జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2013లో ఒక రోజు
మొదలైన అనతికాలంలోనే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఒక మాహా ప్రభంజనంగా మారింది. ఎంతగా అంటే ఇప్పుడు దీన్ని సాహిత్యపు కుంభమేళగా అభివర్ణిస్తున్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‍కు లభించిన ప్రజాదరణ చూశాక చాలా నగరాలలోనూ సాహిత్యోత్సవాలు పుట్టుకొస్తున్నాయి. రచయితలు, కవులు, లిటరరీ ఏజెంట్లు, పబ్లిషర్స్, పాఠకులు అందరూ ఒక చోట చేరి సాహిత్యానికి సంబంధించిన అనేక పార్శ్వాల గురించి చర్చించుకుంటుంటారు ఓ ఐదురోజులు. ఒక రెండు మూడేళ్ళుగా అమిత శ్రద్ధతో దీన్ని “ఫాలో” అవుతూ, ఎట్టకేలకు ఈ ఏడాది ఐదు రోజుల్లో ఒక రోజు మాత్రమే హాజరవ్వగలిగాను. అయితే, ఇదో కుంభమేళ అయితే నేనో మహాభక్తురాలినై వెళ్ళలేదు. కేవలం అక్కడేం జరుగుతుందోనన్న ఉత్సాహంతో వెళ్ళాను. ఇదో గంగాప్రవాహం అయితే నేనందులో మునకలేసి రాలేదు. కేవలం ఓ రెండు నీటి చుక్కలు తలమీద జల్లుకొని పక్కకు తప్పుకున్నాను. నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండకపోరని, వాళ్ళు కూడా ఈ ఉత్సవానికి రాబోయే సంవత్సరాల్లో వెళ్ళాలనుకుంటే నా అనుభవాలు ఎంతో కొంత పనికొస్తాయని వాటిని ఇక్కడ పంచుకుంటున్నాను.
ఫెస్టివల్ తారీఖులు, రిజిస్టేషన్:
ఫెస్టువల్ నిర్వహించబడే తారీఖులు ఓ మూడు నాలుగు నెలలు ముందు ప్రకటిస్తారు. ఇప్పటి వరకూ దీన్ని జనవరిలోనే నిర్వహించారు. తేదీలు ప్రకటించిన తరువాత ఫెస్టివల్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు.
ఈ ఉత్సవంలో జరిగే అన్ని చర్చలకి, సమావేశాలకు ప్రవేశం ఉచితం. సమావేశ స్థలానికి మొదట చేరుకున్నవారికి ప్రాముఖ్యత ఉంటుంది. రచయితలతో లంచ్, డిన్నర్ చేసే అవకాశం కావాలనుకునేవారు “డెలిగేట్”గా రిజిస్టర్ అవ్వచ్చు. దీనికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. (ఈ ఏడాది డెలిగేట్ ఒకరోజుకి రూ|| 5000 కట్టాలి.) ఉచిత ప్రవేశానికైనా, డెలిగేట్లకైనా ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. (ఫెస్టివల్ మొదలయ్యాక కూడా సమావేశ స్థలంలో రిజిస్టేషన్ చేసుకోవచ్చునుగానీ, అది శ్రమతో కూడుకున్న పని. ఒకవేళ జనం ఒకసారిగా వస్తే చాలాసేపు లైన్లలో నిలబడాల్సి వస్తుంది. అందుకని ముందస్తుగా నమోదు చేసుకొని, ఆ ప్రింట్ అవుట్‍ను ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ జిరాక్స్ తో జతపరచి తీసుకువెళ్తే లోనికి ఒకట్రెండు నిముషాల్లో ప్రవేశించవచ్చు. )
వసతి సౌకర్యాలు:
నమోదు చేసుకునేటప్పుడే మనకి వసతి సౌకర్యము కావాలో, వద్దో చెప్పవచ్చును. వారి ద్వారా హోటెల్ బుక్ చేసుకుంటే తక్కువ ధరలకు లభింస్తుందని వారు రాస్తారు. ఎంపిక చేసుకోడానికి కొన్ని హోటెల్స్ కూడా ఇస్తారు. (ఊరిగాని ఊరులో హొటెల్ బుకింగ్ దగ్గర తేడా వస్తే చాలా చికాకుగా ఉంటుంది. అందుకని నేను ఫెస్టివల్ తో పనిలేకుండా, నా సొంతంగా బుక్ చేసుకున్నాను.)
