తులనాత్మక విమర్శకుడు, పరిశోధకుడు – సర్దేశాయి తిరుమల రావు

చాలా కాలం ముందు అంటే సుమారు వందేళ్ళ ముందు సాధన అన్న పత్రిక రాయలసీమ నుండి వెలువడేదిట. అందులో ‘వదరుబోతు ‘ పేరిట వ్యాసాలు వచ్చేవి. అవి రాసిన వారు ఎవరో తెలియదు.ఆ వ్యాసాలలో ఒకానొక వ్యాసంలో పేరు సంపాదించుకోవడానికి మార్గాల గురించి వ్యంగ్యంగా చెబుతారు. ప్రాచుర్యం రావాలంటే – గొప్ప ‘పేరు ‘ ను సంపాదించుకొని ఉండాలి లేదా, గొప్ప వ్యక్తులతో ముందుమాట వ్రాయించుకోవాలి లేదా ప్రముఖులు ఆ పుస్తకాన్ని పొగడాలి. ఇది నాటి పరిస్థితి అయితే మరి నేటి విషయం చెప్పనవసరమే లేదు. ఇలా ప్రాచుర్యం పొందిన వారు తామరతంపరగా కనిపిస్తున్న రోజుల్లో శాస్త్రజ్ఞుడిగా వృత్తిని, సాహిత్య అనుశీలకుడు, విమర్శకుడుగా ప్రవృత్తినీ పెంపొందించుకుని, రెంటినీ సమన్వయం చేయాలన్న తపన నేపథ్యంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఒక అజ్ఞాత అనల్ప ప్రతిభావంతుని గురించిన పుస్తకం ఇది. 

సర్దేశాయ్ తిరుమల రావు గురించిన ఈ పుస్తకం లో రెండు పార్శ్వాలున్నాయి. ఒకరు వ్యక్తి, మరొకరు సాహిత్యవిమర్శకుడు.

ముందుగా సాహిత్యవిమర్శకుడుగా తిరుమలరావు గారి గురించి.

విమర్శకులు నాలుగు రకాలని రాజశేఖరుడనే లాక్షణికుడంటాడు. పాశ్చాత్యసాంప్రదాయంలోనూ ఇలానే నలుగురు విధాలైన విమర్శకులున్నారట. స్థూలంగా వాళ్ళ పద్ధతి ఇది.

 

గుణాలని కనిబెట్టి పొగిడేవాడు
దోషాలను మాత్రమే వెతికేవాడు
అభిమానం లేక గుణదోషాలను సమానంగా వెతికి చూసేవాడు
గుణదోషాలను తులనాత్మకంగా పరిశీలించి, ఆపైన అధ్యయనానికి ప్రేరేపించేవాడు.

తిరుమల రావు ఒక professional విమర్శకుడు కాదు. అతను నిజానికి ఒక నిజాయితీ గల పాఠకుడు, అనుశీలి. తన అభిప్రాయాలను పత్రికలకు వ్రాయడం ఆయన ప్రవృత్తి. ఆ ప్రవృత్తితో బాటు పాశ్చాత్య సాహిత్యంలో ప్రగాఢమైన అభినివేశం, సంస్కృతసాహిత్యానుశీలనం, తెలుగు సాహిత్యం పట్ల పెంపొందించుకున్న అభిరుచి ఎదిగి ఆయన ఒక విమర్శకుడిగా మారటం జరిగింది. వృత్తిరీత్యా పరిశోధకుడు కావడం వస్తువును అధ్యయనం ఎలా చేయాలో నేర్పింది. అందుకు ఒక చక్కని దృష్టాంతం ఈ పుస్తకంలో కనబడుతుంది.

గుంటూరు శేషేంద్రశర్మ గారు గొరిల్లా అని ఒక కవిత వ్రాశారు. మనిషి క్రియాశక్తికి గొరిల్లా ప్రతీక. ఆవేశం తన్నుకొని వచ్చినప్పుడు అది మత్తు వీడి నిద్రలేస్తుంది. దాని రోమరోమాలనుండి అనేక కర్మవీరులు వెడలి వస్తారు – ఈ ధోరణిలో ఉంటుంది ఆ కవిత. ఆ కవితను మెచ్చుకుంటూ ఆర్వీఎస్ సుందరం గారు ఒక వ్యాసం వ్రాశారు.

తిరుమల రావు గారు ఈ కవితను స్టడీ చేశారు.

