చిన్నమనిషి రాసిన పెద్ద పుస్తకం

(చార్లీ చాప్లిన్ ఆత్మకథ పై 1964లో సత్యజిత్ రాయ్ రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఇది. రాయ్ వ్యాసాల సంకలనం “Our films-their films” కు తెలుగు అనువాదమైన “సినిమాలు మనవీ-వాళ్ళవీ” పుస్తకం లోని వ్యాసం, కొద్ది మార్పులతో..)
***

చార్లీ చాప్లిన్ ఆత్మకథ పుస్తకంగా ప్రచురించబడిందని అందరికీ తెలిసిందే. ఆయన ఆత్మకథ చదివేముందు ఎలా ఉంటుందని ఊహించావని అడిగితే చెప్పడం కష్టం. అబ్బో అది చాలా పెద్ద పుస్తకం. దాదాపు అరవై ఏళ్ళ సినీ జీవితం అందులో ఉంది మరి. అటు పందొమ్మిదవ శతాబ్దం లోని మ్యూజిక్ హాళ్ళ నుండి నాటకాలవరకూ, ఇరవయ్యో శతాబ్దంలోని సినిమా ఆవిర్భావం నుండి నేటి శబ్ద చిత్రాల వరకూ అతను చూసిన మార్పుల్ని ప్రస్తావించుకుంటూ పోతేనే ఒక పెద్ద పుస్తకం ఔతుంది. పైగా, చాప్లిన్ కి ఇతర వ్యాపకాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే.

లోకవ్యాప్తంగా అభిమానింపబడి, ప్రశంసలందుకున్న కళాకారుడు అతనొక్కడే అనుకుంటాను. ఇలాంటి వ్యక్తి తన ఆత్మకథ ప్రచురించాడంటే ఆ పుస్తకం ద్వారా అతని ఆలోచనలూ, పనితీరు గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందా? అలాగే ఒక వ్యక్తిగా, చలనచిత్రకారుడిగా అతనిలోని వైరుధ్యాల మాటేమిటి? ఈ పుస్తకంలో చాప్లిన్ కొంత వ్యక్తిగత విమర్శ చేసుకుని, తన గురించి మనకి ఉన్న అస్పష్టతను తొలగించే ప్రయత్నమేమన్నా చేశాడా? లాంటి అనుమానాలతో ఈ పుస్తకం చదవడం ముగిసాక మనకో విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఇది మనం ఊహించిన విధంగా లేనప్పటికీ, అతని గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అతను ఇలా తప్ప మరోలా రాయలేడన్న విషయం కూడా అర్థమౌతుంది. అతను ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాల నుండే కాక, ప్రస్తావించకుండా వదిలేసిన విషయాల నుండి కూడా మనం అతన్ని గురించి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈపుస్తకంలోని రెండోభాగంలో చాలా విషయాలు పైపైనే స్పృశించి వదిలేయడం పెద్ద లోపంలా అనిపిస్తుంది. చాలా చోట్ల విషయాలను మరింత లోతుగా చర్చించి ఉంటే బావుండనే భావనతో ఈ పుస్తకం ఆద్యంతమూ సాగినా, చివర్లో పాక్షింకంగానైనా, సంతృప్తినిస్తుంది.

జానపద కథల తరహాలో బీదరికం నుండి ధనవంతుడిగా ఎదగడం; అతనికున్న మైమ్ కళను వాళ్ళమ్మ పెంచి పోషించి ప్రోత్సహించడం వంటి విషయాలు చాలా మందికి తెలిసిన విషయాలే. అతని పూర్వీకులు జిప్సీలన్న సంగతి కూడా మనకి చూచాయగా తెలుసు. ఇలా నవ్వించి, అలా మనల్ని ఆర్ద్రతలో తడపగల నేర్పు అతని ముందూ,తరువాత మరెవరికీ రాదు, లేదన్న సంగతి బాగా తెలుసు. ఇక “ది ట్రాంప్” గురించి తెలియని వారెవరు? మనకి చార్లీ, ట్రాంప్- ఇద్దరూ ఒకరే. చేతిలో ఆ కర్ర, ఆ ట్రేడ్ మార్క్ మీసం, తలమీద ఆ టోపీ లేకుంటే మనకు చార్లీ చాప్లిన్ ఎవరో తెలియదు; తెలుసుకోవాలనే ఆసక్తీ ఉండదు.

