జిగిరి – పెద్దింటి అశోక్ కుమార్

చిన్నప్పట్నుంచి చేతుల్లో పెట్టుకుని పెంచిన బిడ్డ. జబ్బుపడితే కంటికి రెప్పలా సాకి బతికించుకున్న బిడ్డ. ఏళ్ళ తరబడి కుటుంబపోషణకు ఆధారంగా నిలచిన బిడ్డ. ఆ బిడ్డని ఎలాగోలా హడావిడిగా వదిలించుకోవాలి. కంటికి కనిపించనంత దూరంలో వదిలివేయాలి. వదిలించుకోవటానికి వీలు లేకపొతే ప్రాణాలే తీయాలి. వెనుకాడితే ఇంకో బిడ్డ తన ప్రాణాలు తీసుకుంటానికి సిద్ధమౌతున్నాడు. ఇట్లాంటి సంకటాలు జీవితంలో తారసపడితే ఎట్లా? ఏం చెయ్యాలి?

ఇంత సంకటమూ వచ్చింది ఇమామ్‌కు. దీన్ని కొద్దిగా సామరస్యంగా పరిష్కరించుకుందామంటే, కొడుకు చాంద్ దాన్ని తన బతుక్కూ, భవిష్యత్తుకూ సంబంధించిన సమస్యగా చూస్తున్నాడు, అతని దగ్గరనుంచి బెదిరింపులేగాని సర్దుబాటుకు ఆస్కారం కనబడటం లేదు. భార్య బీబమ్మచాంద్‌ని వెనకేసుకొచ్చి, స్తన్యమిచ్చి పెంచిన మమకారం కూడా లేకుండా, సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంది. ఇమామ్‌ ఏం చేసేట్టూ?

ఈ సంఘర్షణే పెద్దింటి అశోక్ కుమార్ నవల జిగిరి ఇతివృత్తం. జిగిరి నాలుగు పాత్రల చుట్టూ తిరిగే చిన్న నవల/ పెద్ద కథ – ఇమామ్‌, అతని భార్య బీబమ్మ, కొడుకు చాంద్, పెంపుడు ఎలుగుబంటి (గుడ్డెలుగు) షాదుల్. గ్రామాల వెంబడి తిరుగుతూ, షాదుల్‌తో రకరకాల ఆటలు ఆడిస్తూ, మాటలూ, తాయెత్తులూ అమ్ముకుంటూ, డబ్బులూ, రైతులదగ్గరనుంచి గింజలూ తెచ్చుకొంటూ జీవితాన్ని గడుపుకునే కుటుంబం వారిది.

ఇమామ్‌, బీబమ్మలు ఇద్దరూ గుడ్డెలుగులను ఆడించటం వృత్తిగా ఉన్న కుటుంబాలనుంచే వచ్చారు. ఇమామ్‌ తండ్రి మరణించినరోజునే ఆయన పెంపుడు ఎలుగుబంటి కూడా మరణించింది. ఇమామ్‌, బీబమ్మలు అడవికిపోయి ఆరునెల్ల ఎలుగుపిల్లను పట్టి తెచ్చారు. ఎలుగుపిల్ల జబ్బుపడింది. బీబమ్మ నానా యాతనలూ పడి, మొండిగా ఆ ఎలుగు పిల్లకు సపర్యలు చేసింది. షాదుల్ అని దేవుడి పేరు పెట్టుకున్నా లాభం లేకపోయింది. ఆవు పాలు తాపించినా ఎలుగు కోలుకోకపోతే, బీబమ్మ తన స్తన్యాన్ని చాంద్‌తో పాటు షాదుల్‌కు కూడా తాపింది. మనిషిపాలు మరిగాక నెమ్మదిగా ఎలుగు కోలుకుంది. అడివి అలవాట్లు మానుకుంది. నడక మారింది. మనుషుల తిండికి అలవాటయ్యింది. మాటలను పసిగడుతుంది. మనుషులతో కలిసి తిరుగుతుంది.

