జిగిరి
వ్యాసకర్త: రాగమంజరి
******
బడుగు జీవుల బాధలని చిత్రించిందనే అబద్ధపు ముద్ర వేయబడిన నవల – జిగిరి
ఈ మధ్య కాలంలో తెలుగు నుండి ఇతర భాషలలోకి అనువాదాలు కాస్త పెరిగాయి. తమ రచనలని హిందీ, ఇంగ్లీషు మొదలైన ఇతర భాషలలోకి అనువదింప చేసుకోవడానికి ఇప్పటి రచయితలు కృషి చేస్తున్నారు. పాత రచయితలకన్నా యిప్పటి రచయితలకి ఆసక్తీ, ఆర్థిక వెసులుబాటూ, ప్రచార నైపుణ్యమూ ఎక్కువగా వుండడం దీనికి ఒక కారణం కావచ్చు. అయితే వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగేలా వున్న కొద్ది మంది అనువాదకులూ స్నేహ ధర్మంగా కావచ్చు, ఆ రచనలపై వున్న వ్యక్తిగత ఇష్టంతో కావచ్చు కొందరి రచనలనే అనువదించ పూనుకోవడం కనిపిస్తోంది. గమనిస్తే ఒక్కొక్క రచయిత/రచయిత్రి వ్రాసిన ప్రతి పుస్తకమూ విడుదలయిన వెంటనే ఇతర భాషలలోకి అనువదింపబడుతోంది. నిజంగా ప్రతి రచనా ప్రతిభావంతంగా చేసే సమకాలీన రచయితల రచనలు ఇతర భాషలలోకి వెళ్ళ వలసిందే. సమకాలీన రచనలపై వుండే ఆసక్తీ, వాటి ప్రాముఖ్యతా లెక్కింపదగినవే. అయితే ఏ రచనలు ఇతర భాషలలోకి వెళ్ళాలి అన్న విషయంలో రచయితలకీ, అనువాదకులకీ కూడా మరికొంత విచక్షణా, నియంత్రణా, వడపోతా అవసరమేమోననిపిస్తుంది.
ఇటీవల వచ్చిన ఒక నవల ఇప్పటికే ఎనిమిది భాషల లోకి అనువదించబడిందనీ ఇప్పుడు తొమ్మిదో భాష (కన్నడం) లో ధారావాహికంగా ప్రచురించ బడుతోందనీ విన్నపుడు మొదట చాలా ఆనందం కలిగింది.ఆ నవల పేరు “జిగిరి”. ఇది 2006 ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) నవలలపోటీలో ప్రథమ బహుమతి గెలుచుకొందట. అయితే ఎనిమిది భాషలలోకి అనువదించబడిన అత్యుత్తమ నవలగా విపరీత ప్రచారం జరిగిన ఈ నవలని చదివాక మాత్రం చాలా నిరాశ కలిగింది. ఇంత అసంబద్ధమైన నవల ఎనిమిది తొమ్మిది భాషలలోకి వెళ్ళిందంటే కొంచెం బాధా వేసింది.
ఎలుగుని ఆడించి బ్రతికే ఒక కుటుంబం కథ యిది. ఇమాం, బీబమ్మ వాళ్ళ కొడుకు చాంద్. ఎలుగు షాదుల్. ఇవీ నవల లోని ముఖ్య పాత్రలు. ఆరునెలల పిల్లగా వున్నపుడు షాదుల్ ని దాని తల్లి నుంచి విడదీసి ఎత్తుకొస్తాడు ఇమాం. దానికి నేర్పవలసిన ఆటలన్నీ నేర్పుతాడు. చాలా ఏళ్ళు దాని సంపాదనతోనే కుటుంబం బ్రతుకుతుంది. వాళ్ళ కొడుకు చాంద్ పెద్దవాడవుతాడు.