ఐదురోజులూ రాత్రి ఏడింటికి ఒకటో, రెండో సంగీత విభావరి ఏర్పాటు చేస్తారు. ఉచిత ప్రవేశం కింద నమోదు చేసుకున్నవారు వీటికి మరల వేరుగా టికెట్ తీసుకోవాలి. డిలిగేట్స్ కు మళ్ళీ టికెట్టు కొనే అవసరం లేదు.
ముందస్తు ప్లానింగ్:
ఫెస్టివల్ ఇంకో పదిరోజుల్లో మొదలవ్వబోతుంది అనేంత వరకూ వీళ్ళు ప్రణాళికను విడుదల చేయరు. ఎవరెవరు వస్తున్నారన్న చిట్టా ఇస్తారుగానీ, ఎవరు ఏ రోజున, ఏ సమయాన, ఏ సమావేశంలో ఉంటారో తెలీదు. అందుకని ముందుగానే ఒక కట్టుదిట్టమైన ప్లాన్ వేసుకోడానికి వీలుండదు. ఫ్లైట్, టైన్ టికెట్లు ఆఖరి నిముషంలో దొరికినా బాగా ఖర్చు అవుతుంది. జైపూర్‍కు అసలే పర్యాటకుల తాకిడి ఎక్కువ, ముఖ్యముగా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ. అందులోనూ ఈ లిటరేచర్ ఫెస్టివల్ బాగా ప్రాచుర్యం పొందాక, హోటళ్ళు ఓ నెల ముందున్నా బుక్ చేసుకోకపోతే ఆపై తక్కువ సౌకర్యాలకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని తారీఖులు వెలువడగానే, ప్రణాళిక తెలియకపోయినా ప్రయాణం, వసతి సౌకర్యాలు చేసుకోవడం మంచిది.
ఇహ, జైపూర్‍కు రైలు, విమాన మార్గాలే ఉత్తమం, దక్షిణ భారతదేశం నుండి. ఓ నెల ముందే బుక్ చేసుకుంటే ఫ్లైట్ నాలుగైదు వేలలో అయిపోతుంది. లేదా మైసూర్-జైపూర్ ఎక్స్‍ప్రెస్ లాంటివాటినో ఆశ్రయించవచ్చు. అదీ కాకపోతే, ఢిల్లీకి చేరుకొని అక్కడ నుండి రెండొందల యాభై కి.మి దూరంలో ఉన్న జైపూర్‍ను రోడ్డు ద్వారా ప్రయాణించవచ్చు.
వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాక, రెండు రకాలుగా ప్లానింగ్ చేసుకోవచ్చు (నాకు తెల్సి):
౧. ఒకటి రెండు రోజులు హాజరయ్యి, తక్కిన సమయాన్ని జైపూర్ లోనో, చుట్టుపక్కల ప్రాంతాల్లోనో విహార యాత్ర చేయడం.
౨. పూర్తిగా ఐదు రోజులూ హాజరయ్యి ఓ సాహిత్య తీర్థ యాత్ర చేసిన అనుభవం పొందటం.
అయితే ఇలా నిశ్చయించుకోడానికి కావాల్సిన సమాచారం – స్కెడ్యూల్ మన దగ్గర పది రోజుల ముందే చేరుతుంది కాబట్టి పై రెంటిలో ఏది ఎంచుకున్నా చీకట్లో బాణం వేసినట్టే.