కోలుకున్న షాదుల్‌కి తర్ఫీదు ఇవ్వటం ప్రారంభించాడు ఇమామ్‌. బతుకమ్మ ఆడటం, రొట్టె చేయడం, గుర్రం మీద స్వారీ చేయటం, సద్ది మోసుకుపోవడం, తుపాకితో కాల్చటం, కుస్తీ పట్టడం, లేచి నడవడం, పల్టీలు కొట్టడం, డ్యాన్స్ చేయడం, సమస్త ఆటలూ నేర్చుకుంది. ఆఖరుకు నోట్లో తాయత్తుని పెట్టుకొని పిల్లగాండ్ల మీదకు గురిగా విసరడం కూడా నేర్చుకుంది. షాదుల్ ఆట నేర్చాక వారికి ఆకలన్నది లేకుండా పోయింది. ఖర్చులకి ఇబ్బంది పడే పరిస్థితి రాలేదు. చాంద్, షాదుల్ అన్నదమ్ముల్లా పెరిగారు. బీబమ్మ ఇద్దర్నీ తన పిల్లలమాదిరిగానే పెంచుకొంది.

చాంద్, షాదుల్ ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఈలోపు వన్యప్రాణులను ఇళ్ళల్లో పెట్టుకొవడం, వాటితో ఆటలాడించడం నేరమయ్యింది. ఎక్కడికక్కడ పోలీసోళ్ళకి, ఫారెస్టోళ్ళకి లంచాలివ్వడం కష్టమైపోతూంది. అట్లాంటి టైములో ఒక ఎస్సై చాంద్‌ని పిలిపించి ఎలుగు సంగతి విచారించబోయాడు. ఎలుగు చచ్చిపోయిందని, బ్రతుకు తెరువు పోయిందని అబద్ధమాడాడు చాంద్. జాలిగొన్న ఎస్సై, ఎమ్మార్వోతో మాట్లాడి, ఆ విడత పొలాలు పంచేటప్పుడు చాంద్ పేర రెండెకరాల పట్టా ఇవ్వటానికి ఏర్పాటు చేశాడు. వాళ్ళ ప్రాణానికి ఆ రెండెకరాల పట్టా చాలా ఎక్కువ. అది చేతికి వస్తే, వాళ్ళ దశ మారినట్టే. అడుక్కోవటమూ, సంచారజీవితమూ మానేయచ్చు. భూమి శాశ్వతంగా ఆసరాగా ఉంటుంది. ఐతే వచ్చిన చిక్కేమిటంటే ఎలుగు బతికే ఉందని తెలిస్తే, ఈ భూమి రాదు. పైపెచ్చు, అబద్ధం చెప్పి మోసం చేసినందుకు ఎస్సైకి కోపం వచ్చి ఏమైనా చేయచ్చు. అందుకని ఎట్లాగైనా ఎలుగును వదిలించుకోవాలి అని చాంద్ అనుకున్నాడు. రెండెకరాల మాట విన్నాక బీబమ్మ కూడా షాదుల్‌ని వదిలించుకోవటానికే తయారయింది.

అక్కడే వచ్చింది చిక్కు. అడవిలో వదిలిబెడితే, షాదుల్ ఇల్లు వెతుక్కుంటూ వెనక్కి వచ్చేశాడు. పోనీ బంధువులెవరికన్నా ఇచ్చేద్దామంటే ఎవరూ తీసుకోకపోయారు. ఇక మిగిలింది ఒకటే దారి. షాదుల్‌ని చంపేయాలి. ఇమామ్‌కు ఆ పని ఇష్టం లేదు. ఎలుగు చావకపోతే, తానే చావడమో లేక చంపడమో చేస్తానంటున్నాడు చాంద్. తండ్రి వినకపోతే ఉరేసుకోబోయాడు. షాదుల్‌ని పాతిపెట్టడమో, పిచ్చెక్కించే మందు ఇవ్వడమో, లేక విషం ఇవ్వడమో ఏదో ఒకటి చేయమనే బీబమ్మ మాట కూడా. రొమ్ము సని ఇచ్చి పెంచిన విషయం కూడా పక్కని పెట్టేసింది. షాదుల్‌ని ఏం చెయాటానికీ ఇమామ్‌కు మనసు రావడం లేదు. కన్నకొడుకు భవిష్యత్తు, ఇన్నాళ్ళూ తమకు ఆధరువు కలిపించిన పెంపుడు జంతువు చావుతో ముడి పడింది. ఈ ముడి ఎట్లా తెగేట్టు?