ఎలుగుని ఆడించడం నేరం కనుక పోలీసులు అపుడపుడూ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు పోలీసులకి డబ్బులిచ్చీ, వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినీ మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం జరుగుతూ ఉంటుంది. “అంతకన్నా మరో జీవనోపాధి లేదు కనుక వాళ్ళకి గత్యంతరం లేదు” అనేది సమర్థన. అది పూర్తిగా ఒప్పుకోదగిన సమర్థన కాదు. అయినా సరే ఆ విషయాన్ని ఒప్పుకుందాం. అయితే ఈ నవలలోని అసంబద్ధత అక్కడితో ఆగదు. అక్కడ మొదలవుతుందంతే.
ప్రభుత్వం నుంచి కొంత భూమి పొందే అవకాశం వస్తుంది వాళ్ళకి. ఆ భూమి పొందాలంటే మరో జీవనోపాధి వుండక పోవడం అర్హత. వీళ్ళకి నిజంగానే న్యాయమైన జీవనోపాధి లేదు. అంతకుముందు పోలీసుల చేతులు తడిపి ఒక చట్టవిరుద్ధమయిన పనిని చేస్తూ పొట్ట గడుపుకుంటున్నారు కనుక ఇపుడు ఆ పనిని వెంటనే మానేస్తే సరిపోతుంది. అయితే అలా చేస్తే ఈ నవల లేదు. అందుకని మెలికే లేని చోట ఒక నాటకీయమైన మెలిక పెడతాడు రచయిత. “ఎలుగు ఇప్పుడు లేదు. చచ్చిపోయింది.” అని చాంద్ చేత అధికారుల దగ్గర అబద్ధం ఆడిస్తాడు.
ఇక అక్కడి నుంచీ ఆ ఎలుగుని చంపడం యిష్టం లేని ఇమాం, చంపాల్సిందే నని పట్టుపట్టే బీబమ్మ, చాంద్ లు, ఈ విషయం చుట్టూ లేని పోని ఉద్వేగాలు, సంక్లిష్టతలు. చివరికి ఎలుగుతో పాటూ ఇమామ్ కూడా అడవిలోకి వెళ్ళి పోవడం, ఇద్దరూ తిరిగి రాక పోవడం- ఇదీ కథ. ఎలుగు ఉన్నా కూడా ఎలుగుని ఆడించుకుని బ్రతకడం అనేది ప్రభుత్వానికి తెలిసేలా బాహాటంగా చేస్తున్న పని కానప్పుడు.. అది ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా సాగుతున్నపుడు.. ఇప్పుడు చాంద్ “అది వారం క్రితం చచ్చిపోయింది” అని అబద్ధం ఆడడం వల్ల ఒనగూడే ప్రయోజనం అసలేమీ లేదు. భౌతికంగా ఎలుగు వుంది. దానిని ఆడించుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. అది అందరికీ తెలుసు. ఊరి వాళ్ళకీ, పోలీసులకీ, అధికారులకీ, అందరికీ. అ పనిని ఇప్పుడు మానేస్తామంటే పోలీసుల నుండి, అధికారుల నుండీ లభించేది సమర్ధనే కానీ వ్యతిరేకత కాదు. మరిక అబద్ధం ఆడడం ఎందుకు?
లేదు.. ఇన్నాళ్ళు ఆడించినందుకు శిక్షిస్తారన్న భయంతో అబద్దం ఆడాడేమో! అనుకుందాం అంటే అదీ తర్కానికి అందదు. ఎందుకంటే ఆ భయమూ, దాని నుండి తప్పించుకునే అలవాటు ఎప్పుడూ ఉన్నవే. దానికీ స్థలం పొందే అర్హతకీ సంబంధం లేదు. స్థలం సంపాదించుకున్నా సంపాదించుకోకున్నా, ఎలుగుని ఆడించి డబ్బులు చేసుకున్నా చేసుకోక పోయినా దానిని ఊరకే ప్రేమతో ఇంట్లో అట్టే పెట్టుకోవడమూ నేరమే. పైగా కేవలం వారం క్రితమే కదా ఎలుగు చనిపోయిందని చెప్తున్నాడు! అంటే అప్పటివరకూ అది వాళ్ళ దగ్గర ఉందన్న నేరాన్ని ఒప్పుకుంటున్నట్లే కదా! దాని బదులు “అవునండీ, ఇప్పటి వరకూ ఆడించాం, ఇపుడిక మానేస్తాం” అని నిజమే చెప్పవచ్చు. అలా చెప్తే “లేదు,లేదు ఎలుగు వుంది కదా మీకు, దాన్ని ఆడించుకోండి. అదే మీ జీవనోపాధి.” అనరు కదా అధికారులు!
