ప్రళయకావేరి కథలు – మరోసారి!
కొన్ని కథలు – ఎన్నిసార్లు చదివినా విసుగేయదు. ఎప్పుడు మొదలుపెట్టినా ఒక కథ అవగానే ఇంకోటి చదవాలి అనిపిస్తుంది. అప్పటికే చదివి ఉన్నందువల్ల మనకి అసలు కథ తెలిసినా కూడా మళ్ళీ చదవాలి అనిపిస్తుంది. అలాగ నాకు అనిపించే కథల్లో స.వెం.రమేశ్ గారి “ప్రళయకావేరి కథలు” లోని కొన్ని కథలు కూడా ఉంటాయి, ఎప్పటికీ. మొన్నీమధ్యే శ్రీ అట్లూరి గారు పుస్తకం.నెట్ లో సంక్షిప్తంగా ఈ కథల గురించి ప్రస్తావించాక మళ్ళీ చదవాలి అనిపించింది. అప్పట్నుంచీ వీలున్నప్పుడల్లా ఒకటో రెండో కథలు చదవడం, ఇందులోని భాషకు, పదసంపదకూ ఆశ్చర్యంతో కూడిన అభిమానానికి లోనవడం, వారి జీవన విధానంలోని విశేషాల గురించి ఆసక్తికరంగా మళ్ళీ మళ్ళీ చదవడం – జరుగుతోంది. సరే, నాకెందుకు ఈ కథలు నచ్చుతున్నాయి? అని ప్రశ్నించుకున్నాను. ఈ నేపథ్యంలో ఇప్పుడీ వ్యాసం రాస్తున్నాను (కథా నేపథ్యాల లాగా ఈ ఉపోద్ఘాతం వ్యాస నేపథ్యం అనమాట!)
వినడానికి, పలకడానికి అంత గొప్పగా ఉన్న “ప్రళయకావేరి” అన్న పేరు పులికాట్ సరస్సు కు ఉందని తెలిసింది ఈ పుస్తకం ముందుమాట చదువుతున్నప్పుడే.
“…అసలిప్పుడు ప్రళయకావేరనే పేరేలేదు. పర్యాటకశాఖ వారి పుస్తకాల్లో పులికాట్ అనే పేరూ, ఎండిన ఉప్పుకయ్యలూ, జీవం లేని జనులూ, ఇంతే. ఇదంతా, ఇవన్నీ కళ్ళ ముందే, ఒక్క బతుకులోనే తటాలున, చటుక్కున మాయమయిపోవడం, అంతరించిపోతున్నా ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ ఏమీ చేయలేక, వూరుకోలేక నరకయాతన పడడం, ఆ భావాల్ని అక్షరాల్లో వ్రాయడం కష్టం. అయినా నా భావాలను నలుగురితో పంచుకోవాలనుకున్నాను. ఆ భావాలకు అక్షరరూపమే నా ప్రళయ కావేరి కథలు”
– అంటూ రచయిత స.వెం.రమేశ్ ముందుమాటలో రాసుకున్న ఈమాటలే బహుశా నాకీ కథలు నచ్చడానికి గల కారణాలు కూడా అనుకుంటాను.
మొత్తం 21 కథలున్నాయి. కథలన్నీ ప్రళయకావేరి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోని జీవితాలు, వారి పండుగలూ పబ్బాలూ, పిల్లకాయల ఆటలూ ఆరాటాలు, కష్టాలూ నష్టాలూ, తమ తల్లి ప్రళయకావేరిపై గల ప్రేమాభిమానాలు-కోపతాపాలు, ఆ ప్రాంతాల చెట్టూ చేమా, పళ్ళూ కాయలూ : ఇలా అన్నింటి గురించి నిఖార్సైన ప్రళయకావేరి ప్రాంత పదజాలంతో రాయబడినవి. అక్కడక్కడా పదాలు అర్థం కాక (కొన్నింటికి ఫుట్నోట్లు ఇచ్చారు కానీ, అవి సరిపోలేదు నాకు) ఇబ్బందిపడ్డా, అంత అందమైన భాష చదవడానికి ఆ ఇబ్బంది అంత పెద్ద అడ్డంకి కాలేకపోయింది.