ఎలుగుకు పెట్టే గట్టుకలో కలపమని సైనైడ్ తెచ్చి తండ్రి చేతికి ఇచ్చాడు చాంద్. ఆ పని చేయటానికి ఇమామ్‌కు చేతులు వస్తాయా? మనసు ఒప్పుకుంటుందా? ఆఖరు సన్నివేశాన్ని చాలా ఉత్కంఠభరితంగా, హృద్యంగా చిత్రీకరించారు రచయిత.

జిగిరి చిన్న పుస్తకం. పెద్ద అక్షరాలతో చిన్న సైజులో 120 పేజీలు. చాలా ఉత్కంఠతో చదివిస్తుంది. మనకు పరిచయం లేని ఒక జీవన విధానాన్ని వాతావరణాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. జీవితంకోసం ఒక పెనుగులాటని వర్ణిస్తూ, కొన్ని మౌలికమైన నైతిక తాత్విక ప్రశ్నలను మన ఎదురుగా ఉంచుతుంది. వడిగానే చదివించినా, ఇది కాలక్షేపానికి చదివి పక్కన పెట్టేసే పుస్తకం కాదు. మన మనసును ఆవహించుకుని మేధను తినేసే పుస్తకం.

పెద్దింటి అశోక్ కుమార్ ఈ తరంలో పేరున్న రచయితల్లో ఒకరు. పదిహేనేళ్ళుగా కథలు వ్రాస్తున్నారు. ఎమ్మే, ఎమ్.యిడి చదివి, ఒక పల్లెటూర్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అయిదు నవలలు, వంద కథలు వ్రాశారట. కొన్నాళ్ళ క్రితం వరకూ అశోక్ కుమార్‌గారి కథల పట్ల నాకొక ఫిర్యాదు ఉండేది. కథలు వాస్తవికంగానూ, చదివించే విధంగానూ వ్రాస్తారు కానీ, ఒకటే వస్తువును మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి వ్రాస్తున్నారు అని. కొన్నేళ్ళపాటు నేను చదివిన ఆయన కథలన్నీ కూడా సమాజంలో వస్తున్న మార్పుల వల్ల వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులతో బతకలేక కష్టాలు పడుతున్న పల్లెటూరి బడుగుజనాల కథలే – గాడిదలు తోలుకొనే వారు, కుమ్మర్లు, చాకళ్ళు, మంగళ్ళు, సన్న రైతులు వంటి వాళ్ళ కథలన్నమాట. వృత్తి ఏదైతేనేం, చివరికి కథ, ముగింపు ఒక్కటే అయ్యేవి. మారుతున్నఆర్థిక, వృత్తి జీవనాల గురించిన కథలే అన్నీ. తరువాత్తరువాత కథల్లో ఆర్థిక సంబంధాల అంశాలతో పాటు, మానవసంబంధాల, మనస్తత్వాల చిత్రణకు కూడా పెద్దపీట వెయ్యడం మొదలుబెట్టారు. కథల్లో సాంద్రత పెరిగింది. చెప్పటంలో వాచ్యంతో పాటు సూచ్యం కూడా చేరింది.