కనుక నిజ జీవితం లో చాంద్ అసలా అబద్ధం ఆడే అవకాశం లేనే లేదు. అటువంటపుడు అలా అబద్ధం ఆడాడని రాసి, దాని వలన వచ్చిన డ్రామాతో కథ నడిపితే ఇక అది బడుగు జీవుల కథ ఎలా అవుతుంది? బడుగు జీవుల సహజమైన కష్టాలు రాస్తే అది బడుగు జీవుల కథ, వ్యథ అవుతుంది కానీ ఒక పాత్రతో అనవసరంగా, అనౌచిత్యంగా ఒక అబద్ధం ఆడించి, దాని వల్ల వాళ్ళకి కొన్ని నాటకీయమైన కష్టాలు కల్పించి “ఇది బడుగు జీవుల కథ” అని ముద్ర కొడితే ఎలా?
సరే, దీనినీ ఒప్పుకుందాం కానీ ఈ నవల అసంబద్ధత ఇక్కడ కూడా ఆగదు. అలా అబద్ధం ఆడినా కూడా నవలలోని నాటకీయతకంతటికీ మూలమైన షాదుల్ ని చంపడం అనే అంశం రావలసిన అవసరం లేనే లేదు. చాంద్ ఆ అబద్ధం ఆడిన తర్వాత తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంభాషణ ఇలా వుంటుంది.
‘‘ఎమ్మార్వో ఊర్లె లేడట. రేపైతే అన్ని తెలుస్తయట. కానీ ఒక కండీషన్ పెట్టిండు ….’’ అన్నాడు చాంద్.
‘‘కండీషనా ….? ఏంటిది ….?’’ ఏదైనా చేస్తా అన్న ధీమాగా అడిగాడు ఇమామ్.
‘‘గుడ్డేలుగును ఆడియ్యద్దట’’ చెప్పాడు చాంద్.
ఇమామ్ నవ్వుతూ ‘‘ఎందుకాడిత్తం …. ఎప్పుడాడిత్తం …. భూమి ఇస్తే మనకే చేతినిండ పని ఉంటది గదా’’ అన్నాడు.
‘‘షాదుల్‌ను పట్నంల జంతు ప్రదర్శనశాలకు అప్పజెప్పాలెనట …. మన ఇంట్లనే ఉండనియ్యద్దట’’ అన్నాడు.
ఇమామ్ ఉల్కిపడ్డడు. గుండె దడదడ కొట్టుకుంది. కొడుకు ఎంత బలమైన నిర్ణయం తీసుకున్నాడో ఆ క్షణంలో అతనికి తెలియదు. అందుకే తెలిగ్గా కొట్టిపారేస్తూ ‘‘నువ్వేం చెప్పినవురా’’ అన్నాడు ఇమామ్.
‘‘మా దగ్గర ఎలుగులేదు. వారం కిందనే దమ్ము రోగమచ్చి సచ్చింది’ అని చెప్పిన.
‘‘సారు ఏమన్నాడు ….?’’
‘‘సర్పంచ్‌ను ఇంకో ఇద్దరు ముగ్గురిని అడిగిండు. వారం పది రోజుల నుంచి కనబడలేదు అన్నారు వాళ్ళు. సారు నా మాట నమ్మిండు. అబద్దమైతే పాణాన బతుకవు అని భయపెట్టిండు’’ చాంద్ అన్నాడు.