ఒక విధంగా ఆలోచిస్తే – ఈ కథల్లో నిజంగా ఒక మంచి పట్టు ఉన్న కథనమూ, ఒక నేర్పరితనంతో “చెక్కబడిన” శిల్పమూ, ఉన్నవి అంత ఎక్కువగా లేవు (నాకు అనిపించినంతలో). అలాగే, కథలకి పెట్టే పేర్లకి, కథలో ఆ పేరుకుండే స్థానానికి చాలాసార్లు నాకాట్టే పొంతన కనబడలేదు. కొంతకాలం క్రితం ఒక ప్రముఖ కథకులు అన్నట్లు (అంటే ఆయన అంటున్నప్పుడు నేనా గదిలో ఉన్నానన్నమాట), ఇవి “వట్టి నొస్టాల్జియా కథలంతే”. చాలా సూటిగా, ఆట్టే ఇట్టాంటి విషయాలు పట్టించుకోకుండా కబుర్లు చెప్పుకుంటున్నట్లు తన అనుభవాలన్నీ చెప్పుకుపోతున్నట్లు కూడా అనిపించింది కొన్ని చోట్ల. అయితే, అలా అని ఇవి కథలు కావనో, ఫలానా పరీక్షలకి తూగవనో, ఇలాంటివన్నీ నేను ఆలోచించలేదు (నీ అనుకోలు ఎవడిక్కావాలి? అని మీరనుకునే హక్కు మీకెంతయినా ఉంది!). ఎందుకంటే, ఈ కథలు మొదటిసారి చదివినప్పటి నుండి నన్ను అంటిపెట్టుకునే ఉన్నాయి కనుక నా పరిధిలో నాకు అవి గొప్పకథలే! ఈ గొప్పతనం కథనబలం వల్లనో, వస్తు బలం వల్లనో కాక – అందమైన భాష, ఆ ప్రాంత జీవనశైలి గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి చక్కగా, అదీ కథలో భాగంగా రాసుకుపోయిన ఆ వివరాలు, రాయడంలోని నిజాయితీ: వీటివల్ల వచ్చిందని అని నేను అనుకుంటున్నాను.
“కొత్త సావాసగాడు” కథలో “తాత” కొంగల గురించి చెబుతూంటే, కథకుడిలా నేనూ వింతగా కళ్ళింత చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆ అక్షరాలనే చూస్తూ ఉండిపోయా కాసేపు 🙂
‘తాతా, నీకు యీ కొంగల పేర్లు తెలుసా?’ అడిగినాను, ప్రళయ కావేట్లోని రకరకాల కొంగల్ని చూస్తా. తాత చెప్పేకి మొదులుబెట్నెడు.
‘ముక్కుకింద సంచి మాదిర యాలకారుతుండాదే అది గూడబాతు, బార్లుదీరి నిలబడుండేటియి కాళ్ళ వుల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతా వుండేటియి గుండు పుల్లంకులు. అద్దో ఆ జత తెడ్డు మూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరడు ఎర్రముక్కుతో, పసురు వన్నె రెక్కతో సొగసుగా వుండేది ఎర్రగాళ్ళ కొంగ. ఆ దిబ్బమింద రెక్కలార్చుకుంటుండేది నీళ్ళకాకి. దాని పక్కన్నే చేపను తింటా వుండాదే అది చిలవ. చిలవ పక్కనుండేది చింతొక్కు. దిబ్బకు దిగువ నీళ్ళనో వుండే గుంపు ఆడేటి బాతులు. వోటి కెనకుండే నాలుగూ, నత్తగుల్ల కొంగలు. దిబ్బకు యీతట్టు మెడకాయిమటుకే బయటబెట్టి పాము మాదిరి ఆడిస్తుండాదే, అది పాము మెడకొంగ.’