స్కెడ్యూల్ – సమావేశాల ఎంపిక:
ఆరేసి కార్యక్రమాలు ఒకేసారి ఆరు వేర్వేరు వేదికలపైన జరుగుతాయి. అంటే రోజుకి దాదాపుగా అరవై కార్యక్రమాలు జరిగినా, ఒకే సమయంలో రెండు చోట్ల ఉండే విద్య మనకి తెలీదు కాబట్టి, కేవలం పది మాత్రమే చూడగలం. ప్రారంభోత్సవానికి పదిరోజుల ముందు వారి సైటులో పెట్టే స్కెడ్యూల్‍లో కార్యక్రమం పేరు, పాల్గొంటున్నవారి పేర్లు, మోడరేటర్ పేరు, కార్యక్రమాన్ని అందిస్తున్నవారి పేర్లు మాత్రమే ఉంటాయి. దీనితో ముందుగానే ఏ సమావేశాలు హాజరు అవ్వాలన్నది కొంచెం తిరకాసు వ్యవహారంగా మారవచ్చు.
అలా నామమాత్రంగా కాకుండా పండుగ ఐదురోజుల స్కెడ్యూల్లో ప్రతి సమావేశం గురించి, అందులో పాల్గొంటున్నవారి గురించి వివరాలతో కూడిన ఒక పుస్తకం వంద రూపాయలకు అమ్మారు, హెల్ప్ డెస్క్ దగ్గర. మనకు బొత్తిగా పరిచయం లేని రచయితల సమావేశాలకి వెళ్ళడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.
సమావేశాల్లో జనసందోహం విపరీతంగా ఉండే అవకాశాలు ఎక్కువ, ముఖ్యంగా ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు, లేక వి.ఐ.పి, సినిమావాళ్ళు, సెలబ్రిటీస్ వచ్చినప్పుడు. పోయిన ఏడాది జావేద్ అఖ్తర్, గుల్జార్, విశాల్ భరద్వాజ్, ప్రసూన్ జోషి కల్సి చేసిన ఒక కార్యక్రమం సాయంత్రం ఆరింటికి ఉంటే, పొద్దున్న తొమ్మిదింటి నుండి జనాలు కూర్చిలల్లోంచి కదల్లేదు, మళ్ళీ బయటకు వెళ్తే లోపలికి వచ్చే అవకాశం పోతుందని! ఒక వేదికకూ, ఇంకో వేదికకూ పెద్ద దూరం లేకపోయినా, ఒకదాని నుండి ఇంకోదానికి మారటం కష్టమయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకని ఒకే చోట ఒకట్రెండైనా హాజరయ్యేలా చూసుకోవటం మేలు.
25.01.2013న జరిగిన సమావేశాల్లో నేను హాజరైన వాటి విశేషాలు:
పండుగ జరుగుతున్న ఐదు రోజుల్లో నాలుగు రోజులు నేను జైపూర్‍లోనే ఉన్నా, కేవలం 25వ తారీఖునే అక్కడకి వెళ్ళడానికి కారణాలు ఆ రోజున నాకు అత్యంత అభిమానమైన ఇటాలో కాల్వినో రచనలు ఆంగ్లీకరించిన టిమ్ పార్క్స్, నేను అభిమానించే షర్మిలా టాగోర్, జావేద్ అఖ్తర్‍ల కార్యక్రమాలు ఆ రోజు ఉండడమే! తొలిరోజున విపరీతమైన జనం ఉంటారని వెళ్ళడానికి సాహసించలేదు. తక్కిన రెండు రోజులు జైపూర్‍లో సైట్ సీయింగ్‍కి వినియోగించుకున్నాను.
ఉదయం తొమ్మిదన్నర కల్లా డిగ్గి పాలెస్ (రెండో ఏడాది నుండి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఇక్కడే జరుగుతుంది.) చేరుకున్నాను. ముందుగా ఆన్‍లైన్ రిగిస్టేషన్ చేసుకొని ఉండడం వల్ల ప్రవేశం చాలా తేలికైయ్యింది. నమోదు పత్రం, గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకొని, మనకొక “ఎంట్రి పాస్” ఇస్తారు. ఒక్కసారి తీసుకున్న పాస్ ఐదు రోజులకీ వర్తిస్తుంది. ప్రతి సమావేశానికి వర్తిస్తుంది.