ఈ సంభాషణ చదివితే చాంద్ ఆ అబద్ధం ఆడడం ఎంత అసంబద్ధమో స్పష్టంగా అర్ధం అవుతుంది. స్థలం పొందడానికి షాదుల్ ని జంతు ప్రదర్శన శాలలో అప్ప చెప్పడం అనేది కండిషన్ అయినపుడు దానికి ఒప్పుకుంటే సరిపోయేదానికి అది వారం క్రితమే చచ్చిపోయిందని అబద్ధం ఆడడం ఎందుకు? ఆ తర్వాత దానిని చంపడానికి ప్రయత్నించడం అన్న విషయం చుట్టూ బోలెడంత నాటకీయతని చొప్పించడం ఎందుకు?
అసలు సంఘర్షణకి అవకాశమే లేని చోట రచయిత కృతకమైన సన్నివేశాలతో సంఘర్షణని సృష్టిస్తే సమీక్షకులు దానిని “ఈ సంఘర్షణ ఈ కథను సంక్లిష్టం చేసి రొడ్డకొట్టుడు వస్తువులకన్నా పై ఎత్తుకు వెళ్ళేట్టు చేసింది.” అంటూ ప్రశంసించడం మరింత ఆశ్చర్యాన్నికలిగిస్తుంది.
ఇంత కృతకమైన సన్నివేశాలతో, నాటకీయతతో కథ వ్రాసి దానిని బడుగు జీవుల కష్టాలపై వ్రాసిన కథగా ప్రచారం చేయడమూ విడ్డూరంగా కనిపిస్తుంది. విషయమేమిటంటే, చాంద్ అలవాటుగానో, పోరాపాటుగానో ఎలుగు చనిపోయిందని అబద్ధం ఆడినా ఆ తర్వాతయినా దానిని చంపవలసిన అవసరం లేదు. అప్పటికైనా దానిని జంతు ప్రదర్శన శాలలో అప్పగించ వచ్చు. అందుకు ఇమామ్ కి కూడా అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. స్థలం రావడం అతనికీ యిష్టమే.
ఇంత అసంబద్ధంగా రచయిత సృష్టించిన కష్టాలకి “బడుగు జీవుల బాధలు” అనే ముద్ర వేసి ఒక “అసహజమైన కల్పన” ని అత్యంత “సహజమైన జీవిత చిత్రణ” గా ప్రచారం చేయడం నిజంగా చాలా విచిత్రంగా తోచే విషయం.
ఇక పొతే, ఇది మానవత్వాన్ని ప్రతిబింబించే కథ అన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ నవల చదివితే ముందే చెప్పుకున్నట్లు మూర్ఖత్వమే కానీ మానవత్వమేమీ కనబడదు.
ఆరు నెలల ఎలుగు పిల్లని తల్లి దగ్గరనుంచి ఎత్తుకు వచ్చే సన్నివేశమే చాలా క్రూరంగా వుంటుంది. ఆ తర్వాత దానిని మచ్చిక చేసుకోవడం మరింత కిరాతకంగా వుంటుంది. ఆటలు నేర్పించడం కోసం దానిని విపరీతంగా కొడతాడు ఇమామ్. “బ్రహ్మదండి చెక్కను ఉప్పి చెక్కను విషముష్టి, ఇష్టికాంత చెక్కలను కషాయంచేసి మాగవెట్టి వారంరోజులు తాగిస్తాడు. ఎలుగు మదమంతా కరిగిపోతుంది. దాని మగతనం ఎగిరిపోతుంది. ఆరోజు నుంచి అది కుదురుగా వుంటుంది.”
