పుస్తకాలు-మానవసంబంధాలు

‘పుస్తకాలు మానవసంబంధాలు’ అన్నది శ్రీరమణగారు ‘పత్రిక’ జూన్ నెల సంచిక కోసం రాసిన వ్యాసం. పుస్తకం.నెట్ పాఠకులకు అందిస్తామంటూ అడిగిన వెంటనే అంగీకరించిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.సాధారణంగా ఆయన రచనలన్నిటిలోనూ కనిపించే వ్యంగ్యం,హాస్యంతో పాటు తాళపత్రాల నుంచి వెబ్ సైట్ దాకా పుస్తకాలు మారుతున్న తీరును తనదైన పద్ధతిలో గమనించడం ఆశ్చర్యమనిపిస్తుంది.

పుస్తకాలు మానవ సంబంధాలు
అరువు అడగడానికి అత్యంత అనువైనది యీ భూమ్మీద పుస్తకం మాత్రమే. పుస్తకాలు కొనడం చాలా అనాగరికం – అని విశ్వసించి ఆచరించే పుస్తకప్రియులు కోట్లాదిమంది మన మధ్య వున్నారు. ‘క్లాసిక్’ అంటే నిర్వచనమేమిటని ఒక పెద్దాయనని అడిగారు. ‘చదవకుండా చదివినట్టు చెప్పబడే పుస్తకాన్ని క్లాసిక్ అంటారు’ అన్నాడాయన. ‘అరె! శ్రీశ్రీ మహాప్రస్థానం మీ దగ్గర వుందా’ అని వచ్చీరాగానే మీ బీరువాలో ఆ పుస్తకం చూసి నిలువెత్తు ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ‘ఎప్పుడో కాలేజీ రోజుల్లో చదివా.మళ్లీ చదవాలోయ్. మొన్నామధ్య రెండుమూడు షాపుల్లో అడిగితే అవుటాఫ్ ప్రింట్ అన్నారు’ ఇలా మాట్లాడుతూ బీరువాలోంచి పుస్తకం చేతిలోకి తీసుకుంటాడు. మీరు ఇంక ఏవిధంగానూ అడ్డుకోలేరు. ఇంతలో టాపిక్ ఎటో వెళ్తుంది. వెళ్తూవెళ్తూ, ‘నిజంగా ఐ లైక్ శ్రీశ్రీ ప్రోజ్. మహాప్రస్థానం నిజంగా… చెప్పలేనంటే నమ్ము. శ్రీశ్రీ శతజయంతి అనగానే మొత్తం సెట్ తీసుకోవాలని విశ్వప్రయత్నం చేశా.ఎక్కడా… దొరకితేనా. ఎనీవే మహాప్రస్థానం మాత్రం అద్భుతం’ అంటూ గడపదాటుతాడు. ‘పుస్తకం వనితా విత్తం పరహస్తం గతంగత’ అన్నాడు భాసుడో భర్తృహరో. అంటే తాళపత్ర గ్రంథాల రోజుల్లోనే ఈ పుస్తకాలు అరువు తీసుకునే జాడ్యం వున్నట్టు మనకు స్పష్టం అవుతుంది. బెర్నార్డ్ షా వ్యక్తిగత లైబ్రరీని చూసిన ఓ అభిమాని విస్తుపోయాడు. ఎక్కడ చూసినా గుట్టలుగుట్టలుగా అనేకానేక అంశాలపై పలుభాషల్లో పుస్తకాలు వున్నాయి. ‘ఆహా! గొప్ప లైబ్రరీ. కాని ఓ పద్ధతిగా బీరువాలలో అమరిస్తే మరింత బావుండేది’ అన్నాడా అభిమాని. షా ఒకసారి గెడ్డం సరిచేసుకుని, ‘అఫ్ కోర్స్. కాని బీరువాలు అరువెవరిస్తారు..’అన్నాడట సందేహంగా. ఈసారి నివ్వెరపోవడం అభిమాని వంతు అయింది. న్యూస్ పేపర్ అరువులు తీసుకోవడం మన జన్మహక్కుగా భావిస్తాం. రైల్వేస్టేషన్ బుక్ షాప్ లో ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకం కొన్నాను. నా పక్కనే నిలబడి పుస్తకాలు చూస్తున్నాయన వెంటనే నావైపు చూసి మీరు ఏ రైల్లో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ‘ఫలానా రైలు, విజయవాడ వెళ్లాలి’ అని ప్రశ్నార్థకంగా చూశాను. ‘నేనూ అదే రైలు. నేనూ బెజవాడే. మీ బోగీలోనే నేనూ ఎక్కుతాను. యీ యోగి కథ చదవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. మనం చేరేలోగా లాగించేస్తాను. పదండి, మన రైలు నాలుగుమీదకు వస్తుంది’ అంటూ పుస్తకం ఆయన హస్తగతం చేసుకున్నాడు. హతవిధీ అనుకున్నాను. ఇలాంటి పుస్తకప్రియులకు నలజ్జ,నభయం!