1931లో సిటీలైట్స్ చిత్రం విడుదలైనప్పుడు ఈ పొట్టి వ్యక్తి రూపురేఖల గురించి అందరికీ ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అప్పటికి శబ్దచిత్రాలొచ్చినా ఇతను మాట్లాడ్డానికి ఇష్టపడలేదు. ఒక కనురెప్ప ఎత్తడం ద్వారానో, భుజం పైకెగరేయడం ద్వారానో ఎన్నో భావోద్వేగాలు పలికించగలిగిన వాడికి మాటెందుకూ? సిటీలైట్స్ చిత్రం తరువాత నాలుగేళ్ళ విరామం వచ్చింది. ఇతను తరుచుగా సినిమాలు తీయొచ్చుగా – అని మనకి కోపం. ఇలా సినిమాకి సినిమాకి మధ్య ఇంత విరామం ఉండటం మనకి అన్యాయంగా అనిపిస్తుంది. ఈయన కూడా సర్కస్ లా సంవత్సరానికి ఒకసారొచ్చి తన ప్రతిభని ప్రదర్శించి మనల్ని ఆనందపరచొచ్చుగా?

“మాడర్న్ టైమ్స్” చిత్రంలో చాప్లిన్ కి కన్వేయర్ బెల్ట్ లపై నట్లు బిగించే పనిలో విచిత్రానుభవాలు ఎదురౌతాయి. ఈచిత్రంలో రెండు శబ్ద సన్నివేశాలుంటాయి. ఒక సీన్లో పెద్ద టెలివిజన్ తెర ద్వారా యజమాని ఫ్యాక్టరీ పని వాళ్ళను పర్యవేక్షిస్తాడు; మరో సీన్లో ఏదో పిచ్చిభాషలో చాప్లిన్ పాటలు పాడుకుంటూ ఉంటాడు. అక్కడక్కడా మాటలున్నప్పటికీ ఈ సినిమాలో దృశ్యానికే ప్రధానమిచ్చాడు చాప్లిన్. అయితే ఈ సినిమాలో తనతో నటించిన పాలె గొడర్డ్ (Paulette Godard) ని చాప్లిన్ పెళ్ళి చేసుకున్న విషయం చాలా మంది ఈ ఆత్మకథ చదివే తెలుసుకుంటారు. ఇంతకీ అతనికి ఇది మొదటి పెళ్ళి కూడా కాదు – మూడోది. అమ్మాయిలంటే భయపడే “ట్రాంప్” ఇతనేనా? అనిపిస్తుంది. అమ్మాయిలను చూసి అంత దూరం పారిపోయే చార్లీ వేరు; అమ్మాయిలంటే పడి చచ్చిపోయే చాప్లిన్ వేరు అన్నమాట.

మాడర్న్ టైమ్స్ తో “ట్రాంప్” అవతారం చాలించి “ది గ్రేట్ డిక్టేటర్” ద్వారా కొత్త అవతరాం ఎత్తాడు ఈయన. ఈ చాప్లిన్ బ్రిటీష్ యాసతో సునాయాసంగా ఆంగ్లంలో మాట్లాడుతూ, సమకాలీన రాజకీయ నియంతలను వ్యంగ్యంగా తూలనాడేవాడు. ఈయన యుద్ధానికి వ్యతిరేకం; మనిషి మనిషిని ద్వేషించడమంటే ఈయనకి ద్వేషం. కాలాతీత వ్యక్తి నుండి ఇలా సమకాలీన విషయాలని చర్చించే వ్యక్తిగా మారాక అతనిపై పాత్రికేయ దాడి మొదలై “ఈ పాడు ప్రపంచంలో కష్టాలుపడుతూ ఎలాగో బ్రతుకుడీస్తున్న అమాయకుడు” – అన్న ఇమేజ్ నాశనమైంది. అక్కడ్నుంచి, ఒక కమ్యూనిస్టుగా, ఒక వెర్రివాడిగా, ఆదాయపన్ను ఎగ్గొట్టిన వాడిగా, స్వార్థపరుడిగా, కాపీకొట్టేవాడిగా – ఇలా పాత్రికేయులు కనిపెట్టగల ప్రతి చెడ్డబుద్ధినీ చాప్లిన్ కి అంటగట్టడాన్ని ఈ అత్మకథ ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే, చాప్లిన్ తన నైతిక స్థానాన్ని మళ్ళీ నొక్కి చెప్పడానికి ఆవేశపడుతూ, తన శత్రువులను ప్రతిఘటిస్తూ రాసిన వ్యాసాలు చదువుతుంటే బాధ కలుగుతుంది; ఎన్ని కష్టాలొచ్చినా భుజాలు విదిలించి ముందుకు సాగే “ట్రాంప్” ఇతనేనా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇలాంటి విషయాల గురించి కాలయాపన చేసే కంటే మరో కళాఖండం తీసి మనందరినీ అలరించి ఉండొచ్చు కదా అని చెప్పాలనిపిస్తుంది. అలా జరగకుండా ఉండడానికి కారణాలు ఈ పుస్తకమే చెబుతుంది.

