దొరకని పుస్తకాల కోసం..
సూరంపూడి పవన్ సంతోష్
*******
ఎందరో మహాపాఠకులు… అందరికీ వందనాలు…
ఏళ్లుగా పుస్తకాల షాపుల వాళ్ళను అడిగి.. అలిసి.. విసిగిన పుస్తకాల జాబితా ఇది. ఈ జాబితా చదివి “ఓహో.. ఈ మాత్రానికి ఇంత ఇదైపోవాలా? నా దగ్గరే ఒక్కో పుస్తకమూ రెండు మూడు కాపీలు పడున్నాయవి. ఇంతోసి మహాభాగ్యానికి వ్యాసం రాసి ఇ-వేస్టు చెయ్యడం కూడానా” అనో, “భలేవాడివయ్యా వెతికి అలిసిపొయావంటే ఎంటో అనుకున్నాను. ఫలానా పుస్తకం విజయవాడలోనే దొరుకుతుంది కదా” అనో అంటారని తెలుసు. అలా అనిపించుకుని “సంతోషం.ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. కొనేందుకు దొరకదు అనుకుంటే ఓ పుస్తకం ఇవ్వండి చదివి భద్రంగా తిరిగిచ్చేస్తా. లేదంటే ఫోటోకాపీయో, స్కాన్డ్ కాపీనో పంపండి” అనడిగేద్దామని ఆశిస్తూనే ఈ వ్యాసం రాస్తున్నాను. ఇవీ ఆ పుస్తకాలు, ఓ మాటు చూడండి.
1.శివదర్పణం -సిరివెన్నెల సీతారామశాస్త్రి:
సినీ కవి సిరివెన్నెల ప్రేక్షకుల కోసమో, ఏవేవో సందర్భాల కోసమో పాటలు రాస్తూంటే, సీతారామశాస్త్రి శివునిపై ప్రేమతో, భక్తితో తనకై తాను రాసుకున్న కవితలట ఇవి. కొన్ని కవితలు మా గురువుగారు వల్లూరి విజయ హనుమంతరావుగారి సంపాదకత్వంలోని “సుపథ” ద్వైమాసిక పత్రికలో వేస్తూండగా చదివాను. చాలా నచ్చేశాయవి. ఐతే ఆయన వద్దననున్న కాపీ పత్రిక కోసం ఉపయోగిస్తూండడంతో నాకివ్వడం పడలేదు. పుస్తకమా ముద్రణలో లేదు. నాకా చదవాలనే కోరిక పెరిగి పెరిగి విశ్వరూపం ఎత్తేసింది. అలాగని నేనేమీ ఊరుకోలేదు. పాతపుస్తకాల షాపుల్లో ప్రయత్నించాను. ఆ క్రమంలో సిరివెన్నెల గారి సన్నిహితుల్నీ, ఆయన అంతేవాసుల్నీ అడిగాను. ఇప్పుడప్పుడే ప్రింట్లో వచ్చే సూచనలున్నట్టుగా వారు చెప్పలేదు. కాబట్టి మీ దగ్గరుంటే కామెంటండి.
2.సుబ్బణ్ణ -మాస్తి వెంకటేశ అయ్యంగార్:
మాస్తి వారికి నేను వీరాభిమానిని. ఆయనకు జ్ఞానపీఠ తెచ్చిపెట్టిన చిక్కవీర రాజేంద్ర నవల(ఎన్.బీ.టీ. ప్రచురణ) నాకు పారాయణ గ్రంథం. అనువాదంతో సమస్యలు ఉన్నా అస్తమానూ “మాస్తి చిన్న కథల”నే పుస్తకం చదువుకుంటూంటాను. ఆ క్రమంలో సుబ్బణ్ణ అనే ఆయన నవలిక చదివి తీరాలని నిశ్చయించుకున్నాను. పైగా అది తెలుగు అనువాదంలో దొరుకుతూందని తెలియడంతో నాకిక ఉత్సాహం ఆగట్లేదు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, సాహిత్య అకాడెమీల బెంగళూరు ఆఫీసుల్లో గాట్టిగా అడిగి చూశాను. లేదు అని వాళ్లు మెల్లిగా చెప్పారు. అదండీ సంగతి.