నిజానికి ఈ నవలలో కూడా ఒక రకంగా అశోక్ కుమార్ గారి మిగతా కథల్లో మామూలుగా ఉన్న ఇతివృత్తమే నేపథ్యం. ఎలుగులను ఆడించుకొని బ్రతికే కుటుంబం ఇంకా ఆ పనే చేసుకుని ఇంతకుముందులాగే బతికే వీలు లేదు. తమలో ఒక భాగాన్ని చంపుకోకుండా ముందుకు సాగే వీలు లేదు. ఐతే ఈ నవల పరిధి ఆ నేపథ్యం కన్నా చాలా పెద్దది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఆ కుటుంబంలో మారిన పరిస్థితులే కాదు – మారిన బంధాలు, మారిన విలువలు కూడా. ఇమామ్‌ కుటుంబాన్ని పని కట్టుకుని ఇబ్బంది పెట్టడానికి ఎవరూ కూర్చోలేదు. పుస్తకం చివర్లో గుడిపాటి వ్రాసిన సమీక్షలో సూచించిన రాజ్యపు దౌష్ట్యం నాకు కనిపించలేదు; బయట శక్తులకన్నా మనుషుల బలహీనతలే ఇక్కడ ముఖ్యప్రేరకాలు. ఎస్సై, ఎమ్మార్వోలు చాంద్ కోరిక మేరకే, ఆ కుటుంబానికి మేలు చేయటానికే, పనిగట్టుకుని మరీ ప్రయత్నిస్తున్నారు. వన్యమృగాలను సంరక్షించాలనటమూ దౌర్జన్యచర్యేమీ కాదు. ఈ మంచి ఉద్దేశాలవల్లే ఈ కుటుంబంలో ఈ పెను తుపాను కలగటమే విచిత్రం. ఈ సంఘర్షణ ఈ కథను సంక్లిష్టం చేసి రొడ్డకొట్టుడు వస్తువులకన్నా పై ఎత్తుకు వెళ్ళేట్టు చేసింది. ఎలుగును మాయం చేయటం చాంద్‌కి ముఖ్యమైన సమస్య. కుమారుడి భవిష్యత్తు బీబమ్మకు ముఖ్యం. ఇమామ్‌కు కూడా అది ముఖ్యమేనని తెలుసు. ఎలుగు ఎలాగోలా అక్కణ్ణించి పోవాల్సిందే. కాని, ఇన్నాళ్ళు దగ్గరుండి సాకాడు కదా, ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత ఉన్నట్టుండి మాయమైపోవాలంటే ఎలా? చాంద్ కన్నా నాకు షాదులే ఇష్టం అని వారి చిన్నప్పుడు చెప్పిన బీబమ్మ ఇలా మారిపోవటమేమిటి? ఎలుగును తోబుట్టువులా చూసుకున్న చాంద్ ఎలుగును వదిలించుకోవడానికి వెనుకాడుతున్నాడని తండ్రి మీద తిరగబడటమేమిటి? మనుషులకీ జంతువుకీ తేడా ఏమిటి?

నాలుగే ముఖ్యపాత్రలతో ఈ నవలను అతి నైపుణ్యంగా నడిపించారు రచయిత. మనుషులు ముగ్గురితోపాటు, షాదుల్‌ని కూడా జీవంతో పాటు చేతన కూడా ఉన్న పాత్రగా మలచడంలో మంచి ప్రతిభ చూపించారు. ఎక్కడా కృతకత్వం కనిపించదు. వర్తమానం, భూతకాలాల మధ్య ముందుకూ వెనక్కూ వెడుతూ, మల్టిప్లుల్ ఫ్లాష్‌బాక్స్ పద్ధతిలో కథని నడిపించటం కూడా కథలో ఉత్కంఠని పెంచింది. ఎలుగులను పెంచే వారి జీవితాన్ని, ఆ వాతావరణాన్ని అతి సహజంగా, చాలా నిపుణతతో, సమర్థతతో సృష్టించారు. ఎలుగులగురించి, ఎలుగులని పెంచటం గురించి (పనిగట్టుకుని చెప్పినట్టు కాకుండా, కథనంలో భాగంగానే) రచయిత చాలా వివరాలు మనకు అందిస్తారు.

పుస్తకంలో ఏమీ లోపాలు లేవని కాదు. కాల చిత్రణలో కొంత తొట్రుపాటు కనిపిస్తుంది. భాష ఒకటిరెండుసార్లు అసంగతంగా తోచింది. కథంతా కుటుంబసభ్యుల సన్నిధిలోనే జరుగుతున్నప్పుడు, సర్పంచ్-బుచ్చయ్యల సంభాషణ సన్నివేశం టెక్నిక్ పరంగా సరిగ్గా ఇమడలేదు; కథాగమనానికి పెద్దగా అవసరమూ లేదు. కానీ, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవలసిన విషయాలేమీ కాదు.