కృతయుగంలోనే పుస్తకం పుట్టింది. బ్రహ్మదేవుడు వేదాలను రాసుకుంటూ, కొంచెం చిన్న కునుకు వేశాడు. అదే అదునుగా సోమకాసురుడనే వాడు ఆ వేద గ్రంథాలను అరువైనా కాకుండా అపహరణకే పాల్పడ్డాడు. సరస్వతీ దేవి వీణ శృతి తప్పింది. బ్రహ్మ ఉలిక్కి పడ్డాడు. సోమకాసురుడు వేదాల మూటని తీసుకుని సముద్రగర్భంలో దాక్కున్నాడు. వేదాలంటే రాజ్యాంగంలాంటివి. దాంట్లో ధర్మాధర్మ విచక్షణ, న్యాయాన్యాయ విశ్లేషణ వుంటాయి. బ్రహ్మ నాలుగువైపులా ఏకకాలంలో చూశాడు. సముద్రం అడుగున మొత్తం తాళపత్ర కట్టలతో సహా దాక్కున్నాడు సోమకాసురుడు. బ్రహ్మదేవుడు తలరాతలు రాస్తాడేగాని కార్యశూరుడు కాడు. విష్ణుమూర్తికి జరిగిందంతా మొరపెట్టుకున్నాడు. ఎంతైనా విష్ణుమూర్తి ఘటనాఘటన సమర్థుడు. ఒక్కసారి శంఖుచక్రాలను మొప్పలుగా, తిరునామాన్ని కన్నుగా మార్చుకుని మహామత్స్యంగా మారిపోయాడు. వైకుంఠం నుంచి సరాసరి సాగరంలోకి దూకాడు. సముద్రం అల్లకల్లోలమైంది. ఉప్పునీరు వైకుంఠందాకా చిందాయి. అదృష్టవశాత్తు పాలసముద్రంలో ఉప్పునీరు పడలేదు. బహుశా పాలు విరుగుతాయని అమ్మవారు వైకుంఠద్వారాలు మూసేసి ఉంటారు. మత్స్యావతారుడైనా విష్ణుమూర్తి సముద్రపు లోతుల్లో కూచున్న సోమకుణ్ని చావబాదాడు. వేదాలను రక్షించి తిరిగి వాటిని తెచ్చి బ్రహ్మకి అప్పగించి వెళ్లాడు. దశావతారాలలో తొలి అవతారం ఆ విధంగా ఎత్తాల్సి వచ్చింది. దట్ టూ ఫర్ బుక్! అంచేత అవతారానికి పుస్తకాలకీ సంబంధం ఉంది.

‘అన్నయ్యగారేం చేస్తున్నారు’ అని అడిగింది పక్కింటి పిన్నిగారు. ‘రామాయణం రాస్తున్నారు’ అన్నది ఇంటావిడ. ఆవిడ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి, తర్వాత మూడ్ మార్చి ‘మావారూ ఉన్నారు దేనికి, మొన్నటికి మొన్న రామాయణం వంద పెట్టి కొనుక్కొచ్చారు. ఒట్టి దుబారా మనిషి’ అని వ్యాఖ్యానించింది. అంతేగాని ‘తన భక్తి రచనలు తనవని’ ఆమె అవగతం చేసుకోలేదు.‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కొత్త పుస్తకం కొనుక్కో’ అని సామెత. లేదండీ, పబ్లిషర్స్ ఇలాగ బ్రెయిన్ వాష్ చేస్తున్నారని కొందరంటారు. పుస్తకం హస్తభూషణం అంటారుగాని ప్రస్తుతం సెల్ ఫోన్ మాత్రమే హస్తభూషణంగానూ, కర్ణాభరణంగానూ చెలామణీ అవుతోంది. సెల్ ఫోన్ వచ్చి సర్వవిధాలా పుస్తకాన్ని దెబ్బతీసింది. కొంతకాలం క్రితం దాకా కొంచెం రైలు ప్రయాణంలోనూ బస్సు ప్రయాణంలోనూ టైమ్ పాస్ కి ఏదో ఒక పుస్తకం తిరగవేసేవారు. ఇప్పుడేముంది. లైను కలపడం, గమ్యం దాకా బాతాఖానీ కొట్టడం.