ఇక్కడ గమనించ వలసింది ఏమిటంటే, ఎలుగుని ఎత్తుకు రావడం, మచ్చిక చేసుకోవడం, ఆటలు నేర్పడం కోసం హింసించడం అలాగే మరొక ప్రక్కన అది చచ్సిపోకుండా మందులు వేయడం, బీబమ్మ దానికి తన పిల్లాడికిచ్చినట్లే పాలివ్వడం – ఇవన్నీ కూడా వారు తమ జీవనోపాధి కోసం చేసిన సహజమైన ప్రయత్నాలు. అందులో వారి మంచి తనమూ లేదు, చెడ్డ తనమూ లేదు. ఒకదాన్ని “మానవత్వం” అంటూ ప్రశంసిస్తే రెండో దాన్ని “రాక్షసత్వం” అంటూ నిరసించాల్సి వస్తుంది.
నిజమైన సమస్యలనీ, పరిష్కారాలనీ చర్చించే సహజమైన రచనలు ఎన్నో తెలుగు సాహిత్యంలో వుండగా ఇటువంటి కృతకమైన రచనలకి అనవసరమైన ముద్రలు వేసి నెత్తికెత్తుకోవడం అభిలషణీయం కాదు. ఒక రచన చేసేటపుడు, దానికి పురస్కారాలు ప్రకటించేటపుడు, దానిని సమీక్షించేటపుడు, అనువదించేటపుడు, వ్యక్తులు తమకు ఆధిపత్య ధోరణి లేదనో, అభ్యుదయ భావాలు ఉన్నాయనో నిరూపించుకునేందుకు కాక తెలుగు సాహిత్యానికీ మంచి చేసే దిశగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తే బాగుంటుంది.
****
ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ.
Veldandi Sridhar
సహృదయత లేని విమర్శ
కథ, నవల, కావ్యం ప్రక్రియ ఏదైనా సరే చదివి అర్థం చేసుకోవడానికి సహృదయత అయినా కావాలి లేదా ఆ అంశానికి సంబంధించిన జీవన నేపథ్యం అయినా ఉండాలి. గోడ మీద పిడుకల్ని చూసినపుడు దాని తయారీకి సంబంధించిన విషయాలు తెలిసి ఉండాలి. లేకుంటే గేదెలు గోడ ఎక్కి పేడ వేప్తాయని అర్థం అవుతుంది. దాంతో గేదెలు గోడలెలా ఎక్కుతాయనే అనుమానం వస్తుంది. జంతువులు, మనుషుల మధ్య అల్లుకున్న ప్రేమ తెలియదు కాబట్టే రాగమంజరి గారికి ఇమాం, షాదుల్ మధ్య ప్రేమలో కొంత వ్యాపారం, కొంత మూర్ఖత్వం కనిపించి ఉంటుంది. ఈ విమర్శలో లోతు కంటే వ్యంగ్యం, వెక్కిరింతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
జంతువులకు, మనుషులకు మధ్య ప్రేమ ఈ నాటిది కాదు. ఆదిమ కాలం నుంచి వస్తున్నదే. అవసరరీత్యా జంతువులను మచ్చిక చేసుకున్నా, కడుపున పుట్టినదాని కంటే ఎక్కువ ప్రేమించాడు మనిషి. ఆ క్రమంలోనే ఇమాం కుటుంబం ఎలుగుబంటిని పెంచుకుంటుంది. ‘‘పోలీసుల చేతులు తడిపి ఒక చట్ట విరుద్ధమైన పనిని ఇమాం కుటుంబం చేస్తుంది’’ అన్నారు రాగమంజరి గారు. వన్య ప్రాణి సంరక్షణ చట్టం(1966) రాకముందే ఇమాం తాతలు తండ్రులు ఇదే పని చేశారు. ఆ చట్టం పల్లెల్లో విస్తృతంగా