2006 ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) నవలలపోటీలో జిగిరి ప్రథమ బహుమతి గెలుచుకొంది. 1997-2007 మధ్యలో తానా, ఆటాలు నిర్వహించిన పోటీలలో వెలికి వచ్చిన ఉత్తమ స్థాయి నవలలలో జిగిరి కూడా ఒకటి. ఆ పోటీలు కోస్తాంధ్ర అగ్రవర్ణాధిపత్యం కోసమే నిర్వహించబడుతున్నాయని సిద్ధాంతీకరించినవారికి ఈ నవల గురించి బహుశా తెలిసి ఉండదు.

పుస్తకం అందంగా ముద్రించారు. అచ్చు తప్పులు లేవు. చదువుకోవడానికి హాయిగా ఉంది. ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. పుస్తకం సైజుతో పోలిస్తే ఖరీదు కొద్దిగా ఎక్కువే కాని విలువైన పుస్తకం మరి.

ఈ నవల ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒరియా భాషలలోకి అనువదించబడిందట. తప్పకుండా మిగతా భాషలవారికి కూడా గర్వంగా అందించవలసిన తెలుగు పుస్తకమే.

ఇటీవల కాలంలో వచ్చిన మంచి పుస్తకాలలో జిగిరి ఒకటి. ఆధునిక తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవవలసిన పుస్తకం.

జిగిరి
పెద్దింటి అశోక్ కుమార్
2006/ నవంబరు 2011
నయనం ప్రచురణలు, సిరిసిల్ల
ప్రతులకు:
పెద్దింటి అశోక్ కుమార్
మల్లారెడ్డిపేట పోస్ట్
గంభీరావుపేట మండలం
కరీంనగర్ జిల్లా, 505 304
akpeddimti@gmail.com/ 94416 72428
136 పుటలు; 75 రూ.

**
(జిగిరి నవల ఈమాట వెబ్‌పత్రిక గ్రంథాలయంలో ఈబుక్ గా లభ్యం. ఇది విషయం చెప్పడమే కానీ, పాఠకుడు కొని చదవగా రచయితకు వెళ్ళాల్సిన డబ్బుల్ని వారికి అందకుండా చేయడం మాత్రం కాదని విజ్ఞులైన పాఠకులు గమనించగలరు – పుస్తకం.నెట్)

You Might Also Like

5 Comments

  1. Medepalli Seshu

    Facebook లో ‘జిగిరి’ గురించి యండమూరి వీరేంద్రనాథ్ వ్యాఖ్య –
    “నేనీ రోజు ఒక అద్బుతమైన పుస్తకం చదివాను. దాని పేరు “జిగిరి”..!
    నాటకీయత, పాత్ర పోషణ, కధాంశం, విషయ సేకరణ అన్నీ గొప్పగా ఉన్నాయి. ఈ నవల వ్రాయటం కోసం ఎలుగు బంట్ల గురించి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ సేకరించిన సమాచరం, కనుక్కున్న విషయాలు… ఇవన్నీ చదువుతూంటే గతంలోని నాలోని రచయితని గుర్తు తెచ్చింది. చాలమంది ఇన్వెస్టిగటివ్ రచయతలు సమాచారాన్ని సేకరిస్తారు కాని దాన్ని ఎలా కధలో చొప్పించాలో తెలీదు.
    ఎలుగుబంటి మానవ స్త్రీల మృతకళేబరాల్ని కామిస్తుందన్న విషయం, ‘చెప్పికట్ట’తో నాటు పొగాకు కలిపి తినిపిస్తే జంతువుకు పిచ్చెక్కుతుందన్న విషయం, రెండు రొమ్ముల్తో ఇద్దరికి పాలిచ్చిన తల్లి (ఈ సీను ‘బాహుబలి’ అనే సినిమాలో కూడా వున్నదనుకుంటా) ఆ ఇద్దరి లో ఒకరిని వదులుకోవాల్సి వస్తే ఒకవైపు తపన, మరోవైపు ఆనందం (???); రెండెకరాల భూమి కోసం కొడుకుని అడవిలో వదిలేయ వలసి రావటం…
    మనిషికి జంతువుకి మధ్య అనుబంధం గురించి చాలా కధలూ సినిమాలూ వచ్చినా, ఇది వేరే..! అసలు ఇలా కుడా వ్రాయొచ్చా అనిపించింది. (“జూ” కిచ్చేయొచ్చు కదా’ అని చివరలో అనిపించినా, ఆఖరివాక్యం వరకూ మెయిన్టైన్ చేసిన సస్పెన్స్ తో పోల్చుకుంటే, అది చాలా చిన్న అసంతృప్తి.) పోలీసుల్లో లంచగొండులు, చాలా మంచివాళ్ళూ, ప్రజల మూఢనమ్మకాలు, దేశ దిమ్మరుల జీవితాలు…అన్నీ సమపాళ్ళలో సరిపొయాయి.
    “తనా” పోటీల్లో నిజాయితీగా ప్రధమ బహుమతి (50 వేలనుకుంటాను) పొందిన ఈ నవల గొప్పతనం ఏమిటంటే… తెలుగులో సీరియల్ గా వచ్చి, నవలగా రాక ముందే హిందీ,ఇంగ్లిష్, పంజాబీ, మరాటీ, ఒరియా, కన్నడ మరియు బెంగాలీ భాషల్లోకి అనువదింబడి, ఇప్పుడు తొలిసారి తెలుగు లో పుస్తకం గా వెలువడింది. ఇది కావలసిన వారు రచయిత (9441672428)కి ఫొన్ చేసి తెప్పించుకోవచ్చు. వెల 75 రూపాయిలు.”