“ట్రాంప్” ఇమేజ్ లో చార్లీ మన వెంట ఉన్నంత వరకూ ఈ పుస్తకంలో ఒక విధమైన ఆప్యాయత, దగ్గరితనం, సునిశిత దృష్టీ కనిపిస్తాయి. అలాగే, ఇతని సినిమాల్లో తరుచు కనిపించే హాస్య, విషాద సమ్మేళనం ఈ భాగంలో ఉత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఇదంతా చదువుతుంటే మరో సినిమా స్క్రిఫ్టు చదువుతున్నట్టనిపిస్తుంది. పేజీలు తిప్పే కొద్దీ సంవత్సరాల మధ్య ఉన్న యధార్థ వివరాలని వదిలేస్తూ కొనసాగడం అతన్ని పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించదు. మనం కూడా, నిజానిజాల ప్రస్తావన పక్కన పెట్టి, ఆ రచనాశైలి మాయలో చిక్కుకుపోతాము. ఐసెన్‍స్టీన్ చిత్రం “ఇవాన్” ని పొగుడుతున్న సందర్భంలో “చరిత్రపుస్తకాల్లో కంటే కళాఖండాల్లో వాస్తవాలు, వివరాలు ఎక్కువ” అని వ్యాఖ్యానిస్తాడు చాప్లిన్. ఈ పుస్తకంలో చెప్పుకొచ్చిన తన చిన్ననాటి జ్ఞాపకాల్లో చాప్లిన్ ఇలాంటి వాస్తవాలనీ, వివరాలనే మనతో పంచుకున్నాడనిపిస్తుంది.

మనుష్యులూ, ప్రదేశాలూ, భావోద్వేగాలూ, సంఘటనలూ సజీవమై మనకు సాక్షాత్కరిస్తాయి. ఉదాహరణకు:
“స్మశాన వాటికలో వర్షం పడుతూ ఉంది. శవాన్ని పూడుస్తున్నవాళ్ళు మట్టి పెళ్ళలని శవం ఉన్న పెట్టెపై వేస్తుండగా అవి పెద్ద శబ్దం చేస్తూ ఆ పెట్టెపై పడుతున్నాయి. నేను భయపడిపోయి ఏడవడం మొదలుపెట్టాను. అప్పుడు బంధువులు పేటిక పై పూల మాలలు, పుష్పాలు వేయడం మొదలుపెట్టారు. మా అమ్మ వద్ద వేసేందుకు ఏమీ లేక, నా అమూల్యమైన నల్లటి అంచులున్న కర్చీఫు తీసుకుని – “జానీ, మనిద్దరి తరపున ఇది చాలు” అని మెల్లగా నా చెవిలో చెప్పింది.”
-ఇక్కడ వాస్తవాలెలా ఉన్నాయి అన్నవిషయం కంటే, అతను చెప్పే విధానమే మనకు ముఖ్యం. చాప్లిన్ తీరే ఇంత. తన జీవిత విశేషాలను చెప్పుకురావడంలో చాప్లిన్ కొంత స్వతంత్రించినా కూడా, అతని తొలి నాటి జీవితంలో ఉన్న నాటకీయతనూ, అప్పటి ఆశ్చర్యకర సంఘటనలనూ మనం అబద్దాలనలేము. దీనికి కారణం పేదరికం ఒక్కటే కాదేమో. తమ గతాన్ని ఘనంగా నిలుపుకోవాలన్న చాప్లిన్ కుటుంబం పట్టుదల కూడా ఒక కారణం కావొచ్చు.