పాస్ తీసుకొని కొంచెం దూరం లోపలికి వెళ్ళగానే “హెల్ప్ డెస్క్”, “ఇన్‍ఫర్మేషన్ డెస్క్” కనిపించాయి. ఇక్కడ మొత్తం ఐదు రోజుల స్కెడ్కూలు, డిగ్గి పాలెస్ మాపు ఉచితంగా ఇచ్చారు. పైన చెప్పిన స్కెడ్యూల్ వివరాలతో ఉన్న పుస్తకం వంద రూపాయలకు ఇక్కడే అమ్మారు.
నేను హాజరు కావాలనుకున్న టిమ్ పార్క్స్ సమావేశం, షర్మిలా టాగోర్ సమావేశం రెండూ “బైఠక్” అనే వేదికలో జరిగింది. అప్పటికి పట్టుమని పది మంది కూడా లేదు. ఉచిత ఎంట్రీ పాస్‍తో ఉన్నవాళ్ళని కూడా మొదటి వరుసలో కూర్చోనిచ్చారు, డిలిగేట్స్కో, ప్రతికా విలేఖరులకో ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వకుండా. (ఒకవేళ మరో రచయితో / సెలబ్రిటియో ఒక సమావేశం హాజరు అవ్వాలంటే, మామూలుగా అందరితో పాటు ఎక్కడ కుర్చీ దొరికితే అక్కడ కూర్చోవాలి.)
పది గంటలకు కార్యక్రమం మొదలవ్వాలంటే ఖచ్చితంగా అదే సమయానికి మొదలుపెట్టారు. ముందుగా Pursuit of Italy అనే శీర్షికన చర్చ జరిగింది. ఇది డేవిడ్ గిల్మోర్ రాసిన పుస్తకం గురించి చర్చ అని నాకు చాలా ఆలస్యంగా తెల్సింది. అంతవరకూ నేను ఫిక్షన్‍లో ఇటలీ చిత్రీకరణను గురించి మాట్లాడతారేమోనని అనుకున్నాను. ఇటలీ కూడా ఇండియాలానే వివిధ సంస్కృతులకు, సభ్యతలకు, భాషలకు నెలవు. ఇటలీని “దేశం” అనే ఏకఛత్రాధిపత్యంలోకి తీసుకురావటం వల్ల భాషలకు, సంస్కృతులకు అన్యాయం జరుగుతుందని ఈ పుస్తక రచయిత వాదన. “అబ్బే.. అదేం లేదు.” అన్నది టిమ్ పార్క్స్ వాదన. వీరిద్దరి మధ్య కట్టె విరక్కుండా, పాము చావకుండా వాదన చేశారు కార్లో పిజ్జాటి. దాదాపుగా ముప్పావు గంట జరిగిన చర్చకు ముక్తాయింపులో ఇటలీని, ఇండియాను పోల్చారు. “ఇండియా”లో “భిన్నత్వంలో ఏకత్వం” అన్న నినాదం బాగా అక్కరకు వచ్చిందని రీమా హూజా అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులనుండి నాలుగైదు ప్రశ్నలు విని, వాటికి జవాబులు చెప్పి, ఫోటోలకు ఫోజు ఇవ్వడంతో సెషన్ ముగిసింది. ఈ సమావేశం వీడియోను ఇక్కడ తిలకించవచ్చు.