ప్రచారం పొందక ముందే(1985) ఇమాం ఎలుగుతో జీవించాడు. చట్టం అమలయ్యాక కూడా పోలీసులు ఏనాడైనా అందిన కాడికి గుంజుకున్నారే తప్ప ఎలుగును ఆడియ్యవద్దని కచ్చితంగా చెప్పలేదు. ఇక్కడో వెసులుబాటుంది. పోలీసులకు దొరికినప్పుడు ఎంతో కొంత ఇస్తే పని అయిపోతుంది. తన బతుకుదెరువు సాగిపోతుంది. అలాంటప్పుడు ఇమాం లాంటి ఓ చదువు లేని, లౌక్యం లేని అమాయకుడు ఈ వెసులుబాటును వదులుకొని హఠాత్తుగా ఏ వృత్తిలోకి మారగలడు? ఎలా జీవించగలడు? తుఫాను వచ్చి కొట్టుకుపోయి, కరువు బారిన పడి పంట ఎండుకుపోయి ఏటేటా అప్పులు పెరిగినా రైతు భూమినీ, వ్యవసాయాన్ని వదలుకొని వృత్తి మారలేడు. ఎందుకంటే ఇన్ సెక్యూరిటీ. మెరుగైన బతుకుదెరువు కోసం మరో వృత్తి లభించక పోవడం. అలా లభించిన నాడు వృత్తిని మార్చుకుంటాడు కానీ భూమిని అమ్ముకోడు. ఇమాం పరిస్థితి అలాంటిదే.
మరో విషయం ‘‘చాంద్ ఎలుగు లేదని అధికారుల దగ్గర అబద్ధమాడటం ఒక కృతకమైన నాటకీయత అని, ఉన్నదని ఒప్పుకుంటే సరిపోతుంది కదా’’ అంటారు మంజరిగారు. నవలను, వ్యక్తుల మనస్సులను లోతుగా చదివితే ఇలాంటి అనుమానమే రాదు. చాంద్ కు పోలీసులంటే భయం. పిలిచి ‘ ఇదిగో నీకు భూమి ఇస్తా పటు’ అని ఒకే సారి అనెయ్యడు కదా. ముందు ఎలుగుబంటి గురించి ఆరా తీస్తాడు. అప్పుడు చాంద్ ‘ఉంది, తీసుకొస్తాను’ అని అనలేడు కదా. ఉన్నందంటే ఏం సమస్యలు వస్తాయోనని లేదని చెప్పేశాడు. నిజానికీ ఎవరైనా లేదనే జవాబు చెబుతారు. ఎందుకంటే భూమి వచ్చేది నిజమైతే వచ్చాక దీన్ని ఎలాగైనా లేకుండా చేయొచ్చు అనుకుంటారు కానీ ఎకాఎకిన భూమి ఇస్తాం అనగానే అంత తొందరగా ఎలుగును తెచ్చి అప్పగిస్తారా? ఇక్కడ మనిషి మర్మాన్ని కొంతైనా అర్థం చేసుకోవాలి. ’స్థలం ఇస్తున్నప్పుడు ఎలుగుబంటిని జూకు అప్పగించవచ్చు కదా అది ఇమాంకు ఇష్టమే’ అంటారు మంజరి గారు. చాంద్ మంజరి లాగానే ఆలోచించాడు కానీ ఇమాం అలా ఆలోచించలేదు. ఎందుకంటే ఎలుగును అతడు కొడుకు లాగానే చూసుకున్నాడు. ఎక్కడో డబ్బుకు పిల్లల్ని అమ్ముకునే తల్లిదండ్రులు ఉంటే ఉండవచ్చు కానీ అందరూ పిల్లల్ని డబ్బులకు అమ్ముకుంటారా? ఇమాం అలాంటివాడే. అతనికి భూమి రావడం ఇష్టమే అయినా షాదుల్ ను వదులుకునేంతగా కాదు. వారిది ఇరవై ఏండ్ల అనుబంధం. ఈ అనుబంధాన్ని మంజరి గారు వ్యాపార దృష్టితోనే చూశారు తప్ప మానవత్వపు కోణం లోంచి కాదు. అలా చూడాలంటే కొంతయినా వ్యావసాయిక జీవన నేపథ్యం ఉండాలి.