“మా అమ్మ ఎప్పుడూ తన పరిసరాలను దాటి బయటకొచ్చి, మేమేం మాట్లాడుతున్నామో వింటూ, వ్యాకరణదోషాలు సవరిస్తూ, మేమేదో గొప్పవాళ్ళం అన్న భావన కలిగిస్తూ ఉండేది.” అప్పటికే చాలారోజులుగా తల్లినుండి వేరుపడ్డ తండ్రి వీరికెప్పుడూ ఎక్కడో దూరంలో కనబడే మనిషిగానే ఉన్నాడు. అయితే, తల్లి మానసిక సమస్యలు, కొన్నాళ్ళకి ఆవిడని మానసిక చికిత్సాలయానికి తరలించడం వల్ల తండ్రీకొడుకులు కొన్నాళ్ళు కలిసి ఉండాల్సిన అవకాశం వచ్చింది.

“అతను నాకు నచ్చాడు. భోజనాలప్పుడు అతని ప్రతి అడుగూ గమనించేవాడిని. అతను తినే విధానం, మాంసం తినేందుకు కత్తిని కలంలా పట్టుకునే తీరూ, నేను చాలా రోజులు కాపీకొట్టాను..” అంటూ తన తండ్రి గురించి రాసుకొస్తాడు చాప్లిన్.

-ఇవన్నీ చాప్లిన్ ని పతాకస్థాయికి తీసుకెళ్ళిన మిమిక్రీ కళకి మూలాలు. తనకంటే ఆరేళ్ళు పెద్దవాడైన సోదరుడు సిడ్నీ సాయంతో చాప్లిన్ కెరీర్ చిన్నవయసులోనే మొదలైంది. అతను టీనేజ్ కి వచ్చేసరికే తనకంటూ ఓ పేరును ఏర్పరుచుకున్నాడు. “కళ అన్న పదం నా ఆలోచనల్లో ఎప్పుడూ రాలేదు. నాటకరంగం అంటే నాకు జీవనోపాధి, అంతే.” మొజార్ట్ యవ్వనంలో బహుశా ఇలాగే వ్యాఖ్యానించి ఉండేవాడేమో. మంచి మెలొడీలు అందించగలగడం ఒక వరం. అది ఉన్న వాళ్ళు సంగీతం సృష్టించడం అనేది ఒక కళాత్మక ప్రక్రియ అని గుర్తించలేరు; వారి నుంచి సంగీతం సహజంగానే వెలువడుతుంది! “మైమ్” విషయంలో కూడా అంతే; చాప్లిన్ కి అది జీవితం నేర్పించిన పాఠం. చాప్లిన్ లాగే గొప్ప గొప్ప హాస్యనటులందరూ జీవితానుభవాలని కాచివడబోసినవారే. కళ అంటే ఈ వడబోత కాక మరేమిటి? కళ పట్ల తనకెలాంటి ఆలోచనలూ లేవనుకున్నా, అప్పటికే చాప్లిన్ ఒక కళాకారుడిగా ఎదుగుతూ ఉన్నాడన్నది నిజం.