పన్నెండున్నరకు మొదలయ్యే షర్మిలా టాగోర్ సెషన్ “బైఠక్”లోనే ఉంది కాబట్టి, అక్కడే కూర్చొని పదకొండుంబావుకి మొదలైన “The face behind the mask.” ఇందులో పాల్గొన్న వారెవ్వరి గురించి నాకేం తెలీదు. అయితే సమావేశం మొదలైన కాసేపటికే ఇది అనువాదం గురించి అనువాదకులు చేస్తున్న చర్చ అని అర్థమయ్యింది. ఇందులో ఇద్దరు తమిళ రచయిత్రులు, ఇద్దరు ఉత్తరభారతదేశం రచయితలు ఉన్నారు. అనువాదంలో వచ్చే సమస్యల గురించి తీవ్రంగా చర్చించారు. దీని వీడియో ఇక్కడ.
తర్వాత షర్మిలా టాగోర్ పాల్గొన్న “జొరాసంకో” అన్న సెషన్ మొదలయ్యింది. షర్మిలా టాగోర్‍ను అంత దగ్గరగా చూసే అవకాశం దొరుకుతుందని నేనసలు ఊహించలేదు. ఓ ఏడాదిన్నర కాలం కాబట్టి భాషాబేధం లేకుండా ఆమె నటించిన సినిమాలు అనేకం చూసి చూసి ఆమెకు వీరాభిమానిని అయ్యాను. అంతలోనే ఇంత అదృష్టం. అయితే ఈ సెషన్ కేవలం ఆవిడను కళ్ళప్పగించుకొని చూడడానికే కాకుండా, టాగోర్ కుటుంబంలో మహిళల స్థితిగతులను గురించి తెల్సుకునే వీలు కల్పించింది. అరుణా చక్రవర్తి రాసిన “జొరాసంకో” అనే పుస్తకం కాల్పనిక రచనే అయినా, ఆ పాత్రలకు ప్రేరణ టాగోర్ కుటుంబంలో ఒక్కప్పటి మహిళలు. చర్చ చాలా ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకురాలు “companionship” అన్నప్పుడల్లా షర్మిలా తల అడ్డంగా ఊపుతూ ఆ పదం ఎందుకు అప్పటి దాంపత్యాలకు సరితూగదో చెప్పుకొచ్చారు. అలానే, ఎవరో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు కూడా “మగవాళ్ళని విలన్లు చేయనవసరం లేదు. ఓ మహిళకు ఇంటిలో ఉండి పిల్లాపాపలు చూసుకోవాలి అనిపిస్తే, అలా చేయగలగాలి. లేదూ బయటకు వెళ్ళి పని చేయాలనుకుంటే అదీ చేయగలగాలి.” అన్న మాటలు తెగ నచ్చేశాయి. ఒక్కో టాగోర్ మహిళ గురించి మాట్లాడేటప్పుడు వారి అరుదైన చిత్రాలను స్లైడ్-షోలలో చూపించారు. ఈ సమావేశం వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఆ తర్వాత “బైఠక్” నుండి బయటకొచ్చి జావేద్ అఖ్తర్ “What is a Ghazal?” అన్న సెషన్ హాజరవ్వడానికి “చార్ బాగ్” అనే వేదికకు చేరుకున్నాం. అప్పటికి అక్కడ ఒక పుస్తకావిష్కరణ సభ జరుగుతోంది. అది అయ్యాక అఖ్తర్‍గారి సెషన్ మొదలయ్యింది. ఆయణ్ణి పరిచయ చేసిన వర్థమాన ఇంగ్లీషు గజల్ రైటర్ నాకు అసలు నచ్చలేదు. ఆమె అడిగిన ఒకట్రెండు ప్రశ్నలూ గొప్పగా అనిపించలేదు. అఖ్తర్ మాత్రం తనదైన శైలిలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గజల్ అంటే ఏమిటో లోతుగా విశ్ల్హేషిస్తారనుకున్నానుగానీ పైపైన తేల్చేశారు. గజల్‍కూ నజ్మ్ కూ గల తేడా కూడా ఎవరో అడిగితే గానీ చెప్పలేదు. అయితే ప్రేక్షకులు ప్రశ్నలు అడగడం మొదలైనప్పటి నుండి ఈ సెషన్ భలే ఉండింది. అడిగిన కొన్ని ప్రశ్నలు మూర్ఖంగా, తెలివితక్కువతనంగా ఉన్నా మొత్తానికి గంట ఎప్పుడో గడిచిందో తెలియకుండానే అయిపోయింది. ఈ సెషన్ ఇక్కడ చూడవచ్చు.