ఒక రైతుకు ఎద్దు మీదుండే ప్రేమ వేరు. ముసలిదవగానే దాన్ని కటిక వానికి అమ్మేయడు. (చాంద్ తరం రైతులు కాదు. ఇమాం తరం రైతులు) చచ్చే వరకు తన దొడ్లోనే ఉంచుకొని చచ్చాక దాని తల బొక్కను తెచ్చి తన పొలంలో పెట్టుకుంటాడు. దాన్ని చూస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు. ఇమాంకు ఎలుగుకు మధ్య అనుబంధం అలాంటిదే.
కరీంనగర్ లో ‘గంగెద్దుల కొండాపూర్’ అనే ఊరుంది. ఆ ఊరినిండా గంగెద్దులను ఆడించేవారే. ఇప్పటికీ ఆడిస్తున్నారు. ఒక ఎద్దు చనిపోతే మనిషి చనిపోయినంతగా ఏడుస్తారు. దాన్ని పూడ్చిపెట్టి మనిషికి చేసినట్లే కర్మకాండలు చేస్తారు. ఎందుకంటే దాన్ని వాళ్లు ఇంట్టో మనిషిగానే చూస్తారు తప్ప ఎద్దులా కాదు. ఎద్దే గదా చనిపోయింది. పోతే పోనీతీ అని అనుకోరు మరి. ఇమాం ప్రేమ కూడా జంతువుతో అలాంటిదే. ఎలుగును ఎన్నడూ జంతువులా చూడలేదు అతడు. ‘ఎలుగుబంటిని ఎత్తుకు రావడం, మచ్చిక చేసుకోవడం, ఆట నేర్పడం, చావకుండా మందులివ్వడం, క్రూరత్వం అవసరం నిమిత్తమే’ అంటారు మంజరి గారు. అందులో జీవనోపాది ఉన్న మాట వాస్తవమే అయినా దానితో పెనవేసుకొన్న అనుబంధం మామూలుది కాదు గదా. గ్రామాల్లో రైతు లేగ దూడను కాదని పాలు పితుక్కుంటాడు. కోడె దూడ పురుషాంగాల్ని నలిపి ‘షేరు’ వేస్తాడు. ఇది క్రూరత్వమో పగనో కాదు గదా. అలా వేయకుంటే ఏమవుతుందో ఏ రైతునడిగినా చెబుతాడు. దూడను పనిలోకి దింపి నాగలి నేర్పిస్తాడు. బండి లాగడం నేర్పిస్తాడు. పరిపూర్ణమైన ఎద్దును తయారు చేస్తాడు. దీన్నంతా హింసగా చూస్తే ఎలా? ఉలి దెబ్బల కింద నలగకుంటే శిల శిల్పమెలా అవుతుంది? ఇనుము ఆయుధంగా ఎలా మారుతుంది? పిల్లల్ని ఇటు తల్లిదండ్రులు, అటు గురువులు నయాన్నో, భయాన్నో శిక్షణ ఇస్తేనే కదా వ్యక్తులుగా తీర్చిదిద్ద బడేది. రైతు తన కొడుకును ఊరకే వదిలి వేయడు కదా. ఎండలో కష్టపడే తత్త్వాన్ని నేర్పిస్తాడు. అది శ్రమైక జీవనమే కానీ క్రూరత్వం కాదు కదా. మంజరి గారు ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఎలుగు సుఖంగా బతుకుతుందన్న నమ్మకం కలిగితే ఇమాం ఆత్మను చంపుకొని అయినా దాన్ని వదిలివేయడానికి సిద్ధమే. అందుకే అడవిలో వదిలి వేస్తాడు. ఇతరులకు అమ్మజూపుతాడు. సరే ఒక వేళ జూలో వదిలివేద్దాం పద అని తీసుకు వెళ్లేవాడేమో. కానీ చాంద్ పోలీసుల దగ్గర అబద్ధం ఆడాడు కాబట్టి (ఎందుకు ఆడాడో ముందే చెప్పాను. ఇది నవల నడవడానికో, కథ చెప్పడానికో అతడు అబద్ధం ఆడలేదు. తనకున్న పరిణతిలో అప్పటికప్పుడు తప్పుకోవడానికి ఆడాడు. తర్వాత ఉంది అంటే ఏమంటారో…భూమి ఇవ్వరేమో అని అతని భయం.)దాన్ని చంపుదామనే అంటాడు. దాన్ని చంపడం ఇమాంకు తట్టుకోలేని విషయం. ఎందుకంటే అది అతని దృష్టిలో కుటుంబంలోని ఒక మనిషి.