  2. kaasi raaju

    ఈ నవల నేను కూడా చదివాను, పుస్తకమ్. డాట్ నెట్ లో రాగామంజిరి గారు రాసిన విమర్శ కూడా చూసాను.
    “బడుగు జీవుల బాధలని చిత్రించిందనే అబద్ధపు ముద్ర వేయబడిన నవల” అని రాసారు
    ఈ పుస్తకం చదివిన వారు , ఈ విమర్శ కూడా చదివితే విమర్శలు చేసేవాల్లమీద కచ్చితంగా ఒక అభిప్రాయం తెచ్చుకోవచ్చు . పాత్రలతో అబద్దం ఆడిస్తాడు అని చాల చోట్ల రాసారు. “ఎలుగు ఇప్పుడు లేదు. చచ్చిపోయింది.” అని రచయిత అబ్బడం చెప్పించడానికి కారణం ఎలుగును వదల్లేక, దానికి చంపుకోలేక అని తెలియలేదంటే విచిత్రంగా ఉంది . ప్రేమించడం తెలిసినవారికి మాత్రమె ఇది తెలుస్తున్ది. రాగమంజరి గారికి మనుసులు జంతువుల్ని కూడా ప్రేమించే గొప్ప గుణం కలిగి ఉంటారని తెలియనట్లుంది . జంతువులూ కూడా మనుషుల్ని ప్రేమిస్తాయి. అలాంటి మనుషులు నవలల్లో దొరుకుతారు.

  3. జిగిరి | పుస్తకం

    […] **** ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ. […]

  4. M.V.Ramanarao.

    ఇటీవలనే ‘జిగిరి ‘నవలని (పాలపిట్ట బుక్స్)చదివాను.చాలా బాగుంది.moving గాఉంది.అశోక్ కుమార్ marginalised వృత్తులవారి గురించే రాయనిండి.కొందరు స్త్రీవాదం గురించి,కొందరు థ్రిల్లర్స్,లేక చారిత్రక నవలలు రాస్తారనుకొండి.అలాగే ఇది ఒక genre .అటువంటి వారి జీవితాలు,అధ్యయనం చేసి, సానుభూతితో రాస్తున్నందుకు రచయితను అభినందిస్తున్నాను.

  5. యశస్వి సతీష్

    పోలిక తప్పేమో తెలియదు కానీ.. నాకెందుకో మున్షీ ప్రేమ్ చంద్ కథనమంత ఆసక్తికరంగా అనిపించింది ఈ పుస్తకం చదువుతూంటే.. గోరాతో పోల్చడం కాదు.. వేటికవి రెండూ గొప్ప అనుభూతులే.. వెరసి మంచి పుస్తకం చౌదరి గారన్నట్టు..

    ఇటీవల కాలంలో వచ్చిన మంచి పుస్తకాలలో జిగిరి ఒకటి. ఆధునిక తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవవలసిన పుస్తకం.

Leave a Reply