Encyclopedia of Britannica ప్రకారం గొరిల్లా నిర్వచనం తెలుసుకున్నారు. గొరిల్లా ఒక పిరికి జంతువు, చాలా సిగ్గరి, పైగా ఆపద వస్తే గుండెలు బాదుకుంటూ పరిగెత్తుతుంది. ధృవప్రాంతపు ఎలుగుబంటిలా దానికి కుంభకర్ణ నిద్ర అలవాటులేదు.

పై నిర్వచనం ప్రకారం గొరిల్లా కవితలో చెప్పిన వస్తువుకు ప్రతీక అవుతుందా లేదా అని పరిశీలించారు.

అపైన ఆర్వీఎస్ గారిని అధిక్షేపిస్తూ సాకల్యంగా విమర్శించారు. గొరిల్లా కవిత పైన ఈ వ్యాసం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. నవ్విస్తూ ఆలోచింపజేస్తుంది. ఈ వ్యాసానికి తిరిగి ఆర్వీఎస్ గారు ప్రతివిమర్శిస్తే సర్దేశాయ్ తిరుమల రావు గారు “మరలా గొరిల్లా” అన్న పేరుతోటి మరో వ్యాసం వ్రాశారు. ఈ వ్యాసం మొదటి వ్యాసానికి పెద్దన్న.

గొరిల్లా పైన అంత హాస్యస్ఫోరకంగా విమర్శ వ్రాసిన తిరుమల రావు గారు, మరో వ్యాసంలో పుట్టపర్తి నారాయణాచార్యుల జనప్రియ రామాయణాన్ని కాస్త తీవ్రంగానే విమర్శించారు. ఈ వ్యాసం అముద్రితం. ఈ అముద్రిత వ్యాసంలో విమర్శలకు సమాధానం శ్రీ గొల్లాపిన్ని శేషాచలం అనే ఆయన తమ సిద్ధాంత గ్రంథం “పుట్టపర్తి జనప్రియం” లో చెప్పారు.

సర్దేశాయ్ తిరుమల రావు గారి వ్యాసాలు కేవలం విమర్శలతో ఆగిపోలేదు. 70, 80 దశకాలలో ఈయన భారతి కలగూరగంపలో వ్రాసిన వ్యాసాలకు కొంత దుమారమే రేగింది. వాటిలో ముఖ్యమైనవి – పులిచెర్ల సాంబశివరావు గారు కన్యాశుల్కాన్ని విమర్శిస్తూ, విశ్వనాథ సత్యనారాయణను సమర్థిస్తే, ఆతని వాదనలను విమర్శిస్తూ వ్రాసిన వ్యాసాలు. ఈ వ్యాసాలు ఈ సంకలనంలో చోటు చేసుకోకపోయినా, సర్దేశాయి తిరుమల రావు భారతి వ్యాసాల వివరాలను పుస్తకం చివరన చేర్చారు. ఈ విమర్శ, ప్రతివిమర్శలలో చాలామంది పాల్గొన్నారు.  ఆధునిక సాహిత్యం పట్ల పలువురు చర్చించి, ఒక భావాత్మక వాతావరణానికి నాంది పలికారు తిరుమలరావు.

శ్రీ తిరుమల రావు అభిప్రాయం ప్రకారం తెలుగులో గొప్ప ఆధునిక నాటకం – కన్యాశుల్కం. ఆధునిక నవల మాలపల్లి. ఆధునిక కావ్యం – శివభారతం. వీటిలో శివభారతంపైనా, కన్యాశుల్కంపైనా తిరుమల రావు గారు సిద్ధాంత గ్రంథాలు వ్రాశారు. కన్యాశుల్కం – నాటకకళ, సాహిత్యతత్త్వము – శివభారతదర్శనము అన్నవి వీటి పేళ్ళు. శివభారతతత్త్వములో ఆయన కవిత్వంలో పాశ్చాత్య, భారతీయ కవిత్త్వ సాంప్రదాయాలను ’గ్రంథ విస్తరభీతి’ వంటి చాదస్తాలు పెట్టుకోకుండా విపులంగా వ్రాశారు. ఆయన విమర్శ తీరును కొంతవరకూ ప్రతిబింబించే సంకలనం ఈ పుస్తకం.