ఆ తర్వాత “వెళ్ళలేక ఉండలేక” ఉన్న పరిస్థితుల్లో “The literatures of 9/11” అన్న సమావేశం కూడా హాజరయ్యాను. 9/11 నేపథ్యంలో ఒకటి అరా పుస్తకాలు చదవనారంభించి మధ్యలో వదిలేశాను గనుక, నాకీ అంశంపై అంతగా ఆసక్తి కలుగలేదు. ఈ సమావేశం వీడియో ఇక్కడ.
అక్కడితో నా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అయిపోయింది. నేను అనుకున్నదానికన్నా నచ్చింది. ముఖ్యంగా, సమావేశాలను ఉచితంగా అందించడమే కాకుండా, ఎవరు ముందొస్తే వాళ్ళే ముందు కూర్చువచ్చుననే పద్ధతి నచ్చింది. ప్రతి కార్యక్రమాన్ని నిర్ధారిత సమయంలో ప్రారంభించటంలోనూ, ముగించటంలోనూ సఫలీకృతమయ్యారు. దీని వల్ల ఎదురుచూపుల బెడద లేకుండా పోయింది. టిమ్ పార్క్స్ ఆటోగ్రాఫ్ అనుకోని బోనస్.
నిరుడు సల్మాన్ రష్దీని ఆహ్వానించి, ఆ పైన వెనక్కి తగ్గి నానా జాతరా అయ్యాక ఈ సారి నిర్వాహకులు చాలా జాగ్రత్తగా పెద్ద పేర్ల జోలికి పోకుండా నడుపుకొద్దామనుకున్నారుగానీ ఆశీష్ నాండీ గొడవ ఎటూ జరగనే జరిగింది. నన్ను తీవ్రంగా నిరాశపరిచినది మాత్రం ఫెస్టివల్ బుక్ షాప్. ఏదన్నా కొందామని ఎంత ప్రయత్నించినా నాకు నచ్చే పుస్తకాలు కనబడనే లేదు. జైపూర్ వరకూ వెళ్ళే తీరిక, ఓపిక ఉంటే ఎప్పుడూ అట్టల వెనుక బుల్లి ఫొటోలలో దర్శనమిచ్చే రచయితలు కళ్ళముందుకొస్తారు. అసలు అగుపడని పబ్లిషర్లు, లిటరరీ ఏజెంట్స్ తదితరుల ఉనికి తెలుస్తుంది. ఎంతో కొంత మంది సాహిత్యాభిమానులను కల్సుకునే వీలుంటుంది. కొంచెం సోషలైజింగ్ స్కిల్స్ ఉన్నా, లేక పుస్తకాల పురుగులు ఓ నలుగురైదుగురు కల్సి వెళ్ళినా నిజ్జంగా పండుగే!
చిత్రమాలిక:
[portfolio_slideshow size=large include=”14012,14013,14014,14015,14016,14017,14018,14019,14028,14029,14030, 14021,14031,14032,14033,14034, 14020, 14022,14023,14024,14025,14026,14027″ click=advance showcaps=true showtitles=true showdesc=true pagerpos=disabled]
gsrammohan
జైపూర్ గురించి మంచి సమాచారం అందించారు.
మీ వాక్యం బాగుంటుందండీ.చక్కని తెలుగు. మీరు రాసినవి ఏవైనా ఆపకుండా చదివించేస్తాయి.
M.V.Ramanarao.
జైపూర్ Lit-Fest గురించి చాలా వివరాలు ఇచ్చారు.ధన్యవాదాలు.తెలుగునాట సాహిత్యసభలకి,ఉత్సవాలకి పిలిచినారారు. దీనికి ,అందులోను,డబ్బు కట్టి ఇంతమంది వెళుతున్నారంటే నాకు ఆశ్చర్యం గా ఉంది.