3.భారతి మధుర కవితలు:
సుబ్రహ్మణ్య భారతి పేరు వినపడితే వేపరొట్టలు కొట్టే స్థాయికి వెళ్ళిపోతుంటాను (అంటే పూనకం రావడమని అర్థమట. మా మోదుగుల రవికృష్ణ గారు ఈ మధ్య చెప్పారు. అదును దొరికింది కదాని వాడుకలో పెట్టేశాను 🙂 ). నాకు తమిళమ్ముక్క రాకున్నా భారతి పాటలు సినిమాల్లోవీ, ప్రైవేటువీ, కచేరీల్లో పాడినవీ డౌన్లోడు చేసుకుని వింటూంటాను. గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి అర్థాలు తెలుసుకుంటూంటాను. (ఇప్పటికే ఆయనవి చాలా కవితలు/పాటలు నోటికొచ్చేశాయి. మొన్నోరోజున మా ఊళ్లో “చిన్నంజిరు కలియే కణ్ణమ్మా” పాట హం చేస్తోంటే ఎక్కణ్ణించో మా తమిళ లెక్చరర్ వచ్చి అదాటున కౌగలించుకుని రొంబ ఆనందం పడిపోయారు). ఒక్క డైలాగూ సరిగా అర్థం కాకున్నా ఒక్కణ్ణే “భారతి” అనే బయోపిక్ చూస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోతూంటాను. జాలంలో భారతి అభిమానులు పెట్టే ఉడికీ ఉడకని ఆంగ్లానువాదాలు చదువుతూంటాను.
ఎన్.బీ.టీ.వారు ఇక్ష్వాకుల కాలంలో అచ్చొత్తి, కృష్ణుడి కాలంలో అమ్మేసిన “భారతి మధుర కవితలు” పుస్తకం అన్యాయంగా కాటలాగులో ప్రతీయేడు రెచ్చగొట్టే ధోరణిలో “స్టాకులేదు”(మళ్ళీ అచ్చొత్తే ఉద్దేశం లేదు అన్న మాట రాయకపోయినా నాకు అందులో వినిపిస్తూంటుంది) అని వేస్తూంటారు. damn insult. “అహో ఒక్క కాటలాగు నన్ను చూచి నవ్వుటయా.. హతవిధీ” అని నాలో నేనే అనుకుంటూంటాను. అలా చూసినా ఎలా చూసినా నాకీ పుస్తకం కావాలీ, కావాలీ, కావాలి. అందుకు మీరే సాయం చెయ్యాలి.
4.మరువలేని మాటలు-బూదరాజు రాధాకృష్ణ:
అవి నేను ఇంటర్మీడియట్ ముగించి విజయవాడలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్న రోజులు. (భయంలేదు. అహనా పెళ్ళంటలో నూతన్ ప్రసాద్ చెప్పేలాంటి ఆత్మకథేమీ మొదలుపెట్టలేదు. ఇట్టే అయిపోతుంది) రెండువారాలకో ఆదివారం నాడు “ఔటింగ్” ఇచ్చేవారు. నేను “విశాలాంధ్ర బుక్ హౌస్” దర్శనం చేసుకునేవాణ్ణి. చేతిలో ఈడ్చితంతే ఓ వందరూపాయలకు మించి ఉండేవికాదు. పది పుస్తకాలు ఎంచుకుని ఓ పుస్తకం కొనుక్కోవాల్సి వచ్చేది. ఏది పక్కనపెట్టాలో తెలియక ఎంతో ఇబ్బంది పడేవాణ్ణి. ఆ ఏడేళ్లనాడు ఎంచుకునీ కొనుక్కోలేకపోయిన పుస్తకాల్లో ఇదొకటి. ఆ తర్వాత మళ్లీ ఎన్నో పుస్తకాలు దొరికాయి కానీ ఇది ఎందరు బుక్ సెల్లర్స్ ని అడిగినా లాభంలేకపోయింది.