పూర్వం మా రోజుల్లో కాలేజీలో అమ్మాయిలకు ప్రేమలేఖలు ఇచ్చి పుచ్చుకోడానికి పుస్తకాలు ఎంతో అనువుగా ఉండేవి. ఇప్పుడు లిఖిత సాంప్రదాయం అంతరించింది. అంతా ఆశు సాంప్రదాయమే! ‘యద్దనపూడి సెక్రటరీ నవల నా కొంప ముంచిందిరా’ అని నా మిత్రుడు ఇప్పటికీ వాపోతూ వుంటాడు. ఎందుకంటే మావాడు తన మొదటి లేఖను సరోజకి సెక్రటరీ నవల్లో ఇమిడ్చి అందించాడట. సరోజ మూడోరోజుకి సెక్రటరీ ఇచ్చేస్తూ ‘చాలా బావుందండీ’అందిట నర్మగర్భంగా. 32 74, 68 పేజీల్లో మామిడిపిందె బొమ్మలు ఆకుపచ్చ సిరాతో గీసి వున్నాయిట. ఇంకేముంది, అక్కడ నుంచి యద్దనపూడి, కోడూరి నవలలన్నీ చేతులు మారాయి. సరోజ దగ్గర దాదాపు అరవైనాలుగు ప్రేమలేఖలు జమపడ్డాయి. ఒక శుభోదయాన్ని సరోజ వాళ్ల బాబాయ్ మావాణ్ని కాలేజీలోనే కలిసి వీడి రచనాశిల్పాన్ని మెచ్చుకున్నాట్ట. వెళ్తూ వెళ్తూ ‘మీవాళ్లని త్వరగా పంపించి పెళ్లి ఏర్పాట్లు చేయించు. లేకపోతే తోలుతీసి టోపీ కుట్టించుకుంటానని ఓ పొగడ్తని వార్నింగ్నీ ఇచ్చేసి వెళ్లాట్ట. ఇక మావాడికి మనసు మార్చుకునే అవకాశం లేక ఆ విధంగా సెటిలైపోయాడు. ఇప్పటికీ వాడికోమూల పద్మజమీద సాఫ్ట్ కార్నర్ వుంది. కాని అరవైనాలుగుసార్లు కమిటయ్యాడు. ఇలా పుస్తకాలు ఒక్కోసారి ఇబ్బంది పెడతాయి కూడా.

పాపం! నిజంగా కవులంత అమాయకులు ఎవరూ ఉండరు. ఓ కవి తనే స్వయంగా కవిత్వం రాసి, తనే స్వయంగా పుస్తకం అచ్చువేసుకున్నాడు. మిత్రులకు శత్రువులకు కూడా శుభాభినందనలతో పుస్తకాలు బహూకరించాడు. ఆరునెలలు తిరిగేసరికి ఏ పేవ్ మెంట్ మీద చూసినా ఈ కవిత్వమే. ఒకసారి ఆరుద్ర బహూకరించిన పుస్తకం ఆయనకే పేవ్ మెంటు షాపులో తారసపడింది. దాన్ని సగం ధరకి కొని, ‘ప్రియమిత్రుడికి మరోసారి ప్రియంగా! (కాదు చౌకగా) అని రాసి సంతకం చేసి బహుకరించారు. ఒకాయన విశ్వనాథ సత్యనారాయణ కావ్యాన్ని అంకితం తీసుకున్నారు. అచ్చుఖర్చులు, కవిగారికి పారితోషికం ఆయనే అచ్చుకున్నారు. ఎందుకండీ మీకు ఖర్చులు అని అడిగితే ‘బతకడానికి’ అన్నాడాయన. ‘విశ్వనాథ కావ్యం బతికినన్నాళ్లూ నేనూ బతుకుతాను కదా. నాకున్న తెలివికి నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి’ అన్నాడాయన. నిజమేకదా! నాకు ఆ మాట వినగానే షేక్స్ పియర్ మాటలు గుర్తుకువచ్చాయి. ‘పాలరాతి సౌధాలుగాని, బంగారు నీరుతీసిన గోడలు కాని రెండు గొప్ప వాక్యాల కంటే ఎక్కువ కాలం మనజాలవు’ అన్నది మాత్రం సత్యం. పుస్తకం అంటే జ్ఞానం. అది తాళపత్రంకావచ్చు, కాగితం కావచ్చు, వెబ్ సైట్ కావచ్చు.

You Might Also Like

3 Comments

  1. మాలతి

    రమణగారిరచనలు చదివింది తక్కువా, వారిపేరు వినడం ఎక్కువా నావిషయంలో. వారిరచన చదవడం ఇది రెండోసారి. మొదటిసారి సుజాత పంపిస్తే చదివేను కథపేరు మిథునం అనుకుంటాను. రమణగారికీ, ఇది పుస్తకముఖంగా పంచిపెట్టిన అరుణగారికీ ధన్యవాదాలు.

  2. BPhaniBabu

    శ్రీ రమణ గారు వ్రాసిన వ్యాసం ఎంతో బాగుంది. మేము హైదరాబాద్ లో ఆయనను కలిసినప్పుడు, చెప్పానుగా మూడు గంటలు ఆయనతో మాట్లాడే భాగ్యం కలిగింది. వ్రాయడం ఎంత హాస్యంగా ఉంటుందో మాట కూడా అంతే హాస్యంగా ఉంటుంది. ఆయన వ్రాసిన ” శ్రి రామాయణం” మాకు కానుక గా ఇచ్చారు. ఎవరినా వీలుంటే ఆయన ఈ మెయిల్ ఐ.డి ఇవ్వకలరా?

  3. bollojubaba

    i read this. it is the best example to streamline the thoughts while writing on a subject. i wonder at it.

Leave a Reply