగానే వున్నాయి.
      రాముడి తప్పేం లేదు అనిపించడానికి “వాళ్ళ నాన్న కూడా తొందరపాటు మనిషి” అన్న ఒక్క కారణం సరిపోతుందా! అసలది ఒక తర్కమా!
      సీత బాధని చెప్పడానికి “ఒక సాధారణ పౌరుడికి వున్న అధికారం కూడా మహారాణికి లేకపోయింది.” అనడం అవసరమా!
      మిగతా విషయాలు (రాముడు అల్లుడు కాబట్టి ఏమైనా అనవచ్చుననడం, ద్రౌపది గురించిన వ్యాఖ్యలు) నేను వ్రాసినవే మీరు ఇంగ్లీషులో వ్రాశారు.
      అయినా అల్లుడు కాబట్టి అని తేల్చేయడానికి రాముడిపై చేసినవి సాధారణ విమర్శలు కావు. మొత్తం ఆయన జీవితంలోని ప్రతి సంఘటనా, నిర్ణయం, ప్రవర్తనా- అన్నిటినీ విమర్శించి అసలు రామాయణంలో ఉన్న ఒకే ఒక్క ఆదర్శ పాత్ర “రావణుడు” అని తీర్మానించి, ఆ తర్వాత అల్లుడు కాబట్టి నేనేమైనా అనచ్చు, బ్రాహ్మణుడిని కాబట్టి నేనేమైనా అనచ్చు అనడం అందంగా లేదు. హాస్యంగానూ లేదు.
      భగవద్గీత గురించిన వక్రభాష్యం, భారతాన్ని గురించిన అసత్యాలు, బ్రాహ్మణులపై అవహేళనలు – ఈ మూడూ తర్కానికి ఎటూ నిలబడవు.

  13. ధీర

    నారాయణస్వామిగారు, మీరొకసారి ఈ పుస్తకానికి అనువాదకులు లక్ష్మిరెడ్డి గారు వ్రాసిన ముందుమాట చూడండి.
    “భంగుమత్తులో వికటకవి చిన్నాన్న చేసిన ప్రలాపాల రూపంలో రచించబడినా వీటిలో ఒక గొప్ప మేధావి నిశిత పరిశీలన, ప్రభావితం చేసే అభివ్యక్తి, కీలెరిగి వాత పెట్టడం లో ఆయన గడుసుతనం స్పష్టంగా కనిపిస్తాయి.” అన్నారాయన.
    అంతే కాదు మూల రచయిత సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపకరించే అమోఘమైన ఆయుధంగా వ్యంగ్యాన్ని మలచుకుని సాహిత్య రచన చేశారనీ, అయితే ఆయన హిందూమత గ్రంధాలను విమర్శించినందుకు సనాతనవాదులు తీవ్ర ఆగ్రహావేశాలు వెలిబుచ్చారనీ వ్రాశారు. అంటే అర్ధం నేనొక్కదానినే ఘోరంగా పొరబడలేదనే కదా!

  14. లక్ష్మీదేవి

    నారాయణస్వామి గారూ,
    గిరీశం కామెడీ హీరోగానే ప్రెజెంట్ చేయబడ్డాడు.
    మరి ఈ పుస్తకం కామెడీకోసం కాక సీరియస్ గా వ్రాసినట్టున్నారు కదా. పైగా విజ్ఞానదాయకంగా ఉన్నాయని చంద్రహాస్ గారన్నారు.
    భౌతికశాస్త్రంలో ఈసారి నోబుల్ ప్రైజ్ వచ్చిన వారు కనుగొన్నదానికీ,
    నీవారశూకమత్తన్వీ…..ణూపమా” కూ ఏమన్నా లంకె ఉందేమో వివరించమని మనవి.

  15. S. Narayanaswamy

    మీరు ఈ పుస్తకాన్ని అర్ధం చేసుకోవడం సంగతి తరవాత, ఎప్రోచ్ అవడంలోనే ఘోరంగా పొరబడ్డారని నిర్ధారణగా చెప్పగలను. గిరీశం డయలాగుల్ని సవాలక్ష సార్లు స్మరించుకుంటాం, కోట్ చేస్తాం. అలాగని గిరీశం మనకి అనుసరణీయుడని ఎవరూ అనుకోరు.