ఈ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తుల పరిణతి, చొరవ తెలివి తేటలు చూస్తే ఏ ఒక్కరికీ ముందుగా అబద్ధం ఆడాం కానీ ఎలుగు ఉందని చెప్పే ధైర్యం లేదు. జూలో విడిచి వచ్చే చొరవా లేదు. చాంద్ ఒక్కడు చొరవ చూపితే పరిస్థితి వేరుగా ఉండేదేమో. కానీ అతనికీ ఆ ధైర్యం లేదు. అలా వదిలే కంటే ఎవరికీ తెలియకుండా చంపడమే అతనికి తేలికైన పని.
నవలను మంజరి గారు మరోసారి చదివితే మనిషికి జంతువు మీదుండే మమకారం, తరాల మధ్య ఆలోచనా తీరులోని అంతరం బోధపడ్తాయి.
-వెల్దండి శ్రీధర్.
manjari lakshmi
ఈ వ్యాసం మళ్ళా చదువుతుంటే రంగనాయకమ్మగారే మారుపేరు పెట్టుకొని రాశారేమో అన్నంత ఇదిగా ఉంది.
“ఇక్కడ గమనించ వలసింది ఏమిటంటే, ఎలుగుని ఎత్తుకు రావడం, మచ్చిక చేసుకోవడం, ఆటలు నేర్పడం కోసం హింసించడం అలాగే మరొక ప్రక్కన అది చచ్చిపోకుండా మందులు వేయడం, బీబమ్మ దానికి తన పిల్లాడికిచ్చినట్లే పాలివ్వడం – ఇవన్నీ కూడా వారు తమ జీవనోపాధి కోసం చేసిన సహజమైన ప్రయత్నాలు. అందులో వారి మంచి తనమూ లేదు, చెడ్డ తనమూ లేదు. ఒకదాన్ని “మానవత్వం” అంటూ ప్రశంసిస్తే రెండో దాన్ని “రాక్షసత్వం” అంటూ నిరసించాల్సి వస్తుంది”. అన్న ఈ పేరాని చదివితే ఈ స్థాయి తర్కాన్నిరంగనాయకమ్మగారు తప్ప ఇంకెవ్వరు రాయ లేరనిపిస్తుంది. రంగనాయకమ్మగారి తర్క స్థాయినందుకొని రాయగలిగిన రాగ మంజరిగారిని నిజంగా అభినందించ వలసిందే. వేణుగారు తన బ్లాగ్‌లో కేశవరెడ్డిగారి నవల “మునెమ్మ” గురించి ఈ మాదిరి కోణంలోనే చూపిస్తూ చాలా బాగా రాశారు. ఎవరైనా ఆ మోడల్‌గా రాయొచ్చేమో కానీ ఆ స్థాయిలో రాయటం చాలా కష్ట సాధ్యమైన విషయం.
రాగమంజరి
ధన్యవాదాలు మంజరి లక్ష్మి గారు.
manjari lakshmi
ఈ విమర్శ చదవకముందు నేను కూడా రచయిత కధా చాతుర్యంలో పడి చాలా బాగుందనుకున్నాను.