5.సాగరసంగమం వెండితెరనవల:
సినిమాలన్నా, నవలలన్నా నాకు ఇష్టం. ఆ రెంటికీ పుట్టిన వెండితెరనవలలంటే సహజంగా ఇంకా ఇష్టం. వంశీ, ముళ్లపూడి, రావికొండలరావు లాంటి ఎందరో రచయితలు రాసిన పలు వెండితెరనవలల్ చదివితిన్.. ఆనందిచితిన్..
సాగరసంగమం సినిమా చాలా స్తరాలుగా సాగే అద్భుత దృశ్యకావ్యం. ప్రపంచస్థాయిలో ఎవడికైనా “యస్. ఇదీ మా సినిమా, చూడు బావుంటుంద”ని చెప్పి చూపించి మెప్పించగల చిత్రరాజమని నా గాట్టి నమ్మకం. అలాంటిది అది వెండితెరనవలగా రావడమూ నేను చదవకపోవడమూనా.. అమ్మో ఇంకేమైనా ఉందా. లేదు. అలా జరగదు. మీరేదో ఉపాయం చూపిస్తారు.
6.వేట కథలు:
ఈ మధ్య వేట నేపథ్యంగానూ, వస్తువుగానూ తీసుకుని రాసిన తెలుగు కథలపైకి నా మనసు మళ్ళింది. పతంజలి సాహితీసర్వస్వంలో “వేట కథలు” చదివీ చదివీ మురిసిపోయాను. అప్పట్నుంచీ నన్ను అడవి పిలుస్తోంది (మరీ లిటరల్ గా తీసుకోకండి). తెలుగులో గొప్ప వేటకథలు రాసినవాళ్లు- కె.ఎన్.వై.పతంజలి, అల్లం శేషగిరిరావు, పూసపాటి కృష్ణంరాజు అన్నంతవరకూ నాకు తెలుసు. కానీ ఇంకెవరైనా ఉన్నారో ఏమో నాకు తెలీదు. పతంజలి వేట కథలెటూ నేను కొనుక్కున్న స్వంత పుస్తకంలో చదివాను కదా. అల్లం శేషగిరిరావు గారి చీకటి వివిధ కథల సంకలనాల్లో చదివాను. వాసిరెడ్డి నవీన్ గారు అరువిస్తే శేషగిరిరావు గారి “మంచిముత్యాలు” కథాసంకలనంలో “ఎండమావులు”, “డెత్ ఆఫ్ ఎ మానీటర్”, “వఱడు”, “పులిచెరువులో పిట్టల వేట” కథలు చదివాను. మరో సంకలం, ఇంకొన్ని వేటకథలూ అల్లం వారివి ఉన్నాయని తెలుసు కానీ ఇంకెవరన్నా జాడచెప్పి పుణ్యం కట్టుకోవాలి. పూసపాటి కృష్ణంరాజు గారి దివాణం సేరీవేట కథాసంకలనం ముద్రణలో లేదు. చాలామందిని అడగ్గా చివరకు మోదుగుల రవికృష్ణ గారి దగ్గర వేట ముగిసింది. ఆయన తొందర్లో పంపనున్నారు. “బాబూ ఈ సొంతసోదంతా ఎందుకో చెప్తే…” అనెలానూ అడగబోతున్నారని నాకు తెలుసు. కనుక పాయింటులోకొచ్చేస్తున్నాను. ఇంకా ఏమైనా తెలుగులో మంచి వేటకథలున్నాయి అని మీకు తెలిస్తే చెప్పి, వాటి జాడ ఇవ్వండి. అలాగే శేషగిరిరావు గారి ఇతర వేట కథలేమైనా ఉంటే చెప్పండి. వీలుంటే అరువివ్వండి.