Purnima
>> తెలుగునాట సాహిత్యసభలకి,ఉత్సవాలకి పిలిచినారారు.
ఇంకెవ్వరి సంగతో నాకు తెలీదుగానీ నేను మాత్రం వెళ్ళను వీటికి. దానికి కొన్ని కారణాలు: మొదలవ్వాల్సిన సమయానికి మొదలవ్వవు. ఎప్పటికి ముగుస్తాయో అసలే తెలీదు. పాఠకురాలిగా నాకు పనికొచ్చే విషయాలు చాలా తక్కువగా తెలుస్తాయి. నాకవసరం లేనివి బోలెడు తెలుస్తాయి. “అయ్యో! సమయం వృధా పోయిందే!” అన్న భావన తప్పక కలుగుతుంది చివరకు.
ఆ మాటకొస్తే తెలుగువారు నిర్వహించే ఇతరత్రాలకు వెళ్ళినప్పుడు కూడా నాకు ఇలానే నీరసం వస్తుంది. మంగళంపల్లి బాలమురళికృష్ణ కచేరి అంటారు. గంట ఆలస్యంగా మొదలెడతారు. ఆయన గంటైనా పాడకముందే కచేరి ఆపేసి, సన్మాన సభ అంటారు. ఒకటే పాయింట్‍ను తిప్పి తిప్పి పది మంది చెప్తారు. ఆయన అమృతగానం వినడానికా డబ్బు కట్టింది లేక వీళ్ళ ప్రసంగాలకా అన్నది అర్థం కాదు. సురభివారు నాటకం వేస్తారు. నాటకం అవ్వీ అవ్వగానే మళ్ళీ సన్మాన సభ అంటారు. అందులో అసలు సురభి నడిపిస్తున్న మనిషి గురించి, ఆయన టీమ్ గురించి కన్నా ఆ నాటకంలో ఉన్న తెలుగు సినిమా నటుల గురించో లేక స్పాన్సర్స్ గురించో ఉంటుంది. వద్దన్నా నీరసం వస్తుంది. పోనీ, ఆ సన్మాన సభలకు జనాలుంటారా అంటే అదీ లేదు. ఓ పక్క కళాకారులు స్టేజి మీదే ఉంటారు, ఇక్కడ జనాలు జారుకుంటూనే ఉంటారు.
ఆ లెక్కలో పోల్చుకుంటే జైపూర్ సాహిత్యోత్సవం శ్రద్ధగా, చిత్తశుద్ధిగా నడుపుతారన్న నాకనిపించింది. ఓ సగటు పాఠకునిగా అక్కడికి పోతే one would feel at home and also gain some enriching experience. అక్కడికి వచ్చే అందరూ సాహిత్యాభిమానులే అని కాదు. వాళ్ళున్నది డిగి పాలెస్ అనీ, అక్కడ జరుగుతున్నది సాహిత్యోత్సవం అని కూడా తెలీకుండా కాలెజి బంక్ కొట్టొచ్చిన పిల్లలను కూడా కనిపించారు నాకు. స్కూల్ పిల్లలకు టిమ్ పార్క్స్, కార్లో పిజ్జాటి గురించి తెల్సుండడం వల్లే వారి ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారని నేననుకోను. కానీ ఆ exposure వాళ్ళకు మంచిది. ఆ సాంగత్యం వల్ల.. ఏమో.. రేపో గొప్ప రచయిత ఆ పిల్లల్లోంచి పుడతాడేమో?!
ఇదేదో పొరిగింటి పుల్లకూర రుచి బాపతుగా అనిపించచ్చుగానీ, అయినా నాదిదే మాట. సాహిత్యమనే కాదు, ఏ కళమీదైనా భక్తిశ్రద్ధలతో చేసింది నలుగురునీ కదిలించగలదేమోగానీ.. గిన్నిస్ రికార్డుల కోసం చేస్తే మాత్రం.. ఇంతే!