ఈపుస్తకం తొలి అర్థ భాగం నాటకరంగం నుంచి వెండితెరకు మరలడం, పేదరికం నుండి సంపదల్లో మునిగేవరకూ సాగుతుంది. ఇక్కడ మొదలయ్యే జీవన వైరుధ్యాలు ఇక ముందుకు సాగేకొద్దీ ఇంకా లోతుగా కనిపించి, చివర్లో అన్నింటినీ ఒక నిర్లిప్తతతో స్వీకరించేదాకా వెళ్తాయి. ఆర్థికంగా అనూహ్యమైన ఎత్తుల్ని అందుకోడానికి అతనికి జనబాహుళ్యంలో లభించిన గుర్తింపుతో పాటు, చాప్లిన్ స్వయంగా చూపిన వ్యాపారదక్షత కూడా కారణం. ఇలాంటి అద్భుత విజయం అనూహ్యమైన పరిణామాలకు దారితీయడం సహజమే. చాప్లిన్ స్వతంత్ర ఆలోచనలతో ఎదగడానికి సినిమా మాధ్యమం అవకాశం కల్పించింది. అంతే కాదు. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులనూ సంపాదించి, తన కళకి ఒక విధమైన కాలాతీత సార్వజనీనతను కూడా తెచ్చి పెట్టింది. తెరపై ఆయన ప్రదర్శించేవి చేసేవి చిలిపి చేష్టలు, కొట్లాటలు అయినప్పటికీ, ఇవన్నీ ఒక బ్యాలేలో కనబడే ఠీవిని సొంతం చేసుకున్నాయి. అందువల్ల చాప్లిన్ అతి తక్కువ సమయంలోనే అత్యంత గుర్తింపు తెచ్చుకోవడంలో ఆశ్చర్యం లేదు.

నాటకరంగం ఎప్పటికీ అతనికి ఇంత గుర్తింపు తెచ్చిపెట్టగలిగేది కాదు. అస్తవ్యస్తంగా సాగిన చదువు, పేదరికపు నేపథ్యం, ప్రేమకలాపాలు -ఏవీ అతన్ని మేధావి వర్గాల్లోకి ప్రవేశించడాన్ని అడ్డుకోలేకపోయాయి. పెద్ద పెద్ద నటులు, సంగీతకారుల మధ్య చాప్లిన్ హాయిగా ఉండగలిగేవాడు. నిజిన్క్సీ (Nijinsky) వంటి గొప్పవ్యక్తి ఒకసారి చాప్లిన్ షూటింగ్ చూసేందుకు వచ్చి, అతని చిరాకుకు గురయ్యాడు. “చివరిరోజు మా కెమెరామెన్ కు కెమెరాలో ఫిల్మ్ వేయొద్దని చెప్పాను. నిజిన్స్కీ విషాదభరితమైన మొహాన్ని చూస్తే, నేను హాస్య సన్నివేశాన్ని చిత్రించలేను” అంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు చాప్లిన్. రచయితలతో, శాస్త్రవేత్తలతో, రాజకీయనాయకులతో మాత్రం ఏదో విధంగా మాటదాటేయడమో, తెలివిగా నవ్వించడమో, అమాయకంగా ఉండిపోవడమో చేసేవాడు. అయితే, ఇది తనంతట తాను బుద్ధిపూర్వకంగా చేసింది కాదు. ఒకసారి గ్రీన్విచ్ గ్రామంలో హార్ట్ క్రేన్ అన్న అమెరికన్ కవిని కలిశాడు చాప్లిన్. “కవిత్వం యొక్క అవసరాన్ని గురించి మేము చర్చించుకున్నాము. కవిత్వాన్ని ప్రపంచానికి రాసిన ప్రేమలేఖగా నేను అభివర్ణించాను. అతను నా చిత్రాలు గ్రీకు విషాదాలతో పోల్చాడు. నేను అరిస్టోఫెనిస్ (ప్రాచీన్ గ్రీకు రచయిత) రచనల ఆంగ్లానువాదాన్ని చదవడానికి ప్రయత్నించాను కానీ, పూర్తి చేయలేకపోయానని చెప్పాను.” అరిస్టోఫెనిస్ రచనలు పూర్తిగా చదవలేదు కాబట్టి గ్రీకు రచనల ప్రేరణతో తన సినిమా కథలు రూపొందించలేదని చెప్పడం చాప్లిన్ అభిప్రాయమో ఏమో కానీ ఈ పుస్తకం రెండో భాగంలో ఇలాంటి ఎన్నో సంభాషణలు గందరగోళంగా ఉంటాయి. ప్రపంచంలోని గొప్పవారితో తన పరిచయాలు కొన్ని ఆసక్తి కరంగానే ఉన్నాయి. ఒక చోట నెహ్రూ గంటకి డెబ్భై మైళ్ళ వేగంతో వెళ్తున్న కారులో ఉత్సాహంగా రాజకీయాలని చర్చించాడని రాసారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చాప్లిన్ లాంటి నటుడికి ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉండే ఉండాలి. కానీ మేధావులతో మాట్లాడేటప్పుడే చాప్లిన్ దొరికిపోతాడు. బ్రెచ్డ్ట్ (Bertolt Brecht) తో ముఖాముఖి ఈవిషయాన్ని తేటతెల్లం చేస్తుంది. “హాన్స్ ఐలర్ వద్ద మేము బ్రెచ్డ్ట్ ని తరుచూ కలిసేవారం. ఆయనెప్పుడూ బాగా కత్తిరించబడ్డ జుట్టుతో, సిగరెట్టు నోట్లో ఉంచుకుని కనిపించేవాడు. కొన్ని నెలల తరువాత అతనికి నేను ‘మిస్సియర్ వెర్డాక్స్’ స్క్రిప్ట్ ను చూపిస్తే, కాసేపు తిరగేసి – “ఓహ్, మీరు స్క్రిప్టు చైనీస్ పద్ధతిలో రాస్తారా?” అన్నాడు. బ్రెచ్డ్ట్ లాంటి మేధావితో మాట్లాడే అవకాశమొస్తే మాట్లాడిందింతేనా అనిపిస్తుంది పాఠకులకు.