7.వార్తల వెనుక కథలు:
వార్తల ప్రపంచం వేరు. డెడ్ లైన్స్, స్పెషల్ ఐటంస్, స్కోర్ అంటూ నిత్యం పరుగులు పెట్టాల్సిన రేసు జర్నలిస్టుల జీవితం. రాజకీయాల నుంచి సినిమాల వరకూ వార్తల్లో చెప్పలేని ఎన్నో లోతులు తెలుస్తాయి వాళ్లకు. ఒక్కోసారి ఒక్క వార్త వెనుక ఎన్నో రోజుల శ్రమ, ఎంతో ప్రమాదకరమైన సాహసం ఉంటుంది. వార్త రాశాకా ఊహించని స్పందన ఎదురుకావచ్చు. విలేకరులతో, వార్తాజగత్తుతో చాలా సన్నిహిత సంబంధాలున్నవాడిగా నాకివి తెలుసు. రాష్ట్రస్థాయిలో పేరొందిన జర్నలిస్టులు తమ కెరీర్లో ఆసక్తికరమైన “వార్త వెనుక కథ” ఒకటి ఎంచి చెప్తున్నారంటే నాలాంటి వాడు చెవులు రిక్కించాల్సిందే. ఐతే కాస్త అలక్ష్యం చేశాను, తీరా చూస్తే ప్రింట్లో లేకుండా పోయింది. కానీ నాకీ పుస్తకం కావాలీ.. ఈ.. ఈ..
8.పేరు కూడా తెలీయని కొన్ని…:
ఇది మరీ అన్యాయం అని మీరంటే నేను “అవునవును” అని ముందుకుపోతాను తప్ప మడమతిప్పను. “కొమ్మకొమ్మకో సన్నాయి” వ్యాసాలకే అదిరిపోయిన నాతో “గతంలో వేటూరి గారు ఇంతకన్నా మంచి వ్యాసాలు జ్యోతి చిత్రలో ధారావాహికగా రాశారు. పుస్తకం కూడా వచ్చింద”న్నారు మా గురువు గారు. ఐతే అది ఆయనవద్ద కూడా లేదుట. పేరూ గుర్తులేదట. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అలానే స.వెం.రమేశ్ గారు పొరుగురాష్ట్రాల్లో తాము తెలుగు మాతృభాషగా కలవారిమని మరిచిపోయిన కొన్ని కులాల్లో వారికే తెలియకుండా వినిపించే తెలుగు, పొరుగు రాష్ట్రాల్లో సంప్రదాయాల్లో కూడా నిలిచిపోయిన వేమన పద్యాలు వంటి విశేషాలతో ఓ పుస్తకం రాశారని ఈనాడు ఆదివారం సమీక్షలో చదివాను. పుస్తకం పేరు గుర్తులేదు. ఐతే సమీక్ష పేరు మాత్రం గుర్తుంది-పొరుగు తెలుగు. ఇంతకీ అదేం పుస్తకమో ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే చెప్పండి.
ఇవండీ ఆ పుస్తకాలు. చివరిగా ఓ మాట. పైవాటిలో ఏ పుస్తకమైనా ఖరీదుకి దొరుకుతుందంటే కొనుక్కుంటాను. మీ వద్ద ఉండీ మీరివ్వగలిగితే చదివి భద్రంగా తిరిగిస్తాను. పీడీఎఫ్ రూపంలో ఉందంటారా మీకు నా మెయిల్ ఐడీ చెప్తాను.
ఇంతే సంగతులు… చిత్తగించవలెను.
B Krishna Rao
https://logilitelugubooks.com/book/allam-seshagiri-rao-kathalu-telugu-book-by-allam-seshagirirao
https://www.goodreads.com/book/show/61188143
పార్థు
బొమ్మలు రంగులు వేయడం నేర్చుకోవడం కోసం బుక్స్ ఉన్నాయా తెలుగు లో
BANGARU RAMACHARY
Thanq
sekhar
ఈ పుస్తక పరిచయం బాగా ఉన్నది
PVS SATYANARAYANA
వార్తల వెనుక కథ ద్వితీయ ముద్రణ ఇటీవలనే నవంబరులో వెలువడింది. కినిగె డాట్ కం లో అద్దెకు/అమ్మకానికీ రెండు రకాలుగానూ లభిస్తున్నది. ప్రయత్నించండి. నాకు కూడా మొదటి ముద్రణ సమయంలో చదవటం సాధ్యపడ లేదు. ప్రస్తుతం కినిగె ద్వారనే చదువు తున్నాను. ఛాలా మంచి పుస్తకం.