అంతేకాక, ఈ పుస్తకంలో వీరు వ్రాసిన కథ, ఒక నాటకం, హిందూ పత్రికకు వ్రాసిన ఉత్తరాలు, వీరి దస్తూరి, వీరిపై ఇతరులు వ్రాసిన వ్యాసాలు, ఇంటర్వ్యూ, ఛాయాచిత్రాలు, వంటి అనేక అంశాలు సమగ్రంగా పొందుపర్చారు సంకలనకర్తలు.

*********************************************************

వ్యక్తిగా శ్రీ తిరుమల రావు గురించి కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. ఒక శాస్త్రవేత్తగా, వ్యక్తిగా ఈయన ఆంధ్రులు గర్వించదగిన వ్యక్తి. అందుకు ఇసుమంతైనా సందేహం లేదు.

అనంతపురంలో ఒక చిన్న పెంకుటింటి గదిలో జీవితాంతం ఒక చింకి చాప, అలమారాల నిండా పుస్తకాలతో ఏ విధమైన ప్రచారాలను ఆశించకుండా గడిపిన ఈ ఆజన్మబ్రహ్మచారి పేరిట తైలసాంకేతిక రంగంలో పదకొండు పేటెంట్లు ఉన్నాయి. ఈ రోజు గృహిణులు తమ ఇళ్ళల్లో ఉపయోగించే వంటనూనెలలో కొన్నిటికి ఈయన Technology అభివృద్ధి చేశారు.

చందమామ దాసరి సుబ్రహ్మణ్యం  గారికి, సర్దేశాయ్ తిరుమల రావు గారికీ కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఆయన లాగే ఈయన బ్రహ్మచారి, ప్రచారాలకు అర్రులు చాచలేదు, ముప్ఫై సంవత్సరాల ఉద్యోగజీవితంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.

వీరి నేతృత్వంలో OTRI (Oil Technology Research Institute) సంస్థ కేంద్ర ప్రభుత్వం యేటా ఉత్తమ పరిశోధనాసంస్థలకు ఇచ్చే బహుమతులలో ఐదు సార్లు బంగారు పతకాన్ని, ఇంకా పది సార్లు రజత కాంస్యపతకాలను గెలుచుకుంది. జాతీయ, విదేశీయ పత్రికలలో తైలసాంకేతికత మీద వీరు ఐదువందలకు పైగా వ్రాసిన పరిశోధనా, సిద్ధాంత వ్యాసాలు వ్రాశారు. ఏ ఐ ఐ టీ వంటి సంస్థలలోనో తప్ప ఇలా వందలకొలదీ పరిశోధనా వ్యాసాలు వ్రాసిన వారు కనిపిస్తారా అన్నది సందేహమే. అమెరికాలో ఒకానొక తైలసాంకేత సంస్థలో భారతదేశం తరపున నమోదు అయిన ఏకైక వ్యక్తి తిరుమల రావు. ఈ రంగంలో లబ్ధప్రతిష్టులైన విదేశీయులు ఈయనను సంప్రదించేవారట.

వీరి గురించిన వ్యక్తిగత వివరాలు, వీరి పరిశోధనా పత్రాల వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.

*********************************************************

ఆంధ్రదేశంలో అనేక చోట్ల అజ్ఞాత ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. సంస్థలు గుర్తించని పక్షంలో వ్యక్తులే ఇటువంటి వారిని గుర్తించి వెలికి తీయవలసి ఉంటుంది. అందుకు ముందడుగు వేసిన సంపాదకులు నాగసూరి వేణుగోపాల్, కోడిహళ్ళి మురళీమోహన్ గార్లు అభినందనపాత్రులు.

పుస్తకం పట్ల అభ్యంతరాలు లేకపోయినా, సర్దేశాయి తిరుమల రావు గారి విమర్శలు కొన్ని చోట్ల ఆమోదయోగ్యాలు కావని ఈ వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం. కొన్ని చోట్ల ఈయన “శ్రుతి” మించిన వ్యాఖ్యలు చేశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు కూడా ఈ విషయాన్ని ఈయనకు సూచించి మందలించారు. ఉదాహరణకు – సంస్కృత అలంకారిక సిద్ధాంతాలను రచయిత ఒకచోట వేళాకోళం చేశారు. రస సిద్ధాంతం వంటింటి నుండి వచ్చినది అంటారు. వంటింటి నుండి సిద్ధాంతం రాకూడదని ఏమున్నది? సంస్కృతి, సాంప్రదాయాలకు మూలాలు మన ఆహారంలో ఉండటం సరైన విషయమే.