చలనచిత్ర రంగపు ఆదిమజాతిగా వర్ణింపదగ్గ “ఇన్ట్యూటివ్” కళాకారుల్లో చాప్లిన్ ఒకడు. ఈ విషయం అప్పుడప్పుడూ సినిమాలు తీయడంలోని కళను గురించి అతను చేసే వ్యాఖ్యానాల బట్టి ధృవపడుతుంది.
“నా కెమెరా సెటప్ ప్రధానంగా నటీనటుల కదలికలను చూపడానికి ఉపయోగిస్తాను. కెమెరా నేలపై పెట్టి ఒక నటుడి మొహం చుట్టూ తిప్పుతూ ఉంటే, అప్పుడు ప్రదర్శనిచ్చేది కెమెరా కానీ, నటుడు కాదు” అని చెప్పుకొస్తాడు చాప్లిన్. చలనచిత్ర నిర్మాణంలోని ప్రాథమిక సూత్రాలతో అవగాహన ఉన్న ఎవరికైనా కెమెరా పరిమితుల సంగతి తెలిసేఉంటుంది. కెమెరాని కదల్చడం ద్వారా దర్శకుడు తన భావాలను వ్యక్తీకరించాలనుకుంటాడు. అయితే, తన చిత్రాలకు దర్శకుడు తానే ఐనందువల్ల చాప్లిన్ దర్శకుడన్నవాడిని చెప్పుకోదగ్గ వ్యక్తిగా భావించలేదేమో.