A.Surya Prakash
మీ పుస్తకాల వేట అదిరింది! మీరున్నూ నాలాగే పుస్తకప్రియులన్నమాట!సంతోషం!
niteesh
sri sri mahaprasthanam ekkada dorukuthundo cheppagalaru??!!
Dr.Murthy Remilla
idi chaalaa sulabham ga dorukutundande… anni book shop slo, mukhyam ga visaalaandhra shop lo dorukutundi. in case meeru HYD lo vunte, Dec 15th nunchi pustaka pradarsana kuda jaragabotondi..
Kmaheswar
Nenu eemadya iliyanashathakam chadivanu deenirachayitha dr r.vimalraj
Manjari Lakshmi
నాకు కూడా మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల కావాలి. అది reprint అయినట్లు లేదు. ఎవరి దగ్గరన్న ఉంటే ఇస్తే చదివి మరల ఇచ్చేస్తాను. కనీసం చదివిన వాళ్ళు ఉంటే అందులో heroin పేరు కావాలి. తెలుపగలరు.
Phani Puranapanda
ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని మాహోర్(?) సంస్థానం నేపథ్యంలో వేట కథలు సదాశివరావు గారనుకుంటా రాశారు… ఆంధ్రప్రభ వీక్లీ చివరి నాళ్ళలో ప్రచురించినట్టు గుర్తు. కథలు చాలా అద్భుతః. శీర్షిక పేరు గుర్తు లేదు, కానీ అవి ఎంత మాత్రం మిస్ అవకూడని కథలు. సహజంగానే నేను అవి పోగొట్టేశాను 🙁 పుస్తక రూపంలో కూడా వచ్చినట్టు గుర్తు. సంతొష్ గారూ… ఈ హింట్స్‌తో ట్రై చేయండి. దొరికితే నాక్కూడా సాఫ్ట్ కాపీ పంపండి ప్లీజ్
pavan santhosh surampudi
వీటి గురించి వాసిరెడ్డి నవీన్ గారు కూడా చెప్పారు సార్. ఆయన వద్ద కూడా లేవట. ఓమారు విజయనగరంలో కారా మాస్టారి కథానిలయానికి వెళ్లి కనుక్కుంటాను. ఎలాగైనా పట్టుకుతీరాలి.
nagesh
నా వంతుగా నేను.. సం.వెం రమేష్ నెంబర్ ఇవ్వగలుగుతున్నా.. ఆయన్ను సంప్రదించండి..08500548142
pavan santhosh surampudi
thank you
buchireddy gangula
digambara kavithvam–part -1 &2 and 3
cherabandaraju poetry—plus complete sahityam
looking for those books—– please help me where to find them
e -mail me
hanamkonda@aol.com
———————-
buchi reddy gangula
usa
prasanth
patanjali’s veta kathalu are now available in his omnibus released by manasu foundaton which is priced at 500 rs.
pavan santhosh surampudi
సారీ అండీ వేటకథల్లో ఇప్పటికే పతంజలివీ, చాలావరకూ అల్లం శేషగిరిరావు గారివీ చదివేశాను. పూసపాటి కృష్ణంరాజుగారి కథలు అడిగిపుచ్చుకున్నాను. ఇక వీరు కాక ఇంకెవరైనా రాసి ఉంటే చెప్పమనే అడిగానీ వ్యాసంలో. ఎనీవే థాంక్స్.
దొరకని పుస్తకాల కోసం.. | Bagunnaraa Blogs
[…] అతిథి సూరంపూడి పవన్ సంతోష్ ******* ఎందరో […]
tprashanth
maruvarani matalu hyderabad navodayalo chusinattu gurtu prayatninchagalaru