జనప్రియరామాయణంలో ఇతర కవులను అనుసరించిన తీరును తప్పుబట్టారీయన. భవభూతి వ్రాసిన ఉత్తరరామాయణం కుందమాలకు అనుసరణ. కాళిదాసు వ్రాసిన అనేక శ్లోకాలకు గాథాసప్తశతిలో ఆధారాలున్నవి. మృచ్ఛకటికం దరిద్రచారుదత్తానికి పొడిగింపు. ఇంకా అనేకానేక సందర్భాలలో, కవుల విషయంలో అనుసరణ కనిపిస్తుంది. అనుసరణ – తన రచనాపద్ధతిలో భాగమైనప్పుడు, అది అనుసరణే అని రచయిత ఒప్పుకుంటున్నప్పుడు అందులో తప్పుపట్టవలసినది లేదు.

*********************************************************

ఈయన మీద వ్యక్తిగత అభిప్రాయాలేవైనా, ప్రతిభను, అధ్యయనాన్ని, అభినివేశాన్ని, ఒప్పుకోక తప్పదు. భారతదేశంలో సాంకేతికత విద్య వేరు సాహిత్యం వేరు. కాళిదాసును తెలిసినంతగా మనకు కణాదుడు, చరకుడు తెలియలేదు. మ్లేచ్ఛులు ఎలాంటి వారైనప్పటికీ వారికి ఈ సమన్వయం తెలుసు. ఈ రెండు రంగాలను సమన్వయపర్చాలని సర్దేశాయి ఆకాంక్ష. ఎన్నో విధాలుగా విశిష్టమైన ఒక వ్యక్తి గురించి, ఆతని తులనాత్మక సాహిత్య విమర్శ, అధ్యయనం గురించి తెలుసుకోగలిగిన చక్కని పుస్తకం ఇది. సర్దేశాయి అనే వ్యక్తి, సాహిత్యం అన్న విషయాలు పక్కన పెట్టినా చక్కగా చదువుకొని ఆనందించదగిన అందమైన పుస్తకం ఇది. ముద్రణ బావుంది. స్ఖాలిత్యాలు బాధించవు.వెల 150 రుపాయలు. కినిగె లో లభ్యం.

“జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు” పుస్తకం ఆవిష్కరణ జూన్ 23, 2013 న రవీంద్రభారతిలో జరిగింది. ఆ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ ఎల్లూరి శివారెడ్డి గారి ఆశీఃప్రసంగం.

You Might Also Like

3 Comments

  1. Veluri

    కన్యాశుల్కము పై ఆయన విమర్శ చ దవండి

  2. కోడీహళ్లి మురళీమోహన్

    “సంస్కృత అలంకారిక సిద్ధాంతాలను రచయిత ఒకచోట వేళాకోళం చేశారు.”

    దీనికి సమాధానం ఈ పుస్తకంలోనే లభిస్తుంది. ఆచార్య హెచ్.ఎస్.బ్రహ్మానందగారు ఇలా అంటారు.

    “ఇలాంటి వైజ్ఞానిక దృష్టి ఆధునిక కాలంలో సంప్రదాయ పండితులకు నశించడంవల్లనే జాతి జీవితం కుంటుపడిందన్న ‘ఆక్రోశం’తో అన్నమాటలు ‘తక్కినవన్ని వేడుకల్’ అని. ఆయన్ని ఈ విషయంలో అపార్థం చేసుకోకూడదు.”

    “ఆ వాక్యాలను ‘సహృదయం’తో గ్రహిస్తేనే తిరుమలరావుగారి ‘సహృదయం’ అర్థమవుతుంది.

    1. రవి

      బ్రహ్మానంద గారి వ్యాఖ్య సమంజసంగానే ఉంది. మరొకచోట కూడా ’ధ్వని’ని హేళనగా మాట్లాడినా సర్దేశాయి తిరుమల రావుకు ఆనందవర్ధనునిపైన అభిమానం ఉన్నది అని ఎవరో సూచించారు. నిజమే కావచ్చు. శ్రీశ్రీ కవితలో ధ్వని, వక్రోక్తి ఇత్యాదులున్నాయన్న వ్యాసాన్ని రారా నిశితంగా విమర్శిచాడు. అధునిక కవిత్త్వధోరణులను అలంకార పద్ధతుల్లో అంచనా వేయడం దురవగాహనకు దారి తీస్తుందని మనకు వీళ్ళ అనుశీలనం వల్ల తెలుస్తూంది.

Leave a Reply