పుస్తకం రెండో భాగం తేలిగ్గానే ఓ మూసలో పడుతుంది – మొదట ఒక చిత్రానికి కథ ఎలా పుట్టింది? సినిమా ఎలా తీసారు? రిలీజ్ తరువాత కలిగే ఆందోళన, విజయానంతర ఉపశమనం, లాభాలు, ఆ తరువాత ఈ విజయాన్ని ధనవంతులైన స్నేహితుల్తో కలిసి ఆస్వాదించడం (హెర్స్ట్ ఇతని దగ్గరివారిలో ఒకడు!); లేదంటే, ఉదారంగా అమ్మాయిలతో ప్రేమకలాపాలు సాగించడం (జోన్ బ్యారీ గురించి “జారబోతున్నట్లు ఉండే పైభాగం, వేసవి దుస్తుల్లో ఉన్న ఈ అమ్మాయిని చూస్తే, నాలో కోరికలు చెలరేగేవి”), గొప్పవాళ్ళతో భుజాలు రాసుకోవడం; జీవితం-కళ గురించి అప్పటికే జనం నోళ్ళలో నానిన వ్యాఖ్యానాలు మళ్ళీ చెప్పడం;కోర్టు కేసులు; ఫెడరల్ కోర్టు, రైటిస్టు ఫ్యాక్షన్లు, అమెరికన్ ప్రెస్ వారి దాడులు, వీటి తర్వాత వీళ్ళ విమర్శల్ని తిప్పికొట్టడం, చివర్లో తాను అమాయకుడినని ప్రకటించడం, అంతా చదివాక -తన ఆత్మకథ చెప్పుకోడానికి ఇదొక్కటే పద్ధతైతే, అసలు చెప్పుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. అమెరికా ఈ నటుడితో ప్రవర్తించిన విధానం గురించి కలిగే అసహ్యం కొత్తదేం కాదు. ఈపుస్తకం ద్వారా తెలిసే విషయం ఏమిటంటే – చాప్లిన్ తనపై పడ్డ అపవాదుల్ని తొలగించుకోడానికి చేసే యత్నాల్లో కనబడే ఆతృత. “ఆ తరువాత మా లాయర్ ఫోన్ చేసి, చార్లీ, నువ్వు అపవాదుల నుంచి బయటపడ్డావు. రక్తపరీక్షల తరువాత నువ్వు తండ్రివి కావని తేలింది” అనగానే “దీన్నే ప్రాయశ్చిత్తం అంటారు” అన్నాను” లాంటి సినిమాటిక్ ఘట్టాలూ ఈ ఆత్మకథలో చోటు చేసుకున్నాయి.

ఈపుస్తకంలోని చివరి భాగాన్ని ఆనందకరమైన విషయాలతోనూ, ఒక విధమైన సంతృప్తితోనూ ముగిస్తాడు చాప్లిన్. ఒక మంచి వివాహం, ఇల్లు, పిల్లలకి యురోప్ లో మంచి విద్యాబుద్ధులు, కొంత మనశ్శాంతి, ఇలా పెద్ద ఆత్మకథ రాసేందుకు తీరికా, ఇదంతా అతనికి దక్కి తీరాల్సిందే. ఈ ముగింపులో ఎలాంటి అపశృతులూ ఉండరాదని అతనిలోని కళాకారుడు శాసించాడు. లేదంటే, అతని చిట్ట చివరి చలన చిత్రం, అతని జీవితంలో ఏకైన వైఫల్యం అయిన “ఎ కింగ్ ఇన్ న్యూ యార్క్” గురించి ప్రస్తావనైనా లేకపోవడాన్ని మరెలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చాప్లిన్ ని చూస్తే మనకి ముసలివయసులో జనాల్ని నవ్వించే మాయని మరచిపోయిన లైమ్లైట్ చిత్రంలోని హాస్యగాడు క్లవెరో పాత్ర గుర్తుకొస్తుందని చాప్లిన్ కి తెలుసా??

-1964

You Might Also Like

5 Comments

  1. KOTARI MOHAN RAO

    review is very good n interesting to read the original

  2. A.Surya Prakash

    ఆంగ్లభాషలో చాలా గొప్ప ఆత్మకథ గురించి సర్వతోముఖ ప్రతిభ కలిగిన ఒక కళామూర్తి రచనను సౌమ్య ముగా అందించిన రచయిత్రికి అభినందనలు!

  3. gks raja

    సౌమ్యగారూ!
    చాప్లిన్ గురించి ఎన్ని చిన్నా,చితకా,పెద్ద పుస్తకాలు చదివినా— ఎక్కడ ఆయన పేరుతో వ్యాఖ్య,వ్యాసం, సమీక్ష ఏది కనపడినా మళ్ళీ మళ్ళీ చదవకుండా ఉండలేము. అటువంటిది ఆ వ్యాసంలో కొత్త విషయాలు (ఇంతకుముందు చదివిన వాటిలో లేనివి) ఉండడం, వాటిని అందంగా అందించడం జరిగితే ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా! చాప్లిన్’నా కధ’కు వల్లభనేని అశ్వినీకుమార్ చేసిన అనువాదం, మీరు (సత్యజిత్ రాయ్) చర్చంచిన ఆత్మకధా ఒకటేనా?
    మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
    gksraja.blogspot.in

    1. సౌమ్య

      Yes, its the same book.

  4. varaprasad

    verygood review,thanq sowmyaji.

Leave a Reply