ఇలాగ, కథలన్నింటిలోనూ ప్రళయకావేటి భాష, యాస, జనం, జీవం అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. నాకు బాగా నచ్చిన కథల్లో ఒకదాని గురించి ప్రస్తావించి ఇక్కడికి ఆపుతాను. “ఆడపొడుసు సాంగెం” కథలో, ప్రళయకావేరి ఆడపడుచుల గురించి ఆ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న కథ ఒకటి చెబుతారు:
“అరుణ, కాళంగి, ప్రవాళం, సువర్ణముఖి అని పెళయకావేరమ్మకి నలుగురు ఆడపొడుసులుండారు. అంటే ఎగవ సిద్ధలయ్య కొండల్లో పుట్టే ఏరులు ఏడాదికొకతూరి వొదిన్ని చూసే దానికి వురుకులు పరుగుల్తో వస్తారు. వోళ్ళొచ్చినప్పుడు పెళయకావేరమ్మ సంతోషంతో పొంగుతాది. ఆయమ్మ సంతోషాన్ని మనమూ పంచుకొని, ఆడపొడుసులకి సాంగెం పెడతాము. ఇది మన ఆచారం, చెప్పినాడు తాత”
చివ్వర్లో, ఆ ఏడు వరదల్లే ముంచుకొచ్చిన ప్రళయకావేటికి/ఆడపొడుసుల తాకిడికి అయ్యిన భీభత్సానికి, ఒకపక్క ఇంట్లో ఒక మనిషిని పోగొట్టుకున్న దుఃఖానికి, “ఈ పెళయకావేరి నాసినం గానూ, మమ్మల్ని బతకనిచ్చేటట్టు లేదే” అని కథకుడి అత్త తిట్టుకుంటే, అతని తాత – “ఆయమ్మనెందుకమ్మే తిడతావు? ఇది ఆడపొడుసులు ఆడుతుండే సెల్లాటం” అంటాడు. తరువాత, పది దీవులు ప్రళయకావేట్లో కలిపేసుకున్నాక, మొత్తానికి ఈ ఉధృతి తగ్గుతుంది. అప్పుడు రచయిత – “ఏమీ తెలవని నంగనాచుల్లా పెళయకావేరమ్మ ఆడపొడుసులు, మొగదార్లు కోసుకుని మొగుడి దగ్గరికి పరిగెత్తతా వుండారు. ఆడపొడుసు సాంగెంగా పది పల్లెల్ని తమలో కలుపుకుని” …అంటూ ముగిస్తారీ కథని. ఆ ప్రాంతాల ప్రజలకు ప్రళయకావేరితో ఉన్న అనుబంధాన్ని బాగా అనుభవంలోకి వచ్చేలా వర్ణించిన కథల్లో ఇదొకటని నాకనిపిస్తుంది.
నన్ను అడిగితే తెలుగు చదవడం వచ్చినవారందరూ తమ ఇంటి గ్రంథాలయాల్లో ఉంచుకోదగ్గ పుస్తకం. జర్మనీలో ఈ పుస్తకం ఇలా మళ్ళీ మళ్ళీ చదివే సౌలభ్యం కలిగించిన నా స్నేహితురాలికి ధన్యవాదాలు.
***
పుస్తకం వివరాలు:
ప్రళయకావేరి కథలు
స.వెం.రమేశ్
మీడియా హౌస్ ప్రచురణలు, 2005
వెల: 50 రూపాయలు (ఇది నా దగ్గరున్న కాపీ పైని వెల. ఇప్పుడెంతో నాకు తెలియదు.)
కథలు ఉచితంగా చదువుకోవడానికి కూడా తెలుగుపీపుల్.కాం వారి వెబ్సైటులో లభ్యం.
dharanija nimmagadda
nenoo koodaa chadivaanu ee kathalu.pustakam dorike chirunaama cheppagalaraa evarainaa?
sri
kinige.com lo dorukutundi andi …
మధురవాణి
Totally agree with you.. నాకు చాలా చాలా నచ్చేసిందీ పుస్తకం. అప్పుడప్పుడూ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథలు.. 🙂
నాకైతే వెళ్ళి ప్రళయకావేరిని, ఆ కొంగల్నీ, దీవుల్నీ చూడాలని బాగా అనిపించేసింది కథలు చదువుతున్నంతసేపూ..