    1. ధీర

      ఈ పుస్తకానికి గిరీశం ఎవరు? వికటకవి చిన్నాన్నా! ఆయన మాటలు అనుసరణీయాలు కావని ఈ పుస్తకాన్ని మెచ్చుకున్న పాఠకులందరూ అనుకుంటున్నారని మీరనుకుంటుంటే మీరే ఘోరంగా పొరబడుతున్నారని చెప్పవలసి వస్తుంది. ఇక్కడ చంద్రహాస్ గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఈ పుస్తకం వ్యంగ్యంగా వ్రాయబడింది కానీ వ్యంగ్యమే ధ్యేయంగా వ్రాయబడలేదు. కనీసం దీని ప్రచారం అలా జరగడం లేదు. అదే నా సమీక్ష లో వ్రాశాను. [హాస్యాన్ని అందించడం మాత్రమే ధ్యేయమయిన పుస్తకంలో అయితే వక్రీకరణలనీ, వేళాకోళాలనీ పాఠకుడు కొంతవరకూ పట్టించుకోకుండా వదిలేస్తాడు. “సరదాకి అంటున్నాడు కానీ అది నిజం కాదని ఆయనకీ తెలుసు” అన్న భావంతో. అయితే పాఠకుడికి అప్పటివరకూ తెలియని కొత్త నిజాలనీ, విజ్ఞానాన్నీ అందిస్తున్నానని ప్రకటించుకునే పుస్తకంలో అసత్యాలూ, వక్రీకరణలూ వుండకూడదు కదా!]
      నేనూ వ్యంగ్యాన్ని ఆనందించగలను. అయితే అది అబద్దాల మీద కాక నిజాల మీద ఆధారపడి వుండాలి.

  16. చంద్రహాస్

    “ఇలాంటి రచనలు చదివినపుడల్లా, ఇంత ఘోరంగా పాఠకులని అవమానించే రచయితలుంటారన్న అవగాహన కలుగుతుంది. నిజం. ఆకోణంలో మన జ్ఞానం నిస్సందేహంగా పెరుగుతుంది” అన్నారు reviewer ధీర గారు. ‘బడు’ల ప్రయోగం నాకు నచ్చదు. కానీ ఈ పుస్తకం చదివి నేను అవమానింపబడలేదని మాత్రం స్పష్టంగా చెప్పగలను. అంతేగాక నాకైతే ఈ వ్యాసాలు చాలా విజ్ఞానదాయకంగా ఉన్నాయి.ఏ వ్యాసంలోనైనా, ఒక వాక్యాన్నో, ఓ పదాన్నో మాత్రమే చదివితే (ఈ review లోలా)అర్థం తప్పుగా రావడానికి అవకాశమెక్కువ. హరిమోహన్ ఝా ప్రసంగాల్లో ప్రతి మాటకూ, ప్రతి వ్యాఖ్యకు ఆధారం (శ్లోకాలు, వగైరాలు) కూడా ఇచ్చారు. Satire నచ్చని వాళ్ళు, మన శాస్త్రాల్ని ప్రశ్నించడం తప్పు అనుకొనే వాళ్ళు ఈ పుస్తకాన్ని ban చేయమని అడుగలేదు. అందుకు సంతోషం.

    1. కామాక్షీ దేవి

      “ఏ వ్యాసంలోనైనా, ఒక వాక్యాన్నో, ఓ పదాన్నో మాత్రమే చదివితే (ఈ review లోలా)అర్థం తప్పుగా రావడానికి అవకాశమెక్కువ.” – నిజం. ఇదే విషయం పురాణాల లోనుంచి ఉదహరించిన శ్లోకాలకీ వర్తిస్తుంది. ఈ పుస్తకం చదివిన వారందరూ పురాణాలు ఆమూలాగ్రం చదివి వుండకపోవచ్చు. కనుక వాటి గురించి పుస్తకంలో తప్పుగా అర్ధం వచ్చిందని గ్రహించనూ లేకపోవచ్చు.
      మరి ఇక్కడ సమీక్షలో కూడా ఉదాహరణలు (పుస్తకం లోనుంచి) స్పష్టంగా ఇవ్వబడినాయి కదా, ఒక మాటో, ఒక పదమో తీసుకుని సమీక్షించలేదు కదా! తప్పు అర్ధం ఎందుకు వస్తోంది? స్పష్టంగా యిచ్చిన ఉదాహరణల పై వ్యాఖ్యానించండి. అవి పుస్తకం లో రాసిన దాన్నుంచి ఒకవేళ వక్రీకరించబడి వుంటే తెలియచేయండి.

    2. valaludu

      //ఏ వ్యాసంలోనైనా, ఒక వాక్యాన్నో, ఓ పదాన్నో మాత్రమే చదివితే (ఈ రెవిఎవ్ లోలా)అర్థం తప్పుగా రావడానికి అవకాశమెక్కువ.//
      ఏ నేపథ్యంలోనైనా ఆ వాక్యాలకు సమర్థన ఎలా ఉంటుందండీ? వివరణ ఇస్తే బావుంటుంది.

Leave a Reply